‘వేయి పాటలు’ అన్న శీర్షికతో వ్యాస పరంపర రాబోతుందన్న ప్రకటన చూసిన ఒక మిత్రుడు అడిగాడు, “సినిమా పాటల్లో కవిత్వపు వేటా? నువ్వేమైనా పోతన భాగవతం మీద పరిశోధనావ్యాసాలు రాస్తున్నావా ఏంటి? కవిత్వం వెతకడానికి?” అని. ఇలాంటి సందేహం మరెందరికి కలిగిందో మరి. అందుకని అతనికి చెప్పిన జవాబునే ఇంకాస్త వివరంగా రాస్తూ వ్యాసాన్ని మొదలుపెడితే బాగుంటుందనిపించింది.
కొండ లోయల్లో, ఎత్తైన చెట్ల మధ్యన, ఇరుకైన వెదురు పొదల్లో హోరుగాలి వినిపించే సంగీతానికి ఆది మానవుడు పులకించి ఉండవచ్చు. సెలయేటి గులకరాళ్ళ కదుపులో, వేగంగా సాగే నీరు బండరాయికి మోదుకునే మలుపులో నీటి పాట విన్నపుడు గుండె చెమ్మగిల్లి ఉండచ్చు. చిటారు కొమ్మలో కూసే కోయిలపాటలో మనసుకు రెక్కలు మొలిచుండచ్చు. ప్రకృతిలోని రకరకాల పాటలు విన్న ఆది మానవుడు వివిధ భావావేశాలకు లోనైయుండచ్చు. ఇవి విన్న తనుకూడా తన ఆనందాన్ని ఈలలతోనో, నవ్వులతోనో ఒక క్రమంతో వ్యక్తపరిచే పాటను అలా మొదలు పెట్టి ఉంటాడు. భయాన్ని, దుఃఖాన్ని అరుపులతోనో, కేకలతోనో తెలిపి ఉంటాడు – అదొక ఆర్ద్రగీతమయుంటుంది. పరిణామక్రమంలో భాష స్పష్టంగా ఏర్పడక ముందే పాట ఏర్పడి ఉంటుంది అన్నది నా ఊహ. మాటలన్నవి ఏర్పడ్డాక వాటిని లయబద్ధంగా ఒక వరుసలో పెట్టి వివిధ మానసికావస్థలను ప్రతిబింబించే పాటలుగా కూర్చి పాడుకుని ఉంటాడు. లిపి ఏర్పడకముందే పాడుకునే పాటలు పుట్టాయి.
చప్పుళ్ళుగా, శబ్దాలుగా ఉన్న ఆదిపాటలోకి మెల్లమెల్లగా పదాలు చేరిపోయాయి. పదాల్లోకి భావం చేరింది. ఆ భావాలను క్లుప్తంగా, లలితంగా, అతిశయోక్తిగా చెప్పడం మొదలయ్యింది.
ఒక విషయాన్ని వచనంగా చెప్పడంకంటే ఎక్కువ ప్రభావం పాటలో చెప్పినప్పుడు ఉంటుంది. పాటలోని లయో, రాగమో, పాడే గొంతో, మరేదో ఆ భావాన్ని మరింత భావావేశంగాప్రకటిస్తుంది. పైగా పాటలో అతిశయోక్తి ఎబ్బెట్టు కలిగించదు. కాబట్టే సంభాషణలో చెప్పలేని కొన్ని సున్నితమైన, అంతరంగమైన భావాలను పాటలో చెప్పేయడం సులువు. మామూలుగా మాటల్లో చెప్తే పచ్చిగా తోచేవి పరోక్షంగా పాటల్లో చెప్పినప్పుడు పచ్చిదనం పోతుంది. పాటకి అతిశయోక్తి అన్న అలంకారం ఆ వెసులుబాటుని కలిగిస్తుంది.
పూర్వకాలంనుండి పాట అన్నది మన సంస్కృతిలో ముడిపడిపోయుంది. గానంచేసేచోట ఉంటాడు విష్ణుమూర్తి అని దేవుళ్ళకే ప్రీతిపాత్రమైనదిగా పాటను భావించే దేశం మనది. ఆనందమైనా, దుఃఖమైనా, ఈ రెంటికీ మధ్యనున్న ఇతర ఏ భావాలైనా వెళ్ళబుచ్చుకోడానికి పాటే మనకి సరైన వాహకము. శ్రమచేసుకునే మనుషులు తమ కష్టాన్ని మరిచిపోడానికి హాయిగా పాడుతూ పని చేసుకునేవారు. అంటే అక్కడ పాట ఉత్సాహాన్నిచ్చే ఔషధం. పిల్లల్ని నిద్రపుచ్చడానికి జోలపాటలు పాడుతాము. అభిమానాన్ని తెలపడానికి పాట తోడొస్తుంది. భక్తిని తెలిపేందుకూ పాటలే. దేవుణ్ణి మేలుకొల్పడానికీ, నిద్రపుచ్చడానికీకూడా మనం పాటల్నే ఎన్నుకుంటాము.
పాటకున్న ఒకానొక బలం ఒకటి రెండు సార్లు వినగానే గుర్తుండిపోవడమే! ఒంటరిగా చీకట్లో నడిచేప్పుడు భయం తెలీకుండా ఉండేందుకు పాడుకుంటాము. అప్పుడు పాట ధైర్యం. సోలిపోయున్నప్పుడు మనసుకి బలాన్నిచ్చి ఉద్వేగ పరచగలదు. నవరసాలనూ పాటలో చెప్పొచ్చు. ఆహ్లాదం కలిగించే అంతులేని అమృతం పాట.
మన పూర్వులు పురాణ గాధలనూ, కావ్యాలనూ ప్రజావేదికల మీద గానం చేసేవారు. పురాణ, ఇతిహాసాలు వీధి నాటకాల రూపంలో ప్రదర్శించిన పూర్వపు రోజుల్లో ఎక్కువభాగం పాటల తోనే కథను నడిపించేవాళ్ళు. ఆ రంగస్థల కొనసాగింపే మన సినిమాలకి నాంది ఐనది. తొలినాళ్ళలో సినిమాలలో మాటలకంటే పాటలే ఎక్కువ ఉండేవి.
సినిమా అన్న గొప్ప కళ తనలో పలు కళల్ను ఇముడ్చుకుంది. పాశ్చాత్య ప్రపంచం మెల్లమెల్లగా పాటలను వదులుకుని, వీలైనంతవరకూ మాటలు తగ్గించి సినిమాని పూర్తిగా దృశ్య మాధ్యమంగా మార్చేసుకున్నా మనం మాత్రం సినిమాలనుండి పాటలను పూర్తిగా తీసేయలేదు. మొదట్లో కథను కొంత వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి, సన్నివేశ తీవ్రతనో, భావాన్నో అతిశయోక్తిగా చెప్పడానికి పాటని వాడుకున్నారు. కథలో సన్నివేశం ఎంత బలంగా ఉంటే అంత గొప్ప సాహిత్యం రాయగలిగేవారు గేయ రచయితలు. ఆ కథో, సన్నివేశమో పాటకి వస్తువయ్యేది. సాహిత్యపు విలువ ఎక్కువగా ఉండేది.
పౌరాణిక కథలూ, చారిత్రిక, సామాజిక కథలూ, ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథలూ మెల్లమెల్లగా అంతరించాయి. జీవన విధానాలు మారిపోయాయి. కావున కథా వస్తువులు మారాయి. కొత్తదనం కావాల్సొచ్చింది. పాటల అవసరమే లేని కథల్లో కూడా పాటలతోనే సినిమాలు తీశాము, తీస్తున్నాము.
క్రమంగా సినిమాల సంఖ్య పెరిగింది. సత్తువున్న కథలు కరువైయ్యాయి. బలమైన పాట సన్నివేశాలు అరుదుగా మారిపోయాయి. రాను రాను పాటల అవసరం ఎలా తయారైందంటే నటుల నాట్య ప్రతిభను ప్రదర్శించడానికో, సామాన్య ప్రజానికం స్వయంగా చూడలేని దూరప్రదేశపు అందాన్నో, విదేశాలనో చూపించడానికి అక్కడికివెళ్ళి షూట్ చెయ్యడానికి అన్నట్టు మారిపోయినప్పుడు పాట సాహిత్యానికి వస్తువు కరువైంది. అలాంటి పాటలకు సాహిత్యం అందించడం గేయ రచయితల ముందున్న పెద్ద సవాలు అనే చెప్పుకోవాలి. అలాంటి పాటలకి సాహిత్యం అందిస్తూ కూడా కొద్దో గొప్పో తమ ప్రతిభను ప్రదర్శిస్తూ కవిత్వపు మెరుపుల్ని చిలకరిస్తున్నవాళ్ళు గొప్పవాళ్ళనే చెప్పుకోవాలి.
తొలినాళ్ళలో సినిమా పాటలను సాంప్రదాయ సంగీత బాణీలోనో, పౌరాణిక శైలిలోనో కూర్చిన సంగీత దర్శకులు, క్రమంగా లలితసంగీత బాణీలనూ, జానపద సంపదనుకూడా సినిమా పాటల్లోకి ఇముడ్చుకున్నారు. అదివరకు మనకి ప్రాచూర్యంలో ఎన్ని పాటలు ఉన్నా సినిమా అన్న తిమింగలపు ఆకలికి చాల్లేదు. ఈ పరిణామక్రమంలో సినిమా పాటల రంగు మారుతూనే వచ్చింది. పాశ్చాత్య సంగీత, వాద్యాల ప్రభావం భారతీయ సినిమాపాటలమీద పడింది. ఆ దశలో రాసిన గేయాన్ని స్వరపరచడం సంగీత దర్శకులకు పెద్ద ప్రయాస అయింది. వాళ్ళు బాణీలు(తత్తకారం) ఇవ్వడం మొదలు పెట్టారు. గేయరచయితలు వాటికి పదాలల్లేవారు. బలమైన కథో సన్నివేశమో లేని పాటలకి ‘బాణీలకు పాట రాయడం’ అన్న పద్ధతి గేయ రచయితలకు సులువైంది. అయితే సాహిత్యంలో గాలిపదాలు తప్ప భావం పెద్దగా లేకుండా పోయింది. కవి హృదయమూ, పాండిత్యమూ ఉన్న గేయ రచయితలు ఇలాంటి పాటల్లోకూడా అక్కడక్కడా కవిత్వాన్నో, చమత్కారాన్నో, భాషా ప్రయోగాన్నో చెయ్యకపోలేదన్నదే వాస్తవం. అలాంటి పాటలను వేలెత్తి పాఠకులకు చూపించడమూ, గేయ రచయితల ప్రతిభను మెచ్చుకోవడమూ, ఆ గేయాన్ని రాయించుకున్న దర్శకుల అభిరుచిని అభినందించడమే ఈ వ్యాసపరంపర లక్ష్యం.
కవిత్వానికున్న ఒకానొక ప్రధాన లక్షణం క్లుప్తత. అంటే విషయాన్ని క్లుప్తంగా సూటిగా చెప్పడం. పాఠకుడి ఊహాశక్తిని విస్తరించేలా ప్రేరేపించడం. సామెతలను తీసుకుంటే తెలుస్తుంది, అవెంత క్లుప్తంగా ఉంటాయో. వాటిని అన్వయించుకునేవారి ఊహాశక్తినీ పరిధినీ బట్టి వాటిని ఎంత విస్తరించుకోవచ్చో. అంటే చీకటి గదిలో వెలిగించే దీపపు జ్వాల చిన్నదే, వెలుగుయొక్క విస్తీర్ణం పెద్దది. కవిత్వం చేసేదీ అదే.
సరళంగా సాగిపోయే ఒక బాణీలో సరిపడే ఏవో మాటలు పెట్టి పాడుకున్నా పాటే అవుతుంది. అయితే ఆ పాటలోని సంగీతం తాలూకు ఆహ్లాదం మనసుని తాకుతుందిగానీ, సాహిత్యం తాలూకు మాధుర్యం ఏమీ ఉండదు. సాహిత్యం తాలూకూ పరిమళం మనసుని తాకాలంటే దానిలో ఒక భావమో, సంఘటనో, కథో ఉండాలి – అదే ఆ పాటకి వస్తువు. ఆ వస్తువుని ఎంత క్లుప్తంగా, ఎంత చమత్కారంగా, అందంగా చెప్తే పాట సాహిత్యం విలువ అంత పెరుగుతుంది. ఆ కవిత్వాన్నే మనం ఈ వ్యాస పరంపరలో చూడబోతున్నాము.
అసలు బలహీనమైన కథలుగల ఎన్నో సినిమాలు బలమైన పాటలవల్ల నెగ్గిన సందర్భాలు కోకొల్లలు మనకు. అంటే మన దేశంలో ఒక సినిమా విజయం సాధించడంలో పాటకున్న ప్రాముఖ్యత అర్థం అవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక ఎవరికివారు, ఏ పాటైనా సరే ఎప్పుడు వినాలంటే అప్పుడు వినచ్చు అన్న సౌలభ్యం ఉందిగనుక శ్రోతలకు పాటలు మరింత చేరువయ్యాయి.
కొత్త తరాలవారికి తెలుగు సాహిత్యపు ఇతర ప్రక్రియల మీద కొద్దో గొప్పో ఆసక్తిని కలిగించే ఆదర్శంగాకూడా తెలుగు సినిమా పాటలు మారాయి అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తిలేదు. అదివరకు అన్నమయ్య కీర్తనల గురించి తెలియని ఎందరో అన్నమయ్య పాటలను సినిమాలలో విన్నాక అన్నమయ్య పదసాహిత్యం వైపుకి ఆశక్తి చూపారు. ముందు ముందు యువతలో భాషాపరమైన ఆసక్తిని కలిగించడంలోకూడా తెలుగు సినిమా పాటకి పెద్ద స్థానం ఉంది. తెలుగు భాషలో ఉన్న అఖండ సాహితీ సంపదను చవిచూపడానికీ కూడా తెలుగు సినిమా పాట ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి తెలుగు గేయ రచయితలు పాటలు రాసేప్పుడు ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని రాస్తే ఇంకా గొప్ప సాహితీ విలువలున్న పాటలు రాయగలరన్నది నా నమ్మకం.
సినిమా పాటల సాహిత్యం గురించి విశ్లేషించడానికి నాకున్న అర్హతలేంటి?
ఫేస్బుక్లో ఒకానొక చర్చలో ఓ మిత్రుడు ఇలా అన్నాడు ‘సినిమా తప్ప మరో కళా వైవిధ్యం ఎరుగని తరం మాది’ అని! ‘కాదు’ అని గట్టిగా అరవాలనిపించింది ఆ రోజు. అయితే కొంచం తీరిగ్గా ఆలోచించాక గత అరవై ఏళ్ళుగా ఎక్కువవంతు (majority) భారతీయులచేత అత్యధికంగా ఆరాధించబడే, అభినందించబడే కళ అదేనన్న వాస్తవం కళ్ళముందు మెదిలింది. నాకూ అదే జరిగింది. మొత్తం సినిమాకి అకర్షించబడకపోయినా సినిమా పాటలకి బాగా ఆకర్షింపబడ్డాను. నాకు ఊహ తెలిసిన రోజునుండీ రేడియోలో సినిమా పాటలు వింటున్నాను. మా ఇంటి రేడియో వివిధభారతి, సిలోన్ రేడియో స్టేషన్లకే ఎక్కువ సమయం ట్యూన్ అయ్యి ఉండేది. ఊహ తెలిసిన నాటినుండి తెలుగు, తమిళ పాటలను వినడమే కాకుండ రెండు భాషల్లోని సినిమా పాటల సాహిత్యాన్నీ పోల్చి చూసుకుంటూ పెరిగాను. ఒక్కోసారి అరవపాటలకి తెలుగు పదాలూ, తెలుగు పాటలకు అరవపదాలూ కూర్చి మనసులోనే పాడుకునేవాడిని.
చిన్న వయసులోనే పాటల్లో పల్లవికీ చరణాలకీ మధ్య అంత గేప్ ఎందుకు పెడతార్రా బాబూ అని నొచ్చుకునేవాడిని. కొన్ని పాటల్లో పల్లవికి ముందు ఓ అరనిముషం వాద్యాలు మోగేవి. ఇవేవీ లేకుండా పల్లవి మొదలుపెట్టొచ్చు కదా అని చిరాకు పడేవాణ్ణి. పెద్దయ్యాక నేను వాక్మన్(Walkman) కొనుక్కున్నప్పుడు కేసెట్లు రికార్డ్ చేసే షాపతనికి చెప్పి నాకు కావలసిన పాటల్ని పల్లవి-చరణం-పల్లవి-చరణం-పల్లవి అని మధ్యలో ఆ సంగీతమొచ్చే భాగాలను తీయించుకుని రికార్డ్ చేయించుకున్నాను. ఆరు నిముషాల పాటలు మూడు నిముషాలుగా తగ్గిపోయేవి. వినడానికి హాయిగా అనిపించేవి. ఇలా ఒక 4-5 కేసట్లు రికార్డ్ చేసుకున్నాను. అప్పటికే షాపతనికి చిరాకొచ్చినట్టుంది ఆ పద్ధతిలో చేసివ్వడం నా వల్ల కాదనేశాడు.
నా తోటివాళ్ళందరూ రేడియోలో పాట మొదలవ్వగానే అది ఏ పాటో చెప్పేసేవారు నేనేమో పల్లవి లైన్ వినిపిస్తేగానీ గుర్తుపట్టలేకపోయేవాణ్ణి. ఇప్పటికీ నా జ్ఞానం ఆ స్థాయిలోనే ఉందని మొన్నే ఒక మిత్రుడితో పాటల చర్చలో ఉండగా తెలిసొచ్చింది. ఒక తమిళ పాటని తన ఫోన్ లో ప్లే చేసి ఈ పాట తెలుసా అన్నాడు. 30 సెకెండ్లు దాటినా పల్లవి రాలేదు. విన్నట్టులేను అనేశాను. పల్లవి లైన్ వచ్చాక అయ్యో ఇది నాకెంతో ఇష్టమైన పాట. ఆ పాటలోని ఒక్కో పదమూ కంఠోపాటం అని ఆ లైన్స్ చెప్పాను. భాషర్థం కాకున్నా చాలామంది పాటలు వింటుంటారు. నేను అలా ఎందుకు వినలేనో అర్థం అయింది. తెలిసిన భాషలో కూడా ఎంత మంచి ట్యూన్ ఉన్న పాటైనా సరే ఆ పాటలో సాహిత్యం నచ్చలేదంటే పెద్ద వినను. చిన్నప్పట్నుండి నా దృష్టి, ఆసక్తి పాట సాహిత్యం మీదే. పాట సాహిత్యంలో కొంచం కవిత్వమో, పదాల గారడో, చమత్కారమో ఉండాలి నాకు. దాదాపు ముప్పై ఏళ్ళుగా తమిళ తెలుగు పాటలు ఇలానే వింటున్నాను. ఇప్పుడిప్పుడు కన్నడ, మలయాళం పాటలూ వింటున్నాను. ఈ అర్హత చాలనుకుంటాను.
ఏ పాటల్ను, ఎప్పటి పాటల్ను ఎన్నుకుంటాను?
75 ఏళ్ళకు పైగా మనకి సినిమా పాటలు ఉన్నాయి. ఆ సినిమా పాట అప్పుడప్పుడూ తన రూపురేఖలు మార్చుకుంది. ప్రతిభావంతుడైన ఒక కొత్త సంగీత దర్శకుడు పరిశ్రమలోకి అడుగిడినప్పుడల్లా ఓ కొత్త పెనుమార్పు సంభవిస్తూనే వచ్చిందని చెప్పాలి. ఆ రీతిలోనే ఒక్కో ప్రతిభావంతుడైన గేయరచయిత సినిమా పాట రాయడానికి వచ్చినప్పుడల్లా సినిమా సాహిత్య నది కొత్త పరవళ్ళు తొక్కుతూనే ఉంది. ప్రారంభ దశనుండి కొత్త గేయ రచయితలు పరిచయం అవుతూనే వచ్చినా కొందరే ట్రెండ్ సెట్టర్లయ్యారు. అంటే అదివరకున్న సినిమా పాటల సాహిత్య పోకడని మార్చగలిగారు. ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఆ ట్రెండ్‌లో రాస్తూ ఎంట్రీ ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే అదివరకు ఉన్నవాళ్ళూ, అంతకు పూర్వం ఉన్న ట్రెండ్ ని సృష్టించినవాళ్ళు కూడా తమ శైలిని మార్చుకుని రాయక తప్పలేదు. ఆ కాలగమన మార్పుని గుర్తించినవాళ్ళు వార్థక్యం మీదపడుతున్నా నవయవ్వనంగా కొంగొత్త పాటలు రాయగలుగుతారు.
అలా 1985 ప్రాంతంలో ఒక గేయ రచయిత పరిచయం అయ్యి కొత్త పోకడను తీసుకొచ్చాడు. నేను ఎన్నుకోబోయే పాటలన్నీ 1985 నుండి నేటిదాక పలువురు రాసిన పాటలే. వీలైనంత వరకు నేరుగా తెలుగులో వచ్చిన సినిమాలలోని పాటల సాహిత్యం గురించే విశ్లేషిస్తాను. భాషాబదిలీ(Dubbing) చిత్రాల పాటల విశ్లేషణ అసలు చెయ్యనుగానీ, తెలుగులో పునర్నిర్మించిన(Remake) సినిమాల్లోని పాటలకి మినహాయింపు ఇచ్చుకుంటాను. వచ్చే సంచికనుండి పాటల పర్వం.
*
చాలా బాగుంది భాస్కర్ గారు.మేము కూడా ఎదురుచూస్తుంటాం. ఆ పాటల పండుగ కోసం.
ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మీకు హృదయ పూర్వక అభినందనలు. అర్థవంతమైన సాహిత్యాన్ని నింపుకున్న అందమైన పాటలతో మీ విశ్లేషణ మరింత అద్భుతంగా సాగాలని మనసారా కోరుకుంటున్నాను.
ఒకప్పుడు రాసిన పాటకు బాణీ కట్టేవారు. ఆ తర్వాత బాణీకి సరిపోయేలా పదాలు కిట్టించడం మొదలయింది. ఈ రెండు ధోరణులనీ సమీపం నుంచి పరిశీలించినవారికి, తెలుగు సినిమా పాటల్లో నాణ్యమయిన సాహిత్యం ఏ ధోరణి అమల్లో ఉన్న రోజుల్లో ఎక్కువగా వచ్చిందో తెలుసు.
1985 నుంచి వచ్చిన తెలుగు పాటల్లో సాహిత్యవిలువల్ని వెతకడమంటే; ఆకారాదిక్రమంలో-అనిశెట్టి, ఆత్రేయ, ఆరుద్ర, కృష్ణశాస్త్రి, కొసరాజు, జాలాది, దాశరథి, నార్ల చిరంజీవి, పింగళి, భుజంగరాయశర్మ, మల్లాది, గోపి, వీటూరి, సదాశివబ్రహ్మం, సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, సినారె లాంటి వారి పాటలను ఇంచుమించుగా పూర్తిగా వదిలేయడమే. ఈ నేపథ్యంలో, వ్యాసపరంపరద్వారా పరిచయమయే పాటలలో సాహితీ విలువలని చవి చూడాలని నాకూ కోరికగా ఉంది.
నేను నమోదు చేసిన వ్యాఖ్యలో, రెండో పేరాలో, ఆకారాదిక్రమంలో అని అక్షరదోషం దొర్లింది. అకారాది క్రమంలో అని ఉండాలి.
1985 నుండి నేటిదాక తెలుగు సినిమాలలో పలువురు రాసిన పాటల సాహిత్యం గురించి విశ్లేషిస్తాను అని అశ్వాశననిస్తున్న అన్నమయ సంకీర్తనల వీరాభిమాని అవినేని భాస్కర్ గారూ!
యీ విషయంలో మీకెప్పుడైనా సందేహాలొచ్చినా, సమజాయించి మిమ్మల్ని ముందుకు నడిపించాలన్నా గొరుసన్న ( గజయీతరాలు కధలు రాయడవే కాక A.M. రాజాలా సుతిమెత్తగా పాడగల గొరుసు జగదీస్పర రెడ్డి ) మీకండగా ఉంటాడనే విషయం మరువకండే.
అవసరం వచ్చినప్పుడు తెనుంగు, సెన్ దమిళ్ ల సాహితీ వారధి భవనచంద్ర గారిని కూడా సాయం అడుగుదాం. ( సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్ ~ 1980, ‘ఆకలి రాజ్యం’ సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రాసినది) .
మంచి ప్రయత్నం. 85 అడ్డుగీత దేనికో అర్థం కాలేదు. ప్రతి రచయితా తన గీతలేవో తాను గీసుకుంటారు. కాకపోతే 85కు రాజకీయార్థిక ప్రాధాన్యమున్నది. అెది పాటల్లో ఎంత వరకు ప్రతిఫలించిందనేది ఆసక్తికరమైన అంశం.
1985 నుండి అంటే సిరివెన్నెల గారితో మొదలు పెట్టబోతున్నారన్న మాట 😀 అన్నమయ్య సంకీర్తన అని చాలామంది పొరపాటు పడే సిరివెన్నెలగారి పాటతో ఈ సీరీస్ మొదలెడ్తారేమోనని నా డౌటనుమానం. మీరు పరిచయం చేసే పాటలవల్ల, కేవలం పాత పాటలలో మాత్రమే సాహిత్య విలువలుంటాయి, కొత్త పాటలన్నీ చెత్త పాటలేలాంటి అభిప్రాయాలు కొంత వరకైనా తొలుగుతాయని ఆశిస్తున్నా.
All the best.
ఒక గొప్ప వ్యాసం…సినిమా పాట…కవిత్వం అనే అంశం పై..!సినీ గేయరచయతలు అందరూ చదవాల్సిన వ్యాసం. వెర్రి పాటలు రాసి మురిసిపోయే ఆ రచయితలు ఈ పాట నేపద్యాన్ని అయినా తెలుసు కొని ఇకమీదట నైనా మంచి సాహిత్య పరమైన లిరిక్స్ అందిస్తారు…
చాలా అందమైన అద్భుతమైన వ్యాసం…!భాస్కర్ గారికి అభినందనలు…
నిజ్జంగా వెయ్యి పాటల గురించి చెప్పబోతున్నారా, భాస్కర్ గారు? భలే! తొరగా మొదలెట్టండి – చదివేసి పాడేసుకోవడానికి నేను తయారు!
చాలా మంచి ప్రయత్నం.ఇంచుమించు అందరూ ఇష్టపడతారు.మీ ఉపోద్ఘాతం అద్భుతంగా ఉంది.చాలా వివరణాత్మకంగాను ఉంది .మీ పాటల సందడికి ఎదురు చూస్తుంటాం .అభినందనలు.
చాలా విలువైన, మంచి ప్రయత్నం.
పైడిపాల గారు తన PhD సిద్ధాంత వ్యాసంలో విపులంగా చర్చించారు (‘తెలుగు సినిమా పాట చరిత్ర), సినిమా పాట సాహిత్యం కూడా ఒక అపురూప సృష్టేనని.