మూసేసిన శవపేటికనే ప్రపంచమనుకుంటూ దుర్భర అజ్ఞానంలో,దిక్కుమాలినతనంతో మనమంతా బతుకుతున్నామా? విశ్వాంతరాళంలోకి, శాశ్వతత్వాన్ని వెతుక్కుంటూ పక్షుల్లా ఎగిరేందుకు రెక్కలకోసం మనం ప్రయత్నించడం లేదా? తలుపులు తెరిచినప్పుడు నీలి ఆకాశంలోకి స్వేచ్ఛగా ఎగిరిపోయే వారెందరు? రెక్కలు తెచ్చుకోలేక శవపేటికలోనే మ్రగ్గుతూ బతికే నికృష్టులెందరు?
ఈ ప్రశ్నలు వేసుకుంటూ దట్టమైన ఒక చీకటి రాత్రి ఒక సూఫీ కవి దుఃఖించాడట. తన కవిత్వంలో ఈ దుఃఖాన్ని చిత్రించిన 12వ శతాబ్దపు పర్షియన్ కవి ఫరీదుద్దీన్ అత్తర్ అక్షరాల్లో పక్షుల రెక్కల చప్పుడు ధ్వనిస్తుంది. అవి విముక్తి కోసం చేసే పెనుగులాటలో వినపడే ధ్వని కావచ్చు లేదా తెగిన రెక్కల విహ్వల ఆక్రందన కావచ్చు. ఏదైనా ఒక బంధ విముక్తి.. ఒక కపాల మోక్షం..
ఎక్కడో ఏదో ఉందని మహా ప్రస్థానం కోసం లోయలు దాటుతూ, దాహాలకు, రోగాలకూ గురవుతూ, క్రూర మృగాల వాత పడుతూ, కుప్పకూలిన తర్వాత వేలాది పక్షుల్లో మిగిలిన 30 పక్షులు చివరకు తాము ప్రయాణించింది తమ కోసమేనని, చివరకు తమను తాము గ్రహించడమే మోక్షమని తెలుసుకుంటాయని అత్తర్ రాసిన ‘పక్షుల సదస్సు’ అనే కవిత సూఫీ కవితా ప్రపంచంలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఛెంఘిజ్ ఖాన్ జరిపిన ఊచకోతలో మరణించిన అత్తర్ రూమీ లాంటి కవులను కూడా ప్రభావితం చేశారు. రూమీ కవితల్లో కూడా పక్షుల ప్రతిధ్వనులు, స్వేచ్ఛాకాంక్ష మనకు వినిపిస్తాయి. పడిపోతామన్న భయం లేకపోవడమే స్వేచ్ఛ అనే రూమీ ఎవరో వింటారని, ఏదో అనుకుంటారనే ఆలోచనే లేని పక్షిలా స్వేచ్ఛాగానం చేయాలనుకున్నాడు. ఈ ఆదిమ స్వేచ్ఛ, ఈ అనంత స్వేచ్ఛ, శరీరంపై ప్రేమలేని స్వేచ్చ శవపేటికలో బందీ అయి అదే ప్రపంచమనుకునే వారికి తెలుస్తుందా?
చాలా రోజుల తర్వాత ఒక అర్థరాత్రి నాకు అత్తర్ లాంటి మరో సూఫీ పునర్జన్మ చెందినట్లు ఎదురయ్యాడు. అతడే అఫ్సర్ . ఒక సూఫీ సాయంకాలంలో అఫ్సర్ ఆకాశం గూటిలోకి రెక్కలెగరేసిన పక్షుల గురించి రాసి నన్ను దిగ్భ్రమ పరిచాడు.
పోయిన కాలాన్ని తిరిగి బంధించలేము. అలా కాలం ఎగిరిపోతున్నవేళ అఫ్సర్ సూఫీ ముని కప్పుకున్న చాదర్ లోంచి ఆయన దేహంలోకి చూశాడు. తన దేహాన్నంతా ఒంపి కళ్లకద్దుకున్నాడు. మూత పడుతున్న అతడి రెండు కళ్లూ రెండు నీటి చుక్కలై ఆయన ఛాదర్ పై వాలాయి. అవి రెండు పక్షులై ఎగిరిపోయాయి.
ఉన్నట్లుండి ఒక భీభత్సం. పక్షుల సమూహంలో పేలుడు. కొనప్రాణపు అరుపులు. నెత్తుటి రెక్కతో దర్గాలోని రాయిపై ఏదో రాస్తున్న పక్షి. ఎక్కడికి వెళ్లాలి? సదసత్సంశయం.
‘నా లోపల నేను సమాధి తవ్వుకుంటున్నాను’ అనే అఫ్సర్ లో వందల సంవత్సరాల సూఫీల అక్షరాల్లో వినిపించిన పక్షుల రెక్కల చప్పుడు ధ్వనిస్తుంది. ఈ రెక్కల చప్పుడు ఒక విముక్తి గానం. ఒక స్వేచ్చా గీతిక.
ఈ విముక్తి గానంలో అఫ్సర్ నిలువెత్తిన గాయాలను చూశాడు. నిద్రపోయినప్పుడల్లా కలలకు బదులు తెరుచుకున్న గాయాలను అనుభవించాడు. కాలం ఒడ్డున చల్లారిన నెత్తుటి చిచ్చులా తరుముతున్న సముద్రాన్ని చూశాడు. కనపడని ఉస్మాన్ కోసం దిక్కుల నడుమ పరుగెత్తుతూనే ఉన్నాడు.
ఈ స్వేచ్చా గీతిక ఆలపించే క్రమంలో అఫ్సర్ స్థిరబిందువులా గడ్డకట్టుకుపోలేదు. గాలి కాలాల మధ్య సంచరించేవాడు కదా, ఆకాశం కూడా కప్పుకోలేదు. ఎన్నో ఏళ్లుగా ఆకుపచ్చని సంతకాలు చూడని నేలపై కవిత్వమే ఎండుటాకుగా మారిందా అని దుఃఖించాడు.
ఎవరికెవరూ కనిపించకుండా వెయ్యిమంది రోడ్డును తొక్కుకుంటూ వెళ్లిపోయిన చార్మినార్ మలుపు వద్ద రంగులన్నీ మరిచిపోయి నలుపులోకి నిష్క్రమించిన సీతాకోక చిలుక ఆత్మహత్యను గమనించిన అఫ్సర్ కు హైదరాబాద్ ఒక కునుకు కప్పుకున్న మెలకువ.
ఒకో సారి ఈ సూఫీ కవి పూలంటే భయపడతాడు. అడుగు తీసి అడుగు వేస్తే శవమే తగుల్తుంటే పచ్చని చేలన్నా భయపడతాడు. ఊరవతలి దుఃఖంలో దుఃఖమై “నిన్ను ఎలాగైనా సుఖపెట్టడానికి నా కవిత్వం ఈ దేశపు రాజ్యాంగం కాదు” అని ప్రకటిస్తాడు. మన కళ్లకు కట్టిన గంతలన్నీ తీసేసి ఈ నాటకానికి చరమాంకం పాడుదాం అని ఘోషిస్తాడు.
అవును చాలా ఏళ్లుగా అఫ్సర్ ఇలానే ఉన్నాడు. పవిత్రమైన అగ్నిలో కాలిపోతూ. బూడిదలా కాలేకపోతూ.. బతుక్కి ఏ కవచం లేకుండా అసహజ శృంఖలాల్లో పుట్టిన తరం కదా అతడిది! ఎక్కడైనా ఎప్పుడైనా ప్రవాసే కదా అతడు.
క్యాలెండర్ లో రోజురోజుకూ పెరిగిపోతున్న రోజుల భారాన్ని మోయలేక నాన్న అసహనంగా వేసిన కేకల్లో ఎన్ని ‘రోజా’లున్నాయో?అనే అఫ్సర్ లో నిరంతరం ఇఫ్తార్ సైరన్ మోగుతుంటుంది. ఏళ్ల తరబడి జనం తొక్కీ తొక్కీ అలిసిపోయిన నిప్పుల గుండంలా ఉన్న వాడికి నెలరోజుల్లో ఒక పొద్దైనా దక్కితేనేం.. మిగతా రోజులన్నీ కడుపు ఖిబ్లా కన్నా ఖాళీగా ఉంటుంది కదా!
“స్వర్గానికీ భూమికీ మధ్య నీవూ, నేనూ ఒక తెర మాత్రమే. ఈ తెర లేపి చూడు, ఈ కులాలు, జాతుల బంధాలే లేవు. నీవూ, నేనే లేనప్పుడు ఈ మసీదు ఎక్కడ?” అని ప్రశ్నించిన 14వ శతాబ్దపు సూఫీ కవి షబిస్తరి అఫ్సర్ లో ప్రవేశించాడా?
ఎందుకో అఫ్సర్ కవితలు ఇంగ్లీషులో చదివితే తెలుగుకన్నా బాగున్నట్లనిపించాయి. తెలుగులో దాక్కున్న లోతు ఇంగ్లీషులో ప్రత్యక్షమైనట్లనిపించింది. ఈ రీత్యా ‘ఈవెనింగ్ విత్ సూఫీ’ అన్నపేరుతో వచ్చిన అఫ్సర్ ఇంగ్లీషు కవిత్వం ఒక సరిహద్దులు లేని సూఫీ కవిత్వంలా కనిపించింది. సూఫీ మార్మికత ఇంగ్లీషు కవితల్లో అద్భుతంగా ఇమిడిపోయింది. ఈ సంకలనం తెలుగు కవితల అనువాదం అని చెప్పకపోయినా ఫర్లేదేమో.
అనూచానంగా మనకు మిగిలింది పదాలే. ఆపదాలు ఏమంటున్నాయో కనిపెట్టడం మన పని అని మరో సూఫీ కవి అరబి అన్నాడు. అఫ్సర్ కవితల నరనరాల్లో ప్రవహిస్తున్న సూఫీ ఆత్మను కనిపెట్టడం కూడా మన పనే!
*
ఈ పుస్తకం అమెజాన్ లో అందుబాటులో వుంది: Buy Evening with a Sufi Book Online at Low Prices in India | Evening with a Sufi Reviews & Ratings – Amazon.in
మనసుకి హత్తుకునేలా చెప్పారు
Thank you!