సౌదాఅరుణ యిద్దరా? వొక్కరా? అని నిన్న యెవరో వొక యువమిత్రుడు అడిగాడు. ఏమని చెప్పాలి? ఒక్కరనా యిద్దరనా? ఇద్దరూ వొక్కరే అనా? ఒక్కరే యిద్దరనా? నేనైతే వాళ్ళిద్దరూ వొకరు లేకుండా మరొకరిని వూహించలేను. ఇద్దరూ వొకరే నాకు.
మరిప్పుడెలా? అరుణ లేదని యెలా రాయాలి?
సారంగ కోసం అరుణ జ్ఞాపకాలు పంచుకోవచ్చు కదా అని అఫ్సర్ అడిగితే నాకు అరుణ జ్ఞాపకాలన్నీ సౌదాతో కలిపే గుర్తుకొచ్చాయి. సహజీవనం అన్న పదానికి సరైన వుదాహరణ వాళ్ళిద్దరూ. పెళ్లిలో దంపతుల్లో యెవరో వొకరు సొంత వ్యక్తిత్వాన్ని వొదులుకుని బతకాల్సి వస్తుంది కాబట్టి స్వీయ అస్తిత్వాల్ని కాపాడుకోవడానికి సహజీవనమే సరైన మార్గమని అంటారు. కానీ సౌదాఅరుణ ఇద్దరు మాయమై వొకరే మిగిలారు. ఆ వొక్కరు యెవరు అన్నది నాకు యిప్పటికీ సమాధానం దొరకని తాత్విక ప్రశ్నే.
ఎల్లి, అపూర్వ పురాణ కథలు … సాహిత్యం ద్వారా అరుణ- సౌదాలను విడివిడిగా చదువుకున్నప్పటికీ వ్యక్తిగతంగా యిద్దరినీ కలిపి సౌదాఅరుణ గా వొకరిగానే నేను కలుసుకున్నా.
***
‘అపూర్వ పురాణ కథలు’సమీక్షిస్తూ నున్నా నరేష్ పురాణాల్ని పునః కథనం చేసే సౌదా ‘లెఫ్ట్ హేండ్ లెజెండ్’ (పురచేతి పురాణంకు సౌదా అనువాదం) రచనల్లోని కోవర్ట్ వ్యూహాన్ని కరెక్ట్ గా పసిగట్టాడు. నిజానికి సౌదా కనిపించే కోవర్ట్ అయితే అరుణ కనిపించని కోవర్ట్. ఆ విషయం నాకు ఆమెను చూసిన తొలి రోజుల్లో తెలీలేదు గానీ ఆమెతో కలిసి ‘బర్బరీకుడు’ నాటకం ఆడే తర్వాతి దశలో తెలిసొచ్చింది. బ్రాహ్మణీయ మనువాద భావజాల విష వృక్షంపై బలమైన సబాల్ట్రన్ గొడ్డలి వేటు ఆ కథలు అని నాకెన్నోసార్లు అనిపించినప్పటికీ అచ్చులో వున్న కథని ప్రదర్శనగా మలిచే క్రమంలో పాలుపంచుకున్నందువల్ల అది దృఢమై స్థిరపడింది.
అపూర్వ పురాణ కథల్లోని బర్బరీకుడు కథని నాటకీకరించాలన్న ఆలోచన అరుణదే. దాని తొలి ప్రదర్శన రవీంద్ర భారతిలో జరిగింది. పబ్లిక్ గార్డెన్స్ లో దానికి రిహార్సల్స్. రోజూ సాయంత్రం నా స్కూల్ పని అయ్యాకా యే అపరాత్రి దాకానో, నాంపల్లి – లింగంపల్లి యంయంటియస్ ఆఖరి ట్రిప్ వరకో ఆకలి దప్పులు తెలీకుండా లలిత కళా తోరణం వెనక గదుల్లోనో ఆరుబయట చిన్నపాటి ఖాళీ స్థలంలోనో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. రిహార్సల్స్ జరుగుతున్నంతసేపూ మాన్యుస్క్రిప్ట్ లో అరుణ యేదో నోట్స్ రాసుకుంటూ వుండేది. మర్నాటికి మళ్ళీ కొత్త డైలాగులతో కొత్తగా రిహార్సల్స్. రోజు రోజుకూ సెషన్ సెషన్ కీ మారుతూ బర్బరీకుడు నాటకం స్క్రిప్ట్ అలా రూపొందింది.
ఆ తొలి ప్రదర్శనకి నేను Stage Manager ని.
జానపద కళారూపాల్ని అధ్యయనంలో ఆసక్తి వున్న నాకు Barbareekudu making యెంతో గొప్ప అనుభవం. సంప్రదాయ జానపద కళా రీతి – ఆధునిక నాటకరంగం; ఆ రెండింటి మేళవింపులో, దాన్ని సమకాలీన రాజకీయాలకు తాత్త్వికంగా అన్వయించడంలో సౌదాఅరుణ చూపిన నేర్పు మరచిపోలేని పాఠం. నా నేర్చిన ఆ పాఠం అక్కడితో ఆగిపోయింది గానీ కళ్ళముందు ఆనాటి దృశ్యాలన్నీ కదలాడుతున్నై. ముఖ్యంగా నాటకం తయారీ పొడవునా అరుణ ఆలోచనా వుద్వేగాలతో నిండిన ముఖమే మరీ మరీ గుర్తొస్తుంది.
ఆ నాటకంలో నటులందరూ పగలంతా యేదో వొక వుద్యోగం చేసుకుని సాయంత్రానికి వాళ్ళ ఆఫీసు సైన్ అవుట్ టైంల బట్టీ వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు దొరికిన వాళ్ళతో ఆ యా సన్నివేశాలని ప్రాక్టీస్ చేయించాలి. అదొక పెద్ద హర్డిల్. చాలెంజ్. నాటకం పూర్తి రిహార్సల్ యెప్పుడూ జరిగేది కాదు. దృశ్యాల్ని సన్నివేశాల్నీ ముక్కలు ముక్కలుగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రతి సన్నివేశం తర్వాత సౌదా ‘కన్నా, యెట్లా వచ్చిందిరా?’ అని అరుణని అడిగేవాడు. ఆమె ‘మాష్టారూ మీరు చెప్పండి’ అని నన్నడిగేది. ఆమె చూపు, వూహ ముక్కల మీద వుండేవి కాదు; మొత్తం మీద వుండేవి.
నాటకంలో బర్బరీకుడి తల్లి పాత్రకు సురభి కంపెనీ నుంచి వొక వృత్తి కళాకారిణిని యెంచుకున్నాం. ఆమె పోర్షన్ని ముందు రిహార్సల్స్ వేసి రాత్రి మరి పొద్దు పోక ముందే ఆమెను పంపించేసే వాళ్ళు. ఈ ఆలోచన అరుణదే. కానీ యీ క్రమంలో పూర్తి నాటకం ప్రాక్టీస్ చేయటానికి యెక్కువ అవకాశం దొరకలేదు. డ్రై రన్/డ్రెస్ రిహార్సల్ కూడా పడలేదు. ఏ దృశ్యం తర్వాత యే దృశ్యం వస్తుందో కూడా నటులకు సరిగా రిజిస్టర్ కాలేదు. ప్రాప్స్ మేనేజ్మెంట్ బ్యాంక్ డ్రాప్స్ గురించిన అవగాహన కూడా లేదు. నాటకం అంటే నాకు చెప్పలేనంత Passion. నాలుగు వందల రూపాయల లో బడ్జెట్ నుంచి నాలుగు లక్షల రూపాయల హై బడ్జెట్ వరకూ స్కూల్/కాలేజీ పిల్లలతో/టీచర్స్ తో స్టేజి డ్రామాలు ఆడిన, ఆడించిన కొద్దిపాటి అనుభవం వుండటం వల్ల నాకేదో తెలుసు అనుకుని సౌదాఅరుణ రంగస్థల నిర్వహణ బాధ్యతని నాకు కట్టబెట్టారు.
నటుల ఆహార్యం దగ్గర్నుంచి సంభాషణలో స్పష్టమైన వుచ్చారణతో కూడిన ఆర్టిక్యులేషన్ వరకూ అరుణ చాలా రాడికల్ గా ఆలోచించేది. కోఠీలో కాస్ట్యూమ్స్ డిజైనర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ అశోక్ పవార్ (బాబూరావ్ కంపెనీ) దగ్గరికి తీసుకుని వెళ్లినప్పుడు నటుల పాత్రల స్వభావాల గురించి రూపు రేఖల గురించి వాటికి అనుగుణమైన దుస్తులు గురించి ఆమె సునిశిత దృష్టి చూసి నేను విస్తుపోయాను. మా యింట్లో మా పిల్లల చిన్నప్పుడు కొన్న కొకు రాసిన మహాభారతం పుస్తకం వుంది. దాని అట్ట మీది బొమ్మ నుంచి సౌదాఅరుణ బర్బరీకుడు నాటకం పాత్రల ఆహార్యం నిర్మించుకున్నారు. పౌరాణిక పాత్రలకి మేం యెంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ చూసి దశాబ్దాలుగా ఆ రంగంలో పని చేస్తున్న అశోక్ ఆశ్చర్యంతో తలకిందులయ్యాడు. తొలి ప్రదర్శన లో props గురించి యెక్కువ ఆలోచన చేశాం గానీ తర్వాత symbolic presentation ముందుకు వచ్చి ఆ బరువు కొంత తగ్గించుకున్నారు.
నాటక దర్శకత్వంలో సౌదాఅరుణల తొలి సాహసం అది. డ్రామా స్టేజి యెక్కేవరకు సౌదా ముఖంలో చెప్పలేని వుత్కంఠత. పాత్రధారుల్లో తెలీని ఆందోళన. కానీ నిండు కుండలా తొణకని అరుణ మాత్రం విజయం సాధిస్తామని గొప్ప ధీమాతో వుండేది. నటులకు ఆమె చిరునవ్వు చాలా ధైర్యాన్ని యిచ్చేది. తెర లేచే ముందు గ్రీన్ రూమ్ లో టీమ్ అంతా భుజాల మీద చేతులు వేసుకుని గుండ్రంగా నిలబడి ఆ నాటకం వెయ్యి ప్రదర్శనలు పడాలని శపథం చేస్తూ ‘జై బర్బరీక’ అని నినదించాం. ఆ నినాదం రాష్ట్రం నలుమూలలా ప్రతిధ్వనించింది. తెగిపడ్డ ఏకలవ్యుడి వేలే కాదు బర్బరీకుడి తల కూడా చరిత్రని తిరగ చెప్పింది. కర్తవ్యాన్ని బోధించింది. ఆధిపత్య రాజకీయ కుట్రల గురించి హెచ్చరికలు పంపింది. ఆధునిక తెలుగు నాటకరంగంలో బర్బరీకుడు వొక గొప్ప మలుపు. బహుజన వుద్యమాన్ని పునర్ నిర్మించుకోవాలని యిచ్చిన పిలుపు.
న్యూ సిలబస్ ప్రచురణ సంస్థకి అనుబంధంగా ‘దస్య’ థియేటర్ అలా రూపొందింది. ఆ సంస్థ నుంచి ఆ తర్వాత బర్బరీకుడు నాటకం యెన్నోసార్లు యెన్నో చోట్ల ప్రదర్శనలు పొందింది. జిల్లాల్లో చందాలు వేసుకొని మరీ ప్రదర్శనలు యిప్పించారు. సాంస్కృతికోద్యమంలో అదొక సంచలనం. ఆ తర్వాత రాష్ట్రంలో బహుజన రాజకీయ చైతన్యం కలగజేయటానికి బలి – వామన (బమ్మిడి వామన పాత్ర), మహాత్మా జ్యోతి బా పూలే (విద్యాసాగర్ ఫూలే పాత్ర), అంబేద్కర్ వర్ణ నిర్మూలన వంటి నాటకాలతో ‘దస్య’ థియేటర్ ప్రత్యామ్నాయ నాటకాన్ని వొక వుద్యమంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళింది. సౌదాఅరుణలు ఆ నాటకాల ద్వారా అంబెద్కరీయ రాజకీయాలు ప్రచారం చేశారు. మార్క్సిస్ట్ లెనినిస్ట్ రాజకీయ పంథా నుంచి ఆచరణ నుంచి అంబేద్కరైట్ భావజాలం వైపు నడిచిన దశలోనే సౌదాఅరుణ నాకు పరిచయమయ్యారు. వారి విరసం కాలంనాటి యాక్టీవిజం గురించి దాన్నుంచి బయటకు రావడానికి కారణాల గురించి నాకు పెద్దగా తెలీదు. ‘సౌదా యాంటీ మార్క్సిస్టు, వాడితో నీకు స్నేహమేంటి? మానుకో’ అని నన్ను హెచ్చరించిన వాళ్ళున్నారు. అంబెద్కర్ అభిప్రాయాల్ని వాళ్ళు వక్రీకరిస్తున్నారు అని కూడా కొందరు ప్రచారం చేశారు. కానీ నేను వొదులుకోదల్చుకోలేదు. అంతగా కట్టిపడేసే శక్తి యేదో వాళ్ళ సొంతం. భావజాలాలు మధ్య వైరుధ్యాలు మనుషుల మధ్య స్నేహాలకూ ప్రేమకు ఆటంకమౌతాయా? అలా దూరమై యెన్ని ముక్కలుగా మారిపోయాం? ఐక్యత మరచిన ఘర్షణలు యే గమ్యానికి చేరుస్తాయి? అప్పటికీ యిప్పటికీ యీ ప్రశ్నలు నన్ను వేధిస్తూనే వుంటాయి.
బర్బరీకుడు సౌదాఅరుణల జీవితంలో కూడా మలుపే అనుకుంటా. అరుణ నాటకరంగానికి అంకితమైపోవడం వల్ల సృజనాత్మక సాహిత్యానికి దూరమైంది. అలా వ్యక్తిగతంగా ఆమె, మొత్తం సాహిత్య సమాజం చాలా నష్టపోయింది అని నా అభియోగం. కానీ వర్తమాన అస్తిత్వ రాజకీయ సందర్భం ఆమెను కొత్త దారుల వైపు నడిపించిందేమో!
***
కొంచెం వెనక్కి వెళ్తే …
అరుణ చెల్లెలు గీత నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ గా పని చేసేవారు. ఆమె ఇద్దరు పిల్లలూ పబ్లిక్ స్కూల్లో నా స్టూడెంట్స్. అలా సౌదా అరుణ నా స్టూడెంట్స్ కి పేరెంట్స్ గా వాళ్ల చదువు గురించి, టీచర్స్ శిక్షణ లోని మంచిచెడుల గురించి, ప్రైవేటు గవర్నమెంటు స్కూళ్ల స్థితి గతులు గురించి, మొత్తం విద్యా వ్యవస్థ గురించి, అందులో లోటుపాట్లు గురించి నాతో చర్చిస్తూండేవారు. విద్యా బోధన గురించి, పిల్లల శిక్షణ గురించి చాలా ఆధునికమైన భావాలు వాళ్ళిద్దరివీ. అరుణకి పిల్లలంటే అంతులేని మమకారం. ఉప్పలూరులో అరుణ వాళ్ళకి వొక స్కూల్ వుందని చెప్పినట్టు లీలగా జ్ఞాపకం.
మా స్కూల్ వార్షికోత్సవానికి స్టూడెంట్స్ కోసం వొక నాటిక రాసి యివ్వచ్చు కదా అని వొకసారి యేదో మాటల మధ్య అలవోకగా అడిగాను. సౌదా వెంటనే వొక ‘ఏకాంకిక’ రాసి స్క్రిప్ట్ నా చేతిలో పెట్టాడు. ‘యిది మీ ప్రాపర్టీ యెలా అయినా మీరు వాడుకోవచ్చు’ అన్నాడు. ఆ నాటికి సౌదా పెట్టిన పేరు అబద్ధాల మహారాజు. దాన్ని మేము (ప్రధానంగా నేనూ మా రాజ్యలక్ష్మీ) మా స్కూలు పిల్లలకు అనుగుణంగా మార్చుకుని ‘అశ్వత్థామ హతః (కుంజరః)’ పేరుతో ప్రదర్శించాం. ప్రదర్శనకు ముందు కొన్నిసార్లు రిహార్సల్స్ కి సౌదాఅరుణలను ఆహ్వానించాం. మార్పులు చేర్పులు వాళ్ల అనుమతితోనే చేసాం. తారామతి బారాదరి వేదికపై ఆ నాటిక బాగా రక్తి కట్టింది (యిప్పటి భాషలో సూపర్ హిట్అనాలేమో). ఆడియన్స్ లో ప్రత్యేక ఆహ్వానితులుగా సౌదాఅరుణ. ప్రతి క్షణాన్నీ డైలాగ్ నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ అభినందిస్తూ లీనమైపోయారు. ప్రదర్శన తర్వాత వెలిగే ముఖంతో గ్రీన్ రూమ్ కి వచ్చి అరుణ మా పిల్లల్ని దగ్గరికి తీసుకొని ప్రశంసించడం నాకు బాగా గుర్తు. కాస్ట్యూమ్స్ అలంకరణలో అరుణ కూడా మాకు సహకరించింది. అందుకే వాటిని తీయనీకుండా వాళ్లందరితో ఫోటోలు దిగి మురిసిపోయింది (అరుణ చెల్లెలి బిడ్డ సౌమ్య కూడా నాటికలో వొక చిన్న పాత్ర వేసింది).
‘దస్య’ థియేటర్ తో నా అనుబంధానికి బీజాలు అక్కడే పడ్డాయి.
(ఆ స్క్రిప్టుకి పారితోషికం యెంత కావాలి అనడిగితే వొక రూపాయి యివ్వమన్నాడు సౌదా. స్కూలు తరపున రెండు వేల రూపాయల చెక్కు యిస్తే ఆశ్చర్యపోయాడు)
***
యింకొంచెం వెనక్కి వెళ్తే …
నల్ల గుర్రపు నాడా న్యూ సిలబస్ ప్రచురణగా వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి ఆఫీస్ కి వెళ్తే ఆర్ ఎమ్ ఉమామహేశ్వరరావు టేబుల్ మీద ఆ పుస్తకాన్ని చూసి అక్కడికక్కడే చదివాను. ఆ పుస్తకం లోని కంటెంట్ మీద ఉమా నేనూ చాలా సేపు మాట్లాడుకున్నాం. మాట్లాడిన దాన్నే కాగితం మీద పెట్టొచ్చు కదా అన్నాడు ఉమా. ఆ మర్నాడే దాని మీద సమీక్ష రాసి జ్యోతికిచ్చాను. అంత వేగంగా నేను యే పుస్తకాన్ని సమీక్షించలేదు. వూపిరాడనివ్వని బలమైన వుద్వేగంలో వొక్క వూపులో తన్నుకొచ్చిన తక్షణ స్పందన అది.
ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీశైల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల గుర్రపు నాడా బుక్ రీడింగ్ సెషన్ జరిగింది. ఎంట్రీ ఫీజు అయిదు రూపాయలు (ఇలా సౌదాఅరుణ యెన్ని కొత్త ప్రయోగాలు చేశారో, లెక్క లేదు. న్యూ సిలబస్ పుస్తకాలు కూడా సొంతంగా అమ్ముతారు గానీ యే డిస్ర్టిబ్యూటర్లకీ యివ్వరు). జ్ఞాపకం ఉన్నంత వరకు సౌదాఅరుణ లను తొలిసారి అక్కడే చూసినట్టున్నాను.
నల్ల గుర్రపు నాడా కథని నేను యెన్నో సార్లు నా పిల్లలకి క్లాస్ రూంలో, తోటి వుపాధ్యాయులకి స్టాఫ్ రూముల్లో మౌఖికంగా చెప్పాను. కొందరికి పర్సనల్ గా చదివి వినిపించాను. తృప్తి తీరక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో తెలుగు డిపార్ట్మెంట్ తరఫున జరిగే సాహిత్య కార్యక్రమానికి సౌదాని ఆహ్వానించి నల్ల గుర్రపు నాడా బుక్ రీడింగ్ యేర్పాటు చేశాను. అదే సందర్భంలో కావచ్చు; దేశంలో మత విద్వేషం దేశభక్తి వేషం వేసుకుని పిల్లల మనసుల్ని కలుషితం చేసి యుద్ధోన్మాదం వైపు నడిపిస్తున్నందున మానవీయ గుణాల్ని వున్నతీకరించే ఆ కథని పిల్లల కోసం బొమ్మల పుస్తకంగా వేస్తే బాగుంటుందని సూచించాను. ఏలె లక్ష్మణ్ లితో కట్ బొమ్మలతో పాతకాలపు రష్యన్ పిల్లల బొమ్మలు పుస్తకంలాగా దాన్ని ముద్రించడానికీ దానికి నన్ను ముందుమాట రాయమని అడగడానికీ వెనకాల అరుణ ప్రమేయం వుందని నా నమ్మకం (సాధారణంగా సౌదా పుస్తకాలకి ముందు మాటలు వుండవు). “నల్ల గుర్రపు నాడా ‘జేబులో బొమ్మ’లా విశ్వాసమే గానీ ‘జై పాతాళభైరవి’లా మాహాత్మ్యం కాద”న్నమాటకి అరుణ యెంత మురిసి పోయిందనీ! ఆ తర్వాత అదే వుత్సాహంతో పిల్లల కోసం ఏక్ మినార్, గులిస్తాన్ వంటి బొమ్మల పుస్తకాల్ని న్యూ సిలబస్ ప్రచురించింది.
లుంబినీ పార్క్ గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు మా అనుబంధాన్ని మరింత గట్టి పరిచాయి. రవీంద్రభారతిలోనే బర్బరీకుడు నాటకం మరో ప్రదర్శన జరుగుతున్నప్పుడు యీ బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు శ్రీశైల్ యూకే లో పని చేస్తున్నాడు. అతను ‘స్వదేశానికి’ వచ్చినప్పుడు మత హింసకు వ్యతిరేకంగా అవగాహన కలిగించాలని స్కూల్ పిల్లలకు వొక వ్యాసరచన పోటీ నిర్వహించాలని సంకల్పించాడు. అందుకుగాను జంటనగరాల్లో యిరవై పెద్ద పెద్ద స్కూల్స్ గుర్తించాం. పిల్లలకు వ్యాసరచన పెట్టడం నెపం మాత్రమే. పిల్లల ఆలోచనలని ట్రిగ్గర్ చేసి సామరస్య భావన పెంపొందించడమే అభిమతం. ఆ సందర్భంలో శ్రీశైలం రెడ్డి నల్ల గుర్రపు నాడ బొమ్మల పుస్తకాన్ని పదివేల కాపీలు ముద్రించి స్కూలు పిల్లలకు వుచితంగా పంచి పెట్టాడు. సౌదా అరుణ శ్రీశైల్ నేను రెండు విడతలుగా స్కూల్ టీచర్స్ నీ పిల్లల్నీ కలిసి పుస్తకం మీద ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో విసి ఆవుల మంజులత గారి చేతులు మీదుగా బహుమతులు అందజేశాం. ఈ ప్రాజెక్ట్ అంతటా అరుణ లో వొక టీచర్ నీ సోషల్ యాక్టీవిస్ట్ నీ చూశాను. ఆమె టీచింగ్ లో కొనసాగితే బాగుండు అని నాకు చాలా అనిపించింది. చాలా మంది లాగే ఆమెలోని అధ్యాపకురాలి వద్ద మా మధ్య జరిగిన చర్చల నుంచి నేనూ వొకట్రెండు పాఠాలు నేర్చుకున్నా.
సౌదాఅరుణ లతో చేసిన చర్చల్లో బలమైన టాపిక్ వొకటి వర్ణ నిర్మూలన. రాణి శివశంకర శర్మ ‘ది లాస్ట్ బ్రాహ్మిన్’ కేంద్రంగా (యిది కూడా న్యూ సిలబస్ ప్రచురణే) భారతీయ సమాజంలో ముందు జరగాల్సింది కుల వివక్ష నిర్మూలనే గానీ కుల నిర్మూలన కాదని ఆ వాదనల సారం. అరుణ అభిప్రాయాలు ఖచ్చితంగా వుండేవి. ప్రజాస్వామికంగా వుండేవి. అభిప్రాయాలు పంచుకోవడమే తప్ప వాదన గెలవాలనే ఆరాటం ఆమె మాటల్లో కనిపించేది కాదు. నిశ్చిత నిశ్చయాలకు బందీలం కాకపోవడంవల్ల విభేదాల యేకీభావాల మధ్య మా సంభాషణ అకడమిక్ గా (రసవత్తరంగా కాదు) సాగేది.
ఎప్పుడూ నిర్మలంగా నవ్వే అరుణ ముఖంలో కోపం కూడా చూశాను నేను. అదీ వొక్కసారే. రవీంద్రభారతిలో ‘దస్య’ థియేటర్ తరఫున నాటకం కోసం హాల్ బుక్ చేసుకుంటే యేవో రాజకీయపు వొత్తిడుల కారణంగా ఆ బుకింగ్ ని ఆకస్మాత్తుగా రద్దు చేసి వేరే వాళ్ళకి కేటాయించారు. ప్రదర్శన చూడటానికి వెళ్ళిన అందరం నిరాశకు గురి అయ్యాం. అక్కడక్కడ హాలు మెట్లమీదే బైఠాయించి మేనేజ్మెంట్ వైఖరికి నిరసన తెలియజేశాం. అరుణ ప్రెస్ ని వుద్దేశించి మాట్లాడుతూ ఆధిపత్య రాజకీయుల మోచేతి నీళ్లు తాగి మురిసిపోయే రవీంద్రభారతి యాజమాన్యంపై నిప్పులు చెరిగింది. అది ఆమె సామాజిక ఆగ్రహం. అరుణ సామాజిక వుద్యమ చైతన్యాన్ని తెలుసుకోడానికీ క్యాస్ట్ డెమోక్రసీ గురించి ఆమె చేసిన ప్రతిపాదనల్ని అర్థం చేసుకోడానికీ ఆమె సాహిత్యాన్ని ఆశ్రయించాలి.
***
అరుణ కోసం చేయాల్సిన పని …
సాహిత్యంలో అవుట్ సైడర్ ఇన్ సైడర్ చర్చ బలం పుంజుకోకముందే అరుణ ఎరుకల కమ్యూనిటీ కఠోర జీవన వాస్తవికతని ఆవిష్కరిస్తూ రాసిన నవల ‘ఎల్లి’. దాన్ని ఆమె విరసంలో వున్నప్పుడు రాసింది. విరసం ప్రచురణగానే వెలువడింది. ఎరుకల సాంస్కృతిక జీవిత నేపథ్యం నుంచి స్త్రీ పురుష సంబంధాల గురించి యెంతో లోతుగా విశ్లేషించిన ‘ఎల్లి’ అరుణకు యింటి పేరు అయింది. ఆ తర్వాత దాని సీక్వెల్ గా ‘నీలి’ నవల వచ్చింది. తనది కాని జీవితాన్ని సంస్కృతిని నవలీకరించడంలో అరుణ చూపిన ప్రతిభ అనన్యం. అక్కినేని కుటుంబరావు ‘సొరాజ్జెం’ తర్వాత కృష్ణాజిల్లా గ్రామీణ సాంస్కృతిక భాషని అద్భుతంగా పట్టుకున్న నవల ‘ఎల్లి’. ఎల్లి నవల నాకు హృదయగతం కావడానికి అందులోని భాష కూడా కొంత కారణం. నేను దూరమైన నా చిన్నప్పటి నా భాష అది. అన్నట్టు చెప్పడం మరిచా – అరుణా నేనూ వొకే కాలంలో పుట్టి పెరిగాం. వొకే నేల మీద తిరుగాడాం. వొకే గాలి పీల్చాం. వొకే యేటి నీళ్లు తాగాం. మా యిద్దరిదీ వొకే జిల్లా వొకే తాలూకా. మాది వీరవల్లి. ఆమెది ఉప్పలూరు. పిట్ట దారిలో వెళ్తే నాలుగైదు కోసుల దూరం. అంతే. ఆ మట్టి పరిమళం అంటిపెట్టుకొని వుండడం వల్ల ఆమె నాకు మరింత సన్నిహితురాలు అనిపించిందేమో. అరుణ రాసిన మొదటి నవల ‘రెండు నదులు’. ఈ నవలలో అరుణ నలభైల నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రని నమోదు చేసింది. ఎందుకో గానీ ఆ విషయం మీద పరిశోధకుల దృష్టి అంతగా ప్రసరించలేదు.
అరుణ ప్రమేయం లేకపోతే అంగడాల వెంకట రమణ మూర్తి సేకరించిన బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్ ఆత్మకథ ‘పింజారి’ వెలుగులోకి వచ్చేది కాదు. ఆ చారిత్రిక డాక్యుమెంటేషన్ కి సౌదఅరుణ సంపాదకత్వం వహించడమే కాదు ప్రచురణకర్తలుగా కూడా వ్యవహరించారు. సాహిత్య చరిత్రలో ఆ పుస్తకం phenomenal గా రూపొందడానికీ మిగిలిపోడానికీ ప్రధాన కారణం అరుణే. నాజర్ భార్య ఆదం బీ కథనం లేకుండా ఆయన ఆత్మ కథ అసంపూర్ణం అసమగ్రం అని ఆమె భావించింది. అలాగే కస్తూరీ బా గాంధీ జీవితాన్ని గాంధీ జీవితాన్నుంచి విడిగా పరిశీలించినప్పుడు కూడా ఆమెలోని స్త్రీ హృదయ ఔన్నత్యం ద్యోతకమౌతుంది.
ఎల్లి నీలి నవలల్లో స్త్రీ పాత్రల చిత్రీకరణలో అరుణ తీక్షణమైన స్త్రీ దృష్టికోణం స్పష్టంగా కనిపిస్తుంది. స్త్రీలపై అమలయ్యే సాంస్కృతిక అణచివేతకు వుపయోగపడే సాధనాల గురించి ఆమె యెంతో లోతుగా పరిశీలించింది.
దయామయి అరుణ; హఠాత్తుగా యెంత నిర్దయగా విడిచి వెళ్లిపోయింది! చల్లని నవ్వుల స్నేహశీలి అరుణ; చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయి యెంత ద్రోహం చేసింది! నిజంగానే సౌదాని వదిలి అరుణ వెళ్ళిందా? ఇంకా ఆమె ఆ హాస్పిటల్ బెడ్ మీద అలా పక్కకు వొదిగి పసిపిల్లలా నిద్రిస్తున్నట్లే కనిపిస్తుంది. రెండు భావజాలాల్ని కలుపుతూ కట్టిన పూల వూయలలో ఆమె వూగుతుంది. రెండు నదుల మధ్య ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. సవ్వడి చేయొద్దు; ఆమెనలా నిద్ర పోనిద్దాం.
మనం కాస్త యెడంగా నిలబడి గడిచిన నాలుగు దశాబ్దాల సాహిత్య సామాజిక సాంస్కృతిక వుద్యమాల్లో ఆమె ఆలోచనల గురించీ ఆచరణ గురించీ మాట్లాడుకుందాం.
అరుణ మొదలిడిన సంభాషణని కొనసాగిద్దాం.
*
ఎక్సలెంట్ గొప్ప నివాళి ,మాటలు రావడంలేదు…
చాలా బాగుంది ప్రభాకర్ గారూ!
మూడు రోజులుగా
తన గురించి ఏమీ మాట్లాడలేక పోయిన నా దిగులు తీర్చింది. మంచి స్నేహితురాలు. Democratic to the core and a gracious women.
She is the new syllabus.
అరుణ జ్ఞాపకాలు, ఆమె అసాధారణ సాహిత్య, సాంస్కృతిక కృషి గురించి గొప్పగా రాశారు సర్. ఆవును, అరుణ కృషిని కొనసాగించాలి
చాలా ఆర్తి, ఆరాధన లతో సాగింది వ్యాసం.
ఎన్నో వివరాలు తెలిశాయి.. పబ్లిసిటీ కి దూరంగా రు
ఉండే ఇలాంటివారు సమాచారం వారు జీవించిన కాలంలో పరిచయం రూపంలో వస్తే ఈ తరం వారికి ఉపయోగం..
ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు
అరుణ వర్ణంలో మెరిసి నీలి వర్ణంలో అన్వేషిస్తూ చెదరని చిరునవ్వుతో సాగిన అరుణ ఇక ఒక జ్ఞ్యాపకం. ఆమె మలిదశ అంతా ఒక ప్రయోగంగా సాగిన వైనం ఈ నివాళిలో ప్రభాకర్ చెప్పాడు. ఇద్దరూ ఒకరిగా బతికిన సౌదా అరుణలు. అయినా ఆ ఒకరి ప్రత్యేకతే తనను మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకొనేలా వ్యాసం సాగింది. బతికుండగా తెలియాల్సిన అనేక విషయాలు పోయాకే తెలియడం బాధాకరం. దీనికేదో పరిష్కారం ఆలోచించాలి.
అరుణ .. నీకు లాల్ సలాం. జై భీములు.
తెలియని వారికి చక్కని పరిచయం.
ప్రభాకర్ గారూ. లోపలి పొరల్ని చీల్చుకుని ఉబికితేనే చెలిమె గుండెలు ఇంకిపోయే ప్రవాహమయ్యేది.