సనాతనమైనది ఏది ?

“బుజ్జీ చింతాలమ్మ సిరికి రండిరా! రిషి అమెరికా వెళ్ళిపోతాడు నెక్స్ట్ వీక్ “

ఫోన్ లో అంకుల్ ( మేనమామ ) గొంతు విని అమ్మమ్మ ఊరిపై బెంగ మొదలయ్యింది. చాలా కాలమైంది వెళ్లి. చిన్నప్పుడు పదేళ్ల వరకూ అక్కడే పెరిగాను. చింతాలమ్మ గ్రామదేవత. ప్రతిసంవత్సరం జరిగే సిరిమానోత్సవం మా ఊరి ప్రత్యేకత. శనివారం మధ్యాహ్నానికల్లా అందరం ఊరు ( రఘుదేవపురం ) చేరుకున్నాం. కజిన్స్, పిన్నులు , చిన్నాన్నలు , పెద్దనాన్న , పిల్లలు … ఇంటికి చిన్నప్పటి కళ…

******

సాయంత్రం గుడికి బయలుదేరాం.

సాయంత్రపు ఎండలో  నిగనిగా మెరిసిపోతున్న రంగు రంగుల చింతాలమ్మ గుడిని చూడగానే మా తెలుగు మాష్టారు మాటలు గుర్తొచ్చాయి.

“మాండలిక భాషలన్నీ ప్రామాణిక భాష వైపు ప్రయాణిస్తాయి. “

గుడిపై లేని దేవుడు ,దేవత లేదు. హిందూ దేవతల కుటుంబాలన్నీ కొలువైపోయాయి. గుడికి ముందు గాలి గోపురం లాంటిది కట్టారు. గుడి లోపలంతా గ్రానైట్ తాపడం చేసి లోపలా బయటా రంగులతో నింపేశారు.

“ఇదేంటి గుడి ఇలా ఉంది ?”

“పాత గుడిని ఇలా మార్చాం.”

“ఇంతకుముందు ఇవన్నీ ఉండేవా ! గుడి చాలా ప్లెయిన్ గా ఉన్నట్లు గుర్తు “

“అప్పుడు బోసిగా ఉండేదిరా ! గుడిముందు రెండు పోతురాజుల విగ్రహాలు మాత్రమే  ఉండేవి. బాగా డెవలప్ చేశాం “

“గుడి మీద ఇన్ని విగ్రహాలు ఎందుకు పెట్టారు ?”

“చింతాలమ్మ అమ్మవారి అవతారం కదా ! అందుకే “

పెడితే పెట్టారు ఇన్ని రంగులెందుకు ? చాలా కృతకంగా ఉంది.

“కృతక ప్రామాణికత అంటే ప్రామాణిక భాషని అనుసరించే క్రమంలో అవసరం లేనిచోట కూడా అక్షరాలని మార్చేయడం. ఉదాహరణకి ఎల్లడాన్ని వెళ్లడంగా మార్చడం ప్రామాణికం , ఎలకని వెలక అని పలకడం కృతకప్రామాణికత “  తెలుగు మాష్టారి గొంతు ఆకాశవాణిలా కంగుమంది.

“చింతాలమ్మ లోకల్ దేవత కదా! దేవీ అవతారం అంటున్నావేంటి ? చిన్నప్పుడు చింతాలమ్మ స్టోరీ ఏదో చెప్పేవాడివిగా !”

“చింతాలమ్మ యనమదలోళ్ల కూతురు. పెందుర్తోళ్ల కోడలు. పెందుర్తి రామన్న గారి తాత పెందుర్తి దొరయ్య గారు ‘చిట్టితల్లి మజ్జిగ తీసుకురా ! ‘ అంటే కంగు కంగున పరిగెత్తుకుంటూ తెచ్చేదట! “

“దేవతగా ఎలా మారింది?”

“ఎవరికి తెలుసురా! ఏదో జరిగింది. “

“భయమో! భక్తో ! మనుషులని దేవతలుగా మార్చడానికి …” గొణుక్కున్నాను.

పెద్ద ఫోటోగ్రాఫర్లా నటిస్తూ క్యూ తప్పించుకుని గుడిలోకి జొరబడ్డాను.

గుడి మారినట్లే దేవత కూడా మారింది. వెండికళ్లు , కిరీటం వచ్చాయి. అయితే ఇంకా చాకలి పూజారులే ఉన్నారు. ఎక్కువసేపు నిలబడ్డవాళ్లని గద్దిస్తూ బయటికి పంపుతున్నారు.

గుడి బయట గరగలు నెత్తిమీద పెట్టుకుని నాట్యం చేసే ట్రూప్ ఒకటి డప్పుల శబ్దానికి ఆడుతూ కనిపించారు. నాకు బాగా గుర్తు. నోటితో కోడిపిల్ల మెడని కొరికి , చింతాలమ్మ ( పసుపు, కుంకుమ రాసిన ఒక కుండ ) ని ఎత్తుకుని చాకలి లాలమ్మ కొడుకు నడుస్తూ ఉంటే వెనుక నలుగురైదుగురు చాకళ్లు గరగ నృత్యం చేసుకుంటూ వెళ్ళేవారు. యనమదలోళ్ల ఇంటిదగ్గర బయలుదేరిన చింతాలమ్మ ఇంటింటికీ తిరుగుతూ సాయంత్రం కల్లా పెందుర్తోరి ఇంటిదగ్గర గుడికి వస్తుంది.

చింతాలమ్మ ఇంకా గుడికి రాలేదు. ఈ గరగ నృత్యం వినోదం  కోసం పెట్టారట. అందరూ ఒకే యూనిఫామ్ వేసుకుని డాన్స్ చేస్తున్నారు. ఊరంతా తిరిగి , చింతాలమ్మ గుడికి చేరాక సిరిమానోత్సవం జరుగుతుంది. అప్పటివరకూ అక్కడ కూడిన జనాల కోసం గుడిముందు డీజే కూడా పెట్టారు. పుష్ప సినిమాలోని గంగమ్మ జాతర పాట ప్రదేశానికి పూనకాలు తెప్పిస్తోంది. సాధారణంగా సాయంత్రం ఆరింటికల్లా వచ్చే చింతాలమ్మ ఏడున్నర వరకూ రాలేదు.

“ఈ వెధవలు డబ్బులకి అలవాటుపడి ఒక్కో ఇంటికి రెండు మూడు సార్లు పోతున్నారు” కోపంగా అన్నాడో పెద్దాయన. ( ఇళ్లకు వెళ్ళినప్పుడు చింతాలమ్మ బృందానికి దక్షిణలు ఇస్తారు )

“మధ్య మధ్యలో తాగక పోతే ఆ గరగలు నెత్తిమీద పెట్టుకుని ఊరంతా ఎలా తిరగ్గలరు?” సమర్థించాడు పక్కాయన. డబ్బుకీ మందుకి లంకె పెట్టాడు.

ముహూర్తం చూసుకుని గుడిముందు సిరిమాను ( ఇంచుమించు పాతిక అడుగుల ఎత్తు ఉండే ఒక దుంగ. పైన అడ్డంగా తిరిగేలా ఇంకో దుంగ ) నిలబెడతారు. చింతలమ్మ గుడికి చేరుకోగానే ఉత్సవం మొదలవుతుంది. ముందుగా అడ్డంగా ఉన్న దుంగకు ఒక వైపు గుమ్మడికాయ కట్టి వేరే వైపునుంచి తిప్పుతారు. తర్వాత మనిషిని. ఆపై మేకపిల్లని. అలా గాలిలో తిరిగే వాటిపై జనాలు కిందనుంచి జీడిమామిడి పళ్లతో కొడుతూ ఆనందిస్తారు. మనిషిని మాత్రం గాలిలో వేలాడదీయకుండా ఒక పలక మీద పడుకోబెట్టి సిరిమానుకి ఒకవైపున కట్టి కిందనే తిప్పేశారు. నోట్లో కోడిపిల్లని కరిచిపట్టుకుని ,నిర్వికారంగా , జరిగే దానితో సంబంధం లేనట్లు తిరిగాడు. డప్పుల శబ్దం , శరీరాన్ని , పరిసరాలని కమ్మేసిన సారాయి మత్తు అతన్ని వేరేలోకంలోకి తీసుకుపోయి ఉంటాయి.చిన్నప్పుడు మనిషిని కూడా పైన తిప్పడం , కిందనుంచి జీడిమామిడి పళ్ళతో కొట్టడం గుర్తుంది.

“జనాలు రాళ్ళతో కొట్టేస్తున్నారని ఇప్పుడు మనిషిని అలా తిప్పడం మానేశారు “.

సిరిమాను చుట్టూ ఊగిపోతూ తిరుగుతున్న చింతాలమ్మ ( చాకలి నెత్తిపై కుండ ) ని ముట్టుకుని దణ్ణం పెట్టుకుంటున్నారు జనాలు.అతను స్పృహలో ఉన్నట్లు గా కనిపించలేదు. నెత్తిమీద చింతాలమ్మని పెట్టుకున్న క్షణం నుంచి దేవతలా మారిపోతాడు. అత్తారింటికి వెళ్లడం ఇష్టం లేనట్లు విపరీతమైన బలంతో ప్రతిఘటిస్తూ నడుస్తాడు. జనాలు ‘అమ్మా తల్లీ’ అంటూ అరుస్తూ వెనక…

నెత్తిపై చింతాలమ్మని మోస్తూ ఊగుతూ నడుస్తున్న చాకలిని చూస్తే కేరళ “తెయ్యం “ గుర్తుకొచ్చింది. తెయ్యం ‘దైవం’ నుంచి అపభ్రంశమై వచ్చిన పదం. కేరళలో దళితులని దైవంగా మార్చే నృత్యం తెయ్యం. ఏడెనిమిది అడుగుల అలంకరణని నెత్తిపై మోస్తూ చేసే నృత్యం తెయ్యం కళాకారుడిని దైవంగా మారుస్తుంది. తెయ్యం సీజన్ లో ( రెండు మూడు నెలలు ) బ్రాహ్మలు కూడా తెయ్యం కళాకారుడిని ఇంటికి ఆహ్వానించి పూజలు చేస్తారట . ఆ శంకరుడే దళితుడి అవతారంలో వచ్చి శంకరాచార్యుని కులవివక్ష పై ప్రశ్నించాడని , శంకరాచార్యులు తప్పు తెలుసుకుని తెయ్యం సాంప్రదాయాన్ని సృష్టించారని ఒక నమ్మకం.

తెయ్యం సీజన్ అయిపోయిన మర్నాడే దైవం అంటరాని దళితుడవుతాడు. చింతాలమ్మ చాకలి సత్తిగాడవుతాడు. బహుశా ఇటువంటి టెంపరరీ దైవత్వం  వివక్షకి ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ లా పనిచేయడానికి కనిపెట్టారేమో!

అయితే మన దేశంలో కులం శరీరాలు మారినా చావులేని ఆత్మలాంటిది. దానిని మతం ఆర్పలేదు , ఇజం దహించలేదు. దైవం కూడా  మార్చలేదు.అది చావులేని దయ్యం ! బహుశా దయ్యం కూడా దైవం నుంచే వచ్చిందేమో!

సిరిమానోత్సవం ముగియడంతో చింతాలమ్మ ని గుడిలో పెట్టేసారు.

“రేపటి నుంచి చింతాలమ్మ గుడి మళ్లీ సంవత్సరం వరకూ తెరవరు కదూ ! “ ఇంటివైపు వెళుతూ అడిగాను

“లేదు ఇప్పుడు తెరుస్తున్నారు “

“ఎందుకూ!”

“ఇంత ఖర్చుపెట్టి డెవలప్ చేసారు కదా !”

అంటే ప్రామాణికత వైపుకి ప్రయాణం సంపూర్ణమైందన్నమాట ! చింతాలమ్మ గుడి పూర్తిగా దేవాలయం గా మారినట్లే !

భవిష్యత్తులో మాండలికాలు కనుమరుగై ప్రామాణిక భాషగా మిగలొచ్చు. చదవగలిగేవాళ్ళు లేక కొన్ని భాషలు లిపిని కోల్పోవచ్చు. లేదా పదాలు దొరక్క ఒక కృతకమైన భాషగా మారవచ్చు.అన్ని భాషలూ ఒక అంతర్జాతీయ భాషగా రూపాంతరం చెందొచ్చు ! పైడితల్లి పైడిమాంబగా మారినట్లు యాదగిరి గుట్ట యాదాద్రి అయినట్లు చింతాలమ్మ చింతమాంబగా అవతరించవచ్చు. బహుశా అది ఆపలేని మార్పు.

“భాషలకి మతాలకీ చాలా పోలికలే ఉన్నాయనిపిస్తుంది. ” మనసులోని మాట పైకే అనేశాను.

వేరు వేరు ప్రదేశాల్లో వేరు వేరు భాషలు. అలాగే మతాలు. ఎన్ని భాషలున్నా వాటి ప్రయోజనం కమ్యూనికేషన్  !  మతాలు వేరయినా దేవుడు కామన్  . వ్యాకరణం వేరు కావొచ్చేమో కానీ భావం అదే  ! భౌగోళిక దూరాల వల్ల ఇన్ని మతాలు , భాషలు ఏర్పడ్డాయి కానీ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారే దశలో వీటి మధ్య అంతరాలు పోయి ప్రామాణికత వైపుకి పోతాయా ! ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న మతం నాస్తికత్వం. బహుశా అన్నీ అందులోనే కలుస్తాయేమో!

******

“ఇంతకీ సనాతనమైన మతం పోయి నాస్తికత్వం మిగులుతుందంటావా!” ఆశ్చర్యపోతూ అడిగాడు

“ఏది సనాతనమతం “

“శాశ్వతమైనది. అందరికీ ఎప్పటికీ వర్తించే సత్యం గురించి , స్వధర్మం గురించి చెప్పేది  “

“అన్ని మతాలు అలాగే అనుకుంటాయిగా ”

” అంటే ఎప్పుడూ ఉండేది నిత్యమైనది ఏదీ లేదా!”

“ఘనీభవించిన మతాల్లో మాత్రం ఉండదు. ”

” మరి ”

“సనాతనంగా మనిషిలో ఉన్నది ఏమిటో తెలుసా! వాడి ఇరుకు. భూమిని ఖండాలుగా , ఖండాలని దేశాలుగా , జాతులుగా , మతాలుగా , కులాలుగా , మార్చేయమని ఏ దేవుడు చెప్పాడు? విశాలమైన దానిని ముక్కలుగా మార్చి ఇరుకుగా మార్చడమే వాడి సహజ గుణం.  మనిషి మతాలు ,కులాలు , ప్రాంతాల పేరుతో చేసుకున్న హింసకి కారణం వాడిలోని ఇరుకు. ఎవరూ లేకపోతే అంతరాత్మతోనే విభేదించే ఇరుకు.”

“మరి సమయానుసారం మారని నీతి , కర్తవ్యం , సత్యం , న్యాయం లాంటివి లేవా “

“మనుషులు ఏదోకపేరుతో ఒకరిపై ఇంకొకరు చూపించుకున్న వివక్ష , హింస…  దానిపై బాధితుల తిరుగుబాటు… కొంత సడలింపు …కొంత మార్పు… ఇదొక చక్రం … విచిత్రం ఏమిటంటే మార్పే శాశ్వతమైనది. ఎప్పటికీ వర్తించే సత్యం. అసలు మార్పే సనాతనమైన ధర్మం. అదే మానవ జీవన పరిణామక్రమానికి , ప్రస్తుత నాగరికతకు కారణం ”

” ఏమిటో బుర్రంతా గోదారి గోదారి చేసేసావ్ ”

*

శ్రీధర్ నరుకుర్తి

4 comments

Leave a Reply to Sivaramakrishna Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “అప్పుడు ప్రతి పెన్నూ ట్రిగ్గర్ ధరించినట్లుండేది. ఇపుడు ప్రతి శవమూ నేలపై మృత్యుగీతం రాస్తోంది. కవిత్వం ఆత్మహత్య చేసుకుంటోంది. విగ్రహం పిడికిలి బిగించి వినపడని నినాదం చేస్తోంది. వేనవేల చితులు నిప్పురవ్వలతో ఆకాంక్షల్ని బూడిద చేస్తున్నాయి.”

    నిజమే సనాతనమైనది ఏది ? మంచి ప్రశ్న .

  • కథనమూ, విశ్లేషణ చాలా బావుంధి. నువ్వు నిజమైన విశ్లేషకుడువు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు