సుదూరాల్ని కొలిచే తీక్షణ వీక్షణ కవిత్వం!

ఈనెల 28న విజయవాడలో ప్రముఖ కవి, పాత్రికేయుడు కృష్ణుడు కవిత్వ సంపుటి “ఒక్క కరచాలనం చేయి” ఆవిష్కరణ సందర్భంగా—అఫ్సర్ ముందుమాట నుంచి….

1

మండుటెండలాంటి కాలం.

అన్ని కాలాల్నీ వెలివేసి, మండుటెండ  వొక్కటే నిలిచి ఖణేల్ మంటోంది. కాంతి ఏదో, వేడి ఏదో తెలియనివ్వని కాలం. చుట్టుముట్టిన మంటలాంటి ఎండ. పచ్చదనాన్ని దహిస్తున్న ఎండ. నగరాన్ని కాగితమ్ముక్కల్లా కాల్చేస్తున్న ఎండ. అడవినిండా బాహాటంగా రగిలిపోతున్న కార్చిచ్చు. ఇంత ఎండలో కాసింత కాంతినీ, చల్లదనాన్నీ  వూహించుకోవాలి.

​అయితే, ఆ వూహకి ఎలాంటి చట్రాన్నితయారుచేసుకోవాలో అర్థం కానివ్వని స్థితినే ఇప్పుడు చూస్తూ వున్నాం. సరిగా రూపు దిద్దుకోలేక చిత్రమే  సతమతమవుతుంది. వొద్దికైన వాక్యం కాలేక, అక్షరం కల్లోలమవుతుంది. వొక దారీ తెన్నూ కానరాక, ఆలోచన ఛిద్రమైపోతోంది. ఇంత మండుటెండలో కొన్ని వాక్యాల్ని పట్టుకొచ్చి, భరోసా వెలుతురుని  మనసునిండా వెలిగించే ప్రయత్నం కృష్ణుడిది.  ఉద్వేగాల మంటకీ, నిలకడైన వెలుతురుకీ మధ్య తేడా చూపించాలని కృష్ణుడి తపన.

​​ఈలోగానే, అటు సాహిత్య జీవుల్నీ, ఇటు సామాన్యుల్ని కూడా కలచివేసే ప్రశ్న: వీటన్నీటి మధ్యా ఎటు వైపు మొగ్గాలి? ఆ మొగ్గు స్వభావమేమిటి? కృషుడి కవిత్వం చదువుతున్నప్పుడు ఈ సైద్ధాంతిక అన్వేషణ మొదలవుతుంది. అది వివిధ రూపాల్లోకి విస్తరించి, కొన్ని నడిచిన దారుల్నీ, కొన్ని నడవని దారుల్నీ మన ముందు నిలబెడ్తుంది. ఇది వొక్కోసారి చౌరాస్తా. కానీ, అనేకసార్లు ఇది అనేక రాస్తాల పజిల్ కూడా! బహుశా, కృష్ణుడి కవిత్వం మిగిలిన కవుల కంటే భిన్నంగా నిలిచేది ఈ సందర్భంలోనే అనుకుంటా. అయితే, కృష్ణుడు ప్రధానంగా బుద్ధిజీవి. హృదయం చిరునామా మరచిపోని ఆలోచనాశీలి.

​కచ్చితంగా ఇలాంటప్పుడే కృష్ణుడి ప్రయాణం ఎక్కడ మొదలయింది? ఏ మజిలీలు తనని మలిచాయి? ఏ మజిలీలో తను ఎలా నిక్కచ్చిగా నిలబడ్డాడు? లాంటి ప్రశ్నల్లోకి వెళ్తాం.

​తెలుగు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ జీవనానికి అతిదగ్గిరగా మసలుకునే వ్యక్తి. దగ్గిర దగ్గిర నాలుగు దశాబ్దాల ప్రజాజీవనాన్ని అతిసమీపంగా చూసినవాడు. ఎప్పటికప్పుడు ఆ పరిణామాలనీ, వాటి పర్యవసానాల్నీ ఉద్వేగంతో కాకుండా, అవగాహనతో సునిశితంగా విశ్లేషిస్తున్నవాడు. వొక జర్నలిష్టుగా  ప్రధాన స్రవంతి తెర మీద పాత్రధారులతో కలవడం, మాట్లాడడం కృష్ణుడి దినచర్య. అంతేకాకుండా, ప్రత్యామ్నాయ రాజకీయ సాంస్కృతిక వర్గాలతో సన్నిహితంగా మెలిగే ప్రగతిశీలి. అంటే- ఈ వ్యక్తిత్వం అనేక కోణాల సమ్మేళనం. కానీ, వ్యక్తిగా కృష్ణుడి దారి వొక్కటే- అది మొదటి నించీ వొకే దిశగా నిలకడగా సాగిపోతున్న పథం. సున్నిత మనస్కుడి సుదీర్ఘ ప్రయాణం. సుదూరాల్ని కొలిచే తీక్షణ వీక్షణం. ఇవన్నీ కవిత్వంలోని వాక్యాలని సానపెడతాయి.

2

వరసగా కొన్ని సార్లూ, వరస తప్పించుకొని కొన్నిసార్లూ ఈ కవితల్ని చదువుతున్నప్పుడు కృష్ణుడి వేదనని కచ్చితంగా ఎలా పట్టుకోవాలన్న ఆలోచనలో నలిగిపోతున్నప్పుడు- మధ్యలో ఇదిగో ఈ వాక్యం కనిపించింది. కృష్ణుడి కవిత్వాన్ని తన కవిత్వ వాక్యంతోనే కొలిచే ప్రయత్నం కాదు గాని, వొక నిస్సహాయ నిర్వికల్ప నిర్ణిద్రా స్థితిలోకి వెళ్లిపోతూ ఈ వొక వాక్యాన్ని ఆసరాగా తీసుకొస్తున్నా. అదే ఈ వాక్యం:

వాక్యాల్ని స్పృశించడమంటే

ప్రాణం కొట్టుకుంటున్నట్లే!

ఇదేమీ తేలికగా పుట్టుకొచ్చిన వాక్యం కాదు. ఎప్పటిలానే అనేకమంది కవుల్లానే కృష్ణుడు కూడా చాలా చోట్ల కవిత్వాన్నీ, కవినీ వుద్దేశించి మాట్లాడిన/ మాట్లాడుకునే సందర్భాలు ఈ సంపుటిలో అనేకం వున్నాయి. కృష్ణుడి ఇంతకుముందు కవిత్వాన్ని కూడా శ్రద్ధగా చదువుతూ వస్తున్న నాలాంటి మిత్రులకు ఇదొక ఆశ్చర్యం.

కవిత్వాన్ని గురించి వొక ప్రక్రియగానో , క్రియగానో  వర్ణిస్తూనో, నిర్వచిస్తూనో ఇంతకుముందు కృష్ణుడు రాసిన సన్నివేశాలు అతితక్కువ. అట్లా రాయడంలో వొక సౌలభ్యం కంటే ఎక్కువగా కష్టమే వుంది. కొన్ని సందర్భాలు చూద్దాం:

  1. సభలు జరుగుతున్నాయి

సన్మానాలు జరుగుతున్నాయి

నగరం వెలిగిపోతోంది

కవిత్వాలూ, కరచాలనాలు

సాగిపోతున్నాయి.

  1. వాక్యాన్ని తలుచుకున్నప్పుడల్లా

             ఒక అక్షరం అనాథయై విలపిస్తుంది.

  1. కవిత్వం

దారిపొడుగునా హత్యల్ని చూసే

నిస్సహాయ వృక్షాల మనోగతం

నెత్తుటి బొట్లను

మౌనంగా భరించే ఆకుల సంభాషణ

రోడ్డుప్రక్కన మూలుగుతున్న

దిక్కులేని శవం  తెరిచిన కళ్లలో

ప్రతిఘటనా  గీతం 

ఇండియాగేట్ రాతిగోడల

నీడల మధ్య

చేతులు చాచిన బాల్యం

ఇవి కేవలం మూడు ఉదాహరణలు మాత్రమే. వెతుక్కుంటూ వెళ్లకుండానే ఇలాంటివి ఇంకా కొన్ని దొరుకుతాయి.  ఇవి చదువుతున్నప్పుడు వెంటనే తలెత్తే ప్రశ్న ఏమిటంటే:

ఇవి నిజంగా కవిత్వం అనే ప్రక్రియ గురించి రాస్తున్న వాక్యాలా?!

​కొన్ని సార్లు అవుననీ, ఎక్కువసార్లు కాదనీ అనిపిస్తోంది నాకు. దానికి బలమైన కారణమేమిటంటే, కృష్ణుడి వాక్యాల వెనక పారదర్శకంగా మెరిసే మూడ్.  సమకాలీన కవిత్వం విస్తారంగా వస్తున్నా, ప్రధానంగా కనిపించే లోపం- ఈ మూడ్ ని వెలిగించే పంక్తులు లేకపోవడం! కవిత్వానికీ, ఇతర వచన రూపాలకూ మధ్య బలమైన అడ్డుగోడ ఏదైనా వుందీ అంటే- అది మూడ్- అనే మనోభావనా నిర్మాణమే!

కథల్లోనూ, నవలల్లోనూ ఇది వుండదని కాదు. కానీ, అంత బలంగా వుండదు. వొకానొక మనోభావనని వూనికగా తీసుకొని, చివరంటా దాని ఆనుపానులూ చెప్పుకుంటూ వెళ్ళడం కవిత్వంలోనే సాధ్యం. ఇవాళ ప్రపంచ కవిత్వమంతటినీ ఏకతాటి మీద నిలబెడుతున్న లక్షణం ఇదే. మన కవిత్వం కావచ్చు, అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, మన హృదయాలకు దగ్గిరగా వస్తున్న ఆఫ్రికన్ కవిత్వమూ, ఆఫ్రికన్ అమెరికన్ కవిత్వమూ, వివిధ ముస్లిం దేశాల కవిత్వం  కూడా ఈ లక్షణం వల్లనే మనకు ఆత్మీయమమవుతోంది.

3

తెలుగు కవిత్వం మాత్రమే కాకుండా, భారతీయ కవిత్వమూ, ఇతర దేశాల కవిత్వాలూ దగ్గిరగా చదువుకుంటూ, వాటి గురించి లోతుగా ఆలోచిస్తున్న కృష్ణుడికి ఇది వెన్నతో పెట్టిన విద్య. ఇది దొంగలించిన వెన్న కాదు. సొంత కష్టం మీద తయారుచేసుకున్న వెన్న. కృష్ణుడు “సారంగ” పత్రికలో క్రమం తప్పకుండా రాస్తున్న “కృష్ణ పక్షం” శీర్షిక చదువుతున్నవారికి ఇది ఇట్టే తెలిసిపోయే విషయమే. నిజానికి ఆ వచన రచన అంతా కవిత్వమే epicenter గా నడుస్తుంది. ఆ విధంగా ఆ కాలమ్ ని కూడా నడిపించే శక్తి -మూడ్!

​దానికి తగ్గట్టుగానే- ఈ సంపుటిలో ప్రతి కవితనీ వొక మూడ్ నిర్దేశిస్తుంది. మిగిలిన కవుల్లో కూడా ఇదే జరగవచ్చు. కానీ, మూడ్ సృష్టించి, దాన్నే చివరిదాకా కొనసాగించి, అదే మూడ్ ని చదువరి/ శ్రోత మనసులో పదిలంగా నిలబెట్టే నిర్మాణ శిల్పి కృష్ణుడు.  ఈ నిర్మాణంలో ఎక్కడా రాజీలేదు. నిర్దిష్టమైన రాజకీయ స్వరంతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా మూడ్ ని కాపాడుకుంటూ వెళ్తాడు. మళ్ళీ కవిత్వం గురించి రాసిన ఇంకో కవితలోకే వెళ్తాను.

కవిత్వం గోమూత్రం కాదు

తాగితే  పునీతం కావడానికి

కవిత్వం  వ్యవస్థల మూలాల్లో

ప్రవహించే మండే గుండెల లావా

​ఇందులో కొంత కవిత్వం గురించే- సందేహం లేదు. కానీ, అంతకంటే మనిషిని నడిపించే అంతస్సునీ, అంతస్సూత్రంలాంటి ఏదో వుద్రిక్తత గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కవిత్వం కోసం కవిత్వం రాసే కవి కాదు కృష్ణుడు. ఇండియా గేట్ దగ్గిర నిలబడి కవిత్వం చెప్తున్న కృష్ణుడి వ్యక్తిత్వాన్ని పట్టిచ్చే వాక్యాలు చాలా వుంటాయి. ఈ వ్యక్తిత్వంలో కవిత్వం విడదీయలేని భాగమే, అయితే, అంతకంటే ఎక్కువగా కృష్ణుడి రాజకీయ, సామాజిక స్వరం బలంగా వినిపిస్తుంది.

సాహిత్య రూపాలు ఎంతమేరకు చరిత్రని రికార్డు చేస్తాయన్న ప్రశ్న ఇప్పటికీ వుంది. నిజమే! ఎంత కాదనుకున్నా, సాహిత్య రూపాన్ని నడిపించేది ఊహ. వాస్తవికత అనే పునాది వున్నప్పటికీ, ఊహాశక్తి లోపిస్తే అది విరూపమే అవుతుంది. కృష్ణుడికి చరిత్ర అంటే ఆసక్తి. అంతకంటే ఎక్కువగా నిరంతరం రాజకీయ శక్తుల మధ్య సంచరించే జర్నలిష్టు. అంటే- తనకిష్టమైన చరిత్రనీ, తనకి వొదగని రాజకీయాల్నీ రెండీటీని తలలో వేర్వేరు గదుల్లోకి ఇరికించాలి. ఈలోపు తను ప్రాణప్రదంగా ప్రేమించే కవిత్వాన్ని ఆ తలలోకి స్వేచ్ఛగా పరిగెత్తనివ్వాలి. ఇదేమీ అంత తేలిక కాదు.

​అయితే, ఎక్కడా బ్యాలెన్స్ తప్పని నడక కృష్ణుడిది. అది అనుభవమే నేర్పిందో, తనని మొదటి నించీ అంటిపెట్టుకొని వున్న తాత్వికతే అలవర్చిందో- ఈ కవిత్వం చదువుతున్నప్పుడు మరోసారి కృష్ణుడి విశ్వరూపం కనిపిస్తుంది. ఇది కదా కృష్ణుడి రాతా గీతా అనిపిస్తుంది. ప్రేమగా కరచాలనం ఇవ్వాలనిపిస్తుంది!

*

అఫ్సర్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు