తేటిపురుగు నెరి, అనే మాట ఒకటి పాతకవుల రాతలలో కనబడుతూ ఉంటుంది మనకు. తుమ్మెద ఒక పురుగును తెచ్చి తన గూటిలో పెట్టి, ఆ గూడు చుట్టూ గుయ్యి మని తిరుగుతూ ఉంటుందంట. కొన్నాళ్లకు ఆ పురుగు తుమ్మెదలాగా మారిపోతుం దంట.
ఇది, తుమ్మెద తనలాగా పురుగును మార్చుకొనే కత కాదు. తుమ్మెదే వెనక్కు తిరిగి, పురుగులాగా మారిపోతున్న కలత.
మనదేశంలో వేలుపునుడి అనేది ఒకటుంది. దానిని గీర్వాణం అంటారు. దాని ఉనికి ఎక్కడుంది అంటే, ఇంటాబయటా ఎక్కడా లేదు, ఒక్క గుడిలో తప్ప. దానికి వేలుపునుడి అనేపేరును నేను పెట్టలేదు. ఎవరో ఎన్నడో అనిన ఆ మాటను, పని కట్టుకొని చాటుతుంటారు కొందరు. తాము ఆ నుడికి చెందినవాళ్లమే అనే నివ్వెరగు (బ్రాంతి)లో ఉంటారు ఆ కొందరు. నిక్కమో నివ్వెరగో పక్కన పెడితే, వాళ్ల వలన తెలుగుకు వల్లమాలిన కీడు జరిగిపోయింది. తెలుగుపేర్లను చూడండి, తెలిసి తెలిసి తెలుగుదనానికి ఎంత ఎడమయిపోయినాయో!
తొలినాళ్ల మనిసి తిండిని వెతుక్కొంటూ తిరిగేవాడు. ఆ తిరుగుడులో తన చుట్టూ ఉడువు(ఆవరించు)కొని ఉన్న తావులకంతా తన మాటలలో పేర్లు పెట్టుకొనేవాడు. ఏళ్లూపూళ్లూ గడచినాక, ఇల్లూవాకిలీ చేనూచెలకా ఏర్పరచుకొని ఒకచోట కుదురుకొన్నాడు. మూడో ఏడో పాకలు ఒక ఊరుగా, రెండో మూడో వాకలు ఒక చెరువుగా మారుంటాయి.
తిరుగుడులో ఉన్నన్నినాళ్లూ, బెదురు పుట్టించిన వరదనో పిడుగునో, అదురు తగ్గించిన వెలుగునో వెన్నెలనో, కుదురు కాచిన అమ్మనో అయ్యనో తలచుకొనేవాడు. మానునో మాకునో గుండునో బండనో తన తలపుకు ఆనవాలు చేసుకొన్నాడు. ఒకచోట కుదురుకొన్నాక, ఆ తలపుకే ఇలుగాపుగా తన పాక కంటే పెద్దదయిన గుడిసెను వేసి నిలుపుకొన్నాడు. అదే ఆవెనుక గుడి అయింది. గుడిలోని పొడను తన మాటలతోనే పిలుచుకొన్నాడు , తనకు నచ్చినట్లే కొలుచుకొన్నాడు, తనకు కలిగిందే ఎడ(నైవేద్యం) వేసినాడు.
గీర్వాణం ఎప్పడు దూరిందో తెలియదు. ఆ దూరిక ఏళ్లనాటిదో పూళ్లనాటిదో చెప్పలేం. అది వచ్చి మన మాటను మార్చేసింది, మన మెలన(చరిత్ర)ను ఏమార్చేసింది, మనదనాన్నే మొత్తంగా మరుగు చేసేసింది. ఎంతగా అంటే, మనలోనే ఒకడు, ఇదీ నిక్కం అని ఎలుగెత్తితే, వాడిని పిచ్చివాడో దురుసువాడో అనేసేటంతగా. నిక్కం పలికిన వాడిని, అలివైతే మింగేయడం, కాకుంటే పక్కకు పెట్టేయడం అనేంతగా.
మచ్చుకు ఈ ఒక్కమాటను వినండి. విందెమలలకు దిగువన, తూరుపు పడమటి కనుమల వరుసలు ఉన్నాయి కదా. తూరుపు కనుమలలోనే మరెన్నో చిరువరుసలూ ఉన్నాయి కదా. వాటిలో కొన్నిటి పేర్లను చూడండి.
చోళనాడులో పచ్చమలలు, కొంగునాడుకు తూరుపున కొల్లిమలలు(కొల్లి=కొరివి. అంటే ఎరుపు), కొంగునాడుకు ఎగువన వెళ్లిమలలు (వెళ్లి =వెండి. అంటే తెలుపు), కర్నాటక నక్కమూలన(ఆగ్నేయం) బిళిగిరులు (బిళి=తెలుపు), కడపలో ఎర్రమలలు, వాటికి ఎగువన నల్లమలలు…
నెలకొనివున్న నేల తీరును బట్టో, రాతి తెరగును బట్టో ఆ తావు నుడిలో ఏర్పడిన పేర్లని తేటతెల్లం అవుతున్నది కదా.
‘వెన్’ అనే మాటకు తెలుపు అని తెల్లం. వెన్నెలలో వెండిలో వెల్లలో వెల్లుల్లిలో ఉండేది ఈ కుదురుమాటే. ‘కట’ అంటే ఎత్తయినది అని తెల్లం. కట్ట దీనికి మరొక పొడ. ‘వెంకట’ అంటే తెల్లకొండ అని తెల్లం. చిత్తూరు జిల్లా బంగారుపాళెం నుండి కడప జిల్లా కోడూరు వరకూ పరచుకొనున్న ఈ వరుసను, అక్కడివాళ్లు పాలకొండలు అంటారు. పాలవన్నె తెలుపే కదా. ఈ కొండలలో దొరికేది తెల్లటిరాయి. అందుకే చిత్తూరు జిల్లాలోని తిరగళ్లూ సనికిళ్లూ తెల్లగా ఉంటే, కడప జిల్లావి ఎర్రగానూ, కర్నూలు జిల్లావి నల్లగానూ ఉంటాయి.
పాలకొండల చుట్టూ ఏనాదులు అనే తొలిజనులు బతుకుతుంటారు. ఏనాదుల అమ్మనుడి తెలుగు. వాళ్లు పెట్టిన పేరే అయుండవచ్చు ఈ వెంకట అనేది.
ఉత్తరాది నుడులలో ‘ఎ’ ‘ఒ’ సడులు ఉండవు. మనకున్న ఆ సడులను పలుకలేరు వాళ్లు. అందుకే వెంకటను వేంకట అన్నారు. వేం అనగా పాపము, కట అనగా హరించునది, అనే తప్పుడు పుట్టెరుకను (ఎటిమోలజీ) పుట్టించినారు. గీర్వాణపు పెత్తనాన్ని తెగడుతూ కూడా దాని అడుగుజాడల్లోనే నడిచే తమిళ తెలివరులకు, తెలుగు వెంకట నచ్చక, గీర్వాణపు వేంకటనే వాడుకొన్నారు. తమిళులకు మాట నడుమనా చివరనా కరుకులు (పరుషాలు) పలుకవు కాబట్టి, వాళ్లనోళ్లలో అది వేంగడం అయింది.
సరే, వాళ్లూవీళ్లూ ఏమన్నా ఏదన్నా అనుకోనివ్వండి. మనం, అంటే తెలుగువాళ్లం కూడా రెండు గుంపులుగా చీలిపోయి, అది వేంకటమనీ, కాదుకాదు వేంగడమనీ గుయ్యిమని కొట్లాడేసుకొంటూ ఉంటాం. మీకేమీ అరగలి (సందేహం) అక్కరలేదు, మనం ఇట్లా తుమ్మెదల్లాగే ఉండిపోం. తిరిగి పురుగుగా మారిపోయే తరి(కాలం) తొందరలోనే ఉంది.
*
భలేభలే…ఈ పదకోశం…అంటే ఈ పదాల పుస్తకం దొరికితే చదివి ఆ సరళమైన భాషే వాడుకోవచ్చు అని ఆశగా ఎదురుచూస్తున్నాను . వైనం తెలుపగలరు.
స వెం రమేశ్ గారి మాట ఎంత తియ్యగా వుంటుందో!
పలికేటపుడు వెంకటరమణ అని పలుకుతాం..రాసేటప్పుడు వేంకటరమణ అని ఎందుకు రాస్తామబ్బా అనే సంకటపడుతూ వుంటి. రామేశ్‌గరు ఆ బాధ తీర్చారు. ఈయన ఒక్క కథలో ఎన్ని చిక్కని చక్కని తెలుగు పదాలు నేర్చుకోవచ్చో!
వెంకట అన్నది ఎంకిడు అన్న సుమేరు నామానికి అపభ్రంశ రూపం అని రాంభట్ల క్రిష్నమూర్తి అన్నారు, తెలుగు బాష సుమేరు భాష జాతికి సంభందించిందని ఎక్కడో చదివాను,ఇప్పుదు క్లారిటీ వచ్చింది
ఎన్ని తేటపదాలు.. మూలంతో సహా..
రమేశ్ గారికి ధన్యవాదాలు