ఎఫ్ ఎమ్ లో సునీత మంద్ర స్వరం..” ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావో…”
ఈ పాట విన్నపుడల్లా ఏదో ముసురు పట్టినట్టు తీయటి జ్ఞాపకాలు మెదులుతాయి. గుండె పాదులో మొలిచిన ఆ తొలి ప్రేమ గురుతుల్ని తట్టి లేపుతుంది ఆ పాట. ఎలా మర్చిపోతాను?
తరంగాల్లా కడుపు నుండి మొదలై, హృదయాంతరాల్లోకి చేరిన ఆ కలల అలజడి ఎంత గిలిగింత పెడుతుందో,ఇప్పుడే అనుభవమైనంత ఫ్రెష్ గా!
పాట వింటూ ఏదో ఆలోచనల్లోకి జారబోతుంటే ఫోన్లో మెసేజ్ అలర్ట్ వివేక్ నుండి “సాయంత్రం ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. డిన్నర్ కి రాను” అని. తనెప్పుడూ ఇంతే, చాలా సిస్టమాటిక్ గా ఉంటాడు. ఏ చిన్న విషయాన్నీ నిర్లక్ష్యం చేయడు.
ఫోన్ పక్కన పడేసి మంచం మీద వెనక్కి ఒరిగి, ఆ పాట ను హమ్ చేస్తూ అది రేకెత్తించిన పాత జ్ఞాపకాల్లోకి ఇష్టంగా జారిపోయాను.
**********
డిగ్రీ మొదటి సంవత్సరపు రంగురంగుల రోజులవి.
గవర్నమెంట్ సైన్స్ కాలేజ్ చాలా విశాలంగా, చుట్టూ పచ్చని చెట్లు, రంగు రంగుల పూల మొక్కలతో చిన్న సైజు ఉద్యానవనంలా భలే బాగుండేది.
మొదటి రోజు కాస్త భయపడుతూనే కాలేజీకి వెళ్ళాను.
అసలే కొత్తవాళ్ళతో మాట్లాడటం అంతగా అలవాటు లేదు నాకు. అంత గుంపును చూసేసరికి అరచేతుల్లో చెమటలు మొదలయి, నడక వేగం ఇంకా తగ్గింది.
ఆరోజు మొదటి క్లాస్ కెమిస్ట్రీ.
ఎదురుగా వస్తున్న ఇద్దరమ్మాయిల్లో ఒకమ్మాయిని అడిగాను, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ క్లాసు ఎక్కడా అని.
నా ప్రశ్న గొంతు దాటి బయటికి రానట్టుంది, అందులో ఒకమ్మాయి ప్రశ్నార్ధక చూపు అర్ధం అయి, ఈసారి గట్టిగానే అడిగాను. ఆపోజిట్ లో ఉన్న ఉన్న ఒక గది వైపు వేలితో చూపించింది.
క్లాస్ రూంలోకి వెళ్ళి ఖాళీగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నాను. ముందు వరసలో కూర్చున్న అమ్మాయిల్లో ఒకమ్మాయి నా వైపు తిరిగి తనను పరిచయం చేసుకుని స్నేహంగా నా వివరాలు అడిగి తెలుసుకుంది. అదే మొదలు మాలిని తో స్నేహం.
వారం గడిచేసరికి బాగా క్లోజ్ అయిపోయాం. ఒకరోజు క్లాసులు ఏమీ లేకపోవడంతో ఆర్ట్స్ కాలేజ్ లో బీకాం చదువుతున్న తన ఫ్రెండ్ టీనాని కలవడానికి ఇద్దరం వెళ్ళాం.
తనకీ అది లంచ్ బ్రేక్ అవడంతో, కాసేపు కూర్చుని బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. టీనా మొదటి పరిచయంలోనే బాగా నచ్చింది. తనకు కూడా నేను బాగా నచ్చానని మాలిని తర్వాతి రోజే చెప్పింది. మా ముగ్గురి స్నేహం గాఢంగా పెనవేసుకుంది
******* *********
ఆ రోజు జువాలజీ ప్రాక్టికల్ క్లాస్. కెలోటిస్ (తొండ) ని డిసెక్ట్ చేయాలి. నా దగ్గరేమో డిసెక్షన్ బాక్స్ లేదు. ఏం చేయాలా అని దిక్కులు చూస్తున్న నాకు, ఒకబ్బాయి దగ్గరగా వచ్చి “మీకు కావాలంటే ఇది తీసుకోండి, నేను ప్రాక్టికల్ చెయ్యడం లేదు” అని ఎదురుగా ఉన్న టేబుల్ మీద బాక్స్ పెట్టి వెళ్ళిపోయాడు. నన్నే గమనిస్తున్నాడా అని కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా, నాకిప్పుడు అవసరం కదా అని మారు మాట్లాడకుండా తీసుకున్నాను.
అలా పరిచయం అయ్యాడు విహారి.
గలగలా మాట్లాడటం, జోక్స్ వేసి బాగా నవ్వించడం ..ఇవే పన్లుగా ఉండేవాడు. ఎప్పుడూ అంత యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతాడో. క్లాసులకు మాత్రం రెగ్యులర్ గా వచ్చేవాడు కాదు. కాలేజ్ కి వచ్చిన రోజు మాత్రం యమా సందడిగా, సరదాగా ఉండేది. మేమిద్దరం మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువే. తను ఎప్పుడు క్లాస్ కి వచ్చినా, చుట్టూ అమ్మాయిలూ, అబ్బాయిలూ గుమిగూడి ఉండేవారు. నేను మాత్రం చూసీ చూడనట్లు ఉండేదాన్ని. తర్వాత తెలిసింది మాలిని, విహారి, టీనా స్కూల్ ఫ్రెండ్స్ అని.
ఒకరోజు క్లాస్ రూం లోకి వెళ్ళేసరికి ఎప్పటిలాగానే సందడి సందడిగా అనిపించింది. అనుకున్నట్టుగానే విహారి, చుట్టూ అందరూ. వైట్ కాటన్ ఫుల్ హాండ్స్ షర్ట్ వేసుకుని టేబుల్ మీద కూర్చుని, కాళ్ళు ఊపుకుంటూ, చేతులు తిప్పుతూ ఏదో మాట్లాడుతున్నాడు. భలే మెరిసిపోతున్నాడే అనుకున్నాను. ఇంతలో నన్ను చూసి హాయ్ అన్నాడు,
కళ్ళతోటే చిన్న నవ్వు నవ్వాను.
ఆ తర్వాత రోజు తెలిసింది, తనకి వేరే స్టేట్ లో మెడిసిన్ లో సీట్ వచ్చి వెళ్ళిపోతున్నాడు అని. ఓహ్! అయితే ఇంక కాలేజ్ కి రాడన్నమాట అని మనసులోనే అనుకున్నాను.
ఫైనల్ ఎగ్జామ్ డేట్ రావడంతో నేనూ సీరియస్ గా ప్రిపేర్ అవడంలో బిజీ అయిపోయాను.
మాలిని, నేను, టీనా కంబైండ్ స్టడీస్ చేయాలనుకున్నాం. అమ్మ కాదనలేదు. బట్టలు సర్దుకుని టీనా ఇంటికి వెళ్తుంటే అమ్మ ఎన్ని జాగ్రత్తలు చెప్పిందో. వాళ్ళిద్దరితో గడపబోతున్నా అనే ఉత్సాహం నాలో.
మాలిని ఇంటి కంటే టీనా ఇల్లు చాలా పెద్దది. ఇంటి నిండా రకరకాల పూల చెట్లే. గాలి లో నాటు గులాబీల పరిమళం, ఎండను తప్పించి, చల్లటి గాలితో పాటు వెదజల్లే పొగడ పూల పరిమళం హాయిగా.
వేసవిలో ఆరు బయట కుర్చీలు వేసుకుని, మల్లెలు, జాజుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ, కొబ్బరీనెల మధ్య సందుల్లో నుండి కనీ కనిపించకుండా దోబూచులాడే జాబిల్లితో ముచ్చట్లు చెబుతూ గడిపిన ఆ మధురమయిన రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయి ఇక?
కాసేపు చదువు, కాసేపు కబుర్లూ. నిద్రొస్తే కాలనీ అంతా ఒక రౌండ్ వేసి వచ్చేవాళ్ళం.
ఒకరోజు నడుస్తున్నపుడు మాటల్లో విహారి టాపిక్ తెచ్చింది మాలిని. విహారి చేరిన కాలేజ్ విశేషాలు ఇద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మౌనంగా ఆసక్తిగా వాళ్ళ మాటలు వింటూ ఉన్నాను.
విహారి ఇల్లు అక్కడికి దగ్గరే అని అప్పుడే తెల్సింది. ఆ రాత్రి, డిన్నర్ చేసి కాసేపు చదువుకుందాం అని తలా ఒక పుస్తకం పట్టుకుని కూర్చున్నాం.
“విహారిని సరదాగా ఏడిపిద్దామా” అన్న మాలిని గొంతు వినపడింది.
తలెత్తి చూసాను.
‘ఎలా’ అన్న టీనా ప్రశ్నకు, “ఏముంది? ఎవరో తెలీకుండా ఫోన్ చేద్దాం. మనిద్దరి గొంతులూ తెల్సు కాబట్టి గుర్తు పట్టేస్తాడు. కీర్తిని దించుదాం”
అప్పటిదాకా వింటున్న నేను ఉలిక్కిపడ్డాను. “ ఏంటి దించేది? మీ ఇద్దరికీ ఏమన్నా మతి పోయిందా? ఆ అబ్బాయిని ఏడిపించడం ఏంటి? అందుకు మీరు నన్ను ఎంచుకోవడం ఏంటి”
ఇద్దరూ నా చుట్టూ చేరి,” సీరియస్ కాదు కదా, జస్ట్ సరదాగానే, ఈ హెక్టిక్ చదువులో కొంచెం బ్రేక్” బతిమాలి ఒప్పించారు.
దాదాపు ఒక గంట తర్వాత, కాస్త భయంగా, అయిష్టంగానే ఒప్పుకున్నాను.
“ఆపరేషన్ చిన్ని” దాని పేరు.
సాయంత్రం ముగ్గురం కాలనీలో నడుస్తుంటే ఎదురుగా విహారి స్కూటర్ మీద వస్తూ మమ్మల్ని చూసి, బండాపి పలకరించాడు
“నువ్వెప్పుడొచ్చావ్?” అన్నాడు.
ఎందుకో కంగారుతో చెప్పలేకపోయాను. ఈ లోపు మాలిని చెప్పేసింది.
గట్టిగా నవ్వాడు “ఆ అమ్మాయిని చెడగొట్టకండి, అసలే అమాయకురాల్లా ఉంది” అంటూ సర్రున బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు.
“అబ్బో, విహారికి నీ మీద భలే కన్సర్న్ ఉందే, ఇదే కంటిన్యూ అయితే బాగానే ఏడిపించొచ్చు” మాలిని గట్టిగా నవ్వుతోంది.
“నాకెందుకో మళ్ళీ ఇది కరెక్ట్ గా అనిపించట్లేదే, మానేద్దామా” అన్నాను.
ఇద్దరూ ససేమిరా అన్నారు.
ఆ మరుసటి రోజు టీనా ఇంట్లో మేం ముగ్గురం తప్ప ఎవరూ లేరు, ఆపరేషన్ మొదలైంది.
ఆ ముందు రోజు చూసిన ‘గులాబీ’ సినిమా ప్రభావం ముగ్గురి మీదా ఉండి, పెద్దగా ఆలోచించకుండానే ఒక ఐడియా తట్టేసింది.
తెల్ల పేపర్ మీద ఉన్న విహారి ల్యాండ్ లైన్ నంబర్ ను వణుకుతున్న చేతులతో డయల్ చేశాను. చివరి అంకె దగ్గరికి వచ్చేసరికి వణుకు. గొంతు తడారిపోయింది.
ఇలాటి పన్లు ఎప్పుడైనా చేసుంటేగా?
తను రిసీవర్ ఎత్తగానే, ఠపీమని పెట్టేసాను ఫోన్.
దాదాపు పది రోజుల పాటు, నేను కాల్ చేయడం, తను లిఫ్ట్ చేయడం, తర్వాత నేను కాల్ కట్ చేయడం. చివరికి ఒక రోజు ఏదో ఒకటి మాట్లాడమన్నారు.
చిత్రంగా ఈసారి నేను ‘నో’ చెప్పకుండా ఒప్పేసుకున్నాను.
కొంచెం ఎక్సైటింగా చేసాను ఈసారి. అవతలి నుండి తన గొంతు వినగానే ఈవేపు నుండి లోగొంతుకతో “హలో” అన్నాను.
“చెప్పండి ఎవరు కావాలి?” తన గొంతు.
‘మీరే’
“మీ స్వీట్ వాయిస్ బాగుంది. దయచేసి ఎవరో చెబుతారా?”
“వాయిస్ స్వీట్ గా ఉంది అంటే పేరు చెప్పేస్తారా?”
“సరే, మరి మీ పేరు తెలియాలంటే ఏం చేయాలి ?”
“సరే, పేరు మాత్రం చెబుతాను” అని “చిన్ని” అన్నాను.
గలగలా ఏవేవో మాట్లాడేస్తూ ఉన్నాడు అలవాటుగా.
గిల్టీ గా అనిపించింది
నా ఎదురుగా కూర్చున్న ఇద్దరూ బాగానే ఏడిపిస్తున్నావ్ గా అంటూ సైగలు చేస్తున్నారు.
ఫోన్ పెట్టేసి, “ఇక చాలే, ఇంతకంటే ఎక్కువ చేయొద్దు. పాపం ఎవరో తెలీక టెన్షన్ తో చచ్చిపోతున్నాడు” అన్నాను.
“ఇంకో రెండు, మూడు సార్లు చేసి ఆపేద్దాం, జస్ట్ సరదాగానే కదా”
“ఈరోజు మేము చెప్పమన్నట్లు చెప్పు. ఇక ఇంతటితో ఆపేద్దాం” అని అంది మాలిని ఒకరోజు.
“సరే, ఏం చెప్పాలో చెప్పండి?” అన్నాను.
మాలిని చెప్పిన మాట విన్న “నేను, వద్దే, ఇలా చేయడం తప్పు, తను ఇబ్బంది పడతాడు” అన్నాను.
“ఇదే చివరిది అనుకున్నాం కదే, కాల్ చెయ్ ‘ ప్లీజ్ ‘ అంటూ ఇద్దరూ బలవంతపెట్టారు.
చాలా అయిష్టంగానే డయల్ చేసాను. “హలో” అన్న అతని గొంతు వినగానే, గ్యాప్ ఇవ్వకుండా, “నేను చెప్పినట్లు చేస్తే, ఈరోజు మీరు నన్ను చూడొచ్చు” అన్నాను.
“నిజమా?”
ఎంతో ఆశ, ఆశ్చర్యం అతని గొంతులో.
“అవును” నీరసంగా నేను.
“నేను రెడీయే. ఏం చెయ్యాలి?” అన్నాడు.
“మీకు శ్రీనగర్ కాలనీలో ఉన్న వెంకటేశరస్వామి గుడి తెలుసు కదా!”
“ఆ..ఆ..తెలుసు”
“ఇప్పుడు టైం ఉదయం పది అయింది. ఈరోజు ఫ్రెండ్స్ తో కలిసి గుడికి వెళ్తున్నాను. పదీ నలభై అయిదుకల్లా అక్కడికి చేరుకుంటాను. ఒక పావుగంట మాత్రమే అక్కడ ఉంటాను. ఆలోపు మీరు రాగలిగితే నన్ను కలుసుకోవచ్చు. నేను బేబీ పింక్ చుడీదార్ లో ఉంటాను, ఆ టైం వరకూ రాలేకపోతే మీరెప్పటికీ నన్ను చూడలేరు, ఇదే నా చివరి కాల్ అవుతుంది” అని ఫోన్ పెట్టేసాను.
ఫోన్ పెట్టేసాక, విహారి పరిస్థితి తల్చుకుని ఇద్దరి మీదా బాగా కోపం వచ్చింది.
“ఇప్పుడు టైం పదయింది. అతను ఎంత త్వరగా బయలుదేరినా గుడికి చేరుకునేసరికి పదకొండు అవుతుంది. ఇదంతా అవసరమా ” అని నిష్టూరంగా అన్నాను.
వెంటనే మాలిని నా కళ్ళల్లోకి చూస్తూ, “ఏమిటే నువ్వు అంత ఎమోషనల్ అవుతున్నావు, కొంపదీసి నీకు విహారి మీద ప్రేమ కానీ పుట్టిందా?”
“ప్రేమా, దోమా ఏం లేవులే కానీ, ఇక ఇది ఇంతటితో ఆపేద్దాం” నిజాయితీగా అన్నాను.
ఇంతలో టీనా వచ్చి, “నిజమేనే పాపం బానే ఏడిపించాం. ఇక చాలు” అన్నది.
ఆ రోజు సాయంత్రం మాలినికి జ్వరం రావడంతో స్టడీస్ కి రాలేదు, టీనా వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉండటంతో అందరూ వెళ్ళారు.
ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. బయట సన్నని తుప్పర్లతో వర్షం మొదలైంది. చల్లటి గాలికి పూల వాసన భలే గమ్మత్తుగా ఉంది. ముప్పిరిగొన్న ఆలోచనలు విహారి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.
పాపం నాకోసం ఎంతసేపు వెదికి ఉంటాడో, నేను కనిపించక డిసప్పాయింట్ అయుంటాడు ఇలా మనసులో అనుకుంటూ, ఏదయితే అదయిందిలే అనుకుని తన నంబర్ డయల్ చేసాను.
రెండో రింగ్ కే ఠక్కున ఎత్తి, “ఎంతసేపు చూసానో తెల్సా! దూరం నుండి ఎవరు పింక్ డ్రెస్ లో కనిపించినా నువ్వే అనుకునేవాడిని. కానీ దగ్గరకు వచ్చాక నువ్వే అనుకునేలా నా మనసుకి ఎవరూ అనిపించలేదు. నిన్ను చూడకపోయినా, నీ గురించిన ఒక అపురూప చిత్తరువు నాలో నిలిచిపోయింది”.
“ఇంతకీ నువ్వు ఎక్కడున్నావ్ నాకు కనిపించకుండా? నువ్వు చెప్పినట్లుగా నేను కరక్టుగా పదకొండుకే చేరుకున్నా కదా ” అని నీరసంగా అనేసరికి, ఏదో ట్రాన్స్ లో ఉన్న నేను ఈ లోకంలోకి వచ్చి నిజంగా గిల్ట్ ఫీల్ అయ్యాను.
నన్ను కలవలేకపోయానే అనే నిరాశ అతనిలో స్పష్టంగా తెలుస్తోంది.
ఇది ఇంతటితో ఆపకపోతే అతను ఇంకా సీరియస్ గా తీసుకుంటాడేమో అనిపించింది
“ఇప్పటిదాకా నేను ఎవరి కోసమూ ఇంతలా ఎదురు చూడలేదు తెలుసా!” మళ్ళీ అన్నాడు.
“నాకు తెలియకుండానే నువ్వంటే ఇష్టం ఏర్పడింది.”
“నీకో విషయం తెల్సా, టీనా, మాలినీల ఫ్రెండ్ కీర్తి అనుకుంటరా నాకు కాల్ చేసేది” అని నా ఫ్రెండ్ హరి తో అంటే, వాడేమన్నాడో తెలుసా, “నీకంత సీన్ ఉందారా? ఆ అమ్మాయి నీకు కాల్ చేయడం ఏంటి” అని. నిజమే కదా ఆ అమ్మాయి నాకెందుకు చేస్తుంది అనుకున్నాను మళ్ళీ.
“కానీ నువ్వు కీర్తి అయితే ఎంత బాగుండు”
అప్పటిదాకా మామూలుగా అతని మాటలు వింటున్న నాకు ఒక్కసారిగా ఏదో ఆవహించేసినట్లనిపించింది. గుండె చల్లబడి పోయింది.
అది ఈ క్షణం మాత్రమే కలిగింది కాదు అని స్పష్టంగా తెలుస్తోంది. అంతరాంతరాల్లో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న ఇష్టం కరగడానికి సిద్ధంగా ఉంది.
“అవునని చెప్పవా?” అతని గొంతులో లోతయిన అభ్యర్థన.
చెప్పాలని ఉంది, కానీ చెప్పలేను.
ఒళ్ళంతా చెమటలు నాకు. గొంతు పెగలడం లేదు.
ఇంతలో తనే మళ్ళీ, “ప్లీజ్! ఇంక ఈ దాగుడు మూతలు ఆపి నువ్వు ఎవరో చెప్పు”
కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అయ్యేలా లేదు.
వెంటనే ఫోన్ కట్ చేసేసాను.
‘చిన్ని’ పేరుతో నేను విహారికి చేసిన కాల్స్ ఆ రోజుతో కట్.
సరదాగా కాల్స్ చేసి ఏడిపిద్దాం అన్న వాళ్ళిద్దరూ బానే ఉన్నారు, మళ్ళీ ఆ ఊసు కూడా లేదు.
కానీ నా పరిస్థితి ఎలా, ఎవరికి చెప్పను. సరదాగా మొదలు పెట్టినా, నేనూ కూరుకుపోయాను కదా!
“నువ్వు కీర్తి అయితే ఎంత బాగుండు” అన్న విహారి మాట నా చెవుల్లో మ్రోగుతూనే ఉంది. కానీ ఒప్పుకునే ధైర్యం నాకెక్కడిది.
అయినా ఒక ఆడపిల్ల నోరు తెరిచి అవును, నేనే ఆ అమ్మాయిని. నువ్వంటే నాకూ ఇష్టం అని చెప్పగలదా? దానికితోడు కాస్త మొండితనం, బింకం ఉన్న అమ్మాయిని. ఏదీ తొందరగా ఒప్పుకునే మనస్తత్వం కాదు. అదీ కాక, ఎన్నో ఏళ్ళ క్రితం, ఇప్పటి అమ్మాయిల్లా ఓపెన్ గా ఉండలేని రోజుల్లో.
మాటలు కరిగి, ఆవిరయిపోయాయి!
నా ప్రమేయం లేకుండానే పుట్టిన ప్రేమ తెల్లారేసరికి మసకబారింది.
అలా రోజులు, నెలలు, సంవత్సరాలూ గడుస్తూనే ఉన్నాయి.
అప్పుడప్పుడూ టీనా, మాలిని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విహారి అక్కడే ఉండి వుంటే కలుస్తున్నాడు. ఒకటి, రెండు సార్లు బర్త్ డే లకు గ్రీటింగ్స్, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరిగింది.
కానీ నాకు అదంతా యాంత్రికంగా అనిపించేది.
మునుపటి ఉత్సాహం, ఆరాటం కనుమరుగైపోయింది.
పీజీలో సీట్ వచ్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను.
అలా మా అందరి మధ్య చాలా కాలం పాటు గ్యాప్ వచ్చింది. అలాగే విహారి విశేషాలు తెలిసే అవకాశమూ లేకుండా పోయింది.
నా పీజీ అవగానే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వివేక్ తో నా పెళ్ళి కుదిరింది.
వివేక్ చాలా సౌమ్యుడు. ఒకరోజు ఇద్దరం కలిసి పర్సనల్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడానికి షాప్ కి వెళ్ళాము.
విహారి గురించి జరిగిన కథంతా చెప్పేసాను. అప్పుడే నాక్కాస్త రిలీఫ్ అనిపించింది.
కాసేపటికి తనే అన్నాడు, జరిగిన దాంట్లో ఎవరి తప్పూ లేదు, నీలాంటి మంచి అమ్మాయి దక్కాలని నాకూ, అతనికీ ఎక్కడో ఇంకో మంచి అమ్మాయి రావాలని ఉందేమో. కూల్ అంటూ నా చేతిని తన చేతిలోకి తీసున్నాడు. ఆ స్పర్శ కలిగించిన భరోసాతో తేలిక పడ్డాను.
పెళ్ళికి టీనా మాత్రం వచ్చింది. మాలిని డుమ్మా.
రోజులు గడుస్తున్నాయి. ఆరేళ్ళ తర్వాత మా ఇంట్లో పాప బోసి నవ్వులు విరిశాయి.
వివేక్ కి ఇంకా మంచి ఉద్యోగం వచ్చింది. పాప పుట్టిన తర్వాత బాగా కలిసొచ్చిందనే అందరి మాటలూ గమ్మత్తుగా ఉన్నా, మాకూ హ్యాపీగా అనిపించేది.
ఆ పాట వింటుంటే పాత జ్ఞాపకాలన్నీ తెర మీద సినిమాలా కదిలాయి. విహారి ఎక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో? పెళ్లయి ఉంటుందా?పిల్లలా?
ఈరోజు ఆఫీస్ లో మీటింగ్ ఉందని ఎనిమిదింటికే వెళ్ళిపోయాడు వివేక్.
పదింటికల్లా పాపకి స్నానం చేయించి పడుకోబెడుతుంటే ఫోన్ మోగింది
అటునుండి ‘హలో’ అనే అదే చలాకీ స్వరం.
తటుక్కున ‘ఈ వేళలో నీవు….’ పాట గుర్తొచ్చింది.
నాలో ఏదో మోహగీతం రాగమాలికలా!
వెంటనే తేరుకుని, “హే…ఎలా ఉన్నావు? నా నంబర్ నీకెలా తెలిసింది” లాంటి ప్రశ్నల పరంపరతో ముంచెత్తాను.
ఈసారి ఆశ్చర్యపోవడం తన వంతు అయింది.
“నువ్వేనా? భలే గలగలా మాట్లాడేస్తున్నావ్” అని నవ్వుతూ అన్నాడు.
“మార్పు బాబూ, ఏం మారకూడదా ఏంటీ కాలంతో పాటు ?” అని నేనూ కాస్త హుషారుగానే అన్నాను.
“చాలా కష్టపడి నీ నంబర్ సంపాదించాలే కానీ, నీకొక మాట చెబుదామని చేసాను” అన్నాడు.
ఒళ్ళు దడగా అనిపించింది. ఇప్పుడేం చెబుతాడో ఏమిటో అని.
కంగారు లోపలే దాచుకుంటూ అడిగాను, “ఏంటో చెప్పు”
“చాలా చెప్పాలి, కానీ ఎలా మొదలుపెట్టాలో అర్ధం కావడం లేదు ‘ చిన్నీ ‘ అని అన్నాడు.
నాలో వెయ్యి విస్ఫోటనాలు.
మొదటిసారి తనకి కాల్ చేసినపుడు ఎలా ఫీల్ అయానో, సరిగా అలాగే ఉంది నా పరిస్థితి ఇప్పుడు.
నీరసంగా పక్కనే ఉన్న బీన్ బ్యాగ్ లో కూలబడ్డాను.
అతను మాట్లాడుతూనే ఉన్నాడు.
“నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా! వివేక్ లాంటి మంచి వ్యక్తి నీకు భర్తగా దొరకడం. నిజం చెబుతున్నా కీర్తీ”
మౌనంగా వింటున్నా.
“నీ పెళ్ళికి రెండు నెలల ముందే నాకు తెలిసింది నువ్వే ‘చిన్ని’ అనే పేరుతో నాకు కాల్స్ చేసావని. అప్పుడే వచ్చి నిన్ను కలవాలని, గట్టిగా అరిచి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పాలని, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఆ కాల్స్ చేసింది కీర్తినే అని చెప్పెయ్యాలనీ, ఇలా ఎన్నో అనుకున్నాను. కానీ ఏదీ చేయలేకపోయాను. కారణం ఏంటో తెలుసా!
నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అనే భయం.
అప్పట్లో నీ కళ్ళల్లో ‘నా కోసం’ వెలిగిన మెరుపును, ప్రేమను కనిపెట్టని నా అసహాయతను నువ్వెంత ఈసడించుకుంటావో అని.
అప్పుడు నీ మనసులో ఏముందో తెలీదు, ఇప్పుడు తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఇట్స్ టూ లేట్” గొంతులో చిన్న నిరాశా వీచిక.
ఇప్పుడు కూడా ఎందుకు కాల్ చేసానంటే నా స్నేహితుడి కామన్ ఫ్రెండ్ వివేక్ అనీ, మాటల సందర్భంలో నీ వివరాలు కూడా తెలిసాయి.
మీ ఇద్దరి అన్యోన్యత గురించి విని, ఒక్కసారి నీతో మాట్లాడి ఈ రెండు ముక్కలూ చెప్పాలనుకున్నాను.
నిజం చెబుతున్నా. సో హాపీ ఫర్ యూ. నీకు వివేక్ కాకుండా, ఇంకెవరో వచ్చి, నువ్వు ఇంత సంతోషంగా లేకపోయి ఉంటే , జీవితాంతం నన్ను నేను క్షమించుకునేవాడిని కాదు. ఆ బాధ ఎప్పుడూ నన్ను వెంటాడి ఉండేది. వివేక్ గురించి తెలిసాక, నీతో మాట్లాడాలి అనిపించింది” అన్నాడు.
అంతా విన్నాక నెమ్మదిగా అడిగాను, “సరే నీ సంగతేంటి? పెళ్ళి, పిల్లలూ?”
“దూరపు బంధువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. తను కూడా డాక్టర్.
ఒక బాబు పుట్టాడు. పేరు నిహాల్.”
అప్పటిదాకా కాస్త గజిబిజిగా ఉన్న నా మనసుకి ఈ రెండు మాటలూ వినగానే చాలా సంతోషంగా అనిపించింది. ఊపిరాడినట్టు అయింది.
“అవునా?ఎన్నేళ్ళు బాబుకి? ” కాజువల్ గా అన్నాను.
“బాబుకి ఇప్పుడు అయిదేళ్ళు. ఆటిజం. మాట్లాడలేడు. అన్నీ సైగలతోనే” ఒక్క క్షణం ఒళ్ళు చల్లబడి పోయింది. గొంతులో మాటలు ఇరుక్కు పోయాయి.
“అమ్మ ఎప్పుడూ తన దగ్గరే ఉండాలి. ఎవరితోనూ కలవలేడు కదా, వేరే పిల్లల్తో స్నేహం, ఆటలు ఏమీ లేవు వాడికి. అంతా టైం టేబుల్ ప్రకారం జరగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా హైపర్ అయిపోతాడు. బట్ ఇట్సోకే. అవన్నీ నార్మలే ఆటిస్టిక్ కిడ్స్ కి” మామూలుగా అన్నాడు.
ఏమనాలో తెలీలేదు.
“మాక్సిమం వాడికి టైం తప్ప మేమిద్దరం ఏమీ ఇవ్వలేం” అన్నాడు. అలా అంటున్నపుడు అతని గొంతులో కొద్ది పాటి మెరమెర గమనించాను.
జీవితాన్ని సింపుల్ గా తీసుకుని, సరదాగా ఎలా మలచుకోవాలో సింగిడి లాంటి ఈ అబ్బాయి నుండే కదా నేర్చుకున్నాను!!
నా నిశబ్ధాన్ని బ్రేక్ చేస్తూ, “సరే ఉంటాను. టేక్ కేర్” అనగానే ‘యూ టూ ‘ అంటూ పెట్టేసాను.
ఒక్కసారిగా నీరసం ఆవహించేసింది.
మన చుట్టూ ఉండే ఆప్తులకు, దగ్గర వాళ్లకు చిన్న అసౌకర్యమో, బాధనో కలిగితే మనకూ దిగులు మేఘం ఆవరించినట్టు అవుతుందే. అసలే నాకు పిల్లలంటే ప్రాణం. పార్క్ లో సీతాకోక చిలకల్లా, ఎగిరే పక్షుల్లా ఆడుకునే పిల్లలని చూస్తే, ఎంత సేపూ ఇంటికి రాబుద్ధి కాదు.
విహారి కొడుకు గురించిన ఆలోచనలతో మనసంతా గందరగోళంగా అనిపించింది. వాడికి రోజంతా ఎలా గడుస్తుంది? ఆలోచనలు లేని ఆ మనసులో ఏం నడుస్తుంది? విహారో అతని భార్యో బయటికి వెళ్ళినపుడు “వాడేం చేస్తున్నాడో” అని ఆలోచన మెదిలితే? ఏం చేస్తుంటాడు వాడు?
దుఖంగా అనిపించింది. ఇంతలో ఫోన్లో మెసేజ్.
పక్క ఫ్లాట్ లో ఉండే స్నేహితురాలు అను.
మళయాళంలో ‘ థిరికే ‘ అనే సినిమా వచ్చిందట. ఆటిజం పిల్లవాడి గురించి బాగుంది, వెంటనే చూసెయ్ అని.
రిమోట్ తీసుకుని స్క్రీన్ ఆన్ చేసాను ఆ సినిమా చూద్దామని. టైటిల్ చూసి సినాప్సిస్ చదవగానే నిహాల్ ఆలోచనల్లోకి వచ్చాడు.
ఇక నుండీ నాకు ‘ ఈ వేళలో ‘ పాట వింటే విహారి కాకుండా, అతని కొడుకు గుర్తొస్తాడేమో, ‘ ఏం చేస్తు ఉంటాడో’ అని.
కరగని దుఖమేఘం ఎంత బరువో. రెక్కలు విప్పుకునే స్వేచ్చ ఒకటుందని తెలియని ఆ పసివాడి జీవితంలో వెలుగు రేకలు వికసించే రోజొకటి వస్తే ఎంత బాగుండు. ఆ దుఖం దూది పింజలా తేలిపోయే కాలం మున్ముందు ఉంటుందనీ, అది నిజం కావాలని కోరుకుంటూ చిన్ని ఆశతో కళ్లు మూసుకున్నాను.
*
నిజంగా మనసుకు హత్తుకునే విధంగా ఈ జీవిత కథ ఉంది…. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుందేమో! నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది…. మీరు ఆ బాబును చూశారా?
బావుంది