సాహిత్యమూ, సినిమా రెండూ మార్పు తెచ్చేవే: వేణు ఊడుగుల

విరాటపర్వం సినిమా జూన్ 17 తారీఖున దియేటర్లలోకి రానున్నది.  విరాటపర్వం గురించి దర్శకుడు వేణు ఊడుగులతో జిలుకర శ్రీనివాస్ జరిపిన సంభాషణ ఇది. వేణు మొదట కవీ, కథకుడు. సాహిత్య ప్రేమికుడు. తరవాత తెర మీద జన కవిత్వాన్నీ, ప్రజల కథల్నీ చూడాలని కోరుకున్న జనవాది. విరాటపర్వం వేణు కలలకు ఒక దృశ్య అనువాదమే! 

సాహిత్యం, సినిమా రెండు వేర్వేరని భావించే వాళ్లకు మీ సమాధానం?

జ. రెండూ ఒకటే. మానవ సంవేదనలను ప్రతిబింబించి, ఆలోచనలో, వ్యక్తిగత, అలాగే సాంఘిక ప్రవర్తనలో సానుకూలమైన మార్పు తెచ్చే ఏదైనా ఒకటే. రెండీటి మధ్య వైరుధ్యం లేదు.

విరాటపర్వంను ఒక ఎపిక్  క్లాసిక్ సినిమాగా నిలబెట్టేవి ఏవి?

జ. కథ. కథనం. చిత్రణ. ఈ మూడు కలిస్తేనే  క్లాసిక్ నేచర్ వస్తుంది. అయితే కథలో ఎపిక్ నేచర్ లేకపోతే కేవలం కథనం వల్లగానీ లేదా చిత్రణ వల్లగానీ ఎపిక్ క్లాసిక్ నేచర్ రాదు. కేవలం పాత్రలను బాగా రాసుకున్నంత మాత్రాన కూడా రాదు. కథ జరిగే వాతావరణం, వివిధ పాత్రల స్వభావం, కథా కాలగతి అన్నీ సమపాళ్ళలో కుదిరితేనే ఒక ఎపిక్ సినిమా తయారవుతుంది. అలాంటివి అన్నీ ఈ విరాటపర్వం సినిమాలో వున్నాయి.

సినిమాలో విప్లవ కవిత్వం పెట్టాలని ఎందుకనిపించింది? కవిత్వంతో సెల్యూలాయిడ్ ప్రేక్షకులను ఆకట్టుకోగలరా?

జ. కవిత్వం ఈ సినిమాకు బలమైన ఆకర్షణ. విప్లవోద్యమం కవిత్వం, పాట అనే ప్రక్రియల ద్వారా విశేషంగా ప్రజలను ఆకర్షించింది. శ్రీశ్రీ కవిత్వం, గద్దరన్న పాటలు ఎంత బలమైన ప్రభావం వేశాయో తెలిసిందే కదా.  చాలామంది సాయుధ పోరాటంలో వున్న వాళ్లు మంచి కవిత్వం రాశారు. ఉదాహరణకు కౌముది రాసిన ‘చనుబాలధార’. ఈ సినిమాలో రాణా రవన్న పాత్రలో కనిపిస్తారు. రవన్న కవిత్వం సమాజాన్ని మార్చాలని తహతహలాడుతుంది. వెన్నలకు ఆ కవిత్వం అంటే చాలా యిష్టం. కవిత్వం లేకుండా ఈ సినిమా తీయలేం.

ఇదొక సబ్ ఆల్ట్రన్ సినిమా అని మీరు ఒక చోట అన్నారు.  సినిమా రంగంలో సబ్ ఆల్ట్రన్ సబ్జెక్టులకు ఈ మధ్య ఆదరణ పెరిగింది. కారణం ఏమై వుంటుంది?

జ. ఒటిటి ఫోరమ్ వల్ల ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పు వచ్చింది. అన్ని వర్గాల జీవితం, అందులోని అనేక పార్శ్వాలు సినిమాగా మారాయి. అవి సక్క్సెస్ అయ్యాయి. సబ్ ఆల్ట్రన్ సబ్జెక్ట్ లకు మాత్రమే ఇప్పుడు ప్రేక్షకాదరణ వుంది. విరాటపర్వంలో సబ్ ఆల్ట్రన్ లైఫ్ వుంది.

వారియర్ సాంగ్ ఎందుకు?

జ. జిలుకర శ్రీనన్న విద్యార్థి నాయకుడిగా వున్న రోజుల్లో కవిత్వం, పాటలు రాసేవాడు.  ఇప్పుడు ప్రముఖ సాహితీవేత్తలలో తను కూడా ఒకడు.  చాలా సీరియస్ కవి తను. తనను మేయిన్ స్ట్రీమ్ లోకి తీసుకు రావాలని అనుకున్నాను. నా ఫస్ట్ సినిమా నీదినాదీ ఒకే కథలో రెండు పాటలు రాయించాను. అలాగే విరాటపర్వం కథకు అవసరమైన సిచ్యువేషన్ కు పాట రాయాలి.  శ్రీనన్న అయితేనే న్యాయం చేయగలడని అనిపించింది. అందుకే  వారియర్ సాంగ్ ను తన  చేత రాయించాను.  కథను ముందుకు నడిపించే యుద్ద గీతం ఇది. చాలా బాగొచ్చింది. ఇప్పుడు శ్రీనన్న మేయిన్ స్ట్రీమ్ రచయిత గా గుర్తింపు పొందాడు. తను రాసిన పాట సూపర్ హిట్ అయ్యింది.

*

జిలుకర శ్రీనివాస్

1 comment

Leave a Reply to ఆర్ కె Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విరాటపర్వం గురించి సమగ్రమైన సంభాషణ కాకున్నా విప్లవం- ప్రేమల గురించి వేణు ఆంతర్యం అందరికీ తెలిసే నాలుగు ప్రశ్నలు జిలుకర వేసాడు. సినిమా నేపథ్యం అర్థం చేసుకోను ఇది ఉపకరిస్తుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు