ప్రేమ అద్దం లాంటిది
సందేహం అక్కర్లేదు
పగిలితే బహు పదును!
ప్రతిబింబం కూడా ప్రతీకారం కోరుతుంది.
కర్పూర సుగంధం
మొగలి ముల్లై సర్రున గీసుకున్నాక,
ఆశలు ఆవిరైన మసకలో
వెచ్చని కన్నీరై కురుస్తుంది.
గుండెకు పొదువుకున్న రూపం
కాలయంత్రంలో చిద్రుపలైనా
జ్ఞాపకాల్లో సువాసనై ఇమిడి పోతుంది.
గాలి బారిన ఉప్పు చెమ్మబారినట్టు
మనసంతా భావాల చిత్తడి.
స్వరం దొరకని ఊపిరి,
ఊపిరి లేని స్వరం,
పోటీ పోటీగా చుట్టముడతాయి.
మనిషి కళ్ళెదుటే ఉన్నా
ప్రేమించలేని పేదరికం,
దూరమైన వారి కోసం కన్నీళ్లూ,
రెండూ ఒకటేనని ఒప్పుకోవాలి.
జలదరించేలా బ్రతుకు కొరడా
వెన్ను మీద ఛెళ్ళు మంటే
దుఃఖాన్ని తాగే పెదవులు
మరోసారి నవ్వి,
దూది పింజ రెక్కలమీద
నింగిలోకి ఎగురుతాయి.
పవలూ, రేయీ
భూ భ్రమణమైనట్టు
కేరింత, నిట్టూర్పూ
మనసు భాషే కదా.
*
వండర్ఫుల్ గా చెప్పారు maam
నిజమే ఎన్నో బద్ధలైన ప్రేమ ప్రతిబింబాలకి అద్దం ఈ కవిత
❤️❤️
మనసును మత్తడి చేసిన సుగంధి.
శైలజ గారు! జ్ఞాపకాల పరిమళాల పెయిన్ పదునైనది