తెలుగు సాహిత్యంలో వ్యక్తి అసలు ఆవిర్భవించాడా? వ్యక్తి అంటే స్వతంత్ర నిర్ణయం, స్వతంత్ర వ్యక్తీకరణ, స్వ+ఇచ్ఛ (స్వేచ్ఛ) మూర్తీభవించిన వాడు అని అర్థం.
వ్యక్తి ఆవిర్భావమే ఆధునిక సాహిత్యానికి మూలం. అంత క్రితం సమాజం, స్థిరంగా వర్గీకరించబడిన సమూహాలుగా వుండేది. అప్పటి సాహిత్యం కూడా సామూహిక ఆకాంక్షలనే ప్రతిబింబించింది. అందరూ తమకి ముందే నిర్దేశించిన వృత్తిలో, పాత్రలో జీవించే వారు.
కానీ ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తిని ముందుకు నెట్టింది. సమాజం తనలో తానుగా పరిపూర్ణంగా వుండే స్వతంత్ర సత్తాని కోల్పోయింది. వ్యక్తుల సమూహంగా మారింది. ఒప్పందంలోకి వచ్చిన వ్యక్తుల సమీకరణంగా సమాజం నిర్వచించబడింది. అంటే అణువుల కలయిక పదార్థమైనట్లే, వ్యక్తుల కూడిక, యిచ్ఛాపూర్వక కలయిక- సమాజంగా భావించబడింది.
పెట్టుబడిదారీతర్కం దీనికి బలాన్ని చేకూర్చింది. శ్రమ విభజన ప్రకారం వ్యక్తులు ఎవరి పనులు వాళ్ళు యిచ్ఛాపూర్వకమైన ఎన్నిక ద్వారా చేస్తారు. వస్తువుల మార్పిడి సేవల మార్పిడి అందరికీ మేలు చేస్తుంది. స్వార్థమే పరోపకారం అనేది పెట్టుబడిదారీ ఆధునిక తర్కం.
ఈ ఆధునిక తర్కం యొక్క తీవ్ర రూప వ్యక్తీకరణే ఐన్ రేండ్. ఐన్ రేండ్ రష్యా నుంచి అమెరికాకి వలస వచ్చి స్థిరపడిన మేధావి. ప్రధానంగా కమ్యూనిజం సమాజానికి యిచ్చిన ప్రాధాన్యాన్ని తిరస్కరించారు. వ్యక్తి స్వార్థమే నాగరికతని నిర్మించింది అన్నారు. వ్యక్తి సరికొత్త ఆవిష్కరణలు చేసినప్పుడల్లా గుంపులు అడ్డుపడుతూవచ్చాయి. గెలీలియో లాంటి వాళ్లు యిందుకు తార్కాణం. ఈ గుంపు మనస్తత్వం నుంచి బయటపడేయడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ- వ్యక్తి సంకల్పానికి స్థానం కల్పిస్తుంది అంటారు ఐన్ రేండ్ .
అయితే కమ్యూనిజానికీ సోవియట్ సోషలిజానికీ దూరమైనట్లు కనిపించే ఐన్ రేండ్ ఒక విషయంలో ఏమాత్రం దూరం కాదు. అది ప్రోడక్టివ్ మేన్. అంటే వ్యక్తి అంటే ఉత్పత్తి చేసేవాడు; అయితే ఐచ్ఛికంగా ఉత్పత్తి చేసేవాడు. కాని ఉత్పత్తిని నిరాకరించే వాడు మాత్రం కాదు. అడ్డూ అదుపూ లేని ఆధునిక ఉత్పత్తి మూలాలనే నిరాకరించే వాడు కాదు, ప్రశ్నించే వాడు కాదు.
పాశ్చాత్య కమ్యూనిజం కూడా అధిక ఉత్పత్తిని సోషలిజానికి అనివార్య షరతుగా భావిస్తుంది. అయితే సామాజిక ఉత్పత్తిగా భావిస్తుంది. శ్రమకి ప్రాధాన్యం యిస్తుంది. ఐన్ రేండ్ బౌద్ధిక శ్రమని, ఇండివిడ్యువల్ క్రియేటివిటీని ఎత్తిపడుతుంది. యిది పాశ్చాత్య భావ భౌతికవాదాల గోల కావచ్చు. భారతీయ మేధావుల వైఖరి దీనికి పూర్తిగా భిన్నం. భారతీయ కమ్యూనిస్టుల వైఖరి కూడా పాశ్చాత్య కమ్యూనిస్టుల వైఖరికి విరుద్ధమైనది.
ప్రాచ్యం అత్యాశని వ్యతిరేకించింది. కానీ ఆ అత్యాశే పెట్టుబడిదారీ వ్యవస్థకి, దాని పునాదిపై లేచిన కమ్యూనిజానికి మూలం. భారతదేశంలో (చైనాలో కూడా) అడవులు గ్రామాల నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అంటే ఆధునిక ఉత్పత్తి, దానినుంచి పుట్టిన వ్యక్తి ప్రమేయం యిక్కడ లేదు. అంటే భారతదేశంలో పుట్టిన ‘వ్యక్తి’కి సమాజపు బొడ్డు సంబంధం తెగలేదు. అందుకే యిక్కడ పాశ్చాత్య అస్తిత్వ వాదంలాంటి వ్యక్తి కేంద్రక సిద్ధాంతాలు పుట్టలేదు. దళిత, మైనారిటీ వాదాలు వ్యక్తిని ప్రాచీన సమూహాలతో ముడివేశాయి. ప్రాచీన పౌరాణిక కథల్నీ, మూలాల్నీ వెదుక్కునేలా చేశాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి ధర్మారావు లాంటి వ్యక్తిని సృజించాయి. వ్యక్తి కాని వ్యక్తిని, సమూహంతో ముడివడిన వ్యక్తిని.
దీనికి కారణం పాశ్చాత్యం ప్రకారం వ్యక్తి- అంటే వ్యక్తీకరణ శీలి, ప్రాచ్యం ప్రకారం అవ్యక్తం. అందుకే ఐన్ రేండ్ రాసిన ‘ఫౌంటెన్ హెడ్’ నవల కథానాయకుడు రోర్క్ కొండలనీ బండలనీ చూస్తూ, వీటిని గొప్ప ఆధునిక భవంతులుగా ఎలా నిర్మించాలా అనే ఆలోచనతో మొదలౌతుంది నవల. ప్రాచీన నిర్మాణాలకు సంబంధించిన సంస్కృతిని, స్మృతులని బద్దలుచేసి కొంగొత్త నిర్మాణాల ద్వారా తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకుంటాడు ఆర్కిటెక్ట్ రోర్క్.
దీనికి భిన్నంగా విశ్వనాథ సత్యనారాయణ వొక ప్రాచీన సంస్కృతి విధ్వంసాన్ని ప్రకృతి విధ్వంసపు దుష్ఫరిణామాలతో కలిపి వర్ణిస్తాడు. మనిషి – పాముల లక్షణాలు కలగలసిన ‘పసరిక’ పాత్రని సృష్టించాడు. ధనస్వామ్యం, పంటలలో వైవిధ్యాన్ని నిరాకరించే వ్యవసాయం, ఇంకా ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే వికృత పోకడల పర్యవసానంగా ‘పసరిక’ మరణిస్తాడు.
ఎండపల్లి భారతి రాసిన ‘జూదం’ కథలో వొక గ్రామీణ స్త్రీ అంటుంది- మనం ప్రపంచమనే సంతకి వచ్చిన వాళ్లం, మన అడుగుజాడల్ని కూడా మిగల్చకుండా ఎప్పటికప్పుడు తుడిచెయ్యాలి, నేలపైన ఏ జాడలూ మిగల్చకుండా నిష్క్రమించాలి- అని.
ఇటువంటి భారతీయ కథలలో వ్యక్తి ప్రకృతిలో అంతర్లీనంగా నిలిచిపోతాడు. ప్రకృతి నుంచి వేరుపడి బోరవిడుచుకుని తన ప్రత్యేకతని చాటుకోడు. ‘ఆకులందున అణగిమణిగి కవిత కోకిల’ పలుకుతుంది. అందుకే ప్రకృతిని ఆరాధించేదిగా ప్రకృతి స్థాయికి ‘మనిషి’ని దిగజార్చినదిగా భారతీయ మత విశ్వాసాన్ని నిరాకరిస్తాడు మార్క్సు. ప్రకృతిపై మనిషి సార్వభౌముడు అంటాడు. ప్రొటెస్టంటిజం ప్రకారం – మనిషియే దేవుడి ప్రతిబింబం. అందుకే ప్రకృతిపై మానవుడు సార్వభౌముడు అయ్యాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం వహించే మనిషి పుట్టాడు. ప్రకృతిని మలవడం ఎలా అని ఆలోచించే ‘రోర్క్’ పుట్టాడు పాశ్చాత్యంలో.
తను మౌలిక విశ్వాసాలలోనే మనిషికీ, హ్యూమనిజానికీ, వ్యక్తికీ, వ్యక్తి సంకల్పానికీ ఆస్కారం వుండి, పెట్టుబడిదారీ వ్యవస్థ ద్వారా పూర్తిగా సాకారమైన ‘వ్యక్తి, ప్రొలటేరియట్ కార్మిక వర్గం బలంగా వున్న పాశ్చాత్య నాగరికత నుండి విప్లవం, విముక్తి సాధ్యమవుతాయని మార్క్సు భావించాడు. చారిత్రక మానవుడు అనే భావనని నిరాకరించిన అనార్కిస్టు బకూనిన్ ప్రాచ్యంలోనే తిరుగుబాట్లు, విప్లవం సాధ్యం అన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ మానవ స్వభావాన్ని కలుషితం చేస్తుంది అన్నాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తిని సృష్టించలేదు, మనిషిని సృష్టించలేదు. అత్యాశని సృష్టించింది. అత్యాశే వ్యక్తికి, మనిషికి పర్యాయ పదం అయింది.
ఇస్మాయిల్ ‘చిలుకలు వాలిన చెట్టు’ అన్నా, శివసాగర్ ’చిలుక చీటి తెచ్చింది’ అన్నా, విశ్వనాథ ‘మేఘం నాగరికత మీరిన ఊరిపై అలిగింది’ అన్నా, చలం ‘వో పువ్వు పూసింది’ అన్నా అత్యాశపూరితమైన నాగరికత ఎదురుగా ప్రకృతిని నిలపడమే. దానిలోనే మనిషి ఉనికి కూడా వుందని నిరూపించడమే.
కాళిదాసు మేఘసందేశానికి, శుక సందేశాలకి బదులు జాషువా గబ్బిలంతో సందేశం పంపడం దళిత కవిత్వానికి నాందీ వాచకమయింది. చలం మైదానం వొక స్వప్నంలా పరుచుకొంది. ఈ వ్యక్తీకరణలు వేటిలోనూ వ్యక్తి తన పరిసరాల నుండి వేరుపడడు, విశ్వం నుంచి వేరుపడడు. భారతీయ తత్వమే అంత. వ్యక్తిని అణువుగా చూసే దృష్టిలేదు భారతదేశంలో. అణువులో బ్రహ్మండముం వుంది. వ్యక్తిలో విశ్వం, విశ్వ చైతన్యం ఉన్నాయి. ఇంద్రియాలని వివిధ దేవతలుగా భావించే తత్వం వుంది. అసలు నేనే దేవుడు అనే అద్వైతం వుంది.
దేవుని ముందు అందరూ సమానులే అనే భావం నుంచి పౌర భావన, వ్యక్తి భావన పుట్టాయి పాశ్చాత్యంలో. అందుకే వ్యక్తి అణువు వంటివాడు, వ్యక్తుల సమూహమే సమాజం అనే భావన పాశ్చాత్యంలో ఏర్పడింది. ఈ వ్యక్తులు అందరూ వొక ఒప్పందంతో గుమిగూడడం సమాజం అయింది. అందుకే పాశ్చాత్య సామాజిక భావనలో, సమానత్వ ఆదర్శంలో ‘వ్యక్తి’ ప్రధానమయ్యాడు.
వేదం ప్రకృతి శక్తులలో దేవతలని చూసింది. ప్రాచీన ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం సృష్టికర్త ఉనికినే ప్రశ్నించింది. తర్వాతి దశలో మానవ దేహం ప్రకృతికీ, విశ్వానికీ ప్రతిబింబంగా మారి మానవ యింద్రియాలే వివిధ దేవతలు అనే భావన వచ్చింది. చివరికి ‘ఏకం సత్ ‘ వచ్చినా అది బహుళత్వంలో ‘అంతర్యామి’గానే మారింది. నేనే దైవాన్ని, నేనే శివుణ్ణి అనే అద్వైత ఆవిర్భవించింది. ‘భావానికి భౌతిక వస్తువులు నీడలు’ అనే ప్లేటో, దైవానికి మనిషి ప్రతిబింబం, ప్రతినిధి అనే క్రైస్తవానికి దారితీశాడు. యిది ద్వంద్వానికి కారణమై, ‘వ్యక్తి’ ప్రత్యేక అస్తిత్వానికి దారితీసింది. వ్యక్తివాదం ఆశావాదానికి, పరలోకానికి యుటోపియాలకీ దారితీసింది.
భారతఖండం పరిస్ధితి వేరు. ప్రాచీన ఋగ్వేదం వందేళ్లు జీవించాలనే దీర్ఘాయువు పట్ల ఆకాంక్షనీ, మద్యమాంస ప్రియత్వాన్నీ, ఇంద్రియ లాలసనీ, సృష్టికర్త పట్ల శంకనీ బోధించింది. వైదికమే చార్వాకానికి మూలం. వ్యాస మహాభారతం ఆదిపర్వం శకుంతలోపాఖ్యానంలో కణ్వాశ్రమంలో బోధించబడే వాటిలో చార్వాకం కూడా వుంది. రాజులకి బోధించే అన్వీక్షకి విద్యలో చార్వాకం విడదీయరానిది, అదే హేతువిద్య. వామాచారానికి మూలం కూడా వేదమే. ఋగ్వేదంలో లోపాముద్ర అగస్త్య మహర్షికి చేసిన బోధ ఏమిటంటే, ‘తపస్సుకు శృంగారం భంగకరం కాదు’ అని. దేవాలయాల మీద బూతుబొమ్మలకి మూలం వేద ధర్మమే లేక వేద చార్వాకమే.
ఐన్ రేండ్ ‘ఫౌంటెన్ హెడ్’నవలలో కథానాయకుడు రోర్క్ ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఆ దేవాలయంలో పెట్టిన విగ్రహం ఏమిటంటే తన ప్రియురాలి నగ్న విగ్రహం. సర్వమత జాతి సమానత్వానికి ప్రతీకగా వొక పెద్ద పారిశ్రామిక వేత్త తలపెట్టిన దేవాలయం అది. అది పేగన్ విశ్వాసాలతో, నిజమైన దేవుడి పట్ల అవిశ్వాసంతో కట్టబడిన నిర్మాణంగా యీసడించుకోబడుతుంది. చివరికి అది కూల్చి వేయబడుతుంది. ఆ దేవాలయం అమెరికన్ స్వేచ్ఛాకాంక్షకి ప్రతీక అనవచ్చు. అది విక్టోరియన్ నీతిపై తిరుగుబాటు.
దీనితో భారతదేశ పరిస్థితిని చూడండి. శృంగారాన్ని, దైవాన్ని వొకటి చేసిన దేవాలయాలనీ, దేవదాసీ వ్యవస్థనీ మూఢ విశ్వాసంగా, వ్యక్తి హననంగా, యింగ్లీషు సంస్కారవంతులు, మెకాలే మానసపుత్రులు తిరస్కరించారు. పాత వ్యవస్థకీ, దేవదాసీ వ్యవస్థకీ మద్దతుదారైన బెంగుళూరు నాగరత్నమ్మ, బ్రిటిష్ ప్రభావానికి లోనై వ్యక్తివాదానికి సింబల్‌గా మారిన సంఘ సంస్కర్త వీరేశలింగంతో పోరాడవలసి వచ్చింది. స్త్రీలు శృంగార రచనలు చేయడం తప్పుకాదు అని, ముద్దు పళని రాసిన ‘రాధికా సాంత్వనం’ ని నిషేధించకూడదని పోరాడి విఫలమైందామె. ఆ గ్రంథ నిషేధాన్ని సమర్థించినది సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు. యిటీవల హిందూవాదులు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన దేవతల నగ్న చిత్రాలని ధ్వంసం చేశారు. హుస్సేన్ దేశం విడిచి అమెరికాకి వెళ్లిపోయాడు.
అంటే పాశ్చాత్యంలో అమెరికాలో వ్యక్తివాదానికి చిహ్నంగా భావించబడిన విషయాలు ఇక్కడ సంప్రదాయ వాదంగా తృణీకరించబడ్డాయి. బహుశా షోపెన్ హోవర్, నీషే మీదుగా ఐన్ రేండ్ లాంటి వారిని తాకిన భారతీయ సంస్కృతి, భారతఖండంలో మాత్రం పాత విలువగా, అణచివేతగా తిరస్కరించబడింది. వైదిక చార్వాకుడు విశ్వనాథ సత్యనారాయణ బౌద్ధ జైన ఉపనిషత్తుల ప్రభావాన్ని కూడా పక్కనబెట్టి, వేద పేగనిజాన్ని పునరుజ్జీవింపజేశాడు ‘వేయిపడగలు’నవలలో. దేవదాసి పాత్రకి చాలా ప్రాధాన్యం యిచ్చాడు. ‘శప్తభూమి’ నవలలో రాయలసీమ రచయిత నారాయణస్వామి మళ్ళీ దేవదాసికి ప్రాణం పోశాడు.
‘వేయిపడగలు’ నవలలో ఇహాన్ని తిరస్కరించిన సన్యాసి పాత్ర ఒక్కటి కూడా లేదు. బహు దేవతార్చన, దేవదాసి, ప్రకృతి శక్తుల ప్రాధాన్యం… అంతా వైదిక చార్వాకమే. ఎందుకంటే ప్రకృతికి వ్యతిరేకంగా మనిషిని సార్వభౌముడిగా నిలుపుతున్న పాశ్చాత్య సంస్కృతిని ఢీకొనడానికి వేదకాలానికి తిరోగమించాడు. అందుకోసం ఉపనిషత్తులు, బౌద్ధజైనాల ప్రభావాన్ని కూడా తెరమరుగు చేశాడు. వేదము, వేదానికి వ్యాఖ్యానమైన మీమాంసా శాస్త్ర ప్రభావం కనబడ్తుంది విశ్వనాథపై.
వేదాన్ని పరమ ప్రమాణంగా భావించే మీమాంసా శాస్త్రం ప్రకారం – సృష్టికర్త లేడు. ప్రకృతి అనాదిగా వుంది. ప్రకృతి దేవతలని ప్రసన్న చేసుకోవడమే ముఖ్యం. మోక్షం, నిర్వాణం, పరలోకం లేవు. యింక ఋగ్వేదం పూర్తి ప్రాకృతికం.
ఒక బ్రాహ్మణుడు నాలుగు వర్ణాల స్త్రీలని వివాహం చేసుకోవడం, జైమిని సూత్రాల మీమాంస భాష్యకారుడు శబరస్వామి జీవితాన్ని గుర్తుచేస్తుంది. విమర్శకులు ఆర్‌ఎస్ సుదర్శనంగారు విశ్వనాథ నవలల్లో కులాంతర వివాహాలని సమర్థించడం ఆశ్చర్యపోయేలా చేసింది ఋగ్వేదంలో కుల ప్రసక్తి లేదు.
వేదకాలానికి తిరోగమనం. యిదీ విశ్వనాథ. అయితే యిది తిరోగమనమేనా? పురోగమనం అంటే ఏమిటి? విక్టోరియన్ నీతా? నేడు మనని కరోనా బారికి నెట్టిన ప్రకృతి విధ్వంసమే అభివృద్ధా? కాలం గురించి మన ఆలోచనలలోనే లోపం వుందా?
1934లో ఒక ప్రముఖ కమ్యూనిస్టు రచయిత ఫాసిజం గురించి రాస్తూ, ఆధునిక అభివృద్ధి ప్రక్రియని విమర్శించే వాళ్ళు, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల గురించి మాట్లాడేవాళ్ళు – సైన్సు పురోగమనానికి అడ్డంకిగా వున్నారని రాశారు. వీళ్ళు తిరోగమనవాదులు మాత్రమే కాక ఫాసిజానికి దారితీస్తారు అని విమర్శించాడు. గాంధీని కూడా యిదే దృష్టితో విమర్శించాడు (ఫాసిజం యాన్ ఎ సోషల్ రివల్యూషన్ – ఆర్. పామే దత్).
కానీ ప్రాచ్యదేశాలకి సంబంధించిన మావో కూడా పాశ్చాత్య అభివృద్ధి పక్రియని కాదని, కుటీర పరిశ్రమలని ప్రోత్సహించారు. 1939లో విశ్వనాథ ‘వేయిపడగలు’ నవల ద్వారా పాశ్చాత్య అభివృద్ధి పక్రియ- పర్యావరణ విధ్వంసానికి, గ్రామ వినాశనానికి దారితీస్తుందనే విషయాన్ని ఎంతో హృద్యంగా చిత్రించారు. అందువల్ల తిరోగమన వాదిగా ముద్రపడ్డారు. కమ్యూనిస్టులు ఎకో ఫ్రెండ్లీ దృక్పథాన్ని ఒకప్పుడు ‘ఫాసిజం’ అన్నారు, తిరోగమనం అన్నారు. ఇప్పుడు కొందరు దళితవాదులు- కాషాయ దృక్పథం అంటున్నారు.
(గ్రీన్ అండ్ శాఫ్రాన్ – ముకుల్ శర్మ)
అయితే పర్యావరణంలో ప్రతికూల పరిణామాలు, వైరస్‌ల విజృంభణ పేదలకే ఎక్కువ ముప్పుగా మారింది. నిజానికి హిందూవాదులు అభివృద్ధి పేరుతో పర్యావరణ చట్టాలని తుంగలో తొక్కుతున్నారు. విశ్వవ్యాప్తంగా రైటిస్టుల పరిస్థితి యిదే. (నేటి ఇండియా, అమెరికా, బ్రెజిల్ వైఖరులు చూడండి)
ఈ రైటిస్టుల వైఖరికి మూలం ఒకప్పటి లెఫ్టిస్టులే. వాళ్ళు మనిషికీ, వ్యక్తికీ అగ్రాసనం వేశారు. ప్రకృతిని మనిషికి దాస్యం చేయించాలని చూశారు. కానీ భారతీయత ఎదురు తిరిగింది. దాని ఫలితమే విశ్వనాథ ద్వారా ఇస్మాయిల్ కవిత్వంలోకి ప్రయాణం. ‘చిలుకలు వాలిన చెట్టు’ ఇస్మాయిల్ చెట్టు కవిగా పేరుపొందాడు.
మనకి చెట్టు కవులే కాని, ఐన్ రేండ్ లా ప్రకృతిని మానవ ప్రయోజనాల కోసం మలచడంలోనే సౌందర్యం వుందన్న ప్రాగ్మాటిస్టులు పుట్టుకురాలేదు. గురజాడలోని ప్రాగ్మాటిజం కొనసాగలేదు. కమ్యూనిస్టు కవిత్వం కూడా ప్రకృతి ముందు మోకరిల్లింది. …. ఉదాహరణ శివసాగర్. మావో కూడా ప్రకృతి కవే. ఆయనలో టావోయిజం బలంగా వుంది. అంటే ప్రకృతి సమతౌల్యత. త్రిపురనేని రామస్వామి గారి హేతువాదపు పరిమితులని అధిగమించడానికే త్రిపురనేని గోపీచంద్ ప్రయత్నించాడు.
బలమైన హేతువు పాతుకోలేదు యిక్కడ. ‘హేతువు’ అనే దానిని పారిశ్రామిక ఉత్పత్తి, మానవ పురోగతి అనే అర్ధాలలోకి కుదించారు కేపిటలిస్టులూ, కమ్యూనిస్టులూ. వస్తువులకి భావాలే మూలం అంటాడు ప్లేటో. మానవుడు, మానవజాతి అనే వాటికి పారిశ్రామిక మానవుడుని ప్రతినిధి భావంగా చూశాడు మార్క్సు. ఎందుకంటే స్వేచ్ఛగా శ్రమని అమ్ముకోగలది ప్రొలటేరియట్ కార్మికవర్గం. అంటే యిక్కడ ఛాయిస్ – ఎన్నిక వుంది. అంతక్రితం ప్రాచీన సమాజాలకి సంబంధించిన మనుషులు వివిధ వృత్తులలో వంశపారంపర్యంగా పుట్టుక తోనే నిర్దేశించిన పాత్రలో, వృత్తిలో యిమిడి పోయేవారు. కానీ ఆధునికత, పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ పరిస్థితిని మార్చివేసింది. కనీసం నగరానికి వలస పోయి, వృత్తిని ఎన్నుకునే వ్యక్తిని సృజించింది. మార్క్స్ దీనినే శ్రమని అమ్ముకునే స్వేచ్ఛ అంటాడు. పెట్టుబడుదారులు దీనినే ఇండివిడ్యువలిజం – వ్యక్తిత్వం అంటారు.
అణువుల కూడికే పదార్ధం అనే భౌతిక శాస్త్ర భావన, విడివిడి వ్యక్తులు ఒప్పందంపై కలవడమే సమాజం అనే కాన్సెప్ట్‌కి మూలమైంది. ఈ కాన్సెప్ట్‌లో ఛాయిస్ – ఎన్నిక ప్రధానమైనది. ఆధునిక మానవుడు అంటే పారిశ్రామిక పెట్టుబడిదారీ మానవుడు, చైతన్యవంతుడైన మానవుడు అని కమ్యూనిస్టులూ, కేపిటలిస్టులు కూడా అంగీకరించారు. ‘వ్యక్తి’కి గతం, సంస్కృతి పెద్ద అడ్డంకి. ఆధునిక పెట్టుబడిదారీ వర్తమానం- గతంకంటే మౌలికంగా భిన్నమైనది మాత్రమే కాదు, గతంపై తీర్పు కూడా; చైతన్యవంతమైన తీర్పు.
కల్చర్ అవశేషాలని మౌలికంగా తిరస్కరించే ‘వ్యక్తి’ని రోర్క్ ద్వారా ఆవిష్కరించాలని చూస్తుంది ఐన్ రేండ్ . అందుకే ఆల్ ట్రూయిజాన్ని, సామాజికతని పూర్తిగా తిరస్కరిస్తుంది. గత అవశేషాలు, సాంస్కృతిక కొనసాగింపు వ్యక్తి ఆవిర్భావానికి అడ్డంకి. పాత గ్రీకు భవంతుల నిర్మాణ సూత్రాలు ఆధునిక భవంతుల నిర్మాణానికి ఏ రకంగానూ ఉపయోగించవు. సరికదా కొత్త వాస్తు సూత్రాలని కనుగొనడానికి అవరోధంగా నిలుస్తాయి అని రాస్తుంది ‘ఫౌంటెన్ హెడ్’ నవలలో.
‘ఎలా రాయకూడదో తెలుసుకోవడానికే పాత రచనలు చదవాలి’ అంటాడు శ్రీశ్రీ. ‘ఒక క్షణం గడిస్తే చాలు, అదే నాకు గత శతాబ్ది’ అంటాడు. కానీ విశ్వనాథని మించి శ్రీశ్రీనే సంస్కృతి సంప్రదాయాల వెంటాడాయనిపిస్తుంది. ‘మహాప్రస్థానం’లో పురాణ ప్రతీకలూ, శంకరాచార్యుని భజగోవిందం ఛందస్సూ… వగైరా. ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు’ అని వాపోయింది శ్రీశ్రీయే కదా.
అలాగే ఐన్ రేండ్ గతానికన్నా పాశ్చాత్య వర్తమానాన్ని తిరస్కరించిందా? సర్వ సమానత్వ భావనని దేవాలయంగా మలచమని పెట్టుబడిదారు ఆజ్ఞాపిస్తే, గుడిలో స్త్రీ దేవత ప్రతిమని, అందులోనూ నగ్న ప్రతిమని నిలిపి పేగన్ కల్చర్‌లోకి పతనమయ్యాడు అనే నిందని మోస్తాడు హీరో రోర్క్. యిది ఐన్ రేండ్ పొగిడే ఆధునిక అమెరికా కల్చర్‌లో ప్రధానమైన ప్రొటెస్టటిజానికి పూర్తి విరుద్ధం. కానీ భారతఖండంలో కాని యితరత్రా గానీ, పేగన్ కల్చర్‌లలో స్త్రీ ఆరాధన, నగ్న స్త్రీ ఆరాధన సాధారణమైనదే.
కానీ మన తెలుగు మేధావి తాపీ ధర్మారావు ‘దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు’ అని ప్రశ్నించి, పూజనీ, నగ్నత్వాన్ని హిస్టరీగా మార్చే ప్రయత్నం చేస్తాడు. వర్తమాన నాగరికత నుంచి తొలగించాడు. విశ్వనాథ దేవదాసిని వర్తమానంగా మార్చాడు. అంతకు ముందే దేవదాసీ వ్యవస్థనీ, సంస్కృతినీ, దేవదాసీ సాహిత్యాన్నీ వర్తమానంగా మార్చి, సంస్కర్తల ఆధునికతలోని డొల్లతనాన్ని బయటపెట్టింది బెంగుళూరు నాగరత్నమ్మ.
విలియం జోన్స్ అనే యింగ్లీషు మేధావి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని పాశ్చాత్య భాషలోకి అనువాదం చేశాడు, అనువాదం పేరుతో శృంగార వర్ణనలని తొలగించి విక్టోరియన్ కల్చర్‌లోకి సంస్కరించాడు. ఆ పాశ్చాత్య శకుంతలనే గొథె స్వర్గానికీ- భూమికీ వారధిగా కీర్తించాడు. ఆ పాశ్చాత్య శకుంతలనే బుద్ధిచెడిన రవీంద్రనాధ్ ఠాగూర్ ఆధునిక గృహిణి నీతికి పర్యాయ పదంగా భావించాడు. ఆ శాకుంతల ప్రభావంతోనే రొమాంటిసిజం పుట్టి, అమలిన శృంగారపు భావ కవిత్వంగా తెలుగుదేశంలో విర్రవీగింది.
ఈ భ్రష్ట భారతీయ తెలుగు వేషపు పాశ్చాత్య సంస్కృతికన్న ఐన్ రేండ్ ఎక్కువ స్థానికురాలుగా కనబడుతుంది. పేగన్‌గా కనబడుతుంది. ముఖ్యంగా ‘ఆబ్జెక్టివిజం’ పుస్తకంలో ఐన్ రేండ్ సహజతర్కాన్ని ఆశ్రయిస్తుంది. ఈ ‘సహజ’ తర్కం భారతీయ వేద, చార్వాక మీమాంసలకి దగ్గర. ఈ జగత్తు స్వాభావికమైనది అనేదే సహజ తర్కం. జగత్తు స్వాభావికం అంటే ఏమిటి? అది ఉంది అంతే, అది అనాదిగా వుంది. దీనినే స్వతః ప్రమాణం అంటారు.
ప్రతిదానికీ కారణం ఉంటుంది. కుండకి కుమ్మరి కారణం. మరి జగత్తుకి కారణం ఉండాలి అనే ఆలోచన నుంచి సృష్టికర్త అనే భావన వచ్చింది. అతి ప్రాచీనమైన ఋగ్వేదం నాసదీయ సూక్తంలో సృష్టికర్త వున్నట్లయితే వాడిని ఎవరు చూశారు అని నిలదీస్తుంది. మనుషులు, యితర జీవులే కాదు, దేవతలు కూడా సృష్టి మొదలయ్యాకనే వచ్చారు. వారికీ సృష్టి రహస్యం తెలియదు ఋగ్వేదం ఘోషిస్తుంది.
అందుకే సృష్టికర్త ఎవరు, జగత్తుకి కారణం ఏమిటి అన్న ప్రశ్న పూర్తిగా తప్పు అంటుంది సాంఖ్యం. దానివల్ల కార్యకారణ సంబంధంలో అవ్యవస్ధ మొదలవుతుంది. జగత్తుకి కారణం దేవుడు అయితే, దేవుడికి కారణం వుండాలి. ఈ గొలుసు ఎక్కడా ఆగకుండా అనంతంగా సాగుతుంది. ఇదే తర్కంతో వేద వ్యాఖ్యానంగా వచ్చిన మీమాంసా శాస్త్రం జగత్తు అనాది, అనంతం అంటుంది.
జగత్తు స్వభావసిద్ధంగా యిలాగే యెప్పుడూ వుంది అంటుంది. దానినే స్వతః ప్రమాణం అంటుంది. చార్వాకుడు కూడా జగత్తు స్వభావసిద్ధమైనది అంటాడు.
పాశ్చాత్య తత్వవేత్త కాంట్ మానవ అనుభవానికీ జగత్తుకీ మధ్య అగాధం వుంది అంటాడు. మానవ యింద్రియాలూ మనోబుద్ధులూ గ్రహించే ప్రపంచం ఫెనామినల్. కానీ సత్య ప్రపంచం తనలో తానుగా వుంది. థింగ్ ఇన్ సెట్ సెల్ఫ్‌గా వుంది. దాన్ని మానవుడు గ్రహించలేడు. యీ సిద్ధాంతాన్ని ఐన్ రేండ్ స్వభావ తర్కంతో తిరస్కరిస్తుంది.
భౌతిక ప్రపంచం అబ్సల్యూట్ (పరమం), మెటాఫిజికల్ (ఆదిభౌతికం) దానికి మూలాన్ని వెతకడం మూర్కత్వం. అది అదిగా వుంది అంతే. అలాగే భౌతిక ప్రపంచానికీ మానవ అనుభవానికీ గల సంబంధం కూడా స్వయం సిద్ధమైనది, స్వాభావికమైనది. మానవ అనుభవాన్ని, పదార్ధాన్ని అణువులుగా చూసే వైజ్ఞానిక దృక్పథం రద్దు చేయదు. మానవ అనుభవానికి, భౌతిక వాస్తవాన్ని పోటీగా వ్యతిరేక దిశలో నిలపడం తప్పు. అంటే పాదార్థిక ప్రపంచమూ, దాన్ని ప్రతిబింబించే మానవ అనుభవ జ్ఞానమూ వాటికి అవిగా సత్యాలు. ఏదీ మరొకదాన్ని రద్దు చెయ్యదు. పైగా అవి పరమములు- అబ్సల్యూట్. వాటికి కారణాలని మనం అడగకూడదు. అలా అడగడం వల్ల పరమసత్యం వైపు, దైవంవైపు, పరలోకంవైపు ప్రయాణిస్తాం. దానివల్ల మానవుడి ఉనికియే ప్రశ్నార్థకంగా మారుతుంది.
మానవుడి ఉనికి, జ్ఞానం, అలాగే ఆ జ్ఞానానికీ మూలమైన ప్రపంచం ప్రశ్నించరానివి, వాటికి కారణం మనం అడగరాదు. అవి మెటాఫిజికల్, ఆది భౌతికమైనవి, అబ్సల్యూట్. ఈ నిర్ధారణ ద్వారా దేశ కాలాతీతమైన పరమసత్యం, దైవం మానవుడి స్థానాన్ని ఆక్రమించకుండా జాగ్రత్తపడుతుంది ఐన్ రేండ్ (‘ఆబ్జెక్టివిజం’) ఇలా మానవ ఉనికిని తిరుగులేనిదిగా, ప్రశ్నార్థకం కానిది, అభావం చెందనిదిగా స్థాపించాక, మానావ చైతన్యపు ప్రత్యేకతని వివరిస్తుంది ఐన్ రేండి. అదే హేతుబద్ధత. హేతుబద్ధత అంటే, మానవుడు తాను తన ముందున్న అనేకమైన లక్ష్యాలలో వొకదాన్ని ఎంచుకుంటాడు. అదీ హేతుబద్ధత అంటే. ఛాయిస్ – ఎన్నుకునే స్వేచ్ఛ- యిదే మనిషిని జంతువు నుంచి వేరుపరిచింది. అతనికి భవిష్యత్తునీ, లక్ష్యాన్నీ, తద్వారా నాగరికతనీ ఏర్పరిచింది. ఆ హేతుబద్ధతకి మానవుడి చైతన్యానికి అంటే ఇండివిడ్యువల్‌కి సంబంధించినది. ఇదే మనిషికి వొక హోల్- సంపూర్ణతని కూరుస్తుంది.
ఛాయిస్ – ఎన్నిక యిదే హేతుబద్ధతగా ఆధునిక పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థని మలచింది. యిదే పాశ్చాత్య నాగరికతలో, తత్వంలో, మతంలో, సైన్సులో ప్రాధాన్యం వహించింది.
దీనినే స్వేచ్ఛ అన్నారు, ‘ఫ్రీ విల్’ అన్నారు. మనిషి ప్రకృతిలో భగవంతుడి ప్రత్యేక ఎన్నిక, యూదులు ఎన్నుకున్న జాతి, వారి భూమి దైవ వాగ్దత్తం. దేవుడు కొందరిని పాపులుగా, కొందరిని విముక్తులుగా ముందే నిర్ధారించాడు. కాల్వినిజంలోని ప్రీ డిటర్మినిజం ఇదే (ఇది క్రైస్తవ మతసారం).
సైన్సులో డార్విన్ ప్రాకృతిక వర్ణ సిద్ధాంతంలో కూడా కొన్ని జీవులని మనుగడ సాగించడానికి వీలుగా ప్రకృతి ఎన్నుకొంటుంది. ఇదే ఫాసిస్టుల సోషల్ డార్వినిజం సిద్ధాంతానికి దారితీసింది. కొన్ని మానవ జాతులు మాత్రమే మనుగడకి అర్హమైనవనే ఆర్యజాతి సిద్ధాంతానికి యిదే మూలం. డార్వినిజంలోని యీ పార్శ్వాన్ని వ్యతిరేకించాడు మార్క్సు.
హెగెల్, ఆయన శిష్యుడైన మార్క్సు కూడా ఛాయిస్ – ఎన్నికకి ప్రాధాన్యం యిచ్చారు. చారిత్రక క్రమం చైతన్యవంతంగా పోరాడగల ప్రొలెటేరియట్ కార్మిక వర్గాన్ని సృష్టించింది. చరిత్రచే ఎన్నుకోబడిన కార్మిక వర్గమే మానవ సమాజాన్ని విముక్తి చేయగలదు.
ఐన్ రేండ్ కూడా ప్రోడక్టివ్ వర్క్ అనే మార్క్సిస్టు పదాన్నే వాడ్తుంది. కాని అది వ్యక్తి సృజనగా వర్ణిస్తుంది. సమాజం అనే పదాన్ని పక్కనబెడ్తుంది. పారిశ్రామిక పెట్టుబడిదారీ నాగరికతలోకి పూర్తిగా వెళ్లలేని ప్రజల పనులు, వృత్తులు ప్రోడక్టివ్ వర్క్‌గా భావించబడదు. అసలు గ్రామీణులు, రైతులు కూడా ప్రధానమైన ప్రోడక్టివ్ ఫోర్స్‌గా గుర్తించబడరు. వారు చారిత్రకంగా వెనకబడిన వారు. వారు నాగరిక చరిత్రచే ఎన్నుకోబడిన వారు కారు. యింకా ఆహార సేకరణ, వేట దశలో జీవిస్తున్న ప్రజల సంగతి చెప్పేదేముంది? వీరందరూ చైతన్యశీలమైన జనం కాదు. నాగరికత పట్టాలు ఎక్కని వారు. వాళ్లని కూడా నాగరికులే విముక్తి చేయాలి. ప్రోడక్టివ్ ఫోర్స్‌లో భాగం చెయ్యాలి. ఈ మార్క్సిస్టు భావననే వ్యక్తి కేంద్రకంగా మార్చి పెట్టుబడిదారీ సిద్ధాంతంగా మలిచింది ఐన్ రేండ్ .
ఈ ఛాయిస్ – ఎన్నిక అనే భావన సార్త్ర్ లాంటి అస్తిత్వ వాదులనీ వెంటాడింది. ఎన్నుకునే స్వేచ్ఛ బాధ్యతని పెంచి, వ్యక్తిని వేదనకి గురిచేస్తుంది అన్నాడు సార్త్ర్.
అంటే హేతుబద్ధత అంటే ఎన్నిక (ఛాయిస్); దేవుడు, ప్రకృతి, చరిత్ర, వ్యక్తి అన్నీ ఈ ఛాయిస్ – ఎన్నిక అనే శక్తి వల్ల కదులుతాయి. స్వేచ్ఛ అంటే ఎన్నుకునే స్వేచ్ఛ. హేతుబద్ధత అన్నా అదే. విచిత్రం ఏమిటంటే, ప్రీడిటర్మినిజం, ఫేట్ కూడా యీ ఎన్నిక అనే పక్రియ ద్వారానే పనిచేస్తాయి.
ఈ పాశ్చాత్య భావజాలమే ఆధునిక యాంత్రిక నాగరికతనీ, తద్వారా ఆధునిక, మానవుణ్ణీ వ్యక్తినీ సృష్టించాయి.
ఈ అర్ధంలో లోకాయత సిద్ధాంతం కూడా (ఆధునిక) హేతుబద్ధమైనది కాదు. ప్రకృతి పాంచ భౌతికం, దేహమే ఆత్మ అని చార్వాక సిద్ధాంతం. పాశ్చాత్యం ప్రకారం మానవుడు అంటే దేహం కాదు, ఛాయిస్ – ఎన్నిక చేసే చైతన్యమే- మానవుడు అతడే వ్యక్తి. ఈ స్వభావమే మనిషిని జంతువు నుంచి వేరుపరుస్తుంది.
సంస్కృతంలో నర – వానరాలు జంట పదాలు. వానరం అంటే వాలంగల నరుడు. మనిషికీ జంతువుకీ మధ్య విభజన రేఖ గీసే మతం, తత్వం యిక్కడ పుట్టలేదు. అందుకే భారతీయ సంస్కృతినీ, విశ్వాసాలనీ ప్రాకృతికమైనవి అని యీసడించుకున్నాడు మార్క్సు. వైరుధ్యాలమయం అన్నాడు. నిజానికి భారత ఖండ సంస్కృతిలో వైరుధ్యాలు లేవు, ద్వంద్వాలు మాత్రమే వున్నాయి. దానివల్ల జంతువూ మనిషీ సహ జీవనం చేస్తారు కాని, జంతువు నుంచి ప్రకృతి నుంచి పూర్తిగా మనిషి వేరుపడడు. మార్క్సు భాషలో – ప్రకృతిపై సార్వభౌముడైన వ్యక్తి యిక్కడ పుట్టలేదు.
శ్రీశ్రీ మనిషిని సంబోధిస్తూ ‘శరీర పరీవృతుడా’ అని సంబోధిస్తాడు. అంటే ‘శరీరంతో చుట్టుకొనబడిన వాడా’ అంటాడు. దీనిలో తత్వం ఉందంటారు విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి. ఆ తత్వం ఏమిటి? దేహాత్మ వాదమా,-/ అద్వైత వేదాంతమా?
భారతీయ తత్వంలో దేహమే ప్రధానం. స్థూలం ద్వారా సూక్ష్మాన్ని చేరుకోవడం ద్వారా సత్యాన్ని తెలుసుకోగలం అని వేదాంతం బోధిస్తుంది. శరీరంకంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికంటే వీటి అన్నింటికీ చైతన్యాన్నీ ఏకసూత్రతని కూరుస్తున్న ఆత్మ సూక్ష్మమైనవి. ఆ ఆత్మ యీ విశ్వసారం, అదే సత్యం, అదే దైవం. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికీ, వ్యక్తం నుంచి అవ్యక్తానికీ ప్రయాణించాలి. చార్వాకుడు దేహమే ఆత్మ అని ఈ ప్రయాణాన్ని అక్కడితో నిలిపేశాడు అంతే.
ఛాయస్ అనే భావన పాశ్చాత్యతత్వంలో ఎప్పటి నుంచో వుంది. ప్లేటో ప్రకారం భావాలలో పరమభావం- దైవం ఉత్కృష్టం. అరిస్టాటిల్ ప్రకారం మేటర్ నుంచి ఫార్మ్ ద్వారా ప్రపంచం పరిణమిస్తోంది. అత్యంత ఉత్కృష్టమైన ఫార్మ్ – రూపం దేవుడు. హైరార్కీలోకి ప్రయాణం, హైరార్కీ ద్వారా ప్రయాణం అనేదాన్ని గ్రీకు ఫిలాసఫీ స్ధిరపరిచింది. తాత్వికంగా హైరార్కీ స్పష్టంగా సాధ్యమైనపుడే ఛాయిస్ సాధ్యం. అదే పాశ్చాత్య హేతుబద్ధత. అది ప్రాచ్యంలో లేదు.
‘అనంతం’ అనే కాన్సెప్టుని భారత తాత్వికతలో వలే పాశ్చాత్య తాత్వికులు అరిస్టాటిల్ వంటి వారు అంగీకరించలేదు. దానివల్ల ప్రపంచ జ్ఞానాన్ని హైరార్కికల్ పరిణామంగా స్ధిరపరచారు.
మార్క్సిస్టులు చారిత్రక నియతి వాదులుగా విమర్శకి గురయ్యారు. వ్యక్తి స్వేచ్ఛకి, వ్యక్తి ఛాయిస్‌కి కమ్యూనిజం స్థానం యివ్వలేదు అనే విమర్శ వుంది. కానీ వ్యక్తి స్వేచ్ఛని, వ్యక్తి స్వార్ధం స్థాయికి తీసుకువెళ్ళిన ఐన్ రేండ్ ఆ స్వార్ధం సమాజానికి తెచ్చే ముప్పుని పసిగట్టడంలో విఫలమౌతోంది. ఐన్ రేండ్ స్వార్ధాన్ని తాత్వీకరించడానికి ప్రయత్నించిన మేధావి. ఆమె స్వార్ధం అనే దానిలో బంధుప్రీతికి, ఎలాగైనా పైకి ఎగబాకడానికి, విలువల పతనానికి స్థానం లేదు. వ్యక్తి సృజనాత్మకతకి ప్రాధాన్యం ఎక్కువ. సమాజం కోసం గుంపుల కోసం వ్యక్తి స్వేచ్ఛని, వ్యక్తి ఎన్నికని బలిపెట్టకూడదు. ఆమె దృష్టిలో యిటువంటి వ్యక్తి స్వేచ్ఛకి అమెరికా స్వర్గధామం. ఆమె పుట్టిన సోవియట్ సోషలిస్టు సమాజానికి పూర్తి భిన్నమైన స్వేచ్ఛాయుతమైన దేశంగా పెట్టుబడిదారీ వ్యవస్ధనీ, అమెరికానీ నిలుపుతుంది ఐన్ రేండ్ . యిక్కడే ఆమె గొంతుకి ముల్లులా అడ్డుపడ్తుంది నల్లజాతి పట్ల వివక్ష. (వర్చ్యూ ఆఫ్ సెల్ఫిష్‌నెస్)
అమెరికా స్వేచ్ఛా సమాజమైతే, పెట్టుబడిదారీ వ్యవస్ధ స్వేచ్ఛతో కూడిన వ్యక్తి ఆవిర్భావానికి దోహదం చేస్తాయి అనుకుంటే, నల్లజాతి వివక్ష ఎందుకు వుంది? అది పాత సమాజపు అవశేషం అంటుంది ఐన్ రేండ్ . యీ అభిప్రాయం మన యిండియన్ కమ్యూనిస్టుల దళితవాదుల దృక్పథానికి దగ్గరగానే వుంది. సకల వివక్షలూ లోపాలకి మూలం భారతీయ గతంలో సంస్కృతిలో వుంది అంటారు వాళ్లు. బ్రిటిష్ ఆధునికతలతో విముక్తి ప్రారంభమైంది అని భావిస్తారు.
నల్లజాతి పోరాటాలని సమర్థించదు ఐన్ రేండ్ . కారణం నల్లజాతికి ప్రత్యేక హక్కులు, కోటాలూ కావాలనడం వ్యక్తి వాదానికి దెబ్బ, అది బానిస వ్యవస్ధని కాపాడిన నియంతృత్వ గత వ్యవస్ధకి, రేసిజానికీ ప్రతిధ్వని అంటుంది ఐన్ రేండ్ . నల్లజాతి వారు కూడా వ్యక్తి హక్కులు గురించే మాట్లాడాలి అంటుంది. ఆస్తి హక్కుని ప్రధానమైన వ్యక్తి హక్కుగా భావించే ఐన్ రేండ్ , జీవించే హక్కుకే దిక్కులేని నల్లవారిని ‘వ్యక్తులు’గా పోరాడాలనడం ఎలా సాధ్యం? వ్యక్తిత్వమే హరించబడిన చోట ‘వ్యక్తులు’గా ఎలా స్పందిస్తారు?
అసలు ఐన్ రేండ్ లోనే తాత్విక వైరుధ్యం వుంది. మెటీరియలిస్టుల్నీ ఐడియాలజిస్టుల్నీ కూడా ఆమె నిరాకరిస్తుంది. వ్యక్తి చైతన్యానికి మెటీరియలిస్టులు ప్రాధాన్యం యివ్వలేదు అంటుంది. జంతువు నుంచి మనిషి వేరుపడడంలో, పర్సెప్షన్ స్థాయి నుంచి కాన్సెప్టు ఫార్మింగ్‌లోకి ఎదగటం ప్రధానమైనది అని ఆమె అంటుంది. కానీ జాతి, సమాజం వంటి కాన్సెప్టుల భౌతిక వాస్తవికతని తిరస్కరిస్తుంది. అలా తిరస్కరించి ‘వ్యక్తి’ని నిలపాలని చూస్తుంది. యిది వైరుధ్యం.
యిదే పద్ధతిని ఇండియాలో అగ్రవర్ణాలు కూడా అవలంభించడం గమనార్హం. రిజర్వేషన్ల ప్రసక్తి వచ్చినపుడల్లా వ్యక్తి ప్రతిభకి ప్రాధాన్యం యివ్వాలని వాదిస్తారు. మరోవైపు దళితులు కులాన్నే ప్రధానం చేసి, వ్యక్తిని సంపూర్ణంగా తిరస్కరిస్తారు. యిదే తర్కంతో అగ్రవర్ణాలలో వుండే జ్ఞానాన్ని కూడా తిరస్కరిస్తారు. సంస్కృత భాషలోని సారస్వతాన్నీ, తత్వాన్నీ, శాస్త్రాలనీ కనీసం పరిశీలించకుండా తిరస్కరించే వైఖరి యిటువంటిదే. కంచ ఐలయ్యగారిలో యిదే కనిపిస్తుంది. బ్రిటీషు వారు వచ్చేంత వరకూ భారతీయులకి గణితం తెలీదు అని కంచ ఐలయ్య రాస్తారు. నిజానికి గణితంలో భారత ఖండ ఆవిష్కరణలు మరువరానివి.
అంటే వాస్తవాన్ని తెలుసుకోవడానికే కాదు, నిరాకరించడానికి కూడా కాన్సెప్టులు ఉపయోగిస్తాయి. అంటే కాన్సెప్టులు స్టీరియో టైప్సుగా ఘనీభవించగలవు. వ్యక్తి, సమాజం, కులం, జాతి అనే కాన్సెప్టులు కూడా యిలాంటి పాత్రనే నిర్వర్తించాయి.
యిలా పరస్పర విరుద్ధమైన వాదాలన్నీ సిద్ధాంతాలన్నీ ఘనీభవించి పరస్పర ఘర్షణలకి దారితీశాయి. తెలుగు సాహిత్యంలోనూ అదే జరిగింది. త్రిపురనేని మధుసూదనరావు లాంటి కమ్యూనిస్టులు విశ్వనాథ సత్యనారాయణ గారిని తీవ్రంగా నిందించారు. తిరోగామి అన్నారు. కానీ ఆ కమ్యూనిస్టుల తీవ్రవాదాన్ని బలంగా ఎదిరించి నిలిచినది విశ్వనాథకన్నా చెట్టు కవి ఇస్మాయిల్.
ఇస్మాయిల్ సామాజికతకీ, ఉద్యమాలకి ప్రాధాన్యం యిచ్చే కవులు కవులే కాదు అన్నాడు. వారు వ్యక్తి అనుభూతికి, అది ఉత్తమ కవిత్వంగా మారే దారికి అడ్డంగా నిలిచారని తీవ్రంగా విరుచుకుపడ్డారు. సమాజం, విముక్తి అనే పదాల్ని ఉచ్ఛరించక పోయినప్పటికీ యిటువంటి కవులకి సామాజిక ప్రాధాన్యం వుంది. అది ప్రకృతితో మనిషిని తిరిగి ముడి వెయ్యడం. చెట్టుకి ప్రాధాన్యం యివ్వడం ద్వారా మనిషి అహంభావానికి చెక్ పెట్టగలిగాడు. ప్రాధాన్యతల ఎన్నికనే స్వేచ్ఛగా నిర్వచించిన ఆధునిక పాశ్చాత్య తర్కంలోని డొల్లతనాన్ని బయటపెట్టాడు ఇస్మాయిల్.
పాశ్చాత్య కార్యకారణ సంబంధాన్ని తిరస్కరిస్తాడు తత్వవేత్త నీషే. కాజ్ అండ్ ఎఫెక్ట్ – అనే సిద్ధాంతంలోని లోపాన్ని బయటపెడ్తాడు నీషే. సుఖం కోసం, ఆనందం కోసం ధర్మబద్ధంగా, నీతిగా జీవించాలని మతం బోధిస్తుంది. కానీ ఆనందంకన్నా ధర్మం మరేదీ లేదు. పర్యవసానాన్నిబట్టి కారణాన్ని నిర్ధారించడం లోనే లోపం వుంది అంటాడు నీషే. ఆధునిక పాశ్చాత్య తర్కం కార్యం కోసం కారణాన్ని, గమ్యం కోసం గమనాన్ని, లక్ష్యం కోసం జీవితాన్నీ నియంత్రిస్తుంది. యిదే కాజ్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతం. ఇది ఛాయిస్ – ఎంపికకి ప్రాధాన్యం యిస్తుంది. యీ ఛాయిస్ అనేది ఏదో వొకదానికి ప్రాధాన్యం యిచ్చి, మిగిలిన వాటిని మరుగుపరిచి బలహీనపరిచి చెలరేగుతుంది. దీనినుంచే వ్యక్తి – సమాజం, ఇహం – పరం, ప్రకృతి – మనిషి … ఇలా వైరుధ్యాలని ఏర్పరిచి ఒకదానిపైన మరొకదాని ఆధిపత్యాన్ని నిలపడమే ‘ఛాయిస్’.
తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ‘ఛాయిస్ లెస్ అవేర్‌నెస్ ‘గురించి మాట్లాడ్తాడు. గాంధీ గమ్యం కాదు మార్గమే ముఖ్యం అంటాడు. ఛాయిస్ అనేది మనని మనం ప్రకృతి నుంచి, సమాజం నుంచి, విశ్వం నుంచి పూర్తి విడిగా పెడగా వున్నపుడే సాధ్యం. యిదే ఆధునిక వ్యక్తి భావనకి మూలం. వ్యక్తిత్వ వికాసం అనేది దీని వల్గర్ వ్యక్తీకరణ. యిదొక ఆధునిక మూఢ విశ్వాసం.
దీనికి మూలాలు పాశ్చాత్య సంస్కృతిలోనే వున్నాయి. రోమన్ సామ్రాజ్యం పౌరుల నుంచి బానిసలని వేరు పరిచింది. ఈ పౌరులే స్వతంత్ర వ్యక్తులు. దేవుని ముందు అందరూ సమానులే అనే వాగ్ధానం ద్వారా మానవులందరినీ వ్యక్తులు అంది క్రైస్తవం. దేవుడు, దేవుని రాజ్యం అనే భావాలని బలపరిచింది. ఒక ట్రాన్సండెంటల్ – లోకాతీతమైన కారణం వుంది, మనిషి మనిషిగా వుండడానికి, వ్యక్తిగా వుండడానికి. అది స్వభావ సిద్ధం కాదు. యిదే దేవుని రాజ్యం వచ్చి మనుషుల ఆత్మలని ఉద్ధరిస్తుందనే మత భావనకి మూలం.
ఆధునిక యుగంలో ఈ రాజ్య భావన బలపడింది. స్పిరిట్ (పరమభావం) రాజ్య రూపంలో వ్యక్తమౌతుందని భావించాడు హెగెల్. ఆధునిక ప్రష్యన్ సామ్రాజ్యం చరిత్రలోనే స్వేచ్ఛాయుతులైన వ్యక్తులు ఆవిర్భావానికి మూలమైంది అని భావించాడు. ప్రాచ్య దేశాలు నియంతృత్వంలో అజ్ఞానంలో మగ్గుతున్నాయి అని ఆనాటి పాశ్చాత్యులెందరో భావించారు. మార్క్సు ఇండియా గురించి అభిప్రాయాలలో యిదే వ్యక్తమైంది.
అంటే వ్యక్తి అంటే యూరోపియన్. అతడు చరిత్ర క్రమంలో ఏర్పడిన ఆధునిక రాజ్యం యొక్క ఉత్పత్తి. అందుకే మార్క్సు యూరప్‌లోనే విప్లవాలు సిద్ధిస్తాయి అని వాదించాడు. చారిత్రక వ్యక్తి అనే భావననే నిరాకరించాడు అనార్కిస్టు బకూనిన్. సహజమైన మానవ స్వభావం గురించి మాట్లాడాడు. యూరప్ పెట్టుబడిదారీ స్వార్థ వ్యవస్ధ వల్ల కలుషితమైపోయిందని, కనుక తూర్పులోనే విప్లవాలు, తిరుగుబాట్లు సిద్ధిస్తాయి అని వాదించాడు. అదే నిజమైంది. వెనకబడిన చైనా, రష్యాలలోనే తిరుగుబాట్లు వచ్చాయి.
రష్యాలో జన్మించిన ఐన్ రేండ్ వ్యక్తిని వెతుక్కుంటూ అమెరికా వెళ్ళింది. పెట్టుబడిదారీ అమెరికాని వ్యక్తి వికాసానికి చిహ్నంగా నిలిపింది. రష్యన్, టొటాలిటేరియనిజానికి అమెరికా విరుగుడు అంది. (అనార్కిస్టు బకూనిన్ కూడా రష్యన్ కావడం విశేషం)
ఐన్ రేండ్ వ్యక్తి వికాసానికి రాజ్యం ప్రధానం అనే భావాన్ని విడిచిపెట్టలేదు. సొంత ఆస్తి అనేది వ్యక్తి ఆవిర్భావానికి మూలం. పెట్టుబడిదారీ స్వంత ఆస్తి అనేది వ్యక్తి సృజనాత్మక శక్తికి వ్యక్తీకరణ. రాజ్యం విధి ఆస్తిహక్కునీ, శాంతి భద్రతలనీ కాపాడడం మాత్రమే. ఉత్పత్తి కార్యకలాపాలలో రాజ్యం ప్రమేయం ఉండరాదు అంది. అయితే ఈ భావజాలానికి పునాది రాజ్యమే.
కమ్యూనిస్టు, కేపిటలిస్టులు యిద్దరూ రాజ్యం యొక్క ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఇద్దరూ వ్యక్తి వికాసానికి పెట్టుబడిదారీ వ్యవస్ధ, ఆధునిక రాజ్యం మూలాలు అని భావించారు. ఆ రెండూ వికసించని ప్రాంతాలని చీకటిలో మగ్గిపోతున్నవిగా, నియంతృత్వంలో అణగారుతున్నవిగా నిర్ధారించారు.
ప్రాచ్య దృష్టి కోణం వేరు. స్థల కాలాలలో వ్యక్తిని ప్రకృతి నుంచి సమాజం నుంచి వేరుపరచే దృక్పథం ఎప్పుడూ భారతీయ తత్వంలో లేదు. అలాగే మనిషిలో సమానత్వానికి మూలం మనిషికంటే అతీతంగా ట్రాన్సెండెంటల్‌గా లేదు. అందువల్ల అది చేరుకోవలసిన గమ్యం కాదు. లక్ష్యం కాదు. అన్ని జీవులలోనూ ఆత్మ వుంది. ఆ ఆత్మ విశ్వవ్యాప్తమైన చైతన్య సముద్రంలో బిందువు. అందువల్ల సమానత్వం స్వతస్సిద్ధం. ఏకత్వం స్వభావ సిద్ధం.
చార్వాక దృష్టితో చూసినా అన్ని జీవులూ, వాటి దేహాలు పంచభూతాత్మకమైనవి. శంకరాచార్య వ్రాసిన పంచీకరణం అనే గ్రంథం యీ పంచభూతాల కలయికని తాత్వీకరిస్తుంది. పదార్థ దృష్టితో చూసినా, ఆత్మ దృష్టితో చూసినా సమానత్వం సహజం, స్వభావ సిద్ధం.
మరి మనుషుల మధ్య విభేదాలు ఎందుకు వున్నాయి. హెచ్చుతగ్గులు ఎందుకు వున్నాయి. జీవి స్వభావంలోనే స్వతస్సిద్ధంగా వున్న సమానత్వాన్నీ, సమదృష్టినీ అజ్ఞానం కప్పివేసింది. ఆ అజ్ఞానం తొలగిపోతే జీవి స్వభావం సమానత్వమే. సంఘర్షణ లేని స్ధితి; అదే కైవల్యం, మోక్షం.
పై నుంచి రుద్దబడిన దేవుడు కానీ, దేవుని రాజ్యం కాని కాదు, ఆత్మ సామ్రాజ్యం అవసరం. అందుకే రాజుకన్న రాజ్యంకన్నా సాధుసన్యాసులకి ప్రాధాన్యం పెరిగింది. తాత్వికులకి ప్రాధాన్యం వుంది. వారే రుషులు.
అందుకే మనిషిలో పవిత్రం – అపవిత్రం, ప్రధానం – అప్రధానం, శరీరం – ఆత్మ అనే ద్వంద్వాలు అతిక్రమించదగినివి. అంటే ఛాయిస్ – ఎన్నిక కాదు. ఛాయిస్ లెస్ అవేర్‌నెస్ ముఖ్యం. అప్పుడే అన్నమయ్య గీతాల లోని శృంగారమూ- ఆధ్యాత్మికత అర్థం అవుతాయి. పాశ్చాత్యం డెకార్టె అనే తత్వవేత్త దేహాత్మల వైరుధ్యంలో చిక్కుకుపోయింది. ఈ వేర్పాటే ఒకదానికంటే మరొకటి ముఖ్యమనే ఛాయిస్ ని తీసుకువచ్చింది. యీ వేర్పాటు దృక్పథమే సమాజం నుంచి ప్రకృతి నుంచి వ్యక్తిని వేరుపరిచింది.
అయితే యిప్పుడు మనం కూడా పాశ్చాత్య దృక్పథానికే ప్రాధాన్యం యిస్తున్నాం. రాజ్యంని సర్వ సమస్యలకీ పరిష్కారంగా భావిస్తున్నాం. కార్మిక రాజ్యం, దళిత రాజ్యం… యిలా రాజ్యాధికారం వల్లే సకల సమస్యలూ పరిష్కారమై సమానత్వం సిద్ధిస్తుందనే నమ్మకంతో జీవిస్తున్నాం. నిజానికి అన్నిరకాల రాజ్యాలూ కమ్యూనిస్టు రాజ్యంతో సహా హెచ్చుతగ్గుల్నీ అసమానతలనీ పోషించి వాటి ఆధారంగానే బతికి బట్టకడ్తాయి. కానీ మనం రాజ్యం విముక్తిదాయకం అని భావిస్తాం. సమాజం పట్ల అపనమ్మకం రాజ్యంపైన గాఢ నమ్మకం ఆధునికత లక్షణాలు.
నిజానికి ఆధునిక సమాజాలు వ్యక్తిని విశ్వసించవు. వ్యక్తిగతమైన మార్పుని విశ్వసించవు. సమాజాన్ని గంపగుత్తగా రాజ్యం శాసించడమేకాదు, మారుస్తుంది అని నమ్ముతాయి. హేతుబద్ధత సైన్సులో సాధారణీకరణని తీసుకువచ్చినట్లే, హేతుబద్ధ దృక్పథం సరైన రాజ్యాన్ని సృష్టించి విముక్తివైపు మార్గం చూపుతుంది అని ఆధునికుల విశ్వాసం. అంటే అంతిమంగా వ్యక్తివాదం రాజ్యానికి రాజ్యనియంతృత్వానికి దారితీస్తుంది.
నేటి ప్రభుత్వాలని వ్యక్తులు ఎన్నుకోవడం వ్యక్తి స్వేచ్ఛని సృష్టిస్తుంది అని భావిస్తాం. యీ నమ్మకం గుంపు మనస్తత్వానికి మూలమైంది. ఎన్నుకొనే వాళ్ళ మనస్సులని కంట్రోల్ చెయ్యగలిగితే చాలునని పాలకులు గ్రహించారు. ప్రజల దగ్గర వ్యక్తుల దగ్గర రిమోట్ వుంటుందని ప్రజాస్వామ్యవాదులు నమ్మబలికారు. అసలు తామే రిమోట్ చేత్తో పట్టుకొంటే, సమాజ యంత్రాన్ని మొత్తంగా శాసించవచ్చునని చివరికి పాలకులే గ్రహించారు.
అసలు విషయం – మనం యంత్రయుగంలో జీవిస్తున్నాం. యంత్ర నాగరికత మనని మలచింది. మొదట మనిషినీ అతని దేహాన్నీ యంత్రంగా భావించారు. తర్వాత సమాజాన్నే యంత్రంగా భావించారు. ఆ యాంత్రిక సూత్రాలు తెలుసుకొంటే చాలు సోషల్ ఇంజనీరింగ్ సులభ సాధ్యమని భావించారు. వ్యక్తి, సమాజంల గురించి మన భావనని యంత్రం శాసించింది, చివరికి రాజ్యాన్ని కూడా.
మనం ఏమనుకొంటామంటే – టెక్నాలజీని మనిషి సృష్టించాడు. మనిషి టెక్నాలజీని బానిసగా శాసిస్తాడు. మొదట ఆధునిక మానవుడు యిలాగే భావించాడు. ప్రకృతి తనకి బానిస అని. అలాగే యంత్రం కూడా బానిస అనుకొంటున్నాడు. కానీ మనిషిని యంత్రం శాసిస్తే? వ్యక్తి అనేవాడు మిగులుతాడా? అతని స్వతంత్రం అనేది మిగులుతుందా? అతనికి ‘ఛాయిస్’ ఉంటుందా? అతని ఏజన్సీ కొనసాగుతుందా?
మనిషి సృష్టించిన టెక్నాలజీ మనిషిని శాసించగలదు. మనిషి సృష్టించిన డబ్బు మనిషిని శాసించడం లేదా? అందుకే మనిషి ఎప్పుడూ కొత్త టెక్నాలజీని చూసి భయపడ్తాడు. సందేహిస్తాడు. ఇలాగే మాట నుంచి చేతిరాతకి పరిణామం జరిగినపుడు మనుషులు సందేహించారు. మాటలాగా, లేఖనం ప్రత్యక్షం కాదు. దాని వ్యాప్తి కూడా ఎక్కువ. అందుకే అది దెయ్యంలా అదృశ్య శక్తి మార్మిక శక్తి కలదిగా భావించారు. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. ప్రచురణ అనేది జ్ఞాన వ్యాప్తినీ సమాచార వ్యాప్తినీ సులభం చేసింది, అందరికీ చేరువ చేసింది. అయితే అది స్పాంటేనిటీని తగ్గించి క్రమబద్ధత, హేతుబద్ధతకీ ప్రాధాన్యత యిచ్చింది. ఎడిటింగ్ అనే పక్రియ వచ్చింది. ఇక్కడ ఆలోచనల ఛాయిస్ కి ప్రాధాన్యం పెరిగింది. యీ సందర్భంలోనే అబ్రహాం లింకన్‌లా ఎంతో హేతుబద్ధంగా, క్రమబద్ధంగా ఉపన్యసించి, ప్రజల ఆలోచనలని ప్రభావితం చేసే నాయకులు వచ్చారు. వీరు అధ్యయనశీలురు. ప్రచురణ రంగపు కాలం వారు. తర్వాతి దశ టీ.వీ, ఇంటర్నెట్. యిక్కడితో హేతుబద్ధమైన ఆలోచనకి స్థానం ఖాళీ అయింది. షో బిజినెస్ మొదలైంది. హేతుబద్ధత కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానమైంది. వార్తలు కూడా వినోదంగా మారాయి. మితిమీరిన సమాచారం ఆలోచించే అవకాశాన్ని దూరం చేసింది. కాస్త ‘మౌనానికీ ధ్యానానికీ’ అవకాశం లేదు. మనుషులు ఆలోచించడం మానేశారు. చిన్న చిన్న టిప్స్‌గా స్టీరియోటైప్స్‌ని అందించి గుంపు సమ్మతిని సంపాదించడం రాజ్యానికి సులభమైంది. (ఈ పరిణామాన్ని అమెరికా మేధావి నీల్ పోస్ట్‌మేన్ ఎప్పుడో గుర్తించారు)
మనిషి మళ్లీ తిరోగమించాడు. అక్షరం నుంచి దృశ్యం, శ్రవ్యం వైపుకి జరిగాడు. కానీ దీనిలో సహజత్వం లేదు, స్పాంటేనిటీ లేదు. ఎన్నిక అసలే లేదు. వ్యక్తి స్వాతంత్య్రం ఊసే లేదు. సమాజంతో ప్రకృతితో అసలు సంబంధం లేదు. గుంపులని నియంత్రించే వొక యంత్రాంగం మనుషుల బుర్రల్ని శాసిస్తోంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా ఎన్నికలు మారిపోయాయి. ప్రజా ప్రతినిధులు హేతుబద్ధంగా అధ్యయనశీలంగా వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మానేసి, రకరకాల వేషధారణతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజలని రంజింప చేసే వల్గర్ ఆర్టిస్టులుగా అవతరించారు.
తెలుగు సాహిత్యకారులకి అధ్యయనం లేదు అని సాహిత్య విమర్శకులు కె.బాలగోపాల్ అన్నారు. కాని అధ్యయనం అవసరం ముగిసిపోయింది. బాలగోపాల్‌ని మించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్ప మాట అన్నాడు – అన్ని యిజాలూ ముగిసిపోయాయి, టూరిజం మాత్రమే మిగిలింది.
‘అధ్యయనం’ అంటే ఏది అధ్యయనం చెయ్యాలి అనేది తెలుగు మేధావుల సమస్య. వారి దృష్టిలో గతమంతా చీకటి. గతం లేనిదే వర్తమానం లేదు. అందువల్ల అధ్యయనం ఉద్యమాలకి అడ్డంకి. ఉద్యమాలకి నినాదాలు కావాలి కాని, అధ్యయనం కాదు. అధ్యయనం మన అభిప్రాయాలని నిరంతరం మార్చుకోవలసిన అవసరాన్ని కల్పిస్తుంది. అందుకే కమ్యూనిస్టు దేశాలలో కూడా అధ్యయనాన్ని నియంత్రించే వారు. యిక్కడి ఉద్యమ పెద్దలు అదే చేశారు. అందుకే ఫ్రాయిడ్ పేరు ఉచ్ఛరించడం, స్టాలిన్‌కి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా బాలగోపాల్‌లాంటి వారి విషయంలో దారితప్పడంగా భావించబడింది.
దళిత కవి పైడి తెరేష్‌బాబు ‘నేనూ – నా జిత్తులమారి ప్రపంచమూ’ అనే కవితలో పాశ్చాత్య సామ్రాజ్యవాదాన్ని, స్థానిక సంస్కృతుల విధ్వంసాన్నీ మాట్లాడితే, దళిత కవులు పట్టించుకోలేదు. ఎందుకంటే సంస్కృతి, స్థానికత అంటే వారి దృష్టిలో గాఢాంధకారం మాత్రమే.
అధ్యయనాన్ని నియంత్రించడం అనే స్థాయి నుంచి, అధ్యయనం అవసరం లేదు అనే స్థాయికి మన నాగరికత చేరింది. కమ్యూనిస్టు దేశాలు అధ్యయనంపై పరిమితులు విధించాయి. సిలబస్‌ని నిర్దేశించాయి. ఉద్యమకారులు దానినే అనుసరించారు. కానీ నేటి సామ్రాజ్యవాదం అధ్యయనానికి అవకాశం లేకుండా చేసింది. ఆసక్తి లేకుండా చేసింది.
ఫేస్‌బుక్కులూ, ట్విట్టర్లు ఈ దళిత బహుజనులకీ గొప్ప అవకాశం అని వాదించే వారు ఉన్నారు. ‘అన్నా.. భేష్… సూపర్బ్’ అనే గుంపులని పోగు చేసుకుంటే చాలు దళిత పవన్ కళ్యాణ్‌గా మారవచ్చు. ఫేస్‌బుక్ సెలబ్రిటీ కావచ్చు. హిందుత్వ రాజ్యం బలపడడానికి యీ ఫేస్‌బుక్కులూ, ట్విట్టర్లే మూలం. హిందుత్వవాదులు గొప్ప సాంస్కృతిక మేధావులని సృష్టించలేదు. జనాభిప్రాయాన్ని మలచే యింటర్నెట్ అబద్ధపు ప్రచారాన్ని ఆశ్రయించారు. ఈ టెక్నాలజీకి ముందు యింతగా హిందుత్వ ఫాసిజం బలపడలేదు.
నేడు బెంగాల్ ఆలోచించినదే రేపు ఇండియా ఆలోచిస్తుంది అని ఒక ప్రసిద్ధమైన మాట. నేడు తెలుగువాళ్ళు పతనమైన స్థితికే రేపు ప్రపంచం పతనమౌతుంది. క్రమేపీ తెలుగు వాళ్లు ఆధునికతకి తోకలుగా మారారు. స్వంత ప్రత్యేకతలని కాపాడుకుంటూనే ముందుకు సాగవచ్చు. దక్షిణాదిన కేరళ, కర్ణాటక, తమిళనాడు సినిమాలు, నాటకాలు, యితర సాంస్కృతిక రూపాలు అన్నిటిలోనూ తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతున్నాయి. వలస ఆధునికతని కీర్తించిన గురజాడ వారసులైన తెలుగు వారు డబ్బే పరమార్ధంగా సాగుతున్నారు. అందుకోసం అనుకరణని ఆశ్రయిస్తున్నారు. వీరి సినిమాలు అందుకు ప్రత్యక్ష తార్కాణం. (ధనం పంటలు పండవలెనోయ్ – గురజాడ). సాంకేతిక అభివృద్ధి చివరికి వ్యక్తిని మింగేస్తుందా! యిదీ అసలు ప్రశ్న.
ఆధునికత సృష్టించిన వ్యక్తినీ, మానవుడినీ ఆధునిక సాంకేతికత మటుమాయం చేస్తుంది. ఆ పక్రియ యిప్పటికే మొదలైంది అంటాడు ఇజ్రాయల్ సామాజిక శాస్త్రవేత్త యువాల్ హరారి. యంత్ర నాగరికత ఆధునిక వ్యక్తినీ, మానవుడినీ సృష్టించింది. దేవుడిని ఖాళీ చేసింది. ఇప్పుడు మనిషినీ, వ్యక్తినీ యంత్రం ఖాళీ చేస్తుంది.
మరో సందర్భంలో దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘వర్ణనీయ వస్తువే తిరగబడి వర్ణిస్తే…’ అని రాస్తాడు. ఇప్పుడు మనం ప్రశ్నించాల్సింది – మనిషి వాడుకుంటున్న యంత్రం మనిషినే వాడుకోవడం మొదలుపెడితే. ఈ పక్రియ యిప్పటికే మొదలైంది. మీ గురించి మీ భార్యకంటే గూగుల్‌కి ఎక్కువ తెలుసు. మీరు పుస్తకం చదవడం కాదు, మిమ్మల్ని పుస్తకం చదవడం మొదలుపెట్టింది. అందుకే మిత్రుడిలా మీ కిండిల్ మీరు చదవవలసిన పుస్తకాలని సూచిస్తుంది. ఆప్తవాక్యాన్ని యంత్ర వాక్యం స్థానభ్రంశం చేసింది.
యంత్రం ప్రాణం లేనిది. చైతన్యం లేనిది అని మీరు అనవచ్చు. కాన్షియస్ – చైతన్యం, ఇంటెలిజెన్స్, తెలివి (మేధ) కలిసి నడిచే కాలం వెళ్లిపోయింది. చైతన్యంపై జెండా ఎగురవేసింది తెలివి. రేపు డ్రైవర్‌లెస్ కారు మీకంటే బాగా డ్రైవ్ చేయగలదు. ఎందుకంటే భావోద్వేగాలు లేకపోవడం అనేది వొక ప్లస్ పాయింటు. భావోద్వేగాలు మన ఏకాగ్రతకి భంగకరం.
పోస్ట్ హ్యూమన్ ఎరాలోకి మనం ప్రవేశిస్తున్నాం అంటాడు యువాల్ హరారి. అంటే ఆధునిక హేతుబద్ధత సృష్టించిన మానవుడు – ‘వ్యక్తి’ నశించి, డేటా మాత్రమే మిగుల్తుంది. యిప్పటికీ డేటాగా మారనిదేదీ విలువలేనిదే. మీరు మీ ప్రేయసితో కలసి నయాగరా జలపాతం దగ్గరకు వెళ్లారనుకోండి. దాన్ని ఫొటోతీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేసి డేటాగా మార్చినపుడే దానికి అర్థం సిద్ధిస్తుంది.
యిప్పటికే సమీప పరిసరాలతోనూ, ప్రకృతితోనూ సంబంధం తెగిపోయి, పరిసర జ్ఞానం నశించి అన్నిటికీ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పైన ఆధారపడుతున్న మనిషి (వ్యక్తి) తానే డేటాగా మిగిలిపోవడంతో యంత్రానికీ మనిషికీ దూరం చెరిగిపోవచ్చు. రోబోలు దాడి చెయ్యడం వల్ల కాదు, తానే రోబోగా మారిపోవడం వల్ల వ్యక్తి అంతరిస్తాడు. బౌద్ధం బోధించిన అనాత్మవాదం యిలా క్షీణ స్ధితిలో ప్రత్యక్షం కావొచ్చు.
ప్రకృతిని విధ్వంసం చేయడం ద్వారా కరోనా వైరస్ లాంటివి తమ నెలవులు తప్పి విజృంభిస్తున్నాయి అంటున్నారు పర్యావరణ శాస్త్రజ్ఞులు. ఇటువంటి ముప్పులు పర్యావరణ స్పృహని పెంచడం బదులు విద్యా రంగంతో సహా సర్వత్రా డిజిటలైజేషన్, పెరుగుతోంది. డిజిటల్ చదువూ, డిజిటల్ ఆటలు, పాటలు మొత్తం ప్రకృతితో సమాజంతో వేరు పడిన వ్యక్తివాదం ఉనికికే శాపంగా పరిణమించింది.
ఈ పరిణామాన్ని ముందుగానే పసిగట్టిన విశ్వనాథ సత్యనారాయణ వంటి వారిని మనం తిరోగమన వాదులుగా ముద్ర వేశాం. ‘పల్లె కన్నీరు పెడుతుందో…’ అని పాడిన కవి గోరటి వెంకన్నని చూసి, హేతువాదపు వికృత ముఖంతో వెటకారంగా నవ్వాం. పట్టణాలకి వలసపోవడమే అభివృద్ధి అని సూత్రీకరించాం కానీ, మన ప్రవృత్తి వైరస్‌ల వలసకి కారణం అవుతుందని గుర్తించలేకపోయాం.
వైరస్సులకి మందు కనుక్కోవచ్చు కాని, మానవ హేతుబుద్ధికి విరుగుడు లేదు. అదీ అసలు వైరస్.
(మిత్రులు నరహరితో సంభాషణ ఈ వ్యాస రచనకి ఎంతో ఉపకరించింది)
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
చాలా బావుంది సర్.మనకు నిజంగా మనం ఎక్కడికి వెల్తున్నామో,ఎవరి మనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాము.మనం మనకు నచ్చినట్టుగా,స్వేచ్చగా జీవిస్తున్నాం అనుకుంటున్నాం గానీ మన ఆలోచనలు, మన తిండి, ప్రతి ఒక్కటి ఎవరో కంట్రోల్ చేస్తున్నారు.
The title of the article is quite intriguing. his question, “whether there is an individual who can articulate independent decision and independent expression in modern Telugu literature” is too intriguing as I am thinking that Rajeswari, Dayanidhi, Padma (Manchi-Chedu), Parvati (Edi Nijam) and many others are individuals from Telugu novels. If author of the above article believes that these characters from Telugu novels are not individuals, I would like to know reasons for that. He talks about “modern capitalism.” It is faulty expression as there is no pre-modern capitalism. He argues that people used to live in communities before the entry of capitalism. Then what were those communities in pre-capitalist Hindustan? Were not they caste-communities? Modern societies have an idea that all individuals are equal . This idea came into existence with the French Revolution of 1789. According to historians like Sanjay Subramanyam and many other intellectuals, equating modernity and capitalism is problematic. I believe that I put forward some problematic dimensions of this article.
సార్… పుస్తకం గా వేయించాలి… చాలా బావుంది… అభినందనలు…
[…] […]