సెంద్రయ్య విప్లవం

“అడిగిన అయిదు వూళ్లిస్తే కురుక్షేత్రం జరిగేదా? పాలోళ్లు ఒకనొకడు నరుక్కొని కుక్కసావు సచ్చేటోళ్లా? నేరం ద్రౌపది మీద నూకిండ్లు గానీ తప్పు కౌరవులది కాదా? ” అన్నడు ఒక పెద్దమనిషి.

తెల్లారిన ఓ గంటకు పంచాతీ మొదలైంది. బావుల కాడికి పోయేటోళ్లు కూడా ఆగి వింటండ్లు. బర్లు కొన్ని వూరి చెరువుకేలి పోతన్నయి. వాటికి దారిచ్చిండ్లు ఆడ కూసున్నోళ్లు.  గడి ముందట యాపసెట్టు వుంది. దాని యేరు మీద కూసున్నడు యెంకటయ్య. పంచాయతీ పెద్ద మనుషులు ఏం చెప్తరో విందామని వూరి జనమంతా గుమిగూడిండ్లు.

ధర్మయ్యకీ, సూరయ్యకీ మజ్జ గెట్ల తగాదా వొచ్చింది. ఇద్దరూ పాలోళ్లు. నాదాంట్లోకి గజం జరిగిండు వాడని ధర్మయ్య, లేదులేదు అట్టాంటి పాపం నేను చెయ్యను. వాడే రెండు గజాలు నాదాట్లోకి జరిగిండని సూరయ్య లొల్లిపెట్టిండు. ఒకనిమీద ఒకడు పడి గల్లలు గల్లలు పట్టుకొని కొట్టుకుండ్లు. వాళ్లిద్దరి పెళ్లాలు ఒకరినొకరు బూతులు తిట్టుకొని సిగలు పట్టుకున్నరు. బట్టలు వూసిపోయేటట్టు కొట్టుకున్నరు. ఆదివారం జరిగిన కొట్లాటను మల్లాదివారం పంచాయతీ పెట్టిండ్లు. ఇద్దరికీ భయం వుండాలని తలా పదివేలు డిపాజిటు పెట్టించిండ్లు పెద్దమనుషులు.

మహాభారతం కథను వరుసకు చెప్పిండు గర్వందుల ఈరసామి. అంతే.

అంటే మేము కౌరవులమా? అని లేచిండు సూరయ్య. “ఇదేనా నీ పెద్దమనిషితనం? నా భూమి నాకిప్పయ్యమంటే నన్ను దుర్యోధనుని చేసినవుగా, నీ కతకు నా మొడ్డ” అని లేచి తువ్వాల దులిపిండు.

పంచాతీ వింటున్న  అందరూ నోరెల్లపెట్టిండ్లు.

ధర్మయ్యేమీ తక్కువ తిన్నడా? వాడూ లేచిండు.

“అంటే నా  పెళ్లం ద్రౌపతా? నేనుగాక యింకా నలుగురు మొగుల్లున్నరా దానికి? ఓ సిగ్గులేని లంజదానా, కూసున్నావింకా. లే బడ్డుదానా” అని ధర్మయ్య నోరు చేసుకున్నడు. వాని పెళ్లం పెద్ద మనుషులను తిట్టుకుంటా లేచి ఎళ్లిపోయింది.

పెద్ద మనుషులేగాదు, ఆ పంచాతీకాడున్న అందరూ నవ్వుకొని నవ్వుకొని సచ్చిండ్లు.

“పంచాతీ ఇట్టనేనా చెప్పేది పెద్దమనిషి ఈరసామీ? సిగ్గుండాలే నీకు. లంజకతలు చెప్తావూ గాయిదోడా” అని యెంకటయ్య తిట్టుకుంటా లేసిండు.

“ఇది బాగున్నది. సాత్రానికి వొంద జెప్తమో పిలగా. ఇద్దరు లేచిపోతే నాకేమన్నా నాదానా? నష్టమా? డిపాజిటు పైసలు నాకాన్నే వున్నయి. వాళ్లు వాటికోసమైనా పంచాతీ యినాల్సిందే” అన్నడు ఈరసామి.

“పో, పొయి వాళ్లను ఒప్పిచ్చి తీస్కరాపో” అని మిగతా పెద్దమనుషులు లేచిండ్లు.

ఎవలిండ్లకు వాళ్లు లేచిపోయిండ్లు.

యెంకటయ్య యింటికొచ్చి బువ్వ తిందామని కూసున్నడు.

మాభారతం ముచ్చట యాది చేసుకుంటా నవ్వుకున్నడు.

ఒక్కసారిగా సెంద్రెయ్య గుర్తొచ్చిండు.

తినే కంచాన్ని మధ్యలోనే వొదిలేసి చెయ్యి కడుకున్నడు. చిలుకమ్మకు అర్థమైంది. లేచి కంచం చేతిలకు తీసుకొని తను తింటున్నది.

యింటి ముందటి యాపచెట్టు కింద కూచోని యెంకటయ్య ఆలోచిస్తున్నాడు. ఆ యాల్ల జరిగిన సంగతి యాదికొస్తంది.

***

‘‘ఓ అరుణ పతాకమా! చేగొనుమా రెడ్‌ సెల్యూట్‌’’ అని ఎవరో ఎలుగెత్తి పాడుతున్నరు. ఎండాకాలం పున్నమి. చల్లని వెన్నెల మల్లంపల్లిని సేదతీరుస్తున్న సమయం. బావుల కాడ పనులు చేసి వొచ్చి నాలుగు ముద్దలు తిని పక్కల మీద వాలే యాల్ల అది. సెంద్రెయ్య యింటి ముందు మంచంలో కునుకు తీద్దామని ఒరిగిండు. పిల్లలు అన్నం తిని వాళ్లకేసిన పక్కల్లో అటూయిటూ దొర్లుతున్నరు. యెంకటయ్య ఎర్రని లైటు కింద కూసోని యేదో రాసుకుంటండు. సోమయ్య కల్లుతాగి వొచ్చిండు. పెరుగుతో యింత గడ్కతిని పండుకున్నడు. ఆయన పెట్టే గుర్రుకు ఆ యింట్లో వచ్చే నిద్ర కూడా పారిపోతంది.

సెంద్రెయ్య సెవులకు చాలా యింపుగా ఆ పాట వినపడ్డది. వంత గాళ్లు కూడా అంతే బాగా పాడుతండ్లు. ఆ పాట అయిపోగానే యింకో పాట అందుకున్నరు. ఇక మంచంలో వుండలేకపోయిండు. లేచి ఆ పాట వినపడుతున్న దిక్కుకు నడిచిండు.

అది దొరగడి. ఆ గడి ముందట యాపచెట్టు. అది చాలా పాతది. దాని ఒంటిమీద వూడుతున్న పెచ్చులను బట్టి అది బహుశా వందేళ్లకు దగ్గరుంటది. ఆ చెట్టుకింద వెన్నెల రాత్రిలో అన్నలొచ్చి మీటింగు పెట్టిండ్లు. బుర్రోళ్ల యిల్లు ఆ పక్కనే వుంది. వాళ్ల యింటి ముందు కరెంటు స్తంభం వుంది. ఆ దాని తీగలకు ఒక కరెంటు వైరు తాకిచ్చి రెండు చిన్న లైట్లు పెట్టిండ్లు. అవి కూడా ఎర్రగా వెలుగుతున్నయి.

నలుగురు ఆడోళ్లు ఎర్ర అంచు చీరలు కట్టుకొని వంత పాడుతున్నరు. యింకో నలుగురు మొగోళ్లు కూడా పాడుతండ్లు. అక్కడో యిద్దరు యిక్కడో యిద్దరు పచ్చ బట్టలేసుకొని తుపాకులు పట్టుకొని చుట్టూ కాపలా కాత్తండ్లు. దొరలు గడీని వొదిలేసి హన్మకొండకు ఎల్లిపోయిండ్లు. ఆ గడి యిప్పుడు పడావు పడ్డది. పాటపాడుతున్న వ్యక్తి మధ్యమధ్యలో సమాజంలో దోపిడీ గురించి వివరిస్తూన్నడు.

వింటున్న జనాలు ఆ పాటలకు మాటలకు తలలూపుతుండ్లు. వాళ్ల మొహంలో కొత్త కాంతి కనిపిస్తుంది.

‘‘ఎవరూ భయపడొద్దు. పోలీసులొస్తరని అసలే భయపడొద్దు. మనవాళ్లు వూరి చుట్టూ కాపలా కాస్తున్నరు. ఒకవేళ పోలీసులు వొచ్చినా, వాళ్లు పొలిమేరల కాన్నే ఆగిపోతరు. యిది ప్రజల కోసం జరుగుతున్న యుద్ధం. మీ కోసం మా ప్రాణాలివ్వడానికి సిద్ధంగా వున్నాం’’ అని ఆవేశంతో మాట్లాడాడు ఒక వ్యక్తి. ఆయన్నెక్కడో చూసిన అని సెంద్రెయ్య యాది చేసుకుంటండు. గుర్తొచ్చింది. దర్దెపల్లి దండెయ్య. ఒరక్కో, ఈయనెప్పుడు అన్నలల్ల గలిసిండెహే అనుకున్నడు సెంద్రెయ్య.

భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదలు దున్నుకోవాలని దండెయ్య పిలుపునిచ్చిండు. అందరూ సప్పట్లు కొట్టిండ్లు. ఈ వూరిలో వాసునాయక్‌ అన్నల్దములు పెద్ద భూస్వాములు. వాళ్ల భూముల్లో జెండాలు పాతి, ఈ ఎర్రజెండా నాయకత్వంలో మీకు భూములు పంచుతాం అన్నాడు. అందరూ కేకలేసిండ్లు.

ఆ మాటలకు మాదిగలు చాలా సంతోషపడ్డరు. అన్నా మాకు గుంట భూమిలేదన్నా. మాక్కూడ భూమివ్వాలన్నా అని కొంత మంది దండెయ్యకు గోడు చెప్పుకున్నరు. తప్పకుండా భూమిలేని పేదలకు ఇద్దాం అని ఆయన మాటిచ్చిండు.

ఆ రోజు నడిజాము దాకా వాళ్లు అనేక విషయాల మీద అద్భుతమైన పాటలు పాడిరడ్లు. వీధినాటకం వేసిండ్లు. బూర్జువా పార్టీల నాయకుల నాటకాలను కళ్లకు కట్టినట్టు చూపించిండ్లు. మూడుగంటల రేతిరి వాళ్లు మళ్లీ కలుద్దామ్‌ కామ్రేడ్స్‌ అని చెప్పి చీకట్లో కలిసి పోయిండ్లు. అప్పటికి వెన్నెల కూడా అలిసిపోయి మసకబారుతంది. నల్లని మబ్బుల దుప్పటి కప్పుకొని అది కూడా కునుకు తీయాలనకున్నట్టుంది.

సెంద్రెయ్యకు ఆ మాటలు, ఆ పాటలు మంచిగనిపిచ్చినయి. దండెయ్య తనకు బాగా తెలుసు. వయసులో తనకన్నా ఇరవైయేండ్లు చిన్నోడు. దర్దెపల్లిలో దండెయ్య కనిపిస్తే పలుకరించేటోడు. అన్నలల్ల చేరిండంటే నమ్మబుద్ధి కాలే. జనం కోసం యిట్లాంటోళ్లు వుండాలె. ఎర్రజెండా పార్టీ పేదల కోసం కొట్టాడుతదని అంతా నమ్మకం. తమ్మడపల్లిలో సెంద్రెయ్య మేనబామ్మర్దులు కూడా ఎర్రజెండా పార్టీలనే పని చేస్తరు. శాంతమ్మ సచ్చిపోయినప్పుడు దినాలకు వాళ్లంతా వొచ్చిండు. భూభాగోతం అనే వీధి నాటకం ఆడిరడ్లు. దొరలు, భూస్వాములు, ధనవంతులు ఎట్లా దోచుకుంటండ్లో ఆటపాటలతో ఎల్మకంటి శ్రీనివాసు, ఆయన జట్టు జనానికి చూపించిండ్లు. అయితే, తుపాకులతో పోరాటం చేసే పార్టీ కాదు వాళ్లది. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ వాళ్లది. దండెయ్య చేరిన పార్టీ అట్లాంటిది కాదు. తుపాకులతో సావాసం. ఎప్పుడు పానాలు పోతయే తెల్వదు. తెగించి కొట్లాడే పని అది. అట్లా కొట్లాడే వాళ్లంటే సెంద్రెయ్యకు సానా యిష్టం.

తెల్లారింది. బాయికాడ గొడ్లను మేపినంక, వాటిని మామిడి చెట్ల కిందికి తోలుకొచ్చి గడ్డమీద కూసున్నడు. మామిడి సెట్టు సల్లగా వుంది. మామిడ కాయల చుట్టూ ఎర్రటి చీమలు అలుముకొని వున్నయి. ఎండల వొచ్చిండు యెంకటయ్య. పాలకుర్తికి పోయి వొత్తండు.

తమ్మునికి తిత్తిలున్న నీళ్లు తాగమని యిచ్చిండు. తిత్తి మూతి యిప్పి రెండు బుక్కల నీళ్లు తాగిండు యెంకటయ్య. ఇద్దరూ కాసేపు యేమీ మాట్లాడుకోలే.

‘‘రాతిరి పాటలు బగ్గ బాడిరడ్లురా యెంకటి. అన్నలట. దర్దెపల్లి దండెయ్య బలే మాట్లాడుతండు’’ అన్నడు సెంద్రెయ్య.

‘‘మాటల్దేముందే. యెవల్లన్నా మాట్లాడుతరు. యెవలికి న్యాయం జేత్తరని చూడాలె. లంబడోని భూముల జెండాలు పాతుతం అంటండ్లు. పాతి యెవనికి పంచుతరు? పోలీసులొత్తే యెవని యీపు పగుల్తది. వీళ్లు జెండలు పాతి పోతరు. యాడుంటరో తెల్వదు. కానీ, వూళ్లో వుంటోనికే గదా గోస. పోలీసులు యెవన్ని పట్టుకపోతరో, యెవన్ని కొడుతరో తెల్వదు గదా. యిడిపిచ్చుకొచ్చేటోడు లేకపోతే స్టేషన్ల పెండ కారుతది. జైలుకు పోవాలే. యిదంతా యెడతెగని పంచాయితీనే. యెవన్నీ బాగు చేసేది కాదు’’ అన్నడు యెంకటయ్య.

‘‘భూమిలేనోళ్లకే పంచుతం అంటండ్లు కదరా’’ అన్నడు సెంద్రెయ్య.

‘‘మంచిదేనే. కానీ పంచిన భూమి మీద హక్కు యెవడియ్యాలే? మళ్లా ప్రభుత్వమే కదా? అన్నలివ్వలేరు కదా! నల్లా నర్సింహులు, అయిలమ్మ స్వతంత్రం రాకముందే కొట్లాడిరడ్లు. భూములు పంచిండ్లు. ఏమైంది? వాటికి పట్టాలిచ్చిండ్లా? దున్నుకున్నోడికి ఇప్పటికీ పట్టాల్లేవు. యిదేమైతదో సూద్దాం’’ అన్నడు యెంకటయ్య.

సెంద్రెయ్యకు తమ్ముడు చెప్పేది నిజమే అనిపిచ్చింది.

అన్నలు అనుకున్నట్టే వాసునాయక్‌ భూముల్లో ఎర్రజెండాలు నాటడానికి ఒక రాత్రి వొచ్చిండ్లు.

రాత్రి ఏడుగంటల ప్రాంతంలో నినాదాలిస్తూ ఒక దళం వూళ్లోకి వొచ్చింది. దండెయ్య ఆ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. వూళ్లోని ప్రజలంతా భలే ఉత్సాహంతో వున్నారు. ఎవరైనా అడ్డొస్తే నరికి పారేస్తామన్నంత ఉద్రేకంగా వున్నారు. వూరంతా కలె తిరిగిండ్లు. వాళ్ల నినాదాల సప్పుడుకు చెట్ల మీది పచ్చులు కూడా బెదిరిపోయినయి. అవి కూడా నినాదాలకు వంత పాడుతున్నట్టు అరవటం మొదలు పెట్టినయి.

సెంద్రెయ్య కోడెకచ్చు పిలగాళ్ల యెనుక నడుత్తండు. వాళ్ల పాటలు వింటా తను సంబురపడుతండు. వూరంతా జులుసు తీసినంక వాసునాయకుని భూమిలోకి చేరుకున్నరు. ఆ భూమి యెంతో దూరంలో వుండదు. వూరికి ఆనుకొనే వుంటదు. ఎర్కలి సోమయ్య యిల్లు యెనుక వున్న ఎలుక్కాయ చెట్టు  కాన్నుంచి, మర్యాలలోళ్ల భూమి పానాది కాన్నుంచి, అంజనేయుని గుడి యెనక నుంచి జిలుకరోళ్ల యింటి యెనుక దాకా వాసునాయకునిదీ, ఆయన తమ్ముడు దేవానాయకునిదే. మొత్తం వొరి పండిత్తరు. సుమారు యాభై యెకరాల దాకా దున్ననిదే వుంది. అందులో మామిడి చెట్లు బాగా కాయలు కాసి వున్నయి. కొన్ని పండ్లు గాలి వానకు రాలి పడి వున్నయి.

అక్కడికి చేరుకోగానే జనమంతా మామిడి చెట్ల మీద పడ్డరు. దొరికిన కాయను, పండును తెంపుకొని ఒళ్లేసుకున్నరు. తువ్వాలల్లో మూటగట్టుకున్నరు. మాంచి పచ్చడి కాయరా. పచ్చడి పెట్టుకుందాం. ఎప్పుడు పచ్చడి పెట్టుకుంటం. కొన్ని కాయలియ్యమని అంటే కయ్యిమని లేసేటోడురా. యియ్యాల జూడు. వాని తోట లూటీ అయ్యిందని ఒకడు సంతోష పడ్డడు.

రాలిన పండ్లను తీసుకుంటే తిట్టేటోడు. తియ్యటి పండ్లు. నా కొడుకు ఇప్పుడేం అంటడు అని యింకో నడీడు మనిషి అన్నడు. గుద్ద మూసుకొని పంటడు సూడు యిప్పుడు అని యింకో ఆయన పండ్లను మూటగడుతూ అన్నడు.

అన్నలు ఈ భూమి మనదిరా ఈ వూరు మనదిరా అంటూ పాడుతనే వున్నరు. కాసేపయినంక దండెయ్య భూమి విప్లవానికి యిరుసు లాంటిదని, నూత్న ప్రజాస్వామిక విప్లవ దశలో భూపోరాటం కీలకమైందని ఉపన్యసించిండు. దేశంలోని భూమి అంతా భూస్వాముల చేతిలో చెరబట్టబడ్డదన్నడు. భూసంస్కరణల చట్టం సరిగా అమలవుతలేదన్నడు. ఈ పాలకులకు పేదలకు భూమివ్వాలనే చిత్తశుద్ధి లేదన్నడు. భూర్జువా, భూస్వామ్య, గుత్తాపెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేసే దళారీ ప్రభుత్వాలకు పేదల కన్నీళ్లు పట్టవన్నాడు. పేదలు సాయుధులయి తిరగడితే విప్లవం వస్తుందన్నడు. మనుషులంతా సమానంగా బతకడమే విప్లవపార్టీ లక్ష్యమన్నడు. ఆ మాటలు విన్న వూరి కోడెకచ్చు ముగ్ధులయ్యిండ్లు. నడీడోళ్లు ఆ మాటలకు అర్థం గాక అయోమయంలో పడ్డరు. ఆ మాటలు అర్థం గాకపోయినా, దండెయ్య గొంతులోని బలం వాళ్లను కట్టిపడేసింది.

మొదటి జెండాను నేనే పాతుతున్నా. ధైర్యం వున్న వాళ్లు ఎర్రజెండాలను పాతండి అని పెద్ద కర్రకు కట్టిన ఎర్రజెండాను దండెయ్య నాటిండు. అంతే, జనమంతా తమ దగ్గరున్న ఎర్రజెండాలను తమకు నచ్చిన చోట నాటిండ్లు. ఈన్నుంచి, ఈడిదాకా నాదే అని హద్దులు గీసుకున్నరు. ఆ కోలహలం చూసి ఆ పక్కనే వున్న తుప్పల్లోని విషపురుగులు కలుగుల్లోకి దూరి దాక్కున్నయి.

సెంద్రెయ్య కూడా ఎర్రజెండాలు నాటిండు. వాటి మధ్య నిలబడి ఇది నా స్థలం అనుకున్నడు. సెంద్రెయ్య మాదిరే జెండాలు పాతినోళ్లంతా అనుకొని సంబురపడ్డరు. అంతా కొంచెం సద్దుమణిగినంక దండెయ్య ఆదేశాల మేరకు అందరినీ ఒకచోట దళసభ్యులు నిలబెట్టిండ్లు.

‘‘మీ ధైర్యానికి విప్లవ దండాలు. యిప్పుడు ఈ నేల మీ అందరిదీ. మీనుంచి ఈ భూమిని ఎవ్వరూ గుంజుకోలేరు. ఒకవేళ అట్లాంటి ధైర్యం ఎవడైనా చేస్తే, మన దళం వాడిని ప్రజాకోర్టులో నిలబెట్టి తగిన విధంగా శిక్షిస్తది. వర్గశత్రు నిర్మూలనకు మేము వెనుకడుగేయం. అయితే, మీకు నచ్చినట్టు మీరు ఈ స్థలం నాదీ అనుకుంటే సరిపోదు. దేనికైనా ఒక క్రమం, ఒక పద్ధతీ వుంటయి. అందరికీ న్యాయం జరిగేలా స్థలాల కేటాయింపు జరగాలె. కాబట్టి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీలో మీకు నచ్చినవాళ్లను పెట్టుకొనే స్వేచ్ఛ మీకుంది. ఎవరి పేరైనా చెప్తారా’’ అన్నాడు దండెయ్య. ఆ మాటలు చాల యింపుగా వున్నయి. కొంతమంది తమకు యిష్టమైన వాళ్ల పేర్లు చెప్పిండ్లు. వాళ్లను కమిటీ సభ్యులని ప్రకటించిండు.

పార్టీ తరఫున ఇద్దరిని పెడుతున్నము. వాళ్లు కమిటీకి ప్రధాన కార్యదర్శులు. కోతి ప్రభాకర్‌, ఎర్కలి యెంకన్న అని ప్రకటించిండు.

జనం సప్పట్లు కొట్టి ఆమోదం తెలిపిండ్లు. ఆ తర్వాత లాల్‌ సలాం చెప్పి అన్నలు సీకట్లో కలిసి పోయిండ్లు.

జనమంతా కోతి ప్రభాకర్‌, ఎర్కలి యెంకన్నల వైపు చూసిండ్లు. వాళ్లు గొప్ప విశ్వాసంతో నవ్విండ్లు. జనం కూడా అరే మీరింత పెద్దోలా? అని వాళ్లతో చేతులు కలపడానికి ఉత్సాహం చూపిండ్లు.

సెంద్రెయ్య కూడా వాళ్లిద్దర్నీ మెచ్చుకున్నడు.

కొంతమంది కోతి ప్రభాకర్‌ యింటికీ, యింకొంత మంది ఎర్కలి యెంకన్న యింటికీ బాటపట్టిండ్లు.

యిల్లు లేక బాధలు పడుతన్నము అని ఒకరు. నువ్వే ఎట్లయినా నాకు స్థలం యిప్పియ్యాలే అని యింకొకరు అర్జీలు పెట్టుకున్నరు.

యెంకటయ్యను నిద్రలేపి ఆడ జనాభా జరిగిన యవ్వారమంతా చెప్పిండు. అంతా విని అదంతా అయ్యేది కాదు పొయ్యేదికాదు అన్నడు యెంకటయ్య.

ఆ మాటకు సెంద్రెయ్యకు అనుమానం రావాలె. కానీ కోపం వొచ్చింది. సరెలే. అంతా నువ్వనుకున్నట్టు జరుగుతది అని యటకారం అడి రుసరుసలాడిండు. తమ్ముడు యేదో చెప్తంటే వినకుంటా యెళ్లిపోయి పడుకున్నడు. ఆ చీకట్లో అలిగి మబ్బుల వొరాల కింద దాక్కున సందమామ లెక్క మెత్తను పక్కకు యిసిరేసి పడుకున్నడు సెంద్రెయ్య.

రెండు రోజులల్లో వూళ్లెకు పోలీసులొచ్చి అందర్నీ పట్టుక పోతరని అనుకున్నరు. కానీ పోలీసులు రాలే.

జెండాలు పాతిన రోజు అన్నలు చీకట్లో కలిసి పోయిండ్లు కదా. సూటిగా పెద్ద తండాకు పోయిండ్లట. వాసునాయకున్ని, దేవానాయకున్ని మంచంల నుంచి లేపిండ్లట. మీ భూముల్లో జెండాలు పాతినం. ఆ భూమి యిప్పటి నుంచి పేదలది. మీరు పోలీసులకు ఫిర్యాదు చేసిండ్లనుకో, కంతలో తుపాకీ పెట్టి కాల్చి పారదొబ్బుతం అని బెదిరిచిండ్లట. బహుశా, అందుకే వాళ్లు పోలీసులకు చెప్పలే. పోలీసులు వాళ్లిద్దరినీ స్టేషనుకు రమ్మంటే పోయిండ్లు. మా బాధలేవో మేం బడుతం. ఈ విషయంలో మీరు మధ్యల రాకుండ్లి అని చెప్పొచ్చి, సప్పుడు గాకుంట వున్నరు అన్నదమ్ములు. ఆ దెబ్బతో జనానికి భయం కూడా పోయింది. పెద్ద ధైర్యం వొచ్చింది.

వూరి మాదిగోళ్లు పొయి కమిటీ నాయకులకు కష్టాలు చెప్పుకున్నరు. నిజానికి వాళ్లకు గుంట భూమి లేని పేదలు. యిందిరమ్మ యిచ్చిన భూములకు పట్టా కూడా వాళ్ల పేరు మీద లేదు. కుల పెద్ద పేరు మీదనే రాయించిండ్లు. యిప్పుడు ఆ కులపెద్ద నా పేరు మీద వుంది కాబట్టి అది నా భూమి. మీదెట్లా అయితదని అడ్డం తిరిగిండు. అది తేలక చాలా యేండ్లయితంది. అన్నల వల్లనైనా యింత తలం తొరుకుతదని వాళ్ల ఆశ. అందుకే దండెయ్య ఎనకనే జులుస్‌లో నడిచిండ్లు. గొంతు చినిగిపోయేటట్టు నినాదాలిచ్చిండ్లు.

కమిటీ నాయకులు తప్పకుండా స్థలం యిద్దామన్నరు. అందర్నీ చూడాలె కదా అన్నరు.

సూదరోళ్లు కొంతమంది వాళ్లను కలిసిండ్లు. మాకు స్థలం యివ్వాలే. మేము పేదలం. మీకు తెలుసు కదా. మీరు మన కులపోళ్లు. మనం మనం సాయం చేసుకోవాలె. అందరినీ ఒక్కలాగే చూస్తే లేని సమస్యలొస్తయి అన్నరు. ఆలోచిద్దాము లే అన్నరు ఆ నాయకులు.

మూడోరోజు స్థలాలు పంచిండ్లు. ఒకవైపు మొత్తం సూదరోళ్లకు యిచ్చిండ్లు. యింకో పక్క పది కుటుంబాలకు మాదిగోళ్లకిచ్చిండ్లు.

సెంద్రెయ్యకు అది నచ్చలే. అదే సంగతిని నిలదీసిండు. ‘‘మీరు చేసిన పని మంచిగ లేదు పిలగా. ఒక పక్కకు మాదిగోళ్లకు యిచ్చిండ్లు. అదీ పది మందికే. యింకో పక్కన మొత్తం సూదరోళ్లకు యిచ్చిండ్లు. వాళ్లకే ఎక్కువ మందికిచ్చిండ్లు. వందల తొంభైమంది వాళ్లే వున్నరు. ఇదేం న్యాయం? మీరు కులానికి పెద్ద పీటేసిండ్లు. యిదెట్ల విప్లవం అవుతది?’’ అని నిలదీసిండు.

వాళ్లు ఆ మాటలకు బిత్తర పోయిండ్లు. ఏమి సమాధనం చెప్పాల్నో తెలువక నక్కీలు పడ్డయి. ‘‘మీరు భూమి సరిగా పంచలే. సర్కారు సరిగా పంచలేదని దండెయ్య మాట్లాడిరడు. మరి మీరు సక్కంగ పంచిండ్లా? యిదేం పనిరా’’ అని పెంద్రెయ్య తిట్టిండు. ఆ మాటలకు ఏర్పుల రామసెంద్రు తోడయ్యిండు. యిది అన్యాయం. మాదిగలమని మీరు మాకు అన్యాయం సేత్తండ్లు. మీ సూదరి బుద్ధి పోనిచ్చుకోలేదని చెడామడా వాయించిండు.

ఆ మాటలకు కోతి ప్రభాకరుకు కోపం వొచ్చింది. నువ్వెక్కువ మాట్లాడొద్దు. మీరు పంచాతీ చేస్తే నేను పార్టీకి చెప్తా. ఆ తర్వాత మీ పానాలకు నాది పూచీ కాదు అని బెదిరిచ్చిండు.

ఆ మాటలకు సెంద్రెయ్యకు తిక్క నషాలానికెక్కింది. ‘‘ఓ అయ్యా, ఎవల్ని బెదిరిత్తనవు? రమ్మను నీ దండెయ్యను. మాట్లాడుదాం. తుపాకులు సూత్తె ఉచ్చబడేది నీకు. నాక్కాదు. తప్పు యెవడు చేసినా తప్పే. కమ్యూనిస్టు చేసినా తప్పే. కాంగ్రెసోడు చేసినా తప్పే. నాకు తిక్కరేగితే మంచిగుండదు మల్లా. రేపే మీ దండెయ్య వూళ్లెకు రావాలె. ఈ పంచాతీ తెగాలే’’ అని గద్దించిండు.

సెంద్రెయ్యకు కోపం వొత్తే ఏమయితదో ఆడున్నోళ్లకు బాగా తెలుసు. ఎవలూ ఏమీ మాట్లాడలే. దండెయ్యను రేపు పిలుపిత్తం. కూసోని మాట్లాడుదం అన్నడు కోతి ప్రభాకర్‌.

అంతా ఎదురు చూస్తున్నట్టే దండెయ్య దళాన్ని తీసుకొని మల్లంపల్లికి వొచ్చిండు. వూల్లున్న బడికాడి మర్రి చెట్టుకింద అంతా కూసున్నరు. జనమంతా పరేషానుగా వున్నరు. దండెయ్య లేచి మాట్లాడపోయిండు. సెంద్రెయ్య లేచి నువ్వేమీ మాట్లాడొద్దు. ముందు నేను చెప్పేది విను అన్నడు. దండెయ్య కూచున్నడు. సెంద్రెయ్య తన మనసులోని మాట చెప్పిండు. వూళ్లె మాదిగోళ్లు ఎప్పటి నుంచో దూరంగా వున్నరు. ఎర్ర జెండా ఏం చెయ్యాలే? వూరవుతల వున్నోల్లను తీస్కొచ్చి వూరి మధ్యల పెట్టాలే. మీరేం చేసిండ్లు? స్థలాలు కావాలనే మాదిగలకు దూరంగా యిచ్చిండ్లు. మొత్తం సూదరోళ్లకే యిచ్చిండ్లు. ప్రతీ సూదరాయన  పక్కన ఓ మాదిగాయనకు తలం యెందుకు యివ్వరు? అట్లా యిస్తే కదా విప్లవం వొచ్చేది? మీరు కూడా కులం పాటిత్తే, యిగ సమాజం మారేదెట్లా?’’ అన్నడు సెంద్రెయ్య. తన కోపాన్ని మొత్తం చెప్పి కూచున్నడు. అప్పుడు దండెయ్య లేచి సర్ది చెప్పబోయిండు. మాదిగలకు, సూదరోళ్లకు కలిపి స్థలం యిద్దామనే నాకూ వున్నది. కానీ సూదరోళ్లు యింటలేరు. మాదిగోళ్ల పక్కన మేముండం అంటండ్లు. వాళ్లను కాదంటే పార్టీ యిక్కడ నిలదొక్కుకోదు. కాబట్టి యింకా కొంతమంది మాదిగలకు స్థలం యిద్దాం. మన పార్టీ జెండాలు పాతే భూములు యింకా చాలా వున్నయి. వాటిలో మాదిగలకే ఎక్కువిద్దాం’’ అని దండెయ్య చెప్పిండు.

ఆ మాటకు సెంద్రెయ్య అడ్డంబడ్డడు. ‘‘ఉన్నదాంట్లో న్యాయం చెయ్యలేదు నువ్వు. కొత్తదాంట్లే సేత్తవని రుజువేంది? మేము అడుగుతున్నది ఎక్కువ భూమి కాదు. సూదరోళ్ల మధ్య మా వోళ్లకు స్థలం యెందుకు యివ్వరు అని? నిజంగా మీకు మనసుంటే ఈ కులం అనేదాన్ని ఎట్లా ఒప్పుకుంటరు? మీరు తెచ్చే విప్లవంల కులాన్ని యిట్లాగే బతకనిస్తరా? యిదే మీ విప్లవమైతే మాకొద్దు’’ అని లేచిండు సెంద్రెయ్య.

ఏర్పుల రామసెంద్రం, తాళ్లపెల్లి సోమయ్య, గంగారపు అయిలయ్య, తాళ్లపెల్లి మైసయ్య అంతా లేచిండ్లు. మీ భూమి మాకొద్దు. మీ జెండా మాకొద్దు. ఆ సూదరోళ్లతోటే చేసుకోండ్లి మీ పోరాటం అని ఖరాఖండిగా చెప్పిండ్లు.

దండెయ్య యేదో చెప్పబోతుంటే వినకుండా మాదిగలంతా లేచి యెళ్లిపోయిండ్లు. సూదరోళ్లు దండెయ్యను కలిసి ఈ మాదిగోలెప్పుడూ యింతే. యేదో కిరికిరి పెడ్తనే వుంటరు. మీకెందుకు మేమున్నంగా. వాళ్లకు అవసరం లేకపోతే, సూదరోళ్లలో అవుసరం వున్నోళ్లకే యిద్దాం అన్నరు. దండెయ్య వాళ్లను కసురుకున్నడు. యిదంతా మీ వల్లనే అన్నడు. మీ కుల పిచ్చి వల్ల మా ఆ పార్టీ బద్నాం అయ్యేటట్టున్నది. మళ్లా కలుద్దాం. లాల్‌ సలామ్‌ అని చెప్పి దళంతో సహా వెళ్లిపోయిండు.

బండ బూతులు తిట్టుకుంటా సెంద్రెయ్య యింటికొచ్చిండు.

యెంకటయ్య తనకోసేమే యెదురు సూత్తండు. తమ్మునికి జరిగిందంతా చెప్పిండు. అంతా విని యెంకటయ్య ‘‘అది వాసుగాని భూమి అని ఎవడు సెప్పిండే. జెండాలు పాతిన భూమంతా గ్రామకంఠం. అది వాని భూమి ఎట్లా అయితది? ఎర్ర జెండాలు పాతాలనుకునేటోడు ఏది సర్కారు భూమి, ఏది గ్రామకంఠం భూమి అని సూసుకోడా? ఏది వాసుగాని భూమో తెలుసుకోడా? అదంతా పనికిరాని యవ్వారం. కులాన్ని దాటి ఏదీ పోలేదన్నా. ఏ పోరాటమైన యిట్లనే వుంటది. వూరవుతలోడు అవుతల్నే వుండాలని సూత్తరు. ఏ పార్టీ అయినా ఈ గీతను చెరుపలేదు. అది మాభారత కాలం నుంచీ వున్నదే. పాండవులు కౌరవులు కొట్లాడితే మధ్యలో యాదవులు, నిషాదులు, యితర సూదరోళ్లు సచ్చిండ్లు. దేనికోసం?. అది భూమి కోసం జరిగిన యుద్ధం కాదు. కులాన్ని కాపాడ్డానికి జరిగింది. కర్ణుడు, ఏకలవ్యుడు, మైరావణుడు, ఘటోత్కచుడు ఏమయ్యిండ్లు? మధ్యలో పోయినందుకు వుత్తగనే పాణాలు పోగొట్టుకున్నరు. పాండవులు గెలిచిండ్లు? యేమైంది? రాజులు రాజులు మంచిగ బతికిండ్లు. అయ్యవార్లు మంచిగ బతికిండ్లు. మనలాంటి కులపోళ్ల గతేమైంది? యాన్నన్నా రాసిండ్లా? ధర్మరాజు పాలనలో మాలమాదిగోళ్లు యెట్లా బతికిండ్లో మాబారతంల యాన్నన్నా చెప్పిండ్లా? యిది గూడా గంతేనే సెంద్రెన్న. విప్లవం పేరుతో జరుగుతున్నది కూడా గంతే. మధ్యల మాల మాదిగోళ్లు దూరితే, మైరావణుని లెక్క సచ్చుడు తప్పా, సింహాసనం దక్కదు. సూదరోళ్ల పక్కన చిన్న స్థలమే యివ్వనోళ్లు రేపు విప్లవం వొత్తే కుర్చీకాడికి రానిత్తరా? నీకేంపని లేక ఉరికిఉరికి జెండాలు పాతినవు’’ అని నవ్విండు యెంకటయ్య.

తమ్ముని మాటలకు ఆలోచనలో పడ్డడు సెంద్రెయ్య. యేమీ మాట్లాడకుండా పోయి మంచంలో వాలిపోయిండు.

***

తప్పు చేస్తే యెవ్వనైనా ప్రశ్నించే సెంద్రన్న యాడున్నడో? బతికే వున్నడా? సచ్చిపోయిండా? అని తలుచుకొని వొలవొలా యేడ్చిండు యెంకటయ్య. అన్న మీది ప్రేమతో అతని గుండె అల్లాడి పోయింది.

*

జిలుకర శ్రీనివాస్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ప్రతీ సూదరాయనకు పక్కన ఓ మాదిగాయనకు తలం ఎందుకు ఇవ్వరు ?అట్లా ఇస్తే కదా విప్లవం వచ్చేది ?మీరు కూడా కులం పాటిత్తే, ఇగ సమాజం మారేదెట్లా ? “- అన్న సెంద్రయ్య ప్రశ్న , సామాజిక సమానత్వం కోసం పోరాడే ప్రతి ఒక్కరినీ/ ప్రతి పార్టీనీ నిలదీసేదే. సెంద్రయ్య కథల్లో ప్రతి సంఘటనలో సెంద్రయ్యలో కనిపించే చైతన్యానికి వున్న మూలాలు ఈ కథలో వ్యక్తం అయ్యాయి. అయితే 1980 లలో తెలంగాణలో భూమి సమస్య తాత్కాలికంగా నైనా మరోలా పరిష్కారం కాలేదా అన్నది ఇక్కడ చర్చ కాదు. సెంద్రయ్యను తీర్చి దిద్దిన అనుభవ చైతన్యం ఇక్కడ ముఖ్యం. తెలుగు సాహిత్యంలో రావాల్సిన కొత్త ఒరవడికి ఈ సెంద్రయ్య కథలు దారి చూపిస్తాయి. అణచివేతకు గురవుతున్న ఒక దళిత జాతి జీవన అస్తిత్వ ఆవేదన కంఠ స్వరం ఈ బైండ్ల సెంద్రయ్య కథలు.

  • కనీసం ఇరవై యేళ్ళ క్రితం రావాల్సిన కథ . రాయలసీమ లో వేంపెంట ఘటనల ఆధారంగా విరసం పాణి రాసిన నిప్పులవాగు నవల కథా వస్తువు యిదే. ఈ కథలో చెప్పినట్లు వినీ దళం భూమిని మాదిగలకు పంచాలనే నిర్ణయం తీసుకుంటే , మొదట బీసీలూ , ఆ తర్వాత మాలలూ విప్లవ పార్టీని వీడుతారు , చివరకు మాదిగల మీద దాడి చేస్తారు . మాదిగలకు భూమి పంచే తీరాల అనినందుకు మాదిగ వాడ రక్త సిక్తం అయ్యిందా నవలలో. వాస్తవం కూడా అదే.
    కులాన్ని యేదో మేరకు నూట్రలైజ్ చేయకుండా విప్లవ పార్టీ కూడా పనిచేయలేదు .
    శ్రీనివాస్ కథనం బాగుంది. ఇంతకీ ప్రారంభంలో వచ్చిన అసలు కథ యేమైనట్టు?

    • అదొక టెక్కిక్. మాభారతంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది అని చెప్పే నారేటగ్ టెక్నిక్. ఆ పంచాతీని పై స్థాయిలో చర్చించడానికి భూపోరాటం కథ.
      మీ స్పందనకు ధన్యవాదాలు. ‌

  • విప్లవానికి ఇరుసు భూమి. నిజమే. వ్యవసాయిక సమాజంలో నూతన ప్రజాస్వామిక విప్లవం భూమి కేంద్రంగా నడుస్తుంది. అయితే మన దేశంలో ఆ భూమి చుట్టూ కులం అల్లుకుని ఉంది. ఇదొక చేదు సామాజిక వాస్తవం. ఈ వైరుధ్యాన్ని పరిష్కారించే దిశగా జరగాల్సిన కృషి సమాంతరంగా జరగాలి. ఆర్థిక రాజకీయ పోరాటాలు సాంస్కృతిక పోరాటాలు జమిలిగా ఏకకాలంలో నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ కథ గుర్తించింది.
    బైండ్ల చంద్రయ్య కథల్ని రాజకీయ కథలుగా మలచి లోతైన చర్చకు తెర తీసిన జిలుకరకు అభినందనలు.

    • Thank you very much, sir. Caste and land both highly interconnected. Caste system always excludes its subjects from any kind of property weather it is private and public. Caste minds never allow a lower castes to share with them a small portion of property. Before distributing the land, communist party should sensitize the people about equality and fraternity. This has not been done as per my knowledge. Sendraiah reminding us to sensitize the caste minds towards lower castes. Loved your comment. Thank you.

  • This is an offbeat story totally. This instigates lot of debate. “Backward” and “more backward” is something people need to think deeply. We have lot of contradictions in the society at each and every level. That is what this story highlights.అయితే – నాకర్థం కానిది – నక్సలైట్లు కులం గురించి చెంద్రయ్య అంత డీప్ గా అలోచించలేదు కాని – మాదిగల గురించి చేసారా? కేవలం ఆర్థిక ప్రాతిపదికన ఆలోచించే వీళ్ళకు ఒక కుల ప్రశ్న ముందు పడినప్పుడు , వాళ్ళూ హేండిల్ చేయలేకపోయినారు అని ఈ కస్థ చెప్తుంది. ఈ స్టొరీలో డిబేట్ తెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. జిలుకర బ్రడర్ …. ur wiritng skills are extraordinary in this piece

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు