ఈసారి సంచికలో వైదిక ఆచారాల బ్యాక్ డ్రాప్ లో జరిగిన ‘వైతరణికీవల’, ‘భోక్త’ అనే రెండు కథల్ని పరిశీలిద్దాం.
తల్లి పోయింది, ఎవర్ని బాధపెట్టకుండా హాయిగా మంచిరోజు చూసుకుని వెళ్ళిపోయింది. ప్రశాంతమైన దీర్ఘ నిద్రలో పడుకున్నట్లున్నామెను చూస్తే కాసేపట్లో లేచి ‘ఇందిరా కాస్త టీ పట్టుకురా తల్లి’ అని పిలుస్తుందని అనిపిస్తోంది. ఎంత శుభ్రంగా ఉండేది ఆవిడ, ఓపికున్న లేకపోయినా రెండుపూటలా స్నానం చేయవలసిందే. తెల్లగా పలచగా ఉల్లిపొర కాగితంలా ఉంటుంది ఆవిడ చర్మం. గట్టిగా రాస్తే చిరిగిపోతుందేమో అనిపించేంత పలచటి ముడతలు. తలుచుకుంటుంటే శర్మ కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
దహన సంస్కారాలు, కర్మ కాండలు మాట్లాడడంకోసం బ్రాహ్మలు వచ్చారు. బాబాయ్ తో కలిసి వాళ్లతో మాట్లాడుతుండగా, కాలుస్తున్న సిగరెట్ పారేసి తమ వైపే ఓ వ్యక్తి రావడం చూసాడు శర్మ. మాసిపోయిన లుంగీ, వెలిసిపోయిన చొక్కా, నాలుగురోజుల తెల్ల గెడ్డం, ముఖం నిండా సూదితో గుచ్చినట్లున్న సన్నటి బెజ్జాలు, గాజు కాయల లాంటి కళ్ళు. అతనికి 50 నుంచి 150 వరకు ఎంత వయసైనా ఉంటుంది అనిపించింది. ఎముకలకు అంటుకుపోయిన చర్మం మీద నరంలా వేలాడుతోంది అతని యజ్ఞోపవీతం. స్మశానంలో దగ్గిరుండి జరిపించే కార్యక్రమం, అస్థిసంచయం కూడా జరిపే బ్రాహ్మడు అతనే అని తెలిసింది, అతని పేరు రామం. కేవలం మృత దేహాలనే చూడ్డానికి అలవాటు పడ్డట్టున్న అతని కళ్ళు శర్మని చాల ఇబ్బంది పెట్టాయి. కాళ్ళకింద నీడ చూసుకుంటూ నడుస్తున్న అతను చావుకు అతీతం అయ్యి నిర్లిప్తంగా నడుస్తున్నాడు. మాట్లాడవలసినవన్నీ మాట్లాడి బ్రాహ్మలు వెళ్లిపోయారు.
స్మశానం దగ్గర ఏర్పాట్లు చూడ్డానికి బయలుదేరిన బాబాయ్ తో శర్మ కూడా వెళ్ళాడు. స్మశానం లోపలి వెళ్ళడానికి బార్ల తీసిన చెక్కగేటు నిరంతరం చేతులు చాచి చావుని ఆహ్వానిస్తున్నట్టు ఉంది. ఆలా చూస్తూ ఉండగా హఠాత్తుగా పరిగెడుతూ వచ్చిన మూడు పందుల్ని చూసి నిర్ఘాంత పోయాడు శర్మ. శవాలు కూడా భరించలేని వాతావరణం. గాలితో సంబంధం లేకుండా వచ్చే దుర్గంధం శర్మ కడుపుని గుండెల్ని నింపేసింది. దూరంగా చెట్టుకింద ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు తాగుతూ, సిగరెట్లు కలుస్తున్నారు. అంతలో వాచ్ మాన్ అప్పలరాజు వచ్చాడు. అతని మాటలు గుప్పుమన్నాయి. ఏవో బేరాలాడేడు. దహనానికి శుభ్రంగా ఉండే చోటు చూపిస్తాన్నాడు. బలవంతంగా లోపలి నడిచాడు శర్మ. నాలుగు మడతల రుమాలు ఊపిరితిత్తుల మీద దుర్గంధం చేసే దాడిని ఏమి చేయలేక పోతోంది.
లోపలికి నడిచేకొద్దీ కడుపులో తిప్పడం ఎక్కువైంది. మనిషివో, జంతువువో తెలియని ఎముకలు అక్కడక్కడా పచ్చ గడ్డిలో ఎండుతున్నాయి. పగలు పందులు రాత్రి మనుషులు విసర్జించిన గుర్తులు ఎండిపోయి, తప్పించుకు నడవడానికి కూడా వీలు లేకుండా వున్నాయి. దారంతా పగిలిన బీరు సీసాలు, చిన్న చిన్న విస్కీ సీసాలు. శర్మకి కళ్ళు తిరిగినట్లయింది. మొత్తానికి పనులు చూసుకుని తరువాతి కార్యక్రమం కోసం ఇంటికి చేరుకున్నారు.
ఆఖరి స్నానం చేయించి అంద రూ నమస్కారాలు చేసారు. బాదం ఆకులాంటి తల్లిని చేతులమీద తీసుకువచ్చి వెదురు కర్రలమీద పడుకో బెట్టారు. తల్లి పుట్టినరోజుకని కొన్న చీర ఆవిడకి కట్టబెట్టారు. స్మశానం లో ఏంతో ప్రేమతో తల్లికి కొన్న చీర కాటి కాపరి మడిచి లోపల పెట్టుకున్నాడు. కట్టె కాలుతుండగా అతను తాగడానికి పోయాడు, ఈలోపులో ఇంకోడు వచ్చాడు, వాడు మరికొన్ని డబ్బులు తీసుకుని ఆఖరి కార్యక్రమాలు చూస్తున్నాడు. శర్మకి ఎదో దుర్గంధ వలయం ఏర్పడినట్లయింది. మర్నాడు పొద్దున్నే మిగతా కార్యక్రమాలు చేయించడం కోసం రామం స్మశానం కి వచ్చాడు.
వంటిమీద ఆచ్చాదన లేదేమో చుర చుర మంటున్న ఎండలో సన్నగా కాలుతున్నట్లున్నాడు. తుఫాను అలలాగా బలమైన దుర్గంధం శర్మ ని వెనక్కు తోసినట్లైంది. ఉదయాన్నే మనుషులు జంతువులూ తీర్చుకున్న అవసరాలు అతని కళ్ళకు అడ్డంగా తగులుతున్నాయి. నీళ్ల గుంటలో రెండు పందులు విశ్రమిస్తున్నాయి. మరోపక్క ముగ్గురు కుర్రాళ్ళు ఉదయ కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. వాటి మధ్యలో నీళ్లు పోయించి రామం అస్థిసంచయం చేయించాడు. ఓ పక్క దుర్గంధం మరోపక్క కార్యక్రమాలు, వాళ్ళేం చెప్తున్నారో తనేం చేస్తున్నాడో స్పృహ పోయింది శర్మకి. మొత్తానికి అయిందనిపించారు.
శుభ్రంగా స్నానం చేసి కొత్త ఇస్త్రీ చీర కట్టుకుని గుడికి వెళ్లే ముందు ఉన్నట్లున్న తల్లిని ‘వైతరణికీవల’ గట్టు నుంచి సాగనంపాడు శర్మ.
***
నిద్రలోవున్న సోవన్న శాస్త్రి చూస్తే నిన్ననే ప్రాణం పోయినట్లున్నాడు. ఇంచుమించు అరవయ్యేళ్లు అతనికి. కొన్ని నెలలుగా సుస్తీగా వున్నాడు. అన్నం అరగదు. చుక్క మజ్జిగ కూడా కడుపులోకి వెళ్లడం గగనం అయిపోతోంది. దూరం నడవలేడు. ఒంటి ఇటుకతో కట్టిన ఒకటే గది ఇల్లు అది. ముందు నాలుగంగుళాల ఖాళీ స్థలం. తాటాకు దడి, సోవన్నని పూర్తిగా వీధిలో పడేయకుండా నిలబెడుతోంది. రోడ్డుమీదనుంచి చూస్తే ఇల్లు నల్ల కంతలా ఉంటుంది.
సోవన్న, సత్యం, సుబ్రహ్మణ్యం కలిసి చదువుకున్నారు. ముగ్గురికీ చదువు అబ్బలేదు. సుబ్రహ్మణ్యం లక్షాధికారి. సత్యం నాలుగు మంత్రం ముక్కలు నేర్చుకున్నాడు. సోవన్నకి అదీ లేక చావులకి, తిధులకి భోక్తగానే మిగిలిపోయాడు. అడపా దడపా సుబ్రమణ్యమే సోవన్నకి పప్పు బియ్యం పంపి ఆదుకుంటుండేవాడు. సుబ్రహ్మణ్యం పోయి సంవత్సరం అయింది. సోవన్నకి సత్యం ఒక్కడే మిగిలాడు. సత్యమే దగ్గిరుండి సోవన్నని డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్తున్నాడు. మహా ఐతే రెండు నెలలు గడుస్తాయి అన్నాడు డాక్టరు. ఆ ముక్క మిత్రుడు సోవన్నకి చెప్పడానికి సత్యానికి మనసొప్ప లేదు. ‘ఖరీదైన మందులు వాడాలిట, ఆయనే చూసుకుంటాడులే, ఆయనకు అన్నప్రాసన నేనే చేయించా’ అంటూ తేల్చేసాడు సత్యం. రోజూ పొద్దున్న సాయంత్రం వచ్చి స్నేహితుడిని చూసి పోతుండేవాడు సత్యం.
సుబ్రహ్మణ్యం సంవత్సరీకం అని, భోక్తగా రావాలని వాళ్ళ గుమస్తా చెప్పాడు. ఎన్నో సార్లు ఆదుకున్న మిత్రుడికి, భోక్తగా వెళ్లి అతనికి ఇష్టమైన పదార్థాలు తినడం అతని ఋణం తీర్చుకోడమే అనుకున్నాడు సోవన్న. అడ్డుకోడానికి సత్యం కూడా ఊళ్ళో లేడు. భోజనాలు వడ్డించారు. అవపోసన పట్టడంతోనే కడుపులో సుడిగాలిలా తిప్పింది. సుబ్రహ్మణ్యానికి ఇష్టమైన పదార్థాలతో ఆకు కళ కళలాడిపోతోంది. ఆరిపోతున్న చితుకులు గాలికి ఒక్కసారి వెలిగినట్లు సోవన్న కడుపులో ఆకలి అంటుకుంది. కడుపు పెరుగు గారెల సంచి అయిపోయింది. ‘నేను అతను కలిసి స్కూలు కి వెళ్ళేవాళ్ళం’ అని పైకే అనుకున్నాడు. సుబ్రహ్మణ్యం ఆదుకున్నాడు, ‘భోక్త’గా తను ఋణం తీర్చుకున్నాడు. అదే అతని ఆఖరి తిండి.
***
పెద్ద హుక్కా గొట్టంలా త్రేన్చాడు సోవన్న శాస్త్రి. చుక్క మజ్జిగ కూడా కడుపులోకి వెళ్లడం గగనం అయిపోతోంది.
*
రెండు కథలు పరిశీలిద్దాం అన్నారు. ఏదీ పరిశీలన? ఇది పరిచయం, సమీక్ష , విమర్శ కూడా కాదు. ఆ రెండు కథల్ని మీరు మీ మాటల్లో కుదించి(దుర్మార్గం) చెప్పారు అంతే కదా!
ఈ ప్రక్రియ ఈ మధ్య టెల్గూ సాహిత్య లో మొగం మీద పులిపిరి కాయలాగా ఉబ్బింది. అసలు ఇది అవసరమా? ఈ రెండు కథలు ఏ రకం గానూ దొరకని పక్షంలో అవి ఎప్పుడో చదివిన మీరు ‘ఇలా వున్నాయి ఆ రెండు కథలు’ అని సాహిత్య లోకానికి పై విధంగా చెప్పడం సబబు గా వుంటుంది. అంతే తప్ప దొరుకుతున్న కథలని మరుగుజ్జులు(రూపం, సారం) చేసి వదలడం మూల రచయితనీ రచనలనీ ఖూనీ చేయడమే తప్ప ఇంకేమీ కాదని ఈమధ్యే రుజువైంది కదా. మీరు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారేమో ఒకసారి ఆలోచించండి.