కాలికింద నేలను ఎవడో తన్నుకు పోతుంటాడు
చేతిలోని పంటను ఎవడో గుంజుకు పోతుంటాడు
నెత్తిమీది గూడును ఎవడో పీకి పారేస్తుంటాడు
జేబులోని రూపాయికి విలువ లేదని పొమ్మంటాడు
నువ్వు మాత్రం మాటాడకూడదంటాడు
నీకోసమే ఇదంతా అభివృద్ధి చేస్తున్నానంటాడు
ఇదంతా అబద్దం అన్న వారిని దేశద్రోహులంటాడు
జైళ్ళన్నీ మంచి వాళ్ళతో పరిమళిస్తుంటాయి
కోర్టులన్నీ మొరటుగా మొరుగుతుంటాయి
అప్పుడప్పుడూ జనం వీధుల్లో చేతులూపుతూ కనిపిస్తారు
అప్పుడప్పుడూ కొన్ని వసంతాలు పూస్తుంటాయి
అప్పుడప్పుడూ పావురాలు మరికాస్తా ఎత్తుకు ఎగురుతుంటాయి
కొన్నాళ్ళకు ఏదో మబ్బు కమ్మినట్లు ఆకాశం
విషాదాన్ని పులుముకుని భోరుమంటుంది
రహదారులన్నీ తోవ తప్పి ముడుచుకుని పోతాయి
అప్పుడు మరల రైతు సేద్యం చేయ మొదలు పెడతాడు
చాళ్ళన్నీ ఎర్రగా చిగుళ్ళు వేస్తూ నేలను చీల్చుకు వస్తాయి!!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
చాలా బాగా రాశారు వర్మ గారు
Thank you sir..
నేలనీ మాయం చేసాక ఇంకెక్కడ మొదలెడతాడు వ్యవసాయం సార్ రైతు? చేయాల్సిన వ్యవసాయం రూపు మారిపోతుంది. మొలకెత్తాల్సింది ఇంకేదో మిగిలేవుంది. ఎర్ర చాళ్ళు కొత్త స్థలాల్ని వెతుక్కోవాల్సివుంది కదా!
ఇదే నేటి రాజ్యాలతీరు ఒక్కసారి కాలం కుచిచచుకు
పోయి మళ్ళా పుడితే తీరు మారచ్చు వర్మగారు చెప్పినట్టు.