షేర్-పరిచయం-ప్రణయం!

గౙల్ రహస్యాలను వెతికే కొత్త శీర్షిక

ప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో ప్రస్ఫుటంగా గుర్తుంటే అది ప్రేమ ఎలా అవుతుంది. ఉర్దూ షే‌ర్ పట్ల నాకు గల మమకారమూ అలాంటిదే!
బహుశా మదన్ మోహన్ పాటలు వింటూండగా మెరిసిన ఈ ఆణిముత్యం ఆకర్షించిందేమో:
దిల్ కీ నాజుక్ రగేఁ టూట్తీ హై
యాద్ ఇత్నా భీ కోయీ న ఆయే
కాదు కాదు అంతకు ముందే లత గొంతులోఈ గజల్ విన్నాను కదా:
హమ్ హై మతా-ఎ-కూచా-ఒ-బాజార్ కీ తరహ్
ఉఠ్తీ హై హర్ నిగాహ్ ఖరీద్-దార్ కీ తరహ్
లేదు రాజేష్ రెడ్డి గారు ఈ రెండు వాక్యాల్లో ప్రపంచం ఓ విక్రయశాలగా మారిన దృశ్యాన్ని ప్రతిబింబించడం చూసి ఫిదా అయ్యాను:
గఁమ్ బిక్ రహే థే మేలే మేఁ ఖుషియోఁ కే నామ్ పర్
మాయూస్ హోకే లౌటే హర్ ఇక్ దుకాఁ సే హమ్
అవును వసీం బరేల్వీ గారు కష్టాలొస్తాయేమోనని భయపడకూడదన్న జీవనసూత్రాన్ని చెప్పినప్పుడు ముగ్ధుడినవ్వడం మరచిపోయానే:
హాదిసోఁకీ జద్ పే హై తో ముస్కురానా ఛోఢ్ దేఁ
జల్జలోఁకీ ఖౌఫ్ సే క్యా ముస్కురానా ఛోడ్ దేఁ
ఎప్పుడబ్బా నేనీ మత్తుకి బానిసనయ్యీను?? మత్తంటే గుర్తొచ్చింది. ఏళ్ళ కిందటే ఎన్ని సార్లు హరిహరన్ ని ఇమిటేట్ చేస్తూ ఈ మత్లా పాడుకోలేదు:
మైకదే బంద్ కరేఁ లాఖ్ జమానే వాలే
షహర్ మేఁ కమ్ నహీ ఆంఖోఁ సే పిలానే వాలే
మరి అంత వెనక్కి వెళ్తే గులామ్ అలీ, జగ్జీత్ సింగ్, పంకజ్ ఉధాస్ ల పాటలు అర్థమయినా కాకపోయినా వినసొంపుగా ఉంటే వినేవాడినిగా. ఒక జగ్జీత్ సింగ్ గజల్ లోనే కదా ప్రేమకున్న అధిభౌతిక కోణం గోచరించింది:
జిస్మ్ కీ బాత్ నహీఁ థీ ఉన్కే దిల్ తక్ జానా థా
లంబీ దూరీ తయ్ కర్నే మేఁ వక్త్ తౌ లగ్తా హై
వాస్తవానికి ఇంజినీరింగ్ రోజుల్లోనే స్నేహితులు ఒకరు
దూర్ సే దేఖా తో షేర్ లగా
పాస్ గయా తో షేర్ హీ నిక్లా
అంటే, ఇంకొకరు
దూర్ సే దేఖా తో షేర్ లగా
తో మై పాస్ గయా హా నహీఁ
అంటూ నవ్వుకున్నాము కదా. సరదాకే అయినా షేర్ స్ట్రక్చర్ అప్పటినుండే ఎరుగుదును కదా!
 
నాకు తెలిసి ఈ స్వాభావికస్పృహ నా వెన్నంటే ఉంది. అదే నన్నీ తీయని ఊబిలో పడదోసింది. పడ్డాక ఇక బయటపడాలనుకోలేదు. అట్టడుగున ఏం దాగుందోనన్న కుతూహలం మొగ్గతొడిగింది.
 
*
సాంకేతిక ప్రగతి కారణంగా ఇంగ్లీషు లిపిలో ఉర్దూ చదివే సౌలభ్యం, పదాలకు అర్థాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండటం నా రసాన్వేషణను సులభతరం చేశాయి. యూట్యూబ్ లో కూడా అసంఖ్యాకమైన ముషాయిరాలు, గజళ్ళు, దొరకడం అదృష్టకరంగా మారింది. ఇంత విస్తృతంగా ఉన్న సాహితీభాండాగారంలో నిక్కమైన నీలాలు ఏరడం ఎలాగా అని సతమతమవుతున్న తరుణంలో నాకు మార్గదర్శకంగా నిలిచింది మెహఁదీ హఁసన్, బేగం అఖ్తర్!
 
వీళ్ళిద్దరు పాడిన గజళ్ళు ఎంతో ప్రామాణికమైనవి. ‘రంజిష్ హీ సహీ’తో అహ్మద్ ఫరాజ్ పరిచయం. ‘మేరే హమ్-నఫస్ మేరే హమ్-నవా’తో షకీల్ బదాయునీ పరిచయం. ఇలా ఎందరో సునిశితమైన పరిశీలనకు సున్నితమైన పరిభాషణను జోడించి, వ్యథానుభవవసారానికి మధురాభివ్యక్తిని జోడించి, తమ మధురోహలకు సార్వజనీనవర్ణం అద్ది, అమేయమైన సృజనానుభూతిని మథించి, చిన్ని చిన్ని వాక్యాలలో కుదించి మనకందించిన మహామహులు పరిచయమయ్యారు. వీళ్లు అక్షరాలను సీతాకోకచిలుకలుగా, మాటలను మధుకలశాలుగా, వాక్యాలని వెలుతురుచినుకులుగా మార్చగల మాయగాళ్ళు!
అజరామరకవనస్రవంతి నుండీ దోసిళ్ళతో రసగంగను తెచ్చి దాహం తీర్చగల శ్రేష్ఠస్రష్టలు!
అందరిలో నా వరకూ వీళ్లు అతిరథమహారథులు : అహ్మద్ ఫరాజ్, ఖుమార్ బారాబంక్వీ, షకీల్ బదాయునీ, కైఫీ ఆజ్మీ. 
 
**
నాకున్న అతిమితపరిజ్ఞానంలో కవిత్వం స్థూలంగా రెండు రకాలు. పొద్దు మునుగుతూండగా వరండాలో కూర్చుని కాఫీతో పాటో, మండువేసంగిలో మర్రిచెట్టు కింద నులకమంచంపై పడుకునో, మేడమీద పరచుకున్న వెండివెన్నెలకు తోడుగా ఒక చిన్న బల్బు వెలుతురులోనో చదువుకునేది ఒకటి. ఇది పఠనానందదాయిని. అంతశ్శోధనకు ఉద్దీపన. ఇంకొకటి శ్రవణోత్సాహకారిణి. ఇందులో అంతర్లీనమైన లయబద్ధత ఉంటుంది. ఆ లిరికల్ క్వాలిటీ దాన్ని ఒక సమూహం ఎదుట చదివి, భావప్రకటన రక్తికట్టించడంలో దోహదపడుతుంది. 
ఉర్దూ గజల్ ఈ రెండు వైపులా పదునున్న చురకత్తి!
 
నాకు లయబద్ధమైన కవిత్వం ఇష్టం. అందుకే కూనలమ్మ పదాలంటే చ్చాల్లా ఇష్టం. ఆ లయ ఛందోబద్ధమే కానక్ఖరలేదని శ్రీశ్రీ సమర్థవంతంగా నిరూపించారు. నా ఊహ చాంపేయమాల/నా ఊళ కేదారగౌళ అన్నప్పుడూ నేనొక దుర్గం/నాదొక స్వర్గం/అనర్గళం అనితరసాధ్యం నా మార్గం అన్నప్పుడూ ఆ ధ్వనిసామ్యత అభివ్యక్తిని పరిపుష్టం చేస్తూనే పాఠకశ్రోతల్లో ఒక అవ్యక్తాతిరేకాన్ని నింపుతుంది. అటువంటి ధ్వనిసౌందర్యం ఉర్దూ గజళ్ళలో అడుగడుగునా కనిపించింది. ఈ గజళ్ళు వాడే ‘బెహెర్’ గురించి పెన్నా శివరామకృష్ణ గారు ‘గజల్ సౌందర్య దర్శనం’లో విపులంగా చర్చించారు.
ఈ షేర్లు చూడండి:
ఢేరోఁ సద్మేఁ లాఖోఁ ఘమ్
ఫిర్ భీ నహీఁ హై ఆఁఖేఁ నమ్
మేరీ హర్ గజల్ కో యే ఆర్జూ కరే ఐసే కో తేరి రూహ్-బ-రూహ్
జో తేరే హీ జైసా హో సర్-బ-సర్ జో తుఝ్ సే హీ మిల్తా హో హూ-బ-హూ
ఝుకీ ఝుకీ సీ నజర్ బేకరార్ హై కి నహీ
దబా దబా సా సహీ దిల్ మేఁ ప్యార్ హై కి నహీ
ఖయాల్ జిస్ కా థా ముఝే ఖయాల్ మేఁ మిలా ముఝే
సవాల్ కా జవాబ్ భీ సవాల్ మేఁ మిలా ముఝే
కభీ కిసీకో ముకమ్మల్ జహాఁ నహీఁ మిల్తా
కహీఁ జమీఁ తో కహీఁ ఆస్మాఁ నహీఁ మిల్తా
***
నన్ను అమితంగా ఆకట్టుకున్న ఇంకో విశిష్టత డెలికేట్ యూసేజ్ ఆఫ్ విట్! మొదటి వాక్యంలో కవి ఒక ఉత్సుకతని నిర్మించి రంగం సిద్ధం చేస్తాడు:
కిస్ నే దస్తక్ దీ యే దిల్ పర్ కౌన్ హై
ఎవరది, నా గుండె తలుపులు తట్టింది ఎవరు
రెండవ వాక్యంలో కవనోద్రేకం కలిగిస్తాడు. మనసుని చిన్నపిల్లాడిలా చిందులేయిస్తాడు:
ఆప్ తో అందర్ హై బాహర్ కౌన్ హై
నువ్వు గుండె లోపల ఉన్నావు బయట ఎవరు
ఈ సుయుక్తిని వాడటంలో ఉర్దూ కవులు చేయితిరిగినవాళ్ళు. కాలంతో పాటు అన్ని గాయాలు మానిపోవన్న విషయాన్ని ఎలా చెప్పారో చూడండి:
వక్త్ సే కోయీ పూఛ్ రహా హై
క్యా జఖ్మ్ వాకయీ భర్ జాతే హై
మనకు బాగా దగ్గరివాళ్ళే దుఃఖం కలిగిస్తారనే నిజం:
సిఖాయా థా జిస్ నే హమేఁ ముస్కురానా
ఉసీ నే రులాయా హఁసాతే హఁసాతే
అందీ అందని అందం:
ఫాస్లే ఐసే భీ హోంగే యే కభీ సోచా న థా
సామ్నే బైఠా థా మేరే ఔర్ వో మేరా న థా
ఒక పొగడ్త:
అయ్ హుస్న్-ఎ-బేపర్వా తుమ్హే షబ్నమ్ కహూఁ షోలా కహూఁ
ఫూలోఁ మే భీ షౌకీఁ తో హై కిస్-కో మగర్ తుఝ్-సా కహూఁ
****
ఇలా ఈ రమణీయప్రపంచంలో సమయం గడిపాక సహజంగానే కలిగింది: స్ఫూర్తి.
తెలుగులో కూడా క్లుప్తతలో రమ్యత సాధించాలని నేనూ కొన్ని ప్రయత్నాలు చేశాను. ఓ అపరిపక్వ కవిగా నాకు కొంత తృప్తిని మిగిల్చిన కొన్ని డిస్టిల్డ్ మ్యూజింగ్స్:
స్వేచ్ఛాప్రియత్వం
పంజరంలో సకలభోగభాగ్యాలూ సమకూర్చినా
పక్షిరెక్కలు మబ్బతునకనే కోరుతున్నాయి
ప్రవాసవేదన
మా ఊరి మట్టివాసన నన్నెపుడూ వీడలేదు
మళ్ళీ ఏ ఊరూ నన్ను కన్నబిడ్డలా చూడలేదు
జీవితపు ఏకదిశాగమనం
తీసే ప్రతి శ్వాసా నన్ను ఒకవైపుకే నెడుతోంది
ఒక చివరకి దగ్గరగా ఒక చివరకి దూరంగా
మూగబాసలు
నా కీర్తిపతాక ఎంతెత్తున రెపరెపలాడినా
నీ తేనెకళ్ళ మూగప్రశంసలో ఆ అందమే వేరు
ప్రశ్నలు
ప్రశ్నలేగా ప్రగతిపథంలో నిత్యదిక్సూచులు
నలిగిన బాటలో నడిచిన మార్గదర్శిని చూశావా
*****
ఉర్దూ గజల్ లో ఒక అనిర్వచనీయమైన రసానుభూతి ఉంది. ఒక మాటలకందని మధురోద్వేగం ఉంది. ఒక నిర్మాణాత్మక భావావేశం ఉంది. ఒక ఎల్లలు తెలియని సార్వజనీనత ఉంది. అది రెక్కలు లేకుండానే నాకు వినీలాకాశవిహారం నేర్పింది. హృదయపరిభాష నేర్పింది. మనీష్ శుక్లా గారి మాటల్లో:
బాత్ కర్నేకా హసీఁ తౌర్ తరీకా సీఖా
హమ్ నే ఉర్దూ కే బహానే సే సలీకా సీఖా!
*

రమాకాంత్ రెడ్డి

2 comments

Leave a Reply to కృష్ణుడు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు