కవిత్వంతో ప్రయాణంలో….

ఆర్మూరు అంటే అమృతలత, అమృతలత అంటే ఆర్మూరు!

నవంబర్ నెల మొదటి రోజున, చివరి రోజున నేను ఒకే చొట గడిపాను.  మొదటి రోజున కథ కోసం, చివరి రోజున కవిత్వం కోసమూను!  ఎక్కడంటే అమృతలతగారి ఆతిథ్యంలో ఆర్మూరుకి సమీపంలో మామిడిపల్లి గ్రామంలొని  “అపురూప కళ్యాణ మండపం”లో.   నాకు రెండింటిలోనూ పాల్గొనే అరుదైన భాగస్వామ్యం కల్పించిన ఖదీర్ బాబుకి (కథలు), కొండేపూడి నిర్మలకి (కవిత్వం) ముందస్తుగా ధన్యవాదాలు.   సుమారు ఇరవై మంది హాజరైన కవిత్వం గురించిన సమావేశం మీద నా రిపోర్ట్ ఇస్తున్నాను కింద.
మూడు దశాబ్దాలకు పైగా ఫెమినిస్టు కవిగా పేరొందిన కొండేపూడి నిర్మల ఆధ్వర్యంలో ఏర్పడిన “సంతకం”తో నేను అడపాదడపా ప్రయాణిస్తున్నాను.  నిర్మల తానొక్కతే కవిత్వం రాయటం కాకుండా నలుగురినీ చిక్కనైన కవిత్వం రాయించేలా చేయటం కోసం కవి సమ్మేళనాలు, ఏదో ఒక చోట కవిత్వ సమావేశాలు, థీం బేస్డ్ కవిత్వం రాసి, రాయించి “ఫ్రూట్ జ్యూస్” యూట్యూబ్ చానెల్తో కలిసి వీడియో కవిత్వ సంచికలు విడుదల చేయటం వంటి రకరకాల ప్రక్రియలు చేస్తున్నారు రేణుక అయోల సహకారంతో.  ఆమె ఈసారి ఆర్మూరు పట్టణంలోని విద్యా సంస్థల అధినేత, సాహితీవేత్త ఐన అమృతలత గారి సహకారంతో కవిత్వం గురించి నవంబర్ 30-డిసెంబర్ 1, 2019న రెండురోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు.
ఇది మహాసభలు కాదు.  సాహిత్య పాఠశాల కాదు.  కవిత్వంలో శిక్షణ ఇచ్చే వర్క్ షాప్ కూడా కాదు.  ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమం కవిత్వం పట్ల ఒక గంభీరమైన దృష్టి వున్న కవుల్ని సమావేశ పరిచి, ఒక తేలికైన, హృద్యమైన విధానంలో కవిత్వ వాతావరణాన్ని మరింత పటిష్టం చేయటమే.  అందుకే ఇందులో చర్చా కార్యక్రమం తో పాటు కవి సమ్మేళనం, ఆర్మూరుకి 85 కి.మీ. దూరంలో వున్న పోచర్ల జలపాతం సందర్శన కూడా వున్నాయి.  చివరికి కలిసి ప్రయాణం చేయటాన్ని కూడా ఒక ప్రత్యేకమైన సాహిత్యనుభవంగా మలచాలనే ఆలోచన కూడా ఈ కార్యక్రమ ప్రణాళికలో నిబిడీకృతమై వున్నది.
“సంతకం” ఆవిర్భావ వార్షికోత్సవాన్ని కేక్ కట్ చేయటం ద్వారా ఒక ఆత్మీయ సంబరాన్ని నిర్వహించుకున్నారు.  హాజరైన కవుల కవిత్వ పంక్తులతో, ఛాయా చిత్రాలతో కొండేపూడి నిర్మల చేసిన ఫోటో షాప్ చిత్రాలను ఆయా కవులకు బహుకరించటంతో ఒక హృద్యమైన వాతావరణం ఏర్పడింది.
సాధారణంగా కవిత్వం వర్క్ షాప్ అంటే వస్తువు, శిల్పం, కవిత్వ లక్షణాలు, కవిత్వ సామాగ్రి అనే అంశాల మీద కాకుండా టాపిక్స్ ని కవుల్ని సరైన దిశగా ఆలోచించేందుకు ప్రేరణగా వుండేలా రూపొందించటం జరిగింది.  అవి ఇలా వున్నాయి.
1. కవిత్వంలో ఒక వైపు స్తబ్దత మరో వైపు రద్దీ కనబడుతున్నాయి.  కారణం?
2. రైటర్స్ గ్యాప్ (ఒకనాడు చురుకుగా రాసి ఇప్పుడు రాయలేక పోవటం)కి కారణాలేమిటి?
3. భావ ప్రకటన మీద దాడి
4. కొత్త సామాజిక మాధ్యమాలు వచ్చాక రచనలకు ఆదరణ ఎలా వుంది?
5. సాహిత్యంలో సెల్ఫ్ ప్రమోషన్
ఇందులో ఒక్క నాలుగవ అంశం మినహా (సమయాభావం వల్ల) మిగతా అన్ని అంశాల మీద నాణ్యమైన, నిర్మొహమాటమైన మంచి చర్చ జరిగింది.  చర్చ జరిగిన అన్ని అంశాల్లోనూ కవి అంతరంగ, బాహ్య వాతావరణాన్ని, అందులోని పరిణామాల్ని స్పృశించటం జరిగింది.  నిబద్ధత, నిజాయితీతో కూడిన కవిత్వం ఎల్లకాలమూ నిలిచిపోయేదని,  రాసి కన్న వాసి ఖచ్చితంగా అవసరమైనదనీ, కవిత్వంలో కెరీరిస్టు ప్రలోభాలు కవి సృజనాత్మకతకి ప్రమాదకరమని, వాస్తవికమైన కవిత్వ విమర్శ, ప్రోత్సాహం స్థానంలో పరస్పర ప్రశంసలు, అవగాహనా పూర్వక పొగడ్తలు కవి ఎదుగుదలని దారుణంగా దెబ్బతీస్తాయని అభిప్రాయ పడటం జరిగింది.  తమ లోలోపల అడ్డంకుల్ని సృష్టిస్తున్న తర్జనభర్జనల్ని కవి హేతు పూర్వకంగా అధిగమించాలని, వస్తువు శిల్పం దృష్ట్యా తనని తాను తాజా పరుచుకోవాలని భావించటం జరిగింది.  భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి బహు ముఖీనంగా జరుగుతున్నది.  ప్రజలకి వార్తలు, సమాచారాన్ని అందించే పత్రికల్ని అదుపులో పెట్టుకోవడం లేదా స్వంతం చేసుకోవటం ద్వారా పాలకులు భిన్నాభిప్రాయలకు తావు లేకుండా చేయడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడిగానే భావించాలని, అర్బన్ నక్సల్స్ అనే భావజాలం వెనకనున్న ఉద్దేశ్యం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడిగానే కవులు చూడాలని భావించటం జరిగింది.  కవులు నిరంతరం అప్రమత్తంగా, ఉత్సాహంగా ఉంటూ, తమని తాము కొత్త ఆలోచనలకు, శైలులకు మలుచుకోవటం ద్వారా “రైటర్స్ బ్లాక్” ను నివారించగలరని అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ కార్యక్రమంలో భాగంగానే స్థానికులతో సహా సుమారు ముప్ఫై మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహించటం జరిగింది. కవి సమ్మేళనంలో చదివిన కవిత్వాంశాలన్నీ సమకాలీనమవటం విశేషం.
ఆర్మూరుకి సుమారు 85 కిమీ దూరంలో వున్న పోచర్ల జలపాత సందర్శనం ఒక ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చింది.  జర్నీలో కూడా లోతైన చర్చ చేయటం, అనుభవాలు పంచుకోవడం జరిగింది. ఒక సామూహిక స్పృహతో చేసిన ఈ పర్యటన ప్రతి కవి హృదయంలో ఒక మనోహరమైన జ్ఞాపకంగా మిగిలిపోగలదు.
శషబిషల్లేని, జంకు బొంకుల్లేని, అరమరికల్లేని చర్చలతో కార్యక్రమం సఫలమైందని భావిస్తున్నాను.
ఆర్మూరు అంటే అమృతలత, అమృతలత అంటే ఆర్మూరు అనీ, ఆ రెండు పేర్లు కలిస్తే సాహిత్య ఆతిథ్యం అని గుర్తుపెట్టుకోవచ్చు ఇంక. అంత మంచి వాతావరణం కల్పించారు ఆవిడ.  ఆమె కల్పించిన వసతి సదుపాయాలు, వడ్డించిన ఆహారం, చూపించిన ఆప్యాయత అమోఘం.  ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు.
*

అరణ్య కృష్ణ

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కని విశ్లేషణ సర్. చదువుతోంటే మీరు మాట్లాడిన మాటలన్నీ గుర్తొచ్చాయి.

    • ధన్యవాదాలు అన్వర్ గారూ! మీ ఆత్మీయత స్వచ్చంగా, గొప్పగా అనిపించింది.

  • మీ write-up, బాగుంది, సర్,స్వయంగా చూడలేని, రాలేని,మాలాంటి వారికి,మంచి అనుభూతి కల్గించింది, ధన్యవాదాలు మీకు,ముందుగా,. ఇల్లాంటి కార్యక్రమంలుమరింత జరగాలని కోరుకొంటు..💐👌👍!

  • అరణ్యకృష్ణగారూ ఆర్మూర్ కవిత్వ సమావేశం పై చక్కని నివేదిక అందజేశారు.అనారోగ్యకారణాన రాలేకపోవటం తో మంచి కార్యక్రమం మిస్ అయ్యాను.పాల్గొన్న కవులందరికీ అభినందనలు.సాహితీబంధువు అమృత లత గారికి మంచి సాహిత్య కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్నందుకు ప్ర త్యేక ధన్యవాదాలు.

  • “అపురూప ఆలయం” వేదికగా ఆర్మూర్లో జరిగిన కవుల సదస్సు చాలా రకాలుగా అపురూపమైనది, భిన్నమైనది కూడా. ఎంత అపురూపంగా జరిగిందో మీ చిక్కట చక్కటి సమీక్ష దృశ్యరూపకమైంది. ధన్యవాదాలు కృష్ణ గారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు