తెలుగు సాహిత్య ప్రపంచంలో ‘శారద ‘ అనే పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ‘శారద ‘ అన్న కలం పేరుతో ఎన్నో గుర్తుండి పోయే రచనలు చేసిన ఈ రచయిత అసలుపేరు ‘ఎస్. నటరాజన్’ . పుట్టింది ఎక్కడో తమిళనాడులోని పుదుక్కోటలో. కానీ పెరిగిందీ, రచయితగా మారిందీ మాత్రం ‘తెనాలి ‘లోనే.
అవును. 1947 నుంచీ 1955 వరకూ పది నవలలూ, వందకుపైగా కథలూ, ఎన్నో గల్పికలూ, నాటకాలూ రాసిన ఎస్. నటరాజన్ మన తెలుగు వాడే.
1924లో సుబ్రమణ్యయ్యరు, బాగీరధి దంపతులకు జన్మించిన శారద తన పన్నెండో ఏట 1936లో తండ్రితో కలిసి తెనాలి రైల్వే స్టేషన్లో దిగాడు. బతుకు తెరువుకోసం, తండ్రిని పోషించటం కోసం తన బాల్యం నుంచే అనేక పనులు చేశాడు. జోలె పట్టాడు. దేవాలయాల దగ్గర మధూకరం తెచ్చుకున్నాడు. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. హోటళ్ళలో పనిచేస్తూనే తెలుగునేర్చుకొని తన సాహిత్య వ్యాసంగం కొనసాగించాడు. భరించలేని శారీరక శ్రమ, ఆకలి, దారిద్ర్యానికి తోడు మూర్చజబ్బు వల్ల ముప్పై ఏళ్ళ వయసులోనే 1955 ఆగష్ట్ 17 న అతడు మరణించాడు.
శారద రచనా కృషి అంతా ప్రధానంగా 1948 నుంచీ 1955 వరకూ జరిగింది. ఆ ఏడేళ్ళలోనే అతడు అసంఖ్యాకంగా రచనలు చేసి తెలుగు సాహిత్యలోకంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఏది సత్యం, మంచీ-చెడు, అపస్వరాలు, చీకటితెరలు, మహీపతి, అందాలదీవి, చదరంగం, సందేశం, నాగరీకుని ప్రేమ, కార్యదర్శి, హోటల్లో శవం వంటి పదికి పైగా నవలలూ, రక్తస్పర్శ వంటి ప్రసిద్ధమయిన ఎన్నో కథలూ, క్షణంలో సగం పేరుతో వ్యంగ్య రచనలూ, నాటికలూ, గల్పికలూ అతడి సాహిత్య కృషికి నిదర్శనంగా కనిపిస్తాయి. ప్రజావాణి, చంద్రిక అనే పత్రికలను అతడే ప్రచురించి సంపాదకత్వం కూడా వహించాడు.
శారద వచ్చేనాటికి తెనాలి పట్టణం ‘అంధ్రాపారిస్ ‘ గా అనేక సామాజిక, సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాలకు కేంద్రంగా నిలిచి ఉంది. చలం, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, తాపీ ధర్మారావు , త్రిపురనేని రామస్వామిల హేతువాద ఉద్యమం, నాస్తికోద్యమం, శ్రీ శ్రీ కవితా ప్రభంజనం, అభ్యుదయ సాహిత్యోద్యమం అనాటి యువతరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇంకా నాటకరంగానికీ, హరికథలకూ, మహిళా నాదస్వర విద్వాంసులకూ తెనాలి పెట్టింది పేరు.
తెలుగు సరిగ్గా రాకముందే తమిళ సాహిత్యాన్నీ, తమిళంలో వచ్చిన ప్రపంచ కథల అనువాదాలనూ చదివాడు శారద. కొద్దికాలంలోనే తెలుగు నేర్చుకొని తెలుగులో ఉన్న పురాణాలనూ, ప్రభంధాలనూ చదవగలిగే స్థాయికి వచ్చాడు. తెనాలి మున్సిపల్ లైబ్రరీ, ఆంధ్రరత్న గ్రంధాలయం అతడికి శాశ్వత ఆవాస స్థలాలయ్యాయి.
అప్పటికి చలం స్త్రీ స్వేచ్చ మీద, కుటుంబరావు మధ్య తరగతి జీవితాలమీద రాసే రచయితలుగా సుప్రసిద్దులు. వారి ప్రభావంతో రచన ప్రారంభించినప్పటికీ త్వరలోనే తనదైన స్వంత శైలితో వస్తువుతో అందాకా తెలుగు సాహిత్యంలోకి రాని క్రింది తరగతి జీవితాలనూ, వారి జీవిత పోరాటాలనూ తానే స్వయంగా అనుభవించి వాటిని సాహిత్యంగా మలిచాడు శారద.
ఆనాటికి తెలుగులో రచయితలు ఎక్కువగా మధ్య తరగతి నుంచీ వచ్చిన వారు. సమాజంలో అందరికన్నా కింద స్థాయిలో ఉండే సమూహాల గురించి వారికే తెలిసే అవకాశం లేదు.
హోటల్ వర్కర్లు, వంటవాళ్ళు, గుమస్తాలు, కంసాలి పని చేసే వాళ్ళు, కలప అడితీల్లో దుకాణాల్లో పనివాళ్ళు, అచ్చుపని కార్మికులు, దొంగలు, వేశ్యలు, నేరస్థులు, దొంగనోట్లు అచ్చువేసే వాళ్ళు, బ్రాకెట్టు ఆడే వాళ్ళు, రోడ్డుపక్క మందులు అమ్మేవాళ్ళు, మోసగాళ్ళు, తాగుబోతులు, రిక్షా వాళ్ళు, నిరంతరం ఆకలితో కృశించే వాళ్ళు, మగవాళ్ళ దాష్టీకానికి లోబడే మధ్యతరగతి, దిగువతరగతి స్త్రీలు, సినిమాల్లో చాన్సుకోసం టికెట్టు లేకుండా మద్రాసు పారిపోయే వాళ్ళు ఇలా అప్పటికి కనీవినీ ఎరగని అనేక పాత్రలను తన రచనల్లో ప్రవేశపెట్టాడు శారద. వాస్తవిక పద్దతితో పాటు ఫాంటసీ, అలిగరీ, రాజకీయ, వ్యంగ్య, స్త్రీ స్చేచ్చ, ఉద్యమ, నేర పరిశొధన వంటి అనేక ధోరణుల్లో రచనలు కూడా చేశాడు.
స్వాతంత్రం వచ్చిన కొత్తలో వచ్చిన స్వాతంత్రం ఎలా మారబోతుందో 1948 లోనే ఊహించి రాసిన కథ ‘స్వాతంత్ర స్వరూపం ‘, ఆంధ్ర దేశం ఏర్పడి దుగ్గిరాల ఏర్పోర్ట్ లో విమానం దిగితే ఎలా వుంటుందో ఊహించిన కథ ‘కోరికలే గుర్రాలయితే’ , అంగారక గ్రహం నుంచీ వచ్చిన గ్రహాంత వాసుల గురించి ‘ఎగిరే పళ్ళెం ‘, యుగాంతం దురించి ‘వింత లోకం ‘ ఇలా అనేక రకాల వస్తువులతో, ప్రక్రియలతో కథలు రాశాడు. కథను చెప్పటం కాదు, చూపించాలి అని నమ్మేవాడు. కళ్ళకు కట్టేట్టుగా రాస్తూనే, క్లుప్తంగా రాయలేనిది కథ కాదు అని కథలను రాసి చూపించాడు.
ఆయితే దాదాపు 60 యేళ్ళ తరువాత ఇప్పుడు శారద గురించి ఎందుకు గుర్తు చేసుకోవాలంటే తెలుగు సాహిత్యానికి శారద ఇచ్చిన చేర్పు ముఖ్యమయినదన్నది ఒక్కటే కారణం కాదు. కష్టాల కొలిమిలోంచీ, దారిద్ర్యపు శృంఖలాల నుంచీ ఒక మామూలు మనిషి సృజనాత్మక శక్తిగా ఎలా ఎదగగలడో నిరూపించాడని కూడా.
*
Very inspiring….very many thanks ….