సూరత్‌ మొగడు

ల్గొండ జిల్లా రామన్నపేట ప్రాంతానికి చెందిన నిఖిత నెల్లుట్ల ఇప్పుడిప్పుడే కథలు రాస్తున్న రచయిత. ఇప్పటి వరకూ మూడు కథలు రాశారు. చదివింది ఇంజనీరింగ్ ఐనా….అక్షరాల మీద ప్రేమతో జర్నలిజం వృత్తిగా స్వీకరించారు. తర్వాత సాహిత్యం మీద మక్కువతో కథలు రాస్తున్నారు. పుట్టి పెరిగిన ప్రాంతంలోని మనుషులను, తనకు తెలిసిన మనుషుల జీవితాలకి కథా రూపం ఇస్తున్నారు. అదే సమయంలో కొత్త తరం ఆలోచనలకు తన కథల్లో అద్దం పడుతున్నారు.  మనుషుల మధ్య అనుబంధాలను, ఆ అనుబంధాల్లోని గాఢతను, భావోద్వేగాలను తన కథల్లో చిత్రించడానికి ఇష్టపడతానని అంటున్న నిఖిత రాసిన సూరత్ మొగడు కథ ఈ పక్షం రేపటి కథ.

 

    సూరత్‌ మొగడు

కోడికూత ‘కొక్కొరొక్కో’ అని ముందు మెల్లిగా, తర్వాత కాస్తంత గట్టిగా వినపడటం మొదలైంది. చెదలు పట్టిన తలుపు సందులో నుంచి వెలుతురు సన్నగా లోనికొస్తోంది. రోజూ రాత్రంతా చీకట్లోనే పడుకునే పార్వతమ్మకు మెలకువొచ్చింది. ఇంట్లో గడియారం లేకున్నా, రోజూ లేచే సమయమదేగా.. టెంచనుగా లేచేసింది. లేస్తూనే తాను పడుకున్న చాపను, దానిపైనున్న మూడు పాత చీరలతో కుట్టిన బొంతను మడతేసుకుంది.

మెల్లిగా బయటికొచ్చి, నాలుగు అడుగుల వాకిలిని రెండు నిమిషాల్లో ఊడ్చేసింది. నీళ్లు చల్లి ముగ్గేసి లోపలికెళ్లింది. పెరట్లో ఉన్న కట్టెలను తీసుకొచ్చి, పొయ్యిని ముట్టిచ్చింది, నీళ్లు కాగబెట్టుకోవడానికి. ఏ కాలమైనా పార్వతమ్మకు వేడినీళ్లతోనే స్నానం చేయడం అలవాటు. ఉన్న నాలుగు చీరలనే ఏడాది నుంచి కట్టుకుంటుంది. అందులోనే ఆకుపచ్చ చీర ఉంది ఒకటి. అదంటే పార్వతమ్మ భర్తకు చాలా ఇష్టం. ఆ రోజు ఆ చీరనే కట్టుకుంది. దేవుడి పటం దగ్గరకు వెళ్లి కుంకుమను నుదుటిన పెట్టుకుంది. పనికి ఆలస్యం అవుతోందని భయమేసిందో ఏమోగానీ, వెంటనే కాసిన్ని బియ్యం కడిగి పొయి మీద పెట్టింది. నాలుగు టమాటాలు, మూడు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకుంది. అన్నం అయిపోగానే, మరో మట్టి గిన్నెలో టమాటాలు, మిరపకాయలు, ఇంత నూనె, ఉప్పు వేసింది. అవి ఉడికాయో లేదో… దింపేసి పప్పుగుత్తితో అటూ ఇటూ రుబ్బి పక్కన పెట్టింది. గుడిసెలో ఓ మూలకున్న రెండు అర్రల టిఫిన్‌బాక్స్‌ను బయటికి తీసింది. ఒకదాంట్లో అన్నం, మరోదాంట్లో అప్పుడే రుబ్బుకున్న పచ్చడిని పెట్టుకుంది. ఇరవై ఏడేండ్ల క్రితం పెళ్లికి అమ్మగారు పెట్టిన పళ్లెంలో వేడన్నాన్ని కొద్దిగా పెట్టుకొని, రెండు ముద్దలు తినేసింది. తర్వాత ఆ పగుళ్లు పట్టిన స్టీల్‌ ప్లేట్‌ను శుభ్రంగా కడిగి భద్రంగా మళ్లీ ఓ మూలకు పెట్టింది.

అప్పుడే ‘‘పార్వతమ్మా.. అయిందా?’’ అన్న ఓ అరుపు  బయటి నుంచి గట్టిగా వినపడింది. ఆ గొంతు ఎదురింటి సుశీలమ్మది.

‘‘ఆ..! వస్తాన్న సుశీలక్కా…’’ అంటూ ఆ గుడిసెకు ఓ చిన్న ఇనుప తాళం వేసింది పార్వతమ్మ. చేతిలో టిఫిన్‌ పట్టుకొని బయల్దేరింది.

*****

మండుటెండలో.. ఒళ్లంతా పట్టిన చెమటను కొంగుతో తుడుచుకుంటూ పత్తి ఏరుతోంది పార్వతమ్మ. ఆమెను చూస్తున్న కొన్ని నోళ్లు గొనుగుతున్నాయి. అవి ఈ ఒక్కరోజే కాదు.. ఏండ్లుగా చేస్తున్న పనే అది.

పార్వతమ్మ ఒంటరి మహిళ. కట్టుకున్నోడు పెళ్లైన రెండేళ్లకే వదిలేసి సూరత్‌ వెళ్లిపోయాడు. భర్త ఉన్నాడో, లేడో కూడా తెలియకుండా బతుకుతోంది.

‘‘నువ్వింకా నీ మొగడు కట్టిన తాళిని మెళ్లో వేసుకుంటున్నందుకు ఇరుగుపొరుగోళ్లు రోజూ గునుక్కుంటరె పార్వతి..’’ అంది సుశీలమ్మ.

‘‘గునుక్కోనీలే.. నా మొగడు నా పక్కన లేకుంటే ఏంది? ఎక్కడో ఓకాడ బతికే ఉండుగా’’ అన్న సమాధానం పార్వతమ్మ గట్టిగానే చెప్పింది.

‘‘మరి నిన్ను ఎవ్వళ్లూ ఏ పూజకు, నోములకు పిలవరు కదా. నీకేం అనిపియ్యదా?’’ సూటిగా అడిగింది సుశీల.

‘‘పూజలు, వ్రతాలా.. ఆటిని నేనెప్పుడో వదిలేసిన. నాకిప్పుడు రెండు ముద్దలు నోట్లకి బోతే సాలు. దానికి తప్పుడు పని దప్ప, ఏ కష్టమైనా జేస్తా’’.

సుశీలమ్మ, పార్వతమ్మ మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నారు. అప్పుడే ఓ మోటారు బండి మీద పక్క ఊరి ఆసామి వచ్చాడు. ఈ ఊళ్లో ఆయన కొన్న కొత్త పొలంలో పనిచేయడానికి నలుగురు మనుషులు కావాలని వచ్చాడు. విషయం తెలుసుకున్న పార్వతమ్మ ముందుగానే అక్కడికి చేరింది.

‘‘ఏంది నీ పేరు? ఏం పని జేస్తవ్‌ నువ్వు’’ ఆసామి అడిగాడు.

‘‘నా పేరు పార్వతమ్మ అయ్యా! ఒక్కSపని అని కాదయ్యా. పత్తి ఏరబోత, కలువకు పోత, ఏ పనీ దొరక్కపోతే బీడీలైనా జేస్తానయ్యా. కాలు నొచ్చినా.. కడుపు నొచ్చినా.. ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా పని జేస్తానయ్యా’’ అంది పార్వతమ్మ.

‘‘సరే..! చూస్తుంటే కష్టపోతులా ఉన్నావ్‌. రేపటి నుంచి నా పొలంలో పనికిరా. వారానికింత అని లెక్క చూసి ఇస్తా’’ అన్నాడు ఆ ఆసామి.

అలా ఒక్కొక్కరినీ అడిగి, ఆయన ఓ నలుగురిని ఎంచుకున్నాడు. అందులో పార్వతమ్మ కష్టసుఖాన్ని పంచుకునే సుశీలమ్మ కూడా ఉంది. పార్వతమ్మకున్న కష్టం ఇప్పటిది కాదు. దాన్నలా భరిస్తూనే ఉందామె, ఇప్పటికీ.

******

అది ఇరవై ఏడేండ్ల కిందట జరిగిన ముచ్చట. పార్వతమ్మ ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ. ఏనాడూ ఏ పనికీ ఆమెను పంపలేదు. ఆ అవసరం వాళ్లకు రాలేదు. పద్దెనిమిదేళ్లు నిండగానే.. ఆమెకింక పెళ్లి చేయాలనుకున్నారు. పక్క ఊళ్లోంచి ఓ సంబంధం వచ్చింది.

వాళ్లు అయిదుగురు అన్నదమ్ములు. అందులో ముగ్గురికి పెళ్లిళ్లైయ్యాయి. నాలుగోవాడు రాజయ్య సూరత్‌లో ఓ బట్టల కంపెనీలో పని చేస్తానని మూడేళ్ల క్రితం పోయాడట. ఆ సంబంధాన్నే ఖాయం చేశారు. పెళ్లిచూపులకు ఆ ఇంటిపెద్ద రామయ్య, భార్యతో వచ్చి పిల్లను చూశాడు. వాళ్లకు పార్వతమ్మ బాగా నచ్చింది.

‘‘మీ పిల్ల మాకు నచ్చింది. మా తమ్ముడికి పిల్ల ఈడూజోడుగా ఉంటది. వాడు రేపొచ్చే దసరాకు వస్తానన్నడు. రాగానే పెళ్లి పెట్టుకుందాం’’ అన్నాడు రామయ్య.

‘‘సరే రామయ్యా…! మీ తమ్ముడు వచ్చినంక కబురు పంపు. వచ్చి మాట్లాడుకుందాం’’ అన్నాడు పార్వతమ్మ తండ్రి.

నెల రోజుల తర్వాత అందరూ ఎదురు చూస్తున్న దసరా పండగ రానే వచ్చింది. రాజయ్య కూడా ఇల్లు చేరాడు. పండగను అన్నలు, వదినలతో రాజయ్య బాగా జరుపుకున్నాడు.

రెండు రోజులకు పెద్దన్న పెళ్లి ప్రస్తావన తీశాడు. అది రాజయ్యకు అస్సలు నచ్చలేదు. కారణం సూరత్‌లో తాను పని చేస్తున్న కంపెనీలో పరిచయమైన రాణితో ప్రేమ. రాజయ్యలాగే పని కోసం వలసపోయింది రాణి కుటుంబం.

‘‘నాకిప్పుడు పెళ్లి వద్దన్నా. మళ్లొచ్చే ఏడు చేసుకుంటా’’ అన్నాడు రాజయ్య. పెళ్లి నుంచి అప్పటికి తప్పించుకోవాలని అలా చెప్పాడు. కానీ తన ప్రేమ విషయాన్ని చెప్పే ధైర్యం మాత్రం చేయలేదు. పెద్దన్న అంటే రాజయ్యకు చిన్నప్పటి నుంచి భయం.

‘‘వచ్చే ఏడు దాకా ఎందుకు? అదంతా జెప్పకురా. పిల్ల బాగుంది. ఎత్తు కూడా అటుఇటుగా నీ అంతే ఉంది. మీ జోడీ మంచిగుంటది. ఇంక నువ్వు పెళ్లి జేసుకోవాల్సిందే.. మళ్లీ సూరత్‌ గీరత్‌ అంటే కాళ్లు ఇరగ్గొడతా. పెళ్లి జేసుకొని, ఇక్కడే ఏదైనా పని జూస్కో’’ ఆదేశాన్ని జారీ చేశాడు రామయ్య.

పెద్దన్న మీద భయం వల్ల, మిగతా అన్నావదినల బలవంతం మీద పెళ్లికి సరేనన్నాడు. తన వల్ల ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందనే విషయాన్ని రాజయ్య ఆనాడు ఆలోచించలేదు. చూస్తుండగానే వారం రోజుల్లోనే పెళ్లి తతంగమంతా పూర్తయింది. ఇష్టం లేకుండానే పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇష్టం లేకుండానే తాళి కట్టాడు.

పార్వతి మనసు సంతోషంతో నిండిపోయింది. కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ… తాను కలలు కన్న జీవితంలోకి అడుగు పెట్టానన్న ఆనందం ఆమెలో ఉప్పొంగిపోయింది. మొదట్లో రాజయ్య ప్రవర్తన పార్వతమ్మకు కొత్తగా అనిపించింది. తర్వాతర్వాత ఆమె ప్రేమ, అనుకువ అతనిలో మార్పును తీసుకొచ్చింది. మెల్లిగా రాణిని మరిచిపోయి, సంసార జీవితంలోకి అడుగుపెట్టాడు. ఓ ఏడాది గడిచాక… పార్వతమ్మ కడుపులో ఓ నలుసు పడింది. దాంతో ఆ కుటుంబమంతా సంతోషించింది. చూస్తుండగా పార్వతమ్మకు తొమ్మిది నెలలూ నిండాయి. ఓ శుక్రవారం రోజు మహాలక్ష్మిలాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పార్వతమ్మతో పాటు రాజయ్యా మురిసిపోయాడు. వారి జీవితం బాగుంది. బాగుందంటే అప్పటివరకూ, అలా, బాగుంది.

*****

సంసార జీవితానికి అలవాటుపడ్డ రాజయ్యకు రోజులు సాఫీగానే సాగుతున్నాయి. ఓ రోజు ఊరవతల ఏటిగట్టు దగ్గరకు ఏదో పనుంటే వెళ్లాడు. అక్కడికి ఆకుపచ్చ చీరలో వచ్చింది ఓ అమ్మాయి. ఆమెను చూడగానే రాజయ్య నిర్ఘాంతపోయాడు. ఆ అమ్మాయి సూరత్‌లో రాజయ్యను ప్రేమించిన రాణి. ఎలాగోలా రాజయ్య ఆచూకీ కనుక్కొని వచ్చింది. రాజయ్యను చూడగానే వెక్కివెక్కి ఏడవటం మొదలుపెట్టింది.

‘‘నువ్వు నన్ను ఇట్ల మోసం చేస్తావనుకోలె. నన్ను పెళ్లి జేసుకుంటనన్నవ్‌. కానీ నువ్వు ఈడికొచ్చి రెండేళ్లు కావస్తుంది. ఓ ఉత్తరం ముక్క గూడా రాయలె. మా ఇంట్లోళుల నాకెన్ని సంబంధాలు జూసినా, ఇప్పటిదాకా వద్దని జెప్పుకుంటూ వచ్చిన. ఇంగ నావల్ల గాక, కంపెనీలో మేనేజర్‌ సార్‌ కాడ నీ అడ్రస్‌ తీసుకొని… ఇట్ల దోలకుంటు వచ్చిన. నాతో రా నువ్‌. పొయి పెళ్లి జేసుకుందాం’’ అంటూ రాజయ్య చేతిని, తన చేతిలోకి తీసుకొని ఏడుస్తూ చెప్పసాగింది. ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలియని స్థితిలో పడిపోయాడు రాజయ్య.

‘‘రాణీ.. నాకు పెళ్లైంది. ఒద్దొద్దన్నా నా మాట యెవళ్లూ ఇనలె. బలవంతంగా మా అన్నలు నాకు పెళ్లి జేసిర్రు. ఇప్పుడు నాకో బిడ్డ గూడా ఉంది. నువ్వే జెప్పు నేనెట్ల రావాలె’’ అన్నాడు.

‘‘నాకింక ఏం జెప్పకు రాజు! నువ్వు నాతో వస్తవా? రావా?.. రానంటె జెప్పు. ఈడనే ఇప్పుడే ఏట్లో దూకి జస్తా. నాకు వేరే తోవేదీ లేదు’’ అంది రాణి.

‘‘అట్ల గాదు రాణి.. నా సంగతి ఆలోచించు’’ అన్నాడు రాజయ్య.

‘‘లేకపోతే ఏంది చెప్పు. నేను లేకుంటే బతకనన్నావ్‌. నన్నే పెళ్లి చేసుకుంటానన్నవ్‌. పండగకు ఇంటికి పోయ్యొస్తా అని జెప్పి, ఇప్పటి వరకు రాలే. నేనేం అనుకోవాలి చెప్పు. నువ్‌ పొయిన కాడినుంచి నేను ఏడవని రోజులేదు. ఇంట్లోనేమో పెళ్లి పెళ్లి అని పాణం తీస్తుర్రు. ఏం చెప్పాలి ఆళ్లకి? నిన్ను మరచిపోలేకపోతున్న రాజు..’’ అని ఏడుస్తూనే తన బాధను వెల్లకక్కింది రాణి.

‘‘నీ బాధ నాకు తెలుసు రాణి. కానీ, నాకు ఏం అర్థం అయితలేదు. నీతోని వస్తే, పార్వతి జీవితం అన్యాయం అయితది. పాప అనాథ అయితది. నీకు ఒక్క ఉత్తరం ముక్క గూడా రాయలేక పోవడం నా తప్పే. నీ జీవితాన్ని ఆగం చేసిన నాలాంటి దుర్మార్గున్ని నువ్‌ ఏం చేసినా సరే. కానీ, నన్ను మరిచిపోయి నువ్‌ వేరే పెళ్లి చేసుకో రాణి’’ అన్నాడు రాజయ్య.

‘‘నేను నీకు ఎట్ల కనిపిస్తున్న. నిన్ను కాకుండా వేరే పెళ్లా? నిన్ను తప్ప వేరే వాళ్లని నా మొగడిగా ఊహించుకోను రాజు’’ కాస్తంత కోపంగానే అంది రాణి.

‘‘అట్ల కాదు రాణి..! నువ్‌ అంటే నాకు ఇప్పటికి, ఎప్పటికీ ఇష్టమే. కానీ నువ్‌ నన్ను వదిలేస్తేనే, నీ జీవితం ఇప్పుడు మంచిగ ఉంటది’’

‘‘ఏం మంచిగ..! నువ్‌ నాతో వస్తే పోయి పెళ్లి చేసుకుందాం. రాను అంటవా! నా శవమే సూరత్‌ పోతది’’ కన్నీళ్లు తుడుచుకుంటూ తేల్చి చెప్పిందామె.

రాజయ్యకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. రెండు నిమిషాలు అటూఇటూ తిరుగుతూ ఏదో ఆలోచించాడు. మధ్యమధ్యలో రాణీ ముఖం చూశాడు.

మెదడులో ఏ పురుగు తిరిగిందో…!

భార్యాబిడ్డను గుర్తుకు రాకుండా చేసిన దెయ్యం ఎక్కడి నుంచొచ్చి పూనిందో..!

వెంటనే రాణి చెయ్యి పట్టుకొని, పదా వెళ్లిపోదామన్నాడు. అంతే… నిమిషాల్లో ఊళ్లోని కొత్త బస్‌స్టాండ్‌కెళ్లి, వచ్చిన పట్నం బస్‌ ఎక్కి వెళ్లిపోయారు. బస్‌ ఊరు దాటుతుండగా.. అటుగా వస్తున్న రాజయ్య మూడో అన్న సోమయ్య తన తమ్ముణ్ని, పక్కన కూర్చున్న అమ్మాయిని చూశాడు. రాజూ.. రాజూ…! అని ఎంత అరిచినా రాజయ్య అటువైపు చూడనే లేదు. బస్‌ కనిపించనంత దూరంగా వెళ్లిపోయింది.

*****

మధ్యాహ్నం రెండు కావస్తోంది. అందరూ అన్నం ముందు కూర్చున్నారు. ఇంతలో సోమయ్య పరుగెత్తుకుంటూ.. ఆయాసంతో అక్కడి చేరుకున్నాడు. చూసిందంతా చెప్పాడు. పక్క గదిలో ఉన్న పార్వతమ్మ చెవిన ఈ విషయం ఓ పిడుగువార్తలా పడింది. వెంటనే గబాలున బయటి గదిలోకి వచ్చింది. ఇంట్లో అందరూ ఒకేసారి ఆమెవైపు జాలిగా చూశారు. ఇక పార్వతమ్మ కంటనీరుకు ఎవరూ అడ్డుకట్టా వేయలేక పోయారు. ఇప్పుడు అందరూ రామయ్యవైపు ఆశగా చూశారు ఏం చెబుతాడోనని.

‘‘వాడు కచ్చితంగా సూరత్‌కె పొయ్యుంటడు. ఆమె గూడా ఆడి నుంచే ఒచ్చుంటది. నువ్వు ఏడవకు పార్వతి. నీ మొగడ్ని ఎలాగైనా మేం దీసుకొస్తాం’’ అన్నాడు రామయ్య.

అప్పటి నుంచి ఒక్కో అన్న ఒక్కో ప్రయత్నం చేశారు. రెండు రోజల తర్వాత రామయ్య,  రెండో అన్న లక్ష్మయ్య ఇద్దరూ కలిసి సూరత్‌ వెళ్లారు. ఇంతకు ముందు తమ్ముడు పని చేసిన కంపెనీకెళ్లారు. తమ్ముడి గురించి అడిగి, ఏ సమాచారం అందకపోయే సరికి వెనుదిరగక తప్పలేదు.

మరో వారం మూడో అన్న సోమయ్య, చిన్న తమ్ముణ్ని తీసుకొని వెళ్లాడు. ఏ ప్రయోజనం లేదు. వీళ్లు వెళ్లిన ప్రతిసారీ పార్వతమ్మ చేయని పూజ, మొక్కని దేవుడు లేడు. తిరిగొచ్చేప్పుడు వారితో పాటు తన భర్త వస్తాడని ఆశగా చూసేది. ప్రతిసారీ ఆమెకు కన్నీటితో కూడిన నిరాశే మిగిలేది. ఇక అతనే తిరిగొస్తాడని ఎదురు చూస్తున్నారంతా. పార్వతమ్మ పరిస్థితే మరీ ఘోరంగా ఉంది. రాజయ్య వెళ్లిన నాటినుంచి తిండీతిప్పలు మానేసింది. నిద్రపోవడం ఎప్పుడో మరిచిపోయింది. ఆ చిన్నపిల్లను పట్టుకొని, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంది. తమ బాధకు కాలం ఆగుతుందా… ఆరు నెలలు గడిచాయి.

*****

ఉదయాన్నే బిడ్డను చంకన పెట్టుకొని, రామయ్యతో.. ‘‘బావా! నేను మా అమ్మోళ్లింటికి వెళ్తా. కొన్నిరోజులు అక్కడే ఉండొస్తా’’ అంది. ఆమె బాధను అర్థం చేసుకున్న రామయ్య సరేనన్నాడు. అలా పార్వతమ్మ బిడ్డను తీసుకొని తల్లిగారింటికి బయలుదేరింది.

‘‘నా బతుకు ఆగమైందమ్మా. ఇంగ నాకు, నా బిడ్డకు దిక్కెవరు. దేవుడు నాకు అన్యాయం చేసిండమ్మా. ఏ జన్మల ఏ పాపం జేసిన్నో’’ అని తల్లిని పట్టుకొని బోరున ఏడ్చింది.

కూతురికొచ్చిన కష్టాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. బిడ్డతో పాటు తామూ బాధలో మునిగిపోయారు. ఓ నెలరోజుల తర్వాత చిన్నపిల్లకు సుస్తి చేసింది. పక్క ఊళ్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు రక్తం తక్కువైందని, కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంచాలన్నారు డాక్టరు. ఓ వారంరోజుల తర్వాత బిడ్డ పరిస్థితి విషమంగా ఉందన్నారు.

దాంతో పక్కింటి సుబ్బయ్యతో బావ రామయ్యకు సమాచారం పంపింది పార్వతమ్మ. ముగ్గురు బావలు, అక్కలు, మరిది సాయంత్రం కల్లా ఆస్పత్రికి చేరారు. అందరూ చూస్తుండగానే… ఆ ఏడునెలల పసికందు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. బిడ్డ చనిపోయిందని అక్కడున్న ఇద్దరు డాక్టర్లు తేల్చారు.  ఇక ఆ తల్లి గుండె కూడా ఆగిపోయిందనే చెప్పాలి. సీత కష్టం.. సీత కష్టం.. అని వినడమే కానీ చూడని అక్కడి వాళ్లకు పార్వతి ఓ సీతగా కనిపించింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

*****

చూస్తుండగా అమ్మగారింట్లోనే నాలుగు నెలలు గడిచాయి. పార్వతమ్మ గుండె రాయిగా మారింది. తానెందుకు బతుకుతోందో, ఎందుకు బతకాలో తెలియనట్టుగా అయిపోయింది.

ఓరోజు ‘‘నాయనా..! నేను మా ఊరికి పోత. ఆడే ఏదోక పని జేసుకొని బతుకుత’’ అన్న కూతురు మాటలకు అడ్డు చెప్పలేకపోయాడు ఆ తండ్రి. ఆ మరుసటిరోజే బయలుదేరింది.

ఉమ్మడిగా ఉన్న ఇంట్లోనే రెండు రోజులు ఉండి, ఓ రోజు బావతో ‘‘నేను వేరే ఉంట బావ. ఏదో పని జేసుకుంటూ బతుకుత’’ అంది.

‘‘అదేందమ్మా..! మేమంతా ఉండగ నువ్వు బయటికి బోవుడెందుకు.? ఏం ఒద్దు, కావాలంటే ఈడనే ఉండుకుంట అక్కలతోనే ఏదైన పనికి బో’’ అన్నాడు. కానీ పార్వతమ్మ మాత్రం తాను అనుకున్నట్టుగానే ఉండేందుకు బావలను ఒప్పించింది.

ఊరుకు కాస్తంత చివర్లో ఓ గుడిసె వేసుకుంది. ఒంటరిగా జీవించడానికి మెల్లిగా అలవాటు పడింది. రోజూ పనికి వెళ్లడం, రావడం. అదే రోజూవారీ తంతుగా బతుకుతోంది. ఆమె ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని అర్థం చేసుకున్నవారు ఉన్నట్టే… మొగడు ఉన్నాడో, చచ్చాడో తెలియదు కానీ ముల్తైదువలా బొట్టు, మెట్టలు పెట్టుకొని తిరుగుతోందని గుసగుసలాడే అమ్మలక్కలూ లేకపోలేదు.

ఆడదాని కష్టాన్ని సాటి ఆడవాళ్లే అర్థం చేసుకోలేని సమాజంలో బతుకుతున్నానని ఆమెకెప్పుడో తెలిసింది. అయినా, ఎలాంటి మాటలను.. ఎలాంటి విసుర్లనూ పట్టించుకోకుండా బతుకుతోంది పార్వతమ్మ.

*****

మళ్లీ తెల్లారింది. సుశీలమ్మ పిలుపుతో… గుడిసె తలుపుకు తాళం వేసి, టిఫిన్‌ బాక్స్‌ పట్టుకొని పనికి బయలుదేరింది పార్వతమ్మ.. ఎప్పటిలాగే!

 

                                                  ***

నిజజీవితంలో కనిపించే అంశాలే నా కథల్లోనూ…

-నిఖిత గారూ. మీ నేపథ్యం..

నా పేరు నిఖిత నెల్లుట్ల. మమ్మీ,   నల్గొండ జిల్లా రామన్నపేట. కానీ నేను పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. బీటెక్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాను. ఆ తర్వాత ఎంటెక్‌ పూర్తి చేసి రెండేళ్లు టీచింగ్‌ ఫీల్డ్‌లో ఉన్నాను. ఆపైన… రాజకీయాలపై ఆసక్తి, రాయడంపై ఉన్న ఇష్టంతో మీడియా ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాను. అప్పటికి తెలుగు చదవడం, రాయడం మాత్రమే వచ్చు. అంతేకానీ కథలు, కవితల జోలికి వెళ్లలేదు. జర్నలిజంలోకి వచ్చాక పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను. యండమూరి, యద్దనపూడి సులోచనారాణి నవలలు బాగా చదివేదాన్ని. వాటి ద్వారా.. ‘ఒక కథను చదివితే… ఆ దృశ్యం మెదడులో ఎలా మెదులుతుందో తెలుసుకున్నాను’. నేనూ అలా రాయగలనా అనుకున్నాను.

– మొదటి కథ ఎప్పుడు రాశారు.

* మొదటి ప్రయత్నంగా ఓ కథను స్టార్ట్‌ చేశాను. దాన్ని మొదటగా మా అమ్మను చదవమన్నాను. తను ఆ కథను చదివి, నాకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి… ‘‘చాలా బాగుంది. కథ చదువుతుంటే… అందులో సీన్స్‌ కళ్లకు కనిపించాయి. చాలా ఎమోషనల్‌గా రాశావు’’ అన్నారు. అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్‌ వచ్చింది.

అయితే  నా మొదటి కథను ప్రచురించడానికి ఎక్కడికీ పంపలేదు. రెండోది ‘జానూ.. ఐ లవ్‌ యూ’ కథ.. ‘మనం’ దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురితమైంది. మూడోది ‘సూరత్‌ మొగడు’ మీకు పంపిస్తున్నాను.

-ఎలాంటి కథలు రాయడానికి ఇష్టపడతారు…?

*  నేను ఎక్కువగా లవ్‌, ఎమోషనల్ స్టోరీస్‌ చదవడానికి ఇష్టపడతాను. అంతేకానీ ఈ తరహా కథలే రాయాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా మూడు కథలనూ చూసుకుంటే… అందులో ఎమోషన్‌ నాకు తెలియకుండానే వచ్చేసింది. తర్వాత కూడా అదీ ఇదీ అని కాకుండా.. అన్ని తరహా కథలూ రాయడానికి ప్రయత్నిస్తాను.

-కథల ద్వారా ఏం ఆశిస్తున్నారు. కథల ద్వారా లేదా కళ ద్వారా సామాజిక మార్పు సాధ్యమని నమ్ముతారా…?

* కథ ద్వారా సామాజిక మార్పు అంటే… అది ఆ అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది. చదివిన వాళ్లందరూ మారతారని కాదు. కానీ వందలో ఒక్క శాతమైనా ఆ కథకు తాలూకు ఆనవాలు, ఇంపాక్ట్‌ ఎక్కడో ఓ చోట కనిపిస్తుందని నమ్ముతాను. నిజజీవితంలో కనిపించే అంశాలే నా కథల్లోనూ కనిపిస్తాయి.

మీకు నచ్చిన కథలు, లేదా నవలలు…?

* మంచి కథలు అని చేప్పే అర్హత నాకు లేకపోవచ్చు. ఎందుకంటే నేను చదవడం మొదలెట్టి కొన్ని రోజులే.. రాయడం ప్రారంభించి కూడా తక్కువ రోజులే. చదివిన వాటిలో నచ్చిన కథలంటే… యండమూరి నవలల్లో ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘చీకట్లో సూర్యుడు’, అలాగే గురజాడ గారి ‘కన్యాశుల్కం’ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే బయోగ్రఫీలు చదవడం కూడా ఇష్టం.

సాధారణంగా కొత్తతరం వాళ్లు కవితలు ఎక్కువగా రాస్తుంటారు కదా?.. మీరేమైనా కవిత్వం రాశారా…?

* కొత్త తరంలో కథల కంటే కవితలు ఎక్కువగా రాస్తున్నారన్నారు. అయితే నాకు కవితలు రాసే వారంటే అభిమానం. ఎందుకంటే నేను కవితలను రాయలేను. ఎప్పుడో చిన్నప్పుడు రాసిన చిన్న కవిత తప్ప.. వాటి జోలికి నేను ఇంతవరకూ వెళ్లలేదు.

*

నిఖిత నెల్లుట్ల

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాశారు. పల్లెల్లో ఒంటరి మహిళ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. అభినందనలు నికిత గారు.

  • కథలో సంభాషణల్లో పాత్రలకు తగ్గట్టుగా యాస పలికించినా, కథ మొత్తం వాడుక భాషలో వుండడం నాకు హయిగా అనిపించింది. సంభాషణల్లో భాష సొగసూ తెలిసింది. మీ మూడో కథ ఇది అన్నారు. ఇంకా మీరు బోల్డు పుస్తకాలు చదవాలి, ఇంకా ఇంకా మంచి కథలెన్నో రాయాలి. శుభాభినందనలు!

  • Excellent Nikitha ….Very interesting Story…keep it up and I wish you All the very best for your upcoming stories.

  • చాలా బాగుంది మేడం మీ కథ… పల్లెల్లో ఒంటరి మహిళలు పడే బాధలు కళ్ళకు కట్టినట్టు చూపించారు…అంతే కాదు వాళ్లు సమస్యల్ని ఎలా ఎదురు కోవలో కూడా ఇంటర్నల్ గా మంచి సందేశము ఇచ్చారు…ఇలాంటి కథలు మీరు ఇంకెన్నో రాయాలి…జానూ ఐ లవ్ యూ లో కూడా మీరు కుటుంబ సమస్యని బయటపెట్టారు ఇప్పుడు ఇక్కడ సమస్యని చూపించి ఎదుర్కోవడం కూడా చూపినృ..పార్వతమ్మ గురించి మస్తు బాధ ఐంది మేడమ్ చదువుతుంటే…మనసుని తాకే, మనుషులని మార్చే ఇలాంటి కథలు మీరు ఎన్నో రాయాలని కోరుకుంటున్న మేడం.. కంగ్రాట్స్💐💐💐

  • కథ బాగానే సాగింది. కానీ పాపను మధ్యలో ఎందుకు అన్యాయంగా చంపారనిపిస్తుంది… మరిన్ని చక్కని కథలు రాయాలని కోరుతూ…

  • చాలా బాగా రాశారు నిఖిత గారు. అచ్చమైన నల్లగొండ యాసలో సమాజంలో స్త్రీ సమస్యను కళ్ళకు కట్టినట్లు చూపించారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు