1
ఈ నాలుగు మాటలు రాయడానికి ముందు అసలు సాయిపద్మ నిజంగా లేదన్న విషయం నేను నమ్మాలి కదా! అదే కష్టంగా వుంది. ఈ చేదు నిజానికి నా నమ్మకంతో పని వుందా లేదా అన్నది వేరే విషయం కానీ- ఇది నా ఆలోచనల్లో వొక భాగం కావడానికి చాలా సమయమే పట్టవచ్చు. ఇంకా వారం కూడా కాలేదు, “సోల్ స్పేస్” లో సాయిపద్మ స్వరం వినిపిస్తూనే వుంది. ఈమధ్య కాలంలో ముసుగుల్లేని ఇంత బలమైన గొంతుక వినడం అరుదే. తన స్పష్టమైన ఆలోచనలాగానే నిక్కచ్చిగా మాట్లాడే గొంతుక ఆమెది.
ఎంత కాదన్నా, ఇది వ్యక్తిగతమే అవుతుంది. సాయిపద్మ తో నా పరిచయం పదేళ్లపైనే. వొక పుట్టిన రోజు నాడు ఫేస్ బుక్ ఇన్బాక్స్ లో పలకరింతతో మొదలయింది. తను రాసింది:
మీ పుట్టినరోజని కవిత రాకపోయినా రాద్దామని కూర్చున్నానా కొన్ని కావేరి నది వొడ్డున కుప్ప వేసిన దుఖాలు మరో గుప్పెడు ప్రవాసీ వొంటరితనాలు విడిపించుకున్న చేతివేళ్ళ సున్నితత్వాలూ వోకరూ వోకరూ గా వెళ్ళిపోతున్న గుల్దస్తా జ్ఞాపకాలు వశం కాక మిగులుతున్న సూఫీ తత్వాలూ అన్నీ వొకేసారి యాదికొచ్చి అన్ని ఆలోచనలూ, చేతివేళ్ళ మధ్య ఇసుకలా జారిపోయాయి శూన్యం అబ్బురపరచింది.. The thin line between poetry, poet, poetry curator ship ఎంత పెద్ద వివశత్వమో కదా .. ఇవన్నీ చేసే శక్తి, స్థలం, కాలం మీకు దొరకాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు ~~సాయి పద్మ
ఆ మెసేజ్ చివరి వాక్యం ఇక్కడ ముఖ్యం. ఆ వాక్యంలో ఆమె బతుకు పుస్తకమే వుంది. అది ఆమె సొంత వాక్యం కాకపోవచ్చు. ఎవరినుంచో అరువు తెచ్చుకున్నదే- కానీ, సాయిపద్మని define చేసిన వాక్యమే అది.
“Remember there’s no such thing as a small act of kindness. Every act creates a ripple with no logical end.
– Scott Adams
ఈ స్కాట్ ఆడమ్స్ ఎవరో నాకు తెలియక్కర్లేదు. కానీ, ఇందులోంచి సాయిపద్మ కృషి అంతా కనిపిస్తోంది నాకు. ఆ కొద్దిపాటి కరుణే ముఖ్యం అని ఆమె అనుకున్నది. ఆ తరవాత తాను ఏం రాసినా – కవిత్వమూ, కథలూ, ఫేస్ బుక్ పోస్టులూ- వాటన్నీటిలో తన విశ్వాసాలూ, జీవన లక్ష్యాలూ, కక్ష్య తప్పని ఆత్మవిశ్వాసమూ, ఆత్మ గౌరవమే నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా తను రాసే వాక్యాల తీవ్రత మనల్ని వొక పట్టాన వదలదు.
“అందరూ గాయపడుతూనే ఉన్నాం.. అద్రుష్టవశాత్తూ కొందరి గాయాలు శారీరకం..”
“మనలో కలుపుకున్నా సన్నిహితం కాని బంధాలు చుట్టూ అందరూ తామరాకు మీద నీటి బొట్లే కలిసీ కలవకుండా, మాట్లాడీ మాట్లాడకుండా సముద్రాల్ని, తనలో కలుపుకున్న మనుషులు కొందరైతే కళ్ళల్లోనే కదలనివ్వకుండా కాపరం ఉంచేవాళ్ళు మరికొందరు గుప్పెడు పసుపుపూలు నలిగిపోయినా చెప్పే స్వాగతం మరిన్ని గరుకుతేలి ఎండిన కొండల్లో మొలకెత్తిన తలూపే తడి తడి గరికె మొలకలూ అన్నీ చూస్తూ అనుభవించే అదృష్టం ఎందులోనూ మమేకం కాలేనప్పుడే పెళుసు మాటలూ…”
“సాహిత్య ప్రపంచం గాభరాగా వుంది, ఏమైనా రాయడానికి!”
“నేనా ..రాస్తూనే ఉన్నాను.. కొన్నిసార్లు కదలలేని నిస్సత్తువ లో గాలిలో గీతలు.. నీళ్ళ జాడలలో వెతుక్కొనే కళా ఖండాలు అవి రాతల్లో ఎలా ఉంటాయోనన్న పిచ్చి ఊహలు నీటి ఏనుగుల అంబారీల కలవరింతలు దూరమైపోతున్న మరణపు పలవరింతలు…”
“కవిత్వాన్ని .. అకవిత్వం కాకపోతే ఎవరు కుశలం అడుగుతారు”
2
ఇక సారంగలో సాయిపద్మ రచనల గురించి ఎన్నయినా చెప్పవచ్చు. 2015 లో “ఫత్వాలను ధిక్కరించిన ఆమె” అనే శీర్షికతో పాకిస్తానీ ఫెమినిష్టు కవయిత్రి ఫహ్మిదా రియాజ్ గురించి తన వ్యాసం వెలువడింది. ఆ వ్యాసంలో తను అంటుంది:
“ఆమెని , ఆమె కవిత్వాన్ని చదవాలి .. వాళ్లకి నచ్చిన ఉటోపియా నుండి , నిజంలోకి నిర్భయంగా నడవాలి .. కనీసం ప్రయత్నించాలి.. ఫహ్మీదా కోసం కాదు.. మన మానసిక ఆరోగ్యం కోసం..!!
ఇదే సాయిపద్మ సాహిత్య పఠనం రహస్యం. వొక తీవ్రమైన తపనలోంచి తదేక దీక్షలాంటి reflexivity ని తను సాహిత్యంలో వెతుక్కుంది. నిత్య జీవితంలో క్షణం తీరిక లేని పనుల్లో సాహిత్యం తనకొక నిలువద్దం.
అరుణ్ సాగర్ కి రాసిన నివాళి వ్యాసంలో అంటుంది:
అందరు కవులూ జీవితాన్ని బ్రతికేస్తారు, తడిగా కొందరు, పొడి పొడి మాటల వొంటరితనాల్లో మరికొందరు. కానీ, వొకరో, ఇద్దరో.. జీవితాన్ని, సెలబ్రేట్ చేస్తారు.
ఇవన్నీ ఆయా రచయితల గురించి చెప్పిన వాక్యాలని ఎప్పుడూ అనిపించదు. వొక ఉత్తమ అక్షర ప్రేమికురాలు చదువుతూ చదువుతూ ఆ చదివిన వాటిని తన మనసులో యెలా లీనం చేసుకుంటుందో సాయిపద్మ చెప్తుంది.
3
నిన్ననో మొన్ననో మా ఇంట్లో సాయిపద్మ పేరు వినిపించింది. యేదో వొక సాహిత్య సభ యేర్పాటు గురించి మాట్లాడుతూ కల్పన “సాయిపద్మని తప్పకుండా పిలవాలి. తను బాగా స్పష్టంగా మాట్లాడుతుంది,” అంటోంది. కానీ, ఇంతలోనే ఈ వార్త…నిజమో అబద్ధమో తెలియని స్థితిలో కల్పన కి చెప్పాను.
ఇది నిజం కాదని తరవాతయినా చెప్పగలనా?!
*
సారంగలో సాయిపద్మ రచనలు:
గొప్ప జ్ఞాపక నివాళి!
అద్భుతంగా సాయి పద్మ వ్యక్తిత్వాన్ని ఆవిష్కకరించారు అఫ్సర్. విశిష్టమైన విలక్షణమైన వ్యక్తి త్వం తనది. ఎన్నో కలలు ఎన్నో ఆశయాలు అసంపూర్ణంగా వదిలి వెళ్లింది.
సమాజ కళ్యాణం కోసం జీవితాన్ని అంకితం చేసిన సాయి పద్మ గారికి అఫ్సర్ అక్షర నివాళి బావుంది. ఆమె ఆశయాలను కొనసాగించడమే సముచిత నివాళి.
సాయి పద్మ గారికి నివాళి…….
పద్మ మన మనసులని ఆక్రమించిన ఓ సౌరభం..ఈ సుమగంథం..ఈ వెలితీ మనల్ని వదలవు అఫ్సర్‌జీ..
వైజాగ్ లో 2016 లొ స్నేహమయ్యింది. చాలా మంచి వ్యక్తిత్వం
మరీ క్లోజ్ ఫ్రెండ్ కాదు, అట్లాగని దూరమూ కాదు. ఏ సంవత్సరానికో ఓసారి వాట్సాప్ పలకరింపు, ఓ నాలుగు మాటలు, పది నవ్వులు… ఇట్లా ఉండేది.
ఓ పదినిమిషాల పాటు స్తబ్దుగా అయిపోయాను, పాత చాట్స్ చదువుకున్నను. మళ్లీ ఇక ఎప్పటికీ “ఎలా ఉన్నావ్?” అని వచ్చే పలకరింపు ఉండదన్న నిట్టూర్పు… 🙁
పర్సనల్ ఆమె నాకు తెలియదు. రచనల ద్వారా కొంత, ఆచరణ ద్వారా కొంత తెలుసు. తన శారీరక బలహీనతని అధిగమించడం ఒకటే కాదు, దాన్ని దాచుకోకుండానే తన శక్తానంతా ఇతరుల కోసం ధారపోయడం చిన్న విషయేమేమి కాదు. ఇలాంటి వ్యక్తిత్వాల వల్ల సమాజంలో మంచి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మీ అక్షరాలు ఆ కోణం నుంచి ఆమెకు నివాళి అర్పించాయి.