సిన్మా పిచ్చి

“మీ నాయన ఏం చేస్తడు?” అని ఎవరన్న అడిగితే – మా నాన్న సిన్మా టాకీస్‌ల పనిచేసుడు మానేసింకగూడ –

“సిన్మా టాకీస్‌ల పనిచేస్తడు” అనేటోడ్ని.

“అయితే మీకు సినిమాలు ఫ్రీనా?” అని అడుగుతుంటరు ఎమ్మటే.

అట్ల ఆ మాట ఎవరన్న అడిగినప్పుడు.. నోరు సగం తెరిచి కండ్లతోటి నవ్వే నా ముఖం దిక్కు చూడాలి.

ఆబ్కారాయన ఇంట్ల పనిజేస్తున్నప్పుడు – మూడు పూటల అన్నం పెట్టి ఏవో పైసలిస్తే వాటిల్ల సగం దాచిపెడ్తె సగం సినిమాలు చూసేటోడంట మా నాన్న. అక్కినేని నాగేశ్వర్రావంటే పిచ్చి. మద్రాస్ పోయి కమెడియన్ అయిదామనుకున్నడంట. “జోకులు.. జోకులెట్ల చేస్తరువయ్యా.. రమణారెడ్డి, రేలంగి.. అట్ల అయిదామనుకున్న” అనేటోడు మా నాన్న. నిజంగనే సినిమాలల్లకు పోదామనుకున్నవానే అనడగొద్దు మా నాన్నని. అడిగినమంటే డైలాగులు అందుకుంటడు. అయి ఆగకుండా అట్ల పోతనే ఉంటయి.

సరే, అట్లని ఆయన సినిమాలల్లకేం పోలేదుగానీ – బాయిలపడి కాళ్లు ఇరగ్గొట్టుకొని కోలుకున్నంక సిన్మా టాకీస్‌ల పడ్డడు. అంతకుముందు అదే టాకీస్‌ది అనౌన్స్‌మెంట్ బండి నడిపిండు – “నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో” అనుకుంట తిరిగేదంట.

మా నాన్న చిన్నగున్నప్పుడు నల్లగొండల కృష్ణ టాకీస్ అని ఉండేదంట. నేనది చూడలేదుగానీ – లక్ష్మీ, భాస్కర్, న్యూప్రేమ్ (ఇప్పుడైతే పీవీఎన్ సినీమ్యాక్స్), నటరాజ్, వెంకటేశ్వర, తిరుమల.. ఇయన్నీ నేను చూసిన సిన్మా టాకీస్‌లు. లక్ష్మీ, భాస్కర్ జంట థియేటర్లు. మా నాన్న దాంట్లనే స్వీపర్‌గ, గేట్ కీపర్‌గ పనిచేసిండు.

భాస్కర్‌ల “ఎయ్, మీరు చూడొద్దురా అయి” అసొంటి సిన్మాలు వచ్చేటియి. లక్ష్మిల మాత్రం అన్ని మంచి సినిమాలే – అంటే మేం చూసేటివి. రెండు థియేటర్లు ఒక్కటే కంపౌండ్‌ల ఉంటయి. భాస్కర్ టాకీస్ ఎట్ల ఉండేదో నాకిప్పటికీ తెల్వదు. బయట పోస్టర్లనిగూడ చూడనిచ్చేటోడు కాదు మా నాన్న.

లక్ష్మిలనయితే ఏ సినిమా వచ్చినా చూసేది. ’మీకు సినిమాలు ఫ్రీనా?’ అని ఎవరన్న అడిగితే నోరు సగం తెరిచి కండ్లతోటి నవ్వేది ఇందుకే.

నాకు గుర్తుండి నేను చూసిన ఫస్టు సినిమా దగ్గర్నించి చెప్పాలి.

చిన్నప్పుడు నేను అజ్జకారోడినని మా అమ్మ చెప్తుంటది. ఏదన్న కావాల్నంటే కావాలంతే. మా ఊర్ల ఎప్పుడు ఉర్సొచ్చినా నేను రిమోట్ కార్ కావాలని అడిగేది. మా అమ్మనేమో ’కీ’ ఇస్తే ఉరికే జీపు కొనిచ్చేది.

“అమ్మా, నాకు రిమోట్ కార్ కావాల్నె” అని ఏడిస్తే – “మళ్ల ఎప్పుడన్న కొనిస్తలేరా, దీంతోటి ఆడుకో” అనేది.

అప్పటికీ ఆ బొమ్మతోటైనా ’కీ’ పోగొట్టేదాంక – పోగొట్టినంకగూడ ఆ ’కీ’ పెట్టుకునే సన్నటి చువ్వను తిప్పి మరీ ఆడుతుండె. బొమ్మలు ఖరాబ్ చేసుడు ఎర్కలేదు నాకు. మా అమ్మను అడిగితే ఇప్పటికీ చెప్తది ఈ మాట గర్వంగ.

రిమోట్ కార్ కొనియ్యలేదని గొడవ చేసుడు మాత్రం అట్ల కొన్ని రోజులపాటు నడుస్తుంటది. ఒకరోజు ఇట్లనే నేను ఏడుస్తున్న. అమ్మనేమో.. “సిన్మాకి పోతున్నం. తయారుగారా” అన్నది. నేను కాలే. వాళ్లు తయారయిన్రు.. పోతనే ఉన్నరు. నేను రానని మొండిపట్టుకు పట్టిన. మా అమ్మ రెండు అంటించి “సరే, ఈడ్నే ఉండు, మేం పోతున్నం” అన్నది.

నేను ఊకుంటనా, ఆ సందు మొత్తం ఏడ్సుకుంట ఉరికి అమ్మను అందుకున్న. కాళ్లకు చెప్పులుగూడ లేవు. “నీయమ్మ, నా కాళ్లకి చెప్పులుగూడ లేవు” అని ఏడ్సుకుంటనే సినిమాకి పోయిన – ‘నరసింహ’ ఆ సినిమా పేరు. అంతకుముందు ‘అమ్మోరు’ ఇంకేవో సినిమాలు చూసింది తెల్సుగానీ, నాకు మంచిగ గుర్తున్నదైతే ఈ సిన్మానే.

అప్పట్నించి నేను ఇగ సిన్మాలు చూస్తనే ఉన్న. మా అమ్మ మా నాన్న కంటే ఎక్కువ సినిమా పిచ్చిది. నేను, చిన్నక్క పుట్టకముందలైతే వచ్చే ప్రతి సిన్మా చూసేదంట అమ్మ.

ఆ తర్వాత్తర్వాత మొత్తం బంద్ అయ్యింది. మా అమ్మ టాకీస్‌కి పోయి సిన్మా చూసి ఎన్నేండ్లయ్యిందో!

“రావొచ్చుగానే..” అని నేనెప్పుడన్న అడిగితే –

“టీవీల వస్తదిగారా..” అంటది. “నేను తీస్తేగూడా ఇట్లనే చేస్తవా?” అన్నప్పుడైతే.. “తియ్యరాదురా.. అప్పుడైతే చూద్దాం” అంటది.

మా అమ్మతోటి నేను చూసిన సిన్మాలన్నీ లక్ష్మీ టాకీస్‌ల ఆడినవే. అయితే సిన్మా రిలీజైన వారంలనే కాకుండా.. కొత్త సిన్మా ఇంకొకటి వస్తుంటదిగదా.. దానికి ఒకటి రెండు రోజులు ముందు ఫ్రీగ చూడొచ్చు. టాకీస్‌ల పనిచేసేటోళ్లందరికి ఈ ఆఫర్ ఉంటది.

ఇంటర్వెల్ కాంగనే నేను మా అమ్మ చెయ్యి పట్టుకొని “ఏమన్న తింట” అని అడుగుతుండె. బోండాలో, ఆలు బజ్జీలో కొనిచ్చేది. మా అమ్మ జాకెట్ల పెట్టుకునే పర్సంటే నాకెందుకనో మస్తు ఇష్టం. నాకు ఏ బొమ్మ కావాల్నన్నా, ఏదన్న తినాల్నన్నా ఆ పర్సు తీసిందంటే అయిపోతది. అందుల మా అమ్మ ఎన్ని పైసలు పెట్టుకుంటదో అని ఎప్పుడు అనుకునేటోడ్ని. మమ్మల్ని చూడంగనే క్యాంటీనాయన ఒకట్రెండు బోండాలు ఎక్కువనే ఇచ్చేది.

ఇంటర్వెల్ తర్వాత మళ్ల సిన్మా పడ్డంక ఆ చీకట్ల మమ్ముల వెతుక్కుంట వచ్చి ఒక పాప్‌కార్న్ పొట్లమో ఇంకొకటో చేతుల పెట్టేది మా నాన్న. నేను అప్పట్ల సిన్మాలని సిన్మాలు చూసేకంటే ఈ మధ్యల ఏదన్న తినొచ్చనే పొయ్యేది. సిన్మాకు పోతున్నమంటే వాడకట్టంతా తిరిగి చెప్పేది నేను. మంచిగ కొత్త బట్టలేస్కొని, దువ్వుకొని, పౌడర్ ఏస్కొని తయారైపోతుండె.

ఆ తర్వాత్తర్వాత పెద్దగయితుంటే మా అమ్మ సినిమాలకొచ్చుడు తగ్గింది. నేను మా అన్నతోటి పోవుడు స్టార్టయ్యింది.

మా అన్న నాకంటే పదేండ్లు పెద్దగానీ, మేమిద్దరం దోస్తుల్లెక్కనే ఉంటం. అప్పుడప్పుడే నల్లగొండల కొత్త థియేటర్లు వస్తున్నయి. పాతయి కూలగొట్టి కొత్తయి కడుతున్నరు. ఏసీ అంట, డీటీఎస్ అంట, మహేశ్‌బాబు.. నా సిన్మా పిచ్చి అట్లట్ల పెరుగుతున్నది. మా ఊర్ల అప్పట్ల రిలీజ్ రోజే సిన్మాలేం వచ్చేటివి కావు. ’ఒక్కడు’ సిన్మా వచ్చినప్పటికే ’మహేశ్‌బాబు.. మహేశ్‌బాబు..’ అని కలవరిస్తుండె. ఆ సిన్మా నల్లగొండకి వచ్చిందంటే తీస్కపోయిండు మా అన్న. టికెట్లు అయిపోయినయన్నరు.

బ్లాక్‌ల ఐదు రూపాయల టిక్కెట్ ఇరవైకి అమ్ముతున్నరు. మా అన్న నన్ను టికెట్లు అమ్మెటాయన ముందల నిలబెట్టి – “చిన్నపిల్లగాడే జర” అని అమాయకంగ అడిగితే – ఆయన ఏమనుకున్నడో ఎమ్మటే ఇచ్చిండు టిక్కెట్లు.

ఆ సిన్మా పేర్లు పడుతుంటే ఇనుప కుర్చీల నేను ముందలికి కదిలి నోరెళ్లబెట్టి చూసుడు మా అన్నకి ఇంకా గుర్తు. అప్పటిదాంక లక్ష్మి టాకీస్‌ల వచ్చే సినిమాలే చూసే నేను.. అప్పట్నించి అన్ని టాకీసులల్ల చూసుడు మొదలుపెట్టిన.

కొత్త టాకీస్‌లతోటి లక్ష్మి టాకీస్ పోటీ పడలే. మెల్లగ హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఏసేటోళ్లు. నేను ఆ సిన్మాలకు కూడా పోయి చూసేది. మహేశ్‌బాబు సిన్మాలైతే రెండు టాకీస్‌లల్ల వచ్చేటియి. ఇట్ల పెద్ద సినిమాలు వస్తెనే మా నాన్నసొంటోళ్లకు ఒక ఐదారు టికెట్లు బ్లాక్‌ల అమ్ముకునే చాన్స్ దొరుకుతది. మా నాన్న ఊకుంటడా ఇగ?

ఆయన అట్ల అమ్ముకుందామనేసరికే నేను పోయి “నాన్నా, రెండే టిక్కెట్లే..” అని అడిగేటోడ్ని.

“ఇప్పుడే సూడకుంటే ఏమైతదిరా” అని తిట్టుకుంటనే ఇచ్చేటోడు.

మెయిన్ థియేటర్ల రీల్ ఒక పుండ అయిపోంగనే ఇక్కడ సిన్మా పడ్తది. సిన్మా నడుస్తున్నంతసేపు ఒకళ్లు రీళ్లు పట్టుకొని అటు ఇటు తిరుగుతనే ఉంటరు. ఒక మూడు రోజులు రెండు థియేటర్లల్ల సినిమాలు నడిచేటియి. ఆ మూడు రోజులు పోయినయంటే లక్ష్మీ టాకీస్ అంటే.. మళ్ల ఆ పాతబడ్డ టాకీసే.

అదే టాకీస్‌ల ఒకప్పుడు చిరంజీవి సిన్మా వస్తే.. జనాలు పైసలు ఇసిరేదంట. మా నాన్న షో అంత అయిపోయినంక ఏరుకొస్తే.. ఆ చిల్లర పైసల బిళ్లలు ఒక సంచి నిండుతుండెనంట. చెల్లని బిళ్లలతోటి ఇంట్ల నేను ఆడుకున్నది గుర్తు.

అట్ల నడిచిన అదే లక్ష్మీ, భాస్కర్ టాకీస్‌లు కూలగొట్టి మల్టిప్లెక్స్ కడుతరన్నరు. అంతకాలం అక్కడ పనిచేసిన మా నాన్నకు పనిపోయింది.

చిన్నప్పటిసంది పనితప్ప ఇంకేం తెల్వని మనిషాయె? వాళ్లని వీళ్లని అడిగి న్యూప్రేమ్‌ టాకీస్‌ల నైట్ వాచ్‌మేన్‌గ చేరిండు. పొద్దున్నే లేచి ఏడెనిమిది గంట్లకే తయారైపోయే మా నాన్న.. రాత్రిపూట నిమ్మలంగ తిని ఖాకీ బట్టలేస్కొని పోతుంటే చిత్రంగా ఉండేది నాకు.

సెకండ్ షో అయిపోయేదాంక బానే ఉంటది. అందరు పోయినంక అంత పెద్ద టాకీస్‌ల ఒక్కడే ఉండాల్నంటే భయమయ్యేదంట మా నాన్నకి. ఏవేవో సప్పుళ్లు వినిపించేవంట. ఓ రాత్రి కాడైతే దయ్యాలు పడ్డట్టు కలొచ్చిందంట.

“ఇంకే పని చేస్కొని అయిన బతుకుతగానీ, ఇక్కడ చెయ్య” అని బయటికొచ్చిండు. ఒక నెల జీతం కూడా ఇయ్యలేదు. నేను ఆ జీతం మందం సినిమాలన్న చూద్దామనుకుంటుండెగానీ.. “ఎయ్.. ఆ మేనేజర్‌ కయ్య కయ్య అరుస్తడు” అని వదిలేసుకున్నడు మా నాన్న ఆ పైసల్ని.

న్యూప్రేమ్ టాకీస్‌లనించి బయటపడ్డంక కొన్నిరోజులు ఇంట్లనే ఉన్నడు. ఎవర్నో పట్టుకొని కడిమి హాస్పిటల్ల వాచ్‌మేన్‌గ చేరి ఆ మొన్నటిదాంక పనిచేసిండు.

ఆ మధ్య ఎప్పుడో భాస్కర్, లక్ష్మి టాకీస్ ఉన్న కానించి పోతుంటే – లోపలంతా ఖాళీ జాగల పిచ్చి చెట్లు పెరిగి ఉంటే చూసి, “ఎట్లయిపోయెనాయెరా” అని కండ్లల్ల నీళ్లు పెట్టుకున్నడు మా నాన్న.

ఎందుకో తెల్వదుగానీ – చిన్నప్పుడు రిమోట్‌కార్ కొనియ్యమని ఏడ్చి ఏడ్చి కొన్నాళ్లకు నేను రిమోట్ కార్ మీదనే కోపం తెచ్చుకున్నట్టు – న్యూ ప్రేమ్ టాకీస్ నుంచి బయటికొచ్చినంక.. మా నాన్న సిన్మా టాకీస్ దిక్కు చూసుడే మొత్తంగ బంద్ చేసిండు!

*

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

5 comments

Leave a Reply to Ksairavishankar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Mallikarjun, your stories are bringing back some beautiful memories of my childhood . Thank you 🙏 Please keep writing

  • మాటలు రావటం లేదు…నిజంగా అద్భుతం.
    మరెన్నో రావాలని కోరుకుంటున్నా..
    🙏🏼🙏🏼🙏🏼🌿

  • చిన్నప్పుడు కథ కళ్లకు కట్టినట్లు చెప్పినవు మల్లి..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు