వేరు చేసే చూపు

అడుగడుగునా అనుమానపు చూపులను అవిభక్తంగా ధరించిన వాళ్ళం

నా పైదాయీష్
అందరిలాంటి ఆమ్ ఖాస్ దే
పెరుగుతున్నా కొద్దీ వేరు చేసే చూపు
సంధిస్తుంది సమాజం
ఎక్కడికెళ్లినా, ఏం చేస్తున్నా
వెంటాడే చూపు అది
వేటాడే చూపు అది
ప్రేమ చూపో,
కైపు చూపో కానే కాదు
ఆపాదమస్తకం గుచ్చే చూపు
అణువణువును గాలించే ఎక్స్ రే చూపు

*

గడప లోపల ఉన్నా
బయటకు వచ్చినా
నా పరిభ్రమణలపై డేగలా
పహారా కాసే కెమెరా కన్ను
పై చదువుల కోసం
ఆశ కొద్దీ బయటకు అడుగిడిన దాన్నీ
బుర్ఖా విప్పించి
పరీక్షా కేంద్రాల్లో జరిపే దేహపు స్కానింగులు
మా నసీబుల్లో అదే రాతను తిరగరాస్తున్నాయి

*

సాంకేతికతతో నవీనంగా కనబడే
ఏర్పోర్టులను
నేను కప్పుకునే హిజాబ్ భయపెడుతోంది తెలుసా
రహస్య అవయవాల్లో దాచిన బంగారాన్నో, మాదక ద్రవ్యాలనో
గాలించి తీసే ఆ టెక్నాలజీకి అందదట నా బుర్ఖా
అందుకే,
హిజాబ్, నఖాబ్ లను దాటుకుని
లోపల ఉన్న లిబాజ్ ను
తడిమి తడిమి చూస్తే తప్ప
తసల్లీ లేదు వారికి

*

నిఘా నీడల్లోనే జిందగీ గుజారా  చేసేవాళ్ళం
ఏ సారూప్యతలు లేకున్నా
అవమానం కానుకగా పొందేవాళ్ళం
చూపుల శరాల్లో బందీ అయిన వాళ్ళం
అవును
అడుగడుగునా అనుమానపు చూపులను
అవిభక్తంగా ధరించిన వాళ్ళం
మానకుండా సలపరిస్తోంది
పుట్టుక నుంచీ లేని విషపు చూపు గాయం
ఉంటుందో లేదో వచ్చే తరానికైనా
కరకు చూపుల నుంచి ముక్తి, విముక్తి

*

దుస్స్వప్నం

ఏ అలికిడి లేని నల్లటి రాత్రి లో
ఏ అలజడి నిండని మనసుతో
కంటి నిండా నిద్దుర పోవాలని
ఏళ్ళుగా ఆశ పడుతున్నాను

అలసిన నయనాలెప్పుడైనా
ఆదమరచి మూతలు పడినా
వికృతాకార నీడలేవో తరుముకొస్తుంటే
ఉలిక్కిపడి మేలుకొంటాను

పొట్టలో నలుసు,
చంకలో పసిగుడ్డు
ప్రాణాలుగ్గబట్టి పరుగెడుతుంటాను
అయినా దొరికిపోతుంటానెందుకో
అందుకే,
నిద్దుర పోవాలనే ఆశ అత్యాశ అవుతోంది

అత్యాచారమో,
హత్యాచారమో
రెండూ కలగలిసిన హింసాకాండో
ఇంటిల్లిపాది రక్తమాంసాల
ఖండఖండికలు చూసిన కన్నులివి
అనుభవించిన శరీరమూ ఇది
అందుకేనేమో
నిద్దురకూ నాకూ మధ్య తరగని అంతరం

న్యాయం కోసం పోరాడే గుండె
భౌతికంగా ఒప్పుకున్నా
సాక్షీభూతంగా నిలిచిన మెదడు
ఆ దారుణాన్నే ఆవిష్కరిస్తుంటుంది
ఈ రెంటి మధ్య సరిపడని పొత్తు
నా నయనాలనెప్పుడూ తెరిచే ఉంచుతోంది

*

నస్రీన్ ఖాన్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బురఖా మాటున మాదకద్రవ్యాల రవాణా..ఏ.ఒక్కరో చేసిన తప్పుకు అందరికీ పరీక్ష తప్పదు…ఆవేదన సమంజసం.
    కళ్ళముందే అయినవారు కడతేరిపోతుంటే ఇక కన్నులు రెప్పలు ఎలా వాలుస్తాయి…ఏ పీడకల చూడాలో అనే భయంతో…..కవితలు కంటిచెమ్మను రప్పించాయి నస్రీన్ గారు.

  • చూపు పై విసిరిన కవితాస్త్రాలు సూటిగా తగిలాయి నస్రీన్.. చాలా బాగా రాసారు…అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు