శ్రీలంక తమిళ కథ “పవిత్రత”

తమిళ మూలం:  టి.ఎస్. వరదరాసన్  (శ్రీలంక తమిళ కథ)

టి.ఎస్. వరదరాసన్ శ్రీలంక తమిళ సాహిత్యంలో వరదర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. 1924 లో జన్మించారు. పందొమ్మిది ఏళ్ళ వయసులో ది తమిళ్ లిటరరీ రినైసెన్స్ అనే సంస్థ స్థాపించాడు. 1946 లో మరుమలర్చి అనే తమిళ పత్రిక ప్రచురిస్తూ చాలా మంది తమిళ రచయితలకి ఒక వేదిక కల్పించాడు. 2002లో శ్రీలంక సాహిత్య అకాడమీ ఆయనకు సాహిత్య రత్న బిరుదు ఇచ్చింది. 1950 దశకం చివరిలో రాసిన  ఈ కథ 1060 లో జాఫ్నా సెంట్రల్ కాలేజీ మేగజైన్ “మధ్య దీపం” లో ఈ కథ ప్రచురితమైంది. 

 

*

సాయంత్రం నాలుగు గంటల సమయం. మూర్తి మాష్టర్, వినాయకుడి గుడి పూజారి గణపతి అయ్యర్ ఇద్దరూ పూజారి గారి ఇంటి వరండాలో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి సంభాషణలో ఎన్నో విషయాలు దొర్లి చివరకు సాహిత్యం చోటు చేసుకుంది. అయ్యర్ మూర్తి మాష్టారుని “నీవు విధిగా “కళై సెల్వి” పత్రిక చదువుతున్నావా? అని అడిగాడు.

   “అవునవును. ఆ పత్రిక మొదటి సంచిక నుంచి చూస్తూనే ఉన్నాను కానీ అన్ని సంచికలూ చదవలేదు సుమా! అయినా ఎందుకూ? ఏమైనా ప్రత్యేకమా?”

   “అనుకోకుండా ఆ పత్రిక పాత సంచిక ఒకటి చదివాను. అందులో ఒక కథ……”

   “ఎవరు రాసినది?”

   “రచయిత ఎవరో గుర్తు లేదు కానీ ఆ కథలో ఒక ఘటన నన్ను కలవర పెడుతోంది”

   “సరే! అయితే కథ చెప్పు. నాకు గుర్తొస్తుందేమో చూద్దాం”

   “మూడేళ్ల క్రితం మన దేశంలో వరదలొచ్చిన విషయం నీకు గుర్తు ఉందా? ఆ నేపధ్యంలోనే ఈ కథ రాయబడింది. ఒక గ్రామం వరదల్లో మునిగి పోయాక అందరూ ఎత్తైన ప్రదేశాలను వెతుకుతూ పరిగెడుతుంటారు. ఒక ధనవంతుడు తన ఎత్తైన మేడపై ఉన్నాడు. ఆ ఇంట్లో అతను ఒంటరిగానే ఉన్నాడు. ఒక బీద స్త్రీ వరదలకు భయపడి అతడి మేడపైకి ఎక్కుతుంది. ఆ ధనవంతుడు అవకాశాన్ని వినియోగించుకోవాలని అనుకుంటాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. అతను బలవంతంగా అనుభవించే ప్రయత్నం చేయబోతాడు. ఆమె తన‌ జీవితం కన్నా పవిత్రతకే విలువనిచ్చి కిటికీ నుంచి దూకి తన పవిత్రతను కాపాడుకుంటుంది. ఈ కథ గురించి నీవేమంటావ్?”

   “ఇందులో ఆలోచించాల్సినదేముంది? పురాణ కాలం నుంచి కొనసాగుతున్న నిరంతరమైన కథా వస్తువే. ఈ నేపథ్యంలో జీవమున్న కథ రావాలంటే అది కథా నిర్మాణం పైనా, దానిపై అది తీసుకునే రూపం పైనా, ఎలాంటి వచనంలో రాయబడిందో దానిపైనా ఆధారపడి ఉంటుంది. నేను ఆ కథ చదవలేదు. అది చదివాకే మాట్లాడగలను.” 

    “మాష్టారూ! నేను కథని మూల్యాంకనం చేయమని అడగలేదు. పురాణ కాలం నుంచి రాసిన కథలన్నీ చదివాను అన్నావుగా నీవు. ఈ కథా వస్తువు గురించి నీ అభిప్రాయం ఏమిటి?”

    “నువ్వు నన్ను ప్రత్యేకంగా అడుగుతున్నది ఏమిటి అయ్యా? ఆ స్త్రీ తన శీలం కాపాడుకోవడం కోసం జీవితాన్నే త్యాగం చేసిన విషయమేగా? అదేనా?” అన్నాడు.

    “అవును అవును ఆ విషయమే!”

    “ఒక స్త్రీ అందునా ఒక తమిళ స్త్రీ గొప్పతనం అందులోనే ఉంది కదా. కాదంటావా? తమిళ సాంప్రదాయం ప్రకారం పవిత్రత పోగొట్టుకోవడం కన్నా మరణించడమే మంచిది కదా?”

    అయ్యర్ తలాడిస్తూ “నువ్వు కూడా ఇదే అంటున్నావా?” అని అడిగాడు.

    మూర్తి మాష్టారు విస్తుపోయాడు.తనేమైనా తప్పు చెప్పాడా? ఈ అయ్యరు అసలు ఇలా ఎందుకు అడుగుతున్నాడు?”

     ఒక నిమిషం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ విషయమై ఆలోచించాక ధైర్యం వచ్చినట్లు, గణపతి అయ్యర్ నిశ్శబ్దాన్ని ఛేదించాడు.

    “మాష్టరూ! ఈ వ్యక్తిగత విషయం నాకు నా భార్యకూ మాత్రమే తెలుసు. అది నేను నీకు చెప్పబోతున్నాను. నీకు చెప్పినా ఏ ప్రమాదమూ జరగదులే. నేను చెప్పిన కథ విన్నాక ఇద్దరం “పవిత్రత” అంటే ఏమిటో మాట్లాడుకుందాం.

                      *******

    గత సంవత్సరం మురుగన్ కోవెలలో నేను పూజారిగా పనిచేసానని మీకందరికీ తెలుసు. ఆ కొవెల ఉన్న చోట కనీసం ఒక యాభై మంది తమిళులు కూడా నివసించటం లేదు. ఏమైనా ప్రత్యేక పర్వదినాల్లో మాత్రం వేరే ప్రాంతాలనుండి వచ్చేవారు. సింహళ ప్రజలు కూడా సాంప్రదాయంగా కోవెలను దర్శించి అర్చనలు చేయించేవారు. 

   సింహళ తమిళ ప్రజల మధ్య కొట్లాటలు చెలరేగినప్పుడు ముప్పాతిక శాతం తమిళులు యాలపానం ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. కానీ నేను కోవెలలో పూజార్చనలు చేయకుండా ఎలాగ పారిపోగలను? నేను నా భార్యని యానపానంకి వెళ్ళిపోమన్నాను. తను మాత్రం నీకేమైనా అయితే దాన్ని నేనూ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తను ఒక్కర్తీ వెళ్ళిపోవడానికి  ఒప్పుకోలేదు. 

    సింహళ ప్రజలు కూడా ఈ కోవెలకు వచ్చి ప్రార్థన చేసుకునే సాంప్రదాయం ఉన్నందున, కోవెల కార్యక్రమాలలో జోక్యం చేసుకుంటారని గాని, ఏదైనా ప్రమాదం ఉంటుందని గాని నేను భావించలేదు. ధైర్యం కూడదీసుకుని నా భార్యని కూడా కోవెలకు దూరంగా వెళ్ళిపోమని మరోసారి కోరనూ లేదు.

    ఆ రోజు బుధవారం. మాతో రోజూ తిరుగుతూ కోవెలకూ తరచుగా వచ్చే సింహళ వనిత బేబీ నోనా  

“మీరిద్దరూ ఇక్కడ ఉండడం అంత తెలివైన పని కాదు అయ్యా! మూడు లారీల్లో  దుండగులు ఈ ప్రదేశానికి వస్తున్నారని నాకు ఎవరో చెప్పారు. వారు తాము వస్తున్న దారిలో తమిళులందరినీ చెప్పలేని కష్టాలకు గురి చేస్తున్నారు అని నాకు తెలిసింది. వారు ఈ దారి వైపుగా కూడా ఇవాళో రేపో రావొచ్చు. మీరిప్పుడే పోలీసు స్టేషన్కి వెళ్ళండి, వారి సహాయంతో మీరు క్షేమంగా కొలంబో చేరుకోవచ్చు” అంది.

   ఆమె అన్నది వినగానే “ఓ దేవుడా మురుగా! నన్ను క్షమించు” అని నాలో నేను అనుకుని రెండు పెట్టెల్లో ముఖ్యంగా తీసుకు వెళ్ళగలిగే సామానులు సర్దేసాను. భార్య దారంలో కట్టి మెడలో వేసుకున్న తాళిబొట్టు తప్ప మిగిలిన నగలన్నీ కూడా ఒక పెట్టెలో పెట్టాను. అన్ని తయారీలు చేసుకునే సరికి సాయంత్రం అయిదు అయ్యింది. ఇల్లు వదిలేయడానికి సిద్దమవుతున్న తరుణంలో బేబీ నోనా పరిగెత్తుకుంటూ వచ్చి “అయ్యా! సిల్వా అతనితో మరో ఇద్దరు వచ్చేస్తున్నారు. అమ్మగారిని వారి కంటబడకుండా దాచేయండి. వాళ్ళు ఆమె గురించి అడిగితే ఆమె నిన్ననే వెళ్ళిపోయిందని చెప్పండి. మీరు ఇక్కడ ఉండడం ప్రమాదకరం, నాక్కూడా” అని చప్పున అంతర్ధానమైపోయింది. 

    నాకు సిల్వా బాగా తెలుసు. అతడొక చిత్రమైన మనిషి. అప్పుడప్పుడూ ఓ ముద్దు చేసిన కుక్కలా అయ్యా! అయ్యా!  అని ప్రేమగా పిలుస్తూ నాదగ్గర నుంచి యాభై సెంట్లు లేదా రూపాయి చాలా సార్లు తీసుకువెళ్ళిన వాడే! అతడు రౌడీ కూడా అయ్యుండవచ్చనే కాస్త దూరంగానే ఉంచాను.

    ఒకటి రెండు సార్లు రోడ్డు మీద నా భార్యని ఒంటరిగా చూసాడు. అతడి చూపులూ, నవ్వులూ తిన్నగా లేవని తను చెప్పింది. ఇప్పుడు వాడు వస్తున్నాడంటే దాని అర్థం….?.

     ఒక్క క్షణం నాకేం చేయాలో తోచలేదు. ఆలోచించేందుకు సమయం కూడా లేదు. ఇంట్లో కాస్త ఎత్తైన చోట మూడు పెద్ద కర్ర దుంగలూ, కొన్ని పాత పెట్టెలూ ఉన్నాయి. నా భార్యని పైకెత్తి ఎక్కి ఆ దుంగలూ,పెట్టెల మధ్య కనిపించకుండా దాక్కోమన్నాను. నేను వరండాలో చూస్తూ ముందుకి వచ్చాను. నేను వస్తూండగానే ఒక గుంపు ఇంటి ఆవరణలోకి వచ్చేసింది.

   నేను లోలోపల వణికిపోతున్నాను. అయినా నన్ను నేను కూడదీసుకుని  నవ్వుతూ సిల్వాతో “ఏమిటి సిల్వా? ఈ పక్కకి ఎందుకు వచ్చావు?” అని అడిగాను.

    “నేను ఇప్పుడే వచ్చాను. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావో లేక  తాళం వేసి యాలపానంకి పారిపోయావో తెలుసుకుందామని వచ్చాను” అన్నాడు.

    జవాబు ఇచ్చినప్పుడు నా గొంతు స్పష్టంగా లేకపోయినా “నేను మురుగన్ దైవాన్ని ఎలా వదిలి వెళ్తాను” అన్నాను.

    సిల్వా “మాక్కొంచెం తాగేందుకు నీళ్లు కావాలి” అనగానే “సరే” అని వంటింట్లోకి వెళ్ళాను. నా వెనుకే వాళ్ళూ వస్తున్నట్టు అనిపించింది. కానీ నేను  తిరిగి చూడలేదు. ఇత్తడి పాత్రలో నీళ్ళు నింపి తిరిగి చూడగానే ఆ ముగ్గురు రౌడీలూ నా ముందు నిలుచుని కనిపించారు. నేను పట్టుకున్న గ్లాసు వణుకుతోంది.

   “సరే! అయ్యా! అమ్మగారు కనిపించడం లేదేమిటీ”

   నేను ఎన్నోసార్లు మననం చేసి కంఠతా పట్టిన మాట “ఎందుకూ? ఆమె నిన్నే తన ఇంటికి వెళ్ళిపోయిందిగా” అన్నాను.

     పిడుగులాంటి చెంప దెబ్బ తగిలింది. చేతిలో ఉన్న గ్లాసు నీళ్ళూ కింద పడ్డాయి. నేను కళ్ళు తెరిచే లోపు, ఓ రౌడీ నన్ను ఒక చేత్తో నడుం దగ్గర పట్టుకుని మరో చేత్తో బాదటం మొదలు పెట్టాడు.

    “ఒరేయ్!  పందీ! నాతో అబద్ధం చెబుతున్నావు. ఇవేళ ఉదయం కూడా నీ భార్యని చూసాను” అన్నాడొకడు.

     మరొక రౌడీ “రాస్కెల్! నాకు చెప్పు ఆమెను ఎవరింట్లో దాచావు? అనడంతో నా హృదయం కొంచెం తేలిక పడింది. నేను ఆమెను ఇంకెవరి ఇంట్లోనో దాచేను అనుకుంటున్నారు అని. అంటే నా ఇంట్లో ఇక వెతకరు. నా జీవితం పోయినా, నా భార్య పవిత్రత పోదు” అనుకున్నాను.

     “ఏం మాట్లాడవేంరా? రాస్కెల్”

   దెబ్బలు! ముష్టి ఘాతాలు! చెంప దెబ్బలు! నేను అచేతనంగా పడిపోయాను. నన్ను పట్టుకుని నిలబెట్టారు.

    “ఆమె ఎక్కడుందో మాకు నువ్వు చెప్పవు కదా? మా మనుషులు గల్లె నుంచి వచ్చి బజార్లో ఉన్నారు. మేం వాళ్ళకి నిన్ను ఇచ్చేస్తే నీ చర్మం ఒలుస్తారు, ఉల్టాగా కట్టేసి సజీవ దహనం చేస్తారు. అదే నీకు మంచిది. పద నా కొడకా!” అంటూ నన్ను నిలబెట్టి మళ్ళీ కొట్టడం మొదలు పెట్టారు. వాళ్ళు ఎంత తీవ్రంగా కొడుతున్నారంటే నేను అస్సలు నిలబడలేక పోతున్నాను.

    నన్ను ఈడ్చుకుంటూ హాలు మధ్యకు తీసుకు వచ్చారు. నా భార్య పైన దుంగల మధ్య కూర్చుని ఉంది. వాళ్ళు హాలు దాటుతున్నారంతే!

    “ఆగండి! ఆగండి!” అంటూ అరుస్తూ నా భార్య కిందికి దూకేసింది. ఆమె పరిగెడుతూ నా దగ్గరకు వచ్చి “ఆయన్ని వదిలెయ్యండి” అని అరిచింది.

   వాళ్ళు నన్ను వదిలేసారు. ఆరు మొరటు  చేతులు ఆమెను చుట్టుముట్టాయి. వాళ్ళు వెనుకనుంచి ఒక టేబుల్ కోడికి నన్ను కట్టేసారు. నా భార్యను ఈడ్చుకుంటూ వంటగది వైపు తీసుకుని వెళ్ళారు. రెండు నిమిషాలలోనే తన తీవృమైన అరుపులు నాకు వినిపించాయి. ఆ తర్వాత ఆమె అరిచిందో లేక రక్తపోటు పెరిగి మూర్ఛపోయానో తెలియదు. నా మెదడు మొద్దు బారి పోయింది. 

    మళ్ళీ నాకు తెలివి వచ్చేసరికి, ఆ టేబుల్ దగ్గర ఒకరి ఒడిలో ఉన్నాను. నన్ను అంత ప్రేమగా లాలిస్తున్నదెవరో తెలుసుకోవాలని ఆతృతగా కళ్ళు తెరిచాను.

    ఆమె నా భార్య.

    పవిత్రత పోగొట్టుకున్న ఒక భార్య…… 

   శతాబ్దాల పాటు వారసత్వంగా జీర్ణించుకున్న పవిత్రతా భావం నన్ను హింస పెడుతోంది. 

   పవిత్రత పోగొట్టుకున్న నా భార్య ఒడిలో నేను పడిఉన్నాను. నా శరీరం సిగ్గుతో మెలికలు తిరిగిపోతోంది. నా మెదడు నన్ను తననుండి వేరుచేసుకుని నేలపై పడిపోమంటోంది.

     నా ముఖంపై ఒక కన్నీటి చుక్క రాలింది. ఆ తరువాత మరొకటి, ఇంకొకటి అలా నా ముఖం కన్నీటి చుక్కలతో తడిసిపోయింది.

   ఇక్కడ ఆమెను విష సర్పాలు కరిచి ఆనందం జుర్రుకున్నాయి. తన శరీరం, మెదడుకూ వేదనలో మునిగిపోయాయి. కొన్ని శరీరాలు ఆమె శరీరాన్ని ఏదో చేసాయి అది నా శరీరాన్ని సైతం కాల్చేసింది.

     ఆ ఘటన నా మెదడు పై ఏ ప్రభావమూ వేయకపోయుంటే తన పవిత్రత పోయేది కాదా? తను నేరమని తలచకుండా చేసినదానికి తనని శిక్షించాలా? ఆమె మెదడుకి ఏ సంబంధమూ లేకుండా కేవలం శరీరానికి హాని జరగడం వలన,  తన పవిత్రతను పోగొట్టుకుందని ఆమెను నిందించితే, మరి వైద్యుల దగ్గరకు వెళ్ళే ఆడువారి సంగతేమిటి మరి?” 

    నా మెదడుని చికాకు పెట్టే ఈ ఆలోచనలను తోసి పారేసాను. గుండెలో నా భార్య పట్ల గర్వం నిండి, ఆమె దయకీ, అభినందనకీ పాత్రురాలు అనిపించింది. మెల్లగా ఆమె చేతులు పట్టుకుని నా గుండెలకు చుట్టుకున్నాను.

    ఆ తరువాత పోలీసులు వచ్చారు. ఈ విషయంలో బేబీ నోనా సహాయం చేసిందని నాకు తరువాత తెలిసింది. ఎన్నో కష్టాలు ఓర్చుకుని, నిర్వాసితుల కోసం ఏర్పరిచిన ఆశ్రయంలో ఉండి బాధలనుభవించాక ఇక్కడికి ఎలాగో చేరుకున్నాం. 

                     ********* 

     ” ఇప్పుడు చెప్పు మాష్టర్! బలవంతంగా నేరం చేయబడితే ఒక స్త్రీ పవిత్రత పోయినట్టేనా? ఒక పవిత్రమైన భార్య భర్త చితి మంటల్లో భార్య కలిసిపోవాలని, అది తన ధర్మమనీ  సమాజం నిర్దేశిస్తుంది. బలవంతం వలన భార్య దీన్ని ఆమోదిస్తే ఆమె గుణవంతురాలూ, దైవికురాలూనా? లేక సహేతుకం కాని సమాజ నిర్ధేశాలకు బలి అవుతోందా? నాకు చెప్పు. మాష్టర్…..?”

     భావోద్విగ్నుడై గణపతి అయ్యర్ ఏడ్చేసాడు.

    “నన్ను క్షమించండి అయ్యా! తరాల తరబడి మన రక్తంలో పేరుకుపోయిన భావాల వలన ఆలోచించకుండా ఎన్నో విషయాలపై మన అభిప్రాయాలు వెల్లడించేస్తాం. నేనూ తెలివితక్కువ తనంగా ఏదో అనేసాను. అయ్యా! సహేతుక ఆలోచన పేరిట కొందరు వ్యక్తులు అనవసరమైన విషయాల పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ ఈ రోజు సహేతుకమైన ఆలోచనాపరుణ్ణి కనుక్కోగలిగాను” అన్నాడు మూర్తి మాష్టారు. అయ్యర్ ఇంట్లో వేలాడుతున్న గాంధీ చిత్రం అయ్యర్ ముఖంతో కలుస్తున్నట్లుంది అనుకున్నాడు మూర్తి మాష్టారు‌.

*

   చిత్రం: తిలక్ 

ఆర్ . ఎస్ . వెంకటేశ్వరన్ .

2 comments

Leave a Reply to Kallakuri Sailaja Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Excellent narration and useful discussion.The burden of perceptions is well depicted.Thanks for publishing here in dear Saranga

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు