మనిషిని వింటాను
ఒక్క క్షణం నిరాశ
మరుక్షణం ఆశ, పెద్ద ఆశ
మహోద్యమమంత ఆశ
పొద్దుటిపూట
గాజుల శబ్దాలు వింటాను
పూలశబ్దాలు వింటాను
చెరువులో తొణుకుతున్న
చిరునల్ల శబ్దాలు వింటాను
వింటాను
నేలను వింటాను
ఆకాశాన్ని వింటను
గుండ్రంగా మెలమెల్లగా
తిరుగుతున్న భూగోళం
నేత్రశబ్దాన్ని వింటాను
రాత్రులు వేసుకున
వల్లెవాటు చివరల కుచ్చుల
లేలేత శబ్దాలు విటాను
శబ్దాన్ని కేవలం వినను
చూస్తాను, కళ్లల్లో కళ్లు పెట్టి
దీర్ఘంగా లోతుగా చూస్తాను
ఎక్కడో లోలోపల తీగని మీటుతూ
తీగ ప్రకంపనల చేతివేళ్ల చివరలు వింటాను
చూడకుండా వినలేను
వినకుండా చూడలేను
ఒక నిరాశ
మరుక్షణం జీవితమంత ఆశ
విప్లవాన్ని భుజాన మోస్తున్న వీరుల కలల కదలికల
రేపుల్ని చూస్తాను
మీటుతా-పొద్దుటిపూటల్ని మీటుతా
శిశువు కనుల మీద వాలుతున్న పావురాల
కృతనిశ్చయాన్ని మీటుతా
పొద్దున్నే లేచి
పెద్ద పెద్ద ఆశల్ని మోస్తున్న
మనిషిని చూస్తాను
మనిషిని వింటాను
(13 నవంబర్ 2018)
* * *
నీటిపిట్ట
అతననుకున్నాడు
ఒక జీవనకాంక్షను నిలుపుకోవటం కష్టమైపోతుందని
పదును తగ్గకుండా
ఖడ్గాన్ని నిలుపుకోవటమూ కష్టమౌతుందని
ఒంటిరెక్క బంతిపూవునో
వేయిదళాల పద్మాన్నో కాపాడుకోవటమూ కష్టమని-
ఈ కాండ చుట్టూతిరిగి
ఎగురుతున్న నదిరెక్కలను దువ్వటమూ కష్టమేనని
ఆకాశంలో విరబూసిన చెట్లను
భూమిలో నాటాలిగదా,
భూమి పెదాల మీద విరబూస్తున్న దరహాసాన్ని
ఆకాశపు సరస్సు ఒడ్డున పొదగాలి కదా,
అన్ని అవయవాలున్నా
లేనట్టు బతుకుతున్న ఇంద్రధనుస్సు
మనిషిని ఒడిసి పట్టుకునేదెలా?
భూనభోంతరాళాలలో చిరంజీవిని చేసేదెలా?
ఎక్కడ్నుంచి తోడుకోవాలి
సమస్త శక్తిశాలి జీవనసలిలాన్ని
నిజమే!
ఈ చిన్ని దీపాన్ని-జీవితాన్ని శాశ్వతం చేయటం కష్టమే
కనీవినీ ఎరుగని ఓ దీర్ఘకాలిక యుద్ధానికి
సన్నద్ధం చేయడం సులభం కాదు
అలవోకగా నీటిమీద నడుస్తున్న పిట్టనుంచి ఏం నేర్చుకుందాం
విరిగిపడుతున్న కొండచెరియల మార్గాన నడుస్తున్న
ఆదిమ మానవుడి నుంచి నిలబడటానికి కావాల్సిన
ఒక మార్మిక మాయాజాల జీవన సూత్రాన్ని దేన్నో పట్టుకోవాలి
నీట మునిగి పైకి లేస్తున్న ఒక నీటిపిట్ట
మగ్నతా మగ్నత లక్షణాన్ని దేన్నో స్వంతం చేసుకోవాలి
(23 ఫిబ్రవరి 2019)
Superb Sir
Very Good Rendaring
అద్భుతం..కవిత్వం..
మధురమైన కంఠధ్వని..
ఒక మహా మనిషి పద వాక్కులు విన్నాను. ధన్యవాదాలు.