సియాల్ కోట్ టు గడివేముల వయా సౌది..

​         కర్నూలు బస్ స్టేషన్ వేకువన ఐదింటికే రద్దీగా ఉంది. ఇక్కడ రాత్రి పగలుకు తేడా లేదేమో ! నేను హైదరాబాదు హైకోర్టు దగ్గర ఉండాలి. నా ఇద్దరు బిడ్డలు గుల్షన్, షమలను వెంట తీసికొని నిన్న రాత్రే గడివేముల నుండి కర్నూలుకు వచ్చాను. తమ్ముడు వరుస అయ్యే వాడి ఇంట్లో ఉండి వేకువననే ఇలా బయలుదేరాను. ఇద్దరు పిల్లోల్లని తీసుకొని బస్సు  ఎక్కాను. నేను చిన్నదైన షమను ఒడిలో కూర్చొ పెట్టుకున్నాను. గుల్షన్ కిటికీ పక్కన కూర్చోంటానని అడిగి కిటికీ వైపు సీటులో కూర్చోంది. కండక్టర్ వచ్చి టికెట్ తీసుకొమ్మని అడిగాడు.

“ఒకటి ఫుల్లు , ఒకటి ఆఫు” అన్నాను .

చిన్నదాని వయసు అడిగాడు. “రెండున్నర సంవత్సరాలు” అని చెప్పాను.

“ఎవరైనా చెకింగ్ వచ్చి అడిగితే రెండున్నర సంవత్సరాలు అనే చెప్పాలి చూడు”  అనుకొంటూ టికెట్ ప్రింట్ తీసి ఇచ్చాడు.

​         బస్సు బయలు దేరింది. సీటును కొంచం వెనక్కు అనుకొని ‘షమ’ను ఒడిలో పడుకోబెట్టుకొని  కళ్ళు మూసుకొని సీటుకు వెనక్కు  ఆనుకొని కూర్చున్నాను. కళ్ళు మూసుకోగానే నిద్రోచ్చే పరిస్థితిలో నేను లేను. మనసు ఆగమాగంగా  ఉంది. ఒక్కసారిగా  నా గతం అంతా గురుతుకి  రాబట్టే . నా కథను మీకు చెప్పాలనిపిస్తోంది.

​         ఒక్క రాంగ్ కాల్ నన్ను ఇలా కోర్టుచుట్టూ తిప్పేటట్లు చేస్తుందని నేను ఉహించనే లేదు . నన్ను అతలాకుతలం చేసిన ఆ కాల్ గురించి చెప్పే ముందు అంతకు పూర్వం నా జీవితం గురించి చెప్పాలి.  నా పుట్టినిల్లు ఆత్మకూరు. మానాయన టైలర్. నాకు పది సంవత్సరాల వయసు వచ్చే వరకూ మేము ఆత్మకూరులోనే ఉండాము. నాకు ఒక అక్క,ఒక చెల్లెలు. ఇద్దరు అన్నోళ్ళు. చెల్లెలు , చిన్న అన్న తిక్కొల్లు. మానాయన మాఅమ్మని , మమ్మల్ని సాకడానికి చాలా కష్టపడుతా ఉంటే, గడివేములలో ఉండే మాఅమ్మమ్మ ఇట్లా కాదని మమ్మల్ని అందర్నీ గడివేములకు తీసుకు వచ్చే. అపుడు నేను రెండో తరగతి సదువుతూ ఉంటినంట. నాన్నకు ఉర్దూ చదవడం, రాయడం వచ్చు. అందుకే గడివేములలో మసీదులో నాయనకు ‘మౌసన్’ గా పెట్టిరి. మౌసన్  గా పనిచేస్తూనే టైలరింగ్ కూడా చేసేవాడు. ఒకరోజు తిక్కోడు అయిన మా చిన్నఅన్న ఎంతసేపైనా ఇంటికి తిరిగి రాలేదు. రాత్రి అంతా ఊరంతా బుడికితిమి(వెతికితిమి). ఎక్కడా కనపడలేదు. మా అమ్మ ఏడుపును ఆపడానికి ఎవరి తరమూ కాలేదు. అట్లా పోయిన చిన్నన్న ఇంతవరకూ తిరిగి రాలేదు. బతికి ఉండాడో లేదో కూడా తెలియదు. మా చెల్లెలు కూడా అట్లా పోతాదేమో అని మాయమ్మ ఆమెను వాకిలి దాటి బయటికి  పంపేది కాదు. మా అక్కను నంద్యాలకు ఇచ్చిరి. మా అన్నకు హుసేనాపురం సంబందం చూసి పెండ్లి చేసిరి. వాళ్ళ పెండ్లి అయినంక రెండేండ్లకు నన్నీ నంద్యాలలో గౌండపని చేసే మహమ్మద్ ఊసేన్ కు ఇచ్చి పెండ్లి చేసిరి.

​            మా ఆయన గౌండ పనికి పోతే నేను మట్టి పనికి పోతుంటి. మా అమ్మవాళ్ళ  ఇంటిలో మమ్మల్ని మానాయన ఏనాడూ బయటికి పనికి పంపేవాడు కాదు. ఇంట్లో పని మాత్రమే చేసేదాన్ని. మట్టి పనిలో చేతకానప్పుడంతా ఇట్లాంటి ఇంటికి ఇచ్చేడే అని మా నాయనని తిట్టుకొంటా ఉంటి. పెండ్లి అయిన అయిదేండ్లకి మాకి కొడుకు పుట్టే.    మహమ్మద్ ఇలియాస్ అని పేరు పెట్టుకొంటి. నా గాశారానికి(గ్రహచారానికి)మాఆయన టీ.బీ.తో కొడుకు పుట్టిన ఒక ఏడాదికే చనిపోయే.ఏడాది పిలగాడిని తీసుకొని నాను మళ్ళీ మా అమ్మవాల్లుండే గడివేములకు వస్తిని. నేను, నాయన, అమ్మ,నాకొడుకు ఇలియాస్ , తిక్కచెల్లెలు కలిసి ఉంటిమి. అన్న వదినతో తన ఇద్దరు పిల్లలతో వేరుగా ఉండే.

నాను గడివేములలోనే ఉన్న ఒక కాన్వెంటులో ఆయాగా  చెరితిని. రెండేండ్లు అయ్యిందో లేదో నాయన, అన్న చనిపోయిరి. అన్న చనిపోయినంక  వదిన తన పుట్టినిల్లు హుసేనాపురం చేరుకొనే. అమ్మ , ఇలియాస్ , నేను తిక్క చెల్లెలు మిగిలితిమి. కాన్వెంటులో ఆయాగా పని చేస్తూ, సెలవు దినాల్లో పనికిపోతా మిగిలిన ముగ్గురినీ సాకుతా ఉంటిని. కొడుకును బాగా చదివించుకొని నాజీవితాన్ని బాగుపరుచుకోవల్ల అని కలలుకంటాఉంటిని. కాన్వెంటుసారు సెలవుల్లో పని ఏదైనా చెప్పడానికి మీ ఇంటి దగ్గరకు రావాలంటే ఇబ్బందిగా ఉంటాదిఅని ఒక పాత  పోన్ ఇచ్చే. ఆ ఫోనే నా జీవితాన్ని తలకిందులు చేసింది.

​         ఒక ఆదివారం సెలవు రోజు కావడంతో ఇలియాస్ తో కలసి టీవీ చూస్తా ఉంటిని. ఫోన్ మోగింది . మా స్కూలు సారు ఏమైనా పని చెప్పడానికేమో అని లేచి చార్జింగ్ పెట్టిన ఫోన్ తీసిచూస్తి. మా సారుది కాదు. ఎదో నంబరు .చాలా నంబర్లు ఉండాయి. ఏమి ఇన్ని నంబర్లు పడినాయి అనుకొంటా ఫోన్  తీస్తిని.

ఫోన్ తీయంగానే అటు నుంచి “ ముజే పైచానే క్యా” అని ఎవరిదో మొగవారి గొంతు వినిపించె.

“ కోన్ “ అని అడిగా !

తనెవరో చెప్పకుండా మళ్ళీ “ ముజే పైచానే క్యా “ అని అడిగె.

నేను విసుక్కొంటూ ఫోన్ కట్ చేసి మళ్ళీ చార్జింగ్ పెట్టి టీవీచూసేందుకు వస్తిని . మరలా ఫోన్మోగింది. అదే నంబరు. రాంగ్ నంబర్లు వొస్తూ ఉండేది నాకు కూడా తెలుసు కాబట్టి ఎన్ని సార్లు మొగినా తీయలేదు. అలా మోగుతూనే ఉంది.

ఇలియాస్ “ఫోన్ చూడిమా! టీవీమాటలు ఇనిపించడం లేదు”అంటే నేను లేచి ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తి. సాయంత్రం ఆన్ చేసిన రెండు నిమిషాలకే మరలా మోగింది. అదే నంబరే. భయం అయ్యింది.  మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తిని. ఉదయం బడికి పోయిన తరువాత హెడ్మాస్టర్ సార్ కు విషయం చెబితిని.

ఆయన నంబరు తీసుకొని తన ఫోన్ లో నంబరు కొట్టి చూసి “ బువ్వమ్మా! ఇది దుబాయ్ నుంచి వచ్చిండాది. ఎత్తొద్దు లే . రెండు దినాలు ఆపు సేసి పెట్టు” అని చెప్పే.

“అట్లనేలే సార్”అని ఫోను నాలుగు దినాలు ఆన్ చేయలేదు.

​         మరలా ఆదివారం నాడు మా అక్కతో మాట్లాడుదాం అని ఫోన్ ఆన్ చేస్తి. ఇట్లా ఆన్ చేసినానో లేదో మళ్ళా అదే నంబర్ ఫోన్ వచ్చింది. గట్టిగా చెబుదాం అనుకొంటూ ఫోన్ తీస్తిని.

“ముజే పైచానే క్యా” అన్నాడు.

“మీరెవరో నాకు తెలియదు” అని విసుగ్గా అన్నాను.

ఇక మాట్లాడం మొదలు పెట్టాడు . ఆయన మాట్లాడుతా ఉన్నఉర్దూ మనఉర్దూ మాదిరి లేదు. అదో రకమైన యాసతో ఉండాది.నేను అడగకముందే తన పేరు గుల్జార్ ఖాన్ అనీ , తను దుబాయిలో పెయింటింగ్ పని చేస్తూ ఉంటానని తనది పంజాబ్ అనీ చెప్పుకొచ్చాడు.

“ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు ?” అని అడిగాను.

“ మీరు నాకు బాగా తెలుసు “ అన్నాడు.

“ఎట్లా తెలుసు ?” అని అడిగాను.

ఏదో చెప్పాడు. నాకు అర్థం కాలేదు. కానీ తను మాట్లాడుతున్న పద్దతి, గౌరవమైన పలకరింపు ఇవన్నీ అతను మంచి వాడిమాదిరే ఉన్నాడు అనిపించింది.

“ నాపేరు షేక్ దౌలత్ బీ , నాకు అయిదు సంవత్సరాల వయసు వున్న కొడుకు ఉన్నాడు. భర్త చనిపోయిండాడు.

మగ తోడు లేని ఆడవారితో మాట్లాడడం మంచిది  కాదు” అని  చెప్పాను.

“ నేను తప్పుగా ఏమి మాట్లాడాను ? “ అని ఎదురు అడిగినాడు.

నేను ఏమీ జవాబు  చెప్పలేక పోయాను.

“మీ బాబుకు ఇవ్వండి ఫోన్ మాట్లాడుతాను”  అన్నాడు.

మా వాడు “నేనూ మాట్లాడతాను” అని అటం చేయడంతో వాడికి స్పీకర్ ఆన్ చేసి  ఫోన్ ఇచ్చాను. వాడితో పావు గంట సేపు మాట్లాడాడు. పిల్లలను సంతోష పెట్టడం బాగా తెలిసినట్లుండాది. ఇలియాస్ మాట్లాడుతూనే ఉండాడు . నాకు గుల్జార్ ఖాన్ తో  పరిచయం అలామొదలు అయ్యింది. వారంలో రెండు రోజులు ఫోన్ చేసేవాడు. నిదానంగా అమ్మతో, మా అక్కతో, బావతో మాట్లాడడం షురువు చేసినాడు.

ఇలా మా ఫోన్ మాటలు రెండు సంవత్సరాలు జరిగినాయి. ఇంట్లో అందరూ తనతో ఇష్టంగా మాట్లాడేవారు. ఒకరోజు హఠాత్తుగా పెళ్లి ప్రతిపాదన పెట్టాడు. నాకు ఇప్పటికే పెళ్లి అయ్యిందనీ , మరో వివాహం చేసుకోవడం ఇష్టం లేదనీ ప్రతిపాదనను వొద్దన్నాను. కానీ గుల్జార్ వదలలేదు. ఈ విషయం తెలియని మా అక్క నాకు ఒక రెండవ సంబంధం తీసుకవచ్చింది. మా అక్కకు గుల్జార్ విషయం చెప్పి తను తెచ్చిన సంబంధం వద్దన్నాను .

అక్క“ఎక్కడో దుబాయిలో ఉన్నవాడిని నమ్ముకొని కళ్ల ముందు ఉన్న జీవితాన్ని వద్దంటావా?”అని అడిగింది.

“అక్కా! నేను ఇప్పటికే పెళ్లి అయినదానిని. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే మునిగి పోయేది ఏమీ లేదు.  జీవితం అంతా ముగిసింది అనే అనుకొంటా ఉండాను. ఇలియాస్ కోసమే నా ఈజీవనం. నాకు ఏపెళ్ళీ వద్దు. ఒకవేళ పెళ్లి చేసుకోవడం తప్పదు అనుకొంటే గుల్జార్ నే చేసుకొంటాను. లేదంటే ఏ పెళ్లీ వద్దు”అని ఖరాఖండిగా చెప్పాను.

​         గుల్జార్ ఫోన్ చేసినప్పుడు మా అక్కకు నాకు జరిగిన మాటలు గురించి చెప్పాను. తను నాకు మాట ఇచ్చాడు తప్పక నిఖా చేసుకొంటానని.

“ఇక్కడకు ఎప్పుడు వస్తారు” అని అడిగాను.

“జనవరి నెలలో వచ్చేస్తాను. అదే ప్రయత్నాలలో ఉన్నాను” అని చెప్పాడు.

జనవరి 19వ తారీకున హఠాత్తుగా ఫోన్ చేసి “నేను ముంబాయిలో ఉన్నా! మీ వూరు ఎలా రావాలి ?”

అని అడిగాడు.

గుండె ఝల్లు మంది. ఏదైతే అది అవుతుందని “ముంబాయి నుండి హైదరాబాద్ కు వచ్చి అక్కడనుండి కర్నూలు వచ్చి కర్నూలు బస్ స్టాండ్ లో గడివేముల బస్ ఎక్కండి. గడివేములలో నేను పని చేసే స్కూలు దగ్గరకు రండి. అంతలోపు మా స్కూలు సారుకు , అక్కకు బావకు చెప్పి ఉంటాను” అని ఫోన్ పెట్టేశాను.

​          జనవరి 23 ,2011 న మూడు గంటలప్పుడు గుల్జార్ మాస్కూలు దగ్గరకు వచ్చాడు. అప్పటికే మా సారుకు చెప్పి ఉన్నా కాబట్టి, గుల్జారుకు కూడా సారు  గురించి తెలుసు కాబట్టి అతను నేరుగా సారు దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకొన్నాడు. సార్ నన్ను అఫీస్ రూమ్ కు పిలిపించారు. గుల్జార్ ను మొదటిసారిగా అక్కడే చూశాను. మనిషి పొడవుగా కోలముఖంతో గంభీరంగా ఉండాడు. చేతిలో ఒక బ్యాగ్ తప్ప మరేమీ లేదు.

సార్ నన్ను చూపిస్తూ “ ఆమెనే షేక్ దౌలత్ బీ” అన్నాడు.

గుల్జార్ నావైపుచూసి తనకు తెలుసు అన్నట్లు చిన్నగా నవ్వాడు. నేను   మా అక్క, బావలను స్కూలు దగ్గరకు పిలిపించాను. బావ తనను అన్నీ వివరాలు అడిగాడు. తనది పంజాబ్ అనీ ,సౌదీలో పెయింటింగ్ పనిచేసుకొంటూ ఉండేవాడిననీ ,దౌలత్ బీను నిఖా చేసుకొనేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పాడు.

మా బావ “ పెళ్లి అయినతరువాత మీరు పంజాబ్ కు వెళతారా ? ఇక్కడే ఉంటారా? దౌలత్ బీకు ఇప్పటికే ఒక కొడుకు ఉన్నాడు. వాడిని కూడా చూసుకొనే బాధ్యత మీదే” అంటూ షరతులు పెట్టడం షురువు సేసినాడు  .

గుల్జార్ “పంజాబ్ కు వెళ్ళినా పని చేసుకొనే బతకాలి కాబట్టి నేను ఇక్కడనే ఉండిపోతాను , ఇలియాస్ ను నా  కొడుకు మాదిరే చూసుకొంటాను” అని మా బావకు మాట ఇచ్చాడు .

అయితే మాఅక్కాబావలు తన భాషలో ఉండే తేడాను గమనించి నన్ను పక్కకు పిలిచి “ ఏందీ ఈయన మాటలు వేరే రకంగా ఉండాయి . ఇతని మీద నీకు నమ్మకమం ఉండాదా ?” అని అడిగాడు.

“బావా! ఇది నేను ఫోన్ లో మాట్లాడేటప్పుడే గమనించాను. పంజాబ్ లో వాళ్ళ బాష ఇలానే ఉంటుందట” అన్నా.

“ చూడమ్మా! నీ ధైర్యం” అన్నాడు .

“నాకు నమ్మకం ఉండాది బావా” అన్నాను.

​          25.01.2011 తేదీన మాయిద్దరకూ కర్నూలులో నిఖా జరిగింది. ముగ్గురం గడివేములలో ఒక ఇల్లు బాడుగకు తీసుకొని కాపురం ప్రారంభించాం. నిఖా అయిన నాటి నుండి గుల్జార్ ప్రేమకు నేను దాసోహం అయ్యాను. మా అక్క ఎంత అదృష్టవంతురాలివే అనేది. ఇలియాస్ కు కూడా గుల్జార్ అంటే ప్రాణం. నన్ను స్కూలుకు తప్ప మరే పనికి పంపేవాడు కాదు. తనకు వచ్చిన కూలీ డబ్బులు అంతానా చేతుల్లోనే పెట్టేవాడు. అలా మాకాపురం పదకొండేళ్లు సాగింది. పదకొండేళ్ళ మాకాపురంలో నాకు గుల్జార్ ద్వారా ఒక అబ్బాయి ,ముగ్గురు  అమ్మాయిలు పుట్టారు . తనకు తన నలుగురు పిల్లలకన్నా ఇలియాస్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఊరిలో ప్రతిఒక్కరినీ అక్కా , అన్నా అంటూ మాట్లాడించేవాడు. ఒప్పుకొన్న పనిని శ్రద్దగా చేసేవాడు. ఉంటే ఇంట్లో లేకపోతే పనిలో ఉండేవాడు. ఒకరోజు ఇలియాస్ మటన్ కావాలి అంటే ఊర్లో దొరకకపోతే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నంద్యాలకు వెళ్ళి తెచ్చి వండించాడు. పిల్లలు అడిగినది ఇవ్వకపోతే మన బతుకు వృధా అనే వాడు. షాయిరీలు వ్రాసి కమ్మగా పాడేవాడు. తనతో నా మొదటి రాత్రి రోజున తను పాడిన హిందీ పాట నాకు ఇప్పటికీ గుర్తే!

​                          “ పహలీ ములాఖాత్ మే బాత్ ఐసీ హోగయీ

​                                   రాజా భీ ఖోగయా–రాణీ భీ ఖోగయీ

​                                  దోనోంకో కోనపతా చలా మజే కి యే బాత్ హై

​                           పహలీ ములాఖాత్ హై-పహలీ  ములాఖాత్ హై” అని పాడేవాడు.

అతని పాటలు షాయిరీలు నాకు అర్థం కాకపోయినప్పటికీ అవి నన్ను ఉద్దేశించినవే అని మురిసిపోయేదాన్ని. ఒక్క మాటలో చెప్పాలి అంటే తను నా మనసునే కాకుండా మాబందువుల, ఊరందరి మనసులను మెప్పించాడు తన మాట తీరుతో !

​          జీవితం ఆనందంగా ఒకే తీరుగా సాగిపోతే అది జీవితం ఎట్లా అయితది? ఒక సుఖం పక్కన ఒక దుఃఖం ఉంటాదని మానాయన చెప్పేవాడు. అటువంటి రోజు ఒకటి రానే వచ్చింది. ఒకరోజు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ “ మా అమ్మ నీతో మాట్లాడుతుందట. నీకు నాతోనే మొదటి పెళ్లి అనిచెప్పాను. మీరు పఠానులు అనిచెప్పాను” అని చిన్నగా చెబుతూ ఫోన్ నాకు ఇచ్చాడు.

నేను తత్తర పడుతూ “ హలో ! అత్తగారు . సలామలేకుమ్” అన్నా!

అటు వైపు నుండి “ ఆలేకుమ్ సలాం ! కైసాహై భేటీ” అని అడిగింది.

మా ఇద్దరిమద్య మాటల ప్రవాహం నడిచింది. చాలా ప్రేమగా నాతొ మాట్లాడేది. అలా మాఅత్తకు నాకు ఫోన్ ద్వారానే ఒక ప్రేమ బంధం ఏర్పడింది. గుల్జార్ చపాతి తప్ప మరేమీ తినడని ఒకరోజు ఫిర్యాదు చేశా ! తను నాకు ఆలూ పరోటా , రుమాలి రోటీ , బట్టర్ రోటీ ఎలా చేయాలో నేర్పించింది. గుల్జార్ వాళ్ళ అక్క కూడా నాతో ఫోన్ లో మాట్లాడేది . తను డాక్టర్ గా పని చేస్తున్నాను అని చెప్పేది. నేను ఎప్పుడు కూడా వారి ఊరి విశేషాలు అడగలేదు. ఒకరోజు గుల్జార్ తల్లి మా దగ్గరకు వచ్చేయండి అని ఒక ప్రతిపాదన పెట్టింది. ఎప్పటికైనా అత్త వాళ్ళింట్లో ఉంటేనే గౌరవం అనే వాతావరణంలో పెరిగిన దానిని. అందుకు నామనస్సు అంగీకరించింది. గుల్జార్ కు ఆ విషయం చెప్పినప్పుడు ఎగిరి గంతేసినంత పని చేశాడు.

ఒకరోజు రాత్రి భోజనాలు అయిన తరువాత “రేపు ఉదయం మనం ఏడుగురు హైదరాబాదు కు వెళ్ళాలి పాస్ పోర్ట్ తీసుకోడానికి” అన్నాడు. నేను ఐదవ తరగతి వరకు చదువుకున్న దానిని. స్కూలులో పనిచేయడం వలన కొంత ప్రపంచ జ్ఞానం ఉన్నదానిని.

“పంజాబ్ కు వెళ్ళడానికి పాస్ పోర్ట్ ఎందుకు?” అని అడిగాను.

“పిచ్చిదానా! పంజాబ్ కు వెళ్ళాలి అంటే పాస్ పోర్ట్ అవసరం. ఒకే దేశంలో అయితే అవసరం లేదు గాని , వేరే దేశం వెళ్ళాలి అంటే అది అవసరం”అన్నాడు.

“పంజాబ్ ఉండేది ఈ దేశంలోనే కదా ? మరి పాస్ పోర్ట్ ఎందుకు?”అని మరలా రెట్టించి అడిగాను.

పకపకా  నవ్వుతా “నీవు ఈ దేశంలో ఉండే పంజాబ్ అనుకున్నావా? కాదు, పాకిస్తాన్ లో కూడా ఒక పంజాబ్ ఉంది . దానికి దగ్గరలోఉన్న సియాల్ కోట మాఊరు . అందుకే మనం రేపు పాస్ పోర్ట్ కోసం  హైదరాబాద్ కు వెళ్ళాలి “ అన్నాడు.

ఒక్కసారిగా బాంబు పక్కనే పెలినట్లనిపించింది. గుల్జార్ మాత్రం మామూలుగానే నిద్ర పోయాడు. నాకు మాత్రం  నిద్ర పట్టడం లేదు. నేను పంజాబ్ అంటే ఈదేశమే కదా అనుకొన్నాను. పాకిస్తాన్ లో కూడా ఉందా? నేను ఇన్నిరోజులు ఈ పంజాబే కదా అనుకొని ఉన్నాను. పాకిస్తాన్ గురించి టీవీలలో, పేపర్ల వార్తలలోవిని వున్నాను. పాకిస్తాన్ నుండి సరిహద్దు దాటి దొంగతనంగా మన దేశంలోకి  వస్తున్న పాకిస్తాన్ వారిని సైనికులు కాల్చి వేసారనీ, ఫలానా వారు పాకిస్తాన్ నుండి బారత్ కు వచ్చి ఇక్కడి సమాచారాలు వాళ్ళ దేశానికి పంపుతూ ఉంటె అరెస్టు చేశారనీ లాంటి వార్తలు గుర్తుకు వచ్చి చెమటలు పట్టాయి. గుల్జార్ మాత్రం ప్రశాంతంగా నిద్ర పోతూ ఉన్నాడు. తను ఎప్పుడు కూడా తనతో అమర్యాదగా మాట్లాడలేదు. తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ గొప్పగా గౌరవించాడు. ఫోన్ లో కూడా తన తల్లి తండ్రులతో అక్కతో తప్ప మరెవరితో మాట్లాడేవాడు కాదు. ఏరకంగా చూసినా గుల్జార్ అట్లాంటి వాడు కాదు అనిపిస్తోంది. ఓ అల్లా ! ఎంత పరీక్ష పెట్టినావు కదప్పా? అనుకొంటి. గుల్జారు అలాంటి వాడు అయితే ఈ పదకొండు సంవత్సరాలలో ఎప్పుడో బయట పడేవాడు కదా అని సమాధానం చెప్పుకొంటి. ఎంత సమాధానం చెప్పుకొన్నా చెడే  గుర్తుకు వస్తోంది. మనిషి తత్వమే అంతేనేమో! మనకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం కన్నా కీడు జరుగుతుంది అనే భయమే ఎక్కువగా వెంతాడుతుంటుంది. అల్లాను  అంతా మంచే జరుగేటట్లు చూడు అని మనసులోనే ప్రార్థించుకున్నాను. అయితే గుల్జార్ పాకిస్తాన్ వాడని ఎవరకూ చెప్పకూడదనుకొన్నాను.

మరుసటి రోజు ఉదయమే హైదరాబాద్ కు ఏడుగురమూ  బయలు దేరాము. అక్కడ పని అంతా ముగించుకొని రెండు రోజులలో తిరిగి గడివేములకు వచ్చాం. వచ్చినప్పటి నుండి మనసులో మనసు లేదు. తనేమో తన దేశానికి వెళ్లి పోతున్నాం అనే సంతోషంలో ఉండాడు. అక్కడ ఇంత కష్ట పడవలసిన అవసరం లేదనీ తమకు పొలాలు , ఇల్లు ఉన్నాయనీ , తండ్రి వ్యాపారం చేస్తారనీ చెప్పేవాడు. రాను రానూ  నాకు అతను పాకిస్తానీ అనే భయం తగ్గిపోసాగింది. కాలం అన్ని భయాలనూ పోగోడుతుందేమో!

పాస్ పోర్ట్ లు వచ్చాయి. అమ్మకు అక్కకు బావకు మా పంజాబ్  ప్రయాణం గురించి చెప్పాము. అయితే వారికి పాకిస్తాన్ పంజాబ్ అని చెప్పలేదు. అందరూ ఒకరోజు మాకు వీడ్కోలు విందు  ఇచ్చారు. అక్క బావలకూ,అమ్మకు , చెల్లికీ బట్టలు పెట్టాము. ఉదయమే బయలుదేరి కర్నూలులో ఉన్న మామేనమామ కొడుకు ఇంటికి వెళ్లి ఇలా పంజాబ్ కు పోతూ ఉన్నామని చెప్పి పోదామని వచ్చాం అని చెప్పాను.

మాటల తొందరలో పాస్ పోర్ట్ లు తెచ్చుకొన్న విషయం నోరు జారాను.

వెంటనే వాడు “పంజాబ్ కు పాస్ పోర్ట్ ఎందుకు? ఇతను మిమ్ములను ఎదో మోసం చేస్తూ ఉన్నాడు. తిక్క దాని మాదిరి వాడి వెనకాల వెళ్లొద్దు. ఇలాంటి వాళ్ళు  మిమ్ములను అందర్నీ అమ్మి వేస్తారు చూడు” అంటూ గొడవ షురువు  చేసాడు.

నేను గట్టిగా “నాకు అన్ని విషయాలు తెలుసు. గుల్జార్ నా దగ్గర ఏమీ దాచలేదు. ఆయన పాకిస్తానీ. పాస్ పోర్ట్ తెచ్చుకొన్నాం. పాస్ పోర్ట్ అన్నీ విచారించే ఇస్తారు కదా? నీవు అనవసరంగా గొడవ చేయొద్దు. అయినా నాఇష్ట పూర్వకంగా నా భర్తతో నేను పోతున్నపుడు మీరెవరు ఆపడానికి” అంటూ పిల్లోల్లను తీసుకొని గుల్జార్తో కర్నూలు రైల్వే స్టేషన్ కు వెళ్ళిపోయాం.

రైలు బయలు దేరింది. మేము రైలులో బయలు దేరామో లేదో మామామ కొడుకు పోలీస్ స్టేషన్ కువెళ్లి మా అత్తను పిల్లలను ఒక పాకిస్తానీ తన దేశానికి తీసుక పోతున్నాడు, కాపాడండి అని పిర్యాదు ఇచ్చాడంట. ఆ విషయం మాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తెలిసింది. మేము రైలు దిగామో లేదో ఓపదిమంది పోలీసులు మమ్ములను చుట్టూ ముట్టారు. అందరనూ పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్ళారు.

గుల్జార్ “ఎందుకు మమ్ములను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళుతున్నారు? మేము చేసిన తప్పు ఏమిటి? మా దగ్గర పాస్ పోర్ట్ లు ఉన్నాయి. మాదేశానికి మేము వెళ్ళడానికి మీకు ఏమిటి అభ్యంతరం?” అని అడుగ సాగాడు .      నేను కూడా వారితో మేము పదకొండు సంవత్సరాలు కలసి కాపురం చేశామనీ గుల్జార్ చాలా మంచి వాడనీ, మీరు అనుకొంటున్నట్లు అతను చెడ్డవాడు కాదనీ చెబుతూనే ఉన్నాను.

పోలీసు ఇనస్పెక్టర్ “మీరు ఆందోళన పడవలసిన అవసరం లేదు. విచారించి అన్నీ సక్రమంగాఉంటే పంపించి వేస్తాం” అని  భరోసా ఇచ్చాడు .

గుల్జార్ ఫోన్ తీసుకొని ఎవరెవరికి ఫోన్ చేసాడో చూసారు. అతని అమ్మకు, అక్కకు తప్ప మరెవరికీ చేయలేదని నిర్దారించుకొన్నారు. అతను మరి ఎలా ఈ దేశం లోకి వచ్చాడు అనేది విచారాణ చేస్తే దుబాయ్ నుండి ఎమర్జన్సీ సర్టిఫికేట్ ద్వారా వచ్చాడని తేలింది.

గుల్జార్ ఏదీ దాచిపెట్టుకోకుండా “నేను దుబాయ్ కు పాకిస్తాన్ నుండే వెళ్ళాను. దౌలత్ బీ పరిచయం కావడం, మేము నిఖా చేసుకోవాలి అనుకోవడం వలన నా పాకిస్తాన్ పాస్ పోర్ట్ ను కాల్చివేసి పోగొట్టుకు పోయింది అని అపద్దం చెప్పి ఎమర్జన్సీ సర్టిఫికేట్ పొంది ఈ దేశానికి వచ్చాను. నాకు  దౌలత్ బీమీద కేవలం  ప్రేమ తప్ప మరే ఉద్దేశ్యం లేదు” అని అల్లా మీద ప్రమాణం చేసి చెప్పాడు.

నేను ఏతప్పు చేయలేదనీ, తప్పు ఏదైనా చేసి ఉన్నాను అంటే ఎమర్జన్సీ సర్టిఫికేట్ తో ఈ దేశం లో ప్రవేశించడమే అనీ అదీ ప్రేమ కోసమే తప్ప ద్వేషంతో కాదనీ విన్నవించుకొన్నాడు. పోలీసులకు కూడా గుల్జార్ ను అనుమానించే ఆధారాలు లేకపోవడం వలన , ప్రేమకోసం సరిహద్దు దాటి రావడం వారందరనూ  ఆశ్చర్యపరిచింది.

పోలీసు ఇనస్పెక్టర్ “అమ్మా ! నీ మీద ప్రేమతో వచ్చినా తప్పు తప్పే. చట్టం అందుకు అనుమతించదు. మీరు ఏమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఆయనను అరెస్టు చేస్తున్నాం. విదేశీయుల చట్టాన్ని, ఇండియన్ పాస్ పోర్ట్ చట్టాన్ని మీ ఆయన ఉల్లంఘించారు. అందువలన కేసు కడుతున్నాం. మీ ఆయనను మేము కస్టడీలోకి తీసుకొన్నట్లు మీకు రసీదు కూడా ఇస్తాం. కేసు కోర్టుకు వస్తుంది. అక్కడ లాయర్ ను పెట్టుకొని వాదించుకోండి. తప్పు చేయలేదు అంటున్నారు కాబట్టి మీరు నిరూపించుకో గలిగితే వదలి పెడతారు. ఈ విషయంలో మేం నిస్సహాయులము” అంటూ గుల్జార్ ను సెల్లులోపలికి  తీసుకు వెళ్ళారు.

నాకు నోట మాట రాలేదు. ఏమి చేయాలో కూడా తెలియలేదు. నాకు మాత్రం గుల్జార్ మీద నూరుశాతం విశ్వాసం ఉంది. నా జీవితంలో పూవులు పూయించినవాడు  చెడ్డ వాడు ఎలా అవుతాడు? తప్పక గుల్జార్ ను నేను బయటకు తెచ్చుకొంటాను అని నన్ను నేను ఓదార్చుకోవడం తప్ప అప్పుడు నాకు మరోమార్గం కనిపించలేదు. బాధతో  పిల్లోల్లతో గడివేములకు వచ్చి అమ్మకు, అక్క బావలకు , స్కూలు సారోల్లకు జరిగిన విషయం అంతా చెప్పాను. మరుసటి రోజే అన్ని పేపర్లలో పెద్దపెద్ద  అక్షరాలతో వార్తలు  వచ్చాయి. టీవీ లలో గుల్జార్ ఫోటో , నాఫోటో చూపిస్తా ఉండారు.

గుల్జార్  పాకిస్తానీ అని తెలిసి ఊరు ఊరే ఆశ్చర్యపోయింది. అయితే ఏ ఒక్కరు కూడా గుల్జార్ చెడ్డ వాడు అనలేదు. అందరూ మా యింటికి వచ్చి “ బువ్వమ్మా! ధైర్యంగా వుండు. మేమంతా ఉండాము. భయపడొద్దు. కోర్టుకు చెప్పుకోమన్నారు కదా ! లంకలో పుట్టినోల్లంతా రావణులు కారులే ! మంచోళ్ళూ ఉంటారు” అని ధైర్యం చెప్పినవారే గానీ ఒక్కరూ ఒక మాట అనినోల్లు కాదు. ఊరివాళ్ళు, స్కూలు సారూ , పనిచేసే టీచర్లు తమది తక్కువ జీతం అయినా తోచినంత వేసుకొని ఒక ఇరవైవేల రూపాయలు జమచేసి కోర్టుకు పోయిరావడానికి ఖర్చులకు ఉంటాయి తీసుకో బువ్వమ్మా అన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఈ రోజు నేను నా గుల్జార్ కోసం పోరాటం చేస్తూ ఉన్నానంటే నా గడివేముల ప్రజల అండనే ! లేకపోయి ఉంటె ఏమి గతి అయి పోయేదాన్నో!

ఈ దేశంలో కొత్తగా తాము ఈదేశం  మనుషులేనని నిరూపణ చేసుకోవాలనే చట్టం వచ్చిందనీ వాళ్ళూ వీళ్ళూ చెబుతుంటే విన్నా. ఆ చట్టం గురించి ఎవురైనా టీవీలల్లో మాట్లాడుతా ఉంటె భయం అవుతా వుంటాది. దొంగతనంగా సరిహద్దు దాటుతూ ఉన్నప్పుడు పోలీసోల్లు జరిపిన కాల్పుల్లో చనిపోయినారని విన్నప్పుడంతా నిద్ర పట్టదు. కాశ్మీరులో పాకిస్తాన్ రౌడీ మూకలు  అల్లర్లు లేపాయని, పోలీసులు జరిపిన కాల్పుల్లో పాకిస్తానీ వాళ్ళు చనిపోయినారనీ వార్తలు వచ్చినప్పుడు మనసు అల్లాకల్లోలం అయిపోతాది. అందుకోసమే ఈమధ్య వార్తలు చూడడం మానేసాను.

వాయిదాలకు కోర్టుకు పోయి వొస్తా ఉన్నా . అసీఫ్ ఆలీ అనే దేవుడు లాంటి  లాయరు నా బీద పరిస్థితిని చూసి మా కేసు  వాదించడానికి ముందుకు వచ్చాడు . అంతలోనే కరోనా రావడం వలన గుల్జార్ ను తాత్కాలికంగా ఒక ఆరు నెలలపాటు విడుదల చేసారు. గుల్జారు గడివేములకు వచ్చిన రోజు ఊరు ఊరే వచ్చి పరమార్శించింది. అండగా ఉంటాము అంటూ దైర్యం చెప్పింది. గడివేములలో ఉండబట్టి సరిపోయింది. ఏదైనా పట్టణంలో ఉండి ఉంటె ఒక్కరు కూడా సహాయానికి ముందుకు వచ్చేవారు కాదనిపిస్తోంది. నేను గడివేములకి రుణపడి ఉండాను.  గుల్జారును పట్టించిన మా మేన మామ కొడుకు కూడా వచ్చి గుల్జారును క్షమించమని వేడుకొన్నాడు. తానూ తప్పు చేయలేదనీ, తనకు అల్లా న్యాయమే చేస్తాడనీ గుల్జార్ వాడితో చెప్పాడు.

ఆరు నెలల తరువాత పోలీసులు గుల్జార్ ను మరలా కష్టడిలోకి తీసుకొన్నారు. ఈరోజు గుల్జార్ ను కోర్టుకు హాజరు పరిచేందుకు తీసుక వస్తారు. అందుకోసమే నేను హైదరాబాదు బయలు దేరాను. కొంచెం ముందే పొతే గుల్జార్ తో మాట్లాడొచ్చు. పిల్లోల్లనూ తనకు  చూపించొచ్చు. అందుకే వేకువననే బయలు దేరాను.

పోయిన నెలలో ములాఖత్ కు పోయినపుడు “ఒకవేళ నీవొక్కడినే  పాకిస్తాన్ కు వెళ్ళడానికి అనుమతి ఇస్తాం, వీరిని ఇక్కడే వదలి వెళ్ళమంటే ఏం చేస్తావు?” అని  అడిగాను.

“చావనైనా చస్తాను కానీ పిల్లోల్లను నిన్ను వదలి వెళ్ళను. నేను ఏతప్పు చేయలేదు. తప్పు అనేది ఏమైనా వుంది అంటే పాస్ పోర్ట్ లేకుండా ఈదేశం లోకి రావడమే. అది నీకోసం, నీ ప్రేమకోసం , నీకిచ్చిన మాట కోసం తప్పు కాదని వచ్చానే తప్ప మరోటి కాదు” అని కళ్ళల్లో  నీళ్ళు పెట్టుకున్నాడు.

“ఆ!  హైకోర్ట్  వచ్చింది. ఎవరైనా దిగాలి అనుకొంటే  దిగండి” అని కండక్టర్ అరవడంతో నేను ఒక్కసారిగా ఈలోకం లోకి వచ్చాను.

గబా గబా పిల్లోల్లను తీసుకొని బస్సు దిగాను. రోడ్డుపక్కనే చిన్న బండి పై అమ్ముతున్న ఇడ్లీ వడలను  పిల్లలకు తినిపించి, నేనూ తిని కోర్టువైపుకు నడిచాను. కోర్టు ముందు ఇద్దరు పిల్లలతో నా గుల్జార్ కోసం, నా పిల్లల భవిష్యత్తు  కోసం , న్యాయం కోసం ఎదురు చూస్తా ఆశగా నిల్చొని ఉండాను. గుల్జార్ గురించి నాగురించి కాకుండా నా పిల్లల భవిష్యత్తు గురించి ఈకోర్టు ఆలోచన చేస్తుందే అని అనుకొంటాఉండా. పతి బిక్ష పెట్టమని  నా కొంగు చాపి ఈ కోర్టు గుమ్మం ముందు న్యాయం కోసం నిలబడిఉండా.

*******

 

మారుతి పౌరోహితం

18 comments

Leave a Reply to Pappati Varalaxmi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ వాస్తవికమైనది..జరిగిన ఘటన..వర్తమానస్థితి కూడా..కథకుడు కథా సృజనకు తావివ్వకుండా కథనం నడిపాడు..ఈశైలి ఆకట్టుకుంటుంది..

  • కథ చాలా హృద్యంగా ఉంది..‌‌ఎల్లలులేని ప్రేమకు న్యాయం జరగాలి.మారుతి గారి narration చాలా బావుంది.

  • మనసు ఎరిగిన రచయితలకు ఇలాంటి కథలు రాయడం వెన్నతో పెట్టిన విద్య అని నిరూపించబడింది 🙏🙏🙏

  • కథ బాగుందండీ. అభినందనలు💐

  • చాలా బాగుంది సార్.. ప్రేమకు అవధులు ఉండవు. ఏ సరిహద్దులు అడ్డు రావు.. కానీ సమస్యలు మాత్రం నిజమైన ప్రేమకు పరీక్షలు పెడుతూనే ఉంటాయి..🙏🙏👍💓

    • అందరి మనసులు ఎరిగిన రచయితలలో అగ్రగన్యుడు మా అన్నగారు శ్రీ మారుతి పౌరోహితం. మీ కలము నుండి ఇంకా ఎన్నో అత్యద్భుతమైన కథలు రావాలని కోరుకుంటూ… మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోనెగండ్ల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

  • Very good human interesting story.
    ఎక్కడా బిగి సడలకుండా చదివించారు.
    అయితే, సమాధానం లేని ముగింపు ఇచ్చారు.
    ఇది నిజ జీవిత కథ అయితే ఆమెకు ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నాను.

  • అన్నా కథ చాలా బాగుంది. మనసు కదిలించి వేసింది. ఈ కథ సుఖాంతం అవుతుంది అని భావన

  • సమకాలీన సమాజంలో ఉన్న సమాజ సామరస్యం గురించి కథ చక్కగా చెప్పింది. నాకు తెలిసినంతవరకూ ఇది వాస్తవికంగా జరిగిన కథ. రచయిత తన ” కుశలంబే గదా ! ఆంజనేయ ” అనే కథలో ఒకప్పటి సామరస్యం గురించి చెబితే ఈ కథ వర్తమానంలో ఉన్న సామరస్యం గురించి చెబుతోంది. ఇది వర్తమాన కాలంలో అత్యంత ఆవశ్యం. కథలో ఎక్కడ కూడా అతిశయోక్తులు లేకుండా రీడబిలిటీ కలిగి ఉండి ఆసక్తితో చదివిస్తున్నది. మారుతి పౌరోహితం కథల్లో మరో ఆణిముత్యం చేరింది.

  • సర్ జి, గుల్జర్, దౌలత్ బీల ప్రేమ అక్షయమైనది కాబట్టి కథ ముగింపు సారాంశాన్ని మాకే (పాఠకులకు) వదిలేశారు. జీవన పోరాటముకై వీరి ప్రేమ చిగరించింది కానీ దేశ ద్రోహం తోనో లేక ఆకర్షణతోనో గుల్జర్ భారత స్త్రీని వంచించలేదని … కుటుంబ బాధ్యతను మోయడానికి పుట్టిన అక్షయమైన ప్రేమను కాపాడటానికి,కోర్టు జడ్జి గుల్జర్ కేసును కొట్టి వేసి వీరి బంధ కొనసాగింపుకు అనుమతిస్తారు అని అర్థమయ్యేలా ముగించారు. విభిన్నమైన ప్రేమ కథలు ఇంకా వ్రాయాలని ఆశిస్తూ…

  • కుల మత దేశాలకతీతంగా ప్రేమ గెలవాలని కోరుకుందాము ❤️❤️🎉🎉

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు