శీలావీ రాసిన ఒక ప్రేమలేఖ…..

ఏంజనం! అంత జనాన్ని ఎప్పుడు నేను అలా చూడలేదు. ఎంతమందో ఆడాళ్ళు,ముసలాళ్ళు రొప్పుతూ రోజుతూ గుండెలు బాదుకుంటూ పరుగెత్తడం తలంచు కొంటుంటే యిప్పటికీ నా వళ్ళు జలదరిస్తోంది.

24.9-1970 లక్ష్మివారం

నాప్రాణంలోని ప్రాణమా,
        యిప్పుడు ఎంత ఆర్భాటం జరిగిందని! ఒక గంట క్రితం హైదరాబాదు సికిందరాబాదు జంటనగరాలు యావత్తూ ఒక అర్ధగంటసేపు దిక్కుతెలియని అయోమయ పరిస్థితిలో వుండిపోయాయి. గంట క్రితం జరిగిన యీ ఆర్బాటానికి యింకా నా గుండెల్లో అదురు తగ్గనే లేదు.
ఈ జంట నగరాలకు మంచినీటిని సరఫరాచేసే గండిపేట సరస్సు గట్టు తెగిపోయి వూళ్ళోకి నీరు వచ్చేస్తోందని – ఎలావచ్చిందో వార్త వచ్చింది. కొన్ని ప్రాంతాలలో హుసేన్ సాగర్ తెగిపోయిందని (హుసేన్ సాగర్ మరో సరస్సు) వార్త వ్యాపించింది. క్షణంలో వూరంతా పిచ్చెత్తినట్టు అయిపోయింది. ప్రజలు కట్టు బట్టలతో వూరి వీధుల్లోపడి ఎత్తయిన ప్రాంతాలకు చేరుకుందామని పరుగులు తీస్తూ తలొక దారిపట్టారు. వందలు వేలు కాదు లక్షల సంఖ్యలో జనం వీధుల్లో పడి ఒకటే పరుగు. ఎత్తయిన ప్రాంతాలకు చేరుకుందామని వున్నవాళ్ళు వున్నట్టుగా వీధులు పట్టారు. ముసలీ ముతకా, ఆడామగా, చిన్నా పెద్దా అనే తేడా లేక అందరు పరుగెత్తారు.
(అసలు, నడక అనేది కనిపించనే లేదు) పల్లపు ప్రాంతాలనుంచేకాక ఊళ్ళోని అన్ని ప్రాంతాల నించీ జనం ప్రవాహంలాగ, వెల్లువలాగ వీదుల్లో కనిపించారు.
మా వీధి లోంచి కొన్ని వేలమంది జనం ఒకటే పరుగుతో ఆందోళనగా, కంగారుగా ఏడ్పులూ బొబ్బలతో పరుగెత్తడం చూసాను. బళ్ళల్లో, రిక్షాల్లో, , సైకిళ్ళమీదా – అబ్బ  ఆదొక ప్రవాహమే అనుకో. జనప్రవాహం . ఎందరో ఆడాళ్ళు, చిన్న పిల్లలు పరుగెత్తలేక పడిపోయి ప్రాణం మీది ఆశతో దెబ్బల్ని కూడా లెక్క చేయ కుండా పరుగెత్తారు. నా ఎదుటే ఎన్నో సైకిళ్ళు తొక్కే వాళ్ళు జనాన్ని తప్పించుకోలేక క్రింద పడి, మళ్ళీ వగర్చు కుంటూ కంగారుగా లేచి బట్టల్ని సైతం దులుపుకోకుండానే సైకిలు ఎక్కి ఒకటే కంగారుగా పారిపోతుండడం చూశాను . నామాట తర్వాత చెప్తాలే. సైకిళ్ళ క్రింద, రిక్షాల క్రింద (కార్ల కింద కూడా) పడి దెబ్బల్ని తగిల్చుకున్న వాళ్ళు అనేకమంది.
            ఓపిక వున్న వాళ్ళు ఒకట్లో అరో సామాను చేతపట్టుమని చంటిపిల్లల్ని భుజానేసుకుని ఒకటే రొదతో పరుగెత్తారు. ఏమూల చూసినా పారిపోతున్న ప్రజానీకమే. ఏ వీధిలో చూసినా జనప్రవాహమే. వూళ్ళో ఒక మూలా, ఏ ఒకప్రాంత మో కాదు” మొత్తం హైదరాబాదు, సికింద్రాబాదు యావత్తూ యిలానేవుంది. చాలాప్రాంతాలు కాళీ అయిపోయాయి. ఎత్తు ప్రదేశాన్ని వెతు బాగాక్కుంటూ జనం నిరంతర ప్రవాహంలాగ పరుగెత్తుతూనేవున్నారు. సినిమాల్లోంచి తొక్కిసలాటలో జనం బయటపడి ఒకటే పరుగు. దుకాణాదారులు దుకాణాన్ని ఎలా వున్నవి అలా మూసేసి యిళ్ళకు కూడా పోకుండా పరుగులు తీసారు.ఒక్క దుకాణం తీసి లేదు ఒక్క ఇల్లు తెరిచి లేదు.అందరూ తాళాలేసుకుని చేతికందిన సామాను తో ఎక్కడికి పోవాలో తెలియక అంతా ఎటో పరుగెడుతున్నట్టే పరుగెడుతూ పోయారు.
 సరిగ్గా ఆర్థ గంట (కొన్నిప్రాంతాల్లో యింకా ఎక్కువే) ఏంజరిగిందో ఏమిటో తెలీక జంటనగ రాలు యావత్తూ పిచ్చెత్తి పోయినట్లు ప్రవర్తించాయి. హైదరాబాదు నగరం అయితే మరీని. సికిందరాబాదుకు బహుశా యీవార్త అంది వుండకపోవచ్చు అనుకున్నాను. గాని రేడియోవార్తని బట్టి (ఇప్పుడే విన్నాను) హైదరాబాదు, సికిందరాబాదు రెండు అట్టుడికినట్లు ఉడికిపోయాయి.
సరిగ్గా ఆరుగంటల సమయం. స్వాతి ఫ్రూఫులు వస్తే కూచుని దిద్దుకుంటున్నాను. ఇంతలో ఆకసాత్తుగా వీధిలో జనం పరుగెత్తుతూ కనిపించేసరికి ఏమైందాఅని బయటకు వచ్చాను. కొన్ని వేలమంది ఎడతెరిపి లేకండా వీధిలోంచి పరుగెడుతూ పోతు న్నారు. గండిపేట సరస్సు తెగిపోయిందనీ, హుసేన్ సాగర్ కట్టకు గండి పడింది నీరు వూరంతటినీ ముంచేస్తోందనీ, తరుముకొస్తున్నట్టు నీరు వస్తోందనీ సగం చెప్పి సగం చెప్పక, మాటరాక ఎలాగో వూడిపడి- మొత్తంమీద తెలిసిన వార్త అది. ఏడుపులు, కేకలు ఒకటే గోల. నిరంతరంగా జనం అలా పరుగెత్తుకొంటూ వస్తూనేవున్నారు.
          మాది ఎత్తయిన ప్రాంతం. అందుకని ఆ పరిసరాల వాళ్ళంతా మా ప్రాంతం మీదుగా యింకా ఎత్తయిన అబీడ్స్, నారాయణగుడా వంటి ప్రదేశాల వైపుపరుగెత్తుకుంటూ పోతున్నారు.
         ఏం జనం! అంత జనాన్ని ఎప్పుడు నేను అలా చూడలేదు. ఎంతమందో ఆడాళ్ళు,ముసలాళ్ళు రొప్పుతూ రోజుతూ గుండెలు బాదుకుంటూ పరుగెత్తడం తలంచు కొంటుంటే యిప్పటికీ నా వళ్ళు జలదరిస్తోంది.
      ఇదంతా ఓ అరనిమిషం కూడా నిలుచుని చూసీ చూడకుండానే యింట్లోకి ఆవార్త చెప్పుదామని వచ్చేసరికి అప్పటికే మా కాంపౌండ్ లో వున్న మూడూ కుటుంబాల వారూ సామాను సర్దుకుంటున్నారు. మాలతి పిల్లలకు అన్నాలు పెడుతోంది. విషయం విని పరిగెత్తుకొచ్చేసింది పిల్లల్ని తీసుకుని. సామాను సర్దుకోడానికి కూడా వీల్లేనంత హడావుడి, భయం.
        ఏ వస్తువూ తియ్యలేదు. వయోలీన్, రేడియో మాత్రం కాస్త ఎత్తుగా పుస్తకాల షెల్ప్ మీద పెట్టాను. వొదిన పెట్లో వున్న బంగారు వస్తువులూ, డబ్బుని మాత్రం వో చేతిలో పట్టుకోమని యిచ్చింది. అంతే .యింక ఏమీ తీసుకోలేదు. పిల్లలకి అముల్ స్ప్రే మాత్రం చేత్తో పట్టుకుంది. నేను ఆ మధ్య మీవూరునుండి తెచ్చిన రబ్బరుతలగడ తీసుకోని మీవదిన చేతికిచ్చాను. అవసరమైతే దానిని వాడమని. ఒక నిముషం వ్యవధిలో తలుపులు తాళాలు వేసుకుని మా యింటి మేడ మీదకి(మేడమీది పోర్షన్ లో సింథీ వాళ్ళు వుంటున్నారు) చేరుకున్నాం.ఇతర కుటుంబాలవాళ్ళూ ఇక్కడికే చేరుకున్నారు.పిల్లలు ఒకటే ఏడుపు.అంతెందుకూ మీ వదిన కూడా ఏడ్చేసింది.అనవసరంగా ఈ వూళ్ళో చిక్కుపడి పోయానని.
         మరో అయిదునిమిషాల్లో యింతవరకూ నీరు వచ్చేస్తుందనీ,ఇల్లు మునిగి పోతుందనీ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఏమాతుంది ఏమౌతుందన్న ఆరాటంతో ఏమీ తోచక ఒకటే ఆందోళనతో చూస్తూవుండి పోయాం. వీధిలో జనం వేలాదిమంది అలాపరుగెత్తుకుంటు పారిపోతూనేవున్నారు. మామూలు యిళ్ళవాళ్ళు -మాచుట్టు పట్లవాళ్ళు- ఇళ్ళుకాళీచేసేసి ఎటో వెళ్ళి పోతున్నారు. మాది కాస్త గట్టిగా వుండే మేడ కావడంవల్ల అక్కడే వుందామని పారిపోకుండా వుండిపోయాం
      ప్రాణాలమీది తీపి అంటే ఏమిటో నాకు అప్పుడు తెలిసివచ్చింది. ఒక వేళ నీరు యింటిని ముంచేస్తే యింత కన్నా ఎత్తయిన ప్రాంతానికి వెళ్ళిపోవడం ఎలాగా ? అని మానసికంగా prepare అయి చూస్తున్నాను. మనసుకు ఏ ఆలోచనా తోచకుండావుంది. అలా ఓ యిరవై నిమిషాలు గడిపాం. ఆడవాళ్ళందర్నీ మేడపైన డాబామీద వుంచి అప్పుడప్పుడు క్రిందకు వీథిలోకి వచ్చి చూస్తున్నాను ఏమైనా వార్తలు తెలుస్తాయేమోనని. చార్మినార్ పూర్తిగా మునిగిపోయిందనీ, పైశిఖరం మాత్రమే కనబడుతున్నదనీ, ఇదిగో యిసామియాబజారులోకి (యిసామియాబజారు మాకు చాలా దగ్గర) నీరు వొచ్చేసిందనీ, ఇదిగో సుల్తాన్ బజారు కొట్లలోకి నీరు సగంవరకు అప్పుడే వచ్చేసిందనీ జనం చెప్పుకుంటూ పారిపోయి పరుగెడుతున్నారు.
ఎలాగైతేనేం యిరవై నిముషాలు తర్వాత పోలీసు వాళ్ళు కారుల్లో వచ్చి అంతా పుకారనీ, ఏమిలేదని హెచ్చరికలు వేసుకుంటూ వెళ్ళడం వినిపించింది. గబగబా నేను కింద కొచ్చి తలుపు తాళం తీసి రేడియోపెట్టాను. ఇది కేవలం పుకారనీ, ప్రజలు భయపడనక్కరలేదనీ ఒక ముఖ్యప్రకటన
 రేడియోలో వచ్చింది. ఇప్పటికి యీముఖ్యప్రకటనని రేడియోవాళ్ళు పదిసార్లన్నా వేశారు. దీన్ని బట్టి ప్రజలు ఎంతగా భయ భ్రాంతులయ్యారో, ఎంత ఆర్భాటం జరిగిందో వూహించుకో.
         నామట్టుకినేను చాలా భయపడ్డాను. ఆ సమయంలో ఏమాత్రం విచక్షణతో ఆలోచించినా యింతగా భయపడవలసిన పనివుండేదికాదు. నిజానికి నేను వుంటున్న ప్రాంతం ఎత్తులోనే వుంది . వూళ్ళో మూడొంతులు మునిగిపోతేగాని నీరు యిక్కడికి రాదు. పైగా యిది పక్కామేడ. మేడమీదకి చేరుకుంటే ఏభయమూ వుండదు. సిమ్మెంటుమేడ గనుక కూలి పోతాదన్న భయం కూడా లేదు. అసలు సరిగ్గా ఆలోచిస్తే ఇంత ఎత్తుకు నీళ్ళురావడానికి వీల్లేదు.
            నిజంగా గండిపేట సరస్సుకూ, హుసేన్ సాగర్ సరస్సుకూ గండ్లు పడి నీరు వూళ్ళోకి వచ్చే సినా మెల్లమెల్లగా నీరు వస్తుందిగానీ ఒక్కసారిగా నిలువెత్తునరాదు. ఎందుకంటే గండిపేట సరస్సు వూరికి ఏడుమైళ్ళ దూరంలో వుంది. అయితే యిదంతా ఆలోచించే జ్ఞానం ఆక్షణంలో ఎవరికీ లేదు. ఇదిగో నీరు ఫలానా చోటవరకూ వచ్చేసింది, అదిగో ఆ బజారుమునిగి పోయింది అని చెప్తున్నప్పుడు వేలాది, లక్షలాది ప్రజలు పరుగెత్తుకుంటూ పారిపోతున్నప్పుడు నమ్మకుండా వుండడం ఎలా? అసలు యింత భయం. ప్రజలకి కలగడానికి కారణం లేకపోలేదు.
             సరిగ్గా మూడు రోజుల క్రితం-అంటే తెల్ల వారితే సోమవారమనగా హైదరాబాదు చాలా భయంకర విషాదానికి గురైంది. రాత్రల్లా విపరీతంగా మున్నెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా వర్షం కురవడం వల్ల, మూసీనదికి వరదలు వచ్చి వూళ్ళో కొన్ని ప్రాంతాల్ని ముంచేసింది.
       1908 తర్వాత మూసీనదికి యింతటి వరదలు ఎప్పుడు రాలేదు. 1908లో మాత్రం అపారమైన నష్టం జరిగితే అప్పటి నిజాంనవాబు మొక్షగుండం విశ్వేశ్వరయ్యని మైసూరు నుండి పిలిపించి యీ వరదల్ని అరి కట్టే వుపాయం ఆలో చించ మంటే ఆయన రెండు సరస్సులను నిర్మించమని ప్లాను యిచ్చాడు. ఆవిధంగా హుసేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) సరస్సుల్ని నిర్మించారు. అప్పటినుంచీ వరదలు రాలేదు. మళ్ళీ యిన్నాళ్ళకు యిలా అకపాత్తుగా వరదలు వచ్చాయి.
           ఈ వరదల్లో మొన్న సుమారు రెండు వందలమంది చనిపోయారు. బస్సుడిపో దగ్గర నాలుగు అంతస్తులమేడ కూలిపోయి ముప్పయ్ కుటుంబాలు సజీవ సమాధి అయిపోయారు.
వరదవచ్చేస్తోంటే’మట్టియిళ్ళవాళ్ళు, పాకల యిళ్ళ వాళ్ళు రక్షణకోసం అమేడమీదకు వెళ్ళారు. ఆమేడ మేడ యావత్తు కూలిపోయింది. ఆ ఇక్కయింట్లోనే వందమందికి పైగా చనిపోయివుంటారని అంచనా. ఇప్పటి వరకు ఆ శిధిలాలనించి అరవై మృత దేహాల్ని తీసారు. ఇది అధికార లెక్కలు. అనధికార లెక్కల్ని బట్టి మరణించినవారి సంఖ్య యింకా ఎక్కువేవుండొచ్చు.
         వరదనీరు ఒక చోట హోల్సేల్ వ్యాపారం జరిగే ప్రాంతంలో రెండు నిలువుల లోతు వరకు వచ్చింది. చాలా కోట్లరూపాయల సరుకు నాశనమై పోయింది. నీళ్ళల్లో కొట్టుకు పోయిన శవాలు కొన్ని యీరోజుకు కూడా దొరకలేదు. ఈవరద వల్ల జంటనగరాల్లో రెండు వేలకుపైగా ఇళ్ళు కూలిపోయాయి.
        మూడు రోజుల క్రితం అనుభవం లోకి వచ్చిన యీ విషాద సంఘటన వల్ల ప్రజలు  భీతావహులైవున్నారు . ఆ షాక్ నించి యింకా కోలుకోలేదు. యిప్పుడు యీ పుకారు లేవదీసేసరికి ప్రజలు నమ్మకుండా ఎలావుంటారు? భయపడకుండా ఎలావుండ గలరు?
           ఈ పుకారుని కొంతమంది గుండాలు చాలా organised గా లేవదీశారు. చాలా చోట్ల యిళ్ళు లూటీ చేశారు. ఆడాళ్ళ మెళ్ళో వస్తువుల్ని సైతం తెంపుకు పారిపోయిన సంఘటనలు చాలావున్నాయి. ప్రజలు ఎక్కడి వస్తువుల్ని అక్కడే వదిలేసి వున్నవాళ్ళు వున్నట్లుగా పారిపోవడంవల్ల దొంగతనాలు విపరేతంగా జరిగాయి. సైకిళ్ళ మీద జనాన్ని తప్పించుకుని వెళ్ళలేక రోడ్లమీదే సైకిళ్ళని వదిలేసి పారిపోయినవారుకూడా వున్నారు!బహుశా దొంగతనాలు చేసే రౌడీవాళ్ళు యీపుకారుని లేవదీసి వుండవచ్చని అనుకుంటున్నారు.
          అయితే ఈపుకారుకి మరోకారణం కూడా జతపడింది. వూళ్ళోవున్న సరస్సుల నిండుగా నీళ్ళువుండడం వల్ల ఎప్పుడు గట్టు తెగిపోయి ప్రమాదం సంభవిస్తుందేమోనని అధికార్లు యీ రెండుమూడు సరస్సులలోని ఎక్కువ నీటినీ మూసీ నదిలోకి విడుదల చేశారు. ఆరోజు సాయంకాలం 5గంట లప్పుడు రెండో మూడో అడుగులలోతు మాత్రమే నీరున్న మూసీనదిలో యీ సరస్సులలోని నీరుచేరడం వల్ల ఆరుగంటలప్పుడు గట్లు నిండుగా నీరు వచ్చేసింది.మూడు రోజులక్రితం వచ్చిన వరద ఆ మర్నాడే పూర్తిగా తీసేసింది . వొట్టి రోజుల్లో మూసీనది చిన్న పిల్లకాలవలా వుంటుంది .ఒక్క సారిగా మూసీనది లోనికి యింత నీరు రావడంతోనే ఆ పరిసరాలలో వుండే ప్రజలు భయపడిపోయారు. మళ్ళీ ఏ సరస్సో తెగిపోయిందని భావించారు. ఆ వార్త అలా అలా పాకి వూరంతా అల్లుకుపోయింది.
       ఓ అర్థగంట జంటనగరాలు యావత్తూ పిచ్చెత్తిపోయినట్టు అయిపోయాయి.. ఇంకా యిప్పటికీ వీధిలో జనం గుంపులు గుంపులుగా వెళ్తుండడం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ తొమ్మిదిన్నరో అయివుంటుందేమో. పారిపోయిన జనం మళ్ళీ యిళ్ళముఖం పడుతున్నారు. రేడియోవార్త విన్న తర్వాత ఏడున్నరకి ఓసారి అలా బయటికి వెళ్ళి ఓఅర్దగంట తిరిగివచ్చాను.
     ఏం జనం ! ఏం జనం!! ఇన్ని లక్షల మంది జనం ఈవిధంగా ఫూల్స్ కావడం తలచుకొంటే ఇప్పుడు నవ్వొస్తుంది .
          అబ్బా!ఇటువంటిది నా జీవితంలో యింతకు ముందు ఎన్నడూ చూడలేదు. నా చిన్నప్పుడు గోదావరి వరదలు వచ్చాయి వచ్చిన తర్వాత వెళ్ళిచూశాను. జనం కోలాహలం భయం, ఆందోళన – యివి అప్పుడు చూడలేదు. ఇప్పుడు మూడురోజుల క్రితం వచ్చిన వరదలూ, యీనాటి ఆందోళనా ప్రత్యక్షంగా చూశాను. వళ్ళు గగుర్పొడిచే అనుభవం యిది. నా ప్రాణం మీద యింత తీపి ఎప్పుడూ అనిపించలేదు.
         నీరు వచ్చేస్తోందని వూరుమునిగి పోతోందని అంతా మేడమీదకి చేరుకున్నప్పుడు నా కళ్ళనిండా నువ్వే అలుక్కుపోయావు. దేవీ నేనేమైపోతానా? అన్న భయంకన్న నీకెక్కడ అన్యాయం జరిగిపోతుందా అన్న భయము నన్ను ఆక్రమించుకుంది. అందుకే వెంటనే కూచుని నీకు యీ లేఖరాయడం మొద పెట్టాను.
            ఇంతకుముందే మొన్న ఆదివారం నాటి మూసీనది వరదల్ని గురించి వార్తాపత్రికల్లోనో రేడియోద్వారానో తెలుసు కునేవుంటావు. ఎంతో ఆందోళన పడుతూ వుండొచ్చు. వెంటనే నీకు వుత్తరం రాద్దామనుకుంటున్నాను.
          ఏలాగు రేపు నీవుత్తరం వొస్తుందికదా, ఏకంగా అప్పుడే రాయొచ్చులే అనుకున్నాను. ఇంతలోకి యీసాయంకాలం యీ పుకారు వల్ల వూరు వూరంతా అరగంట సేపు దిక్కతోచని అయోమయ అవస్థలో మునిగిపోతే యీ నా అనుభవాన్ని నీకు తెలియజేద్దామని యీ వుత్తరం రాస్తున్నాను.
       ఈరాత్రి గడిచి వుదయం వచ్చేసరికి న్యూస్ పేపరు యింకెన్ని విశేషాల్ని మోసుకొస్తుందో.
వుంటానుమరి. చాలారాత్రయ్యింది. బైట వీధిలో యింకా జనం రాకపోకలు, మాటలూ వినిపిస్తూనేవున్నాయి. ఈ రాత్రి ఏం అర్థరాత్రో దాటాక గానీ యీ నగరం నిద్రపోదు కాబోలు.
నీ
రాజు

శీలా సుభద్రాదేవి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు