రాయలసీమలో ఒక్క నీటికరువు మాత్రమే కాదు. రాయలసీమ మానవసంబంధాలలో ఒక ప్రత్యేకత ఉంది. ఎంతో క్రౌర్యమూ, చిత్రమైన మానవత్వమూ ఉన్న ఫ్యూడలిజం ఇంకా రాయలసీమలో సజీవంగానే ఉంది. ఇతరులకు ఆటవికతగా స్థానికులకు ఆత్మగౌరవ పోరాటంగా కనిపించే ముఠాకక్షలు రాయలసీమ రక్తంతో తడుపుతున్నాయని ప్రముఖసాహితీవేత్త వల్లంపాటి వెంకటసుబ్బయ్య చెబుతారు. మూడుదశాబ్ధాల క్రితం ఆయన ఆ మాట చెప్పినా ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పురాలేదు. అయితే వాటి రూపం, స్వరూపం మారింది. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఈ పరిస్థితులు నేటికీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరువును ప్రధానంగా సాహిత్యసృజన చేసిన రాయలసీమ జిల్లాలోని కర్నూలు అగ్రభాగాన కనబడుతుంది.
పద్యసాహిత్యం విరివిగా వస్తున్న జిల్లాల్లో కర్నూలుదే పైచేయి. ఐనా ఆధునిక కథాసాహిత్యంలో ముఖ్యంగా సీమకథా సాహిత్యంలో కర్నూలుకథ ఏ మాత్రం వెనకంజలో లేదనడానికి ఉదాహరణగా కర్నూలు నుండి అనేక సంకలనాలు, సంపుటాలు కథను ఉన్నతశిఖరంలో నిలబెట్టాయి, నిలబెడ్తున్నాయి. రాయలసీమను ఇప్పటికీ పట్టిపీడిస్తున్న కరువు, వివక్ష, అసమానతలు, ఫ్యాక్షన్, వలసలు, రైతు ఆత్మహత్యలు, సాగునీటి వాటా తదితర దీర్ఘకాలిక సమస్యలపై ఇప్పటికీ కర్నూలు కథకులు కథలు రాస్తున్నారు. కొత్తతరం కథకులు కూడా అదే బాటన నడుస్తున్నారు. సీమకథ పరిణామాన్ని పరిశీలించి నపుడు 1975లో కేతు విశ్వనాథరెడ్డి మార్పుకథను ముందుగా చెప్పుకోవాలి. గ్రామీణనేపథ్యంలో సాగిన ఆ కథలో పల్లెతనాన్ని, అంతర్లీనంగా సాగే సంక్లిష్టతలు కనబడతాయి.
కేతు కరవు నేపథ్యంలో గడ్డి అనే కథ కూడా రాశారు. కరవునేలలో పండేపంటల్ని, రైతులబతుకుల్ని కథలో చెప్తాడు. కేతు కథ ‘మార్పు’ కథ రాకముందే 1970లోనే కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణల సంఘం కెయన్‌యస్ రాజు అధ్యక్షతన ఏర్పడింది. 12మంది రచయితలతో వైకుంఠపాళి అనే కథాసంకనం 31.10.1972న వెలువరించారు. 1975లో తుంగభద్రాతరంగాలు పేరుతో 17 మంది రైతులు కథాసంకలనం తెచ్చారు. ఈ సంస్థ కర్నూలు కథాసాహిత్యాన్ని కొండారెడ్డి బురుజంత ఎత్తులో నిలబెట్టగలిగింది.
ఇదే ఏడాది రైతుల యదార్థ జీవిత గాథలు అనే ఉపశీర్షికతో “శాపగ్రస్తులు” అనే కథల సంకలనం తెచ్చారు. కెయన్‌యస్ రాజు-ప్రాజెక్టు 1960, శిష్టుకృష్ణమూర్తి-కరవు కాటు, కెబియస్ కుమార్-సైకతలింగం, వానపాము-చక్కిలం విజయలక్ష్మీ, కెయన్‌యస్ రాజు-శాపగ్రస్తులు, యస్‌డివి అజీజ్-ముట్టడి, నారపురాజు వేణుగోపాలరావు- గరికమొక్క, అలనాటి కరువు -సుభాషిణి, కెయన్‌యస్ రాజు-బాల్లింగన్న బతుకుబండి, హెల్ప్‌లైన్-శిష్టుకృష్ణమూర్తి, అలజడి శివరాం వంటి కథలు ఇందులో ఉన్నాయి. 2009లో కర్నూలును ముంచిన వరద నేపథ్యంలో “ఉగ్రతుంగభద్ర” కథాసంపుటి తీసుకొచ్చారు. ఇందులో ఉగ్రతుంభద్ర `కెఎన్‌యస్ రాజు, 2009 ఆక్టోబర్ 2,3 తేదీలు-శిష్టుకృష్ణమూర్తివరద-డా.యం.హరికిషన్, గోపురం-పత్తిఓబులయ్య, వేయిపడగల నాగేంద్రుడు వచ్చేసినాడప్పో-రంగనాథరామచంద్ర, రవణమ్మ మనవరాలు-డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం, ఆ..దినాలు-జి.వెంకటకృష్ణ, కుందుబొంద-దినకర్, ఉప్పెన-యస్‌డివి అజీజ్, పుస్తకాల మనిషి -వియోగి, వరదమ్మా! నీకు వందనం-ఇనాయతుల్లా, నిలువుదోపిడి-కెయన్‌యస్ రాజు, మన అవసరం-జి.ఉమామహేశ్వర్ కథలు రాశారు.
2010 వరకు అంటే దాదాపు సీరియస్ కథకులను పరిచయం చేయగలిగింది. ఇదే కాలంలోనే కర్నూలు నుండి కథాసమయం సమాంతరంగా కథాజైత్రయాత్ర సాగిస్తున్నది. 1990 దశకంలో ఏర్పడింది. ప్రగతిశీల భావజాలంతో కర్నూలు నుండి కథకులు తుమ్మల రామకృష్ణ-ఊరిమద్దిస్తం, రాప్తాడు గోపాలకృష్ణ-నాన్న కథచెప్పవూ, జి.వెంకటకృష్ణ- హృదయస్పర్శ, ఎన్ నాగరాజు-పొలికేక, టి.మధుసూధన్ -దేవర, ఇనాయతుల్లా -వలస, హరికిషన్- కాంక్రీట్ జంగిల్, ఎ.నాయకీ-జాడలేని మనిషి, శ్రీనివాసమూర్తి-దేవుని మాన్యం,జిపి రాంచంద్ -గాజుగోడ, గాయత్రీదేవి-కుక్క పరిహాసం, టి.వెంకటేష్-చీడకాటు. ఈ కథకులు కర్నూలు కేంద్రంగా కథల సునామీని సృష్టించారు. కథాసాహిత్యంలో కథాసమయం చేస్తున్న అరుదైన కృషిని అఫ్సర్ ‘కథ స్థానికత’ అనే పుస్తకంలో ప్రత్యేకవ్యాసం కూడా రాశారు.
ఇందులో ఆయన ‘1990 తర్వాత వచ్చిన ఈ కథకులు ఉర్రూతలూగించే ఊహలకూ, మత్తెకించే ఉత్ప్రేక్షలకూ తావివ్వకుండా సమకాలీనత పట్ల తమకున్న దృక్కోణాన్ని అవిష్కరించడానికి చేసిన ప్రయత్నం. మిగిలిన ప్రాంతాలకు కూడా ఒక మంచి స్ఫూర్తి’ అంటూ రాశారు. తొంభైలతొలినాళ్ళకే కర్నూలుజిల్లా నుండి అనేక మంది కథకులు కథాసంపుటాలు తీసుకొచ్చారు. మచ్చుతునకగా చెప్పినపుడు 1998లో యస్.జయ “రెక్కలున్నపిల్ల” కథాసంపుటిని వెలువరించారు. ఆమె 1978నాటికే తన మొదటి కథ ‘ఖరీదు’ను రాశారు. అది రత్నమాల సంపాదకత్వంలో వెలువడిన నూతన అనే పత్రికలో ప్రచురితమైంది.
ఈక్రమంలోనే జి.వెంకటకృష్ణ, హరికిషన్, సుభాషిణి, యస్‌డివి అజీజ్, జంధ్యాల రఘుబాబు, డా.తొగట సురేష్‌బాబు, వియోగి, రంగనాథరామచంద్ర, ఆదోని భాష, చక్కిలం విజయలక్ష్మీ వంటివారందరూ విస్తృతంగా కథలు రాస్తూ ఎవరికివారు ఒక్క ఆదోని భాష మినహా దాదాపు అందరూ కథాసంపుటాలు తీసుకొచ్చారు. ఈకాలంలోనే కర్నూలు కథ సీమ కథా సాహిత్యంలో అగ్రభాగాన నిలబడింది. కథాసాహిత్యంలో ముఖ్యంగా రాయలసీమ కథకులు కథాసమయంలోని కథకులతోపాటు కొత్తగా రాస్తున్న యువకథకులతో కలసి 2019లో నీళ్లింకని నేల కథాసంపుటి రాయలసీమ ప్రచురణలు పేరుతో తీసుకొచ్చారు.
గతంలో కథాసమయంలో లేని కథకులు మారుతీ పౌరోహితం, కెంగారమోహన్, జంధ్యాల రఘుబాబు, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, డా.వి.పోతన్న, వెల్ధండి శ్రీధర్, కల్యాణదుర్గం స్వర్ణలత, ఎన్.నాగమణిలు కథలురాశారు. సంపాదకులుగా ఇనాయతుల్లా-కెంగారమోహన్‌లు వ్యవహరించారు. 2020లో రాయలసీమ ప్రచురణల పేరుతో నాల్గుకథలతోనే సిద్దశ్వరం అడుగు తీసుకొచ్చారు. ఇందులో రెండు సందర్భాలు-కె.సుభాషిణి, ఇన్ మోషన్-పాణి, కాల్వ-మారుతీ పౌరోహితం, రెండో వీరగల్లు-జి.వెంకటకృష్ణ రాశారు. ఇది కేవలం రాయలసీమ నీటి ఉద్యమంలో భాగంగా తమ వాటా తమకు దక్కాలని, అలుగు నిర్మించాలని కోరుతూ రాసిన ఉద్యమకథలివి. వీరిసంపాదకత్వంలోనే 2021లో వానమెతుకులు కథాసంపుటి తీసుకొచ్చారు.
ఇందులో రాయలసీమ అన్ని జిల్లాల కథకులను రాయలసీమ ప్రచురణలకు పరిచయం చేశారు. వానమెతుకులు-కెంగారమోహన్, ఊరిమర్లు-మారుతి పౌరోహితం, నేనూ రైతునే-డా.యంప్రగతి, ఉడుకోడు-పలమనేరుబాలాజీ, పాతబాకీలు-జి.వెంకటకృష్ణ, అడివి-సడ్లపల్లి చిదంబర రెడ్డి, తిమ్మప్పపార-సోదుం శ్రీకాంత్,కొత్త సేద్యగాడు-ఇనాయతుల్లా, ఫోర్స్ మెజూర్-జి.ఉమామహేశ్వర్, తోట అమ్మకానికి లేదు-డా.సుభాషిణి, ఓబుల్రెడ్డి ఎద్దులు-వివేక్ లంకమల, నీళ్ళ చిలువ-సుంకోజు దేవేంద్రాచారి, పెన్నేటి బతుకు-కాశీవరపు వెంకటసుబ్బయ్య, మూలిగే నక్కపై-అడవాల శేషగిరి రాయుడు, కురువోని బండ-డా.మనోహర్ కోటకొండ, బంధాల మొలక-ఎన్.నాగమణి, రైతే సిద్దార్థుడు-లోసారి సుధాకర్, మట్టిపెళ్ళ వాసన-పిళ్ళాకుమారస్వామి తదితరులు కథలు రాసి సీమకథాసాహిత్యాన్ని విస్తృతపరిచారు.
అందుకే ‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ ఎంతోకొంత అభివృద్ధి ఫలాల్నీ, తమ వాటా జలాల్నీ దక్కించుకుంటున్నప్పుడు సీమలో మాత్రం కుడి, ఎడమలు దగా, దగా, దగా అనే పరిస్థితి ఎందుకు? మన వాటా జలాల్ని రాబట్టుకోలేకపోవడంలో మన వాటా పాపం ఎంతో, శాపం ఎంతో తేల్చుకుని అధికార రాజకీయాల జలకుట్రని భగ్నం చేయాల్సిన సమయం ఇది. లేకపోతే ఇప్పటికే మొదలైన ఎడారి, దిగమింగడం ఖాయం అంటారు’ అఫ్సర్ కథాసాహిత్యంలో కర్నూలు కథకులు ఎప్పటికీ వెనకంజలో లేరు అని పై ఉదాహరణల ద్వారా అర్థమౌతుంది. అయితే కర్నూలు కథకులకు రావలసినంత గుర్తింపు రాలేదు. మొదటితరంలోనే కర్నూలుకు చెందిన గాడిచర్ల హరిసర్వోత్తర రావు రోజాంబ-శ్వేతాంబ అనే కథను 1913లో రాశారు. ఇది 1 ఆక్టోబర్ 1913 హిందూ సుందరి పత్రికలో అచ్చయ్యింది.
ఇంతటి క్రియాశీలకపాత్ర పోషించినా కర్నూలులో కథలేదు అనే విమర్శను కర్నూలు కథకులు ఎదుర్కొంటున్నారు. ప్రసిద్ధకథారచయిత సింగమనేని నారాయణ కూడా కర్నూలులో లేదని ఒక పుస్తకానికి ముందుమాట రాస్తూ చెబుతారు. పైన పేర్కొన్న చారిత్రక ఆధారాలు చూసైనా కథ ఉందని ఒప్పుకోవచ్చా..?
*
కర్నూలులులో కథ లేదనడం వారి పాక్షిక దృష్టికి నిదర్శనం. సవివరంగా రాసిన మోహన్ కేంగార అభినందనీయుడు .
‘అయితే కర్నూలు కథకులకు రావలసినంత గుర్తింపు రాలేదు.’
దానికి కారణం కర్నూలు కథకులేనేమో. బయటి విమర్శకులనూ తప్పు పట్టాల్సిందే. కర్నూలు కథకులేనేమో అని నేను అనటానికి ఈ వ్యాసం కూడా ఓ ఉదాహరణ. పాపం, హెచ్చార్కె అనే కవి ఇక్కడున్న చాల మంది రాసినన్ని, రాసినంత మంచి కూడా కథలు రాశాడు. ‘చేతికి రాని కొడుకు’ కథ లాంటి కథ మరొకటి నాకు తెలియదు. అచ్చయినప్పుడు ఆ కథ ఎంతగా ప్రాసంగికం అయ్యిందో తెలియని వాళ్లు సీమ సాహిత్యాన్ని గమనిస్తున్నారని నేను అనుకోను. పి. వరలక్ష్మి వంటి విరస-విప్లవకారిణి కోపాన్ని కూడా చవి చూసిన కథ అది. అది కాకుండా, ‘ఎండ’ వంటి కథలు చదివిన వాళ్లను బాగా మెప్పించాయి. ‘ఎండ’ వాస్తవ వాతావరణాన్ని… అనుభవించి పలవరించే రూపంలో… హృద్యంగా పరిచయం చేసే కథ. మనుషులు ఎలా స్నేహం వంటి విలువలు కోల్పోయి, ఆర్థిక యంత్రాలవుతారో చెప్పిన కథ… ఒకప్పుడు ఉధృతంగా పని చేసి, బతుకులను నాశనం చేసిన చిట్టీల నేపధ్యంలో వచ్చిన కథ… ‘కనిపించని చేయి’ లాంటి కథ… మరొకటి నాకు తెలీదు. ఈ కథలన్నీ ‘కనిపించని చేయి’ పేరుతో ఒక పుస్తకంగా వచ్చాయి. దాన్ని పూర్తిగా నా డబ్బుతో అచ్చేసిన ‘చినుకు’ వాళ్ల దారిద్ర్యం పాడుగాను, అది పాఠకులకు చేరనే లేదు. అది ఏమైందో రాజ గోపాల్ కే తెలుసు. ఆ పుస్తకం మీకు తెలీకపోవడం ఆశ్చర్యకరం కాదు. మీ మంచి వ్యాసాన్ని పైపైన చూశాక కనీసం రెక్కలున్న పిల్లనైనా ‘రెక్కులున్న పిల్ల’గానె గుర్తుంచుకున్నందుకు మా జయమ్మ కోసం… ఆత్మీయుడు కెంగార మోహన్ కు నా కృతజ్ఞతలు.