రాజకీయశాస్త్రం చదివి విద్యార్థులకు దానినే బోధించి విప్లవ రచయితల సంఘంలో ఏభై ఏళ్లుగా పనిచేస్తున్నారు సి.ఎస్.ఆర్ ప్రసాద్. ప్రపంచ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన ఆలోచన పరుడు. సాహిత్య రచనలో తన అభినివేశం తక్కువ అని నిజాయితీగా చెబుతారు . అయితే సాహిత్య రచనలోని అనేక విషయాల పట్ల లోతైన పరిచయం వుంది. తానొక సాహిత్య చదువరిని మాత్రమే అంటారు. రచనలను తన వివేచనతో లోతుగా అంచనా వేస్తారు . సామాజిక చలనానికి సాహిత్యం చేయదగిన పని ఏమిటో అనేక ఉదాహరణలతో చెబుతారు. ప్రసాద్ రచనా వ్యాసంగంలో సాహిత్యం అంతర్లీనంగా వుండి, రాజకీయ విశ్లేషణ, ప్రపంచ పెనుగులాటపై విశాల దృష్టి ఉంటుంది. కోట్లాది ప్రజల జీవన రాపిడి వెనుక ఉన్న పాలకవర్గ నీతి గురించి ఒక అంచనా ఉంటుంది.
సి .ఎస్ .ఆర్ .ప్రసాద్ జీవితం గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య గడిచింది. విరసం వంటి రచయితల సంస్థలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. ఒక సంస్థ సాహిత్య కార్యాచరణకు అనుగుణంగా ఎలా ఉండాలో అతని వ్యక్తిత్వం చెపుతుంది. నిబద్ధత, క్రమశిక్షణ, ముందు చూపు ఇవన్నీ కలగల్సిన ఆలోచనా జీవి. ఉద్యోగం, అధ్యయనం, రాత, కార్యకర్తత్వం, తొ నకని వ్యక్తిత్వం . నిశ్శబ్ధం గా పనిచేసుకునే స్వభావం.
మాటను ఎలా వాడాలో- ఎంతవరకు మాట్లాడాలో తెలిసిన వ్యక్తి . ఎక్కడ అతి ఉండదు. తత్వ శాస్త్రాన్ని చెబుతున్నా, మార్కిస్ట్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నా, సాధారణ రైతు గురించి మాట్లాడినా ఒకే కొలత ఆమాటలలో ఉంటుంది. తాను అధ్యయనం ద్వారా పొందిన జ్ఞానక్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో చెబుతారు. కష్టతరమైన మార్కిస్ట్ అధ్యయన గ్రంథాల నుండి గ్రహించిన సారాన్ని తేలికయిన సంభాషణ ద్వారా అవగాహనను కలిగిస్తారు. రచయితలు బహువిధాలుగా ఉంటారు. అయితే తనది సాహిత్య, రాజకీయ కార్యాచరణ మాత్రమే . రాజకీయాలు లేని సాహిత్య రచన ఉండదు.
విరసం వంటి సంస్థను బలోపేతం చేయడంలో తన వంతు కృషి వుంది. దాదాపు తెలుగు సమాజంలోని మూడు తరాల రచయితలను అధ్యయనం చేశారు .ప్రపంచ వ్యాప్తంగా రాస్తున్న అనేకమంది బుద్ధి జీవుల రచనలను తెలుగు చేసారు. తన నిరంతర అధ్యయనంలో సమాజ జీవన సంక్షోభాన్ని సాహిత్యం విడమర్చి చెప్పగలుగుతుందనే విశ్వాసి. కవిత్వ, కథానిక వెనుక ఉన్న రచనా క్రమాన్ని విశదీకరించే ఉపకరణాలు న్నాయి. సాహిత్య రచన మానవ చరిత్ర. ఈ చరిత్ర వెనుక సృజనాత్మక రచయితల మాత్రమే ఉన్నారు అనే భావన సి.ఎస్. ఆర్ ది.తన రాజకీయ అవగాహనతో సాహిత్యాన్ని అంచనా వేస్తారు. అయితే అతని గమనం రాజకీయ, సాహిత్య భావజాలం.
అనేక నిర్బంధాల మధ్య అనుభవజ్ఞుడైన సి.ఎస్. ఆర్. ప్రసాద్ సంస్థ బాధ్యతలను నిర్వహించారు. విప్లవోద్యమం లేదా, సామాజిక ఉద్యమాలు ప్రధానంగా తెలుగు సమాజాన్ని చైతన్యీకరించాయని ఆయన నమ్మిక. కారంచేడు, చుండూరు ఘటనల అనంతరం వికసించిన దళితోద్యమాలను దగ్గరగా చూసారు. కారంచేడును విప్లవోద్యమం ఎలా స్వీకరించిందో, ఆ తర్వాత తెలుగు సమాజంలో వచ్చిన చైతన్యం పట్ల ఒక అంచనా ఉంది. విప్లవోద్యమం వెలుగులోనే కుల -వర్గ సమస్యను పరిష్కరించగలమని హేతువు సి .ఎస్ ఆర్ ది. రెండు వాదాల మధ్య జరిగిన చర్చలలో మిత్ర వైరుధ్యమే గాని ,శత్రు వైరుధ్యానికి అవకాశం లేదనే అభిప్రాయం .భారత సమాజాన్ని అర్థం చేసుకుని ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి సామాజిక ఉద్యమ ప్రభావాలను జాగ్ర త్తగా అంచనా వేయాలని అంటారు. ఏవిషయం లోనైనా అవగాహనతోనే సంభాషణ కొనసాగిస్తారు..
మారుతున్న ప్రపంచం యుద్ధం మధ్య తన గమనాన్ని వెతుకుతుంది. మూడు దశాబ్దాలుగా భారత రాజకీయాలకు హిందుత్వం ఒక సాధనమయింది. విశాల భావనా పరిధి కుచించుకు పోతుంది . సమస్య జటి లమౌతుంది. దీనికి బీజాలు పాలనాక్షేత్రంలోనే ఉన్నాయనే గ్రహింపు సి. ఎస్ .ఆర్ ది రాజ్యాంగం అది హామీ పడిన వాస్తవాన్ని గ్రహించకుండా పాలనా వ్యవస్థ రాజ్యాంగ రచనకు భిన్నంగా వ్యవరిస్తుందనే ఆగ్రహం ఉండనే ఉన్నది. అధికార మార్పిడి అనంతర కాలం, దీనిని రుజువు చేసిందని అంటారు. భారతదేశం ప్రతినిత్యం ఘర్షణ అనుభవిస్తున్నది. ఈఘర్షణ వర్తమానానికి సంబంధించింది ఎంత మాత్రం కాదు .గత కాలంలోనే ఈసంక్షుభిత సమయానికి పునాది ఏర్పడింది. ఈ భావజాల సంఘర్షణ మనుషులు ఆశించినది కాదు. సమాజ తలంలోని ఆర్థిక వ్యత్యాసాలు సరి చేయబడలేదు . పరిష్కారం ఆవల ఉండగానే సాంస్కృతిక రంగంలో విభజిత పోకడ వచ్చింది. ఈ వైరుధ్యం భారత సమాజ భిన్నత్వాన్ని ఎంతో కొంత మేర డిస్టర్బ్ చేసింది.
ఎక్కడ మొదలైనామో ఆ తొలి అడుగు దగ్గరే ఉన్న అసమానతలు అలానే ఉన్నాయి. అన్నిటికంటే భారత సమాజం ముందు నూతన సవాళ్లు ముందుకు వచ్చాయి. దీనిని సరి చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా యువతరంది . భిన్న దారులను సరిచేయడం లేదా, సమతుల్యతను కాపాడటం యువత కర్తవ్యం.ఇదొక సమాజ శాస్త్రవేత్త అంతరంగ గమనం. ఈ గమనం కేవలం సి .ఎస్ .ఆర్. ప్రసాద్ వంటి వారిది మాత్రమే కాదు. అందరిని కలవర పరిచే అంశం.
చాలామంది సి .ఎస్ ఆర్.ప్రసాద్ దగ్గర చదువుకున్న విద్యార్థులు సాహిత్య కళా రంగాలలో పనిచేసేవారే. తన మజిలీ సమాజంలోని వైరుధ్యాల పరిష్కారంలో దాగి ఉందనే అభిప్రాయం . ఎక్కడా పేచీ లేదు. తన దారిని విడిచిపెట్టనూలేదు.
భావజాలాలైనా, సంస్థలైన సమాజంలో ఉనికిలో ఉండడానికి కారణం ఆ సమాజపు భౌతిక పరిస్థితి. అంటే వస్తూత్పత్తీ, పంపిణీ వినిమయాల మధ్య ఉండే అన్యోన్య సంబంధమే. ఈ సంబంధాలే అంతిమంగా మానవ సంబంధాలును నిర్దే సిస్తాయి. అలాంటి మానవ సంబంధాలలో ఉన్న అసమానత్వాన్ని ఆధి పత్యాన్ని, హింసను విమర్శనాత్మకంగా వాస్తవంగా ప్రతిబింబిస్తూ రచయితలు రచనలు చేస్తారు. అది సమాజం వారికిచ్చిన బాధ్యత. సమాజం పట్ల వాళ్ల ఆవాహన చేసుకున్నారు బాధ్యత.
సి. ఎస్ .ఆర్ . తన రచనా వ్యాసాంగం గురించి వినయంగానే చెబుతారు రచయితలుగా రూపొందే క్రమంలో సమాజపు అసమాన పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సృజనాత్మకంగా ఆలోచింప జేయడం. రచయితలకు సమాజం పట్ల బాధ్యత ఉందనే విషయాన్ని పునఃశ్చరణ చేస్తారు.ఘర్షణ, ఆందోళన, అభద్రతను రచయితలు మాత్రమే సరిచేయగలరు.
సి .ఎస్. ఆర్. విషయ పరి జ్ఞానం కలిగిన వ్యాసకర్త. తన ప్రసంగాలలోని సరళత శ్రోతకు చేరుతుంది.
రాజకీయపరమైన రచనలుపై మొగ్గు చూపుతారు. సమకాలీన విశ్లేషణలను, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన రచనలను తన అధ్యయనశీలతతో ఎంచుకొని తెలుగు సమాజానికి అందిస్తారు. ఆయన రచనా కాలంలో మూడు వ్యాస సంపుటాలు వచ్చాయి. మతం- ఫాసిజం, పడగనీడలో ప్రపంచం ఇటీవల వచ్చిన రచనలు. భారతదేశపు భౌగోళికతలోని సంవేదనలను రాజకీయంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. కాలానికి అనుగుణంగా వస్తున్న ఇంగ్లిష్ రచనలను తెలుగు చేసే పని నిరంతర అభ్యాసంలో భాగం. ఎప్పటికప్పుడు తనను, తాను ఒక పాఠకుడిగా నిలబెట్టుకుంటారు.
గుంటూరులో విశ్రాంత జీవితం గడుపుతున్న సి. ఎస్ .ఆర్. ప్రసాద్. నిత్య చలనంలో ఉంటూనే.. సమాజ చలనాలని రాజకీయార్థిక, సంస్కృతిక కోణంలో తన ఆలోచనా రీతులను నమోదు చేస్తున్నారు.
ఇంత కాలం పాటు విరసం లాంటి అపురూపమైన సంస్థలో కొన సాగడం కంటే ఏ వ్యక్తి కయినా ఆనంద దాయకమైంది ఏముంటుంది?!
*
Add comment