శబరిమల-మరక మంచిదే

నగనగా..అంటే పాతికేళ్ల క్రితం అన్నమాట. ప్రకాశం జిల్లాలో నిడమానూరు అనే ఊరు. ఊరిలో పల్లె. దళిత కుర్రాళ్లు ఊర్లోని ఆలయంలో ప్రవేశించాలని సంకల్పించారు. వాళ్లున్న, వాళ్లలాంటి వాళ్లున్న సంఘాల్లో కలకలం. బోల్డంత చర్చ. ఆ ‘గాంధియన్ బూడిద’ మనం పులుముకోవడం ఏంటి అని. మనమేంటి, మన నాస్తిక వంశమేంటి,  పోయి పోయి ఆలయప్రవేశం చేయుట ఏంటి అని.

పాతికేళ్ల తర్వాత మళ్లీ అదే చర్చ. మరో సందర్భంలో అంతకంటే బలంగా, అంతకంటే విస్రృతంగా, అంతకంటే సంక్లిష్టంగా. రీముల కొద్దీ పేపర్లు నలుపు చేశారు. భక్తి, పవిత్రత, అపచారం అనే కోణాలు పక్కనబెడితే లిబరల్ శ్రేణుల్లో చర్చ ఆసక్తికరంగా సాగుతూనే ఉంది. ఈ గడ్డి మాకే పరిమితం అంటే మేము కూడా తినాల్సిందే అని పట్టుబడతామా అని మిత్రులు కొందరు రాస్తున్నారు. గడ్డి బదులు మరింత ఘాటైన పదాలు కూడా కనిపిస్తున్నాయి. అశ్శరభ శరభ అని మేమూ వాతలు పడేట్టు ఒళ్లంతా కొరడాతో కొట్టుకుంటాము  అని పోటీపడితే మనం ఆ హక్కుకు మద్దతివ్వాలా, దబ్బలాలతో సూదులతో గుచ్చుకుంటాం అంటే మనం మూతి ముందుకు పెట్టాలా అనే స్థాయిలోనూ వాదనలు ఉండొచ్చును గానీ అది మరీ వెటకారం డాట్ కామ్ వ్యవహారం.

రాజకీయంగా ఇది ఎవరికి లాభం చేస్తుంది అనే ప్రాపంచిక చర్చది ఇంకొక పాయ. బెంగాల్ పోయి త్రిపురా పోయి చివరాకరికి చిట్టచివరన ఏదో ఒక పేరుతో ఏదో ఒక రంగుతో మిగిలిన రాష్ర్టంలో కూడా కోరికోరి తలకొరివి పెట్టుకున్నారేమిస్వామీ అని వగచేవాళ్లున్నారు.

ఏదీ కొట్టివేయలేం. ఇది గ్రే ఏరియా. ఇది బ్లాక్ అండ్ వైట్ల కాలం కాదు. మారిన సమాజపు మారిన సన్నివేశపు రంగు వెలుగు నీడల గ్రే. సంక్లిష్టత దాని సహజలక్షణం. గతంలో వలె తటాల్మని అస్సోయ్ దూలా అని దూకగల కాలం కాదు.

మత విశ్వాసాలతో మనకేమి సంబంధం అనేవాళ్లలోనూ రెండు స్థాయుల్లో వాదనలున్నాయి. వ్యతిరేకిస్తే మొత్తానికే వ్యతిరేకించాల గానీ అందులో మళ్లీ పలానాది తప్పు అని సరిదిద్దే తలనొప్పి మనకేల అనేది మొదటిది. తెలిసి తెలిసి ఫలానా దానిమీద రాయివిసరడమేల అని అన్నమాట. వీళ్లతో గట్టిగానే మాట్లాడొచ్చు. నువ్వు అవునన్నా కాదన్నా మతం అనేది ఒకటి ఉండిచస్తుంది. అందులో వివక్షా పూరితమైన ఆనవాయితీలకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతులు, పోట్లాడే చేతులు అవసరం. అటువంటి ప్రయత్నం చాలాసార్లు ప్రధానంగా లోపలినుంచే రావచ్చు. అది సంస్కరణల రూపంలో రావచ్చు. దానికి బయటినుంచి కూడా వత్తిడి పనిచేస్తుంది. ఆ ఒత్తిడి బలమైన రూపం తీసుకున్నపుడు రాజ్యం చట్టం రూపం తీసుకుంటుంది. అ ఒత్తిడి సివిల్ సొసైటీ పని. మనం కూడా ఆ సివిల్ సొసైటీలో భాగం. బాల్య వివాహాల నిరోధం కానీ వితంతు పునర్వివాహం కానీ అనేక దేశాల్లో ఇస్లాం చట్టాల్లో వచ్చిన సవరణలు కానీ ఏవీ ప్రయత్నం లేకుండా రాలేదు. ఆ ప్రయత్నంలో అనేక శ్రేణుల భాగస్వామ్యం ఉన్నది. అంతెందుకు, పురుషుడి పక్కటెముక నుంచి తీసి స్ర్తీని సృష్టించెనని నమ్మే  మతాలు పెత్తనం చేసే దేశాల్లో ఇవాళ స్ర్తీలు అక్కడే లేరు. చాలాచాలా ముందుకొచ్చారు. కుటుంబమూ, రాజ్యమూ, మతమూ…అన్ని అంగాల్లోనూ మార్పులు అవసరం. ఆ మార్పుకు ప్రయత్నం అవసరం. ఉన్న స్థితిని మార్చే ఏ ప్రయత్నమైనా ఏదో ఒక మేర మేలు చేస్తుంది.  ఆ మేలు అక్కడే ఆగదు. స్వేచ్ఛ రుచి మరిగిన ఏ జీవీ సంకెళ్లను పూర్తిగా చేదించుకునే దాకా శాంతించదు. అదొక నిరంతర ప్రయాణం. వాడు అసుంట అంటాడు కాబట్టి మనమూ మతాన్ని అసుంట అనక్కర్లేదు. కాకపోతే దాటేసిన కాలం కనిపించినంత బ్లాక్ అండ్ వైట్గా వర్తమానం కనిపించదు. సంక్లిష్టతలను ఎదుర్కోక తప్పదు.

అణచివేత ఉన్నచోట అది మన హక్కులకు స్వేచ్ఛకు పురోగతికి భంగం కలిగించే చోట రోజువారీ జీవితాలకు అవమానంగా మారిన చోట గొంతు కలపొచ్చుగానీ ఇక్కడ నీ కొచ్చిన ఇబ్బంది ఏమిటి, నష్టం ఏమిటి, అనేది రెండో ఆర్గుమెంటు. అక్కడెక్కడో కొండల్లో అడవుల్లో పడి ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్లాలి అని పోటీపడడమేమిటి ఆడ స్వాములూ అని. ఇది చర్చించాల్సిన ప్రశ్న.

ఆధునిక సమాజంలో సింబాలిజం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకసారి ఏదైనా అంశం సింబాలిక్ రూపం తీసుకున్నాక దాని రూపు రేఖలు మారిపోయి వేరే స్థాయికి వేరే కోణానికి చేరుకుంటుంది. అపుడిక దాన్ని కేవలం ఆ అంశానికే పరిమితం చేసి చూడలేం. అదొక స్వేచ్ఛాసంకేతంగా మారుతుంది. భూమాతా బ్రిగేడ్ అటువంటి ప్రయత్నం కొంతకాలంగా చేస్తూ వస్తున్నది. వారు భక్తులో కాదో తెలీదు కానీ షిర్డీసాయి ఆలయం దగ్గర్లోని శని సింగాపూర్ ఆలయంలోనూ మరికొన్ని చోట్లా వారు అలాంటి ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఎక్కడెక్కడయితే స్ర్తీల ప్రవేశానికి ఆంక్షలు ఉన్నాయో అక్కడల్లా ధిక్కరిద్దామనే ధోరణిలో పోటీపడుతూ వస్తున్నారు. కొన్ని విజయాలు నమోదు చేస్తూ వచ్చారు. వారెంచుకున్న మార్గంలో అదొక ప్రయాణం. అయ్యప్ప దీక్షల్లాగే ఆయన కొండమార్గంలాగే శబరిమల మరింత కఠినమైన మరింత ఘాటైన సింబాలిజంగా మారింది. స్ర్తీల రుతుస్ర్తావం పొలిటికల్ అంశంగా సినిమాలుగా హాపీటు బ్లీడ్ చర్చలుగా అనేక రూపాంతరాలు చెంది మన చుట్టూ సంచరిస్తున్న కాలంలో దానితో ముడిపడిన ఆంక్షలకు వ్యతిరేకమైన సామూహిక ఆకాంక్ష బలపడింది. చాలా సార్లు క్రెడిట్(డెబిట్ కూడా) అంతా వ్యక్తులకే ఆపాదించి స్థలకాల మహిమలను మర్చిపోతుంటాం. ఇది వ్యక్తుల కృషిని వారి సాహసాన్ని తక్కువ చేయడం కోసం కాదు. స్థలకాల మహిమలను గుర్తించడం కోసం.

భక్తులెవరైనా మేము బాధపడుతున్నాం అని ముందుకొచ్చారా! ఈ గొడవపడుతున్న వాళ్లు నాస్తికులే కదా! మనకెందుకు అనే ఉపప్రశ్న ఉన్నది. భక్తాగ్రేసరులేకాదు, అభక్తాగ్రేసరుల్లోనూ ఇది ఉన్నది. ఇది భక్తుల సమస్య కాదు అనేంత వరకు నిజమే. భక్తి అనేది ఓవరాల్ ప్యాకేజి. మేము మొత్తంగా భక్తులమండీ ఈ విషయంలో మాత్రం హేతువు ప్రకారం ఆలోచిస్తామండీ అనేది ఉండదు. తక్షణ ప్రయోజనాల తోనూ తక్షణ ముప్పుతోనూ  ముడిపడిన విషయమైతే తప్ప. అంటే నీ మొగుడి శవంతో పాటు నిన్నూ తగలబెడతామంటే వాడితే పాటు నేనెందుకు పోవాల అనొచ్చు, అనగలిగిన రోజున. నీ మొగుడు చస్తే మళ్లీ పెళ్లి చేసుకోకూడదు, గుండు చేసుకుని మూలన కూర్చోవాలి అంటే నేనెందుకు కూర్చోవాల, నే పోతే వాడు కూర్చొని చస్తాడా, నాలుగో రోజే టింగు రంగా అంటూ ఎగురుకుంటా పోడా అనొచ్చు అనగలిగిన రోజున. అవి ప్రాణంతోనూ శరీరంతోనూ దగ్గరి ప్రయోజనాలతోనూ ముడిపడిన అంశాలు. కనీస హక్కులతో కనీస స్వేచ్ఛతో ముఖ్యంగా వాటి విలువ తెలిపిన ఆధునికతతో ముడిపడిన అంశాలు.

అట్లాగే ఆ మూడూ రోజులూ బయటే కూర్చోవాలి ఎవ్వరూ ముట్టుకోకూడదు, ఎవ్వర్నీ ముట్టుకోకూడదు ఏ  పనీ చేయకూడదూ అని ఆంక్షలు పెడితే ఎందుకూర్చోవాల్రా గాడిద కొడకా అని ఆమె ఒక్కత్తే అనడం కాదు. ఆమె కంటే గట్టిగా ఆధునిక మార్కెట్ కూడా అంటుంది. భూమిలో సగం ఆకాశంలో సగం బయటకు రాకుండా ఉత్పత్తిలో పాల్గొనకుండా మార్కెట్కు దూరంగా ఉంచే ఏ సంప్రదాయాన్నైనా అది వ్యతిరేకిస్తుంది. ఆధునిక వ్యవస్థకు అడ్డంకి అది. కాబట్టి ఇక్కడ ఈ అంశంలో స్ర్తీల హక్కుకు స్వేచ్ఛకు మార్కెట్ మహా గట్టి అండ. అది బండగా కనిపించే అండ కాదు. కానీ జాగ్రత్తగా చూస్తే పీరియెడ్స్ తో ముడిపడిన ఆంక్షలకు వ్యతిరేకమైన పోరులో ఆధునిక విలువలు మాత్రమే కాకుండా ఆధునిక మార్కెట్ ఎంత ప్రోయాక్టివ్గా ఉందో అర్థం అవుతుంది.  

మహిళలను ఇళ్లల్లోంచి బయటకు తీసుకురావడంతో పాటుగా ఇంట్లోంచి బయటకొస్తే ఏఏ పాతివ్రత్యాలు పరువులు శీలాలు పోతాయని భయపెడుతుంటారో వాటన్నింటిని అభాస చేయడం కూడా మార్కెట్ కి అవసరమే. ఇలాంటి సందర్భాల్లో వైద్యుడు ఇచ్చేది రోగి కోరుకునేది ఒకటే మందు అయి ఉండొచ్చును. మార్కెట్ మరక మంచిదనే చెప్తుంది! ఈ మార్కెట్ గొడవేంటి, ఆ మూడు రోజుల ఆచారం అనాగరకం అంటావాలేదా అని నిగ్గదీసి ప్రశ్నించువారలుందురని ఎరుక ఉన్నది. నిక్కముగా అనాగరకమే. దానికి మరొక మాటయుండునా! దానికి మళ్లీ ఒక ప్రశ్నా, చర్చా అవసరమా! కాకపోతే అలాంటి సంకెలను చేధించాలని నడుము కట్టే సమయములోనే మార్కెట్ అతి పెద్ద సమ్మెట తీసుకుని మద్దతుగా నుంచున్నది. మన కంటికి కనిపించకుండానే మనకంటే ప్రధానపాత్ర పోషిస్తున్నది అని చెప్పడమే ఇక్కడ కవిహృదయం. పని ముట్టు పరస్పర వ్యతిరేకార్థంలో స్థిరపరిచింది పాత వ్యవస్థ. కాదని తేల్చే కొత్త పనిముట్టు పాత్ర పోషిస్తున్నది మార్కెట్.

ఈ నెలవారీ రక్తస్రావం ఆంక్షలపై వ్యతిరేకతను మార్కెట్ శక్తులు కూడా భుజాన వేసుకోవడం వల్ల అది సినిమాలుగా మాత్రమే కాదు, హోర్డింగులుగా మాత్రమే కాదు, ఎటు తిరిగితే అటు శానిటరీ ప్యాడ్స్ కనిపించే అంతగా ప్రచారం కమ్మేస్తుంది. పదిహేనేళ్ల క్రితం కండోమ్స్ ప్రచారం ఎంత ఉధృతంగా సాగిందో ఇపుడు శానిటరీ ప్యాడ్స్ రివల్యూషన్ అంత ఉధృతంగా సాగుతున్నది. హైవేలు, వాటితో పాటు ప్రయాణాలు, పర్యటకాలు వాటన్నింటితో పాటు వ్యభిచారం భారీగా పెరుగుతున్న వేళ మార్కెట్ కండోమ్స్ అమ్మకంలో కొనడంలో ఉన్న ఇబ్బందిని తీసేసే పులిరాజు వేషం వేసింది. ఇవాళ మరక పట్ల మనకున్న అనీజీనెస్ ని తీసేసే పనిలో ఉంది. దాని చుట్టూ ఆధిపత్య కులపురుషులు అల్లిన చట్రాన్ని బద్దలు చేసే పనిలో తానూ పాలుపంచుకుంటున్నది.

ఇంత జేసిన వాళ్లు సరైన వాష్ రూమ్స్ లేక పేదబిడ్డలు స్కూల్స్ మానేసే పరిస్తితులు ఉన్నాయి కదా దానిమీద గట్టిగా నాలుగు రోజులు ఫోకస్ చేస్తారా! దానికేదైనా పరిష్కారం దొరికే నిలకడ చూపిస్తారా అంటే, అబ్బే! క్లాస్ క్లాసే! అలగా జనం మీద అంత సేపు చూపు సారించే తీరిక ఉండదు. ఇక్కడ క్లాస్ ఉన్నది. నాప్ కిన్స్ రకరకాల భంగిమల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించేస్తున్నారు కదా, పదే పదే మార్చుకునే నాప్ కిన్స్ కంటే శుభ్రం చేసి వాడుకునే కప్( సేఫ్, అండ్ ఈజీ అని మహిళా నిపుణులు అనేకులు చెపుతున్నారు) మనకంటే స్ర్తీలు ముందున్న పశ్చిమదేశాల్లో విజయవంతమైంది కదా, అదేమన్నా గట్టిగా ముందుకు తెస్తారా అంటే అదీ లేదు. మార్కెట్ మాయావి. అట్లాంటివి మన కళ్లపడనీదు. శానిటరీ నాప్ కిన్ ను మన కళ్లకు అడ్డంగా కట్టేస్తది.

సరే , ఈ క్లాస్ ఎక్కడైనా ఉండేదే గానీ, మళ్లీ స్వామి వారి దగ్గరకొద్దాం. పైన కనిపించే వ్యక్తుల చుట్టూ నడిపించే అదృశ్య శక్తులు అనేకం ఉంటాయని ఇపుడే చెప్పుకున్నాం. ఇక్కడా అలాంటివి చాలానే ముడిపడి ఉన్నాయి. కాకపోతే ఆ మూడు రోజులు అపరిశుభ్రమవుతారని దూరంగా ఉంచినా, లేదా స్వామివారో లేదా వారిశిష్యులో దారితప్పే అవకాశముందని స్ర్తీలను దూరంగా ఉంచినా అది అనాగకరమైన ఆలోచనే. అయితే ఎవరికి అనాగకరం? ప్రధానంగా భక్తులకు కాదు. కాదు కాబట్టే అంతమంది భక్తులు అక్కడ రోడ్డు మీద కత్తులు కటార్లు నూరుతున్నారు యాక్టివిస్టుల మీద. భక్తుల్లో కాస్త ప్రాపంచిక గ్నానం అదీ ఉండి కూసింత ఆధునిక పొడ తగిలన భక్తాండాళ్లు కూడా ఆ ఆనవాయితీ ఏదో అపుడెపుడో పెట్టుకున్నారు, మనకెందుకు దానిజోలికి అని మాత్రమే అనేసుకుంటారు తప్పితే ఏది ఏమైనా తెగించి దూకాల్సిందే అనుకోరు. తెగించి దూకే పరిస్తితే వస్తే అధికస్య అధికం నాస్తికులకు వ్యతిరేకంగానే దూకుతారు. కాబట్టి కోర్టులో ఏమోకానీ ప్రజాకోర్టులో మాత్రం ఈ ఆందోళన ఎక్కువలో ఎక్కువ భక్తికి సంబంధం లేని వాళ్లదే. అందుకనే ఇది భక్తులమీద ఆధారపడిన ప్రధాన పార్టీకి అస్ర్తంగా మారింది. అక్కడి లెఫ్ట్ పార్టీలకు గుదిబండగా మారింది. అవసరాన్ని బట్టి భక్తీ సెక్యులరిజాల మధ్య పెండ్యులమ్ లాగా తిరిగే  పార్టీకి తేల్చుకోలేని సంకటంగా మారింది. తొలుత కాస్త లిబరల్ స్టాండ్ తీసుకున్న ఆ జాతీయ పార్టీ కూడా ఇపుడు అటు ఇటు కాని స్టాండ్ మీద సర్కస్ ఫీట్ చేస్తున్నది. నిన్నకాక మొన్నే వారి యువనాయకుల వారు మేం ఎటూ కాదు అని నొక్కుతూ పార్టీకి పడిన నొక్కులను సవరించుకునే పనిలో పడ్డారు.

సుప్రీం కోర్టు తీర్పుకు చాలా ముందునుంచే కొంతమంది మహిళా కార్యకర్తల చూపు శబరిమల మీదున్నది. పది పదిహేనేళ్ల క్రితం ఒక కార్యకర్తతో మాట్లాడుతున్నపుడు ఈ విషయం మీద ఎంత ఆక్రోశం వెళ్లగక్కారో గుర్తున్నది. అలాగే మాల వేసుకునేది మగాడు, గొడ్డుచాకిరి అంతా ఆడాళ్లకు అని వర్కింగ్ క్లాస్ స్ర్తీ వైపునుంచి సత్యవతిగారు ఒక కథలో చర్చించి ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నాటికి పీరియెడ్స్ సంబంధమైన చర్చ దేశమంతటా విస్రృతంగా సాగుతున్నది.  కోర్టులో తీర్పు వచ్చే నాటికి అంటే ఇద్దరు పురుష న్యాయమూర్తులు స్ర్తీల ప్రవేశానికి అనుకూలంగా మరో స్ర్తీ న్యాయమూర్తి మరొక విధంగా తీర్పు నిచ్చే నాటికి బయట ఒక వాతావరణం ఉధృతంగా ఉన్నది. తీర్పుతో ఒక దశ విజయం సాధించినట్టుగా మహిళా కార్యకర్తలు భావించారు. సంఖ్య పరంగా, బలాబలాల పరంగా అంగుష్టమాత్రకంగా ఉండే యాక్టివిస్టు నాస్తికుల విజయానందాన్ని భక్తాగ్రేసరులు సహించలేకపోయారు. మతంలోకి చట్ట ప్రవేశం ఎక్కడిదాకా అయినా వెళ్లొచ్చనే భయం పట్టుకుంది. రమ్మను చూసుకుందాం అన్నట్టు బరిగీసి నిలిచారు. కొన్ని రాజకీయ పార్టీలకు ఇదొక అవకాశం. తీర్పు అమలుకు హేతువాద ఆధునిక భావాలున్న భక్తేతరులు గట్టిగా ప్రయత్నించడంతో ఘర్షణ తీవ్రతరమైంది. రెండువైపులనుంచి విశ్వాసాలకు విలువలకు ప్రతీకగానూ ప్రతిష్టాత్మకంగానూ తయారైంది.

అవిశ్వాసులకు సంప్రదాయాలతో ఏం పని అనే ప్రశ్నఎదురవుతున్నదిభక్తులనుంచి గట్టిగా, నాస్తికులనుంచి మెల్లగా. భక్తి ఉందా లేదా అనేది కాదు. అది దేవాలయమా ఆచారమా అని కాదు. ఇదొక మలుపు. మహిళా స్వేచ్చకు సంబంధించిన ప్రయాణంలో తెంచుకునే ఒక సంకెల అని కొందరు కార్యకర్తలు పట్టుదలగా భావించే దశ వచ్చింది. ఆ దశకు చేరాక దానికి సింబాలిక్ విలువ చేకూరుతుంది. దాన్నిఈ సంప్రదాయానికి పరిమితం చేసి చూడలేం. సుప్రీంకోర్టు తీర్పును ఆయుధంగా చేసుకుని ఒక సింబాలిక్ సంకెల ఛేదించడమే. ఆ ప్రభుత్వంపై ఏవైనా విమర్శలుండొచ్చుగానీ ఆ వామపక్ష ప్రభుత్వమే లేకుంటే అక్కడున్న పరిస్తితుల్లో యాక్టివిస్టులు దాన్ని ఛేదించడం సాధ్యమయ్యేది కాదేమో!

అయితే దేశంలో సవాలక్ష సమస్యలుండగా ఇదే అంత  అర్జెంట్ సమస్యనా, ఇదేనా మీ ప్రయారిటీ అనే ప్రశ్న రావచ్చు. అదే సమయంలో మద్దతుగా గొంతు విప్పకపోతే మీరసలు పురోగామివాదులే కాదు అన్నట్టు బెదిరింపులు ఇటు కొందరు కార్యకర్తలు చేయవచ్చు. రెండు ధోరణులు చూస్తున్నవే. కొసలకు ఆకర్షణ ఎక్కువ. కొసరాజులకు కొసరాణులకు కొదువ లేని కాలమ్మిది.  

మిలిటెంట్ సంస్థల స్థానంలో ఎన్జీవోలు, హక్కుల స్థానంలో చారిటీ వర్క్ విస్తరించినట్టుగానే వర్కింగ్ క్లాస్ అని కాకుండా ఏ బ్రాంచికి ఆ బ్రాంచి స్పెషలైజేషన్ వ్యాపించడం ఆధునిక వ్యాపారయుగ లక్షణం. ప్రతి బ్రాంచి తానే అండమూ బ్రహ్మాండమూ అనేసుకుంటా ఉంటది. అందరూ తమ డిమాండ్ వెనుకే నుంచోవాలని అనుకుంటా ఉంటది. వర్కింగ్ క్లాస్లో కాస్త పై భాగాన ఉన్న పెద్దగొంతు వారు తమ డిమాండ్లే మొత్తం ప్రపంచ విముక్తి డిమాండు అన్నట్టు భ్రమపెడతా ఉంటారు.

శబరిమల ఆలయ ప్రవేశం స్ర్తీల హక్కులకు సంబంధించి ఒక విజయం అనుకునే వారికి ఎంత హక్కున్నదో అది మనకంత ప్రయారిటీ కాదు అనుకునే వారికి కూడా అంతే హక్కున్నది. అసలది మన డిమాండే కాదు అనుకోవడం కూడా నేరమేమీ కాదు. ఎక్కడ నిలబడి చూస్తున్నావు అనేదాన్ని బట్టి నువ్వు చూసే అంశాలు వాటి విస్రృతి ఆధార పడి ఉంటాయి. వర్తమాన సన్నివేశంలో ఆ వింటేజ్ పాయింట్లు బహుళం. ఎవరి ప్రయారిటీలు వాళ్లవి. మన ప్రయారిటీనే అవతలివారి ప్రయారిటీ కావాలని రూలేమీ లేదు. స్ర్తీలైనంత మాత్రాన అందరి అవసరాలు ప్రయారిటీలు ఒక్కటి కావాలని రూలేమీ లేదు.

*

 

జీ.ఎస్. రామ్మోహన్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • This has been the only Down to earth discussion I read since the issue of Sabarimala has risen. And then, we have to consider 2 more aspects of the issue.
    1. దీక్ష తీసుకున్నవారు, తీసుకోనివారు రావచ్చు
    2. మెట్లు ఎక్కి దిగగానే మొదలుపెట్టే అన్ని అలవాటు ప్రకారం చేసే పనులు( మందు, దమ్ము)
    ఒకరకంగా దైవాన్ని నమ్మేవాళ్ళం కూడ పటాటోప, ప్రదర్శన ఉన్న గుడికి మానేసి ఇంట్లోనే ధ్యానం చేసుకుందామనిపిస్తోంది.

  • దేవుని మీద భక్తి ఉన్నవారు ఆలయ సంప్రదాయాలు అనుసరిస్తారు .దేవుని నమ్మని వారు సంప్రదాయాన్ని కూడా నమ్మరు వారు రావాలిసిన అవసరం లేదు.ఎందుకంటే వారికి నమ్మకం లేనప్పుడు అక్కడికి ప్రవేశం ఉంటే ఏంటి లేకుంటే ఏంటి.అసలు ఈ గోడవంతా హిందువుల నమ్మకాలు పై మాత్రం ఎందుకు వేరే మతాల వారిని కదిలించే ధైర్యం లేక.ఇక స్త్రీవాదుల సంగతి పోరాటం చేయాల్సిన ఎన్నో విషయాలు వదిలేసి మీడియా లో మాట్లాడటం మీద ఎక్కువ టైం VASTE చేస్తున్నారు.
    అసలు నిజంగా ఆడవాళ్లు కు కూడా ప్రవేశం ఉన్న ఎన్నో దేవాలయాలు INDIA లో ఉన్నాయి అవి అన్ని చూసారా ఈ భక్త్తులు. అడ్డమైన గోడవలతో దేవాలయ ప్రశాంతి భక్తులకు శాంతి పోగొడుతున్నారు.

    • హిందూమతంలోని ఆచారాల గురించి మాట్లాడినప్పుడల్లా మిగతా మతాల ప్రస్తావన ఎందుకో నాకు అర్ధం కాదు.

      సరే! అదికూడా కానివ్వండి. ముమ్మారు తలాక్ ముస్లిముల్లోని సాంప్రదాయమేగా, అది రద్దవ్వలేదూ! ఏం హిందూమతంలోని ఆచారాలు కొన్ని పోతే తప్పేముంది?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు