వృత్తం

1
ఏదో వెతుక్కుంటూ ఎక్కడెక్కడో తిరుగుతుంటాను
అప్పటికి అందరూ నన్ను
వదిలేసి వెళ్ళిపోయి వుంటారు
వెళ్ళిన వాళ్ళు ఎవరూ ఎంత పిలిచినా
తిరిగిరారు
భూమి ఒక్కటే నా చుట్టూ
రాత్రీ పగళ్ళను వెదజల్లుతూ తిరుగుతుంటుంది
దూరం నుంచి తిన్నగా
వరుసలు వరుసల్లో ఉన్నట్టు కనబడ్డవన్నీ
దగ్గర నుంచి వంకరటింకరగా కనబడి
నిరాశపరుస్తాయి
సమీపాలు అనుకున్నవన్నీ
క్షణాల్లో దూరాలను తొడుక్కుంటాయి
ఏదీ స్థిరంగా ఉండదు
అల్పపీడనం కదలాడినట్టు
ఉపరితలాల మీద ఒకటే నడక
ఆశపడ్డ మేఘం కురవకుండానే వెళ్ళిపోతుంది
మరో విరిగిన స్వప్నపు వెక్కిరింత
గేటు దగ్గర నిలబడీ నిలబడీ
వెనుదిరిగిన పసిపాప కంట్లో కదలాడే
సన్నని నీటి బొట్టు లాంటి అనుభవాల గుండా జారి
నేల మీద ఒక ఆకాశాన్ని కలుసుకున్న సంతోషంలో
మట్టి గుండెల్లోకి చేరుకుంటాను
అచ్చంగా నాలాంటిదే ఒక స్వప్నాన్ని
భూమి మళ్ళీ కంటుంది కొన్నాళ్ళకు.
2
మాటలు రాలిపడిన చోట
గాలిపటం అంచులకు
నా గుండెను కట్టి ఎగరేస్తాను
నువ్వు పతంగి రెక్కలకు నిశ్శబ్దాన్ని చుట్టి
నిన్ను నువ్వు బలంగా ప్రకటించుకుంటావు
మాటల పాదాలకు సరిపడా
వంతెనను నిర్మించుకోవడంలో వెనకబడ్డాక
మొదట్లో పూసినంత విరివిగా
మాటలపూలు పూయవు
పూసిన కాసిన్ని పువ్వుల మీదా
కొన్ని నిష్టూరాలను వదిలి వెళ్తాయి సీతాకోకచిలుకలు
తీయని పలకరింపులవ్వాల్సిన ఉదయాలు
పొగమంచులో ఎక్కడో తప్పిపోయాక
రాళ్ళ మొనల మీద
మధ్యాహ్నాలను ఆరబెట్టుకోవడం అలవాటవుతుంది
అప్పుడిక ఎప్పటికీ రోజు పూర్తవ్వదు
సాయంత్రాలు ఎదురుచూపుల్లోనే ఆవిరవుతాయి
రోడ్లు అతుక్కోకుండా పగుళ్ళు అడ్డం పడతాయి
జేబులో దాచుకున్న నిప్పురవ్వలు
ఎండు చెట్లతో పాటు
మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న
నమ్మకాలనీ తగలబెడతాయి
విశ్వాసం సడలిన దారుల్లో
మూడో కంటికి
ఇక అన్నీ అపసవ్యాలే కనబడతాయి
ఒకటే అర్థాన్నిచ్చే మాటలో
ఒక విరోధాభాస దాగుందనుకోవడం
ఎంత పెద్ద అపోహో
కొన్నాళ్ళకెప్పుడో బయటపడుతుంది
అప్పటికే మాటలు రాలిపడిన చోట
ఎవరి సమాధులు వాళ్ళు తవ్వుకుని
అందంగా అలంకరించుకోవడంలో మునిగిపోయి వుంటాం .
*

సాంబమూర్తి లండ

నేను సాంబమూర్తి లండ. టీచర్. బోధన తర్వాత ఎక్కువగా ప్రేమించేది కవిత్వం. చదవడం మరీ ఇష్టం. వర్తమాన సమాజంలోని వ్యత్యాస్తాలు, మూకస్వామ్యాలు, బతుకు రొద, శూన్యం నన్ను కదిలిస్తాయి. 2020 లో "గాజురెక్కల తూనీగ" కవితా సంపుటి ప్రచురించాను. నాదైన వాక్యాన్నీ, నాదైన గొంతునీ, నాదైన భాషనీ వదిలివెళ్లాలనేది నా స్వప్నం.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు