విశ్వనాథ తీగ లాగితే కదిలిన డొంక!

రిశోధనలో దృష్టి నైశిత్యం గురించీ, కేంద్రీకరణ గురించీ, దృష్టి మళ్లకుండా ఉండే ఏకాగ్రత గురించీ పదే పదే చెపుతుంటారు. కాని ఎంత తదేక దీక్షతో సాగే పరిశోధనలో అయినా ఆలోచనలను ఆ కేంద్రీకరణ పరిధిలోనే కుదించి కొనసాగించడం కష్టం. ఒక విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మరొక విషయంలోకి వెళ్లడమనేది సర్వసాధారణ అనుభవం. ఇది పరిశోధనలో మాత్రమే కాదు, సాహిత్య పఠనంలో, సృజనలో, సంభాషణలో, ప్రతి పనిలో, నిత్య జీవితాచరణలో అతి మామూలుగా జరిగిపోతుంటుంది. ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళిపోతాం. దేని గురించో ప్రారంభించి, మరెన్నో విషయాలు శాఖా చంక్రమణం చేసి, అసలు మొదలు పెట్టిన విషయాన్ని మరిచిపోయి మరెక్కడో తేలుతాం. ఒకటి మాట్లాడుతుండగానే, ఒకటి చేస్తుండగానే మరొకటో, మరెన్నో మదిలో సుళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఇది మానవ మేధకూ ఆలోచనకూ అత్యంత సహజమైన విషయం కావచ్చు.

ఎంతగా పరిధులూ పరిమితులూ గీసుకుని ఆ ఆవరణ లోపలే పరిశోధన సాగిస్తున్నా, ఏదో ఒక ప్రస్తావన మరెక్కడికో తీసుకుపోతే, ఒక పని కోసం తవ్వడం మొదలుపెట్టిన గునపం మరేదో అపూర్వమైన కుండపెంకుకు తగిలి, ఆ కుండపెంకు తన సంగతి చూడమని తోసుకొస్తే ఏం చేయగలం? తెలిసో తెలియకో, ఉద్దేశపూర్వకంగానో, యథాలాపంగానో ఒక తీగ లాగితే డొంకంతా కదిలితే ఏం చేయగలం?

ఆ అవస్థలో పడ్డాను నేను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో వాడిన ఒక మాట చాల చరిత్ర తవ్వడానికి కారణమైంది. విశ్వనాథ తీగ లాగితే చాల డొంక కదిలింది.

విప్లవ రచయితల సంఘం యాబై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని చరిత్ర పుస్తకం రాయాలని ఒక ఆలోచన కలిగింది. కూచుని ఏకబిగిన పుస్తకం రాసే తీరికా, ఓపికా, ఏకాగ్రతా లేవు గాని ధారావాహికగా రెండు వారాలకొకసారో, నాలుగు వారాలకొకసారో ఒక ముక్క రాయమని కొలిమి వెబ్ పత్రిక అడిగితే అది సులభమని ఒప్పుకున్నాను.

తొమ్మిదో ఏటి నుంచి ఆ సంస్థను సన్నిహితంగా చూస్తున్నాను. ఈ యాబై ఏళ్లలో సగానికి కొంత ఎక్కువ కాలం దానితో, దానిలో జీవించాను. పదకొండేళ్ల కింద సంస్థకు దూరమైనా, ఆ ఆదర్శాల పట్ల విశ్వాసమూ గౌరవమూ మారలేదు. అందువల్ల ఈ చరిత్ర రచన పని సులభంగా చేయగలననే అనుకున్నాను.

సంస్థలో సభ్యుడిగా చాల కాలం ఉండడం మాత్రమే కాక సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా దాని సాహిత్యం చదువుతూ, దాని కార్యక్రమాలతో, దాని నాయకులతో, అనేక మంది ఆయాకాలపు సభ్యులతో సన్నిహితంగా ఉండే అవకాశం రావడం వల్ల సంస్థ చరిత్రలో చాల విషయాలే తెలుసునని అనుకుంటున్నాను. ముఖ్యంగా కెవిఆర్, చలసాని ప్రసాద్, కృష్ణాబాయి, వరవరరావు, లోచన్, ఎన్ కె వంటి స్థాపక సభ్యుల వాత్సల్యాన్ని, త్రిపురనేని మధుసూదనరావు, సి ఎస్ ఆర్ ప్రసాద్, వి చెంచయ్యల నుంచి పాణి, వరలక్ష్మి, కాశీంల దాకా మూడు తరాల నాయకుల స్నేహాన్ని పొందినందువల్ల ఎన్నెన్నో చారిత్రక, చరిత్రాత్మక, వాస్తవ ఘటనల గురించి ప్రత్యక్ష సాక్షులుగా, భాగస్వాములుగా వాళ్ల అనుభవాలు విని ఉండడం వల్ల జ్ఞాపకం మీద ఇది రాయగలననే అనుకున్నాను.

ఎంత జ్ఞాపకం మీద రాసినా, చారిత్రక పరిణామాల మీద రాసేటప్పుడు ప్రతి వాక్యానికీ కచ్చితమైన ఆధారాలు ఉండాలనే అకడమిక్ సంప్రదాయం కొంత నేర్చుకున్నాను గనుక ప్రతి ఘటనకూ ఆధారాలు వెతికే పరిశోధన మొదలుపెట్టాను. అకడమిక్ రచనలో లాగ పేజీల కొద్దీ పాదసూచికలు, ఆధారాలు, ఉపయుక్త గ్రంథసూచిలు ఇచ్చి భయపెట్టనక్కరలేదు గాని, రాసిన ప్రతి వాక్యమూ రుజువు చేయదగిన వాస్తవంగా, కనీసం ఆధారం ఇవ్వదగిన ఉటంకింపుగా ఉండాలని నియమం పెట్టుకున్నాను. అభిప్రాయాలు, నిర్ధారణలు, వాదనలు, బహుళ కోణాలు ఎలా ఉన్నా సరే, వాస్తవాలు మాత్రం కచ్చితంగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. “కామెంట్ ఈజ్ ఫ్రీ, బట్ ఫాక్ట్స్ ఆర్ సేక్రెడ్” అని సుప్రసిద్ధ సంపాదకుడు సి పి స్కాట్ అన్నాడని చలసాని ప్రసాద్ వందలసార్లు ఉటంకించిన మాట ప్రతి వాక్యానికీ గుర్తొస్తుంటుంది.

ఆ పనిలో భాగంగా, 1970 జూలై 4 కు ముందూ వెనుకా పరిణామాల గురించి రాస్తున్నప్పుడు ఇతర ఆధారాలతో పాటు, కాస్త ఎక్కువగా సంప్రదించిన పుస్తకం అనంతం (భమిడిపాటి అనంత నారాయణ) రాసిన ‘తెలుగు సాహిత్యంలో కల్లోల, క్షీణ దశాబ్దాలు 1965-85’ (వికాసిని ప్రచురణలు, విశాఖపట్నం, 1988). అనంతం అభిప్రాయాలేవైనా పుస్తకంలో కొన్ని చారిత్రక వాస్తవాలు, ఆధారాలు పొందుపరిచారు గనుక అవి సంప్రదిస్తూ, వాటిని సమర్థించే, పరిపుష్టం చేసే, అదనపు సమాచారం చేర్చే ఇతర ఆధారాల కోసం కూడ అన్వేషిస్తూ ఉన్నాను.

విరసం ఏర్పడిన వెంటనే సాహిత్య లోకంలో స్పందనల కోసం చూస్తుండగా, అనంతం పుస్తకంలో, రచనలో భాగంగా కాక ప్రత్యేకంగా ఒక బాక్స్ లాగ ఇచ్చిన విశ్వనాథ సత్యనారాయణ అభిప్రాయం కనబడింది. అది:

“ప్రశ్న: ఈ విప్లవ రచయితలని ‘సాహిత్య నక్సలైట్లు’ అన్నారు. మీరు చదివేరు కదా?

విశ్వనాథ సత్యనారాయణ: చదివాను. మనం ఏమి చెయ్యగలుగుతాము? మన హోం మంత్రి శ్రీ వెంగళరావు గారు. వారి దృష్టి ఈ సాహిత్య నక్సలైట్ల మీద పడకపూర్వం, మనం కూడ ప్రొద్దు వాక రైతుకు మల్లే అయితే మన ఖర్మ.”

విప్లవ రచయితల సంఘం ఏర్పడిన నాలుగో రోజే వారి మీద హోం మంత్రి దృష్టి పడాలని విశ్వనాథ ఆకాంక్షించారని చూసి కాస్త ఆశ్చర్యం కలిగింది. విప్లవ రచయితలవి కూడ ఒకరకమైన భావాలు, తమకు భిన్నమైన భావాలు అని గుర్తించి, ఆ భావాలను ఖండిస్తాము, ఓడిస్తాము అని కాకుండా, రాజ్యాంగయంత్రం చర్యలు తీసుకోవాలని ఆయన లాంటి పెద్దమనిషి సూచించారని చూసి ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత వాక్యంలో “ప్రొద్దు వాక” అంటే ఏమిటో అర్థం కాలేదు. అది అచ్చుతప్పా, అటువంటి పదమేమైనా ఉందా తెలియలేదు. అక్కడ అనంతం కూడ ఎటువంటి వివరణ ఇవ్వలేదు (ఆ ఇంటర్వ్యూ జరిగిన 1970 జూలైలో ఆ మాట అందరికీ తెలిసినదిగానే ఉండవచ్చు, అనంతం పుస్తకం వెలువడిన 1988 నాటికి కూడ అంతే ప్రాచుర్యంలో ఉందా తెలియదు). పైగా అవి రెండు పదాలన్నట్టుగా మధ్యలో ఖాళీ వదిలి ప్రచురించారు.

ఆ కింద బ్రాకెట్ లో “ఆంధ్రప్రభ విలేఖరి ఇంటర్వ్యూ, ఆంధ్రప్రభ, 9.7.70” అని ఆధారం మాత్రం ఇచ్చారు. ఇటీవలి రచనల్లో, ముఖ్యంగా సాహిత్య వ్యాసాల్లో, ఎంత తీవ్రమైన, వివాదాస్పదమైన అభిప్రాయాల ఉటంకింపులకైనా, అత్యవసరమైన సందర్భాలలోనైనా ఆధారాలు ఇవ్వకుండా ఉంటున్న ప్రస్తుత అలవాటుతో పోలిస్తే అది కొంత మేలే.

ఆ మాట అచ్చు తప్పు కావచ్చుననే గట్టి నమ్మకంతోనే, అసలు మూలం చూస్తే అదేమిటో తేలుతుందని ఆంధ్రప్రభ వెతికాను. అది అచ్చుతప్పు కాదు. కాకపోతే ఆంధ్రప్రభలో అచ్చయిన ప్రకారం ప్రొద్దువాక ఒక్కటే మాట అని కొత్తగా తెలిసింది. అక్కడి సందర్భాన్ని బట్టి అది ఊరి పేరు కావచ్చునని అనిపించింది. అది ఊరిపేరే అయితే ఆ ఊరి రైతుకు ఏమైంది? దానికీ నక్సలైట్లకూ లేదా సాహిత్య నక్సలైట్లకూ సంబంధం ఏమిటి? మరొక వెతుకులాట.

గూగుల్ సర్చ్ లో ప్రొద్దువాక అనే ఊరు కృష్ణాజిల్లా కైకలూరు దగ్గర ఉన్నట్టు తేలింది. ఇక అక్కడి రైతు సంగతీ, నక్సలైట్ల సందర్భంలో ఆ ప్రస్తావన సంగతీ తేలాలి.

మరి కాస్త తవ్వకప్పని జరిపితే, ఈ ఇంటర్వ్యూ జరగడానికి రెండు నెలల ముందు కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ప్రొద్దువాక (కొన్నిచోట్ల పొద్దువాక) గ్రామంలో కురుగంటి అప్పయ్యశాస్త్రి అనే భూస్వామి ఇంటి మీద నక్సలైట్ల దాడి జరిగిందని తెలిసింది. బహుశా కృష్ణా జిల్లాలో నక్సలైట్ల ఆధ్వర్యంలో జరిగిన తొలి దాడి ఘటన అది. 1970 ఏప్రిల్ 26-27 రాత్రి జరిగిన ఈ దాడిలో నలబై యాబై మంది పాల్గొన్నారని పత్రికలు రాశాయి. దాడి చేసినవారు ఒక లక్ష రూపాయల విలువ చేసే డబ్బు, నగలు, వస్త్రాలు తీసుకుపోయారని, ఆ వస్త్రాలను ఊళ్లో పంచారని, ఇంటి ముందు ప్రామిసరీ నోట్లు దహనం చేసినట్టుగా బూడిదకుప్ప ఉందని, మావో జిందాబాద్ అనీ, ధనికులను దోచి పేదలకు పంచుతాం అనీ నినాదాలు ఇచ్చారనీ పత్రికా కథనాలున్నాయి. దాడి మొదలయినప్పటి నుంచి ముగిసేసరికి గంట, గంటన్నర అయిందని, ఆ తర్వాత వెళ్లిపోయే ముందు వారు అప్పయ్యశాస్త్రిని కత్తితో పొడిచారని తదనంతర కథనాలు చెపుతున్నాయి. ఆ కత్తిపోట్లకు ఆయన ఆ తర్వాత చనిపోవడంతో మర్నాడు వార్తాపత్రికల్లో హత్యావార్తే పతాకశీర్షిక అయింది.

ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగినందువల్ల, పత్రికల్లో పతాక శీర్షిక అయినందువల్ల, విశ్వనాథ సత్యనారాయణ దృష్టికి కూడ వచ్చి ఉంటుంది. అది జరిగిన తర్వాత రెండు నెలలకే ఈ ఆంధ్రప్రభ ఇంటర్వ్యూ జరిగినందువల్ల ఆయన అది ప్రస్తావించి ఉంటారు.

అయితే ఈ ఘటన గురించి, తర్వాతి పరిణామాల గురించి తవ్వకాలలో బైటపడిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ప్రొద్దువాక ఘటన గురించి హత్య, దోపిడీతో కూడిన హత్య, నేరపూరిత కుట్ర, చట్టవ్యతిరేకంగా గుమికూడడం, దొమ్మీ, సాయుధ దొమ్మీ, ఇంట్లో చొరబడడం, దొంగిలించిన వస్తువుల వినియోగం వంటి నేరాలు ఆరోపిస్తూ మొత్తం 30 మంది మీద కేసు పెట్టారు. ఆ కేసులో విజయవాడ సెషన్స్ కోర్టు ఇద్దరికి మరణశిక్షనూ, మిగిలినవారికి వేరువేరు శిక్షలనూ విధించింది. ఇద్దరి మీద ప్రాసిక్యూషన్ నేరం రుజువు చేయలేకపోయిందని నిర్దోషులుగా విడుదల చేసింది. మరణశిక్ష పడిన ఇద్దరూ, ఇతర శిక్షలు పడినవారూ తమ మీద శిక్షలను సమీక్షించాలని హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. మిగిలినవారికి కూడ మరణశిక్ష విధించాలని ప్రభుత్వం కూడ హైకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. ఈ మూడు అప్పీళ్లను కలిపి విచారించిన హైకోర్టు బెంచి, జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిస్ చెన్నకేశవరెడ్డి, 1973 ఏప్రిల్ 19న తీర్పు ఇచ్చారు.

ఆ తీర్పు మొత్తంగా కాకపోయినా, కొంత భాగం గూగుల్ సర్చ్ లో దొరుకుతున్నది. కాకపోతే ఆ తీర్పులో నిందితుల పేర్లు గాని, సాక్షుల పేర్లు గాని లేవు. నిందితులను ఎ 1, ఎ 2 అని, సాక్షులను పిడబ్ల్యు 1, పిడబ్ల్యు 2 అని మాత్రమే ప్రస్తావించారు. సెషన్స్ కోర్టు తీర్పు, చార్జిషీట్ దొరికితే గాని ఆ వివరాలు తెలియవు.

మామూలుగా తీర్పులలో జరిగిన ఘటన గురించి ప్రాసిక్యూషన్ కథనం, ప్రతివాదుల కథనం, వాదనలు, న్యాయమూర్తుల నిర్ధారణలు వివరంగానే ఉంటాయి. ఏప్రిల్ 26-27ల్లో ఈ ఘటన జరిగితే, జూన్ 11 రాత్రి మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి సరుగుడు తోటలో ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు నక్సలైట్లు పోలీసు కాల్పుల్లో చనిపోయారని ఆ తీర్పు చదువుతుంటే అదనపు విషయం తెలిసింది. మంగినపూడి సరుగుడు తోటలో నక్సలైట్ల కదలికలు ఉన్నాయని తెలిసి, పోలీసులు అక్కడికి వెళ్లారని, నక్సలైట్లు పోలీసుల మీద కాల్పులు జరిపారని, ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారని, కాసేపటి తర్వాత వెళ్లి చూస్తే రెండు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెప్పినట్టుగా తీర్పులో రాశారు. ఆ చనిపోయిన ఇద్దరు నక్సలైట్లు ప్రొద్దువాక దాడిలో పాల్గొన్నవారేనని ప్రాసిక్యూషన్ చెప్పిందని తీర్పులో రాశారు. ఆ ఇద్దరి పేర్లు రమణ, జానకిరామరాజు అని, హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులలో ఆ ఇద్దరూ ఉన్నారని, మిగిలిన ఇద్దరికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించిందని ఆ తీర్పులో పేర్కొన్నారు.

రమణ అనే పేరు వినగానే నాకు ఆ పేరుకు సంబంధించిన ఇతర విషయాలు గుర్తుకొచ్చాయి. బెజవాడలో నేను నాలుగేళ్ల పాటు ఉన్న ప్రాంతానికి పక్కనే సున్నపుబట్టీల సెంటర్. దాని వెనుక రాడికల్స్ నాయకత్వంలో కొండ అంచును ఆక్రమించుకుని పేదలు, విప్లవోద్యమ సానుభూతిపరులు వేసుకున్న గుడిసెల కాలనీ పేరు రమణ నగర్. అది నక్సల్బరీ విప్లవోద్యమంలో కృష్ణా జిల్లానుంచి తొలి అమరవీరుడు దాసరి వెంకట రమణ పేరు మీద ఏర్పడిన కాలనీ. ఆయన పదకొండో సంస్మరణ సందర్భంగా 1981 జూన్ 10న అక్కడ స్థూపావిష్కరణ జరిపారు. ప్రొద్దువాక దాడిలో పాల్గొన్నాడనే ఆరోపణతో ఆ దాడి తర్వాత నెలన్నరకు పోలీసులచే కాల్చిచంపబడిన వ్యక్తి ఆయన. బెజవాడలో టాక్సీ డ్రైవర్ గా ఉంటూ, టాక్సీ డ్రైవర్ల సంఘం స్థాపించి నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమ ప్రభావంతో దళజీవితంలోకి వెళ్లిన తొలి తరం వ్యక్తి ఆయన.

ఆయన గురించి కొన్ని వివరాలు ‘అమరవీరుల జీవితచరిత్రలు’లో ఉన్నట్టు జ్ఞాపకం. పార్వతీపురం కుట్రకేసు ముద్దాయిగా జైలులో ఉన్న కాలంలో కొల్లా వెంకయ్య, విశాఖపట్నం, రాజమండ్రి జైళ్లలో తోటి కార్యకర్తల నుంచీ, రైతుల నుంచీ అమరవీరుల గురించి వివరాలు సేకరించారు. అవి ‘సేకరణ: రైతు కార్యకర్త’ అనే పేరుతో 1973లో పిలుపు ప్రచురణలు ప్రచురించింది. ఆ పుస్తకం మళ్లీ చూస్తే దాసరి వెంకట రమణ జీవిత వివరాలు పెద్దగా లేవు గాని, “కృష్ణా జిల్లాలోని కైకలూరు తాలూకా ప్రొద్దువాక రైతాంగ విముక్తి పోరాటంలో నాయకత్వ పాత్ర వహించారు” అని ఉంది. ఆయననూ పోరంకి జానకిరామరాజునూ ఏజెన్సీ లో పేరుకొండ దగ్గర జూన్ 10న పోలీసులు పట్టుకున్నారనీ, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారనీ ఆ పుస్తకంలో ఉంది.

కలకత్తానుంచి వెలువడే వారపత్రిక ఫ్రాంటియర్ ఆరోజుల్లో విప్లవోద్యమ వార్తలూ వ్యాసాలూ విరివిగా ప్రచురించేది. ఆ పత్రికలో 1971 ఫిబ్రవరి 27 సంచికలో సి కె కుటుంబ రెడ్డి రాసిన ‘ఆంధ్రప్రదేశ్: విల్ యు వోట్?’ అనే వ్యాసంలో ప్రొద్దువాక ఘటన తర్వాత నిర్బంధం గురించి కొన్ని వివరాలు కూడ ఉన్నాయి. ప్రొద్దువాక హత్య కేసుకు సంబంధించి ప్రసాద్, యుగంధర్ అనే రైల్వే ఉద్యోగులను, పి వి సుబ్బారావు అనే హెల్త్ ఇనస్పెక్టర్ నూ, శరబంది అనే బేసిక్ హెల్త్ వర్కర్ నూ అరెస్టు చేశారని ఆ వ్యాసంలో రాశారు. అలాగే ఏలూరుకు చెందిన వీరంకి రాజగోపాల్ నూ, విజయవాడకు చెందిన దాసరి వెంకటరమణనూ, కపిలేశ్వరపురంకు చెందిన జానకిరామరాజునూ సామర్లకోటలో పట్టుకున్నారనీ, వెంటనే రాజగోపాల్ ను ఏజెన్సీకి తీసుకువెళ్లి కాల్చి చంపారనీ, మిగిలిన ఇద్దరినీ నూజివీడు, వీరవల్లి, కొడాలి పోలీసు స్టేషన్లలో నెలరోజుల పాటు చిత్రహింసలు పెట్టి చివరికి మంగినపూడిలో సిఐడి ఇనస్పెక్టర్ పిళ్లా సత్యనారాయణ కాల్చి చంపాడనీ రాశారు.

ఆ ఎన్ కౌంటర్ వివరాల కోసం మళ్లీ పాత పత్రికలు వెతికితే, ఆ “ఎన్ కౌంటర్” జూన్ 11 రాత్రి జరిగినట్టుగా ఉంది. నక్సలైట్లు ఉన్నారని తెలిసి బందరు డి ఎస్ పి రామచంద్రారెడ్డి నాయకత్వంలో పోలీసు దళం వెళ్లిందని, సరుగుడు తోటలో ఉన్న నక్సలైట్లు తమ మీద నాటు బాంబులతో, బరిసెలతో దాడి చేశారని, తాము ఆత్మరక్షణకై కాల్పులు జరిపితే వారిలో ఇద్దరు మరణించారని, వారెవరో గుర్తు తెలియదని, మిగిలినవారు పారిపోయారని పోలీసులు చెప్పిన కథనాన్ని పత్రికలు ప్రచురించాయి. అయితే, బాంబు దాడిలో ఇద్దరు ఇనస్పెక్టర్లు గాయపడ్డారని పోలీసులు చెప్పారని ఆంధ్రప్రభ రాయగా, “పోలీసులకు మాత్రం గాయాలు తగులలేదు” అని ఆంధ్రజ్యోతి రాసింది.

ఈ పత్రికా వార్తలలో మంగినపూడి ఎన్ కౌంటర్ కు బందరు డి ఎస్ పి నాయకత్వం వహించాడని ఉండగా, హైకోర్టు తీర్పులో ఉటంకించిన ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, స్పెషల్ స్క్వాడ్ ఇనస్పెక్టర్ నాయకత్వంలో పోలీసు బలగాలు వెళ్లాయి. పత్రికావార్తల్లో నక్సలైట్ల దగ్గర తుపాకులు ఉన్నాయని గాని, వారు కాల్పులు జరిపారని గాని లేదు. బాంబులు విసిరారని, బరిశెలు విసిరారని మాత్రమే ఉంది. కాని హైకోర్టు తీర్పు ప్రకారం చూస్తే అవతలి నుంచి కాల్పులు జరిగాయని ప్రాసిక్యూషన్ చెప్పింది. ఆ తీర్పులో ఉంటంకించిన ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం, కాల్పుల తర్వాత వెతికితే, రెండు మృతదేహాలు, నాటు బాంబులు, బరిశెలు, విప్లవ సాహిత్యం కనిపించాయి. వాటిలో ఒక మృతదేహం జేబులో రెండు వేల రూపాయలు, రమణ అనే వ్యక్తిని ఉద్దేశించి రాసిన ఉత్తరం దొరికాయి. ప్రాసిక్యూషన్ సాక్షులు ఆ మృతదేహం ఫొటో చూసి దాడిలో పాల్గొన్నది అతనేనని గుర్తుపట్టారని తీర్పులో ఉటంకించారు.

హైకోర్టు తీర్పు చట్టానికీ, న్యాయశాస్త్రానికీ, తర్కానికీ సంబంధించిన అనేక సాంకేతిక సూక్ష్మ అంశాలతో నిండి ఉంది గాని, దాంట్లో రెండు మూడు ఆసక్తికరమైన అంశాలున్నాయి.

సెషన్స్ కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గిస్తూ, హైకోర్టు అందుకు అవసరమైన చాల వాదనలు ముందుకు తెచ్చింది. ప్రాసిక్యూషన్ చేసిన నేరారోపణలలో ఒక్కదాన్ని మినహా అన్నిటినీ సెషన్స్ కోర్టు అంగీకరించి, నేరపూరిత కుట్ర అనే నేరారోపణకు ఆధారం లేదని అంది. ఆ మాటను ఒప్పుకుంటూనే, ఈ ఘటనలో చట్టవ్యతిరేకంగా గుమికూడడం, దొమ్మీ, సాయుధ దొమ్మీ, ఇంట్లో చొరబడడం, దోపిడీ వంటి అన్ని నేరాలూ ఉన్నాయి గాని, ఉద్దేశపూర్వకమైన హత్య అనడానికి ఆధారాలు లేవని హైకోర్టు వాదించింది. హత్యకు ప్రణాళిక ఉన్నట్టు లేదని, అది చివరి క్షణంలో జరిగింది గనుక, “క్షణికమైన ఆవేశంతో” జరిగి ఉండవచ్చునని అంది. అందువల్ల మరణశిక్ష అవసరం లేదని నిర్ధారించింది. ఆనాటికి విప్లవోద్యమానికి, ఈ చర్య జరిపిన దళానికి వర్గశత్రు నిర్మూలన అనే సిద్ధాంతం ఉండింది గాని, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కూడ ఆ దళసభ్యులు ఆ నినాదం ఇవ్వలేదు. కోర్టు తీర్పు కూడ వర్గశత్రు నిర్మూలన సిద్ధాంతాన్ని ప్రస్తావించలేదు.

ఈ తీర్పులో మరొక చెప్పుకోదగిన అంశం ఆనాటికి విప్లవోద్యమంలో కొందరైనా పాటిస్తుండిన “బూర్జువా కోర్టుల బహిష్కరణ” పట్ల కోర్టులు ఏ వైఖరి తీసుకోవాలనేది. మరణశిక్షకు గురైన ఎ-29, ఆయనతో పాటు ఎ-30 కోర్టులను బహిష్కరిస్తున్నామని ప్రకటించారట. తమ తరఫున వాదనలు వినిపించుకోలేదు గనుక, తమకు వ్యతిరేకంగా చెప్పిన సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు గనుక, చివరికి కోర్టు కాగితాల మీద, అప్పీల్ దరఖాస్తు మీద సంతకాలు పెట్టడానికి కూడ నిరాకరించారు గనుక, వారు తాము నేరం చేసినట్టు అంగీకరించినట్టేనని, కనుక మరణశిక్ష చెల్లుతుందని ప్రాసిక్యూషన్ వాదించింది. “నిందితుడి ప్రవర్తనే అతను న్యాయస్థానాలలో నమ్మకం లేని నక్సలైట్ అని చూపుతున్నది గనుక, ఈ నక్సలైట్ ఆ దాడిలో తప్పనిసరిగా పాల్గొనే ఉంటాడు” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాడట. దానికి జవాబుగా, హైకోర్టు తీర్పు, “న్యాయస్థానాలు తమ విధి నిర్వహణలో, తమ ముందుకు విచారణకు వచ్చే నిందితులు తీసుకునే వైఖరులను బట్టి వెనుకకు తగ్గడమో, ప్రభావితం కావడమో జరగదు, జరగగూడదు. నిందితులు ఎటువంటి వైఖరి తీసుకున్నప్పటికీ, అమలులో ఉన్న చట్టాల ప్రకారం న్యాయాన్ని ఇవ్వడం మాత్రమే న్యాయస్థానాలు చేయవలసిన పవిత్ర, మౌలిక కర్తవ్యం. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలనూ, పరిస్థితులనూ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం మనసులో సకారణమైన అనుమానం గనుక మిగిలి ఉన్నట్టయితే, ఆ నిందితుడికి ఆ అనుమాన ప్రయోజనం ఇవ్వాలని, ఈ దేశపు నేరవిచారణా న్యాయశాస్త్రం నిర్దేశిస్తున్నది. నిందితుడి రాజకీయ, సాంఘిక విశ్వాసాలేవైనప్పటికీ, విచారణలో అతను న్యాయస్థానంతో సహాయ నిరాకరణ చూపినప్పటికీ, చివరికి ధిక్కారం ప్రదర్శించినప్పటికీ, ఆ అనుమాన ప్రయోజనం ఇవ్వవలసిందే” అని చెప్పి కోర్టును బహిష్కరించిన ఎ-29 ఆ దాడిలో పాల్గొన్నాడనీ, హత్యలో పాల్గొన్నాడనీ ప్రాసిక్యూషన్ నిస్సందేహంగా రుజువు చేయలేకపోయిందని అన్నది.

ఈ చరిత్ర శోధనను ఇంకా కొనసాగించవచ్చు గాని, ఇక్కడికి ఆపి, ఇప్పటికే ఉన్న ఖాళీలనూ, సమస్యలనూ చర్చించదలచాను.

  1. పైన ఇచ్చిన వివరణను చూస్తే, చాల సందర్భాలలో నిస్సందేహంగా చెప్పగలిగిన కచ్చితమైన ఆధారాలు లేవు. యాబై ఏళ్ల కిందటి చరిత్రే ఇంత సందేహాస్పదంగా ఎందుకున్నది? నిండా యాబై ఏళ్లు గడవని చరిత్ర శోధనే ఇంత కష్టంగా ఎందుకున్నది? తప్పకుండా ఏ సమాచారమైనా ఒక దృక్పథం మీద మాత్రమే ఆధారపడుతుంది గాని, తేదీలు, స్థలాలు, పేర్లు వంటి “శుద్ధ సమాచార” వివరాలు శోధించడం కూడ కష్టమయ్యే స్థితి ఎందుకున్నది? సమాచార నమోదులో కచ్చితంగా, నిర్దిష్టంగా, నిర్దుష్టంగా ఉండకపోవడం అనే అలవాటు మనకు ఎందుకొచ్చింది?
  2. “శుద్ధ” “కేవల” సమాచారపు సమస్యలు ఒకవైపు విషయాన్ని జటిలం చేస్తుండగా, సమాచారం మీద వ్యాఖ్యాత దృక్పథం ప్రభావం మరొక పెద్ద సమస్య. అప్పయ్యశాస్త్రి హత్య వార్త రాసిన పత్రికలు ఆయనను “భూస్వామి” అని అభివర్ణించగా, హైకోర్టు తీర్పు అయితే, “160 ఎకరాల భూస్వామి” అని ఒకటికి రెండు సార్లు రాసింది. 1970 నాటికే ఊళ్లో విద్యుచ్ఛక్తి లేకపోయినా ఆయన ఇంటికి విద్యుత్ జనరేటర్ పెట్టుకున్నాడని రాసింది. దాడిలో నక్సలైట్లు తీసుకుపోయారని చెప్పిన ఆస్తిలో డెబ్బై వేల రూపాయల నగదు ఉంది. విశ్వనాథ సత్యనారాయణ మాత్రం ఆయనను “రైతు” అంటున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
  3. అభ్యుదయ సాహిత్య సదస్సు, దాని బహిష్కరణకు పిలుపులు, దాన్ని బహిష్కరించిన శ్రీశ్రీ, కెవి రమణారెడ్డి, దిగంబర కవులు, తిరుగబడు కవులు కలిసి విప్లవ రచయితల సంఘం స్థాపించడం మొదలైన పరిణామాలేవీ తనకు తెలియదని, ఎవరో ఇన్ కం టాక్స్ అధికారి వచ్చి అడిగి, తనకు తెలియదంటే, పత్రిక తెప్పించి చదివి వినిపించాడని విశ్వనాథ ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలోనే అన్నారు. సాహిత్య రంగంలో జరుగుతున్న ప్రధానమైన పరిణామాలేమో తెలియవని అనడం, మరొక పక్క వారి సంగతి హోం మంత్రి చూసుకోవాలని అనడం, ప్రొద్దువాక రైతు గురించి ప్రస్తావించడం కేవలం సమాచార లోపమేనా, ఇతర అర్థాలేమైనా చూడవచ్చునా?
  4. ఒక వ్యక్తి జీవిత చరిత్ర సేకరణ అన్నప్పుడు ఆ వ్యక్తి పుట్టిన ఊరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రులు, జీవనస్థాయి, చదువు, వృత్తి ఉద్యోగాలు వంటి వివరాలు ఉండడం కనీస అవసరాలు గదా. జీవిత చరిత్రలు సేకరిస్తున్నపుడు, రాస్తున్నప్పుడు ఆ దృష్టి ఎందుకు ఉండడం లేదు? దాసరి రమణ జీవిత వివరాలు లేకపోవడం ఒక ఎత్తయితే, అరెస్టు గురించీ, ఎన్ కౌంటర్ గురించీ, కనీసం ఎన్ కౌంటర్ జరిగిన తేదీ గురించీ కనీసం మూడు భిన్నమైన కథనాలున్నాయి. వీటిలో ఏది వాస్తవం?
  5. 1970-71లో ఫ్రాంటియర్ కు ఆంధ్రప్రదేశ్ గురించి రాసిన సి కె కుటుంబరెడ్డి ఎవరు? కెవిఆర్, ఐవి సాంబశివరావు, సికె నారాయణ రెడ్డి లలో ఎవరైనా కావచ్చునా?

 

*

ఎన్. వేణుగోపాల్

16 comments

Leave a Reply to kiran Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అత్యంత విలువైన పోస్టింగ్. చాలా విషయాలలో మార్గదర్శకంగా నిలుస్తుంది.

  • వేణు అన్నట్లు నేను కూడా వేరే వ్యాపకం లో0చి ఇందులోకి తల దూర్చ వలసి వచ్చింది.
    దాదాపు గడచిన 49 ఏళ్ళుగా కృష్ణా జిల్లాలో వుంటున్నాను కనుక పొద్దువాక కేసు గురించే కాదు అందులో కొందరు ముద్దాయిలనూ, ఆ కేసు వలన నిర్బంధాలకు గురయిన వారినీ స్వయంగా ఎరిగున్నాను.
    దిన పత్రికలలో పతాక శీర్షికలలో పొద్దువాక వార్తలు వచ్చినపుడు నేను కాకినాడలో వుండే వాడిని.
    ఆ కేసులో శిక్ష పడి బయటకు వచ్చి ఇంకా సజీవంగా ఉన్న వారు కూడా వున్నారు.
    అప్పటికే కృష్ణా జిల్లాలో వల్లూరి పూర్ణ చంద్రరావు ( కంకిపాడు సమితి ప్రెసిడెంటు) ని ఆయుధాల కొనుగోలుకు అవసరమయిన డబ్బుల కోసం నక్సలైటు బ్రుందం జనవరి 1969లో హత్య చేసి వున్నారు. అది కిరాయికి జరిగినదని తరవాత తెలిసిన సత్యం.
    పొద్దు వాక కు సంబంధించి ఆ హత్య సంఘటనలో ప్రత్యక్షంగా వున్న వారిని ముగ్గురిని నేను తరవాత ఎరిగి వున్నాను. వారు చెప్పిన ప్రకారం వీరంకి రాజగోపాలరావు ( ఏలూరు ) నాయకత్వాన కృష్ణా జిల్లాలోని దాదాపు 40 మంది అందులో పల్గొన్నారు.
    అంతకు ముందు ఆ గ్రామం లో ఎలాంటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కనీసం గా కూడా లేవు. ఒక్కరు తప్ప ( బహుశా వీరంకి రాజగోపాల రావు బంధువు) ఆ గ్రామస్తులెవరూ అందులో పాల్గొనలేదు. వారెవరికీ అప్పయ్య శాస్త్రి తెలియదు. గ్రామం లో ఆయన పట్ల శత్రుత్వం గల వారు కూడా లేక పోగా ఆయన హత్యను హర్షించిన వారు కూడా లేరు. నిజానికి ఆయనను చంపాలని మొదట అనుకో లేదనీ, తన కూతురు పెళ్ళి నిమిత్తం తెచ్చి పెట్టుకున్న నగలూ, నగదూ ఎత్తుకు వెళ్ళాలని మాత్రమే అనుకున్నామనీ వారు నాకు చెప్పారు. అయితే వారికి ఆను పానులు చూపిన తమ గ్రామస్తుడిని అప్పయ్య శాస్త్రి గుర్తు పట్టిన కారణంగా చంప వలసి వచ్చినదనీ చెప్పారు.
    ఆ సంఘటనలో పాల్గొన్న, పాల్గొనకున్నా నిర్బంధాలకు గురయిన దివి తాలూకా వారందరినీ నేను ఎరుగున్నాను. నాకు తెలిసి బ్రతికి వున్నావాడు బందలాయి చెరువు ( అవనిగడ్డ పంచాయతీ) గ్రామస్తుడు కామ్రేడ్ సి0హాద్రి కృష్ణా రావు ఒక్కడే!
    కొడాలి ( దివి తాలూకా) అనే గ్రామం లో నాటికీ నేటికీ పోలీసు స్టేషను లేదు. కానీ పొద్దువాక కేసులో అనుమానితులను విచారించటానికి అప్పుదు వడాలి అనే గ్రామం ( అప్పుడు కైకలూరు తాలూకా – ఇప్పుడు ముదునేపల్లి మండలం) లో పోలీసు క్యాంపు పెట్టి చిత్రహింసల పర్వం సాగించారు. అచ్చు తప్పుగా వడాలి బదులు కొడాలి అని రికార్డులలో కూడా వుండి వుండవచ్చు.
    చాలా ముఖ్యమయిన ఒక విషయం ఏమిటంటే హతుడయిన అప్పయ్య శాస్త్రి గుంటూరులో ప్రముఖ లాయరూ, 1952 ఎన్నికలలో గుంటూరు నుండి లోక్ సభ కు ఎన్నికయిన ఎస్.వి.ఎల్. నరసిమ్హం గారికి స్వయంగా వియ్యంకుడు. కృష్ణా నుండి నెల్లూరు దాకా కంమ్యునిస్ట్ లపై వందలాది కేసులను వాదించిన వాడు. పార్వతీ పురం కుట్ర కేసు నూ ( చారూ మజుందార్ కానూ సన్యాలులు ముద్దాయిలుగా వున్న)
    తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేస్వర రావు లు ముద్దాయిలుగా వున్న హైదరాబదు కుట్ర కేసునూ అత్యంత నిజాయతీగా వాదించినది కూడా ఎస్వీఎల్లే!
    అప్పటికి కృష్ణా గుంటూరు నెల్లూరు జిల్లాలలో చారూ వర్గీయుల దాడికి హత్యలకూ గురయిన వారు కమ్మ, రెడ్డి, వైశ్య, పద్మశాలీ కులస్తులున్నారు కానీ బ్రాహ్మలెవరూ లేరు. ప్రజలపై, తమ వ్యతిరేకులపై ప్రత్యక్ష భౌతిక దాడులు చేయని లేక చేయలేని వారుగా బ్రాహ్మలను ప్రజలు చూస్తారు. అలాంటిది పొద్దువాక కేసు జరిగి వున్న నేపధ్యమ్లో విశ్వనాధ ను ఈ సంఘటన కొంత కలత పెట్టి వుండవచ్చు. —
    — దివికుమార్

    • దివి కుమార్ గారూ !
      మీ వివరణ నాకు అనేక ఇన్ పుట్స్ ఇచ్చింది. ధన్యవాదాలు. కామ్రేడ్ సింహాద్రి కృష్ణా రావు, వారి కుటుంబం నాకు 1978 నుండి బాగా తెలుసు.

      1952 లోక్ సభ ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతుతో S. V. L. Narasimham గుంటూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచినట్టు తెలుసు. కానీ, పొద్దువాక హతుడు అప్పయ్య శాస్త్రి కి ఆయన వియ్యంకుడు అని తెలీదు.

      నక్సలైట్ల ముసుగులో కొన్ని కిరాయి హత్యలు కూడ జరిగిన మాట వాస్తవం. కంకిపాడు సమితి ప్రెసిడెంటు వల్లూరి పూర్ణ చంద్రరావు హత్య అలాంటిదే అని నాకూ తెలుసు. అయితే, దానికి చారు మజుందార్ గ్రూపుతో సంబంధంలేదు. ఆ యాక్షన్ లో పాల్గొన్న వారికి అప్పటికి చారు మజుందార్ గ్రూపుతో రాజకీయ అనుబంధం లేదు.

  • విశ్వనాధసత్యనారాయణ రాజ్యం గొంతులో గొంతు కలిపినది ఇందులో స్పష్టం. చరిత్ర రికార్డు చేయడం ఇప్పటికీ మనకి ఆబ్బని కళ. దానికవసరమైన శ్రమ ఎవరూ చేయడం లేదు. పనిముట్లూ ఎవరి వద్దా లేవు. అన్నింటికి మించి ఆధారాలను బట్టి మన దృక్ఫధం చరిత్రనిర్మాణం జరగాలని మనమింకా గుర్తించడం లేదు.

  • ” పదకొండేళ్ల కింద ( విరసం ) సంస్థకు దూరమైనా, ఆ ఆదర్శాల పట్ల విశ్వాసమూ గౌరవమూ మారలేదు ” అన్న వీక్షణం ఎన్. వేణుగోపాల్ గారూ … మీరు తీగ లాగిగా ఎంత డొంక కదిలిందో చూడండి. యీ విషయమై మరిన్ని వివరాలు కోసం విశాఖకు ఫోనుచేస్తే విరసం క్రిష్ణక్క హైదరాబాదు లో ఉన్నారు అని డా. అత్తలూరి నరసింహ రావు గారు చెప్పారు. యీ వ్యాసం పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. ~ ఇట్లు త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు.

  • ” విశ్వనాథ తీగ లాగితే కదిలిన డొంక! ” అంటూ వీక్షణం వేణు గారు రాసిన వ్యాసానికి మరిన్ని విలువైన వివరాలు ఇచ్చిన దివికుమార్ గారూ…

    కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ప్రొద్దువాక గ్రామంలో 1970 ఏప్రిల్ 26-27 రాత్రి కురుగంటి అప్పయ్యశాస్త్రి అనే భూస్వామి ఇంటి మీద నక్సలైట్ల దాడి… మంగినపూడి ఎన్ కౌంటర్ … ఇద్దరు నక్సలైట్లకు మరణశిక్ష విధించిన విజయవాడ సెషన్స్ కోర్టు తీర్పు… హైకోర్టు అప్పీలు… ఈ అప్పీళ్లను విచారించిన హైకోర్టు బెంచి, జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిస్ చెన్నకేశవరెడ్డి lu 1973 ఏప్రిల్ 19న ఇచ్చిన తీర్పు.. పొద్దువాక కేసు జరిగి వున్న నేపధ్యంలో విశ్వనాధను ( కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని ) ఈ సంఘటన కొంత కలత పెట్టి వుండవచ్చు అని మీరు ఇచ్చిన వివరణ…

    మీకు నెనర్లు.

    ( ఉద్యోగ రీత్యా కొన్నేళ్లు మచిలిపట్నం లో ఉండటం వలన కృష్ణా జిల్లా, కైకలూరు, కంకిపాడు, ముదునేపల్లి , బందరు, మంగినపూడి బీచ్, దివితాలూకా, అవనిగడ్డల గురించి చాలా కొద్దిగా తెలుసు. ) కామ్రేడ్ నంబూరి పరిపూర్ణ గారి అబ్బాయి… బంటుమిల్లి వద్ద తన బాల్యం గడిచిన ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర ( ప్రముఖ సాహితీవేత్త, కథా రచయిత, వ్యాసకర్త ) గారి స్పందన కోసం ఎదురుచూస్తున్నా..

    విరసం కృష్ణక్క గారి నుండి ఏమైనా వివరాలు తెలుస్తాయేమో అనే కుతూహలం కూడా ఉంది.

  • హిందూ దినపత్రికలో మే 1 శుక్రవారం రోజున ‘దిస్ డే 50 ఇయర్స్ అగో’ శీర్శిక లో 1970 మే 1న ప్రొద్దువాక ఘటన గురించి రాసిన వార్త పునర్ముద్రణ జరిగింది.

  • వ్యాసం చాలా బాగుంది వేణు! నేను నక్సలైట్ (కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని సివోసి) ఉద్యమంలోనికి రావడానికి కొన్నేళ్ళ ముందే దాసరి రమణ చనిపోయాడు.

    నేను రాడికల్ యూత్ అధ్యక్షునిగా వుండగా వాసిరెడ్డి కృష్ణారావు మార్గదర్శకత్వంలో నా నాయకత్వంలో సున్నపుభట్టీల గుడిసెవాసుల సంఘం ఏర్పడింది. ఆ కమిటీలో నేను అధ్యక్షుడ్ని, జర్నలిస్టు ఎం చంద్రశేఖర్ ఉపాధ్యక్షుడు, లింగం నాగేశ్వర రావు కార్యదర్శి. 1979 డిసెంబరు 31 (కిష్టయ్య భూమాగౌడ్ లను ఉరి తీసిన రోజు) అర్థరాత్రి భామిని ఆక్రమించాము.

    అప్పుడు సివోసిలో లేనప్పటికీ గతంలో నక్సలైట్ ఉద్యమంలో పని చేసిన కొందరికి కూడ అక్కడ ఇళ్ళ స్థలాలు కేటాయించాము.

    కొత్తగా ఏర్పడిన కాలనీకి మొదట్లో రాడికల్ నగర్ అని పేరు పెట్టాము. ప్రభుత్వం నుండి ఇళ్ళ పట్టాలను సాధించడంలో ఇబ్బందులు వస్తాయని అడ్వకేట్ కర్నాటి రామ్మోహన రావు చెప్పడంతో కొత్త పేరు కోసం వెతికాము. అప్పుడు దాసరి రమణ (1970), బొమ్మారెడ్డి స్నేహలత (1975) పేర్లు పరిశీలనలోనికి వచ్చాయి. అంతిమంగా దాసరి రమణ పేరు ఖరారు చేశాము. రమణ సోదరుడు ‘ఫాదర్’ కుడ అక్కడ ఇంటి స్థలం కేటాయించారు.

    బెజవాడలో నక్సలైట్ ఉద్యమం బస్ స్టాండులోని టాక్సి స్టాండ్ లో మొదలయింది. అప్పటి సిపిఐ నాయకుడు చలసాని వెంకటరత్నం వ్యతిరేక వర్గం శ్రీకాకుళ ఉద్యమంతో ప్రభావితమైంది. ఈ వర్గంలో ఒక దశలో వంగవీటి రాధా కూడా వున్నాడు. వీరికి కర్నాటి రామ్మోహన రావు మద్దతు వుంది. వాళ్ళ కేసుల్ని ఆయనే వాదించి నక్సలైట్ల లాయరుగా మారారు. అయితే అప్పటికి నక్సల్సైట్లకు కృష్ణాజిల్లాలో ఒక పార్టీగానీ కమిటీ గాని వున్నట్టు లేదు. శ్రీకాకుళం నుండి వచ్చే వార్తలతో ప్రేరణపొంది ఎవరికి వారు తిరగబడ్డారు. కొందరు రైలెక్కి నేరుగా శ్రీకాకుళం వెళ్ళిపోయారు.

  • కామ్రేడ్ దివికుమార్ గారూ…

    త్రిపుర గారి ఆప్తమిత్ర, నాటితరం కధారచయిత, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు మీతో తనకున్న చిరు పరిచయాన్ని ( ఉద్యోగరీత్యా అప్పట్లో వారు కొన్నాళ్లు బందరులో ఉన్నారు కదా )… మీరు కృష్ణా జిల్లా దివిసీమకు చెందిన వారని…

    ఉద్యమ, సిద్దాంతాల పట్ల నిబద్దత కలవారని… అత్యున్నత మాన‌వీయ‌, రాజ‌కీయ విలువ‌ల‌కు నిలువెత్తు నిద‌ర్శనం గా నిలిచిన కా. తరిమెళ్ల నాగిరెడ్డి వర్గానికి ( CPM – ML ) చెందినవారని…

    తనకు చెందిన వామపక్ష పార్టీలు, విప్లవ సిద్దాంతాలకు అతీతంగా నిజాయతితో, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలవారు మీరని… అంటూ మీ గురించి ఆర్తితో తలపోసారు.

    హంసల దీవి కవితలు పుస్తకం రాసిన కవి దీవీ సుబ్బారావు గారు ( కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ) మీరు కాదని,

    పామర్రు, కూచిపూడి, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా హంసలదీవి చేరుకోవచ్చని, కృష్ణానది సముద్రంలో కలిసే పవిత్ర సాగరసంగమ ప్రదేశం హంసలదీవి అని కూడా చెప్పారు.

    హద్దులు మీరుతున్న యీ నేలక్లాసువోడి ప్రల్లదాలకు మీరు నొచ్చుకోరని ఆశిస్తూ…

  • ఎ.ఎం. ఖాన్ యాజ్ డాని గారూ.. దివికుమార్ గారూ… యాక్టివిస్ట్ డైరీ సజయక్క రాస్తారని ఆశపెట్టుకున్న ఓ సబ్జెక్ట్ … తొలితరం కమ్యూనిస్టు నేతల్లో విప్లవ మేధావిగా పేరుగాంచిన కవి, రచయిత, ఉపన్యాసకులు యాదాటి కాశీపతి గురించి. హెచ్చార్కే గారు ఓ చిన్న నివాళి వ్యాసం రాసారు కానీ…

    కామ్రేడ్ కాశీపతి గారు మరణించినప్పుడు పత్రికల్లో వచ్చిన నివాళి వ్యాసాల నుండి కొన్ని…

    అనంతపురానికి చెందిన కాశీపతి చదువు పూర్తి చేసిన అనంతరం డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ విప్లవ నేత చండ్ర పుల్లారెడ్డి పిలుపు మేరకు విప్లవ ఉద్యమానికి అంకితమయ్యారు.

    చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డిలతో కలిసి పనిచేసి విప్లవ రాజకీయాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. 1967 నుంచి విప్లవ ఉద్యమంలో పని చేశారు. ఎమర్జెన్సీలో 21 నెలల పాటు ముషీరాబాద్ కారాగారంలో జైలు జీవితం గడిపారు. సీపీఐఎంఎల్ తరపున సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

    శ్రీశ్రీకి అత్యంత ఆప్తుడు.

    1978లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉండే గిరిజన యువతిని పెళ్లి చేసుకున్నారు.

    ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజంలో గోల్డ్‌మెడల్‌ను సాధించారు.

    ఏపీసీఎల్‌సీ, విరసం స్థాపనలో ఆయన ఉన్నారు. మంచి వక్త, ప్రసంగాలతో వేలాదిమందిని కదిలింపచేశారు. మంచి గాయకుడు కూడా.

    మాలాంటి వారి కోసం, భావితరాల కోసం యాదాటి కాశీపతి గారు ఓ చిన్న నివాళి పుస్తకం గా గ్రంధస్తం కావాలని ఆశించకూడదా వీక్షణం వేణుగోపాల్ గారూ !

  • గొప్ప పరిశోధన. కాని, యాభై సంవత్సరాల చరిత్రను తవ్వడానికే ఇంత శ్రమించవలసి వస్తోంది. చరిత్రను ఖచ్చితంగా, ఆబ్జెక్టివ్ గా నమోదు చేసే అలవాటు మనకు లేదనిపిస్తోంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు