1) నాకు తెలిసినంత వరకు ఒక సంవత్సరకాలంగా ఈ గడ్డిపోచలను రాస్తూ వచ్చారు. మొట్టమొదటి సారి ఇలా రాయాలని ఎందుకు అనిపించింది?
మూడేళ్లపాటు రాసానివి. ఒక్కోదానికి మధ్య చాలా గాప్ వచ్చేది. ఒకోసారి వెంటవెంటనే రాసినవి ఉన్నాయి. చాన్నాళ్లుగా ఒక ప్రశ్న ఉండేది, మెటఫర్లు లేకుండా రాయలేనా అని. ప్రతిదీ వేరే దేనితోనో ఉపామానాం గా చేసి చెప్పడం మానేసి దేన్ని దానిలాగానే దానికున్న అందాన్నో ప్రత్యేకతనో అక్షరాల్లో స్ఫూరింపజేయ్యలేనా అని. ఇంకో అసౌకర్యం ఏంటంటే కవిత్వం లో ఎక్కువగా సముద్రం, ఆకాశం, పువ్వులు, వెన్నెల ఇవి వాడడం అలవాటు నాకు. అసలు మన రోజువారీ జీవితంలో వాటిని చూసేది, వాటితో గడిపి గుర్తుచేసుకునేది చాలా తక్కువ. మరెందుకు అలా కండిషన్ అయిపోయాను అని చిరాకొచ్చేది. అంటే మనం నిజంగా అనుభవించేవి, ఎక్కువగా చూసేవి, దగ్గరగా ఉండేవి రాయట్లేదనిపించింది. అదొక ఎక్సర్సైజ్ లాగా మెదలుపెట్టాను. అతిశయోక్తులు, ప్రతీకలు, పాత అలంకారాలు వీటినుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పను కానీ ప్రయత్నం చేసాను. కొత్త అలంకారాల కోసం కాస్త వెతికాను. కొన్ని దొరికాయి కూడా.
2) మీరు వీటిని ‘అడ్డదిడ్డంగా నేలని ఆక్రమించుకునే గడ్డిపోచలతో’ పోలుస్తారు. మరొక దగ్గర కెమెరా లెన్స్ అప్రయత్నంగా దృశ్యాలను రికార్డ్ చేయటం లాంటిదనే మరో ఉపమానం ఇస్తారు. దీని గురించి ఇంకొంచం చెప్పండి.
ఒక ఇంటెన్స్ ఎమోషన్ ని బయటపెట్టడానికో, ఉపశమింపజేయ్యడానికో చాలా సార్లు రాయడం జరుగుతుంది. అలాటి ప్రత్యేకమైన వ్యక్తిగత ప్రేరణ ఏం లేని (ఉన్నా అది డామినేట్ చెయ్యని), వాటికంటూ ఒక తాత్విక, కవితాత్మక ప్రత్యేకత లేని రోజువారీ వస్తువులు, మాటలు, దృశ్యాలు వీటిని పోయెటిక్ మానిప్యు లేషన్ లేకుండా ఉన్నదున్నట్టు రాయడం వల్ల గడ్డిపోచలు అని పిలిచాను. కాకపోతే అక్కడ ఉన్నది ఏంటి, ఉన్నవాటిల్లో నేను ఏం చూడదల్చుకున్నాను అనేది మళ్లీ నా తత్వం మీద, టేస్ట్ మీదా ఆధారపడి ఉంటుంది.
3) “మాటలు కథలు చెప్పటం – కథలు మాటలు చెప్పటం” అనే ఇంటర్ -ప్లేను అనుభవించాలన్న మీ నిరంతర వ్యసనం గురించి ఇంకొంచం చెప్పండి?
ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజూ కార్ లో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఊరికే అటూ ఇటూ చూస్తే రోడ్డు పక్కన ఇద్దరు నడివయసు మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకాయన చాలా యానిమేటెడ్ గా, ఆవేశంగా తలెగరేస్తూ, చేతులూపుతూ, ఎదుటి మనిషి కాలర్ పట్టుకుని ఊపుతూ ఏదో పెద్దగా అంటున్నాడు. ఆ రెండో మనిషి మాత్రం చాలా కూల్ గా తలపంకిస్తూ, అవునన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఆయనలా ఊగిపోతూ తిడుతుంటే ఇతను నవ్వుతూ వింటున్నాడేంటి అని పక్కన ఉన్న మా నాన్నని అడిగాను. ‘అతను గొడవ పడట్లేదు. వేరే ఎవరితోనో తనకు జరిగిన గొడవని ఫ్రెండ్ కి ఆవేశంగా ఇలా జరిగిందని చెప్తూ ఉండొచ్చు.” అని చెప్పాడు నాన్న. అలాగ మనుషులు జంటలుగా, గుంపులుగా రకరకాల మూడ్స్ లో చిత్రమైన హావభావాలతో మాట్లాడుకుంటూ ఉండటం చాలా ఇంటెరెస్టింగ్ గా ఉంటుంది. ఒకే విషయాన్ని వేరే ప్రాంతీయ, వ్యక్తిగత యాసల్లో వినడం కూడా ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు “బోర విరుచుకు నడిచాడు. మొహం ఇంత లావున పెట్టుకుంది, నంగిగా మాట్లాడాడు.” ఇలాంటి వర్ణనలు చేస్తుంటారు. అలా మనుషుల బాడీ లాంగ్వేజ్, వాళ్ల మాటల్లోని ఇంటొనేషన్స్, మాడ్యులేషన్స్ వెనక ఫీలింగ్స్ ఇవన్నీ డీకోడ్ చేసుకుంటూ ఉండటం ఒక సరదా. అది చాలా సార్లు అసంకల్పితంగా జరిగిపోతుంది. తాజాగా ఇవ్వాళ రోడ్డు మీద ఒక టీకొట్టు బయట కొందరు మనుషుల్ని చూశాను. వాళ్ళందరు కుడిచేతి వేళ్లలో మధ్యలో మూడువేళ్లతో గాజు టీ గ్లాసులు పట్టుకుని అటూఇటూ రెండు వేళ్ళు గాల్లో ఓపెన్ గా వదిలేసి మెల్లగా టీ సిప్ చెయ్యడం చూస్తే భలే బ్యూటిఫుల్ గా అనిపించింది. అట్లాగే కథలు మాటలు చెప్పడం గురించి- ఏదైనా ఒక నేరేటివ్ చదివేటప్పుడో, వినేటప్పుడో దానిలోని విషయం పట్ల మనకుండే శ్రద్ధ ఒకటి, ఆ నేరేటివ్ లో వాడబడ్డ మాటలు, పదాలు కొన్ని మన మనసులో రిజిస్టర్ అవడం ఇంకోటి. నాకు తెలిసిన ఒకావిడ “రేపు నేను రాలేదు.” అంటుంది. నా ఫ్రెండ్ ఒకతను “ఆమె గురించి మాట్లాడాను” అనడానికి “ఆమె కోసం మాట్లాడాను.” అంటాడు. మా నాన్నయితే రోజుకోసారైనా “సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే చెప్పుకోవాలి.” అంటాడు. మా అమ్మాయికేమో ‘సందర్భం’ అనే మాట వినగానే ఎందుకో తెలీని చికాకు. ఇట్లా నెరేటివ్ తో మాటల ఇంటర్ ప్లే గమ్మత్తుగా అనిపిస్తుంది.
4) ఈ గడ్డిపోచలు ఎంతవరకు మీ వ్యక్తిగతం/’subjectivity’ ని ప్రతిబింబిస్తాయి అనుకోవచ్చు?
సబ్జెక్టివ్ కానిదంటూ ఏమీ లేదు. నాకు నేనుగా అనుభవించిందో, చూసిందో, నాకు చాలా దగ్గరగా చూడ్డానికి వీలున్నవో మాత్రమే వీటిల్లో రాశాను. పాలు తాగని నల్ల పిల్లిపిల్ల మా టెర్రెస్ మీదే ఉండేది. భయమనే భావన నాకు చాలా గాఢంగా కలిగినప్పుడే భయం గురించి రాశాను. సముద్రతీరాల మీద కాలినడకన ఒకవారం రోజులు కేంపింగ్ కి వెళ్ళినప్పుడే సముద్రం గురించి రాశాను. నాకు తెలీనిది, ఊహించి మాత్రమే రాసింది దాదాపుగా ఏం లేదు ఈ పుస్తకంలో.
5) ఈ గడ్డిపోచలు రాయబడిన ప్రాంతం/ప్రాంతాల గురించి, వ్యక్తుల గురించి ఏమైనా…
ఎక్కువగా ఇంటి వరండాలు, టెర్రెస్ లు. మా ఇంటివి, నేను వెళ్ళే ఇళ్ళవి. ఆ స్థలాల్లో ఒక తెరిచిపెట్టిన మనదైన చోటు అనే సొంత భావనలో నుంచి నింపాదిగా టీ తాగుతూనో, కబుర్లాడుతూనో, నిర్లిప్తంగా ఒక్కళ్ళమే కూర్చుని దిక్కులు చూస్తునో ఉన్నప్పుడు ఈ ఆలోచనలొస్తాయి. అవి కాకుండా హొన్నావర్ నుంచి గోకర్ణం కాలినడకన సీ ట్రెక్ కి వెళ్లినప్పటివి రెండున్నాయి: చేపలవాళ్ళింటికి భోజనానికి వెళ్లడం గురించి, తీరం నుండి తీరానికి అదుపు తప్పే అలల గురుంచి. ఒకే సముద్రాన్ని రోజుకో తీరం లో చూడటం, రాత్రుళ్ళు కెరటాల హోరు వింటూ ఇసుకలో నిద్రపోవడం, టార్చ్ లైట్ వెలుగులో కనపపడ్డ స్టార్ ఫిష్… ఇవన్నీ రాయడానికి ప్రేరణ.
6) వీటిలో చుట్టూ ఉన్న ప్రపంచంలోని అతి చిన్న వస్తువులకు, కదలికలకు ఎదో ప్రాధాన్యత ఇచ్చినట్టు తోచింది. వాటికేదొ ఓ మార్మిక, spiritual అర్థం ఆపాదించినట్టు! ఈ వివరాలు ఎందుకు అంత ప్రత్యేకం?
మన చుట్టూ ఉండే వస్తువులు మన స్వభావం వల్ల, ప్రిఫరెన్స్ ల వల్ల వచ్చి చేరినవి ఉంటాయి ఎక్కువగా. వాటి ప్రభావం మన మూడ్ మీద కూడా ఉంటుంది. రంగు వెలిసిన మెత్తటి పాత దుప్పటి కప్పుకోడానికి ఇష్టపడటం, బ్రైట్ కలర్ బట్టలేసుకుంటే హుషారుగా అనిపించడం, పాలమీగడ మీద మిరియాల పొడి ఒక డిజైన్ లాగా అట్టకట్టినప్పుడు ఒక చలిరాత్రి దానివైపు చూసి మెల్లగా సిప్ చెయ్యడం.. ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి కొన్ని అలవాట్లు, ఇష్టాలు ఉంటాయి వస్తువులకు సంబంధించి. రోజువారీ జీవితంలో చాలమటుకు వీటితోనే కనెక్ట్ అయి ఉంటుంది మన రొటీన్. అసలు అవేం లేకపోతే, వాటి వల్ల వచ్చే సంతోషం, హుషారు, చికాకు లేకపోతే ఇంత కలర్ఫుల్ గా, ఎంగేజింగ్ గా ఉండదేమో జీవితం అనిపిస్తుంది. అందుకే వాటిని రాసుకుంటాను. అలాగే పైన చెప్పినట్టు మనుషుల కదలికల్లోని గ్రేస్, విలక్షణత కూడా గుర్తుంచుకోవాలనిపిస్తుంది.
7) “ఈ గడ్డిపోచల్లో కనిపించేది ‘ఆమె’ చూపు, ఆమె ని చూసే చూపు. ఆమె చూడదల్చుకున్న చూపు.” అన్నారు. ఇప్పుడున్న పితృస్వామ్య వ్యవస్థలో ఈ చూపుని ఎలా అర్థం చేసుకోవాలి?
పితృస్వామ్యం కాబట్టే దృక్కోణాలు వేరువేరుగా ఉంటాయి. సమానత్వాన్ని కోరుకుంటూనే ప్రత్యేకతని కాపాడుకోవడం ఇప్పటి ఛాలెంజ్. ఆకర్షణని నిలబెట్టుకుంటూనే అర్థంలేని దూరాల్ని చెరుపుకోడమే ఇప్పటి అవసరం. ఇప్పటి పరిస్థితుల్లో ఇదంతా అత్యాశ ఏమో తెలీదు. ఎంపతీ, గౌరవం లాంటి విలువల్ని మనలో భాగం చేసుకునే క్రమంలో ఈస్థటిక్స్ ని కోల్పోకుండా, వాటిని కొత్తగా డిఫైన్ చేసుకుంటూ, ఇష్టంతో కలిసి బతకాలనేదే నేను ప్రతిపాదించిన చూపు.
…కుడిచేతి వేళ్లలో మధ్యలో మూడువేళ్లతో గాజు టీ గ్లాసులు పట్టుకుని అటూఇటూ రెండు వేళ్ళు గాల్లో ఓపెన్ గా వదిలేసి మెల్లగా టీ సిప్ చెయ్యడం …
ఇలాంటి అబ్జర్వేషన్స్ ని ఎందుకో వచనంలోకాని, కవిత్వంలోకాని మన పాఠకులు (వీళ్ళు రచయితలు, సమీక్షకులు కూడ) ఆహ్వనించరు. పైపెచ్చు అనవసరం అంటారు!
ఈ ఇంటర్యూ చదివాక జీవితం మీద ఇంకాస్త ప్రేమ పెరిగింది 🙂
“ఎంపతీ, గౌరవం లాంటి విలువల్ని మనలో భాగం చేసుకునే క్రమంలో
ఈస్థటిక్స్ ని కోల్పోకుండా, వాటిని కొత్తగా డిఫైన్ చేసుకుంటూ, ఇష్టంతో కలిసి బతకాలనేదే నేను ప్రతిపాదించిన చూపు.” – సింప్లీ ప్రొఫౌండ్ .