జపాన్, చైనా దేశ జెన్ బౌద్ధ భిక్షువుల గురించి మనం చదివాము. వారి జీవన శైలి గురించి తెలుసుకున్నాం. కానీ తెలుగు పాఠక లోకానికి ఈ కాలంలో అదే విధంగా జీవించాలన్న ప్రత్యక్ష వ్యక్తులు, అది కూడా అలా జీవించాలన్న విషయంలో ఏ వైరుధ్యమూ లేని భార్యాభర్తలు తారసిల్లుతారని ఊహించలేము. వారే జయతి, లోహి కోయిచి కోరన్లు. వారు అలా జీవించడమే కాక వారి అనుభవాలు ఇప్పటి వరకూ దిమ్మరితో సహా నాలుగు పుస్తకాలు జయతి గారు తెలుగులో, లోహి గారు బైసికల్ డైరీస్ అని ఆంగ్లంలో రాయడం అదృష్టం. ఆ పుస్తకాలు త్యజించడం అంటే ఏమిటో మనలో కొంతైనా ఇంకిస్తాయి.
మీ మొదటి పుస్తకం అడవి నుంచి అడవికి రెండవది అడవి పుస్తకం మధ్య మూడు సంవత్సరాల కాల వ్యవధి ఉంటే మూడవ పుస్తకం మనం కలుసుకున్న సమయాలు నాల్గవ పుస్తకం దిమ్మరికి మధ్య కాల వ్యవధి సుమారు ఏడు నెలలు మాత్రమే! ప్రత్యేక కారణం ఏమైనా ఉందా జయతి గారూ?
లేదు. రాయాలనిపించినపుడు రాస్తాను. ఏదైనా అనుభవమైనప్పుడు నా మనసులో ముద్రపడిపోతుంది. రాయడానికి సమయం కుదిరినప్పుడు మనసులోకి తిరిగి చూసుకుంటాను. కల్పితం రాయలేను. అది నా చేతకాదు. రాయాలనిపించాక రాయకుండా ఉండలేకపోయినా, రాస్తున్నపుడు కలిగే మంచి అనుభవమే నేను రాసేలా చేసేవి.
కొంచం వివరంగా చెప్తాను. నేనెప్పుడూ ఒకటి పూర్తయ్యాక ఆ తరువాత నేనేమైనా పరవాలేదనుకుంటాను. అడవి నుండి అడవికి అప్పుడు అంతే అనుకున్నాను.
ముందు రాయడం కూడా నా ఆలోచన కాదు. వాడ్రేవు చినవీరభద్రుడు గారు అన్నారనుకుంటాను. నాకు సరిగ్గా గుర్తులేదు. ఫేస్బుక్లో నేను రాసేవి, షేర్ చేసిన ఫోటోలు చూసి నాకు మెసేజిలు వచ్చేవి ఎంతమంది నుంచో. రాసింది పాఠకులకి ఇష్టమవుతున్నకొద్దీ వాళ్ళ స్పందనల్ని బట్టి ఒక పుస్తకం అచ్చువేస్తే timeless గా ఉండిపోతుందనిపించింది నాకు.
ఆ తరువాత వైటీని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయాం. అడవిని అన్ని ఋతువుల్లోనూ, అడవిలో జరిగే ప్రతి మార్పుని ఫోటోలు తీస్తున్నాను. అడవి నుండి అడవికి ముందు కూడా రాసేదాన్ని. అడవికి చేరాకా కూడా నా అనుభవాల్ని రాశాను. ఇప్పటికే ఎంతమందినో నా రచనలు కదిలిస్తుండటంతో, అడవిలో నేను చూసినవీ, మట్టి కుటీరం మా సొంతగా నిర్మించడమూ, దిమ్మరిలో ‘నగ్నపాదాలు’ లో చెప్పినటువంటి మేమెదుర్కున్న పరిస్థితులు రాస్తూనే ఉన్నాను. నాకోసమనీ కాదు ఇతరుల కోసమనీ కాదు. పుస్తకాలమ్మితే డబ్బు వస్తుందనీ కాదు. మా అవసరం ఆహారం మాత్రమే. అడవిలో కొంత పుస్తకాలవల్ల కొంత సమకూరేది. రాయడం ఒక అవసరంగానూ మారలేదు నాకు. ఫోటో తియ్యాలనిపించినట్టే రాయలనిపించి రాసేదాన్ని. 2018 అక్టోబర్లో అడవి నుండి అడవికి పూర్తైతే 2012 ఏప్రిల్ దాకా ఈ మధ్య కాలంలో నా అనుభవాలు అడవిపుస్తకమైంది. అడవి పుస్తకం తరువాత ముందులానే మరో పుస్తకం ఆలోచన లేదు. వరహా నది తీరంలో ప్రారంభించి కొంత కాలం మార్క్వెజ్ నవల అనువాదం చేశాను లోహి అడగడంతో. వరహానదిని వదిలిపెట్టి వచ్చి, కొత్త స్థలంలో మరో కుటీరం నిర్మించడం ప్రారంభించి అనువాదానికి సమయం లేక పక్కన పెట్టాను. మళ్ళీ కుటీరం నిర్మాణం, తోట పెంచడం, ఎప్పటిలానే నా అనుభవాలని రాయడం, షేర్ చేయడం జరుగుతోంది. 2022 సంవత్సరం మధ్యలో ఒకనాడు ‘మనం కలుసుకున్న సమయాలు’ అనే మాట తట్టింది ఏదో ఒక క్షణంలో. అది రాశాక ఏదో కొంత మిగిలే ఉందనిపించింది. దాని తరువాత మళ్ళీ స్థలం మారడం, రాయాలనిపించడం, దిమ్మరి వెంటనే రాయడం అనుకోకుండానే జరిగింది. అయితే, స్థలం మారడంలో తట్టిన మాట దిమ్మరి. కుటీరం ఆలోచన కూడా ఇక లేదు కనుక.
ఇంతవరకు రాసిన పుస్తకాలన్నిటిలోకి “దిమ్మరి” పుస్తకమే నాకిష్టం” అనడానికి గల కారణాలు వివరించగలరా?
ఔను, దిమ్మరి నాకు చాలా ఇష్టమైంది. వాగబాండ్ అనే మాట, వాగబాండ్ జీవితం నాకు ఇష్టం. అలా ఉండాలనుకునేదాన్ని. అలా అవుతూ వచ్చాను. ఉండిపోవడం కన్నా వెళ్ళిపోవడం నాకు ఇష్టం. వెళ్తూ ఉండేవాళ్ళనే కదా దిమ్మరి అంటారు.
మనం కలుసుకున్న సమయాలు అంటే నా ఉద్దేశ్యంలో నేను మనుషులు, పరిస్థితులు, చెట్లూ, అడవులూ, నదులు, పక్షులు రాళ్ళు లాంటివి కలుసుకోవడమే కాదు, జీవితపు అంచుల్ని కలుసుకోవడం. జీవితపూ మరణపు అంచులమీద నిలబడడం. చాలా బాగుంటుంది అక్కడ. తేనెటీగలు దాడిచేసినప్పడూ, అడవి దారుల్లో తిరుగుతున్నప్పుడే కాదు, ఒకచోటనుంచి మరొకచోటికి వెళ్ళవలసి వచ్చి ఏ దారీ లేనప్పుడు, ఇంకా ఇదనీ వివరించలేని ఎన్నో సందర్భాల్లో పదునైన ఆ అంచుల మీద నడిచిన సమయాలున్నాయి. Zen saying ఒకటుంది, The whole essence of Zen consists in walking along razor’s edge of now అని.
అలాగే మరొకటి, Above, not a tile to cover the head; Below, not an inch of ground for the foot అని. అర్ధం ఏమిటి. ఈ present moment లో పదునైన అంచులమీద ఉండడాన్నే నేను మనం కలుసుకున్న సమయాలుగా రాసే యత్నం చేశాను. ఆ తరువాత రాయవలసింది ఇంకా ఉందనిపించిందంటే నేను చెయ్యవలసింది పూర్తి చెయ్యలేదని. అందుకే దిమ్మరి వచ్చి ఉంటుంది.
దిమ్మరిలో ఆకాశం అధ్యాయంలోని మూడో భాగం తప్ప రెండు నుంచి ఐదు అధ్యాయాలు నేను పదేళ్ళ క్రితం ముందే రాశాను. రమ ఇల్లు పూర్తి చెయ్యలేదనే భావం మిగిలి ఉండేది. దిమ్మరిలో రమ ఇల్లు పూర్తి చేశాను. దిమ్మరి ఎక్కువ ఇష్టం కావడానికి ఇటువంటివొక కారణం కావచ్చు. అనంతయాత్ర, The Stars ,The Wind, The Rain రాసినప్పుడు తృప్తిగా గుండెలనిండా ఊపిరి తీసుకున్నాను. ఎందుకో చెప్పలేను. చివరి అధ్యాయం నా మనసులో ఎప్పటినుంచో ఉంటున్నది. ఇవన్నీ అందరూ మమ్మల్నడిగే ప్రశ్నలే. నేను చెప్పలేకపోయే సమాధానాలే. ఇప్పుడు రాసే సమయం వచ్చింది. ‘అనంతయాత్ర’ ‘అన్నం, నీడ, నిద్ర’, ‘రాలినవి ఏరుకుంటూ’ ల్లో అంతే. సైకిల్ యాత్ర పూర్తైనపుడే కొంత రాసి ఆగిపోయేదాన్ని. మిగిలిపోయినట్లుగా ఉండేవి. సంవత్సరాలు గడిచాక ఇప్పుడు ఈ అధ్యాయాలు నేను వారంరోజుల్లో రాయగలిగాను. నగ్నపాదాలు, ఏకాంతం, అగ్గిపెట్టె లేబుళ్ళు, నల్లమలలో నాలుగు రోజులు కూడా.
లోహి మూడేళ్ళ క్రితం మొదలుపెట్టిన నవల కాస్త కూడా ముందుకి పోలేక నల్లమలకి వచ్చాక సగంపైన రాసేశారు. అలాగే దిమ్మరి. నల్లమలకి రావడంవల్ల అలా జరిగి ఉండవచ్చు. కొన్ని చోట్ల మనలో కొత్త తలుపులు తెరుచుకుంటాయి. కొత్త పరిసరాలు పరిస్థితులు మిగిలిపోయానవి పూర్తిచెయ్యడానికి సహకరిస్తాయి.
దిమ్మరి పుస్తకంలో కొన్ని భాగాలు ఉదాహరణకి వసంతంలో ఒక మరణం, నల్లమల అడవిలో నాలుగు రోజులు, నగ్నపాదాలు లాంటివి చదువుతుంటే అనంత ప్రయాణంలో మనసులో ఏ మూలో గూడు కట్టుకున్న బాధ కలిగిస్తున్న అవరోధం తొలగించుకునేందుకు ఈ పుస్తక రచన చేసారేమో అని నాకనిపించింది. మీ అభిప్రాయం ఏమిటో తెలియజేస్తారా?
వసంతంలో ఒక మరణం నా పెద్ద తమ్ముడు చనిపోయిన మరునాడు రాసింది. 2013 లో. చిన్న తమ్ముడికి మెయిల్ చేస్తే దాన్ని ప్రింటు తీసి వాళ్ళమ్మకి చూపించాడు. దాంతో వాళ్ళకి నా మనసు తెలిసింది.
అవరోధాలు ఎప్పుడూ లేవు. అటాచ్మెంట్స్ లేవు. గొప్ప పెయిన్ ఉండేది. బెంగ ఉండేది. దాన్ని అర్ధం చేసుకోవడానికి, దాన్నుంచి విడుదల కావడానికి కాకపోతే సైకిల్ తొక్కడం నేర్చుకుని అన్ని మైళ్ళ దూరం ఎందుకు సైకిల్ తొక్కుతాను. నా మనసులో ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వెళ్ళాలి. నాకేం తెలుసు. కుటీరం కట్టాక ఇది కాదనిపిస్తుంది. తోట పెంచాక ఇది కాదనిపిస్తుంది. ఎక్కడికి ఎందుకనేది తెలిసీ తెలియనట్లు ఉండి, నేను వెళ్ళి ఎవరినీ బాధకి గురిచెయ్యవద్దన్న ఆలోచనతో అడవిలో కొంత దూరంవెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేదాన్ని. ‘నల్లమల అడవిలో నాలుగు రోజులు’ లో వెనక్కొచ్చి లోహితో, నన్ను ఏ అడవి జంతువైనా తింటే, ఆహారం కావడం నాకు ఆనందం అని అనడం అదే. అసంకల్పితంగా నా నోటి నుంచి వచ్చే మాటలవి. అలా అని ఏం తెలియకుండా కాదు. తెలిసీ కాదు. ఏదో తెలియదు. అదంతే. పాము విషం పాముకి ఎంత విలువైనదో స్పష్టంగా తెలిసిన మేము, అలాగే నన్ను పాము కాటేసినా, నాకు మరేదైనా లోహికి అంతే స్పష్టం ఇప్పుడు. అవరోధాలు ఏమీ లేవు. నన్ను ఆపే విషయాలు ఎప్పుడూ లేవు. వెళ్ళిపోగలను. లోహితో చెప్పాలి, అంతే.
వైటీ ఉన్నంతకాలం ఉంటానంటుంటాను లోహితో. అదొక్కటే ముందు రాబోయే కాలం గురించి నేను మాట్లాడేది. ఆ తరువాత ఏమిటని ఎక్కడికని అడగవద్దు. నాకు తెలియదు. అడవిలోకి నడిచిపోతానేమో. పర్వతాలలోకి నడిచిపోతానో.
ఎప్పుడు వైటీ నా చేతుల్లోకొచ్చిందో అప్పటినుంచి వైటీని స్వేచ్ఛగా సంతోషంగా సహజంగా పెరిగేలా వైటీ చుట్టూ నేను ఉంటూ వచ్చాను. చివరి అధ్యాయంలో అదే రాశాను.
కొన్నేళ్ళ క్రితం అడవిలోకి వెళ్ళిపోవాలని గాఢంగా అనిపించినప్పుడల్లా లోహికి తెలియడానికి ఒక ఉత్తరం రాయాలనుకునేదాన్ని. ఎప్పుడూ రాయలేదు. నాలుగు పుస్తకాలు రాశాను! ఇప్పుడు నాకేం కావాలో లోహికి తెలుసు. నేను అదృశ్యమైపోయినప్పుడు, నా ఇష్టంతో సంతోషంతో వెళ్ళిపోయానని నా బంధువులు మిత్రులంతా కూడా తెలుసుకుంటారు.
కథల్లో పుల్ స్టాప్ ఉంది కాని ముగింపు లేదన్నారు. ఏ కథకైనా ముగింపు ఉంటుందని నాకు తెలియదు. ఇప్పటికీ నేను నా అనుభవాలనే రాశాను. ఒక చోటికి వచ్చాక ఇక రాసేదేమి లేక వదిలేస్తాను. ఆ తరువాత ఏమి ఉండదు. సహజంగా జరిగిందే.
బహుశా నా ఈ ప్రశ్న మీ అభిమానులకు (నాతో సహా) కొంత బాధ కోపం కలిగిస్తుంది కానీ దిమ్మరిలో కొన్ని వాక్యాలు చదివాక తరువాత చాలాకాలం పాటు మీనుంచి మరొక పుస్తకం తొందరగా రాదనిపిస్తోంది! అవునో కాదో మీరే చెప్పాలి.
దిమ్మరి తరువాత ఏం ఉంది రాయడానికి? ఏమీ లేదు. నేను రాయకపోవడం బాధ కలిగించబోతుందంటే, రాస్తున్నందువల్ల సంతోషం కలిగిస్తుందని. నేనిక రాయకపోవచ్చు. రాయవచ్చు. ఏం చెయ్యకపోవడాన్ని ఇష్టపడే నేను, ఈ రోజులో ఈ క్షణంలో జీవిస్తుండే నాకు ముందు ముందు ఏంచేస్తానో తెలియదు. ఇది చెయ్యాలని ఆలోచించను. ఈ క్షణంలో నాకు మరొకటి రాయాలనిపించవచ్చు. అనిపించకపోవచ్చు.
నేను కొన్ని మైళ్ళ దూరందాకా ఒక్క మనిషీ కానరాని గాఢమైన అడవిలో, లోహి, నేను, వైటీ, లూసీ కలిసి జీవించాలనుకుంటాను. Incognito గా. అక్కడన్నా ఉండాలనిపిస్తుందా, అదీ కాదనిపిస్తుందా? అయితే, నేనిప్పుడు దిమ్మరి గా ఉన్నాను.
దిమ్మరి పుస్తకంలో చివరి భాగం The Stars, The Wind, The Rain చదివాక మీ పుస్తక పఠనం John Krakauer రాసిన Into the Wild వైపు మళ్ళింది. మీ అనంత ప్రయాణంలో మరో దశకు (ఉదాహరణకు మరో కుటీర నిర్మాణమే చేయకుండా) చేరుకుంటోంది అన్న దానికి సంకేతమా?
ఓను. ఐతే, Into The Wild నేను ఎనిమిదేళ్ళ క్రితమే చదివాను. క్రిస్ మెకాండ్లెస్ కథ తెలిసి ఉంటుంది మీకు. Into The Wild అనడంలోనే క్రిస్ నేనూ ఒకటే అని తెలుస్తుంది కదా. అందుకే ఆ పుస్తకం నాకు చాలా ఇష్టం. ఎంత అంటే, నాదనుకునే ఒకే ఒక వస్తువు ఆ పుస్తకం అనిపించేది. ఇప్పుడనిపించదు. చెప్పేసాను కనుక. క్రిస్ ఇంట్లో చెప్పకుండా వెళతాడు. తల్లతండ్రులకి, తోబుట్టువులకి, స్నేహితులు ఎప్పటికీ బాధ మిగిల్చి. నేను చెప్పి వెళతాను. అదే దిమ్మరి పుస్తకం. అందుకే దిమ్మరి వెలువడ్డాక ఆ రెండిటిని పక్కపక్కన పెట్టి ఫోటో తీసుకున్నాను.
లోహి మనుషులకి అడవికి మధ్య ఉండగలరు. నేను కొన్ని మైళ్ళ దూరందాకా ఒక మనిషీ కానరాని గాఢమైన అడవిలో లోహి వైటీ లూసీతో కలిసి జీవించాలనుకుంటాను. Incognito గా. అక్కడన్నా నాకు ఉండాలనిపిస్తుందా, అదీ కాదనిపిస్తుందా? Incognito అయితే ఇక ఇంకేమి రాయను.
దిమ్మరి పుస్తకానికి మీ మూడు పుస్తకాలకు భిన్నంగా ఏ ముందుమాటా లేదు. ఇప్పటికే మీ పుస్తకంపై కొన్ని అభిప్రాయాలు వెలువడ్డాయి. ఆ దృష్ట్యా ఈ పుస్తక రచన గురించి ఇప్పుడైనా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా జయతి గారూ?
అడవి నుండి అడవికి తప్ప ముందుమాట దేనికి లేదు నిజానికి. అడవి నుండి అడవికి రాయాలని వీరభద్రుడు గారు అనడంతో మరెవరూ తెలియక ఆయన్నే రాయమన్నాను ముందు మాట. నన్ను గమనిస్తూ వస్తున్న వీరభద్రుడు గారు అడవి నుండి అడవికిని దగ్గరుండి డిజైన్ చేసి ఇష్టంతో ముందుమాట రాశారు. అడవి పుస్తకంలో, అడవి నుండి అడవికి ఆవిష్కరణ రోజు సూరపరాజు రాధాకృష్ణ మూర్తి గారు ఫేస్ బుక్ లో షేర్ చేసిన నోట్ ని ముందుమాటగా ఆయన అనుమతితో చేర్చుకున్నాను. సంతోషంగా ఒప్పుకున్నారు. నేను నాలుగు పుస్తకాల్లో రాసిందంతా నాలుగు వాక్యాల్లో చెప్పారాయన. దిమ్మరి కి ముందు మాట గురించి ఆలోచించాను. వద్దనే అనిపించింది. మానుకున్నాను. దిమ్మరి లో నేను ముందుమాటకి బదులు ఒకే ఒక వాక్యం రాసుకున్నాను to experience the void, solitude and silence అని. అంతకు మించి ఏమిలేదు.
మీరు, లోహి గారు ఈ విధమైన జీవన విధానం ఎన్నుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా?
మేమిలా evolve అవుతూ వచ్చాం. డబ్బుతో అవసరం లేకుండా జీవించాలనుకున్నాం. బ్రతకాడానికి మనకి ఏంకావాలి ఎంతకావాలనేవి మాకు స్పష్టమవుతూ వచ్చింది. కుటీరం కట్టడానికి తోట పెంచడానికి ఎంతో శరీర కష్టం చేశాం ఇద్దరం. ఇష్టంగా చేశాం. రాళ్ళు మోసాము. మట్టి తవ్వాము, మట్టి మోసాము. కూరగాయలు పెంచాము. కడుపు నిండేది మనసు నిండేది. ఇంకేం కావాలి? కొండలను రుచి చూసినవాళ్ళం మేము.
*
Amazingly beautiful❤
Pleasure reading such a Different experiences.. No one can live like that if they want to be..but they can when they are being like Nayure
Pleasure reading such a Different experiences.. No one can live like that if they want to be..but they can when they are being like Nature
రుషుల్లా జీవించడం చెప్పినంత సులువు కాదు.
అందునా..ఆధునిక జీవన సరళి అలవాటయ్యాక.
అలా జీవించి చూపించారు జయతి, లోహితాక్షన్లు.
“to experience the void, solitude and silence”-
మీ ఇంటర్వ్యూ ద్వారా వారి జీవన సారాన్ని ని చక్కగా రా బట్టారు. అభినందనలు వెంటేశ్వరన్ గారూ!