సగం మనుషులు సగం జీవితాలు!

మధ్య నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైం లాంటి OTT లు వచ్చిన తర్వాత చాలా వెబ్ సెరీస్లు వస్తున్నాయి. చాలా వరకూ రొడ్డకొట్టుడే అయినా కొన్ని మంచివి కూడా వస్తున్నాయి. వొక సినెమా తీయడానికి అడ్డుపడే విషయాలు తెర మీద అవసరమైనా సెక్సును చూపించలేకపోవడం, LGBTQ ల లాంటి అంశాలు తీసుకుని తీయలేకపోవడం (ఎవరు ధైర్యం చేస్తారు? ప్రసిధ్ధ నటులలో ఎవరు ముందుకు వస్తారు ఆ పాత్రలు చెయ్యడానికి?). ఇలాంటి సమస్యలకు వొక పరిష్కారం ఈ వెబ్ సిరీస్లు.

ఇప్పుడు “Four more shots please – Season 2” కూడా వచ్చింది. నేను ఇదివరకు మొదటి రుతువు (అదేనండీ సీజను ) చూశాను. నచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ చూసేముందు మరోసారి మొదటి సీజన్ చూశాను. మొత్తం పది ఎపిసోడ్లు. ఈ పక్షం మొదటి సీజన్ గురించి మాట్లాడుకుందాం.

ఈ సిరీస్ కు మొదట్లో వచ్చే graffity ఏంటంటే “I am not a girl, I am a storm with skin”. ఇదీ, తర్వాత మొట్టమొదటి సన్నివేశం ఈ వెబ్ సిరీస్ కు వొక పునాది వేస్తుంది. బోర్డ్ రూం లో సాయాని గుప్తా లెక్చర్ ఇస్తుంటుంది. ఎదుటి కుర్చీలో కేవలం డ్రాయార్ వేసుకున్న మిలింద్ సోమాన్ (ఆమె గైనకాలజిస్టు) కూర్చుని వుంటాడు. లేచి టేబిల్ ఎక్కి నడుస్తూ ఆమె దగ్గరికి వెళ్తాడు. అందరూ చూస్తుండగానే ఆమెతో సెక్స్ మొదలుపెడతాడు. ఇంతలో కల విరిగి సాయాని నిద్ర లేస్తుంది. అలవాటు లేనివారికి ఇది షాకింగ్ గా, అఫెన్సివ్ గా అనిపించవచ్చు. కాని ఇన్ని దశాబ్దాలుగా మనం మన చిత్రాలలో చూసింది ఇదే. అయితే ఆ ఊహల్లో సాఫ్ట్ పోర్న్ మగవాడి కళ్ళల్లోంచి. ఆడవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళ కథ వాళ్ళె చెప్పుకోవాలి. కథ వ్రాసింది ఇద్దరు ఆడవాళ్ళు : దేవికా భగత్, (రెండో సీజన్ కి) ఇషితా మోఇత్రా. దర్శకురాళ్ళు అను మెనన్, (రెండవ సీజన్ కి) నూపుర్ ఆస్థానా. వో నాలుగు ఆడ పాత్రల మధ్య స్నేహం ఎలా కలుస్తుంది, అది ఎలా గట్టి పడుతుంది, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కష్టాలు వస్తాయి, వాటిని వారు ఎదురుకోవడం, రోజూ కలిసే ట్రక్ బార్లో ఒకరి కథలు మిగతావారికి చెప్పుకోవడం వగైరా.

ఈ సాయాని ఒక స్తార్టప్ మొదలు పెట్టింది జర్నలిజం లో. అది బాగా పేరు తెచ్చుకుంది. కాని మరిన్ని లాభాల కోసం ప్రజలకు నచ్చే గాసిప్ పెడితే లాభం అని చెప్పి సప్నా పబ్బి ని చేర్చుకుంటారు. ఈ గాసిప్లు వరసగా మూడుసార్లు భయరహిత విలేఖరి అవార్డు పొందిన సాయాని కి నచ్చవు. ఇది ఎంతవరకు పోతుందంటే బోర్డులో మెజారిటీ వోట్ ప్రకారం ఆమెను తీసేసేంతవరకు. ఈ లోగా ఆమె ప్రేమ జీవితంలో వచ్చిన ఒడిదుకుకులు కథ. హై సొసైటీ పక్షులైన తల్లిదండ్రులు ఈమెని పట్టించుకోరు. చిన్నప్పట్నించీ తన చుట్టూ దిళ్ళు అమర్చుకుని పడుకుంటూ వుండే సాయానికి పెద్దయ్యాక కూడా అదే పరిస్థితి. ట్రక్ బార్ లో ఓనర్/బార్టెండర్ ప్రతీక్ బబ్బర్ అంటే ఇష్టం. తన గైనిక్ మిలింద్ అంటే ఆకర్సహ్ణ. ప్రత్యేక సమస్య లేకపోయినా అతనిదగ్గరికెళ్ళడం వగైరా. అతనితొ గడిపిన వొకనొక ఏకాంత క్షణాల్లో తన ఎరోజీనియస్ జోన్స్ ను గుర్తిస్తుంది. అంతవరకే. ఆమె పుట్టినరోజుకు నలుగురు అమ్మాయిలూ పారస్ అనే గే అందరూ గొవాకెళ్తారు. అక్కడ అన్ని ఎంబరాస్మెంట్లు విడిచి ఎంజాయ్ చేస్తారు. ఈమె కథలో తలెత్తే ప్రశ్నలు జర్నలిజం లో నిజాయితీగా వుండదలిస్తే ఎందుకు అలా వుండనివ్వరు, చిన్నతనంతో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల వొంటరిగా ఫీల్ కావడం, మగవారితో సన్నిహిత్యం పెట్టుకున్నా అది సాంత్వన ఇవ్వకపోవడం, వగైరా.

రెండో పాత్ర మానవి గగ్రూ. కాస్త లావుగా వుంటుంది. ఆమె తల్లికి (సైమోన్ సింఘ్) ఎప్పుడూ కూతురు పెళ్ళి గురించే చింత. లావు తగ్గమంటుంది, చీటికీ మాటికీ అవమాన పరుస్తుంది. ఆమెలో ఆత్మవిశ్వాసమనేది లేకుండా చేస్తుంది. చిన్నప్పుడు తల్లి కంటే ఆయానే ప్రేమను పంచింది. (కొంత కథ కొత్తగా వున్న, కొంత మరీ 1970స్ లో వచ్చిన సినిమాలలోలాగా వుంది. బాబీలో రిషి కపూర్ ని కని కూడా తన ఫిగర్ పాడవకూడదని పాలివ్వని తల్లి, వొక ఆయాకి కొడుకు సంరక్షణ అప్పజెప్పడం అదీ చూశాం.) ఇంతవరకూ పర్లేదు, దీని తర్వాతే పరిణామంగా ఆమె చేసే పనులు కొన్ని మనల్ని ఆలోచనల్లో పడేస్తాయి. లావు లావు అని బాడీ షేమింగ్ ద్వారా తన శరీరం మీద తనకే ప్రేమ లేకుండా చేస్తారు. ఆ గే మిత్రుడు ఇచ్చిన లింక్ ద్వారా ఆమె ఒక కొత్త లోకంలో ప్రవేశిస్తుంది. మనుషులు, ఆడా మగా తమ నగ్నత్వాన్ని ప్రదర్శించుకోవడం, డేటింగులు చేసుకోవడం వగైరా జరుగుతుంటాయి. వొకపక్క ఇంటర్నెట్ ఇచ్చిన anonymity మనుషులను ఎలా తయారు చేసిందో చూపిస్తే, వొక స్త్రీ బాడీ షేమింగ్ కి ఇంట్లోనే బలి కావడం పర్యవసానంగా ఎలా మారుతుందీ అన్నది చూస్తాము.

అందరూ లైకులు, కామెంటులూ ఇస్తుంటే ఆమెకు తనలో ఆత్మ విశ్వాశం కలగడం, దానికి అడిక్ట్ అవడం జరుగుతాయి. మగవాళ్ళలో fetishes తక్కువ వున్నాయా అంటే ఆమెకోసం చూసిన వొక సంబంధంలో కుర్రాడికి ఆమె శరీరంలో కాళ్ళు చాలా ఇష్టం, ఆమె కాలి వేళ్ళు చీకాలని చూస్తాడు. ఈమె తన్నేసరికి ఆ సంబంధం పోతుంది. తర్వాత న్యూ యార్క్ నుంచి వచ్చిన బాల్య స్నేహితుడు రాజీవ్ సిధ్ధార్థ గోవాలో కలుస్తాడు. అక్కడ ఇద్దరూ ఒక్కటవుతారు. అతను దీపావళి పార్టీలో అందరి ముందు ప్రపోజ్ చేసినా, మరో పక్క ఆ సైట్ లో పరిచయమైన వొక వ్యక్తి ఆమెను బ్లాక్మేల్ చేస్తుంటాడు. ఈమె కథలో బాడీ షేమింగ్, ఆత్మ న్యూనత, తల్లిని హేట్ చెయ్యడం, చేతకాని తండ్రి వెన్నుదన్నుగా వుండకపోవడం, నెట్ లో అలాంటి సైట్ లో వెళ్ళిన కొత్తలో మెచ్చుకోళ్ళు దొరకడం, నచ్చడం, చివరికి బ్లాక్మేల్ కు గురికావడం ఇవన్నీ చూస్తాము. ఇవన్నీ మన కాలంలో జరుగుతున్న కథలే కదా.

ఇక మూడో అమ్మాయి కీర్తి కుల్‌హారి. ఈమె వొక సక్సెస్ఫుల్ లాయర్. భర్త నీల్ భూపాలం తో విడాకులు తీసుకుంది. కూతురు ఆర్య. నీల్ పనీ పాట చెయ్యడు. ఇంట్లో భార్యకు కూడా సాయం చెయ్యడు. పురుషాహంకారం జాస్తి. భార్య సంపాదన మీద బతుకుతూ ఎలాంటి బాధ్యతా తీసుకోడు. ఆ కారణంతోనే విడిపోతారు వాళ్ళు. అప్పట్నించీ ఆమె సింగిల్ గా వున్నా, అతను మాత్రం అమృతా పూరి తో సంబంధం కలిగి వుంటాడు. తర్వాత కీర్తి అంకుర్ రాఠీ తో ప్రేమలో పడుతుంది. అది చూసి మాజీ భర్త అసూయ పడటం, తన అధికారం చెలాయించాలని చూడడం వగైరా మనుషుల్లోని ఆ చీకటి పార్శ్వాలను పరిచయం చేస్తుంది. ఈమె కాస్త పాతకాలపు ఆలోచనలు కలిగినది. పాపే లోకంగా బ్రతుకుతుంది. ఇంకో మనిషిని చూసుకోవడం కూడా ప్రయత్నించదు. మిగతా స్నేహితురాళ్ళు బార్ లో అంటారు, టాయ్లెట్ కె వెళ్ళి మేకప్ అద్దం కాళ్ళ మధ్య భాగం కనబడేలా పెట్టుకుని బూజు పట్టిందేమో చూసుకో అంటారు. మగవాళ్ళు నలుగురు కలిసి చేసే బూతు జోకుల అల్లరే వీళ్ళూ చేస్తారు. why should only boys should have all the fun?” వొక పక్కన అమృతా అంటే అసూయ, మరో పక్క తన భర్తతో తిరిగి వొకటయ్యే వీలుందేమో అని ఆశగా చూడడం, ఇలాంటి అలలు లేచి ఆమె మనసులో సంచలనం సృష్టిస్తాయి. ఇవీ ఈ నాటి సమస్యలే.

ఇక నాలుగో అమ్మాయి బాని జె. ఈమె లుధియానా నుంచి ముంబాయ్ కి వచ్చి వో జిం లో ట్రైనెర్ గా పనిచేస్తుంటుంది. తను బై సెక్సువల్. వూళ్ళో ఆస్థా అరోరాను ప్రేమించేది. కాని సమాజం ఇలాంటి సంబంధాలను పడనివ్వదుగా. తల్లిదండ్రుల వొత్తిడికి తలవొగ్గి ఆస్థా బాని తమ్ముడితో పెళ్ళి చేసుకుంటుంది. మూడేళ్ళైనా పిల్లలు లేరు, కారణం ఆమె పిల్స్ మీద వుంది. పెళ్ళి అయినా ఆమె మనసంతా బానీ మీదే వుంటుంది. అన్ని వొదిలేసి ఆమెతో వుండగలిగితే ఎంత బాగుండు అనుకుంటుంది. నిలకడగా చాలా సంవత్సరాలపాటు నిలిచిన వాళ్ళ సంబంధం ఈ పెళ్ళితో తెగిపోయింది. బానీ లిసా రే అన్న సినీ నటికి పెర్సొనల్ ట్రేనర్ గా కుదురుతుంది. ఇద్దరూ శారీరికంగా వొక్కటవుతారు. బానీ మనసులో ప్రేమ వున్నా, లిసా మాత్రం సందిగ్ధంలోనే వుండి ఈ సంబంధాన్ని చాటుగానే వుంచాలని చూస్తుంది. బానీ మాత్రం ఇంకెవరూ తన దగ్గరికి రావాలని చూసినా, సారీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటుంది నిజాయితీగా. ఈమె కథలో ఇలాంటి సెక్స్ ధోరణులు కలిగిన వారికి సమాజంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతాయో కనిపిస్తుంది.

రెండో సీజన్ గురించి మరో సారి. ఈ సిరీస్ గొప్పగా వుందా? లేదు. చూడతగ్గదా? అవును. మన కథలూ, చిత్రాలూ తల తిప్పి వెళ్ళి పోయే చాలా అంశాలను ఈ సిరీస్ చర్చిస్తుంది. మాన్వి తను బ్లాక్మేల్ కు గురి అయినప్పుడు అర్జంటుగా మిత్రులను పిలిపిస్తుంది బార్ కి, సలహా-సహాయాల కోసం. కాని కీర్తి నీకు ఈ సమాజం తెలుసు కదా, ఇంతవరకూ ఎందుకు తెచ్చుకున్నావు అంటుంది. సాయాని మందలిస్తుంది నువ్వు కూడా విక్టిం నే విమర్శిస్తే ఎలా అంటుంది. వీళ్ళతో లాభం లేదని, నా సమస్య నేనొక్కదాన్నె చూసుకుంటాను, అయినా నేను ఆ పని చేసింది నాకు నచ్చడం వల్ల అంటుంది మానవి. నిజమే మగవాళ్ళూ, ఆడవాళ్ళూ అలాంటి కలాపాల్లో పాల్గొంటున్నప్పుడు నైతికత ప్రశ్నలు, vulnarabilities like hounding and blackmail స్త్రీలమీదే ఎందుకు?

ఇక అవకాశం దొరికినప్పుడల్లా మగవాళ్ళ మీద చురకలు కూడా. బార్ లో నలుగురు కుర్రాళ్ళు ఈ నలుగురు అమ్మాయిలకోసం డ్రింకులు పంపిస్తారు. వీళ్ళు వెళ్ళి పరిచయం చేసుకుని, సెక్సు లో ఎవరికి ఏది ఇష్టమో వివరంగా చెబుతారు. ఇది ఊహించని ఆ నలుగురి మొహాలూ పడిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా వున్నాయి.

మరో విషయం. ఇది ఫెమినిజమా అంటే అవునూ కాదూ అని సమాధానం. ఇది కేవలం ముంబై లాంటి నగరాల్లో చదువుకున్న అమ్మాయిల జీవితం చుట్టూ తిరిగే కథ. ఇదే కథ పల్లెల్లో, దళితుల్లో కనబడవు. ఏ వర్గానికి సమస్యలు ఆ వర్గాన్ని అనుసరించి వేరువేరుగా వుంటాయి. ఎంత మంది స్త్రీలు వుంటే అన్ని రకాల సమస్యలూ, అన్ని రకాల పరిష్కారాలూ వుంటాయి. one size fits all లాంటిదేం వుండదు. ఇది చూస్తున్నప్పుడు వేరే వర్గాన్ని తలచుకుని ఇదే ఎందుకు చర్చించాలి అనుకుంటే దానికి సమాధానం వుండదు.

ఈ పాత్రలు పరిపూర్ణ పాత్రలా? అసలు అలాంటి మనుషులే వుండరు. ఇక పాత్రలెక్కడినుంచి వస్తాయి? అందరిలోనూ గ్రే షేడ్స్ వుంటాయి. లోపాలు వుంటాయి. మనం చూడాల్సింది ఈ పాత్రల కాల-స్థలాలలో ఇలాంటి సమస్యలు నిజమా? దానికి వాళ్ళను విమర్శించి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? లేక మరింత నిజాయితీ అవసరమా? అని.

*

పరేశ్ దోశి

6 comments

Leave a Reply to నారాయణస్వామి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇక వాయిదా వెయ్యకూడదు. చూసేయాలి

    మీ రైటప్ మరీ ఉత్సుకత రేకెత్తిస్తోంది

  • చాల మంచి పరిచయం నేను మొదలు పెట్టి పనిలో పడి పూర్తి చెయ్యలేదు – త్వరలో చెయ్యమని పురమాయించింది మీ వ్యాసం

  • Very candid write up on the bold characters of web series…. ఎక్కడో పల్లెల్లో వాళ్ళకు తెలియని పాత్రలన్నారు…You are mistaken Paresh garu, ఆస్ట్రేలియాలో వున్న నాకు చదువుతుంటే ఇలాంటి పాత్రలు నిజ జీవితంలో వుంటాయా అని a big surprise🤔🤔🙄🙄

  • I don’t think it’s worthy of a review/discussion even. These kind of free spirited and BOLD women movies give lot of scope for showing what they want to show. They are in the business sorts they wanted to be in. It’s show business. Nothing more than it. 😏

    • ఆ మాటకొస్తే, ‘షోయింగ్ వాట్ దే వాంట్’ అనే ప్రక్రియ, తెరమీద బొమ్మలౌ కదలడం మొదలైన నాటినుంచీ జరుగుతున్నదేనండి. ఏ కథైనా జీవితంలోంచే పుడుతుంది. అలాగే ఇవి కూడా. కాకపోతే ఇవి ‘సంసార పక్షమైన ట్రాక్‌నుంచి తప్పించుకుని నడిచే కథలు.

      • Unfortunately- Yes. This sort has got more audience/ readers since ages, so it gets to be in supplied to make money out of the demand. Educated/ Neo-rich taking it as if it’s “new normal” is quite concerning.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు