తెలంగాణాలో నేను టీచర్ ఉద్యోగానికి వచ్చిన్నాటికి ఉపాధ్యాయసంఘాలు కొన్ని పెద్దరికం చేసేవి.
టీచర్లంతా వాటిలోనే ఉండాలని డిమాండ్ చేసేవారు. ప్రతి చిన్నపనికి పైరవీలు, లంచాలు, పెత్తనాలు. చందాలు…వ్యక్తిపూజలు ఇట్లా ఒక రాజ్యలక్షణాలన్నీ కలిగివుండేవి.
కొంత ప్రజాస్వామికంగా ఉంటుందని ఒక సంఘాన్ని బలపరిచి, విసిగి, వేసారిన ఉద్యమశీలులైన ఉపాధ్యాయులు అప్పటిదాకా ఆంధ్రప్రాంతంలోనే విస్తరించి వున్న ఏపిటిఎఫ్ (ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్)ను తెలంగాణాలోకి తేవాలనుకున్నపుడు తొలి అడుగు మా ఊర్లో, మా ఇంట్లోనే పడింది.
అప్పటి నల్లగొండ జిల్లా కన్వీనర్ బుచ్చిరెడ్డిసార్ ఆధ్వర్యంలో విరువంటి గోపాలకృష్ణ, జయరాములు, సుంకరి సత్యనారాయణ, గుండా కుమారస్వామి, నేను సభ్యులుగా తొలి అడ్ హాక్ కమిటి ఏర్పడ్డది. ఆ తర్వాత వేగంగా తెలంగాణ జిల్లాల్లో విస్తరించింది ఏపిటిఎఫ్… జిల్లాలో జరిగిన ప్రాంతీయ విద్యాసదస్సుల్లో దాసి సుదర్శన్ కనిపించేవాడు. నల్లగొండ జిల్లా సదస్సు జరుగుతున్నపుడు సభలో పరిచయమేర్పడ్డది.
చిన్నవాడినైనా నన్ను తొలి ఉపాధ్యాయ కమిటి నిర్మాణంలో ఉన్నానని గౌరవంగా మాట్లాడాడు. నాకపుడే తెలిసింది తాను దాసి సిన్మాకు కళాదర్శకుడుగా పని చేసాడని. విద్యాసదస్సులో ప్లకార్డ్స్, పోస్టర్లు తయారు చేయడంలో కార్యకర్తగా చొరవగా పనిచేస్తుండేవాణ్ణి. నినాదాలు, కొటేషన్ల పోస్టర్లు రాసేటపుడు బీడిలతోకలతో రాసేవాళ్ళం. నేను కొంచెం చేయి తిరిగిన వాణ్ణయినాను. నా చేతిరాతను బాగా మెచ్చుకునేవాడు సుదర్శన్ సార్. నాగార్జునసాగర్ కు రమ్మని ఆహ్వానించాడెన్నోసార్లు.
ఎపుడు కలిసినా సదస్సుల్లో, కమిటీలలోనే కలిసేవాండ్లం. ఎపిటిఎఫ్ నుంచి డిటిఎఫ్ విడిగా కొత్త ఉపాధ్యాయ ఉద్యమ సంస్థగా ఏర్పడినపుడు డిటిఎఫ్ కొక కొత్త జెండా కావాల్సినపుడు తాను చేసిన జెండా రూపకల్సన అందరి ఆమోదం పొందింది. ఎంత సంతోషపడ్డాడో తనకా అవకాశం దక్కిందని.
చాలా నిశ్శబ్దంగా వుండేవాడు. పొదుపుగా మాట్టాడేవాడు. నినాదాలపుడు పెద్దగొంతుక. ఉద్యమాలలో ముందడుగు తనది. చాలా యేండ్లుగా తన గురించి తెలిసింది, తెలుసుకున్నది తక్కువే…జీవితపు ఒడుదొడుకుల్లో పడి కొట్టుకుపోయాం చెరోవైపు. ఇపుడీ పిడుగుపాటు వార్త.
కొందరు ఎపుడు చనిపోయినట్టనిపించరు. సర్వదా సజీవంగానే ఉన్నారనిపిస్తుంది. అట్లాంటివాడే మా సుదర్శన్ సార్..ఇంతదాక రాసిన చేతులు వణుకుతున్నాయ్. మనసు బరువెక్కి వెక్కిళ్ళు పడుతున్నది.
అన్నా, జోహార్లు.
*
స్కెచ్: రాజు కార్టూనిస్ట్
అప్పుడు నా వయస్సు 18. వామపక్ష భావాల ఉడుకు రక్తం లో..
దాసి సినిమా ఎప్పుడు తీసారో తెలియదు. అవార్డులు ప్రకటించే దాకా తెలియదు. కారణం థియేటర్లల్లో విడుదల కాలేదు. ఆ సినిమాకు దుస్తుల రూప కర్త మా నాగార్జున సాగర్ హిల్ కాలనీ లో క్రాఫ్ట్స్ టీచర్ గా పని చేస్తున్న శ్రీ సుదర్శన్ గారని అవార్డ్ వచ్చే దాకా తెలియదు. మా నాన్న గారు సి హెచ్ నారాయణ పైలాన్ కాలనీ లో టీచర్. నాన్న గారు చెప్పేదాకా తెలియదు.
అప్పట్లో ప్రింట్ మీడియా మాత్రమే వుండేది. సుదర్శన్ మాష్టారు గారు ఓ ఆర్నెళ్ళు పేపర్లో ఏదో మూల అగుపడే వారు.
దూర దర్శన్ లో దాసి సినిమా వచ్చే వరకు చూడలేని నాటి తరం. అవార్డ్ సినిమాలు కాసులు కురిపించవని థియేటర్ లో వచ్చేవి కావు.
అప్పట్లో సారు ఏదో పత్రికకి పార్ట్ టైం రిపోర్టర్ గా కూడా పని చేసినట్లు గుర్తు. లోకల్ సమస్యలు సార్ చెవిన వేద్దామని ఒకటి రెండు సార్లు సారింటికి వెళ్ళాను. యువతరానికి మంచి సందేశం ఇచ్చారు మాట్లాడిన కాసేపైనా!
జోహార్ మాష్టారు! మా నాగార్జునసాగర్ లో వుండగానే అవార్డు రావడం మాకు గర్వ కారణం గా ఫీల్ అయిన రోజులవి! మీ యాదిలో నివాళి!! మాష్టారు!
Show quoted text
దాసి సుదర్శన్ అమర్ హై!