వెళ్ళిన చోట ఏమేం వెతుక్కోవాలి?!

మధ్యే ఎక్కడో చదివాను. Travelling leaves you speechless, then turns you into a storyteller (Ibn Battuta). పది కథలు. పది ప్రదేశాలు. ఈ ఊళ్ళే శ్రీ ఊహ కి కథల చెప్పే పద్దతిని నేర్పించాయి. ప్రయాణం తొంగి చూడగల లోతులు ఇలా శ్రీ ఊహలా రాస్తేనే తెలుస్తాయి. ఊహ గొప్పదనమంతా ఇక్కడే కనిపించింది. ఎక్కడికైనా వెళ్ళడం మాత్రమే కాదు, వెళ్ళిన చోటు నిన్ను ఏం వెతకమంటోందో తెలుసుకోవడమే అసలు సృజనాత్మకత.

కాళ్ళకు చక్రాలు కట్టుకు తిరిగే వాళ్ళలో కొత్త ప్రదేశాలెంత గాఢమైన ప్రభావాన్ని చూపిస్తాయో ఈ కథలు చదివితే అర్థమవుతుంది. మనల్ని ఏ కథ ఎంత కదిలిస్తుంది (?) అందుకు ఏది ముఖ్య కారణం తేల్చుకోవడం కష్టం. మనం ఆయా ప్రదేశాల్నీ, పాత్రల్నీ తరచి తరచి తడుముకుంటాం. ఫలానా గోవాలో ఇలా ఉందా, లేదా ఫలానా ధూల్పేట్, వరంగల్, అదిలాబాద్ చోటనే ఇటువంటి కథలు సంభవిస్తాయా ? వంటి రక రకాల ఆలోచనలు మనల్ని ఉక్కిరిబిక్కి చేస్తాయి. ఈ కథలు నాలుగు చోట్లకి మనం వెళ్ళాల్సిన అవసరాన్ని, అపేక్షనీ బలీయంగా కలిగిస్తాయి. వెళ్ళడమే కాదు, వెళ్ళాక అక్కడి జీవితాల్లోకి మనల్ని మనం కోల్పోవాలనీ నొక్కి చెబుతాయి. ఈ గొప్పదనం కథలదా ? లేక ఆ ప్రదేశాలదా ? ఏది దేన్ని ప్రేరేపిస్తుంది ? అని ఆలోచించినప్పుడు శ్రీ ఊహలోని కథా రచయిత్రే, యాత్రీకురాల్ని అధిగమిస్తుంది.

ప్రదేశాల గురించి ఆసక్తిరేపిన కథల్లో బల్కావ్ (గోవా) తరానా (వరంగల్లు) ఇంకా రాత్రి చీకట్లో (బందర్ సీంద్రి) బర్కత్ (పాతబస్తీ) ముఖ్యమైనవి. ధూల్ పేట్ (లడాయి) అదిలాబాద్ (ఆతీ) ఇంకాస్త దగ్గరగా తీసుకెళ్తాయి. గోవాలో జరుగుతున్న మార్పును బల్కావ్ కథలో ఉన్న మార్టిన్ కొడుకు చూపిస్తే, కాకతీయ రాజు ప్రతాపరుద్రుని ఆస్థాన నర్తకి మాచలదేవి గొప్పదనాన్ని తరానా నిర్వహించింది. బల్కావ్ కథలో తన జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఇంటిని బిల్డర్ కి అపార్ట్మెంట్ కట్టేందుకు (Development) ఇవ్వనని తండ్రి ఎందుకు అనేవాడో కొడుకూ కోడలకి తెలిసి రావడమే కథ.

ఇందులో ఎక్కడ మన గుండె చిక్కబడుతుందో, కళ్ళెందుకు చెమ్మదేలుతాయో నాకు చెప్పడం ఇష్టం లేదు. ‘ఎన్ని చేసినా ఒత్తిడికి గురయ్యి వెళ్ళిపోయాడు. లేకపోతే అంత చక్కటి ఆరోగ్యం గలవాడు గుండెపోటు వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఏంటో’ అన్న వాక్యం ఎందుకు మనల్ని కుదిపేస్తుందో మాటలకి అందే విషయం కాదు. తరానా కథ భారతీయ సంగీత సాహిత్యాభినివేశంలో ఉన్న మూలాల్ని చాలా హృద్యంగా పట్టి చూపిస్తుంది. మాచలదేవి నృత్యం చేస్తున్న సన్నివేశంలో మనం కూడా ఆ కాలపు మండపంలోకెళ్ళి కూర్చుండిపోతాం. అజ్మత్ ఖాన్ పాత్ర చిత్రణలో ఎంతో సంయమనం ఉంది. ఆనాటి ఢిల్లీ సుల్తాన్లకి మన కాకతీయులపట్ల ఎందుకు ఆసక్తి రేగిందో అజ్మత్ ఖాన్ మాటలు తెలియజెబుతాయి.

శ్రీ ఊహ ఈ కథాంశాన్ని మలచడంలో ఎంతో ఎత్తుకు ఎదిగినట్టు కనిపిస్తుంది. సృజనకారులకి అమాయకత్వం ఎంత ముఖ్యమో అందులో ప్రదర్శితమయ్యే పరిణితి కూడా అంతే ముఖ్యం కనుక శ్రీ ఊహ తరాన, కథా నిర్మాణ కౌశలాన్ని మరింత తాజా గా ఉంచుతుంది. ఎన్ వేణుగోపాల్ అన్నట్టు ‘సాహిత్యానికీ సామాజిక శాస్త్రాలకూ, ముఖ్యంగా చరిత్ర, సమాజ శాస్త్రం ఇచ్చే పరికరాల అనుసంధానం’ ఈ కథలో అద్భుతంగా కుదురుతుంది. కథా రచన పట్ల శ్రీ ఊహ వంటి ఆధునిక కథా రచయిత్రులకు ఎంత సాంద్రమైన పునాది ఉన్నదో ఈ కథ తెలియజేస్తుంది. వరంగల్లును ఏ ఒక్కసారో చూసినందుకే శ్రీఊహలో ఇంత అద్భుతమైన కథ స్ఫురిస్తే ఇక రోజూ అక్కడే, అటువంటి చారిత్రక స్థలాల్లో ఉండేవాళ్ళకి ఇంకెంత అనిపించాలి ? అయితే అందరూ శ్రీ ఊహలా కథలు రాయకపోయినా పూట పూటకీ లోలోపల్నుంచీ కదలిపోవడం మాత్రం తప్పక జరుగుతుంది.

ఊర్లు తిరగడం (travel), మనిషిని చురుగ్గా ఉంచుతుంది. నిజమే, జ్ఞానం కూడా ఇస్తుంది. అంతేనా ? ఆమాత్రానికే అయితే ఈ కథలు మనల్ని ఆకట్టుకునేవి కాదు. శ్రీ ఊహే ‘తరాన’ లో మాచలదేవి అవతారం ఎత్తేసిందా అన్నంత మమేకత ఉంది. అంతే అర్థవంత వాస్తవికతతో (meaningful reality) మనలోని సాధుత్వాన్ని, కనికరాన్ని, మానవీయతని ఇంకా ఇలాంటి ఎన్ని పర్యాయపదాలు వాడినా సరిపోనంత పరితాపాన్ని కలిగించడంలో ‘ఇంకా రాత్రి చీకట్లో’ కథ సఫలమవుతుంది. జైపూర్ – అజ్మీర్ మధ్య గల బందర్ సీంద్రీ గ్రామపు నాట్, బేడియా స్త్రీల అత్యంత దారుణ జీవన స్థితిగతుల్ని రచయిత్రి కళ్ళకు కట్టేస్తుంది. పడుపు వృత్తిలోకి రాననీ, బొమ్మలేస్తానని చెప్పే ఒక చిన్న చెల్లిని ఆ మురికి కూపంలోకి దించాలని చూసే కుటుంబ సభ్యులదీ, ఆ రూపంలో ఉన్న వ్యవస్థదీ, ఈ కథ. చివర్లో ముంబై దాదర్ చౌపట్టీల్లో వినాయక నిమజ్జన జనసందోహంలో ఈ అమ్మయి తప్పిపోయినట్టు కథ ముగుస్తుంది. ఇందులో చాలా సంఘర్షణ ఉంది. యాత్రలు, ఇటువంటి స్త్రీల గురించిన మన ఆలోచనల్ని చాలా మారుస్తాయని చెప్పకనే రచయిత్రి చెబుతుంది. రాయడమంటే మన హృదయాన్ని మన ముందు మనమే ఆవిష్కరించుకోవడం కాదా అన్న ఎరుక కలుగుతుంది.

అనుభవాన్ని అర్థం చేసుకోవడం కూడా క్లిష్టమైన పని. అంత సులువుగా ఉండదు. అందునా ఆ అనుభవం హైద్రబాద్ పాతబస్తీలోని నిరుపేద ముస్లిం స్త్రీదో, ఆదిలబాద్ అడవుల్లోని ఆదివాసీలదో అయితే అది మరింత ముల్లువలే గుచ్చుకుంటుంది. గాయం మానదు. తొలుస్తూంటుంది. బర్కత్ లోని షాహీన్ పాత్ర అటువంటిది. దండారీ పండగకి రాలేని చెల్లెలు కోసం బస్తర్ అడవుల్లోకి వెళ్ళి సాల్వాజుడుం చేతుల్లో మరణించే ఒక అన్న కథ ఆతీ. అబ్బా – ఈ కథని చదువుతున్నంత సేపూ ఎంత నొప్పిని భరించాలిరా తండ్రీ అనిపించింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచి వేయాలన్న ప్రభుత్వాల అత్యుత్సాహంలో ఎన్ని జీవన సున్నితత్వాలు బలైపోతున్నాయో ఈ సర్వ సత్తాహక సామ్రాజ్యాధీసులకి ఎప్పటికి అర్థమవుతుందో కదా ? అని మన గుండెలు బద్దలవుతాయి. బర్కత్ కథలోని షాహీన్ కూడా అంతే. అనుమానపు భర్త, నాల్గు రాళ్ళు సంపాదించే పనిలో ఊహాతీతమైన యాతన – వీటన్నింటి నడుమ చిన్న కొడుకు హిందూ అమ్మాయి ప్రేమ వ్యవహారం, చెత్త కుప్పలో దొరికిన పసిదాన్ని ఎత్తుకుని ఇంటికి తెచ్చే ఆర్దృ స్వభావాన్ని శ్రీ ఊహ మన ఊహకు అందనంత గొప్పగా మలుస్తుంది.

అదిలాబాద్ నేపథ్యంగా రాసిన ఆతీ కథాంశం పట్ల శ్రీఊహకి ఇంకాస్త సమగ్రమైన చూపు అవసరం. సాల్వాజుడుం పనుల్ని, వాళ్ళ కర్కశత్వాన్నీ చూపెట్టినప్పటికీ ఆ స్థితికి వాళ్ళని తీసుకెళ్ళిన రాజ్య దుర్మార్గాన్ని ఇంకాస్త నిర్మాణపరం చేయాలి. అనవసర వాచ్యత ఏదో కథా శిల్పానికి అడ్డు తగుల్తుంటుంది. ఎవరన్నా మనమీద మనవాళ్ళనే ఉసిగొల్పుతున్నప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తాం ? ఆతీలాంటి కథల్లో చర్చించిన ప్రజా పోరాట నేపథ్యాల్ని పాఠకుడు అన్ని వైపులనుండీ చదువుకుంటాడన్న విషయం శ్రీఊహవంటి వారికి అనూహ్యం కాబోదు. గోండ్ల పలుకుబడిలో కూడా ఇంకొంత సహజత్వం తీసుకురావడం శ్రీ ఊహకు అసాధ్యం కాదు. అయితే గోండ్ల సాంస్కృతిక జీవితాన్ని శ్రీ ఊహ చాలా బాగా రాసింది. గోండ్లదే కాదు, ఈ కథా సంపుటిలో ఏ నేపథ్యాన్ని తీసుకున్నా రచయిత్రి చేసిన అసాధారణమైన పరిశ్రమని మనం మెచ్చుకుని తీరాలి. ధూల్ పేట్ వాతావరణాన్ని శ్రీ ఊహ చాలా దగ్గరగా చిత్రిస్తుంది. ఆ ప్రాంతం పట్ల భయం కన్నా ఒక ఆలోచనాత్మక ధోరణి కనబరుస్తుంది. ఇక పరావర్తనం, కిట్టీ పార్టీ కథలకి ఆ ప్రాంతాలే ఎందుకు నేపథ్యం కావాలో పాఠకులే నిర్ణయించాలి. ముడుపు కథ కి నిజాముద్దీన్ బస్తీ ఇరుకైన సందులు కొంత న్యాయం చేస్తాయి. చేయకపోయినా, కథ చివర్లో మిర్రూ అనే ముద్దు పేరు గల దర్పణ అనే అమ్మాయి, కథానాయకుడు కొంపదీసి నా అర్జీ కూడా (ముడుపు) కట్టావా అన్నప్పుడు “నాది కట్టాగా చాల్లే” అని అనడంతో మనం గాల్లో తేలిపోతాం.

భౌగోళిక విషయాల్నే కాదు యాత్రా స్థలాలు అక్కడి ప్రాకృతిక లక్షణాలతో బాటు మానవ జీవన స్వభావల్ని కూడా ఇముడ్చుకుని ఉంటాయి. వాటిని కథలకి ముడి సరుకు చేసుకోవడం భారతీయ సాహిత్యానికి కొత్తకాకపోవచ్చు గానీ, తెలుగులో మాత్రం ఇదొక మంచి ప్రయోగమే. తెలిసిన, లేదా అస్సలు తెలియని సాంస్కృతిక అధ్యయనాలకి ఇదొక పెద్ద వీలు. అసలు మన ఊహల్ని ఈ ‘తిరుగుళ్ళు’ తలకిందులు చేసేస్తాయి. అప్పటిదాకా మనకున్న నమ్మకాల్ని, అభిప్రాయాల్నీ తిరిగి మార్చుకోవల్సిన స్థితికి తీసుకు వచ్చినా ఆశ్చర్యం లేదు. శ్రీ ఊహ పర్యాటక లక్షణంలో సృజనాత్మకత, చారిత్రకత ఉన్నాయి. భారత దేశాన్ని చాలామంది చుట్టి తిరిగారు. రాహుల్ సాంకృత్యయాన్ గారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇంకా చాలా చాలా మంది కూడా ఉండి ఉండొచ్చు. కానీ శ్రీ ఊహ తను మోసిన బ్యాక్ పాక్ బరువునంతా ఈ కథల రూపంలో మన హృదయమ్మీదకి మీదకి బదలాయిస్తుంది. ఎంత వద్దనుకున్నా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఈ కథల్ని సెంట్రల్ లండన్ లోని థేమ్స్ నది ఒడ్డున కూచుని మరీ చదివాను. ఇవి నా ట్రావెల్ అనుభవానికి కొత్త చూపునిచ్చాయంటే అతిశయోక్తి లేదు.

బల్కావ్ (కథలు) : శ్రీ ఊహ పేజీలు: 148, ప్రతులకు: అర్క పబ్లికేషన్స్, నవోదయా హైద్రాబాద్. 

Follow Saranga on https://www.instagram.com/edi.tor472/

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

2 comments

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీ ఊహ కథల పరిచయం హత్తుకునేలా చేసారు. వెంటనే కొని చదవాలనిపించేలా కథలలోని గాఢతను తెలిపారు. ఇరువురుకి అభినందనలు.

  • శ్రీఊహ కథల్లోని ప్రత్యేకతల్ని స్పష్టంగా తెలియజేసారు.పుస్తకం తప్పక చదవాలిమంచి పుస్తక పరిచయం చేసినందుకు అభినందనలు శ్రీరాం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు