సేద్యగాడి ప్రశ్నకు జవాబిచ్చే కథ రావాలి

ప్రముఖ రచయిత కాట్రగడ్డ దయానంద్పుస్తకం ‘పండుటాకు – గుండ్లకమ్మ తీరాన’  పాఠకుల ముందుకు తీసుకువచ్చిన సందర్భంగా ఆయనతో ముఖాముఖి.

 చాలా కాలంగా మీరు కథలు రాయడం లేదు. ఇప్పుడు పుస్తకం రావడం ఆశ్చర్యంగా  ఉంది. పైగా గతంలో వచ్చిన రెండు పుస్తకాలూ కలిపారు. ఈ రెండు పుస్తకాలూ కలిపి తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?

అప్పుడప్పుడు నేను కథలు రాస్తూనే ఉన్నాను. అయితే కథకు కథకు మధ్య ఎక్కువ ఎడం రావడంవల్ల కథలు రాయడం మానేశానని చూచే వాళ్ళకు అనిపిస్తోంది. మొదటినుంచీ ఇబ్బడి ముబ్బడిగా రాసిన వాడినైతే కాదు గాని, ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ కాస్త ఖాళీ సమయాల్లో సాహిత్యం చదువుకుంటూ రాసుకుంటూ ఉంటాను. ఈ పది పన్నెండేళ్లలో ఆరేడు కథలు  రాసి ఉంటాను.   నా కథల సంపుటాలను పునర్ముద్రించాలని తలపెట్టింది ఈశ్వర వరప్రసాద పరిషత్తు తరుపున మోదుగుల రవికృష్ణ రవికృష్ణ, ఈశ్వర వరప్రసాద్ పరిషత్తు. వాళ్ళకు ధన్యవాదాలు.

 మీరు సరళమైన శైలిలో కథలు రాశారు. అలాగే మ్యాజిక్ రియలిజంలోనూ కథలు రాశారు. ‘అతడు ఆమె ఒక స్వప్నలోకం’ లాంటివి. ప్రస్తుతం ఈ పుస్తకంలో ఎలాంటి శైలీ, శిల్పంతో కథలు ఉండబోతున్నాయి?

సరళమైన శైలి, మ్యాజిక్ రియలిజం ఏదైనా మనం జీవితాన్ని కళాత్మకంగా వ్యక్తం చేయడానికి, వ్యాఖ్యానించడానికి ఎంచుకున్న వివిధ పద్ధతులు మాత్రమే. ఏ పద్ధతి విశిష్టత ఆ పద్ధతిదే. దేన్నీ తక్కువ చేయడానికి వీల్లేదు .అయితే పాఠకుడికి రచయిత చెప్పాల్సిన ,అందించాల్సిన సారాంశం అందిందా లేదా అన్నది ముఖ్యం. అతడు ఆమె ఒక స్వప్నలోకం కథ ఒక ఎలిగరీ. 90 ల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూలిపోతున్న అద్భుతమైన వ్యవస్థల్ని గురించి ఒక దుఃఖ భరిత వ్యాఖ్యానం .  స్త్రీ పురుషుల మధ్య ప్రేమను, మానసికంగా ఎదగని పసిబిడ్డ వైకల్యాన్ని సూచ్యప్రాయంగా చెబుతూ కథ చెప్పడం నా ఉద్దేశం . గోప్యంగా కథ నడపడంలో ఒక వెసులుబాటు ఉంది. రచయిత విషయం వెనుక దాక్కోవచ్చు.కథలో ఉన్న విషయాన్ని పాఠకుడు ఆకలింపు చేసుకోగలిగితే ఆ కథ మంచి కథ. పాఠకుడికి కథ అందనప్పుడు రచయితగా విఫలమైనట్లే .నేను ఈ కథ విషయంలో విఫలమైనాననే అనుకుంటున్నాను .

  ఈ పుస్తకంలో మీకు బాగా నచ్చిన కథ ఏది? ఎందుకు?

కథలు బాగా నచ్చడం, నచ్చకపోవడం అన్నది పాఠకుడి ప్రాపంచిక దృక్పథం మీద ,అతడి అంతరంగమ్మీద ,ఆలోచనా విధానమ్మీద,ఆర్ధిక మూలాలమీద ఆధారపడి ఉంటుందనుకుంటాను .ఒక పాఠకుడికి అద్భుతం అనిపించిన కధే మరొకరికి చాలా సాధారణ కథగా అనిపించవచ్చు .అయితే రచయితల విషయంలో ఏ కథకు ఆ కథ నచ్చితేనే  పాఠకుడికి అందిస్తాడు, బాగా నచ్చటం, నచ్చకపోవడం అన్నది ఉండదనుకుంటాను. కాకపోతే తను చెప్పదలుచుకున్నది కళాత్మకంగా చెప్పినప్పుడు పాఠకుడు ఆ విషయాన్ని వ్యక్తం చేసినప్పుడు రచయితపొందే ఆనందం అంతా ఇంతా కాదు.

ప్రకాశంజిల్లా వ్యవసాయానికి గుండ్లకమ్మ ఒక ఆసరా(నాది ఆ ప్రాంతమే కాబట్టి ఆమాత్రం తెలుసు). గుండ్లకమ్మ వాగుతో మీ అనుబంధం ఏంటి?  మీ రెండో పుస్తకం టైటిల్ కథ ‘గుండ్లకమ్మ తీరాన’ ఎలా పుట్టింది?

నేను పుట్టింది ఒంగోలుకు మూడు కిలోమీటర్ల తూర్పునున్న కొప్పోలులో అయినా పెరిగిందిీ, కొంతకాలం చదువుకున్నదిీ, సొంతూరు చేసుకున్నదిీ మా అమ్మమ్మ గారి ఊరు అమ్మనబ్రోలు. నా ఎనిమిదో తొమ్మిదో  ఏళ్ల వయసులో తొలిసారి గుండ్లకమ్మను చూశాను. ఎండాకాలం సెలవుల్లో ఆటలాడుకుంటూ, నడుచుకుంటూ,పరుగెత్తుతూ  నా ఈడు పిల్లలం గుండ్లకమ్మ ఒడ్డునున్న తాటి తోపుల్లో  కాపలా వాడికి దొరక్కుండా దొంగతనంగా  తాటి గెలలు దించి, వాటిని కొట్టుకొని, తాగుతూ తింటూ నడిజాముకు గుండ్లకమ్మని చేరుకుని ఆ నీళ్లలో ఆడుకునేవాళ్ళం. కొట్టుకునే వాళ్ళం. పెద్ద లోతుండేది కాదు అక్కడ. అప్పటి నుంచే నాకు గుండ్లకమ్మన్నా అందులో నీళ్లన్నా అమిత మోహం. నా సహచరి జయలక్ష్మి వస్తూ వస్తూ తనతో పాటు తాటితోపు పక్కన గుండ్లకమ్మ ఒడ్డునున్న నాలుగెకరాల భూమిని కూడా తీసుకొచ్చింది. అందులో సేద్యం చేసేటప్పుడు వాళ్ళ నాన్న, మా నాన్న పడిన తిప్పలే గుండ్లకమ్మ తీరాన కథ. ఇప్పటికీ ఆ పొలం వెళ్ళి గుండ్లకమ్మ ఒడ్డున నిలుచున్నప్పుడు నేను అమితమైన, చెప్పరాని భావావేశానికి గురవుతాను. ‌ఆ ప్రకృతి, ప్రశాంతత, పేరు తెలియని  పక్షుల విహారాల అరుపులు ,నీళ్లు నడుస్తున్న సవ్వడి ,స్వేచ్ఛగా తిరుగాడే చేప పిల్లల కదలికల వయ్యారాలు ,మునీశ్వరుల్లా నుంచున్న చెట్లు, పైర్లు… వీటన్నిటి మధ్యలో మనుష్యుల,పశువుల సంచారం,వాటి అస్తిత్వం అన్నీ నాలో  వింత అనుభూతులు నింపుతాయి .నన్ను వివశుడిని చేస్తాయి.

మీరు తొంబైల్లోనే ప్రపంచికరణ నేపథ్యంలో కథలు రాశారు. ఇప్పుడు ప్రపంచీకరణ అనుకూల, ప్రతికూల ప్రభావాలను ప్రస్తుత సమాజం చూస్తూ ఉంది. దీని విషయంలో ప్రస్తుతం మీ దృక్పథం ఎలా ఉంది? ఈ కథలు ఈ కాలానికి ఎంత రిలవెంట్ అని మీరు అనుకుంటున్నారు?

ప్రపంచీకరణ గాని, నూతన ఆర్థిక విధానాలు గానీ మరొకటి గాని జీవితం మెరుగుపడడానికి మనం సృష్టించుకున్న వ్యవస్థలు కల్పించిన విధానాలు మాత్రమే. ఖచ్చితంగా వాటి ప్రభావాలు సమాజం మీద, సమూహాల మీద బలంగా ఉంటాయి .అయితే ,అవి ఏ మేరకు మానవ సమాజానికి అనుకూలము అన్నదే ప్రశ్న. ఒక సామాన్యుడి ,బలహీనుడి జీవితం ఎంత మేరకు ప్రభావితం అవుతుంది అన్నది ఇక్కడ చూడాలి .90 ల తర్వాత వ్యవసాయరంగంలో విపరీతమైన మార్పులు వచ్చాయి .ముఖ్యంగా మార్కెట్ అనేది రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది.మా జిల్లాల్లో పత్తి, పొగాకు రైతులు దారుణంగా మోసగించబడ్డారు.వందలమంది ఆత్మ హననాలు చేసుకున్నారు. విత్తనాల దగ్గర్నుంచి పురుగు మందులు దాకా, పంట అమ్మకం నుంచి అదే పంటను సామాన్యుడు కొనుగోలు చేసేవరకు అంతా ఎవరి చేతిలో ఉంది? మెట్ట ప్రాంత రైతుల సేద్యాన్ని మట్కాతో పోలుస్తారు కేతు విశ్వనాథ రెడ్డి గారు .సింగమనేని నారాయణ గారు  జూదంతో పోల్చి  ఒక పంట విధ్వంసాన్నే కోరుకున్నారు.

రైతుల తరువాతి తరానికి భూమి మీద ఒక కనెక్షన్, ప్రేమ లేకుండా పోతుంది అని ఒక సందర్భంలో అన్నారు. ఈ మార్పుకి కారణమేమిటి? రైతుల తర్వాతి జనరేషన్ పయనం ఎటు వెళ్తుంది?

ఈ రోజున పల్లెల్లో ఒక విషాద భరితమైన సంక్షోభ వాతావరణం కనబడుతోంది. కులవృత్తులన్నీ ధ్వంసమై అందరూ వలసల దారి పట్టారు. యాభై వయసు దాటిన వారు మాత్రమే వ్యవసాయం చేస్తూ పల్లెల్ని కనిపెట్టుకొని ఉన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, పొద్దంతా చాకిరీ చేసినా ప్రయోజనం లేకపోవడం,మార్కెట్ మాయాజాలం   రైతుని భూమికి దూరం చేస్తున్నాయి .ఊరిని కనిపెట్టుకొని సేద్యం చేస్తున్న యువకులకు పెళ్లిళ్లు ఒక సమస్యగా తయారైంది . మెరుగైన సౌకర్యాల కోసం పల్లెల్ని  ఖాళీ చేసి పట్నాల బాట పడుతున్నారు. బహుశా భారతీయ సమాజంలో ఇంకో రెండు తరాల తర్వాత సేద్యం చేయడానికి ఒక్క రైతు కూడా మిగలడేమోనన్న భయం వెంటాడుతోంది. మనం సృష్టించుకున్న వ్యవస్థలే మనల్ని దిక్కులేని వాళ్ళను చేస్తున్నప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలన్నది ఇవ్వాల సేద్యగాడి ప్రశ్న.

 ప్రస్తుతం వస్తున్న తెలుగు కథలు ఎలా ఉన్నాయి. నవతరం రచయితలకు మీరు ఇచ్చే సూచన.

ఎంతోమంది యువ కథకులు కథానికా  సృష్టిని కొనసాగిస్తున్నారు.  చాలామంది వాళ్ల వాళ్ల పరిధిలో వారు ఎంచుకున్న వృత్తి జీవితం గాని,  లేదూ తమ చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులను గాని కథల్లో వినూత్నంగా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు కథాధారను ఆగకుండా అందిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. అయితే ఇక్కడ అధ్యయనం గురించి ఒకమాట చెప్పాలి.  నేను చదివిన ఎన్నో కథలు నాకు కథ రాయడానికి మార్గ నిర్దేశం చేశాయి . ఎట్లా రాయాలో ఎట్లా రాయకూడదో తెలిపాయి. అధ్యయనాన్ని మించిన శిక్షణ లేదు. నాలో ఎప్పుడూ ఒక దిగులు కమ్ముకుని ఉంటుంది. పాశ్చాత్య రచయితలను నేరుగా చదివి ఆకళింపు చేసుకునే అవకాశం లేదనేది. కాని ఇప్పటితరం కథకులు బాగా చదువుకున్న వారు. వారికిప్పుడు ప్రపంచ సాహిత్యం అరచేతిలోకొచ్చింది. అధ్యయనం చేస్తూ వర్తమాన జీవన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుంటూ కథాప్రక్రియను ముందుకు తీసుకెడతారన్న నమ్మకం నాకుంది.

 రచయితగా మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి!  ఏమైనా రాస్తున్నారా?

మా ప్రాంత జన జీవితం గురించిన కథలను ఇప్పటిదాకా రాశాను .అయితే రైతు జీవితం గురించి ఒక నవల రాయాలని ఉంది .సమయం  దొరకడం లేదు. మరో 10 నెలల తర్వాత ఉద్యోగ విరమణ ఉంది. నేనొక  నవల రాయడానికి సమయాన్ని కేటాయించే అవకాశం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.

*

చరణ్ పరిమి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సేద్యగాడి ప్రశ్న అనేదిఉండదు బహుశా ముందుముందు కార్పోరేట్ వ్యవసాయం రావచ్చు ప్రజలు దొరికింది తినే పరిస్తితికూడా రావచ్చు. బియ్యం అంటే ఏమిటి అవి ఏచెట్టుకి కాస్దాయి అని ఇప్పటికే చాలామంది పిల్లలు అడుగుతున్నారు. మీవివరణ చాలాబాగుంది అభినందనలండి నేనోక విశ్రాంతరైతు మరియు ఉద్యోగాని ప్రతిలిపిలోకదలు వ్రాస్తుంటాను..

  • అసలు సేద్యగాళ్ళుంటారా ముందుముందు. మీరువక్కాణించినట్లు ముసలితరం మాత్రమే వ్యవసాయం చేస్తోంంది. ఆతరవాత కార్పోరేట్ వ్యవసాయం రావచ్చు, అప్పుడు ప్రజలు ఏదిదోరికితే అదే తినాల్సివస్తుంది. ఇప్పటికే కొంతమంది పిల్లలు పట్నాలనుండి-విదేశాలనుండి వచ్చినవాళ్ళు బియ్యం అంటే ఏమిటి అవే చెట్లకు కాస్దాయి అని అడుగుతున్నారు ఇది నాఅభిప్రాయం

    మోహనరావు మంత్రిప్రగడ- విశ్రాంత రైతు-మరియు ప్రబుత్వ ఉద్యోగి. కాకినాడ. 9515275307 రచయత ప్రతిలిపి మరియు ఇతర అంతర్జాల మాధ్యమాలు.

  • మీరన్నది నిజమే కొంతకాలంతరవాత రైతుండడు అంతా కార్పోరేట్ వ్వవసాయం. ఎది పండిస్తే అదేతినాలిస్సి వస్తుంది. ఇప్పటికే సిటిలో పెరిగిన పిల్లలు బియ్యం అంటె ఏమిటీ, అవి ఏ చెట్లకి కాస్తాయి అని అడుగుతున్నారు. ముంముందెలాఉంటుందో తెలియదు. మంచి విషయాలు వ్రాసారు. అభినందనలు,

    నెనోక విశ్రాంత రైతుని మరియు విశ్రాంత ఉద్యోగిని.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు