సంపెంగలు – విరిగిన గళాసులు

సింహాచలం అంటే సింహ పర్వతం అని అర్థం. వరాహలక్ష్మి నరసింహుడిని సింహాద్రి అప్పన్న అంటాం.

విష్ణువు నాల్గో అవతారం   సింహాద్రప్పన్న.

రాక్షస రాజు హిరణ్యకశిప మహారాజుకి విష్ణువు అంటే అస్సలు పడి  చావదు.

అతని  కుమారుడు ప్రహ్లాదుడేమో పుట్టుకతోనే విష్ణు భక్తుడు.

అనేక రకాలుగా ప్రయత్నించి న హిరణ్యకశిప మహారాజు, కుమారుడికి  విష్ణుమూర్తి అంటే ఇష్టం లేకుండా చేయలేకపోతాడు.

విసుగెత్తి చివరికి తన భటులతో ప్రహ్లాదుని చంపేయమని పురమాయిస్తాడు. కానీ ప్రతిసారీ ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు.

విసిగిన హిరణ్యకశిపుడు ‘ నీ హరి ఏడబడితే ఆడుంటాడని సెబుతున్నావు కదా? ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించమని చిరాకొచ్చి ఫాట్ .. మని స్తంభాన్ని పగలగొట్టాడు. ‘

‘అప్పుడు విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, కోపంతో హిరణ్యకశిపుని చంపీసాడు.’

‘స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవ మహా రాజుకి  పుట్టలో కప్పి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు.’

‘విగ్రహాన్ని సంవత్సరమంతా    చక్కని చందనంతో కప్పి ఉంచుతారు, ఎందుకంటే కోపంతో రగిలిపోయిన  ఆయనకు సల్లగా ఉంటుందని.

ఆ సాంప్రదాయం ఇప్పటికీ ఉందనుకో. అలా ఆ రాజు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు.

వరాహం ,నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని  నిజరూపం వరాహ  తల, సింహం తోక కలిగి మానవ  శరీరంతో ఉంటుంది.’

‘అదమ్మాయ్ స్వామి స్థలపురాణం, సింహాద్రి అప్పన్న అంటే పేదల గాడ్ తల్లి, అందుకే నువ్వు జగదాంబ సెంటర్ కెళ్ళి ..అప్పన్నా.. అప్పారావు .. అప్పలరాజు, అప్పలకొండా.. అని గట్టిగా  పిలిచావనుకో ఆడా  మగా కలిసి వంద తలకాయలు నీవైపు తిరిగి చూస్తాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది. ?’

‘పేద జనానికి ఆయనంటే ప్రేమ అని అర్ధమవ్వాల?’ అన్నాడు సాధువు.

అంత వరకూ చెప్పి సాధువు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని గెడ్డం నిమురుకున్నాడు.

సాధువు ఇంకా కథ చెప్పిన తన్మయత్నాన్ని వీడలేదు.

ఆయన గెడ్డం నిమురు కోవడం అయ్యాక డిస్టర్బ్ చేయొచ్చులే అని,ఈలోగా చింతలగ్రహారం నుంచి వొచ్చిన గొల్లలు అమ్మే మజ్జిగో పెరుగు తాగుదామని ఒక యాభై మెట్లు పైకి ఎక్కిన కొండా ఎస్. ఎ. కి అక్కడెవరూ కనిపించలేదు.

‘ ఇక్కడ మజ్జిగ, పెరుగూ కొబ్బరి చిప్పతో అమ్మే వాళ్ళు లేరా ‘ అని మెట్టుకి అవతల గోడవారగా కూర్చున్న ఒక బిచ్చగాడిని అడిగింది.

సీరియస్గా సెల్లు చూసుకుంటున్న బిచ్చగాడు, అది పక్కన పెట్టి ” అల్లు రాడం మానీసి చాలా కాలమైంది, ఇప్పుడు ఎక్కువగా ఎవరూ మెట్లిక్కి అప్పన్న దర్శనానికి యెల్లటం లేదు కదా, ఆ ళ్లకు బేరాలు లేక ఇక్కడకు రాడం మానీసారు ‘ అన్నాడు.

‘అలాగని అస్సలు అమ్మటం లేదని కాదు, బస్సెక్కి కొండ మీది కెళ్ళి అక్కడ అమ్ముతున్నారు.’

మళ్ళీ వాడే అన్నాడు ‘ఇది వరకు ఈ మెట్ల మీద పనస తొనలు, పైనాపిల్ ముక్కలు, పెరుగు అమ్మీవోరు, ఇప్పుడవి లేవు. కొండ మీద కెళ్ళండి అక్కడ ఉల్లి సమోసాలు, బంగాళా దుంపల సమోసాలు అమ్ముతున్నారు, ఈళ్ళు కూడా ఆ పక్కనెక్కడో కూర్చుంటారు, మరి జనం ఈల్ల పెరుగు తాగుతా న్రో, పాకెట్లో వొచ్చే బటర్ మిల్కు తాగుతాన్రో?’.

తిరిగి మెట్లు దిగుతూ బిచ్చగాడికో యాభైయ్యీ , సాధువుకు వందా ఇచ్చింది కొండా.

‘  ఏంటి బిచ్చమా ?’ అన్నాడు. ‘ కాదు బ్రో.. సమాచారం ఇచ్చినందుకు ‘ అని వేగంగా నడిచి కింద ప్రసాదాల కౌంటర్ దగ్గర వున్న తన యాక్టివా బండి తీసి వేగంగా కొండ మీదకు బయలు దేరింది.

అడవివరం జంక్షన్ నుంచి పైనాపిల్ కాలనీకి వెళ్లే ముందర కొండ మీదకు కొత్త రోడ్డు వేసారు, సర్రున దూసుకు పోవొచ్చు, ఎటునుంచి చూసినా పచ్చని పచ్చదనం.  సీతాఫలం చెట్ల,వేప చెట్ల గాలి,తల్లి మాట లాంటి గాలి, గాలిలో సంపెంగ పూల పరిమళం.

*  *  *

జనం వేళల్లో వస్తున్నారు, పక్క జిల్లాల నుంచి, కాకినాడ జె యెన్  టి  యూ నుంచి కూడా గుం ట లొస్తున్నారు,కాళ్ళకు చెప్పులు లేకుండా జీను ప్యాంటు టీ షర్టులతో వున్నారు. చాలా మంది షూ లు వేసుకొని నడుస్తున్నారు. అనకాపల్లి నుంచి, విజీనగరం నుంచి కూడా జనాలు వొస్తున్నారు.

కొంత మంది గుంటలు స్పీకర్ బాక్సులతో నడుస్తున్నారు, అందులో పెద్దగా లేటెస్టు లస్కు లఫా సినిమా పాటలు, చాలామంది ఫోన్ లలో సినిమా పాటలు.

ఆ నడిచే జనాల్లో చాల మంది చెవులకి ఇయర్ ఫోన్స్ వున్నాయి,కొంత మంది ఫోన్ లోనే గంటలు గంటలు మాట్లాడుకుంటూ పోతున్నారు.

ఒరిస్సా నుంచి జనాలు ఎలాగూ వస్తారు. వాళ్ళ మానాన వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసేస్తుంటారు.

పిల్లలు పుట్టటం లేదు కరుణించు తండ్రీ అని నడిచే వాళ్ళు కొందరు, ఇంజనీరింగ్ పూర్తి చేయించి మంచి వుద్యోగం ఇప్పుంచు అని నడిచే గుంటలు కోకొల్లలు.

ఆరోగ్యం బాగు చేయి అప్పన్నా అని నడిచే వాళ్ళు ఇంకెందరో. పిల్లకు పెళ్లి చేయి తండ్రీ నీ కొండ మీదే చేస్తాను అని మొక్కుకునే తల్లులు.

భక్తితో నడిచే వాళ్ళు, భామల కోసం, అమ్మాయిల కోసం నడిచే వాళ్ళు, ప్రసాదాల కోసం నడిచే వాళ్ళు, పుణ్యం కోసం నడిచే వాళ్ళు, ఈ ఈవెంట్ ని  నిలబెట్టాలని నడిచేవాళ్ళు, ఇలా ఎవరి గోల వాళ్ళది. మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు కాళ్ళకు చెప్పులు లేకుండా గిరి చుట్టూ అప్పన్న మీద భక్తితో, ఉపవాసంతో నడవాలి.  ఇప్పుడేమో టీ షర్టులు, కానీ లక్ష జనాలు ట్రాక్ ప్యాంట్లు వేసుకొని నడుస్తున్నారు. అదేదో వాకింగుకో ట్రెక్కింగుకో వెళ్లినట్లు. ఏం మనుషులురా నాయనా? అని ఆలోచించుకుంటూ స్కూటీ మీద వెళుతోంది కొండా.

కొం చిన్నప్పుడు డా కి వాళ్ళ అయ్యా చెప్పేవాడు, ఒకప్పుడు గిరి ప్రదక్షిణ రాజులు, గవరలు, గొల్లలు మాత్రమే చేసేవారు అని..

పది మంది ఒక బృందంగా వుండి కోడె దూడను అలంకరించి కాగడా పట్టుకొని దానితో కలిసి ఆ వెన్నెల రాత్రిపూట బయలుదేరేవా రు. తమ ఇంటి  దగ్గర చాలా  సేపు గరిడి చేసి అప్పుడు బయలు దేరేవారు అందరూ. గరిడి చేసేటప్పుడు లయబద్దంగా పాటలు పాడేవారు.

ఒక సంవత్సరం నేను కూడా వస్తానయ్య అని మారం చేస్తే తీసుకెళ్లాడు, జాగ్రత్త బిడ్డ ఈ కొండ చుట్టూ వున్న గిరుల్లో తోడేళ్లుంటాయి, నక్కలుంటాయి, మెఖాలు ఉంటాయి.

‘ అయ్యా.. ఎందుకు గిరిప్రదక్షిణం చేస్తున్నాం మనం ?’ అని అడిగింది చిన్నప్పుడు ఆ అడవి బాట లాంటి రోడ్డులో నడుస్తూ వెళుతుంటే.

‘ నమ్మకం తల్లీ.. ఈ కొండ చుట్టోత ఔషధ మొక్కలు ఉంటాయట, ఈ ఆషాఢ మాసంలో వర్షం ఎండా కలగలిపి వొచ్చే జబ్బులు తగ్గాలంటే కొండ చుట్టో గిరిప్రదక్షిణ చేస్తే ఆ ఔషదాల గాలి మనకు తగిలి శరీరం గట్టిగ ఉంటాదని మా  అయ్య చెప్పాడు.’ అన్నాడు.

ఆ ఆషాడ పౌర్ణమి వెన్నెల్లో గిరులన్నీ వెండి కొండల్లా వున్నాయి, చెట్ల మీద వెండి వెలుగులు.

కీచురాళ్ళ చప్పుడు, ఎక్కడో దూరంగా నక్కల కూతలు,పొద్దుటే సముద్రపు అలల హోరు, ఒక జీవిత కాలానికి సరిపడా సౌందర్యం తనలో నింపు కున్న కొండాకి ఇప్పుడు జనం చేస్తున్న ఈ హడావిడి రుచించటం లేదు.

‘ఇక్కడింత చల్లగా ఉండేందుకయ్యా ?’ అని అడిగింది.

‘సింహాచలం గిరి నిండా జల  ధారలు, జీవ ధారలు వుంటాయమ్మా, చల్లని చక్కని నీళ్లు, అదిగో సీతమ్మధార, మాధవధార ‘ అన్నాడు అయ్య.

‘ నన్ను మాధవస్వామి ధార తీసుకెళ్ళు నాన్న ‘ అంది.

‘ అలాగే వెళ్లే దారిలోనే కదా , తప్పక వెళదాం ” అన్నాడు.

‘ మరి ఈ కోడె దూడను ఏం చేస్తాం ? మళ్ళీ మనింటికి పట్టుకుపోతామా ?’

‘ లేదమ్మా సింహాచలం దగ్గర గోశాలలో ఈ కోడెదూడ ఇచ్చేస్తాము ‘ అన్నాడు.

ఇలా ఎన్నో జ్ఞాపకాలు, అయ్య ఉండుంటే ఇప్పుడీ గిరి ప్రదక్షిణ చూసి యేమని వుండేవాడో అని

ఇలా ఇంకేవేవో ఆలోచించుకుంటూ వేగంగా ఆ కొండ మలుపు తిరుగుతుంటే అట్నుంచి వేగంగా వొచ్చిన ఇన్నోవా బండి కొండా ని ఒక్క గుద్దు గుద్దింది.

‘ అయ్యా ‘ అని గట్టిగ అరుస్తూ ఆ జీడి మామిడి, పనస చెట్ల మధ్యలోకి గాల్లో ఎగిరిపడింది.

*  * *

‘ అమ్మా కొండా లే’ అంటున్నారు డాక్టర్ గారు బుగ్గ మీద చేత్తో  కొడుతూ.

‘ ఎలా వుంది ఇప్పుడు, సర్జరీ బానే అయిపోయింది, వారం రోజుల్లో ఇంటికి పంపిస్తాము ‘ అన్నాడా గుంటూరు నుంచి వొచ్చి వైజాగులో సింహాద్రి అనే క్లినిక్కు పెట్టిన తెల్లటి డాక్టరు.

కొండా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అమ్మ వొంక చూసింది.

‘నీ యాక్టివా బండి తుక్కు తుక్కు అయిపోయిందే.. నువ్విక బతకవనుకున్నాము.  వెతగ్గా, వెతగ్గా సంపెంగ పూల మొక్కల్లో చిక్కుకొని వున్నావు. ఒంటికి చాలా గాజు పెంకులు గుచ్చుకున్నాయి తల్లీ’ అని వన్ టవును కనక మహాలక్ష్మి అమ్మవారి బొట్టు కూతురి నుదిటిన పెట్టింది.

‘ అదేంటి నన్ను రక్షించినాయన ఏడి ?’ అని గొణగడం మొదలు పెట్టింది కొండా.

‘ రోడ్డు మీదనుంచి ఎగిరాను ..కింద పడ్డాను, దెబ్బలు తగిలాయి, కానీ నన్ను సంపెంగ పూల మొక్కల్లో పెట్టినాయన.. సింహం మొఖంతో మధ్య పాపిడి జుత్తుతో, మొఖం నిండా గెడ్డంతో వున్నాడే, ఆయనేడి  అని గొణుగుతుంది. ‘

అయ్యో బిడ్డ బాధతో మూలుగుతుంది కొంచెం మత్తు ఇవ్వండి డాక్టర్ అంది లబోదిబో మంటూ ఆ తల్లి.

‘బిడ్డ నొప్పి చూడలేకున్నాను కొంచెం మత్తు ఇవ్వండి దయుంచి ‘ అని బతిమాలాడుతుందామె కూతురుకి  తగిలిన పగిలిన గాజు పెంకుల దెబ్బలు తలచుకుని.

నొప్పి తెలీకుండా నిద్రపట్టడానికి డాక్టర్ ఒక చిన్న మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ‘అస్తమానూ మత్తు ఇవ్వకూడదమ్మా, ఒక్కోసారి ప్రమాదం అన్నాడాయన. ‘

ఆ మత్తులో హాయిగా వుంది కొండా ఎస్ ఎ అని పేరు రాసుకుంటూ బెంగళూరులో పనిచేసుకుంటూ పెందుర్తి వాసి అయిన సింహగిరి అప్పల కొండ అనే ఆ పాతికేళ్ల అమ్మాయికి.

మత్తులో తను ఇప్పుడు ఏ బాధ లేకుండా నిద్ర పోతోంది, అవును మత్తు అవసరం, రోజువారీ ఈతి బాధలు మరిచి పోవాలంటే జనానికి మత్తేగా అవసరం, మిగతా రాజకీయాలు పేద జనాల కెందుకు.

*

 

హరివెంకట రమణ

రచయిత కుదురుగా ఓకే చోట పనిచేస్తే ఎలా ? అందుకే పత్రికా రంగం లో మొదలయ్యి యానిమేషన్ లో పనిచేసి తరువాత యెన్. జీ. ఓ రంగంలో పిల్లల హక్కులు, విద్య,సంరక్షణ అంశాలపై పనిచేస్తున్నాను. చదువేమో తెలుగు, సోషల్ వర్క్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్సు.
'బర్మాకేంపు కథలు '( ఈ మధ్యే పుస్తకం గా వొచ్చింది ) ఇంకా స్కూలు అనుభవాలు ' మా బడి కథలు ' గా వొచ్చేయి మరో పదిహేను కథలు పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. పాతికేళ్లుగా వ్యంగ్య రాజకీయ చిత్రకారుడిగా ఫ్రీలాన్సరుగా ఉంటూ మూడు కార్టూను పుస్తకాలు ప్రసవించాను. ( హరి కార్టూన్లు, జగమేమాయ, ఇదీలోకం)

భారత ప్రభుత్వ యువజన అవార్డు 2012 లో అందుకుని, 2022 లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై మానవ అక్రమరవాణా అంశంపై అధ్యయన యాత్రకు నెలరోజుల పాటు పర్యటించిన నేను పత్రికల్లో విద్య, బాలల అంశాలపై వ్యాసాలు కూడా రాస్తుంటాను.

4 comments

Leave a Reply to Kiran Palepu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Very nice sir excellent sir 🤝 చాలా చక్కగా ఉంది సార్ ప్రతి విషయన్ని క్లియర్ గా వివరించారు ప్రతి సన్నివేశాన్ని చక్కగా రూపొందించారు. కధ రూపంలో చాలా చక్కగా రాసారు సార్ మీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు సార్ మీ రాసిన కధ లు చాలా బాగున్నాయి సార్ 🤝

  • ‘సంపెంగలు విరిగిన గాళసులు’ కధ సరళ శైలిలో
    కధ ఆసక్తిగా చదివింప చేసింది

  • హరిగారు మొన్ననే గిరి ప్రదక్షిణ చేశాను మరలా కథ చదివాక ఇలా ఈరోజు కూడా😊 ఆద్యంతం కథ చాలా బాగుంది, కథ నడిచే క్రమంలో కొంత హాస్యాన్ని కోరుకున్నాను , నిడివిని దృష్టిలో పెట్టుకుని రాశారని అర్థమైంది.Keep continue sir 👌👌👌👌

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు