డాక్టర్ జి రత్నాకర్ కవిత్వం ‘వర్ణమాల’ ఆగస్టు 15, 2019లో వచ్చింది. 2019లో జరిగినటువంటి సంఘటనలు, పరిస్థితులు, ఆ పరిస్థితుల ప్రతిఫలనాలు ఈ వర్ణమాల కవిత్వంలో ప్రాణం పోసుకున్నాయి. ఈనాటికే అంతకుముందు ఉవ్వెత్తున ఎగిసిన దళిత కవిత్వం,అస్తిత్వ వాద కవిత్వాలు తగ్గుముఖం పట్టాయి. అంబేద్కర్, బుద్ధుడు సిద్ధాంతాల ప్రాతిపదికన ఏర్పడిన దళిత కవిత్వం పరిస్థితుల పెనుగాలులకు వంగిందే గాని విరిగిపోలేదని, ఆ విషయం నిరూపిస్తూ రత్నాకర్ రాసిన కవిత్వం నిదర్శనగా, ధీటుగా నిలబడింది. ఆయన తన కవిత్వంలో ప్రస్తావించిన ప్రతి అంశం నేటికీ ప్రాసంగీకత కోల్పోకుండా నిలబడటం విశేషము, విషాదము కూడా..!
మద్దూరు నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, కలేకూరి ప్రసాదుల కవిత్వం మనువాద రాజ్యానికి ఎదురు రొమ్ము చూపించి కలబడేదైతే, రత్నాకర్ కవిత్వం గెరిల్లా యుద్ధం.తన ప్రతి కవిత లోను తన పుట్టిన ఊరు జ్ఞాపకాలు, తను పెరిగివచ్చిన పరిస్థితులు, తను నమ్మిన సిద్ధాంతాలు, తను తన జాతి నడవాల్సిన మార్గాలు ఒక వలబోత లాగా కలబోసుకుంటాడు. తను ఎదిగి వచ్చిన క్రమాన్ని గుర్తు చేసుకుంటానే, తన మూలాలను ఎక్కడా మర్చిపోడు. అతనికి తన పల్లె ఒక అమ్మ..నాన్న కూడా! ప్రతి కవి తన పుట్టిన ఊరు గురించి పలవరించాడు గానీ, రత్నాకర్ నాలుగు అడుగులు ముందుకేసి తన పల్లెలో తన జనాలు ఆధిపత్య భావజాలం మాయలో ఎట్టా కునారిల్లుతున్నారో, కూర్చున్న కొమ్మ నరుక్కుంటూ, ఎట్టా చుట్ట చుట్టుకుపోతున్నారోనని మనాదితో దిగాలు కవిత్వం అవుతాడు. పల్లె పరాయికరణ చెందటం పట్ల దుఃఖంతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆశ్చర్యంగా ఈ సంపుటిలో ప్రతి కవితలలో తన పల్లె మూలాలనుంచో, తన సిద్ధాంత మూలాల నుంచో పుట్టుకొచ్చి మాట్లాడుతుంది. చాలా కవితలు పెరిదేపి పల్లె తల్లి వేర్లలో పొదుపుకుని, ఎక్కడ తిరిగినా, ఏమి మాట్లాడినా తన తల్లి పేగును తడుముకోవటం కనిపిస్తుంది. ఎదిగి వచ్చిన తన క్రమాన్ని మర్చిపోకపోవడం కనిపిస్తుంది. ఆనంద సందోహం అనే ఈ కవిత చూడండి:
‘పెరిదేపి మాదిగపల్లె
బడి కొట్టాం నుండి
మొదలైన నాటి నా పయనం
సెంట్రల్ యూనివర్సిటీ చేరింది.
అది నేడు ఆజాదు యూనివర్సిటీ
ఆచార్య పదవికి మారింది.’ అని తలచుకోవటం పైకి వచ్చిన అందరూ తరచుగా చేసే పనేం కాదు.
నాన్న నాగయ్య పంతులు జ్ఞాపకాలు పలవరిస్తూ రాసినటువంటి కదిలించే కవిత ‘నాన్న పిలుపు’. నాన్న ఇక లేడని, ఆయన ఇక కన్నీటి బొట్ల కథేనని తెలిసి, నాన్న చేతికర్ర కావాలనుకున్న కొడుకు జవజారి ఇలా అంటున్నాడు.
‘నేనేడకి ఎల్ల లేదురా
నీతోనే నీ నీడలానే
నువ్వు రాసే అక్షరం లోనే
నువ్వు చెప్పే పాఠంలో
నువ్వు వేసే నాటకంలో
నీ ఆలోచనలో ఉన్నాను రా
అంటూ ఆకశాన
అలా..అలా..నాన్న..’
‘అచ్చరం కోసం..’అనే కవిత అచ్చంగా హాస్టల్లో చదువుకునే పేద దళిత పిల్లల జీవన చిత్రాన్ని పచ్చిగా మన ముందు నిలబెడుతుంది. నిజానికి ఎస్సీ హాస్టల్స్ గురించిన తెలిసిన వారికి ఎవరికైనా ఇది పచ్చి నిజమని తెలుస్తుంది.
‘చదువుకునే పెతి పిల్లోడు
ఓ అంబేద్కర్ అవుతాడేమోని
మనువాద రాజ్యం
హాస్టల్స్ మూసేస్తుంది.
పిల్లలు నోట్లో మన్ను కొడుతుంది.’ ఇదే విషయం మరింత లోతుగా, నిలువెత్తు పచ్చిగాయంగా మోహన్ తలారి రాసిన ‘హాస్టల్ లైఫ్’ అనే కథలు మరింత విడమర్చి చెబుతాయి. అంతేకాకుండా హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు కానీ, హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ తామొక ప్రయోజన పూర్వక ఆత్మగౌరవ పోరాటాన్ని అవలంబించాలని,
చదువుకోవడం తమ రాజ్యాంగ హక్కుని తెలుసుకోమని ఈ కవిత చెబుతుంది.నాలుగు మెట్లు పైకి ఎక్కి అంది వచ్చినవాడు, కింది మెట్టు మీద ఉన్న వాడికి చేయందించడం గురించి కూడా మాట్లాడుతుంది. విద్యార్థి దశలోనే ఈ స్పృహ కలిగించడం ఒక బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడి కర్తవ్యం కూడా.
‘కూటికోసం,
గుడ్డ కోసమే కాదు సోదరా
అచ్చరం కోసం,
ఆత్మగౌరవం కోసం కూడా
నేడు పోరాట బావుటాలౌదాం.’ అని అనడమే దీనికి నిదర్శనం.
నేడు దేశంలోకి దిగుమతి అవుతున్న మత విద్వేషాల వల్ల బలవుతున్నది మొదట దళిత బడుగు వర్గాలే. అది పల్లె అయినా నగరమైన మహానగరమైన ఇదే తంతు..
‘కషాయానికి కళ్ళు నెత్తికెక్కినప్పుడల్లా
గర్భగుడిలోకి పారేయబడ్డ
ఆవు కళేబరం అవుతుంది.
పాతబస్తీ కొట్లాటవుతుంది.
మతం పేరిట జరుగుతున్న
అమానవీయ మారణ హోమంలో
బడుగుల బతుకులు బుగ్గవుతున్నాయి.
పోలీసుల పహారాల నడుమ
జీవన దృశ్యం చిధ్రమవుతుంది.’ జీవన దృశ్యం కవితలో వాస్తవ స్థితిని కళ్ళకి కడతాడు.
ఆంధ్ర ప్రదేశ్లో ఎస్సి రిజర్వేషన్స్ అన్ని కూడా పెద్ద మొత్తంలో ఒక సామాజిక వర్గం అనుభవిస్తుందని, మిగతా సామాజిక వర్గాలైన మాదిగ మాదిగ ఉప కులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సామజిక అంశాలలో స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా, అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులం మాదిగ కులం అని చెప్తూ, మాకు కూడా అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు కావాలంటూ నినదిస్తూ ముందుకు రావడం జరిగింది.అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం పంపిణి విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం, అనతికాలం లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమ సంస్థగా ఎదిగి, అణగారిన కులాల గొంతుకగా నిలిచింది. ఒక ప్రవాహంగా ప్రజాక్షేత్రంలో దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిల్చింది.దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త ప్రశ్నలు, పోరాట రూపాలు, విలువలు అప్పటికే నిర్మాణమైన దళిత ఉద్యమ అవగాహనా పరిధిని తాత్వికంగా విస్తృత పరిచింది.మొత్తం పైన దేశంలో సరికొత్త చర్చను పెట్టి కులనిర్ములన, ఫులే-అంబేద్కర్ ఉద్యమాలు నేడు దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన ఎస్సి కులాల అనుభవం, హక్కులు, వాటాల పునాదిగా నిర్మాణం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.
అయితే అవసరాన్ని అవకాశంగా తీసుకునే అధిపత్య రాజకీయాలు ఈ ఉద్యమాన్ని కూడా తమ రాజకీయాలకు అనుగుణంగా ఉపయోగించుకున్నాయి. మాలా మాదిగల మధ్య ఐక్యతను దెబ్బతీసి, వారి మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. నాయకులు కూడా తమ జాతికి దక్కాల్సిన సామాజిక న్యాయం గురించి కాకుండా, అగ్రకుల రాజకీయ పక్షాల పంచన చేరి, దీన్ని ఒక ప్రహసనంగా మార్చి వేశారు. కానీ, సామాజిక బాధ్యత కలిగిన దళిత కవులు ఈ విషయంలో ఉద్యమాన్ని, ఉద్యమం ఇస్తున్న స్ఫూర్తిని ఆలంబనగా తీసుకొని ఒక మార్గ నిర్దేశం చేశారు. అన్నదమ్ముల మధ్య కొట్లాట జాతికి మంచిది కాదని, న్యాయంగా ఎవరికి దక్కాల్సిన వాటా వారు కూర్చుని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని తమ కవిత్వంలో సూచించారు. మద్దూరు నగేష్ బాబు, పైడి తెరేష్ బాబు, కలేకూరి ప్రసాద్, కృపాకర్ లాంటివాళ్లు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కవిత్వ పరిష్కారాలు సూచించారు. రత్నాకర్ కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా స్పందించాడు.
‘ఆ రథాన్ని..ముందుకు లాగుదాం!’ కవితలో ఈ విషయాన్ని హెచ్చరిస్తూ..
‘మాల చెన్నయ్యలుగా
మాదిగ మాతయ్యలుగా విడిపోయి
అగ్రహారపు కుంపట్లలో
రాలి పడొద్దు’ అని మెలుకువ చెబుతూ..’ ప్రజాస్వామిక సూత్రం’ అనే కవితలో
‘ పోరాటంలో మీ నా జనం ఎంతో
లెక్కలేసుకొని వాటాలు పంచుకుందాం.
దీనికోసం తలలు తెగాల్సిన అవసరం లేదు.
చావు భాజాలు మోగాల్సిన అవసరం
అంతకన్నా లేదు.
అందుకే మనం కలిసి మాట్లాడుకుందాం
అన్నదమ్ములుగా వంతులేసుకుని
విడిపోదాం.’ ఈ విధంగా మాల మాదిగల మధ్య తలెత్తిన వాటాల సమస్యను సులక సూత్రంగా పరిష్కరించుకుందామని చెబుతున్నాడు. విడిపోక తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు ‘ విభజన ఓ ప్రజాస్వామ్యక
సూత్రం’ అని కవి అనడం ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే అవుతుంది. ఈ విషయంలో కవులు సంకుచిత భావంతో కాకుండా విశాల హృదయంతో ఆలోచించాలని కవి కోరుకుంటున్నాడు.
తెలంగాణ వచ్చిన తర్వాత దళిత బహుజనల కష్టాలన్నీ తొలగిపోతాయని అనుకున్న ఆశలన్నీ అడియాసలు అయినాయి. పెత్తందారులే రాజాధికారం చేపట్టి,భూస్వాములకే కొమ్ముగాసారు.దళిత బహుజనుల పై దాడులు ఆగకపోగా అవి ఇంకా పెరిగాయి.ఒక పెత్తందారు నుంచి మరొక పెత్తందారికి అధికారి మార్పిడి జరిగింది తప్ప బడుగుల జీవితాల్లో మార్పులు ఏమీ లేవు.ఈ విషయాన్ని కూడా కవి పట్టించుకున్నాడు. తన దళితుల పక్షాన తెలంగాణ రాజ్యాన్ని కూడా నిగ్గదీసి అడుగుతున్నాడు. కవులందరూ ప్రశ్నించడం మరిచిపోయి రాజ్యం పంచన సేదతీరుతున్నప్పుడు నికార్సయిన కవి మాత్రమే ఇలా ప్రశ్నలు వేయగలుగుతాడు.
‘నెత్తుటి వేలిముద్రలు’ అనే కవితలో
‘ఎగిరిన జెండాలో
నా రంగు ఎందుకు వెలిసిపోయిందని
కురిసిన వానలో
నా కన్నీటి చుక్కలెక్కడని
పారిన నెత్తుటిలో నా వేలిముద్రలెక్కడని ‘ అడుగడుగునా అడుగుతూ ఊరుకోలేదు. అంబేద్కర్ చెప్పిన’ Political power is the master key’ అనే మాటల్ని తన మాటల్లో ఇలా చెప్తున్నాడు.
‘బహుజన వాదంతో
మనం ఎగసిపడే అలలైన నాడు
నిద్ర నటిస్తున్న సంద్రం
ఆ మాటునున్న రాజకీరీటాలు
నెత్తురు కక్కుకుంటూ మన
పల్లెల ముంగిట మోకరిల్లక తప్పదు.’ ఇక్కడ ‘సంద్రం’ అనే మాటని రాజ్యానికి ప్రతీకగా వాడుతున్నాడు. ఇది మనకి పైడి తెరేష్ బాబు హిందుత్వ రాజ్యాన్ని ‘హిందూ మహాసముద్రం’ అని ప్రతీకించినట్టుగా కనపడుతుంది. ఈ ప్రతీక ఎప్పటికైనా రాజ్యానికి సరిపోయిన ప్రతీకే. చురకపెట్టే ప్రతీకే.
రత్నా
ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారు ఈ పుస్తకానికి రాసిన తన సుదీర్ఘ ముందుమాటలో ఇలా రాస్తున్నారు.” ఆ జాతి దళిత జాతి. ఆ జాతి జీవితాన్ని లోతుగా దర్శించడంలో కవి జీ.వి. రత్నాకర్ కి ఒక తాత్వికత ఉంది. ఆ తాత్వికత కవికి గొప్ప సంస్కారాన్ని ఇచ్చింది. ఆ సంస్కారము కవికి ఒక చూపునిచ్చింది. ఆ చూపులో ఎక్స్ రే కిరణాలు ఉన్నాయి. ఆ చూపులో కన్నీళ్లు ఉన్నాయి. ఆ చూపులో డైనమెట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి జీ.వి. రత్నాకర్ కి ఒక గొంతు ఇచ్చాయి. అది కవి గొంతు. ఆ గొంతులో స్పష్టత ఉంది. సూటిదనం ఉంది. బెరుకులేని తనం ఉంది. అమ్మ పిలుపు ఉంది. నాన్న పలుకు ఉంది. ఇవన్నీ కలబోసి ఒక క్రమంలో కూర్చితే ఈ ‘వర్ణమాల’ అయింది”. ఈ మాటలు అక్షర సత్యాలు. రత్నాకర్ కవిత్వాన్ని సరిగ్గా అంచనా వేసిన తూనిక రాళ్లు.
అయితే సామాజిక పారమార్థిక సిద్ధాంతాలని కవిత్వంలో ప్రవేశపెట్టేటప్పుడు, ఆ కవిత్వం కొంత నినాదప్రాయంగాను, కొంత వచనంగానూ అనివార్యంగా వస్తుంది. రత్నాకర్ కవిత్వంలో కూడా అది జరిగింది. కొన్ని కవితల్లో చెప్పదలుచుకున్న భావాలు పునరావృతం అయ్యాయి. వస్తువు పట్ల శ్రద్ధ ఉన్నా శైలి,వ్యక్తికరణలో నవ్యత లేకపోవడం ఒక లోపం. కానీ రత్నాకర్ తన పల్లె భాషను యాసను అతి సహజంగా కవిత్వంలో ఉపయోగించడం వల్ల ఆ లోటు చాలా తక్కువగా తెలుస్తుంది. రాజ్యాన్ని, డొల్ల రాజకీయ ఉద్యమాలని ప్రశ్నించే క్రమంలో అక్కడక్కడ ఉపయోగించిన వ్యంగ్యం మద్దూరు ని, తెరేష్ ని గుర్తు చేస్తుంది. సంఘటనాత్మక కవిత్వం చెప్పేటప్పుడు ఒక ధారలాగా సాగే ఆ ప్రకాశం జిల్లా యాసతో కూడిన భాష ఈ కవిత్వానికి ఒక సుగుణమనే చెప్పాలి. సంక్లిష్ట వాక్యాలు, అమూర్త చిత్రాలు ఈ కవిత్వంలో కనిపించవు. సామాన్య పాఠకునికి కూడా ఈ కవిత్వం హాయిగా అర్థం అవుతుంది. శిష్ట వ్యవహారంలో కాకుండా, కష్టజీవుల పక్షాన రాసిన కవిత్వం ఇది. వర్ణమాల ప్రతి కవి తిరగేయాల్సిన పుస్తకం.
2019 తర్వాత కూడా దళిత బహుజనుల జీవితాల్లో ఏ మార్పు లేదు. ఏ ప్రభుత్వాలు కూడా దళిత జనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు.ఇంకా చెప్పాలంటే దళితుల మీద దాడులు, వివక్షలు ఎక్కువయ్యాయి.మారిన కాల పరిస్థితులు దృష్ట్యా అప్పటికంటే ఇప్పుడు సమస్యలు జటిలమయ్యాయి. దళిత బహుజన మైనారిటీ గిరిజన ఆదివాసీలు తమ సమస్యల పట్ల మరింత జాగరుకతగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. రూపం మార్చుకున్న వివక్షతను, అణిచివేతను, రాజకీయ వెనుకబాటుతనాన్ని, పెత్తందారుల ఎత్తుగడలను, ఆగడాలను అర్థం చేసుకొని బహుజన బడుగు వర్గాలు ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు వారిలో అవసరమైన చైతన్యాన్ని సామాజిక బాధ్యత గల కవులు కలిగించాలి. అందుకు రత్నాకర్ లాంటి కవులు గట్టి పూనికతో మళ్ళీ నడుం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారతదే
పుస్తక లభ్యత : +91 70135 07228
మంచి కవనానికి జయహోలు
సమీక్ష బావుంది
వర్ణమాల సారాన్ని
పిండి విశ్లేషణ చేసిన
మితృడు సోదరుడు
శ్రీనివాస్ గౌడ్ కి
ప్రచురించిన అఫ్సర్ సాబ్ కి
జైభీమ్ లు
వర్ణమాల సారాన్ని పిండి విశ్లేషణ చేసిన మిత్రులు సోదరుడు శ్రీనివాస్ గౌడ్ కి
ప్రచురించిన అఫ్సర్ సాబ్ కి జైభీమ్ లు
వర్ణమాల కవిత్వం పై సమీక్ష రాయటం ఒక సాహసం అందులో శ్రీనివాస్ గౌడ్ బీసీ కవులలో మొగి తాత్వికత కల్గిన అరుదైన కవి ఇతడు మద్దూరి నగేష్ బాబు చెక్కిన శిల్పి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పగలరు వర్ణమాల అనగానే మాల కులం దగ్గర ఆపి చూపే లోకంలో జి వి రత్నాకర్ విశాల దృక్పధం ఉన్న కవిగా పరిచయం చేయటం నచ్చింది
Thanks ఎల్లన్న
సోదరా మెట్టా నాగేశ్వరరావు
మీకు జైభీమ్ లు