శిశిరాన్ని రాల్చుకున్న వసంతం

వేదనో వెన్ను తట్టినప్పుడు ప్రతీ మనిషీ వేదాంతి అయిపోతాడు, కాలాన్ని పట్టి లేదా గళాన్ని విప్పి తనవైన కొన్ని సూక్తులు, కొన్ని రాతలు ప్రపంచానికి అందిస్తాడు. అదే ఆ మనిషి అసలుకే ఓ కవి అయ్యి వుంటే ఆ కాలాన్ని కాగితాల సాయంతో బంధిస్తాడు.
సరిగ్గా అదే చేసింది అమూల్య చందు కప్పగంతు, సాహిత్య ప్రపంచంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న ఈ పాత్రికేయ కవయిత్రి తన ఉనికిని చిధ్రం చేసేందుకు వచ్చిన అతిథిని అతిథిగానే భరించి, గౌరవించి, సాగనంపి తన తోటి హృదయాలకు ఆదర్శంగా నిలిచింది. సుదూర జీవన యాత్రలో అనుకోకుండా ఆగవలసిన కాన్సర్ మజిలీ దగ్గర ఏమాత్రం తడబాటు లేకుండా ఆగి, నెమ్మదిగా, నింపాదిగా ఆ దశకు, ఆ అనివార్య మజిలీకి వీడ్కోలు పలికి తిరిగి తన దైనందిన జీవితాన్ని మొదలు పెట్టింది.
ఇక్కడ ఓ ప్రశ్న మన మనసులకు పని పెట్టవచ్చు, బాధలు ఎవరికి వుండవు? అనారోగ్యాలు ఏ దేహాన్ని పలకరించవు? అంత మాత్రాన అవన్నీ కవిత్వం చేయాలా? మన క్షోభను ప్రపంచానికి విప్పి చెప్పాలా? అని. ఇది ఏదో సాధారణ బాధ, అతి సాధారణ అనారోగ్యమో అయితే మనమా ప్రశ్నను కూడా అతి సాధారణమైన ప్రశ్న గా కొట్టి పారేయవచ్చు. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని కబళిస్తూ, జన జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ, పసి హృదయాలను, ప్రౌడ భవిష్యత్తులను, వృద్ధుల ప్రశాంత జీవనాన్ని తన పాశవిక హస్తాలలోకి తీసుకుని కనీసం ఓదార్పుకూ అందనంత విషాదాన్ని రచిస్తున్న మహమ్మారి.
కాన్సర్, పేరు వింటేనే అయ్యో పాపం ఆమె లేదా అతను కాన్సర్ పేషెంట్ అంట, ఇంక ఎలా బతుకుతాడో, ఏమో, ఎలా తట్టుకుని నిలబడుతారో ఇలాంటి జాలి చూపుల మధ్య, ఒంటిని, మనసును కాల్చేసే రేడియేషన్ చికిత్సల మధ్య రోజూ చస్తూ, బతుకుతూ , పగవాడికీ ఈ స్థితి రాకూడదు అని చేతులు జోడించి కనిపించే వైద్యులను, కనిపించని దేవుళ్ళను ప్రార్థించే పెదవులకు ఈమె తన కలాన్ని ఇచ్చింది, తన దయనీయ కాలాన్ని అక్షరాల సాయంతో బయటపెట్టింది.
చీకట్లో ఒంటరిగా నడుస్తూ ఎక్కడో
తగలబడుతున్న శవం దగ్గర నిలబడినట్టు
మనుషులెవరూ లేని ప్రపంచం చివరి కొసకు
వేలాడుతున్నట్టు
సముద్రమంతా పొంగి మీద పడుతున్నట్టు
నన్ను మింగేసే కలలవి
ఇలాంటి ఎన్ని చీడ పీడ కలల్ని ఎదిరించి తాను వెలుగును చూసిందో ఈ ఒంటిరొమ్ము తల్లి పుస్తకం లోని 19 కవితలు మనకు ఆర్ద్రంగా చెబుతాయి.
నేనేం పాపం చేశాను
నా దేహాన్నే కాదు
మనసునూ గాయం చేశావు
నా జీవితాన్ని చీకటి చెరసాల చేశావు
చావుకన్నా భయంకరమైన శిక్ష వేశావు
నన్నో నిలువెత్తు గాయంగా మిగిల్చావు
నువ్వూ మా ఆడవాళ్ళ శరీరాలను గాయ పరిచే
పురుషాధిక్య మూర్తివేగా…!
అంటూ దేవుడిని కూడా నేరస్తుడిని చేసే ఆమె కవిత్వం వెనుక ఎన్ని కన్నీళ్లు రాలి పడ్డాయో మనకు అర్దం అవుతూనే, మనకూ కాసింత తడి అంటుకుంటుంది. అలా అని ఆమె ముడుచుకు కూర్చోలేదు
ఆసుపత్రి మంచం మీద నుంచి
కాలాన్నైనా ఎదిరించి తీరుతాను…..
…..
తప్పక మీ సకల అహంకారాల్ని
అత్యాచారాల్ని, అవమానాల్ని
ఆధిపత్యాన్ని జయించే విజేతను నేనే అవుతానని ప్రకటిస్తుంది, అన్నట్లుగానే విజేతగా నిలిచి మన ముందు నిలుచుని వుంది.
ఇక్కడ పగలు, రాత్రంటూ వుండదు
కష్ట సుఖాలను ఒక మంచం మీంచి మరో మంచం
మీదకి గుమ్మరించుకోవడం తప్ప….
తెల్లని చర్మమంతా
మాయమై ముడతలు పడి కారుమబ్బు రంగును
పులుముకున్నప్పుడు
మొదటి గెలుపుగా నలుపురంగు జెండాను ఎగరేసాను….
ఖరీదైన రోగాలకెప్పుడూ మనిషి శరీరం ఒక ఆట వస్తువే…..
……
జీవితమంటే కొన్నికామాలు….
ఇంకొన్ని అశ్చర్యార్థకాలు….
చాలా వరకూ ప్రశ్నార్థకాలు….
నా ఒంట్లో ఒక్కో భాగం బ్రహ్మ జెముడు
ముల్లులా గుచ్చుకునేది…
నరకానికి ఎన్నో ముఖాలు
తలుపులు, కిటికీలు మూసేసినా
చీమ దూరేంత సందు చాలు…..
కొన్ని రోజులు శూన్యంలోకి మాటల్ని విసిరాను
నా బేల చూపులకు సమాధానమివ్వలేని
గోడలు కూడా మౌనం వహించాయి…
గులాబీ చుట్టూ అల్లుకున్న ముళ్ల వల
ఇప్పుడు నన్ను గుచ్చుతోంది….
రోజు రోజుకూ ఓర్చుకోలేనంత బాధకు
రసీదునౌతున్నా…
అంటూ ప్రతీ కవితా వేదనాత్మకంగా, తన దేహపు మంటలలో మనల్నీ కాల్చినా గమనిస్తే ప్రతీ కవితా ఓ దైర్యపు కాంతిని ఆమె లోకి చొప్పించినట్టు అనిపిస్తుంది.
తన ఒకానొక పుట్టినరోజు నాడు తాను రాసుకున్న ఆఖరి వాక్యాలు
కన్నీళ్లు గడ్డకట్టిన చోట
నేనో కొత్త పుట్టినరోజును
జరుపుకుంటున్నాను
చదివితే, ఆ కన్నీటి హిమాలయాల్లో మన గుండె మండుతుంది. గడ్డ కట్టిన మన మనస్సు చలిస్తుంది , ఆత్మీయతా వరదై ఆమెను చేరుకుంటుంది.
ఎన్ని ఎండాకాలాల్ని మింగిందో
ఆ లినియర్ ఆక్సిలేటర్ మిషను
నా మీద వేడి బుసలు కొట్టింది…. అంటూ ట్రీట్మెంట్ నరకాన్ని సూటిగా, స్పష్టంగా రిజిష్టర్ చేసినా
ఏ వైరస్ ఐతే ఏంటి
ఇంకో ఫ్లూ ఐతే ఏంటి
మరో కాన్సర్ ఐతే ఏంటి
ప్రాణం కోసం పోరాడితే పోయేదేముంది
మరో నలుగురికి ఆదర్శమౌతాం…
అంటూ ధీరత్వం ప్రదర్శించినా అది ఆమెకే చెల్లింది.
మరో పుట్టిల్లు, శ్వేత హంసలు, అతను నా రెండో అమ్మ, వర్ణించలేని ఆకాశం, అమ్మ నా ధైర్యాక్షరం, క్షణమైనా లేను, ధైర్యానికి అమ్మలు, విడువని చేతుల కోసం అంటూ మానవత్వ పరిమళాలు పంచిన, తనకు అన్నీ తామై, తనను తనలా మిగిల్చిన తన వాళ్ళ కోసం, అహరహాలు తన వ్యాధి తీవ్రత తగ్గించేందుకు, తనకు పునర్జన్మ ప్రసాదించేందుకు వృత్తి ధర్మంగా, కర్మ బద్ధంగా కష్ట పడి తెల్లటి దుస్తుల్ని మరింత తెల్లటి మనసుతో ప్రకాశవంతం చేసుకున్న డాక్టర్లు, నర్సుల కోసం ఆమె రాసిన పదాలు పూలై వారిని అభిషేకిస్తాయి.
స్థూలంగా సూక్ష్మంగా ఈ ఒంటిరొమ్ము తల్లి ఓ విజేత ప్రయాణం, ఓ పరాజిత దీన గాథ.
*

సుధా మురళి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు