విస్మృత అవధూత అన్నయ

జ్ఞానబోధ, ప్రవచనం, ఎఱుక, బయలు, అచలం ఇట్లా ఆధ్యాత్మిక విషయమంతా బ్రాహ్మణాధీనమై వెలుగుతున్న రోజుల్లో శిష్య బృందాన్ని వెంటేసుకొని దేశంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించి ఆయా ప్రదేశాల్లో శూద్రులకు సైతం అర్చనాధికారా లున్నాయని వాదించి గెలిచిన మహాయోగి, అచల మత బోధకులు, ప్రచారకులు, మార్గదర్శకులైన రచయిత అన్నావధూత. తల్లిదండ్రులు పెట్టిన పేరు అన్నయ. ఆయన దీక్షానామం భూమనంద స్వామి. సికింద్రాబాద్‌లో వంజరి కుటుంబంలో వేపురు నృసింహార్య, వెంకమాంబ దంపతులకు 1820 ప్రాంతంలో జన్మించారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో వంజరి కులస్థులు ఎక్కువగా వడ్డీ వ్యాపారం చేసేవారు. అన్నావధూత గురించి రేఖా మాత్రంగా బిరుదురాజు రామరాజు తన ఆంధ్రయోగులు గ్రంథంలో రాసిండు. అయితే అది ప్రధానంగా ఆధ్యాత్మిక రంగంలో అన్నావధూత చేసిన కృషిని రికార్డు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాసం అన్నావధూత సాహితీ ప్రతిభను గుర్తించే ప్రయత్నం చేస్తున్నది.

కనపర్తి ఇంటిపేరుగల గురువులు అన్నయకు ఋగ్వేదంతో సహా పలు ఆధ్యాత్మిక అంశాలను బోధించారు. అయితే ఈ కనపర్తి వారు బ్రాహ్మణులో, విశ్వబ్రాహ్మణులో తెలియదు అని బిరుదురాజు రామరాజు గారు రాశారు. సాహిత్యంలో జ్ఞానం, ఎఱుక, అచలం గురించి లోతుగా అధ్యయనం చేసి రాసిన అతి కొద్ది మందిలో అన్నావధూత ఒకరు. తెలుగు, సంస్కృత భాషల్లో ఈయన రచనలు చేసిండు.

1808లో సికింద్రాబాద్‌ పట్టణం ఏర్పాటయ్యింది. అంతకు ముందు నుంచే ఉన్నటువంటి తిరుమలగిరి ప్రాంతంలో బ్రిటీష్‌ వారు తమ సైన్య స్థావరాలను ఏర్పాటు కుపక్రమించారు. ఈ సమయంలో అక్కడ కొత్త కట్టడాలు, భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. ఈ భవన నిర్మాణ పనుల్లో అన్నయ టైమ్‌ కీపర్‌గా ఉద్యోగంలో చేరిండు. ఈ ఉద్యోగంలో ఉన్న సమయంలోనే ఒక యోగి/గురువు (వనదేవత ఆశీస్సులతో అని కూడా చెబుతారు) ఉపదేశం పొంది సంచారిగా మారిండు. ఆధ్యాత్మిక మార్గంలో నడిచిండు. కాలి నడకన హుమ్నాబాద్‌ (కర్నాటక-పాత హైదరాబాద్‌ రాజ్య ప్రాంతం) వెళ్లి అక్కడ మాణిక్య ప్రభు (1817-1865)ని సందర్శించాడు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. అట్లాగే మూడుసార్లు కాశీయాత్ర చేసిండు. మొదటిసారి కాశీయాత్రకు వెళ్ళినపుడు ఆయన కుల వివరాలను అక్కడి పండితులు ఆరాదీసిండ్రు. దీనికి ఆయన తన శూద్ర కులాన్ని గురించి చెప్పుకున్నాడు. దీంతో అక్కడి పండితులు శూద్రులకు పూజార్హత లేదు అని అడ్డగించడంతో వారితో అన్నయ వాదనకు దిగిండు. 40మంది గల పండిత మండలితో చర్చ కాశీలో తొమ్మిది రోజులు పాటు సాగింది. రాజేశ్వరీ ఉపాసకుడైన అన్నావధూత పాండిత్యాన్ని, తర్కాన్ని, పూజాధికారాన్ని వాళ్లు ఒప్పుకున్నారు. ఈ కాశీయాత్ర సందర్భంగా దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించి తాను బస చేసిన ప్రతి చోటా పండిత గోష్ఠిని ఏర్పాటు చేసి వివిధ అంశాలను శూద్ర దృష్టికోణంతో విప్పి చెప్పేవారు. జబల్పూర్‌, సాగర్‌, జగన్నాథపురి, బరంపురం, విజయనగరం, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కాకినాడ, బందరు, గుంటూరు, గుత్తి, బళ్ళారి, బెంగళూరు, చాందా, ధర్మపురి, వేములవాడ ఇట్లా పలు ప్రాంతాల్లో గోష్ఠులు నిర్వహించారు. కడపలో తన శిష్యుడు హుసేన్‌దాసుని అక్కడి పీఠాధిపతిగా నియమించారు. ఈ హుసేన్‌దాసు సైతం అనేక కీర్తనలు రాసి ప్రసిద్ధికెక్కారు.

ఇట్లా సంచారం చేసి హైదరాబాద్‌కు చేరుకున్న మొదటిసారి ఆయనకు శిష్యులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాతి కాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా శిష్యబృందం వెంట ఉండేది. పల్లకీలో ఊరేగించేవారు. మేళతాళాలు, ఛత్ర చామరాలూ ఉండేవి. జూలై రెండు, 1871 నాడు సికింద్రాబాద్‌లో పండితారాధ్య వీరశైవ మఠం వారు మంత్రి లింగారాధ్యుల వారి ఆశ్రమ స్వీకార ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నావధూత హాజరయ్యిండ్రు. ఈయనతో పాటు అప్పటి పండిత ప్రముఖులు వేలూరు మునిస్వామి నాయుడు (బహుశా వేలూరు రంగధామ నాయుడు కుటుంబానికి చెందిన వాడయ్యుంటాడు. రంగధామ నాయుడు పెయింటర్‌గానే గాకుండా రచయితగా గూడ ప్రసిద్ధి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ స్థాపకుల్లో, నిర్వాహకుల్లో ఒకరు). మధుసూదనార్యులు, కృష్ణాచార్యులు అనే యాదవ ప్రముఖులు, తదితరులున్నారు. ఈ పరంపరలోనే అచ్యుత రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు అన్నావధూతకు ముఖ్య శిష్యుడిగా తయారయిండు.

అచలంలో రెండు గురు పరంపరలున్నాయి. నల్లగొండ జిల్లా సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన అచల గురువు రామడుగు శివరామదీక్షితులు (1690-1791) ఆ సంప్రదాయాన్ని ఎక్కువగా ప్రచారంలో పెట్టిండు. ఈయన గురువు మహరాష్ట్రీయుడైన శ్రీధరులు (1658-1730). శ్రీధరులు గారికి మరో శిష్య పరంపర కూడా ఉన్నది. అందులో శ్రీధరులు శిష్యుడు రామావధూత. రామావధూత శిష్యుడు సదానందుడు. ఈయన తత్త్వాలు తెలుగులో అచ్చయినాయి. ఈ సదానందుడి శిష్యుడు వెంకటేశ్వర యోగి. ఈ వెంకటేశ్వర యోగి శిష్యుడు మనం ఇప్పుడు చదువుతున్న అన్నావధూత. అన్నావధూత శిష్యుడు అమాం వీర వెంకయ్య. మరో శిష్యుడు వేంకట చిదానంద యోగి ‘కైవల్యామృత మోక్ష గ్రంథం’ని 1925లో వెలువరించారు. ఈ గ్రంథం మదరాసులోని పమ్మి త్యాగరాయ శెట్టి ముద్రణాశాల ‘శ్రీరాజ రాజేశ్వర ముద్రాక్షరశాల’లో ప్రచురితమయింది. అందులో ‘‘శ్రీమదఖిల వేదాగమ పురాణ శాస్త్రార్థ సారమును గ్రహించి, ముముక్షు జనోపకారార్థముగా, సర్వజనులకు స్పష్టముగా దెలియు నట్లాంధ్ర భాషయందు ప్రబంధ రూపముగా, కైవల్యామృత మోక్షమను గ్రంథము, శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్బ్రహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణులయిన అన్నావధూత స్వామి శిష్యుడగు వేంకట చిదానందయోగిచే రచియింపబడి, మోక్షైక ప్రధానమగు వైరాగ్య ప్రకరణము ముందుగా నారంభింపఁబడియె’’ అని పేర్కొన్నాడు. (కైవల్యామృత మోక్ష గ్రంథము:పే. 11) హుసేన్‌దాస్‌ శిష్యుడు వేటపాలెంకు చెందిన దేవాంగ కులానికి చెందిన దేవన నాగానందం 1914లో వెలువరించిన ‘వేదాంత కీర్తనలు’ గ్రంథములో తన రచనలతో పాటు అన్నావధూత అష్టకములు కూడా జోడించాడు.

ఈ అన్నావధూత 30-11-1889 నాడు తుదిశ్వాస విడిచారు. ఈయన శతకాలు, తారావళి, కందార్థ దరువులు, అష్టకాలు, పంచదశి తత్త్వములు, సంస్కృత స్తోత్రాలు తదితర డజనుకు పైగా రచనలు చేసిండు. అన్నీ కూడా ఆధ్యాత్మికత మార్గాన్ని బోధించేవే! అచలంలోని జ్ఞానం, ఎఱుక, బయలు తదితర అంశాలను విశదీకరించేవే!

అన్నావధూత రచనలు 1914లో ‘శివజ్ఞానాష్ఠక స్తోత్రం, అన్నావధూత వాగ్భూషణము’ అనే రెండు పుస్తకాలు కలిపి ఒక సంపుటిగా ప్రచురితమయింది. ఇది ‘‘శ్రీమద్బ్రుహద్వాసిష్ఠ సిద్ధాంత నిర్ధారణులైన, శ్రీమత్పరమ హంసాది బిరుదాంకితులుగు భూమానంద అన్నావధూత స్వాముల వారిచే సర్వజనులకు కైవల్య ప్రాప్తిజెంద చేయునటుల రచియింపబడియె. ఇది సచ్చిదానందన వేంకటేశ్వర అవధూతగారి ప్రేరణచే బ్రహ్మశ్రీ గౌరావజ్జల రామకృష్ణ సచ్చిదానంద సద్గురుస్వామి వారి ప్రియ శిష్యుండైన శికింద్రాబాద వైశ్యశ్రీ గుండా భూమయ్య గుప్త గారి ద్రవ్య సహాయముచే, చీకోటి వీరన్న అండు సన్సు గారి సుబోధ ముద్రాక్షరశాల యందు ముద్రంపబడియె.’’ అని ఉన్నది. ఇందులో అన్నావధూత రచనలను ఇట్లా పేర్కొన్నారు.

‘‘1.పీఠిక, 2. అవతారిక అనగా అన్నావధూత జీవ చరిత్ర, 3. బృహద్వాసిష్ట పీఠ పారంపర్యము మహామహుల ప్రతిమలనూ, 4. గురు పరంపరాభివర్ణన, 5. రాజేశ్వర శతకము, 6. హంసశతకము, 7. గురు వాక్యతారావళి, 8. గురువాక్య సుధారసము, 9. అఖండానంద బోధార్థ అద్వైత కందార్థ దరువులు, 10. పరబ్రహ్మనంద విలాసము. 11. అన్నావధూత వాగ్భూషణము, 12. చరమానుష్ఠానము, 13. వుపదేశ రత్నమాల, 14. శివజ్ఞ్యానాష్టకము, 15. పంచదశి పరమతత్వములు.’’ ఇవి అన్నావధూత రచనలు. ఇందులో ఐదో సంఖ్య పుస్తకం నుంచి 15వ సంఖ్య వరకు గల రచనలు 1930లో ‘అఖండానంద బోధ యను అన్నావధూత అనుభవ ప్రకాశిక’ పేరిట ప్రచురితమయింది. దీన్ని గుండా భూమయ్య అనే వైశ్య ప్రముఖుడు హైదరాబాద్‌లోని భూలక్ష్మి ముద్రాక్షర శాల యందు 8, అక్టోబర్‌, 1930నాడు ప్రచురింప జేశారు.

ఇందులో చరమానుష్టానము రెండు పేజీల రచన కాగా, శివజ్ఞానాష్టకము ఒక పేజీ రచన. చరమానుష్టానము రచన చివర్లో తన గురించి ‘గద్య’లో ఇట్లా పేర్కొన్నాడు. ‘‘ఇయ్యది శ్రీమద్వేపురు వంశ పయఃపారావార రాకాసుధాకర వంజరి కుల పవిత్ర నృసింహార్య పుత్ర శ్రీరాజరాజేశ్వరీ వరప్రసాద జనిత సరస కవిత్వ వైభవ ‘‘అఖండభూమండల నాధుమండనో బృహద్వాశిష్టాన్వయ సింధు చంద్రమ విద్యా నిధీ సత్వసుభూషణోజ్వలే’’ త్యాదిబిరుదాంకిత అన్నావధూత ఆత్మవిజౌశిఖాణియని ప్రసిద్ధి జెందిన పరమభూమానంద యోగీంద్ర ప్రణీతంబైన అఖండానంద బోధయను అన్నావధూత అనుభవ ప్రకాశిక సర్వంబు నేకాశ్వాసంబు సంపూర్ణము’’. అని ఉన్నది. సచ్చిదానంద వేంకటేశ్వర అవధూత సవరణలతో వెలువడిన తొలి పుస్తకములో రెండు రచనలున్నాయి. ఈ గద్య వలన అన్నావధూత కులం ‘వంజరి’అని విశదమవుతున్నది. అతేగాదు అతని బిరుదులు కూడా అవగతమవుతున్నాయి.

సాహిత్యం

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు అన్నావధూత సాహిత్యం తాత్విక చింతనతో కూడుకొని ఉన్నది. ఆధ్యాత్మిక, అచల బోధనలను సరళ సుబోధకంగా ఉండే విధంగా పద్యాలు, తారావళిల రూపంలో కంఠోపాటానికి అనుగుణంగా ఉండే విధంగా రాసి ప్రచారం చేసిండు. ఇందులో రాజేశ్వర శతకము 111 చరణాలతో అచలంలోని నిగూఢార్థాలను సైతం విప్పి చెప్పిండు. జ్ఞానాన్ని బోధించిండు. అందులో నుంచి మచ్చుకు కొన్ని పద్యాలు ఇలా ఉన్నాయి.

సీ.       ఏ పాదయుగములు నెప్పుడు విడువక

శ్రీదేవి తాసే జేయుచుండె

ఏ పాదములు సోకి యిలమీద బండయై

పడియున్న యహల్య పడతియయ్యె

ఏ పాదతీర్థంబు నెప్పుడు పార్వతీ

పతితల ధరియించు పరమనియతి

ఏ పాద యుగములు యిలమీద నటియించి

అవని భారంబెల్ల నడగిపాయె

నట్టి పాదంబునందునే నవతరించి

దేశికేందృని సత్కృపా దృష్టి చేత

బోధరూపుండనై యాత్మభోగమంది

దురితములు దృంచి అన్నావధూతనైతి        అనే పద్యముతో పాటు కందార్థములను ఇట్లా చెప్పిండు.

వెంకట యోగీంద్రుని పద

పంకజములు గొలచి యాత్మ పరిపూర్ణంబై

సంకటము లెల్ల వదలియు

శంకలుడిగి నీ కృతిని నే చేసెదనయ్యా

జన్మములాను బాసీనానయ్య

ఆశాలు వొదలిన యన్నావధూతను

వాసీగ శ్రీగురు వరునకర్పించినే

జేసెదనయ్యా జన్మములాను బాసీనానయ్యా

ఈ రచనలు ఆయన సాహితీ ప్రతిభకు నిదర్శనాలు.

రాజేశ్వర శతకము:

వేములవాడ రాజరాజేశ్వరుని స్తుతిస్తూ రాజేశ్వర అనే మకుటముతో రాసిన చరణములు మొత్తము 111 ఉన్నాయి. ఇందులో వేదాంతము, తత్వము, అచలం, బోధనలున్నాయి. అయితే ఇవి పద్యాలు కావు. ప్రతి రెండు పాదాలకు ఒక పద్యం/చరణం లెక్కగడుతూ నెంబర్లు ఉన్నాయి. అందులోని కొన్ని చరణాలు చూసినట్లయితే వాటి గురించి అవగతమవుతుంది. రాజేశ్వరుడి స్తుతి లేకుండానే అదే మకుటంతో బోధనాత్మకంగా అంశాలను వివరించాడు. విడమరిచి చెప్పిండు. అధ్యాత్మికాంశాలను సరళ సుబోధకంగా పాడుకునేందుకు వీలుగా చరణాల్లో ఈ రచన సాగింది.

శ్రీ రాజరాజేశ్వరా పార్వతీ చిత్త విషరుహ భాస్కరా

కారణాచార్య వర్యా మద్గురవే కరకంఠ రాజేశ్వరా                       ॥1॥

నీదు తత్వంబు దెలియా బ్రంహ్మాది నిర్జరుల వశముగాదు

వేదాంత వేద్యులెల్ల బ్రంహ్మంబు వండృనిను రాజేశ్వరా   ॥8॥

భేదవాదుల కెల్లనూ నీ వెపుడు భేదముగాన్పింతువూ

భేదరహితుల కెల్లనూ విడువకను పొందుదువు రాజేశ్వరా          ॥16॥

నీమాయ దెలియ వశమా నితరులకు నిక్కమిట్టిదటంచునూ

కామాంధకుడను నేనూ నిన్నెట్లు గాంచగల రాజేశ్వరా               ॥17॥

మాయయన యెట్టిదనగా తన్నుతా మరచిపోవడమె కాదా

నీ యందు భక్తిగల్గు వాడౌను నీ రూపు రాజేశ్వరా                    ॥18॥

వుత్త తాడును జూచియూ పామనుచు వణికి భయమందినట్లు

చిత్తమున నీ యందునా గాన్పించు జగమెల్ల రాజేశ్వరా ॥21॥

చిత్తమను మర్కటంబు నన్నెపుడు చంచలంబుల బెట్టగా

ఖ్యాతిగానీ యందునా నామనసు వొప్పదో రాజేశ్వరా                 ॥23॥

హంకారమందు బుట్టి పంచభూతాది ప్రపంచమెల్ల

హంకారమున జనములూ నిను దెలియ రాత్మలో రాజేశ్వరా      ॥26॥

పరుల ద్రవ్యములందునూ నామనసు పరువులీడుచు నుండునూ

పరభామల జూచినా నిలువకను భ్రమలొందు రాజేశ్వరా ॥30॥

చాపల్యముల జెందియూ నా మనసు చాంచల్య మొందుచుండూ

కాపట్యములకు నెలాల్ల తామూల కారణము రాజేశ్వరా             ॥31॥

తన్ను తాదెలియకుండా యితరులకు తత్వంబు లెల్ల దెలుపూ

పన్నుగా నా గురువులే జగమునను పశువులో రాజేశ్వరా        ॥40॥

మలమూత్ర యోనులందూ జన్మించి మరణంబు నొందు చుండ్రూ

కలనైన నిన్ను జనులూ గాంచకను గరకంఠ రాజేశ్వరా              ॥41॥

సకల యోనుల బుట్టుచూ నొక్కపుడు సర్వేశ నిన్ను మదిని

యకళంకముగ గొల్చియూ మానవుండై పుట్టు రాజేశ్వరా          ॥42॥

అష్టమదమ్ముల జిక్కియూ నీయందు నిష్టనిల్పగలేక నూ

భ్రష్టులైచెడి పోదురూ జగమందు పతితులై రాజేశ్వరా                ॥48॥

దేహిదేహంబులకును నీవుసందేహ మేమియు లేక నూ

సాహసంబుగ నెప్పుడూ వెలుగుదువు సాక్షివై రాజేశ్వరా           ॥73॥

గంగ యుమనా వాణియూ సంగమౌ ఘనత్రివేణీ మధ్యను

పొంగుచును నీవుందువూ నాయత్మ లింగమై రాజేశ్వరా ॥75॥

యరుకమరుపుల రెంటిని నెరిగేటి యెరుకవే నీవంచును

పరమయోగీందృలండ్రూ నిన్నెపుడు పరమాత్మ రాజేశ్వరా         ॥83॥

యెరుక మరుపులు లేకను నిత్యమై యేకమై యవ్యయంబై

పరిపూర్ణముగ నుందువూ నీబట్ట బయలయ్యి రాజేశ్వరా           ॥93॥

వేములవాడ వాసా వేదాంత వేద్యహృత్పద్మభృంగా

స్వామి నేనీవాడనూ ననుబ్రోవు సర్వజ్ఞ రాజేశ్వరా                    ॥108॥

మంగళము విశ్వేశ్వరా గౌరీశ మంగళము సర్వేశ్వరా

మంగళము పరమేశ్వరా హరహరా మంగళము రాజేశ్వరా          ॥109॥

అన్నావధూత భూమానందుని హృదయాంబుజమునందునా

పన్నుగా నీవుండియూ నింతయూ బల్కితివి రాజేశ్వరా ॥110॥

యెఱుక, మరుగు, బయలు, మరు జన్మము, తత్త్వము, కాపట్యము, చాంచల్యము,  మానవ జన్మలోని మంచీ చెడూ, స్వభావాలు అన్నింటినీ పాటలాగ పాడుకునేందుకు వీలుగా కూర్చిండు. గురువు, శిష్యులు, వాదము, భేదము అన్నింటిని అచలాధ్యాత్మిక రీతిలో వివరించినాడు.

హంస శతకము

అచ్చమైన శతకం ‘హంస శతకము’ ఇందులో 111 కంద పద్యాలున్నాయి. ఇవి కూడా అచల బోధలోని బయలు, ఎరుకను కలిగించేవే! ఇందులో గురువుతో పాటు కులభావమును గురించి రాసిండు. మలినాత్ములే కులభావాన్ని ప్రదర్శిస్తారని చెప్పిండు. జ్ఞానముతో అజ్ఞానాన్ని జయించాలన్నాడు. ఇట్లా హితబోధతో పాటు, ఆధ్యాత్మికాంశాలను కైగట్టిండు.

కం.      అంగమున లింగ దేహము

భంగముతా జేసినపుడె బయలై సర్వం

లింగ మయంబుగ దోచును

సంగము లేకుండ వెల్గు సత్యము హంసా

కం.      గురువును నరుడని దలచక

హరిహర వాణీశులనుచు ఆత్మయటంచున్‌

పరిపూర్ణుడనుచు గొలచిన

సరిలేని పదంబు గల్గు సత్యము హంసా

కం.      కులభావము గుణ భావము

మలినాత్ములు వదల లేక మరిగిరి సీలం

బిలలోను తాను బట్టుట

మలమూత్రపు కులముగాదె మహిలో హంసా

కం.      మలమూత్ర కుక్షిలోపల

పలుమారును దుఃఖమంది పాపపు జనముల్‌

తెలివొంద లేక నిలలో

కలకాలము బుట్టవలసె కారణ హంసా

కం.      యెంగిలి యనతన జన్మము

యెంగిలి యన శబ్దజాల మెంగిలిగాదా

యెంగిలి వేదముగాదా

యెంగిలి దినకున్న మోక్ష మెరుగడు హంసా

కం.      హృదయమనే దర్పణమున

సదమలముగ మనసుచేత చక్కగ జూడన్‌

హృదయములో పూర్ణుంబను

పడమందున జిక్కు మనసు పావన హంసా

కం.      వాదించవచ్చు శాస్త్రము

భేదించుట కష్టమండృ బుధజనులెల్లన్‌

వాదము భేదంబునకే

వాదంబున కందదాత్మ వాసిగ హంసా

కం.      తనుదానెరుగట కొరకై

తనుదా వాదించవలయు తత్వజ్ఞులిలలన్‌

తనుదా వాదము చేసిన

అనుమానము లేక పూర్ణుడౌగద హంసా

కం.      క్షరమునకు సాక్షియైతా

క్షరమే నేననుచు మోహ చరలో జిక్కెన్‌

క్షురము నెరింగెడి యక్షర

పురుషుడునే ననెడివాడు పూజ్యుడు హంసా

కం.      జ్ఞానంబనియెడి ఖడ్గము

పూనికర స్థలమునందు పురుషుండిల

నజ్ఞానమను యడవి నరికిన

వాని సమానుండు లేడు వసుధను హంసా

కం.      అజ్ఞానం బను చీకటి

విజ్ఞానం బనెడి జ్యోతి విమలపు కాంతిన్‌

అజ్ఞానాంధము బాసియు

సుజ్ఞానము చేతతన్ను జూచును హంసా

కం.      యెరిగెడి యెరుక నెరింగెడి

యెరుకను నేననుచు నెరిగి యేకంబైతా

నెరుగని యటువలె నెరుగును

యెరుకునితో లేరు సములు యెందును హంసా

కం.      బురదలొ దిరిగెడి కుమ్మరి

పురుగు వలెన్‌ దిరుగు చుండ్రు భువిలో సాధుల్‌

ధరలో వారల భావము

నరపశువులకేమి యెరుక నయముగ హంసా

కం.      అద్వైతమనగ యాత్మగు

అద్వైతంబనగ పూర్ణ మగు సత్యముగా

అద్వైత మార్గ మెరిగిన

అద్వయుడై నతడు వెల్గు నమలుడు హంసా

కం.      నీవనియెడి నేనడియెడి

భావంబుల నెల్ల వదలి పరతత్వంబున్‌

భావింపు దుండి పూర్ణం

బై వెల్గిరి గాదె పూర్ణులనయము హంసా

కం.      దృక్కనుచు దృశ్యంబని

దృక్కును దృశ్యంబుగాద దృశ్యంబనుచున్‌

మక్కువతో బలికెదరిటు

చక్కగ తమ్మెరుగలేరు సత్యము హంసా

కం.      అతర్బాహ్యంబులతా

సంతతము వెలుంగు నాత్మ సత్యంబనివే

దాంతులు బల్కుచు నుందురు

అంతర్బాహ్యములుగాని ఆత్మను హంసా

కం.      అంతర్బాహ్యములనియెడి

సంతత సంశయము వదలి సహజ స్థితిగా

మంతనము లేక నుండిన

అంతట తానై వెలుంగు ననయము హంసా

కం.      వెన్నెల వలె పూర్ణుండై

అన్నయయను పరమహంస ఆనందుమునన్‌

తిన్నగ సద్గురు మూర్తికి

పన్నుగ నీకృతియు నిచ్చె పావన హంసా

మల్లేశ్వర గురువర్యులను తలుచుకుంటూ ముగించిన ఈ శతకములో అచల తత్వము విడమరిచి చెప్పిండు. ఎరుక, బయలు, గురువు, శిష్యులు, బోధన, శాస్త్రము, వాదము, రచన అన్నింటిని భక్తులకు సుబోధకంగా తెలిపిండు. శాస్త్ర జ్ఞానం, తాత్విక మర్మజ్ఞత, సాహిత్య ప్రతిభ ఉంటే గానీ ఇట్లాంటి రచన సాధ్యము కాదు.

గురువాక్య తారావళి

తన గురువు వేంకటదాసును స్తుతిస్తూ గురువాక్య తారావళి పేరిట రచన చేసిండు.

అందులో పరమాత్ముడు, గురువు, దేహము, సాధన ఇట్లా చాలా విషయాల మీద తన భావాలను వ్యక్తం చేస్తూ రాసిండు. అందులోనుంచి ఒకటి రెండు పద్యాలిలా ఉన్నాయి.

సీ.       దేహంబనిత్యంబు దేహీ నిత్యంబని

దేహేంద్రియాదుల తీవ్రగతిని

మోహంబులెల్లలను మొదటికి వర్జించి

యాత్మపరమాత్మల కైక్యమెరిగి

చిత్త శాంతిని బొంది చిన్మాత్రమును వినా

యితరంబు జూడక నెప్పటికిని

సర్వమాత్మయటంచు సత్యంబుగాజూచు

వారెతత్వజ్ఞులీ వసుధలోన

అట్టివారల మర్మంబు నరయుటకును

హరిహర బ్రహ్మలకునైన నలవిగాద

టంచు శాస్త్రంబులెల్ల నిట్లను నటంచు

దెలిపి చెప్పెను వేంకట దేశికుండు

సీ.       అజ్ఞానభావంబు నణచివేయగ లేక

ప్రజ్ఞానమనినోట బలుకనేల

అద్వైతతత్వంబు నాత్మలోగనలేక

తత్వమసీయని దలపనేల

బ్రహ్మసాక్షాత్కార భావంబెరుంగక

అయమాత్మ బ్రహ్మమంచనగనేల

యెన్ని విధములనైనను తిన్నుగాను

గన్నవాడిలయ పరోక్ష జ్ఞానియనుచు

నిఖిల వేదాంత శాస్త్రములు నిశ్చయించు

ననుచు వేంకట గురువరుండానతిచ్చే

ఇవే గాకుండా అఖండ బోధానంధార్థ అద్వైత కందార్థ దరువులు అనే పుస్తకములో గురువు, గురు పరంపర, గురు శిష్య అన్యోన్యత, మోక్షము, సుజ్ఞానము, అజ్ఞానము, సుజన, అచల, ఎరుక లక్షణము, సగుణ, నిర్గుణ విచారము ఇట్లా అనేక విషయాలను వివరంగా చెప్పిండు.

అచల పరిపూర్ణ ప్రతిభావంతుడైన అన్నావధూత గురించి ఏ సాహిత్య చరిత్రలోనూ రికార్డు కాలేదు. ప్రామాణికంగా పరిగణించే వంగూరు సుబ్బారావు శతక సాహిత్య చరిత్రలోనూ ఈయన గురించి ఏమాత్రము ఉటంకింపు లేదు. తెలంగాణ నుంచి దాదాపు 200 ఏండ్ల నుంచి 175 ఏండ్ల క్రితం రచనలు చేసి ప్రచురించిన అవధూత అన్నయ. ఈయన రచనలు కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ అకడెమిక్‌ రంగంలో ఎవ్వరూ కృషి చేయలేదు. తెలంగాణ సాహిత్య చరిత్ర కోణంలో కూడా ఈయన గురించి ఇవ్వాళ సమగ్రంగా రికార్డు చేయాల్సిన అవసరమున్నది. ప్రధానంగా బహుజన సాహిత్యానికి పట్టం కట్టాలి. నిజాం పాలనలో ఆధ్యాత్మిక రంగంలో అత్యధిక రచనలు వచ్చాయి. వాటిని చరిత్రలో ఏనాడూ భాగం చేయలేదు సాహిత్య చరిత్రకారులు. ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి తెలుగులో బహుజనులు వెలువరించిన సాహిత్యాన్ని సమగ్రంగా వెలికి తీసి ప్రచురించాల్సిన అవసరమున్నది.

*

సంగిశెట్టి శ్రీనివాస్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు