ఏదో ఎర్రటి దుఖం
పారాగ్లైడ్ చేస్తూ వచ్చి
నా ఆలోచనల్ని ఆక్రమించింది
ఎక్కడో నాలుగు సరిహద్దుల మధ్య
ఖైదుజేసిన కన్నీళ్ళు నా కలలోకి
అనుమతి లేకుండా చొరబడ్డాయి
నా పడక చూరంతటా
శతాబ్ధాల వారీగా అమర్చిన
అనామక శవాల గుట్టలు
తీరని కోరికల చిట్టాలు
సగం కాలిన జ్ఞాపకాలు
రాలిన సన్నజాజిలోకి
ఈదుకుంటూ పోతుంది
ఓ సుదీర్ఘ నిట్టూర్పు
కొన ఊపిరితో ఊగుతూ
అనంత స్వప్నంలోకి జారుతూ
ప్రేమికులూ పసికందులూ
సముద్ర కెరటాల పొత్తిల్లలో
యుద్ధ వాసన
పుట్టిన భూమిలో
పరాయిగా మిగిలిన
పేగు యాతన
నేనో నిర్వీర్య ప్రేక్షక…
భయమేసి నా నుంచి నేనే ఉరికాను
ఎవరో పారేసుకున్న కండువా
—తెల్లటి వస్త్రంపై నల్లటి రేఖలు
వెన్నెలపై గ్రహణం చేసిన గాయాల్లా—
నా పాదాల్ని మెలివేసి
చరిత్ర పుటల్లోకి తోసింది
కుప్పలు కుప్పలుగా నిప్పు శకలాలు
చావులో ముంచితీసిన నక్షత్ర తునకలు
పైనున్న విశాల శున్యం కక్కగా
ఓ అనాథ కాగితపు ముక్క
నా కనుబొమ్మలపై వాలగా
“ మా
గొంతు చుట్టూ సంకెళ్ళు
సముద్రం ఓ ఎండమావి
పొలిమేర ఓ దరిద్రరేఖ
గగనం పెదిమలు
మృత్యు క్షిపణులు
సంధ్య కిరణాలు
వలసరెక్కల ఉత్తరాలు
త్రాగునీరు
గాయాల మడుగులు
కవిత్వం
వెలివేయబడ్డ వెన్నెల చిహ్నం
“ ఒక్కసారిగా
ఎవరో రంగస్థలం పై చివరి సారిగా తెర వేసినట్టూ
కవనాలన్నీ మునివేళ్ళను నరికి నిశబ్ధంలోకి దూకినట్టూ
కలలన్నీ కళ్లను చీల్చుకుని రక్త వెల్లువలై తొణికినట్టూ
ఓ ఇనుప ట్యాంకర్ల బలగం
ఓ అంతిమ శబ్ధం
*
మీ కవిత్వం తెలుగు సాహిత్యానికి కొత్త చేర్పు. చాలా బలమైన అభివ్యక్తి.
Thank you sir!!
మీ కవిత్వం చాలా సాంద్రమైనది. హృదయానికి హత్తుకునేది. మీ పదబంధాలు బలమైనవి”సముద్ర కెరటాల పొత్తిళ్లలో యుద్ధ వాసన”భలే గుంది.