మేఘాల దుప్పటిని
మెల్లగా తోసేస్తూ
కళ్ళు నులుముకుని
బద్దకంగా లేస్తున్న
వెలుగు రాజుకి
తనకంటే ముందుగా లేచి
డాబాపై హాయిగా విహరిస్తున్న
నేనంటే ఎందుకింత ఈర్ష్య!
శర వేగంతో కురిపించిన
తన కిరణాల పరంపర
వాడిగా మరింత వేడిగా!
నేనేం తక్కువ తిన్నానా!!
సూర్య తాపాన్ని తప్పుకుంటూ
రెండు మెట్ల దొంతరలను దిగి
మా ఇంటి ముందు
నడక కొనసాగించానో లేదో
క్షణాల్లో నన్ను తన తీవ్ర కిరణ జాలంలో
బంధిస్తూ…
నేనేమో మరో అంచె కిందికి
మా పెరట్లోకి జారుకుంటూ…
నువ్వడిగింది
మూడడుగులే.
అదృష్టవశాత్తూ మా స్థలం
మరో అంచె కిందికి విస్తరించలేదు.
నీ వైష్ణవమాయకు
మాడిపోవడానికి
నేను బలిని కాదయ్యా!!!
2
నా నుడి
పంది
తననూ, మన పరిసరాలనూ
ఎంత శుభ్రంగా ఉంచుతుందో
తెలుసుకుంటే
పంది బురద మెచ్చు
పన్నీరు మెచ్చునా అన్న
నానుడి ఎంత దారుణమైన
ఆరోపణో తెలుస్తుంది.
నందిని కీర్తించే మన సంస్కృతి
ఆది వరాహ రూపంలో విశ్వాన్ని రక్షించిన
నీ ఔన్నత్యాన్ని మరిచినట్లుంది.
నందిని పందిని చేయడం కాదిప్పుడు!
పంది జన్యు కణాలతో
మానవ కణాలకున్న సామ్యాన్ని
గుర్తెరిగి నడుచుకోవాలిప్పుడు.
(సుక్క పందికి సాహిత్య గౌరవాన్నిచ్చిన కేశవరెడ్డిని తలచుకుంటూ)
*
విశ్వాన్ని రక్షించిన నీ ఔన్నత్యాన్ని మరిచినట్లుంది