కొంతమంది సౌందర్యం శరీరం మీదే కాదు, వాళ్ళ గొంతుల్లో కూడా ప్రతిధ్వనిస్తుంది. వాళ్ళ స్వర పేటికలు తేనెలద్దిన పల్చటి పూల రెక్కలు.
అదిగో అలాంటి అందాల మహారాణి శారదా శ్రీనివాసన్.
నాటకాలను చూడడంలోనే కాదు, వినడంలో కూడా ఎంత అనుభూతి ఉంటుందో ఆ తరం వాళ్ళని అడిగితే చెప్తారు. ఆ రోజుల్లో రాత్రి 9.30 కి ఆకాశవాణి నుంచి లైవ్ నాటక ప్రసారాలు. ప్రి రికార్డింగ్ లేదు, ఎడిటింగులు లేవు, చిన్న అపశృతి పలికినా నాటకం సర్వ నాశనమై పోతుంది.
అలాంటి రోజుల్లో ఒక్క నండూరి విఠల్ గారితోనే వెయ్యికి పైగా నాటకాలు పలికారంటే ఆవిడ స్థాయిని మనం వూహించవచ్చు. ఎన్నెన్ని జ్ఞాపకాలు. చలం గారి “పురూరవ” విని పరవశించి పోయారని చెప్పాలా!? పింగళి లక్ష్మీకాంతంగారు, స్థానం నరసింహారావు గారు, బందా కనకలింగేశ్వరరావుగారు, బాలాంద్రపు రజనీకాంతరావుగారు, కృష్ణశాస్త్రిగారు, ముని మాణిక్యంగారు, బాలమురళీ, ఓలేటి, బుచ్చిబాబు, దాశరధి సోదరులు, గోపిచంద్, మరెంతమందో మహామహులు పట్టుబట్టి ఆవిడ చేతే తమ రచనలని పలికించేవారని చెబితే వోర్నాయనో అని అనిపించదూ!!
శ్రీకాంతశర్మగారు ఆవిడని దృష్టిలో పెట్టుకొని రాసిన “ఆమ్రపాలి” నాటకాన్ని, ఆవిడ 83వ యేట పలికారంటే, వూహించండి ఆవిడ స్వర మధుర విన్యాసాన్ని. ఆవిడకి అత్యంత ఇష్టమైన పాత్ర తిలక్ “సుప్త శిల”లోని అహల్య. ఆవిడకి అజరామరమైన ఖ్యాతిని తెచ్చిన పాత్ర చలం “పురూరవ”లోని ఊర్వశి. 1959 నుంచి 1995 వరకు ఆకాశవాణిలో ఆవిడ ప్రమేయం లేని కార్యక్రమం లేదంటే అతిశయోక్తి కాదు. ఆకాశవాణి కళాకారుడు, మిత్రుడు, ప్రియుడు, భర్త శ్రీనివాసన్ గారు, వేణుగాన విద్వాంసుడు టి.ఆర్. మహాలింగంగారి అత్యంత ప్రియ శిష్యుడు.
నవ్వుతుంటే జలపాతం జర జరా జారినట్టుందని కవులనగా చదివారు కదా! ఇప్పుడు ప్రత్యక్షంగా విని పరవశించడానికి రండి.
ఆసక్తికరం అలనాటి ముచ్చట్లు. గుమ్మడిలాంటి వాళ్లు శారదా శ్రీనివాసన్ గారితో నటించాలని తహతహలాడారంటే ఆమె స్వర స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఆ గొంతులో పలికే అనందందము వేదన– మాటలలో ఇముడ్చగలనా? సుప్త శిల లో అహల్య లాంటి వాల్లు ఎందరోకదా ఈ భూమ్మీద–
శారద గారి వీడియో ఇంటర్వ్యూ రెండవ భాగం కూడా చాలా ఆసక్తిగా సాగింది. చివరలో వినిపించిన ” సుప్తశిల ” నాటికలో అహల్య డైలాగ్స్ ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు. అంత గొప్పగా పలికారు ఆమె. చిల్లర దేవుళ్ళు నాటకంలో తన పాత్ర మంజరి అని చెప్పారు. కానీ .. వేసింది వనజ పాత్ర అనుకుంటా . ఏదేమైనా మూడవ భాగం కోసం ఎదురు చూసున్నాను. ఇంత మంచి వీడియో ఇంటర్వ్యూ అందించిన ‘ఛాయ’ మోహన్ బాబు గారికి మరోసారి అభినందనలు.
తెలుగు మాట్లాడేటప్పుడు ఉచ్చారణపట్ల శ్రద్ధ అలాగే, వ్రాసేటప్పుడు వ్యాకరణంపట్ల, అక్షర గుణింతంపట్ల జాగరూకత ఇటీవలి కాలంలో తెలుగువారిలో లోపిస్తున్నది. అవి ఇంగ్లీషు భాషకి తప్పనిసరిగానీ తెలుగులో మాత్రం ఏం మాట్లాడినా, ఏం వ్రాసినా చెల్లిపోతుందనే ధీమా పెరిగిపోయింది. నేడు టీవీలో, రేడియోలో, సినిమాల్లో తరచుగా వినిపించే వికారపు మాటలు తెలుగుని ప్రేమించే వారికెవరికైనా రోత పుట్టిస్తాయి. ఈ దుస్థితి ఎందుకు, ఎప్పుడు, ఎలా దాపురించిది అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం.
ఈ ఇంటర్వ్యూ తొలితరం రేడియో కార్యక్రమాల్లో, కళాకారులలో, దర్శకుల్లో ఉండిన నిబద్ధతను కళ్లెదుట నిలిపింది; ఆనాటి రేడియో – సినిమాల బారిన పడకుండా – ఏ విధంగా భాషనీ, సంగీతాన్నీ కాపాడిందీ సాహిత్యంతోనూ, నాటకరంగంతోనూ సజీవ సంబంధాలను ఎట్లా కొనసాగించిందీ తెలియపరచింది. మా తరంవారికి సుపరిచితమైన శారదా శ్రీనివాసన్ గారి బంగారు పలుకులు వింటూంటే ప్రముఖ నేపథ్య గాయని జానకిగారు ఒక ఇంటర్వ్యూలో అన్న మాట గుర్తుకొచ్చింది. ‘మేము తెరవెనుక గొంతుతో నటిస్తాం; గొంతులోనే నవ రసాలనూ పలికిస్తాం’. వీరూ – ఇంకా ఇతరులూ – పలికించిన నాటకాలూ, పాటలూ ఆలిండియా రేడియో వారి వద్ద భద్రంగా ఉన్నాయని ఊహించవచ్చా?
ఆనాటి అనుభవాల్ని ఒకచోట నమోదు చెయ్యడం ద్వారా మిత్రుడు కృష్ణ మోహన్ చేస్తూన్న ప్రయత్నం అద్వితీయం, అభినందనీయం. ఇది ఎవరికైనా, ఎప్పటికైనా ఉపయోగంగా, మార్గదర్శకంగా ఉండవచ్చు అనే ఆశాభావం కలిగిస్తున్నది.
చివరిగా – వింటూంటే కలిగిన ఒక ఊహ: తెలుగు శతకాలూ, గేయాలూ, కవితలూ, కథలూ, నవలలూ ఆడియో రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశలో మొదలైన ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. ఇది తెలుగు చదవలేని కొత్త తరానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. మన శ్రవ్యకావ్య ప్రపంచాన్ని మళ్లీ ఆవిష్కరించు కుందాం.
Heavenly voice! I regret now, out of ignorance, I have never heard radio but for songs, those days! The small bits heard now pleased me to no end! Thank you.