వేసవి కాలం… ఊరగాయల కోలాహలం…

అగ్రహారం అంటే…కూచిమంచి అగ్రహారమే! మిమ్మల్ని కూచిమంచి లాక్కువెళ్లే స్నేహహస్తం ఇది. ముక్కామల చక్రధర్ కొత్త కాలమ్ ప్రారంభం

కాలం మారిపోయింది. కాలం మారిపోతుంది. అంత వరకూ దుప్పట్లో ముసుగేసిన అగ్రహారం వాటిని అటకెక్కించిన కాలం. ఆ కాలంలో ఏసీలు, కూలర్ లు లేవు. నిజానికి వాటి తయారీ కూడా లేదనే గుర్తు. ఆరో తరగతిలో ఉండగా విశాఖపట్నంలో ఉంటున్న మా పెద్దన్నయ్య దగ్గరికి వేసని సెలవులకు వెళ్లినప్పుడు జగదాంబ థియేటర్ లో చూసిన బ్రూస్లీ సినిమా ఎంటర్ ది డ్రాగన్. ఆ థియేటరే నా జీవితంలో తొలి చలిమర గది. ఆ చల్లటి గాలి ఇప్పటికీ నన్ను అంటిపెట్టుకునే ఉంది.

నాలుగు దశాబ్దాలు గడిచినా ఎంటర్ ది డ్రాగన్ లోని హ..హు శబ్దాలు చెవుల్లోంచి పోనట్లే… ఆ ఏసీ చల్లదనం కూడా ఇప్పటికీ నాకు వెన్నులోంచి చలి పుట్టిస్తోంది. నా స్వంత ఇంట్లో ఏసీ ఉన్నా విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్ లో ఆనాటి ఆ నా ఏసీ అనుభవం మాత్రం వెంటాడుతూనే ఉంది. అగ్రహారంలో చాలా ఇళ్లలో ఒకే ఒక్క ఫ్యాన్. కొందరిళ్లలో అదీ లేని స్థితి. ఇంటికి కనీసం నలుగురైదుగురు సంతానం. తలిదండ్రులతో కలిపి అందరూ ఇప్పటి హాలు అనబడే ఇరుకిరుకు వరండా.. లేదూ వసరాలో ముడుచుకుని పడుకోవడమే. చాలా మంది ఇంటి ముందున్న అరుగుల మీదో… ఖాళీ స్ధలంలోనో పక్కలు వేసుకుని పడుకునే వారు. గేటుకి రెండు వైపులా రెండు సిమెంట్ సింహాలు ఉన్న వాడ్రేవు మహదేవుడి గారి ఇంట్లో అద్దెకు ఉండే వాళ్లం  మేం.

వాడ్రేవు మహదేవుడి గారిని మేం చూడలేదు కాని… సిమెంట్ సింహాల్లో ఓ సింహంలా ఉండే ఆయన ఆఖరి కొడుకు వాడ్రేవు రాజబాబుదే ఆ ఇంటి పెత్తనం. అప్పుడే ప్లీడరీ చదువు పూర్తి చేసి అగ్రహారంలో అడుగుపెట్టారు రాజబాబు. ఆ ఇంటిలో దాదాపు పది కుటుంబాలు అద్దెకు ఉండేవి. ఇంటికి ఎడమ వైపున్న పెద్ద గదిలో సీతారామం గారి టైప్ ఇనిస్టిట్యూట్. ఎడమ వైపు ముందు గదిలో ఆకాష్ టైలర్స్. ఆ వెనుక గదిలో తమిళనాడు నుంచి వచ్చిన  మెడికల్ రిప్రజెంటెటీవ్.  రెంటికీ మధ్యలో ఉన్న ఖాళీ స్ధలంలో అద్దెకున్న వారి మంచాలు, పక్కలు. ఇంటి యజమాని ప్లీడరు రాజబాబుకి ఎందుకో కాని అప్పుడప్పడు కోపం వచ్చేది. ఏ సాయంత్రమైనా ప్లీడర్ రాజబాబుకు కోపం వచ్చిందా… నోట్లో చుట్ట తిప్పుతూ కుడి ఎడమల వైపున్న మంచాలు, పక్కల వైపు చూసే వారు. అంతే, అద్దెకున్న వాళ్లంతా కిమ్మనకుండా పక్క బట్టలు చంకల్లో సర్దుకుని ఎవరి ఇళ్లలోకి వెళ్లిపోయేవారు. ఈ మధ్య అగ్రహారం వెళ్లినప్పుడు ప్లీడర్ రాజబాబు కలిస్తే “అలా ఎందుకు చూసే వార”ని అడిగాను. దానికి మళ్లీ చుట్ట తిప్పుతూనే ప్లీడర్ రాజబాబు సమాధానం “అప్పుడు 25… ఇప్పుడు 65”.
వేసవి వచ్చిందంటే అగ్రహారం అంతా హడావుడిగా ఉండేది. ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకూ ఒకటే ఉరుకులు… పరుగులు.

సరిగ్గా అ సమయంలోనే అగ్రహారం అంతా కారంగా… ఘాటుగా ఉండేది. ఆ రెంటి జుగుల్ బందీ రుచుల మధ్యలో అప్పుడప్పుడు ఉప్పగా తగిలేది. ఈ రుచి దాదాపు రెండు నెలల పాటు అగ్రహారాన్ని ఊరగాయల మత్తులో ముంచేది.  ఏడాది పాటు నిల్వ చేసుకుని కష్టకాలంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతిని ఆదుకునే ఆపన్న హస్తం ఆవకాయ. నాలుగు రకాల ఊరగాయల తయారీ కోసం అగ్రహారంలో అమ్మలు, ఆడపడుచులు క్షణం తీరిక లేకుండా గడిపేవారు. ఊరగాయలంటే ఇప్పటి దొండకాయ, బంగాళాదుంప, నానా కూరగాయల పచ్చళ్లు కాదు. ఏటికి ఏడాది పాటు జాడీల్లో నిల్వ చేసుకుని ఇంట్లో వారికే కాదు… అతిథులకు కూడా ఆహా ఏమి రుచి అనిపించే ఊరగాయలు. ఆవకాయ, మాగాయి, మెంతికాయి, తొక్కుపచ్చడి, కాయ ఆవకాయ కలిపితే ఊరగాయలు. ఇవి ముమ్మాటికి పచ్చళ్లు కాదు. ఊరగాయలే. అందుకే మా ఇంటిలో ఆవకాయ పచ్చడి అని ఎవరైనా అన్నారంటే వీపు అగ్రహారం మోతే. ఒక విధంగా చెప్పాలంటే మా అగ్రహారంలో బ్రాహ్మణులకి ఊరగాయలు బ్రహ్మ సృష్టి. పచ్చళ్లు విశ్వామిత్ర సృష్టి.  వీటి తయారీ కోసం రెండు నెలల నుంచే అగ్రహంలో  పండగ వాతావరణం  నెలకొనేది. ధనిక, పేదా అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లోను ఈ పండగ సందడి చేసేది. ఊరగాయల కోసం మామిడి కాయలు కొనడానికి ముందే అగ్రహారంలో ఈ ఊరగాయ పండగ ప్రారంభమయ్యేది.

కారాల దంపుడు అగ్రహారంలో ఏడాదికి ఓ సారి జరిగే జాతర.
కారాలు దంపుడు ఆగ్రహారంలో సామూహిక సహజీవనం.
కారాల దంపుడు అగ్రహారంలో మండువేసవిలో ఘాటైన మురిపెం..
కారాల దంపుడు అగ్రకులాల మహిళలతో కింది కులాల మహిళల స్నేహ సౌరభం.
కారాల దంపుడు పిల్లలకు మామిడి కాయలకు దొరికిన ఓ కారపు నేస్తం.

నలుగురు పనిమనిషుల కలయిక ఓ జట్టు. వీరంతా నాలుగు ఇళ్లల్లో  పని మనుషులు కాదు. ఈ కుటుంబాల్లో ఆడపిల్లలు పెద్దవాళ్లే… పెళ్లిళ్లు చేసుకున్నాక అక్కడ ఎలా పని చేయాలో నేర్పే తల్లి కాని తల్లులు. అందుకే  శెట్టిబలిజ కులానికి చెందిన పని మనుషులే అయినా బ్రాహ్మల ఆడపిల్లల్ని పేరు పెట్టే పిలిచి వారు. కొందరు స్థితిమంతుల ఆడపిల్లల్ని వాళ్ల తండ్రుల ఎదుట మాత్రం అమ్మాయి గారూ అని పిలిచే వారు. ఇది అగ్రహారంలో పురుషాహంకారపు నాణానికి ఒక వైపు. తల్లుల ఎదుట మాత్రం పేరు పెట్టే పిలిచే వారు. ఇది పాటక స్త్రీలకు అగ్రహారం తల్లులతో ఉన్న స్నేహానికి ప్రతీక. యనమదల నాగరత్నం, మరిడి మాలక్ష్మి, కడలి లక్ష్మి, పితాని సత్యవతి, నూకాలు వీరికి తోడు ముస్లీం మహిళ మీరాబీ. వీరితో పాటు మరో ఐదారుగురు కలిస్తే కూచిమంచి అగ్రహారం బ్రాహ్మల ఇళ్లలో పని మనుషులు. కాదు కాదు… ఇంటి మనుషులు.

వీరంతా సూర్యుడితో పాటే అగ్రహారంలో వెలుగులు పంచే వారు. వాళ్ల చేయి పడిన గిన్నెని హైస్కూల్ రోడ్డులో కూచిమంచి రామక్రిష్ణ యజమానిగా ఉన్న అన్నపూర్ణ స్టీల్ షాపుకో, సేట్ల బంగారం దుకాణాల పక్కన ఉన్న నంద్యాల రామారావు గారి స్టీలు కొట్టుకో  వెళ్లి బేరం పెడితే కొత్తదేమో అనుకుని కళ్లకు అద్దుకోక పోయేవారేమో కాని కచ్చితంగా కొనేసే వారు. ఆ దుకాణాల ముందు ప్రచారం కోసం పురుకోసలకు, చాంతాళ్లకు వెళ్లాడదీసిన స్టీలు కారియర్లు, బాల్చీలు, గల్లా పెట్టె పక్కన పెద్దది, దాని మీద కొంచెం చిన్నది, దాని మీద ఇంకెంచెం చిన్నదిగా నిలబెట్టిన స్టీలు బిందెలపై సూర్య కిరణాలు పడి చుట్టు పక్కల కొట్లపై మెరుపులు మెరిపించినా… ఆగ్రహారం గిన్నెలు చూసి మాత్రం అవన్నీ చిన్నబుచ్చుకునేవి. అగ్రహారం పని మనిషుల చేతిలో ఈ  స్టీలు, ఇత్తడి గిన్నెలు ఇంతలా మెరవడానికి కారణం నేటి కార్పొరేట్ కంపెనీల విమ్, ప్రిల్, సబినా, పీతాంబరి కానే కాదు. కేవలం నలుగురు తొక్కిన మట్టి, కోనసీమ కొబ్బరి పీచు, వేడి నీళ్లు కాచుకున్నాక ఆ పొయ్యిలోంచి వచ్చిన బూడిద. ఇవే ఆ గిన్నెల సోయగాలకు మా ఇళ్ల పని మనుషులు అబ్బిన చేతి పనితనం.

మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తిన మీదకు వచ్చే సమయానికి కారం దంపుళ్లకు వచ్చే వారు. వాళ్లంతా మిరపకాయలు, ఆవాలు, ఉప్పు దంచేందుకు వచ్చే వారిలా కాకుండా సరిహద్దుల్లోని మహిళా సైనికుల్లా ఉండేవారు. వచ్చి రావడమే పైటతో పాటు చీర కుచ్చిళ్లను బొడ్లో దోపుకుని “ఆయ్… ఏటాలస్యం. ఓ.. నవ్వులు. సాలు. ఎవలో ఒకలు ఆ మిరకాయలు ఓపాలి నెరపండి. ఓ ఇద్దరు రోకల్లుచ్చుకోండి. ఓ నూకాలు… ఆవాలెండాయో..! లేదో సూడు. మనం రావేమోనని అన్నపూర్ణమ్మగోరికి బయం. ఆవాలు వెండకపోయినా… దంపుల్లకి పిలిసేత్తాది !” ఆ జట్టు నాయకురాలి వంటి ఇంటి పని మనిషి పురమాయింపు.  ఏ ఇంట్లో దంపుళ్లుంటే ఆ ఇంటి పని మనిషే ఆ జట్టుకు ఆ రోజు నాయికి. ఇది వాళ్లు చేసుకున్న ఒప్పందం కాదు. అలా జరిగిపోతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మిరపకాయలు దంపుడు, దంచిన కారాన్ని జల్లెడ పట్టడం ముగిసేది. ఆ తర్వాత భోజనాలకు లేచే వారు. ఇంటి పెరడులో చెట్ల కింద జరిగే దంపుడు ఘాటుకి ఆగ్రహారం అంతా తెలిసిపోయేది ఎక్కడ దంపుళ్లు జరుతున్నాయో…

“ఏవే… ఈవాళ దంపుళ్లు ముక్కావల మాస్టారి ఇంట్లోనా…. బులుసోరింట్లోనా” అని అడిగే వారు అగ్రహారంలో మిగిలిన కుటుంబాల వాళ్లు. పెరట్లో చెట్ల కింద జరిగే ఈ కారాల దంపుళ్ల సమయంలో సూర్యుడి కిరణాలు చెట్ల సందుల్లోంచి కారం దంచే స్త్రీల ముఖాల మీద పడి చిత్రమైన కాంతితో వెలిగిపోయేవి. ఆ ముఖాల మీద పట్టిన చిరు చెమటని మోచేతితో తుడుచుంటూ వెటకారాలు ఆడుకునే వారు ఆ పాటక స్త్రీలు. ఆ దృశ్యం సూర్యుడు చెట్టు మీంచి రాసుకున్న కవిత్వంలా ఉండేది. దంపుళ్లు ప్రారంభమైన ఓ గంటకి మా అమ్మ బెల్లం ఎక్కువగాను,  మిరియాలు తక్కువగా… ఏలకులు కనిపించీ కనిపించనంతగా వేసి పానకం తయారు చేసేది. అంతకు ముందే ముగిసిన శ్రీరామనవమికి పానకం కోసం తెచ్చిన ఏలకులు మిగిలితేనే పానకంలో వేసేది. “ఏటమ్మా… వేలకులేశారా… ఆటి తొక్కలేశారా.. వోసనే లేదు” అని అడిగితే మా అమ్మ ఓ నవ్వు నవ్వేసి లోపలికి వచ్చి మాత్రం ఓ నిర్వేదపు నిట్టూర్పు వదిలేది. మిరపకాయల దంపుళ్ల కోసం సుగంధ ద్రవ్యాలలో ఒకటైన ఏలకుల్ని కొనేంత స్తోమత లేని కుటుంబాలు మావి. దంపుడు స్త్రీలలో ఒక్కొక్కరూ కనీసం రెండు గ్లాసులైనా ఆ పానకం తాగితే తప్ప వారికి మండించే ఎండ,  ముక్కుపుటాలు అదిరిపోయే ఘాటు తగ్గేది కాదు. పిల్లలం లాగులో దాచుకున్న మామిడి కాయ ముక్కల కోసం దంచిన కారాన్ని అడిగితే ఓ గుప్పెడు కారం మా చేతుల్లో పోసి “వెక్కువ తీనేయకండి. గట్టు తెగిన గోదార్లా ఇరేసనాలు ఆగవు” అంటూ నవ్వేసేవారు.

మిరపకాయలు, ఆవాలు దంచేసరికి మధ్యాహ్న భోజనాల వేళయ్యేది. సలవ చేస్తుందని పెసరపప్పుతో చేసిన పప్పు పులుసు, అన్నం వడ్డించేవారు. దాంతో పాటు పెద్దావకాయకు ముందు పెట్టిన పచ్చడి బద్దలో…., కొబ్బరికాయ, మామిడి కాయ పచ్చడో వేసేవారు. (ఇది పచ్చడే. మామిడితో కొబ్బరికాయ కలిసేది. అందుకే ఇది పచ్చడి). కారం దంచేవాళ్లకి ఇంట్లో ఆడపిల్లలు వడ్డించే వారు. అయితే, తల్లులు మాత్రం మధ్య మధ్యలో వచ్చి “ఏం మాలక్ష్మి… పులుసేసుకోలేదు. బాలేదా… మేం ఉల్లిపాయలు వేయం కదా… అందుకే నచ్చి ఉండదు” అంటే… “బలే వోరే… దేని రుసి దానిదే. రొండు రోజులకోపాలి నీసులో ఉల్లిపాయలు తినవా.. ఏటీ. అయినా ఈ పచ్చడి మాత్రం బేమ్మర్లే సేయాలి. వింగువ (ఇంగువ) దగ్గరే తేలిపోద్దీ దీని రుసి” అనే వారు. సాయంత్రానికి దంపుళ్లన్నీ పూర్తి అయ్యాక దేనికెంతో లెక్కలు వేసుకునే వారు మా అమ్మ, మా పెద్దక్క. మిరపకాయలు దంచినందుకు కేజీలెక్కన.., ఆవాలు, ఉప్పుకు కుంచాల లెక్కన డబ్బులు లెక్క గట్టి ఇచ్చేవారు. దంచిన కారం, ఆవపొడి, మెత్తటి ఉప్పు మూటలుగాను, జాడీల్లోకి ఎత్తి పెట్టుకుని కారాలు దంచిన చోటు, ఆ తర్వాత ఇల్లూ కడిగి ఒబ్బిడి చేసుకునే సరికి రాత్రి తొమ్మిదయ్యేది. మా నాన్నగారికి అన్నం పెడుతూ “మిరపకాయలు, ఆవాలు దంచే పని అయ్యింది. మీరు మామిడి కాయలు తెస్తే ఊరగాయలు కలిపేయడమే” అని పక్క ఇంట్లో వాళ్లకి కూడా వినపడేలా చేప్పేది మా అమ్మ. అంత అరుస్తూ చెప్పడానికి కారణం మా నాన్నగారికి కాసింత చెవుడు.

ఆవకాయకి మామిడికాయ చాలా గట్టిగా… కండపట్టి… చూడగానే ఇది ఆవకాయ కోసం పుట్టిందనిపించాలి. మగాయికి అంత పులుపు అవసరం లేదు కాని ఓ మాదిరి మెత్తగా ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే మగాయి ముక్కలు కోసిన తర్వాత దాన్ని ఉప్పులో ఊరబెట్టి ఎర్రటి ఎండలో ఎండపెట్టాలి. ఇక మెంతికాయకి సొంత ఐడెంటిటీ లేదు. తన అన్న ఆవకాయ కోసం కొట్టిన ముక్కల్లో టెంక లేకుండా మిగిలిన ముక్కలు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మెంతికాయకి  ముందుగా కారాలు కలిపి మూడో రోజు ఎండలో పెడతారు. మగాయికి మాత్రం ఎండిన తర్వాత కారాలు కలుపుతారు. ఈ తేడా మగాయి, మెంతికాయ తింటే తప్ప తెలీదు. ఇక చివరిది…. తొక్కుపచ్చడి. ఇది ఒక రకంగా ఊరగాయల్లో ఆఖరి తమ్ముడో.. చెల్లెలో అన్నమాట. తొక్కుపచ్చడి పెట్టాలంటే మామిడి కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా అంటే… బంగాళా దుంపల వేపుడు ముక్కల్లా అన్న మాట. కాసింత పని ఎక్కువ. అందుకే దీని కోత కాని, కారాలు కలపడం చివరాఖర్న చేసే వారు. ఇక కాయ ఆవకాయ. ఇది కొన్న కాయల్ని బట్టి ఉంటుంది. కంటికి కాసింత నజరుగా కనిపించిన కాయల్ని పచ్చి మిరపకాయ బజ్జీలు కోసి నిమ్మకాయ పిండుతారు చూడండి… అలా తరగాలన్న మాట. దీనికి పని ఎక్కువ. పైగా ఆర్థిక భారం కూడా ఎక్కువే.

అందుకే ప్రతి ఇంట్లోనో కాయ ఆవకాయ తక్కువగానే పెట్టేవారు. కారాలు దంపడం, మామిడి కాయలు కొనడం ఓ క్వార్టర్ ఫైనల్ అనుకుంటే కాయలు తరగడం మాత్రం ఓ సెమీఫైనల్. మామిడి కాయలు తరగడానికి ఆగ్రహారంలో రెండంటే రెండే మర కత్తిపీటలుండేవి. అందులో ఒకటి పట్టాభివీధిలోని ఎన్.ఎస్.శాస్త్రిగారి ఇంట్లో ఉండేది. మరొకటి కూచిమంచి ప్రకాశం గారింట్లో. వీరిద్దరూ పేరెన్నికగన్న లాయర్లే. ఒటిన్నర నుంచి రెండున్నర అడుగుల పొడవు, అరడుగున వెడల్పులో ఉన్న చెక్క తొలి భాగంలో కొంత వదిలేసి పటా కత్తి వంటి పదునైన కత్తిని ఆ చెక్కకు అమరుస్తారు. దానికి ఇత్తడో, రాగి పిడి ఉంటుంది మామిడికాయని నిలువుగా పట్టుకుని కత్తికీ, పీటకి మధ్యలో ఉంచుతారు. అలా ఉంచిన కాయ మీద పిడి పట్టుకుని పైనుంచి మామిడి కాయని పూర్తిగా కాకుండా రెండుగా మధ్యలోకి చీల్చడం, దాన్ని మళ్లీ నాలుగు భాగాలుగా చీలుస్తారు. అంటే కాయనిపూర్తిగా తరగకుండా కాయగానే ముక్కలుగా చీల్చడం అన్నమాట. ఈ చీలికల మధ్యలోనే కారం కూరి జాడీల్లోకి ఎత్తుతారు. ఇలా  మరకత్తి పీటతో కోయడానికి ఓ నేర్పరి తనం కావాలి. అందరూ దీన్ని కోయలేరు. కాయ ఉంచిన చోటు కాని కదిలిందా…. వేలు తెగిపోవడమే.

అందుకే మరకత్తి పీట ఇచ్చే సమయంలో దాని యజమానులు ఎన్.ఎస్.శాస్త్రి గారి ఇంటిలో కాని, కూచిమంచి ప్రకాశం గారి ఇంటిలో వారు కాని ‘‘ ఏరా మీ ఇంట్లో ఈ కత్తిపీటతో తగరడం వచ్చిన వాళ్లు ఉన్నారా’’ అని అడిగేవారు. ఇలా ప్రతీ ఏటా ఆ రెండు కుటుంబాల వాళ్లు అడిగే వారు. ఇలా అడగడంలో వారికి గుర్తు లేదని కాదు… ఓ జాగ్రత్త తొంగి చూసేది. ఇక కత్తిపీటని వారింటి నుంచి తీసుకు రావడం కూడా రహస్యమే. ఇచ్చిన వారికి, దాన్ని తెచ్చుకుని వారికి తప్ప అగ్రహారంలో అన్యులకు తెలియకూడదు. మరకత్తి పీటను గోనె పట్టాలోదాచి దాన్ని మళ్లీ గుడ్డ సంచిలో పెట్టి సైకిలు ముందు పెట్టుకుని అత్యంత రహస్యంగా తీసుకువచ్చే వాళ్లం. దీనికి కారణం. దిష్టి. ఎవరి కళ్లైనా పడితే ఆవకాయ పాడైపోతుందని ఓ భయం. అదే దిష్టి. కత్తిపీట ఇచ్చిన వారు కూడా వేరెవరైనా మరకత్తి పీట కోసం వస్తే ‘‘లేదమ్మా.. ఎవరో పట్టికెళ్లారు. రేపో, మాపో రండి’’ అని చెప్పే వారే కాని ఎవరు పట్టికెళ్లారో మాత్రం చెప్పే వారు కాదు. ఇది కత్తిపీట ఇచ్చేవారికి, పచ్చుకునే వారికి మధ్య అలా జరిగిపోయేది.  మడి, తడిలకు ఆలవాలమైన అగ్రహారంలో ఊరగాయ కారాలు కొట్టించడానికి మాత్రం ఏ మడి ఉండేది కాదు.

ఇదే విషయాన్ని మా ఆఖరి అక్కని అడిగితే ‘‘అగ్నిహోత్రం తగిలినప్పటి నుంచే మడి. అంతకు ముందు ఏ మడి లేదు. గిన్నెలు తోమించుకోమూ. ఇది అలాగే’’ అంది. అగ్రహారంలో బ్రాహ్మలకి ఆవకాయ బ్రహ్మ సృష్టే అయినా మా ఇళ్లలో జరిగే మరణానంతర ఉత్తర క్రియల్లో మాత్రం ఆకులో ఆవకాయ వడ్డించరు. అగ్రహారంలో అందరిళ్లలోనూ ఈ వ్యవహారం ఇలాగే సాగేది. వేసవి కాలంలో ప్రారంభమైన ఆ ఆవకాయ సందడి వర్షాకాలం సమీపిస్తుందనగా ముగిసేది. ఈ సీజన్ లో ఆగ్రహారంలోంచి నడిచి వెళ్తూంటే ఇరువైపుల ఇళ్లలోంచి ఓ కమ్మటి కారపు వాసన ముక్కుపుటాలని ఎగదన్నేది. కొత్తావకాయ, తరవాణి, మామిడి పండు కలిపి ఉదయాన్నే తింటే స్వర్గపు మెట్లు కనిపించేవి.

మళ్లీ మధ్యాహ్నం మగాయితో రెండు ముద్దలు, మెంతికాయతో రెండు ముద్దలు, తొక్కుపచ్చడితో రెండు ముద్దలు తింటే మెట్లేమిటీ… ఏకంగా స్వర్గమే కనిపించేది. అందుకే అగ్రహారంలో ఎవ్వరికీ మరణానంతర స్వర్గం పట్ల భ్రాంతి ఉండేది కాదు. ఏ స్వర్గమైనా బతుకుండగా అనుభవించాల్సిందే. వాళ్లంతా అలా బతకడం కోసం ఆస్తులను సైతం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు అగ్రహారం లేదు. అది బ్యాంక్ స్ట్రీట్ గా మారింది. ఇది మాబోంటి వాళ్లకు అగ్రహారం మిగిల్చిన మంచి చెడుల జుగుల్ బందీ.

*

ముక్కామల చక్రధర్

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బుజ్జిగాడు… ఉరఫ్ చక్రి మామ (alias ముక్కామల చక్రధర్)…
    … కేరాఫ్ కూచిమంచి అగ్రహారం!
    ———-

    దాష్టిక నియోగి… దైన్య వైదిక ‘వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్‌!’ అంటూ తాను పుట్టి పెరిగిన కూచిమంచి అగ్రహారం (అమలాపురం) కథాస్రవంతికి చక్రి చుట్టిన శ్రీ(శ్రీ)కారం!
    Wonderful & congratulations 🥳

  • కవర్ పేజీ చాలా బాగుంది
    బాగా రాశావు చక్రధర్

  • ఎంత బాగా రాశావురా బుజ్జీ! అక్షరాలా మామిడికాయలాంటి తెలుగుభాషతో ఆవకాయ పెట్టినట్టుంది. మన సంస్కృతి, సంస్కారం నమోదు చేయగల సత్తా ఉన్న ఇంతటి ప్రతిభని తవ్వుకోడానికి ఇన్నేళ్లు పట్టిందా? సారంగ వస్తేగాని, సారంగ వేస్తేగాని రాయనని భీష్మించుక్కూచున్నావా? కొత్తావకాయలా బావుందిరా? అక్షరాలా అభినందనల ఆవకాయ్ నీకు! ఇంక రాయ్! ఇంకా రాయ్! ఆపకొరే!

  • మీరు రాశారు, కానీ మేము లీనామయ్యాం, కారం దంపుళ్ళు మరోసారి చూశాము. మధ్యాహ్న భోజనాలు ఎంత బాగున్నాయి. శాస్త్రి గారి కత్తి పీటకోసం తిరిగిన విషయం మరోసారి కళ్ళముందు కనిపించింది. చివరగా దంపుళ్ళ చెల్లిపులు, వారి పంపకాలు పక్కనే ఉంది చూశాము

  • “ఏటమ్మా! వేలకులేసారా
    ఆటి తొక్కలేసారా
    వొసనేలేదు”….అంటూ
    అచ్చమైన పల్లె పదాల యాసను పరిచయం చేస్తూ….
    ఆవకాయ…మగాయ… మెంతికాయ
    రుచులను పాఠకుల నోరూరించేలా చక్రధర్ గారు రాసిన “ఉరగాయల కోలాహలం” కథ మనసుకు హత్తుకునేలా ఉంది…..

  • superb write up chakradhar, keep writing. the sketch is also beautiful and apt. wish to read more from you.
    love
    gollapudi srinivasa rao
    warangal

  • ఆహా ఏమి రుచి అనరా మైమరచి! ఆవకాయ ఘాటు అదిరిందనుకో !! బుజ్జిగాడికభినంధనలు !!!

  • Solid stuff from you sir. I felt like im living with the characters while readung. Good style of writing sir. Waiting for next writing. Thank you

  • Absolutely marvellous description.Its giving live feeling and refreshing old memories..Grt Job done..

  • This year there is no perfect Avakaya, due to lockdown. Very sad.
    But I remember Athagari kathalu By Bhanumathi Ramakrishna.
    Excellent narration. Kudos to writer.

  • “వాళ్లంతా అలా బతకడం కోసం ఆస్తులను సైతం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు అగ్రహారం లేదు. అది బ్యాంక్ స్ట్రీట్ గా మారింది.” అంటే వాళ్లేమై పోయారండి? ఆర్ధికంగా పతనమై పోయి దిక్కు మొక్కు లేకుండా పోయారా? ఆస్తులన్నీ ఆవకాయల కోసమని అమ్మేసుకొని పొగాక్కంపనీల్లో బేళ్లు మోస్తున్నారా? మార్కెట్లో కూరగాయలమ్ముతున్నారా? అదేం లేదు మేష్టారూ! తెల్లోడు భారతదేశం రాగానే ఇంగ్లీష్ నేర్చుకొని ఏ విధంగా అవకాశాల్ని పెంచుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా తమ స్థానాల్ని భద్ర పరుచుకున్నారో అలాగే 1990ల నుండి ప్రపంచీకరణ ఇచ్చిన ఆధునిక అవకాశాల్ని అంది పుచ్చుకొని సాఫ్ట్ వేర్, బాంకింగ్ అనేక ఇతర రంగాల్లో ఎగబాకటం కోసం అగ్రహారాలు వదిలిపెట్టి హైదరాబాద్, పుణె,, బెంగళూరు మాత్రమే కాక ప్రపంచం మొత్తం వ్యాపించారు.

  • మంచిచెడుల,జుగల్ బందీ అగ్రహారం.. చదువు తుంటే, చిన్నపుడు, మావాళ్లపెట్టినా, పచ్చడి లు,గుర్తుకు వచ్చి.. కళ్ల వెంట నీరు వచ్చింది. ధన్యవాదాలు, అండి!

  • ఆవకాయ అదిరి పోయింది. పాత జ్ఞాపకాలు గుర్తుకు తీసుకొచ్చారు.

  • Nuvvula nune matrame kaadu, inguva gurinchi cheppadam marachi poyavu Chakradhar. Konaseema lo vunna anni agraharala lo jarige summer specials leda vuragaayala yagnam idi. Ee roju varaku panchina anni anubhavalu (vaatini kathalu anatledu nenu) adbhutaha. Vere chotla cheppina vidham ga veetiki moodo stanam Amaravathi kathalu, Maa Pasalapudi kathalu tharvata…… kalanni apavaddu….

  • మరణానంతర స్వర్గం పట్ల భ్రాంతి ఉండేది కాదు.

    వాహ్ క్యా బాత్ హై 🙏🙏👍

    నేనూ జీవితంలో బాగా నమ్మే నిజమే ఈ వాక్యం.

    అభినందనలు బుజ్జి గారు..

    ఇక బ్యాంక్ స్ట్రీట్ అయిపోవడం భార హృదయ వేదనా భరితం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు