వెనుకవరుసలో కూచోవడం నేర్చుకోవాలి

క కవిత ఎప్పుడు రాశావంటే, చిట్టచివరి అక్షరీకరణ సమయం చెప్పడం సులభమే గాని, అలా ఒక కవిత ఒకానొక క్షణాన మాత్రమే వస్తుందా? అలాగే ఒక కవిత ఎట్లా రాశావంటే, దాని వ్యక్తీకరణ క్రమాన్ని వివరించమంటే కూడ చిట్టచివరికి అది కాగితం మీదికో, కంప్యూటర్ తెర మీదికో ఎట్లా దిగిందో చెప్పగలమేమో గాని, ఆ కవితలోని భాష, భావాలు, భావచిత్రాలు ఎన్నెన్ని సంవత్సరాల, దశాబ్దాల ఆలోచనల, అధ్యయనాల, సంభాషణల, మథనాల ఫలితమో గదా, ఏ బిందువు దగ్గర నిలిపి ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఆ కవిత వెలువడింది అని చెప్పడం సాధ్యమా, సమంజసమా? ఒక కవి తన కవితల్లోంచి అన్నిటికంటె ఎక్కువ ఇష్టమైన కవిత తీసుకుని అది ఎట్లా వెలువడిందో చెప్పాలని సంపాదకులు ఆదేశించారు. మళ్లీ ఇక్కడ కూడ ఒక్క కవితే అన్నిటికంటె ఎక్కువ ఇష్టమైనదవుతుందా? అన్నిటిలోకీ ఒక్కదానికే అగ్రసనాధిపత్యం ఇవ్వడం సాధ్యమేనా, సమంజసమేనా?

ఈ విచికిత్సలతోనే, నా కవిత్వంలోంచి నాలుగైదు ఎంపిక చేసి, అందులోంచి మళ్లీ ఒకటిగా ‘వెనుకవరుస మేలు’ ను ఎంచుకున్నాను. అది నా తాత్విక, సామాజిక దృక్పథానికి ఒక సూచిక గనుక. ఇదివరకే నా ‘రెప్పవాల్చని కాపలా’కు రాసుకున్న ముందుమాటలో ఆ కవిత మూలాల గురించి కొంత చెప్పాను గనుక.

స్థలమూ కాలమూ సమాజమూ ఒక వ్యక్తిని ముందుకు తోసినప్పటికీ, ఆ వ్యక్తి ఆ బాధ్యతను ఆ క్షణానికి నిర్వర్తించక తప్పనప్పటికీ, ప్రతి మనిషీ వెనుకవరుస మేలు అనుకోవాలని నేననుకుంటాను. కొందరికి అపరిమిత అవకాశాలూ, కొందరికి అపారమైన నిరాకరణలూ ఉన్న మన సమాజం వంటి అంతరాల సమాజంలో, ఇప్పటికే అవకాశాలు దక్కినవారు ఉద్దేశపూర్వకంగా వెనుక వరుస ఎంచుకోవడం అవసరమని అనుకుంటాను. అది ఇతరుల అవకాశాలు గుంజుకోకుండా ఉండడానికి, ఇతరులకు అవకాశం ఇవ్వడానికి, అతిశయం నుంచీ అహంకారం నుంచీ సంకల్పపూర్వకంగా దూరం జరుగుతూ వినయాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటాను.

నాకు ఈ అవగాహన కలగడానికి కొంత చరిత్ర ఉంది. బాస్టన్ విమెన్స్ కలెక్టివ్ ప్రచురించిన ‘అవర్ బాడీస్ అవర్ సెల్వ్స్’ పుస్తకం మొదటిసారి 1982-83ల్లో చదివాను. ఆ పుస్తకం అప్పటి కూర్పు ముందుమాటలో ఒక మాట రాశారు: “స్త్రీల స్వభావం అని మన మీద రుద్దిన ముద్రలను వదిలించుకోవడం అవసరం. అలాగే కొన్ని ముద్రలను పునర్వ్యాఖ్యానించడం, కొత్త అర్థాలు ఇవ్వడం కూడ అవసరం. ఉదాహరణకు అణచివేస్తూ, అందరినీ వెనక్కి తోసేస్తూ ముందువరుసలోకి దూసుకుపోయే పురుషుడి ప్రతీకకు భిన్నంగా స్త్రీ అంటే బిడియంగా, వెనక్కి తగ్గి, అంచులలో ఉంటుందనే ముద్ర ఉంది. ఈ ముద్రను తీసేసుకోవడానికి మనమేమీ ఎవరినీ అణచివేసే స్థానంలోకి, అందరినీ వెనక్కి తోసేసి ముందుకు దూసుకుపోయే వైఖరికి వెళ్లనక్కరలేదు. వెనుక వరుసలోనూ ఉండవచ్చు. అప్పుడే జరిగేదంతా చూసే అవకాశమూ ఉంటుంది. అవసరమైనప్పుడు, మనం కావాలనుకున్నప్పుడు ముందుకు వెళ్లి జోక్యం చేసుకోగలిగిన అవకాశమూ స్థిమితమూ ఉంటాయి. ముందు వరుసలోనే ఉంటే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా జోక్యం చేసుకోవలసిందే. వెనుక ఏం జరుగుతుందో కూడ తెలియదు. కనుక వెనుక ఉండడాన్ని ప్రతికూల విలువగా ఏమీ తీసుకోనక్కరలేదు.”

సరిగ్గా ఇవే మాటలు కాకపోవచ్చు. తర్వాతి కూర్పులలో ఈ మాటలు లేవు గనుక వాళ్లే అభిప్రాయం మార్చుకుని కూడ ఉండవచ్చు. కాని నా మనసులో నిలిచిపోయిన చిత్రం అది. నాకు ఆ మాటలు చాల ఉపయోగపడ్డాయి. విద్యార్థి జీవితంలో తరగతి గదుల్లో మాత్రమే కాదు, సభలూ సమావేశాల్లో కూడా వెనుక వరుసలో కూచోవడానికి, అవసరమైతేనే, కోరితేనే మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. వక్తగా గుర్తింపు నా ఆ ఇష్టాన్ని చాలసార్లు వమ్ము చేస్తుంది గాని వీలయినంత వరకు అలా ఉండడానికే ప్రయత్నిస్తాను.

కొన్నేళ్ల కింద హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ హాలులో ఒకసారి నేను వెనుక వరుసలో కూచుని ఉండగా కేతు విశ్వనాథ రెడ్డి గారు వచ్చి నా పక్కన కూచోబోయారు. ‘అయ్యో సార్, మీరు ముందుకు వెళ్లాలి’ అన్నాను. ‘ఇదే సేఫ్. ఇంక ఇక్కడి నుంచి వెనక్కి ఎవరూ పంపించలేరు గదా’ అన్నారాయన. అప్పుడు మదిలో మెదిలిన వాక్యం ‘వెనుకవరుస మేలు’ ఆ తర్వాత రెండు మూడేళ్లు మనసులో నానుతూ ఉండింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమక్రమంలో 2012లో జరిగిన ‘సాగరహారం’ సందర్భంగా వేదిక మీదికి ఎవరెవరో తోసుకుపోతున్నారు. నేను దూరంగా పచ్చిక మీద కూచుని వింటున్నాను. అప్పటికి పది సంవత్సరాలుగా తెలంగాణ మీద రాస్తూ, ఎన్నో సభల్లో మాట్లాడుతూ ఉన్న నేను వేదిక మీదికి వెళ్లకుండా అలా కింద శ్రోతల్లో కూచోవడం ఏమిటని చాల మంది మిత్రులు అడిగారు. వేదిక మీద ఒకరిని ఒకరు మోచేతులతో తోసేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దూరంగా ఉండి చూడడమే బాగుంటుందని అన్నాను, అనుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి పరిణామాల్లో ఆ ఆలోచన మరింత పెరిగి 2014 డిసెంబర్ 15న ఆ కవిత వెలువడింది.

*

వెనుక వరుస మేలు

వేదిక జిగజిగేలుమంటున్నప్పుడు
సుదూరంగా వెనుకవరుసలో కూచోవడం నేర్చుకోవాలి
వీలయితే ఇంకా వెనుక అంచుల నీడల్లోకి తప్పుకోవాలి
ఎంత దూరంగా నిలబడితే అంత స్పష్టమైన చూపు
ఎంత దగ్గరైతే అంత అధికారపు మమకారపు కైపు
మిరుమిట్ల వెనుక చీకట్లు కనబడేది దూరమైనప్పుడే
నిన్నటి దాకా వేదికను కూల్చిన చేతులే
ఇవాళ మోచేతులతో అందరినీ వెనక్కి తోస్తూ
వేదిక ఎక్కుతున్న వింత దృశ్యం కనబడేది అక్కడే
వేదిక కట్టిన చేతుల బొబ్బలూ నెత్తుటి చారికలూ
నిన్నటిదాకా ప్రయాణంలో ఒరిగిన సహచరులూ
మదిలో చెరగకుండా ఉండేది దూరంగా ఉన్నప్పుడే
వేదిక మీది కొందరిలోకి రారమ్మని పిలిచేవేళ
పచ్చిగడ్డి మీద అసంఖ్యాకుల్లో కాటగలిసి పోవాలి
నిద్రమత్తు సుఖప్రయాణ వాహనం ఆహ్వానిస్తున్నప్పుడు
ముళ్లదారిన మెలకువతో కాలినడక ఎంచుకోవాలి
గద్దెల మీది ఔదార్యపు సాయానికి, సారాయానికి
ధన్యవాదపు దోసిలి పట్టడం మానుకోవాలి
ప్రగల్భాల పట్టు పీతాంబరాలు పర్రున చింపి
సహజాత నైసర్గిక ప్రకృతిని ధరించాలి
ఎవరో నీకు కల్పించిన ప్రాముఖ్యతనో
నీకు నువ్వే తెచ్చిపెట్టుకున్న ఆధిక్యతనో
నువ్వే ధ్వంసం చేయడం నేర్చుకోవాలి
వేదిక మీది కుర్చీని తన్నెయ్యాలి
మొదటి వరుస ఆహ్వానాన్ని తిరస్కరించాలి
డిసెంబర్ 15, 2014

ఎన్. వేణుగోపాల్

1 comment

Leave a Reply to thagulla gopal Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాకు చాలా ఇష్టమైన కవిత సార్. దీని నేపథ్యం తెలంసుకునే అవకాశం దొరికింది. మీ సాహిత్య దృక్పథం మొత్తంను సూచించే కవిత.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు