మీరు రాసిన మొదటి కవితా, దాని నేపథ్యం?
పిల్లలూదే సబ్బు నురగల నీటి బుడగల తేలే రంగురంగుల ప్రపంచమే ప్రపంచమని భ్రమసే యవ్వనారంభ కాలాన కనిపించే ప్రతి పువ్వుతోని, ఎదురయ్యే ప్రతి నవ్వుతోని ప్రేమలో పడే తన్మయస్థితిలో కొన్ని అల్లిబిల్లి ప్రేమకవితలు రాసుకున్న మాట నిజమే గానీ..నాకు కవిత్వ పరిచయం మాత్రం నా మిత్రుడు పరిచయం చేసిన హైకులే.
అప్పటి నా మానసిక స్థితి కి దగ్గరగా వుండి నా హృదయంలోకి అప్రయత్నంగా ప్రవేశించాయవి. కొన్ని మంచి హైకుల పఠనం నా ఆంతరంగిక ప్రపంచాన్ని మార్చివేసాయి. ప్రతి దృశ్యాన్ని ఆ నిమిషాన్ని అదే క్షణికమన్నట్టు స్వీకరించాను.అదే లోకంగా జీవించాను. ఒక రోజు ఇంటికి ఒంటరిగా వచ్చినప్పుడు నా చొక్కాపై ఒక చిన్ని పురుగు వుంది.హృదయంలో మెరుపులా అప్రయత్నంగా ఈ వాక్యాలు పలికాయి.
ఒంటరిననుకున్నా..
నా చొక్కాపై ఓ చిన్ని పురుగు
ఇంటి దాకా వచ్చింది.
ఇదే నా మొదటి కవిత్వ వ్యక్తీకరణ కావచ్చు.
కవిత్వం ఎందుకు రాయాలి?
కవిత్వం ఆత్మఘోష. మానసిక ప్రపంచాన తల బాదుకునే విరిగిపడే ఆలోచనా అలలసముద్రం. ఢీకొని ఢీకొని అలసి ఓర్వలేక, లోపల ఓర్చలేక, మనకి మనం మనఃప్రపంచాన ఓదార్పు కోసం కాసిని అక్షరాల్ని ఆశ్రయించి.. శమించి.. విశ్రమించేందుకు..
ఆంతరిక లోకానికి..భౌతిక ప్రపంచానికి వేసే ఒక లంకె..కుదుర్చుకునే ఒక ఆత్మిక ఆలాపనని కొన్ని మనకి సరితూగే అశాంత సంచారకులతో చేసే సంభాషణ..దించుకునే మదిబరువు.. పంచుకునే లోన గొడవ..
మీరు రాసిన వాటిల్లో మీకు బాగా నచ్చిన కవిత? ఎందుకు?
కరోనా కాలాన వలస కార్మికులు కాలినడకన స్వస్థలాలకు బయలుదేరి..దారిలోనే ప్రాణాలు రాలిపోతుంటే..కలిగిన మానసిక క్లేశం నుంచి బయటపడ్డ నా ఆవేదన ‘పాదాలు..పాదాలు మాత్రమే..’ కవిత.
ఇది రాసి నేను విముక్తుడనయ్యాననుకున్నాను గానీ..ఆ మహా విషాదంలో మరింత కూరుకుపోయా..
*
అన్న..శుభోదయం.. మీ కవిత… మీ హృదయావిష్కరణ చక్కగా ఉన్నాయి..శుభాకాంక్షలు అన్న..
కవిత్వం ఎందుకు అన్న ప్రశ్నకు మీ సమాధానం హృద్యంగా ఉంది. మీ ఇతర సమకాలీన కవితల్లాగే శాంతి యుద్ధం రైతు ఉద్యమ స్వరూప స్వభావాలను వాస్తవంగా చిత్రించింది. అభినందనలు శ్రీనివాస్ అన్న.
మంచి కవిత…!!!
మొదటి కవితా నేపధ్యం బాగా చెప్పారు.
అభినందనలు.