సారిక సోఫాలో కూర్చొని పొట్ట మీద ఒక చేయి వేసి, ఇంకో చేత్తో స్కాన్ రిపోర్ట్ పట్టుకుంది. దాని వంకే ఆనందంగా చూస్తోంది.
వైణిక పుట్టిన ఏడేళ్ళ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ. వైణిక పుట్టిన మూడేళ్లకు మళ్లీ ఇంకొకరు పుడితే బాగుంటుంది అనుకున్నారు సారిక, శరత్. కానీ సారిక కన్సీవ్ అవ్వలేదు. వైణిక ఒక్కతే పెరగాలేమో అని కొంచెం బాధపడ్డారు. ఆ తర్వాత దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. దానికి ఇంకో కారణం కెరీర్ గ్రోత్. సారిక ఆఫీసులో చాలా కష్టపడి, ఇష్టపడి పనిచేస్తుంది. దానికి తగ్గట్టే ప్రమోషన్లు, బోనస్లు వస్తుంటాయి. రెండో బిడ్డ లేదే అని బాధపడే టైం దొరకలేదు వాళ్ళకి. మేము ఇద్దరం, మాకు ఒక్కరు అన్నట్టు ముచ్చటైన కుటుంబం వాళ్ళది.
చాన్నాళ్లకు అనుకోకుండా పీరియడ్ మిస్ అయితే, స్ట్రెస్ ఏమో అనుకుంది మొదట. తర్వాత ఎందుకో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే స్కాన్ చేసి విషయం చెప్పారు. సారిక, శరత్‌లకు నమ్మడానికి టైం పట్టింది. ఇంటికి వచ్చాక ఆ రిపోర్ట్ చూస్తుంటే ఆశ్చర్యం ఆనందంగా ఎపుడు మారిందో తెలీలేదు. మనసంతా సంతోషంతో నిండిపోయి అది కళ్ళలోనుంచి బయటికి రాబోతుంటే శరత్ వచ్చి తన కన్నీళ్లను వేలితో తుడిచాడు.
“ఏయ్ పిచ్చీ! ఇంత మంచి టైంలో ఎందుకా ఏడుపు? దీనికోసమేగా చాలా రోజులనించి వెయిట్ చేస్తున్నాం!” అన్నాడు.
“ఏడుపు కాదు శరత్, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. ఎంత ఆఫీస్ పనిలో పడి మర్చిపోయినా, వైణికకి తోడు లేదే అని చాలాసార్లు అనిపించేది. అదొక్కత్తే బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటూ నన్ను, నిన్ను తనతో ఆడమనేది. మనం బిజీగా ఉంటే పాపం దాని మొహం చిన్నబోయేది. తనతో ఆడటానికి ఒక తమ్ముడో, చెల్లో ఉంటే బాగుండును కదా అనిపించేది. పెద్దయ్యాక కూడా మనం అన్నీ పేరెంట్స్‌తో చెప్పుకోలేం కదా! తమ్ముడో, చెల్లెలో ఉంటే వాళ్ళతో చెప్పుకోవచ్చు. అది మనం వైణికకి ఇవ్వలేకపోతున్నాం అనిపించేది” అంది సారిక.
“నిజమే! నేను కూడా చాలాసార్లు అనుకున్నా ఇలానే. నాకు మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి, మా అమ్మానాన్నల బాధ్యతని ఇద్దరం కలిసి పంచుకుంటున్నాం. రేపు మనం పెద్దవాళ్ళమయ్యాక మన భారం మొత్తం మన బుజ్జిపాప మీదే పడుతుందేమో అని చాలా స్ట్రెస్ అనిపించేది”.
“అవును! ఇద్దరుంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు”.
“పోనీలే, ఇప్పటికైనా మన బుజ్జిపాపని కష్టపెట్టక్కర్లేదు మనం!” అన్నాడు శరత్.
“అంటే పుట్టేవాళ్లే మొత్తం చూసుకోవాలా మనల్ని?” అడిగింది సారిక.
“అంతేగా మరి! అమ్మాయి పుడితే ఏమో కానీ, అబ్బాయి పుడితే మాత్రం నా బుజ్జి యువరాణికి సేవలు చేయడానికే వాడు” అల్లరిగా అన్నాడు శరత్.
“ఏం కాదు, పుట్టేవాళ్ళు ఎవరైనా ఇద్దరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉంటే చాలు”.
“అబ్బా! అప్పుడే ఎన్ని ప్లాన్స్ వేస్తున్నాం మనం”.
“ఏం ప్లాన్స్ డాడీ?” అంది వచ్చింది వైణిక అప్పుడే స్కూల్ నుంచి వచ్చి.
తనకి ఇప్పుడే ఏం చెప్పొద్దు అన్నట్టు ఒకరికి ఒకరు కళ్ళతోనే చెప్పుకున్నారు.
“ఏం లేదురా! ఈ వీకెండ్ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్దామా, లేకపోతే నానమ్మ వాళ్ళింటికి వెళ్దామా అని?” అన్నాడు శరత్.
“వాళ్లందర్నీ ఇక్కడే రమ్మను డాడీ..” అంది వైణిక.
ఇది మంచి ఆలోచనే. అందరికీ ఒకేసారి చెప్పొచ్చు అనుకుంటూ, “ఎలారా మా బంగారుతల్లికి ఇంత మంచి ఐడియాస్ వస్తాయి” అని పాపని ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్లిపోయాడు శరత్. రాబోయే మంచి రోజులు తలుచుకుంటూ పుట్టబోయే బిడ్డని కలలో చూసుకోడానికి నిద్రలోకి జారుకుంది సారిక.
వీకెండ్‌లో సారిక అమ్మానాన్న, శరత్ అమ్మానాన్న అందరూ వాళ్లింట్లో లంచ్‌కి కలిశారు. భోజనాలయ్యాక డెసెర్ట్‌కి కేక్ అని చెప్పి, వైణికని కేక్ బాక్స్ తెరవమని చెప్పారు. తెరిచి చూస్తే, కేక్ మీద అందంగా ‘BIG SIS TOBE’ అని రాసి ఉంది. అది చూసి అందరిలోనూ ఆనందం నిండిపోయింది. ఇల్లంతా సంతోషం పరుచుకుంది. వైణికని పట్టుకోవడం ఎవరివల్లా కావడం లేదు. కేరింతలు కొడుతూనే ఉంది. కేక్ తనే సగం తినేసి, మిగిలింది ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి వెళ్ళింది. తనకి తమ్ముడో, చెల్లో రాబోతోందని వాళ్ళతో చెప్పుకోవాలన్న ఆరాటం తనది.
ఇద్దరి అమ్మానాన్నలు సవాలక్ష జాగ్రత్తలు చెప్పి, ఏమైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయమని చెప్పి వెళ్లారు.
ఆ రోజు రాత్రి వైణిక అమ్మ పక్కనే పడుకొని తన పొట్ట మీద చేయి వేసి, “అమ్మా! నీకు తెలుసా? నీ బొజ్జలో బేబీ మన మాటలు వింటుందంట. ఇందాక కేక్ ఇవ్వడానికి వెళ్ళినపుడు ఆద్య వాళ్ళ మమ్మీ చెప్పింది. నేను రోజూ బేబీతో మాట్లాడతా, సరేనా?” అంది.
“సరే బంగారూ! కానీ అప్పుడే వినదమ్మా. ఇంకా కొన్ని రోజులు పోయాక అప్పుడు వింటుంది” అంది సారిక.
“ఏం కాదు. నేను ఇప్పటినుంచి మాట్లాడితే అప్పటికి తనకి అలవాటవుతుంది. నేను రోజూ మాట్లాడతా!” అంది వైణిక.
“సరే..సరే.. ఏం మాట్లాడతావు?”
“ఏదో ఒకటి. స్కూల్ గురించి, ఫ్రెండ్స్ గురించి, నా టాయ్స్ గురించి, ఇంకా..”
“సరే! ఇప్పుడు పడుకో. రేపటి నుంచి మాట్లాడు. ఓకేనా?” అంది సారిక.
“ఓకే! గుడ్ నైట్ మమ్మీ! గుడ్ నైట్ బేబీ” అని సారిక బుగ్గ మీద ఒక ముద్దు, తన పొట్ట మీద ఒక ముద్దు పెట్టేసి పడుకోడానికి వెళ్ళిపోయింది వైణిక.
కాలం పరుగులు మొదలయ్యాయి. వీకెండ్స్ అమ్మ వాళ్ళో, అత్త వాళ్ళో ఎవరో ఒకరు వచ్చి సారికకి నచ్చినవి వండిపెట్టేవారు. లేకపోతే అందరూ కలిసి సరదాగా బయటకి వెళ్ళేవారు. వైణిక అమ్మని వదిలి ఉండట్లేదు. జాగ్రత్తగా చూసుకుంటోంది.
* * *
పన్నెండు వారాలకు డాక్టర్ చెకప్‌కి వెళ్ళినప్పుడు మాములు స్కాన్స్‌తో పాటు ఎన్.టి.స్కాన్(న్యూచల్ ట్రాన్స్‌లూసెన్సీ స్కాన్) చేయించుకోమని డాక్టర్ చెప్పినప్పుడు సారిక, శరత్ కొంచెం కంగారు పడ్డారు. “అది ఇప్పుడు అందరూ చేయిస్తున్నారు. కంగారు పడాల్సిందేమీ లేదు. బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉందో, లేదో తెలుసుకోవడానికి ఈ స్కాన్ పనికొస్తుంది. ఏడేళ్ల తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ కదా, చేయిస్తే మంచిది” అని అనడంతో ఆ స్కాన్ కూడా చేయించారు.
రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ రిపోర్ట్‌తో డాక్టర్ రూమ్ ముందు కూర్చున్న వాళ్ళిద్దరి మొహాలు టెన్షన్‌తో ఉన్నాయి. డాక్టర్ పిలుపుతో రిపోర్ట్ తీసుకొని రూమ్‌లోకి వెళ్లారు.
రిపోర్ట్ చుసిన డాక్టర్ “ఈ రిపోర్ట్ కొంచం అబ్నార్మల్‌గానే ఉంది. డౌన్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయి” అంది. ఆ మాట వినగానే వాళ్ళ కలల ప్రపంచం బీటలు వారడం మొదలైంది. సారిక చేతిని తన చేతిలోకి తీసుకొని, ‘ఏం కాదు’ అన్నట్టు గట్టిగా పట్టుకున్నాడు శరత్.
“అంటే మా బేబీ?” అని డాక్టర్‌ని అడిగాడు.
“డౌన్ సిండ్రోమ్..అంటే ఫిజికల్‌గా నార్మల్‌గానే ఉంటారు. కానీ వీళ్ళ మెంటల్ గ్రోత్ మిగిలిన పిల్లల కన్నా లేటుగా ఉంటుంది. మీరు వినే ఉంటారు, స్పెషల్ చైల్డ్ అని. ఆటిజం అని.. అలా అన్నమాట” అంది డాక్టర్.
“ఎందుకిలా అయ్యింది డాక్టర్? దీన్ని బాగుచేయొచ్చా?” నీరసంగా అడిగింది సారిక.
“డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన పరిస్థితి. అంటే ఒక క్రొమోజోమ్ ఎక్ట్ర్సా ఉంటుంది ఈ పిల్లల్లో. డౌన్ సిండ్రోమ్‌ను నయం చేయడానికి ప్రస్తుతం ఎటువంటి మార్గం లేదు” చెప్పింది డాక్టర్.
“మరిప్పుడు ఏం చేయాలి?” అడిగాడు శరత్.
“మీరు ఆలోచించుకోండి. బేబీ వద్దనుకుంటే అబార్షన్‌కి వెళ్దాం”.
“అబార్షనా?” ఇద్దరూ ఒక్కసారే అరిచారు.
“అవును. ఇలాంటి బేబీస్‌ని పెంచటం చాలా కష్టం. మీరు ఆలోచించుకొని మళ్లీ రండి” అని చెప్పింది డాక్టర్. కలలో నడుస్తున్నట్టు బయటికి వచ్చేసారిద్దరూ.
ఇంటికి రాగానే వైణిక “మమ్మీ! నీ బొజ్జలో బేబీ ఎలా ఉంది? ఫొటో చూపించవా నాకు” అని అడగగానే అంతవరకు లోపలున్న బాధ బయటికొచ్చి, తనను పట్టుకొని ఏడ్చేసింది సారిక. అమ్మకి ఏమైందో తెలీక వైణిక కూడా ఏడవడం మొదలెట్టింది. శరత్ పైకి ధైర్యంగానే ఉన్నట్టు కనిపిస్తున్నా, వాళ్ళిద్దరిని చూడగానే తట్టుకోలేకపోయాడు. ఇద్దరినీ దగ్గరకు తీసుకొని తను కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు ఇంట్లో ఎవరూ భోజనం చేయకుండా పడుకున్నారు.
ఆ వీకెండ్ ఇద్దరి పేరెంట్స్‌ని పిలిచి విషయం చెప్పారు. విన్న వెంటనే వాళ్లు షాక్‌లో ఉండిపోయారు. కాసేపటికి తేరుకొని “వేరే డాక్టర్ ఎవరైనా..” అంటుండగానే, “ఆల్రెడీ సెకండ్, థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాకే మీకు చెప్పాం. ప్రాబ్లెమ్ అయితే ఉంది, సొల్యూషన్ ఏంటో తెలీట్లేదు. అందుకే మిమ్మల్ని అడుగుదామని పిలిచాం” అన్నాడు శరత్.
“ఏం చేస్తాం మరి? దేవుడిచ్చిన దాన్ని అంగీకరించి ముందుకుపోవడమే. మేము కూడా ఉన్నాం కదా, అందరం కలిసి చూసుకుందాంలే, మీరు బాధపడకండి” అన్నారు ఇద్దరి అమ్మానాన్నలు.
“అబార్షన్ గురించి ఆలోచిద్దామా?” అన్న శరత్ మాటలు ఎవరికీ నచ్చలేదు. కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అప్పుడే ఎంత ప్రేమ పెంచుకుందో కానీ, అబార్షన్ అన్న మాటే విని తట్టుకోలేకపోయింది సారిక.
బయట ఆడుకుంటూ ఉన్న వైణిక లోపలికి రావటంతో అందరూ మాటలు ఆపేసారు. వైణిక మాత్రం రోజూలాగే అమ్మ దగ్గరికి వెళ్లి బొజ్జ మీద చేయి పెట్టి తను ఆడుకొని వచ్చిన ఆటలన్నిటి గురించి బేబీతో చెప్తూనే ఉంది. అది చూసి అందరూ అబార్షన్ అన్న మాట మర్చిపోయారు.
ఆ రోజు రాత్రి నిద్రపోకుండా ఆలోచిస్తున్న సారిక దగ్గరికి వచ్చాడు శరత్. “చూడు సారికా! ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను నిన్ను సపోర్ట్ చేస్తాను. నీ నిర్ణయమే ఫైనల్. పిల్లల్ని కనాలా, వద్దా అనేది ఎప్పటికైనా తల్లిదే ఫైనల్ ఛాయిస్ అవ్వాలి. ఇంట్లో మిగిలిన అందరూ తన ఛాయిస్‌కి సపోర్ట్ ఇవ్వాలి. అంతే! ఇంక ఎక్కువ ఆలోచించకు” భరోసా ఇచ్చాడు శరత్.
ఆఫీస్‌కి వెళ్లినా సారిక ఈ విషయం గురించే ఆలోచిస్తోంది. ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతోంది. ఆఫీసులో పని సరిగా చేయలేకపోతోంది. అప్పుడే కొలీగ్ చిత్ర కనిపించింది. చిత్ర తమ్ముడు కూడా ఆటిస్టిక్ కిడ్ అని అప్పుడెప్పుడో చెప్పిన విషయం గుర్తొచ్చింది. చిత్రని సలహా అడగటం మంచిదేమో అనిపించింది.
మెల్లగా తన డెస్క్ దగ్గరికి వెళ్లి, “చిత్రా! నీతో మాట్లాడాలి. కొంచం పర్సనల్. ఎప్పుడు కుదురుతుంది?” అని అడిగింది.
“అర్జెంటా? ఈవెనింగ్ త్వరగా వర్క్ ఫినిష్ చేసేసి, 5 గంటలకు వస్తా. ఓకేనా?” అడిగింది చిత్ర.
“హా! ఓకే! 5 గంటలకి కలుద్దాం” అని చెప్పి తన డెస్క్ దగ్గరికి వచ్చేసింది. టైం ఎప్పుడు అవుతుందా అనుకుంటూ, చిత్ర గురించి ఆలోచిస్తూ కూర్చుంది.
“ఎంత మంచి అమ్మాయి. పనిలో ఎంత కచ్చితంగా ఉంటుందో ఫ్రెండ్స్ విషయంలో కూడా అంతే! ఎవర్నీ త్వరగా దగ్గరికి రానీదు. పర్సనల్ విషయాలు కూడా చాలా దగ్గరి ఫ్రెండ్స్‌కి మాత్రమే చెప్తుంది. ఎవరికి హెల్ప్ కావాలన్నా ముందుండి చేస్తుంది. ఇలాంటి అమ్మాయికి డివోర్స్ అయ్యిందంటే అతనెంత దురదృష్టవంతుడో!” అని ఆలోచిస్తూ ఉండగా సాయంత్రం ఐదయ్యింది.
“ఏంటి సారికా? ఏదో మాట్లాడాలన్నావ్!” అంటూ వచ్చింది చిత్ర.
“అప్పుడే ఐదయ్యిందా?”
“హా..అయ్యిందిలే కానీ, ఏంటి చాలా డల్‌గా కనిపిస్తున్నావ్? ఏమైంది?”
“నీతో చాలా మాట్లాడాలి. పద కేఫ్‌కి వెళ్లి కాఫీ తాగుతూ మాట్లాడదాం”.
ఇద్దరూ కాఫీలు తెచ్చుకొని కూర్చున్నాక చెప్పడం మొదలుపెట్టింది సారిక.
“నిన్ను కొంచెం పర్సనల్ విషయాలు అడుగుతాను. సమాధానం ఇస్తావా?”
“అడుగు సారికా! ఈ ఆఫీస్‌లో నువ్వొక్కదానివే నన్ను జడ్జ్ చేయకుండా నేను చెప్పేది వింటావ్. మిగిలిన అందరూ నేను రూడ్ అని, నా డివోర్స్ ట్యాగ్ చూసి రకరకాలుగా మాట్లాడుతారు. నువ్వొక్కదానివే నన్ను నన్నుగా చూస్తావ్. సరేలే, ఏదో అడగాలన్నావ్. అడుగు”.
“మీ తమ్ముడు ఆటిస్టిక్ కిడ్ కదా, దాని గురించి నువ్వెలా ఫీల్ అవుతావ్?” అడిగింది సారిక.
“దాని గురించా? అదేంటి సడన్‌గా మా తమ్ముడు గురించి అడుగుతున్నావ్? ఎనీ ప్రాబ్లమ్?”
“హా..అలాంటిదే! నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు”.
“వావ్! కంగ్రాచ్యులేషన్స్. బట్, మా తమ్ముడి గురించి అడిగావంటే బేబీకి ఏమైనా ఇష్యూ ఉందా?” అంది చిత్ర.
“హా..అవును! డౌన్ సిండ్రోమ్ ఉందని డాక్టర్స్ అంటున్నారు. అబార్షన్ చేయించుకుంటే మంచిదని సజెస్ చేశారు. చూస్తూ చూస్తూ కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేయడమనే ఆలోచన భరించలేకపోతున్నా. అలా అని తనకి జన్మనిచ్చి ఎలా పెంచాలా అని తలుచుకుంటుంటే వచ్చే బాధ, భయం తట్టుకోలేకపోతున్నా. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలీట్లేదు. అందుకే నిన్ను సలహా అడుగుదామని రమ్మని చెప్పా” మొత్తం చెప్పేసింది సారిక. తను చెప్తున్నది వింటూ ఉంది చిత్ర.
“మీ పేరెంట్స్ తనని ఎలా పెంచారు? ఏమైనా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తే బాగయ్యిందా? తను అలా వేరేగా ఉన్నాడని ఎప్పుడు గమనించారు? మీ పేరెంట్స్ చాలా స్ట్రగుల్ అయ్యుంటారు కదా! సారీ.. అన్నీ ఒక్కసారే అడుగుతున్నానని ఏమీ అనుకోకు. మీ పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేసారో తెలిస్తే మాకేమైనా క్లారిటీ వస్తుందేమోనని అడుగుతున్నా!” అంది సారిక.
“వెయిట్.. వెయిట్. మెల్లిగా అన్నిటికీ సమాధానం చెప్తా కానీ, ఒకటి చెప్పు. నీకు ఆల్రెడీ ఒక పాప ఉంది కదా?” అంది చిత్ర.
“హా.. వైణిక. ఏడేళ్లు తనకి. బేబీ కోసం చాలా వెయిట్ చేస్తోంది. అబార్షన్ వద్దు అనుకోడానికి తను కూడా ఒక మెయిన్ రీసన్. పాపం, రోజూ ఎన్ని కబుర్లు చెప్తుందో పొట్టలో ఉన్న బేబీకి. ఇప్పుడు బేబీ ఉండదని తెలిస్తే తను..” అని కళ్ళల్లో నీళ్లతో ఇంకేం చెప్పలేక ఆపేసింది సారిక.
“రిలాక్స్ సారికా! కంట్రోల్ చేసుకో. నేను చెప్పేది ఓపిగ్గా విను. తర్వాత ఒక డెసిషన్ తీసుకో. నన్ను అడిగావ్ కదా, మా పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేసారని. ఏ పేరెంట్స్ అయినా పుట్టిన బిడ్డ ఎలా ఉన్నా, ఏదైనా అవకరం ఉన్నా ఆ బిడ్డని అలానే ప్రేమించగలరు. కానీ ఆ బిడ్డ తోబుట్టువుల గురించి ఎప్పుడైనా ఆలోచించావా?”
“అంటే?”
“వెల్ సిబ్లింగ్ సిండ్రోమ్ అనే పేరు ఎప్పుడైనా విన్నావా?” అంది చిత్ర. కాస్త ఆలోచించి, లేదని చెప్పింది సారిక.
“ఐతే విను. వెల్ సిబ్లింగ్ సిండ్రోమ్ అంటే స్పెషల్ నీడ్స్ పిల్లల తోబుట్టువులు, వారి ఆలోచనలు, అనుభవాలు. మొత్తంగా అది వాళ్ళ జర్నీ అనుకో. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఎప్పుడైనా గమనించావా? వాళ్ళు చాలావరకు మొండిగా, లేకపోతే ఇంట్రావర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్లకు కావాల్సినంత ప్రేమ తల్లిదండ్రుల నుంచి పొందలేక అలా తయారవుతారు. నేను కూడా ఒకప్పుడు అలానే ఉండేదాన్ని” అంది చిత్ర. ఆశ్చర్యంగా తనవైపు చూసింది చిత్ర.
“అవును! మా అమ్మ పొట్టలో బేబీ ఉందని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డా. నేను కూడా వైణికలానే ఒక తమ్ముడో, చెల్లో పుడితే వాళ్ళతో మంచిగా ఆడుకోవచ్చని అనుకునేదాన్ని. అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యిందని తెలిసాక తమ్ముడు పుట్టి ఇంటికొచ్చేవరకు గుమ్మం దగ్గరే తిండి, నిద్ర అన్నీ! అమ్మ తమ్ముణ్ని తీసుకొని ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మని చుట్టేసి తమ్ముడిని ఇచ్చేవరకు ఏడ్చాను తెల్సా! స్కూల్ నుంచి ఇంటికొచ్చాక ఆడుకోడానికి బయటికి వెళ్లేదాన్ని కాదు. వాడి ఉయ్యాల పక్కనే కూర్చుని హోంవర్క్ చేసుకునేదాన్ని. వాడు మేలుకొని ఉన్నప్పుడు మా స్కూల్ కబుర్లు చెప్పేదాన్ని. నిద్రపోతుంటే వాడి వైపే చూస్తూ వీడెప్పుడు పెద్దవుతాడో, నాతో ఎప్పుడు ఆడుకుంటాడో అని ఆలోచిస్తూ వుండేదాన్ని. వాడు లేచి ఏడిస్తే ఉయ్యాల ఊపుతూ నోటికి వచ్చిన పాటలేవో పాడుతూ నిద్రపుచ్చేదాన్ని.
పుట్టిన కొన్ని నెలల వరకు బానే ఉన్నాడు. కానీ సహజంగా జరిగే ఎదుగుదల లేకపోయింది. బోర్లా పడటం, పాకటం, నడవటం, మాటలు అన్నీ లేట్‌గానే జరిగాయి. అందరు పిల్లలలో ఉండే యాక్టివ్‌నెస్ వాడిలో లేదు. 11 నెలలకి కూర్చోవడం, 18 నెలలకి పాకడం, రెండో ఏడు వచ్చాక నడవటం, ఐదేళ్లు వచ్చాక కూడా మాట్లాడకపోవడం, తన పేరు పిలిస్తే పలకకపోవడం.. ఇవన్నీ చూసాక మా పేరెంట్స్‌కి అనుమానం వచ్చింది. పెద్ద హాస్పిటల్‌లో చూపిస్తే డౌన్ సిండ్రోమ్ అని చెప్పారు.
అప్పట్లో అదేంటో పెద్దగా అవగాహన లేదు మాకు. కానీ ఇంటికొచ్చాక అమ్మ, నాన్న బాధగా ఉండటం చూసి తమ్ముడికి ఏదో పెద్ద జబ్బే వచ్చిందనుకొని బాగా ఏడ్చా. రాను రాను ఇంట్లో అమ్మ, నాన్న వాడిని ఎక్కువ పట్టించుకోవడంతో సహజంగానే నాకు వాడి మీద కోపం వచ్చేది. రెండో బిడ్డ వచ్చిన మొదట్లో మొదటి బిడ్డ మీద శ్రద్ధ తగ్గుతుంది. కానీ ఇక్కడ వాడి సమస్య వలన ఇంకా ఎక్కువ టైం వాడికి ఇవ్వాల్సి రావడంతో నాతో మా పేరెంట్స్ గడిపే సమయం చాలా తగ్గిపోయింది. దానికితోడు ఇంటికి వచ్చిన అమ్మమ్మ, నానమ్మలు వాడిని పట్టుకొని ఏడుస్తూ నన్ను పట్టించుకోకపోవడం, చుట్టాల జాలిచూపులు, స్కూల్లో ఫ్రెండ్స్ “మీ తమ్ముడికి పిచ్చంటగా” అని గేలి చేయటం చూసి నా చిన్ని బుర్ర తట్టుకోలేకపోయేది. ఎవరికి చెప్పాలో, ఎవర్ని అడగాలో తెలిసేది కాదు.
అలాంటి రోజుల్లోనే ఒకసారి మా స్కూల్ డే జరిగింది. నేను డ్యాన్స్ బాగా చేస్తానని మా టీచర్ ఒక డ్యాన్స్ నేర్పింది. ఆ డ్యాన్స్ కోసం అమ్మ చీర ఒకటి తీసుకురమ్మని చెప్పింది. నాకోసం మంచి చీర ఒకటి వెతికి మరీ ఇచ్చింది అమ్మ. స్కూలుకి వెళ్తూ అమ్మ, నాన్నకి మరీ మరీ చెప్పి వెళ్ళా త్వరగా నా డ్యాన్స్ చూడ్డానికి రమ్మని.
ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. మా టీచర్ నాకు చీర కట్టి రెడీ చేసింది. స్టేజీ మీదకి వెళ్లి కిందకి చూస్తే అమ్మా, నాన్న కనపడలేదు. వెనక ఎక్కడైనా ఉన్నారేమో అని చూస్తూనే డాన్స్ చేశా. అందరూ చప్పట్లు కొట్టారు. డ్యాన్స్ ఐపోయాక స్టేజీ దిగి వెళ్లి స్కూల్ మొత్తం వెతికా, ఎక్కడా అమ్మ, నాన్న కనపడలేదు. ఏడుపొచ్చేసింది. స్టేజీ మీద నా డ్యాన్స్‌కి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసారు. ఏడుపు మొహంతో వెళ్లి తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసుంది.
పక్కింటి ఆంటీ వచ్చి “మీ తమ్ముడికి ఒంట్లో బాలేదని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు మీ అమ్మ, నాన్న” అని చెప్పి తాళం ఇచ్చేసి వెళ్ళింది. ఇంట్లోకి వచ్చి ఏడుస్తూ పడుకున్నా. కాసేపటికి తమ్ముణ్ని ఎత్తుకొని అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళు ఇంట్లోకి రాగానే వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా ‘వాడిని బయట పారేసి రండి. వాడు ఇంట్లో వద్దు. వాడి వల్లే ఇవాళ మీరు నా స్కూల్ ప్రోగ్రాంకి రాలేదు. నన్ను పట్టించుకోవట్లేదు. వాడు వద్దు మన ఇంట్లో. బయట పారేసేయ్ అమ్మా!’ అని గట్టిగా ఏడ్చా. నాకు నచ్చచెప్పడానికి మా నాన్న ఎంత ప్రయత్నించినా వినిపించుకోలేదు. ‘వీడు చచ్చిపోతే బాగుండు’ అన్నా కోపంలో. వెంటనే మా నాన్న నా చెంప పగలగొట్టారు. ఆ తర్వాత నెలకే నన్ను హాస్టల్లో వేశారు.
అమ్మానాన్నలకి దూరంగా నేను హాస్టల్‌కి రావటానికి వాడే కారణమని వాడి మీద ద్వేషం పెంచుకున్నా. ఎప్పుడైనా హాలిడేస్‌లో ఇంటికి వెళ్లినా వాడి గది వైపు కూడా వెళ్లేదాన్ని కాదు. పాపం! వాడు నన్ను చూడగానే అమాయకమైన నవ్వు నవ్వేవాడు. ఆ నవ్వు చూస్తే మొదట జాలి కలిగినా, తర్వాత నా కోపమే గెలిచేది.
హాస్టల్లో కూడా ఎవరితో పెద్దగా కలిసేదాన్ని కాదు. ఎప్పుడు దిగులుగా ఓ మూల కూర్చొని ఉండేదాన్ని. నన్ను అలానే వదిలేస్తే ఏమయ్యేదాన్నో కానీ, మా సీత టీచర్ వల్ల ఇవాళ ఇలా ఉన్నాను” అని ఆపింది చిత్ర. అప్పటిదాకా తను చెప్పింది వింటున్న సారిక తర్వాత ఏం జరిగిందన్న ఆసక్తితో ముందుకు ఒంగింది. చిత్ర మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది.
“సీత టీచర్ అందర్లాగా నన్ను కోప్పడలేదు, వదిలేయలేదు. దగ్గరకు తీసుకుంది. మా అమ్మ దగ్గర కోల్పోయిందేదో తన దగ్గర దొరికినట్టు ఫీలయ్యాను. తనని అలానే హత్తుకొని చాలా ఏడ్చాను. తను నన్ను ఏడవనిచ్చింది. మెల్లిగా అన్ని సంగతులు తెలుసుకొని నాకు అర్థమయ్యేలా చెప్పింది. డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, దానివల్ల పిల్లల్లో ఎలాంటి లోపాలు ఉంటాయని వివరించింది. అలాంటి పిల్లల్ని చూసి కోపం తెచ్చుకోకూడదని, దయగా ఉండాలని నేర్పింది. అలాంటి పిల్లలకి థెరపీస్, మందులు ఉంటాయని, వాటి వల్ల వాళ్ళు మొత్తం మారకపోయినా కొంచెం మెరుగవుతారని చెప్పింది. ఇవన్నీ విన్న నాకు ఎంత తప్పు చేసానో అర్థమయ్యింది.
ఆ సమ్మర్ హాలిడేస్‌లో ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మానాన్నలు నాలో మార్పు చూసి చాలా ఆనందపడ్డారు. నేను మా తమ్ముణ్ని పట్టుకొని చాలాసేపు అలానే ఉండిపోయాను. తనని కోప్పడ్డా తిరిగి నవ్వే వాడిని చూసి తెలీకుండానే ఇష్టపడటం మొదలుపెట్టాను.
నేను హాస్టల్లో ఉన్న రోజుల్లో అంత గమనించలేదు కానీ, అమ్మ, నాన్న దిగులుతో సగం అయిపోయారు. అమ్మ అయితే వాడు బాగవ్వడం కోసం గుళ్ళు గోపురాలు అంటూ ఎవరేం చెప్తే అది చేస్తోంది. తమ్ముడు పుట్టేవరకు అమ్మ టీచర్ ఉద్యోగం చేసేది. తనకి ఎంత ఇష్టమో జాబ్ అంటే. కానీ ఇపుడు తమ్ముణ్ని చూసుకోవడమే తన ఫుల్ టైం జాబ్ అయిపోయింది. నాన్న కూడా వీడి మందులకు, నా హాస్టల్ ఫీజుకి సతమతం అయిపోవడం చూసి నేను అక్కడే గవర్నమెంట్ స్కూల్‌లో చేరతానని చెప్పా.
సీత టీచర్ వల్ల నేను మళ్లీ మామూలు చిత్రని అయిపోయా. స్కూల్‌కి వెళ్లడం, ఇంటికొచ్చాక అమ్మకి సాయం చేయటం, తమ్ముడికి ఇంట్లోనే బేసిక్ థెరపీస్ చేయించడం, చదువుకోవడం.. ఇలా రోజులు గడిచిపోయాయి. చూస్తుండగానే ఇంటర్, ఎంసెట్ అయిపోయింది. ఇంటర్‌లో మంచి మార్క్స్ వచ్చాయి. హైదరాబాద్‌లో మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. ఈ మాట చెప్పగానే నాన్న మొదట సంతోషపడ్డారు. కానీ వెంటనే దిగులుగా “నువ్వు ఇంజనీరింగ్ చదవాలని నాక్కూడా ఉందమ్మా! కానీ చూస్తున్నావుగా, తమ్ముడి థెరపీస్‌కే డబ్బులు చాలట్లేదు. ఇంకా నీ చదువంటే మన వల్ల కాదేమో. నువ్విక్కడే డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వు” అన్నారు.
చిన్నప్పటినుంచి అన్నింటికీ రాజీపడుతూ ఉన్న నాకు, ఈ విషయంలో రాజీ పడాలని అనిపించలేదు. అమ్మానాన్నలని ఎలాగో ఒప్పించి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ లోన్ వాళ్ళకి భారం కాకూడదని పార్ట్ టైం జాబ్స్ చేస్తూ, హోమ్ ట్యూషన్స్ చెప్తూ నాలుగేళ్లు గడిపేసా.
కష్టపడి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్ తెచ్చుకున్నాను. జాబ్‌లో చేరాక వర్క్ ఎంజాయ్ చేసేటప్పుడు తెలిసింది, అమ్మ తన ఉద్యోగం వదిలేసి ఎంత బాధపడిందో! నెలాఖరులో అకౌంట్‌లో డబ్బులు లేక ఖర్చుల లెక్కలు చూస్తున్నప్పుడు తెలిసింది నాన్న పడే కష్టమేంటో!
ఆ టైంలోనే నా కొలీగ్ పృథ్వీతో పరిచయం, మా ఇద్దరి స్నేహం ప్రేమగా మారడం, నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లి పరిచయం చేయటం జరిగాయి. నేను వాళ్ళకి నచ్చాను. మా తమ్ముడి గురించి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. మంచి రోజు చూసుకొని మా ఇంటికొచ్చి, తాంబూలాలు మార్చుకుంటాం అన్నారు. మా ఇంట్లో కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు.
ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు మనుషుల మీద నమ్మకం పోయిన రోజు! తాంబూలాలని చెప్పి వచ్చిన వాళ్ళు, మా తమ్ముణ్ని చూసి మొహం తిప్పుకున్నారు. ఇంటికి వెళ్ళాక కబురు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు.
నేను పృథ్వీకి కాల్ చేస్తే ముందు తనేమీ చెప్పలేదు. ఆ తర్వాత నిదానంగా అసలు విషయం చెప్పాడు. మా తమ్ముణ్ని చూసేవరకూ ఇంత పెద్ద ప్రాబ్లెమ్ ఉందని వాళ్ళు అనుకోలేదంట. రేపు నాక్కూడా అలాంటి పిల్లలే పుడతారేమోనని వాళ్ళు భయపడుతున్నారంట.
‘నీ ఒపీనియన్ ఏంటి’ అని అతణ్ని సూటిగా అడిగాను.
‘ఏమో తెలీదు కదా, ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తే ఏం చేయగలం? అలాంటి లైఫ్ నేను ఊహించలేదు నీతో’ అని నైసుగా నాకు బ్రేకప్ చెప్పాడు.
ఆ తర్వాత మరో సంబంధం చూసి మా నాన్న నా పెళ్లి చేసాడు. కానీ అప్పటికే నాకు మనుషుల మీద విరక్తి వచ్చేసింది. నన్ను చేసుకున్న అతను కట్నం చూసి చేసుకున్నాడే కానీ, నా మీద ప్రేమ చూపించే మనిషి కాదు. అదృష్టమో, దురదృష్టమో మాకు పిల్లలు పుట్టలేదు. పెళ్లి తర్వాత లైఫ్ మీదే ఇంటరెస్ట్ పోయింది నాకు. నన్ను అలా చూసి, ఆ దిగులుతోనే అమ్మ, నాన్న ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు.
వాళ్లు పోయాక తమ్ముడి విషయం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే మా ఆయన, మిగిలిన బంధువులందరూ వాణ్ని ఏదైనా ఆశ్రమంలో చేర్పించమని సలహా ఇచ్చారు. నా మనసు దానికి ఒప్పుకోలేదు. వాడు నా దగ్గరికి వచ్చి “అక్కా! అన్నం పెట్టు, ఆకలేస్తుంది” అనగానే నాకు వాడిలో తమ్ముడు కాదు, కొడుకు కనిపించాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నా వీడు జీవితాంతం నాతోనే ఉంటాడని.
అది మా ఆయనకి నచ్చలేదు. విషయం విడాకుల దాకా వెళ్ళింది. మా మనసులెప్పుడూ కలిసి లేవు. కాబట్టి మనుషులుగా విడిపోవడం పెద్ద బాధగా అనిపించలేదు.
ఇపుడు మా తమ్ముణ్ని నేనే చూసుకుంటున్నా. వాడి పనులు వాడు చేసుకోవడం నేర్పించా. థెరపీస్ ఇంకా అవుతూనే ఉన్నాయి. నేను ఆఫీస్‌కి వచ్చినపుడు చూసుకోవడానికి ఒక కేర్‌టేకర్‌ని పెట్టా. హ్యాపీగా ఉంది లైఫ్” అని చెప్పడం ఆపింది చిత్ర. అంతా విన్న సారిక కళ్లల్లో నీళ్లు నిండాయి.
వెంటనే లేచి చిత్రని కౌగిలించుకొని “ఎన్ని కష్టాలు పడ్డావ్ చిత్రా! నువ్వు నిజంగా గ్రేట్!” అంది.
“మా అమ్మానాన్నల కష్టంతో పోలిస్తే నాదేమంత పెద్ద కష్టం కాదులే. నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులు, మనుషులు నాకు నేర్పిన పాఠాలు నీకు చెప్పా, అంతే!”
“నిజమే కానీ, ఇంకోటి అడగనా? మీ అమ్మానాన్నలు నీ గురించి నీలాగే ఆలోచించి ఉంటారంటావా?” అంది సారిక.
“ఏమో తెలీదు కానీ, మా అమ్మ పోయే ముందు నాతో ఒక మాట అంది. ‘మీ తమ్ముడు ఇలా ఉంటాడని తెలిస్తే నేనసలు కనేదాన్ని కాదమ్మా! వాడి వల్ల మేము నిన్ను కూడా దూరం చేసుకున్నాం’ అని. దట్ హిట్ మీ హార్డ్. అప్పటివరకూ ఏదో మూల మా అమ్మానాన్నల మీద ఉన్నఆ కొంచెం కోపం కూడా పోయింది నాకు. ఇది వింటే ఎవరైనా వెంటనే అమ్మని, అమ్మతనాన్ని జడ్జ్ చేసేస్తారు కదా, అందుకే ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. కానీ ఈరోజు నీకు చెప్పాలని అనిపించింది.
నిన్ను చూస్తే మా అమ్మ గుర్తొస్తోంది సారికా! మా అమ్మ కూడా ఇలానే, నువ్వు వైణికని చూసుకుంటున్నట్టు నన్ను ప్రాణంలా చూసుకునేది. ఇష్టంగా జాబ్ చేసేది. ధైర్యంగా, ప్రేమగా ఉండేది. కానీ తమ్ముడు పుట్టాక తనని తాను కోల్పోయింది. మేం చూస్తూ కూడా ఏం చేయలేని పరిస్థితి. అందుకే ఇవన్నీ చెప్పా నీతో” అంది చిత్ర.
“కానీ ఇపుడు నేనేం చేయాలో తెలీట్లేదు చిత్రా!” అయోమయంగా అంది సారిక.
“నా కథ విని నీకు క్లారిటీ వస్తుందేమోనని చెప్పా. నేనేదో గొప్ప పని చేస్తున్నానని అనుకోను. అలానే నాలాగా ఇంకొకరు ఉండాలని నేను అనుకోను. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకేది మంచో వాళ్లే నిర్ణయించుకోవాలి. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఎదురయ్యే పరిస్థితులని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి ఉన్నప్పుడే అడుగు ముందుకు వేయాలి.
తమ్ముణ్ని అమ్మ ఎండ్లెస్‌గా ప్రేమించింది. తన లైఫ్ మొత్తాన్ని త్యాగం చేసింది. తనను, తన ఉద్యోగాన్ని, తనకంటూ మిగిలిన టైంని.. అన్నింటినీ కోల్పోయింది. కానీ ఏ రోజూ తన బాధని మా దాకా రానివ్వలేదు. జీవితంలో ఎంత ఓపికగా ఉండొచ్చో అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నా నేను” అంది చిత్ర.
ఆలోచనలో మునిగిపోయిన సారికని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయింది చిత్ర. ఇంటికొచ్చాక కూడా చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది సారిక. శరత్ వచ్చిన తర్వాత తనతో చిత్ర చెప్పిందంతా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయారు ఆ రాత్రి.
మరుసటి రోజు ఆఫీస్‌కి రాగానే సారిక దగ్గరికి వెళ్ళింది చిత్ర.
“నేను నిన్న శరత్‌తో మాట్లాడి ఒక డెసిషన్ తీసుకున్నాను” అంది సారిక. తనేం నిర్ణయించుకుందో అని ఉత్కంఠగా చూసింది చిత్ర.
రెండు క్షణాలు ఆగి, “అబార్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాను” అంది సారిక.
చిత్ర సారిక భుజం మీద చేయి వేసి “డోన్ట్ వర్రీ! నీకు సరైనది అనిపించే నిర్ణయమే నువ్వు తీసుకున్నావ్” అంది.
“చాలా బాధగా ఉంది కానీ, వైణికకి ఇదే మంచిదని మాకనిపిస్తోంది. పిల్లల్ని ఒక వయసు వచ్చేవరకు చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే, తోబుట్టువులది కాదు. వాళ్ళ బాల్యాన్ని ఇబ్బందుల్లో పెట్టే హక్కు తల్లిదండ్రులకి లేదు కదా! మేం రెండో బిడ్డని కనాలని అనుకున్నదే మా పెద్ద వయసులో వైణికకి భారంగా మారకూడదని, అలాంటిది తనకి ఇంత పెద్ద భారాన్ని వదిలి మేము వెళ్లలేం. ఇంకా పుట్టని బిడ్డ కోసం పుట్టిన బిడ్డ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టలేకపోతున్నాం” అంది సారిక. తనవైపే చూస్తూ ఉంది చిత్ర.
“వైణిక తన లైఫ్‌లో చాలా చూడాలి. చాలా ఎదగాలి. తను కొన్ని రోజులు బాధపడినా, జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే తప్పదు” అంటూ సారిక తన పొట్ట మీద చెయ్యి వేసుకుని, కళ్ళ నిండా నీళ్లతో “సారీ బేబీ! నిన్ను అమ్మ ఎప్పటికీ మర్చిపోదు! వి మిస్ యూ ఫరెవర్” అంది వీడ్కోలు పలికింది.
***
నేను ఎప్పటికీ పాఠకురాలినే!
* హాయ్ శారద గారూ! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది కడప జిల్లా పులివెందుల. నేను పుట్టి, పెరిగింది అక్కడే. రాజంపేటలో ఇంజినీరింగ్ చేసి, ఆ తర్వాత బెంగళూరులో డాట్ నెట్ డెవలపర్‌గా పనిచేశాను. పెళ్లయ్యాక సింగపూర్ వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉద్యోగం చేశాను. ఆ తర్వాత తిరిగొచ్చి, ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను. మాకు ఒక పాప, బాబు.
* చిన్నప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదివేవారా?
అప్పట్లో కథల పుస్తకాలు, నవలలు పెద్దగా అందుబాటులో ఉండేవి కావు. చందమామ, బాలమిత్ర లాంటివి దొరికితే చదివేదాన్ని. నిజానికి నాకు 20 ఏళ్లు వచ్చాకే పాఠకురాలిగా మారానని చెప్పొచ్చు. నేను బెంగళూరులో ఉన్న టైంలో మా ఫ్యామిలీ అనంతపురంలో ఉండేది. బెంగళూరు నుంచి అక్కడికి రావాలంటే రైల్లో నాలుగు గంటలు పట్టేది. అప్పటికి స్మార్ట్ ఫోన్లు ఇంతగా లేవు. కాబట్టి జర్నీలో చదువుకోవడానికి కొన్ని పుస్తకాలు ఇమ్మని మా కొలీగ్‌ని అడిగాను. అతను మొదటగా ఇచ్చినవి చలం గారి పుస్తకాలు. ఆ తర్వాత రంగనాయకమ్మ, ఓల్గా గార్ల పుస్తకాలు చదివాను. రైలు ప్రయాణంలో వారానికో పుస్తకం చదివేదాన్ని. ఆన్‌లైన్‌లో ఏమైనా పుస్తకాలు దొరుకుతాయా అని చూసేదాన్ని. ఆ తర్వాత ఆసక్తితో బెంగళూరులో లైబ్రరీకి వెళ్లి, అక్కడున్న తెలుగు పుస్తకాలు చదివాను.
* పాఠకురాలిగా మీ అనుభవాలేమిటి?
నేను ఎప్పటికీ పాఠకురాలినే. ఓల్గా గారి రచనలు నాకు బాగా నచ్చుతాయి. ఆమె రచనల్లో స్త్రీ దృక్పథం ఎలా ఉండాలో తెలుస్తుంది. సమస్యలకు తగ్గ పరిష్కారాలను ఆమె సూచిస్తారు. అలాగే రంగనాయకమ్మ గారి రచనలన్నీ చదివాను. కుప్పిలి పద్మ గారి కథలు చాలా ఇష్టం. ముఖ్యంగా ‘మసిగుడ్డ’ కథ! కల్పన రెంటాల గారు రాసిన ‘తన్హాయి’ పుస్తకం చాలా నచ్చింది. అందులో ‘కల్హార’ పాత్ర నాకు చాలా ఇష్టం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి ‘ఒంటరి’ నవల కూడా ఇష్టంగా చదివాను. పుస్తకాలు చదవడంలో ఆనందాన్ని పొందుతాను. నాలాగా నా పిల్లలకు కూడా పుస్తకాలు చదవడం అలవాటు చేయాలని ప్రయత్నిస్తున్నాను. వాళ్లు ఎక్కువగా ఇంగ్లీష్ పుస్తకాల వైపే చూస్తున్నారు. తెలుగు చదివి, అందులోని సారాన్ని అర్థం చేసుకొని, ఆ ఆనందాన్ని వాళ్లూ పొందాలని నా ఆశ.
* కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
కథ రాయాలన్న ఆలోచన ఫలానా సమయంలో వచ్చిందని చెప్పలేను. 2010-2012 ప్రాంతంలో తెలుగు బ్లాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. వాటిని చదివేదాన్ని. అప్పట్లో అనంతపురంలో కొంతమంది బ్లాగర్స్ కలిసినప్పుడు నేనూ వెళ్లి వారిని కలిసి, మాట్లాడాను. అలా పరిచయమైనవారిలో అవినేని భాస్కర్ ఒకరు. వారి స్ఫూర్తితో నేనూ బ్లాగ్ మొదలుపెట్టి, కొన్ని ఆర్టికల్స్ రాశాను. తర్వాత టైం కుదరక వదిలేశాను. ఆ తర్వాత ఉద్యోగం, పిల్లల పనుల్లో పడి మర్చిపోయాను. రెండు కథలు రాసి పత్రికలకు పంపినా రిజెక్ట్ అయ్యాయి. ‘నేను బాగా రాయలేదేమో’ అనుకొని ఊరుకున్నాను. ఆ తర్వాత ‘వైణిక’ కథ రాశాను. అలా ఇదే నా మొదటి కథయ్యింది.
* ఇంకా ఏమేం రాయాలని ఉంది?
నాకు నేను రాసే వాటికన్నా వేరే వాళ్లు రాసేవే నచ్చుతాయి. వీళ్లలా ఒక్క వాక్యమైనా నేను రాయగలనా అని అనిపిస్తుంది. ఆ కారణం వల్లే ఇన్నాళ్లూ ఎక్కువగా రాయలేదు. గతంలో రాసిన కొన్ని కథలున్నాయి. వాటిని సరిచేసి, ప్రచురణకు పంపాలని ఉంది.
*
Add comment