విలువైన సలహాలు

క ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. ఉండడానికి ఒక చిన్న ఇల్లు గానీ, పండించుకోడానికి కొంచెం పొలం గానీ లేదు. పొద్దున లేచినప్పటి నుంచీ రాత్రి పండుకునేదాకా ఎంత పనిచేసినా కమ్మగా కడుపునిండా తినిన రోజూ లేదు. కంటినిండా కలలుగంటూ నిద్రపోయిన రాత్రీ లేదు. పెళ్లయితే తలరాత మారుతుంది అనుకున్నాడు కానీ ఇద్దరూ కలసి ఒళ్ళొంచి ఎంత కష్టపడినా ఏ మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది పరిస్థితి. దానికితోడు ఒక కొడుకు కూడా భూమి మీదికి వచ్చినాడు. చూస్తుండగానే పిల్లోనికి పదేళ్ల వయసొచ్చింది.

“కట్టుకున్న పెళ్ళానికి, కడుపున పుట్టిన కొడుకుకి కడుపునిండా తిండి కూడా పెట్టలేని బతుకూ ఒక బతుకేనా…” అనుకుంటూ ఒక రోజు పెళ్ళాంతో “నేను ఇక్కడే ఇలాగే ఉంటే మన బతుకు ఒక ఇంచు కూడా ముందుకు పోదు. ధైర్యం చేసి ముళ్ళదారిలో ముందడుగు వేస్తేనే బతుకుదారి బాగుపడేది. నువ్వు సంపాదించే దానితో పిల్లోన్ని చూసుకో. నేను ఏదైనా నగరానికి పోయి హాయిగా బతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొని వస్తా” అంటూ వంద జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.

నాలుగు వారాలు నడిచీ నడిచీ చివరికి ఒక నగరానికి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఎక్కడ చూసినా అందరూ తనలాంటి పేదవాళ్లే పనుల కోసం వెతుకుతా కనపడ్డారు. వారం రోజులు వీధుల్లో పడుకుంటా, చెరువుల్లో స్నానం చేస్తా పనుల కోసం వెతికాడు. ఏ ఇంటి తలుపు కొట్టినా పొమ్మనేటోళ్లే తప్ప రమ్మనేటోళ్లు కనపడలేదు.

చివరికి ఒక పెద్ద మనిషి కనబడ్డాడు. అతను బాగా చదువుకున్నవాడు. తెలివైనవాడు. నగరంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సలహాలు ఇచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. అతని దగ్గరికి పోయి “అయ్యా తినడానికి తెచ్చుకున్న డబ్బులు అన్నీ నిన్నటికే అయిపోయాయి. పొద్దున్నుంచీ ఉత్త నీళ్లు తప్ప కడుపుకింత తిండి లేదు. ఏదైనా పని ఉంటే చెప్పండి. ఇంటి ముందు కుక్కలా నమ్మకంగా ఉంటా… ఒంటికి కవచంలా కాపాడుతూ ఉంటా…” అన్నాడు.

ఆ పెద్దమనిషి “నీ మాటల్లోనే నీ మంచితనం, నిజాయితీ అర్థం అవుతా వున్నాయి. ఉండడానికి గది ఇస్తా. తినడానికి తిండి పెడతా. జీతం మాత్రం నువ్వు తిరిగి ఎప్పుడు వెళతావో అప్పుడు ఒకేసారి ఇస్తా. ఆశకు పోకుండా ఎంత ఇస్తే అంత తీసుకో” అన్నాడు. ఆ మాత్రం ఆసరా దొరకడం కూడా అదృష్టమే అనుకుంటూ మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు.

నెమ్మదిగా కాలం దొర్లుతావుంది. చూస్తుండగానే పది సంవత్సరాలు పూర్తయిపోయాయి. పెళ్ళాం పిల్లలు పదే పదే కళ్ళముందు మెదులుతా ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు కారుతా ఉన్నాయి. గుండె బరువెక్కుతా ఉంది. ఇక లాభం లేదనుకొని యజమాని దగ్గరికి పోయి “అయ్యా… అడుగుపెట్టి పదేళ్లు అవుతావుంది. కళ్ళు మూసినా తెరిచినా ఇళ్ళూ ఇల్లాలే కనపడతా ఉన్నాయి. ఇక ఇక్కడ కాలు నిలవడం కష్టం. మీరు అనుమతించి నా జీతం గనుక ఇస్తే ఇంటికి పోతా” అన్నాడు.

దానికి యజమాని “ఈ లోకంలో ఎవరు ఎంత కష్టపడినా పెళ్ళాం బిడ్డల పెదాలపై చిరునవ్వు చూడడానికే కదా… నమ్మకంగా నా మనసు తెలుసుకొని పనిచేశావు. నీలాంటివాడు మరలా దొరకడు. నువ్వు వెళతానంటే బాధగానే వుంది” అంటూ భుజంతట్టి వాని చేతిలో జీతం కింద మూడు బంగారు నాణాలు పెట్టాడు.
ఆ పేదరైతు సంబరంగా ఆ నాణాలను కళ్ళకు అద్దుకొని పోతావుంటే ఆ పెద్దమనిషి “చూడు… నీవు గనక నాకు ఒక బంగారు నాణెం తిరిగి ఇస్తే నీకు జీవితంలో ఉపయోగపడే ఒక మంచి సలహా ఇస్తా. లేదంటే నీ ఇష్టం. ఇంత తక్కువ ధరకు నేనింతవరకూ ఎవరికీ ఏ సలహాను ఇవ్వలేదు” అన్నాడు.

రైతు ఆలోచనలో పడ్డాడు. “తన యజమాని ఎంత తెలివైనవాడో అతనికి బాగా తెలుసు. ఎక్కడెక్కడి దేశాలవాళ్ళు అతని కోసం వచ్చి అడిగినంత ధనమిచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటారు. మూడు నాణాలలో ఒక్కటి ఇద్దాం. ఇంకా రెండు ఉంటాయి కదా” అనుకుని అతని చేతిలో ఒక బంగారు నాణెం పెట్టాడు.

యజమాని చిరునవ్వు నవ్వి “బాగా గుర్తు పెట్టుకో. నీకు సంబంధం లేని విషయాలలో పొరపాటున కూడా జోక్యం చేసుకోవద్దు” అని చెప్పాడు.

రైతు వినయంగా అలాగేనంటూ తిరిగి పోతావుంటే ఆ పెద్దమనిషి “చూడు… ఇంకో బంగారు నాణెం ఇస్తే ఇంకో సలహా ఇస్తా” అన్నాడు. రైతు ఆలోచనలో పడ్డాడు. చేతిలో ఉన్నవి రెండే. కానీ అతను ఇచ్చే సలహాలు ఆ బంగారు నాణాల కంటే ఎంతో విలువైనవి. డబ్బు కోసం చూసుకుంటే బంగారం కన్నా విలువైన సలహా పోగొట్టుకోవచ్చు” అనుకొని  రెండవ వరహా అతని చేతిలో పెట్టాడు.

ఆ పెద్దమనిషి చిరునవ్వుతో “బాగా గుర్తు పెట్టుకో… నీకు తెలియని కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు” అని చెప్పాడు.

అలాగేనంటూ ఆ రైతు వెనక్కి తిరగగానే ఆ పెద్దమనిషి చిరునవ్వుతో “చూడు… నాకు ఇంకో వరహా ఇస్తే ఇంకో సలహా చెప్తా” అన్నాడు. పేద రైతు ఆలోచనలో పడ్డాడు. “చేతిలో ఒకే ఒక్క వరహా ఉంది. ఇది ఉంటే ఏమి లేకుంటే ఏమి. సలహా మాత్రం వదులుకోకూడదు” అనుకుంటూ దానిని కూడా అతని చేతిలో పెట్టేశాడు.

ఆ పెద్దమనిషి చిరునవ్వుతో “బాగా గుర్తుపెట్టుకో. తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి” అన్నాడు.

మూడు వరహాలకు మూడు సలహాలు అందుకొని ఆ రైతు ఇంటిదారి పట్టాడు. అలా ఒక వారం రోజులు నడిచాక ఒక అడవిలో ఒక వింత దృశ్యం కనపడింది. ఒక గంధర్వుడు ఒక చెట్టు మీద కూర్చుని ఆకులకు బంగారు నాణాలు అంటిస్తూ ఉన్నాడు. అది చూస్తూనే అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ‘అలా ఎందుకు అంటిస్తా ఉన్నాడో కనుక్కోవాలి’ అనుకున్నాడు. అంతలో ఆ రైతుకు తన యజమాని చెప్పిన “నీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోకు” అనే సలహా గుర్తుకు వచ్చింది. దాంతో ‘మనకెందుకులే అనవసరంగా’ అనుకుంటూ అక్కడినుంచి ముందుకు నడిచాడు.

అలా నాలుగు అడుగులు వేశాడో లేదో ఆ గంధర్వుడు అతన్ని పిలిచి “మిత్రమా… నూరు సంవత్సరాలుగా ఈ చెట్టు ఆకులకు వరహాలు అంటిస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలలో ఎందుకిలా అంటిస్తా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోతావున్నది నీవు ఒక్కనివి మాత్రమే” అన్నాడు.

దానికి ఆ రైతు “అయ్యా… మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నాకు సంబంధం లేని విషయాలతో నాకెందుకు” అన్నాడు. అది విని గంధర్వుడు సంతోషంగా “అదీ మాటంటే. ప్రతి ఒక్కడూ పనున్నా లేకున్నా పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడమే తప్ప, తన పని తాను చేసుకోడు. మొదటిసారి ఇలాంటి కమ్మని మాట వినడం. నీకు బహుమతి ఖచ్చితంగా ఇవ్వవలసిందే” అంటూ ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని అటూ ఇటూ బలంగా ఊపాడు. అంతే గలగలగల బంగారు నాణాలు కొన్ని పైనుంచి కిందపడ్డాయి.

“ఇవన్నీ నీకోసమే. తీసుకో” అన్నాడు గంధర్వుడు. రైతు సంబరంగా వాటిని ఒక సంచి నిండా నింపుకొని తనకు అంత మంచి సలహా ఇచ్చిన యజమానికి మనసులోనే దండం పెట్టుకుంటూ అక్కడినుంచి బైలుదేరాడు.

అలా ఒక వారం రోజులు ఆ అడవిలో నడుస్తూ పోతూవుంటే అతనికి ఒకచోట గాడిదల మీద సరుకులు వేసుకొని పోతూవున్న ఒక వ్యాపారి కనబడ్డాడు. అతన్ని చూసి ఆ రైతు “అయ్యా… నడిచీ నడిచీ కాళ్ళు పీకుతా ఉన్నాయి. ఒక గాడిద మీద నన్ను కూర్చొనిస్తే ఒక బంగారు వరహా యిస్తా” అన్నాడు. ఆ వ్యాపారస్తుడు సంబరంగా ‘సరే’ అన్నాడు.

వాళ్లు అలా కొంతదూరం పోయేసరికి ఒకచోట ఒక పూటకూళ్ల ఇల్లు కనపడింది. ఆ వ్యాపారస్తుడు “మిత్రమా… నాకు చాలా ఆకలిగా ఉంది. కడుపునిండా తిని కమ్మగా కాసేపు విశ్రాంతి తీసుకుందాం” అన్నాడు. అంతలో ఆ రైతుకు “కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు” అని తన యజమాని చెప్పిన రెండవ సలహా గుర్తుకు వచ్చింది. దాంతో “అయ్యా… మీరు వెళ్లి తిని రండి. నేను ఇక్కడే ఈ గాడిదలకు కాపలాగా ఉంటాను. నాకు ఆకలిగా లేదు” అన్నాడు.

దాంతో వ్యాపారస్తుడు సరేనని ఆ పెంకుటిల్లు లోపలికి పోయాడు. అలా పోయిన కాసేపటికి అక్కడ పెద్ద ఎత్తున భూమి కనిపించింది. దాంతో కళ్ళముందే ఆ పెంకుటిల్లు ధన ధన ధన కూలిపోయి పాపం లోపలున్న వాళ్లంతా అందులోనే సమాధి అయిపోయారు. దాన్ని చూడగానే రైతు భయంతో వణికిపోయాడు. యజమాని సలహా పట్టించుకోకుండా తాను కూడా లోపలికి పోయివుంటే ఇప్పటికల్లా ఏమైపోయేవాడినో కదా అనుకుంటూ తన యజమానికి మనసులోనే దండం పెట్టుకొని ఆ గాడిదలను తోలుకొని అక్కడినుండి బైలుదేరాడు.

అలా రెండు వారాలు ప్రయాణించి చివరికి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు కొట్టాడు. ఇల్లు వదిలి పది సంవత్సరాలు దాటింది. జుట్టు పెరిగి, గడ్డం పెరిగి, వయసు పెరిగి మొత్తం రూపం అంతా మారిపోయి ఉన్నాడు. అదిగాక అప్పటికే మసక మసక చీకటి పడతా ఉంది. దాంతో తలుపు తెరిచిన రైతుపెళ్ళాం తన మొగున్ని గుర్తుపట్టలేకపోయింది.

“ఎవరు మీరు. ఏం కావాలి” అంది.

అతను కూడా వెంటనే విషయం చెప్పకుండా సరదాగా పెళ్ళాన్ని ఆటపట్టించాలని “అమ్మా… చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈరోజు రాత్రికి ఇక్కడ ఎక్కడైనా ఉండవచ్చా. పొద్దున్నే వెళ్ళిపోతా” అన్నాడు. దాంతో ఆమె జాలిపడి “ఇంటి లోపలికి ఎవరినీ రానివ్వలేను. కాకపోతే బయట ఉన్న గుడిసెలో విశ్రాంతి తీసుకోవచ్చు” అంది.

రైతు చిరునవ్వుతో “పొద్దున్నే నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టి తాను చేసిన పనికి ఎంత సిగ్గుపడుతుందో ఏమో” అని నవ్వుకుంటూ ‘అలాగేనమ్మా’ అని గాడిదలను తీసుకొనిపోయి ఆ గుడిసెలో కట్టేసి విశ్రాంతి తీసుకోసాగాడు.

ఒక గంట గడిచేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో ఒక యువకుడు వచ్చి ఆ ఇంటి తలుపు కొట్టాడు. తలుపు తెరవగానే నవ్వుకుంటూ లోపలికి పోయి తలుపు మూసేశాడు. అది చూడగానే రైతు అదిరిపోయాడు.

“అరెరే… నా పెళ్ళాం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోగానే చూసి చూసి ఇంక రానేమో అనుకొని వేరేవాన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. ఈ పెళ్ళాం బిడ్డల కోసమే కదా ఇన్ని రోజులూ ఇంత కష్టపడి సంపాదించింది. వీళ్ళు లేనప్పుడు ఇక బ్రతికి ఏం లాభం. వీళ్లను చంపి నేను చస్తా” అని కోపంతో ఊగిపోతూ కత్తి అందుకున్నాడు. అంతలో అతనికి “తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి” అని తన యజమాని చెప్పిన సలహా గుర్తుకు వచ్చింది.

దాంతో ఆ రాత్రంతా ఆలోచిస్తా ఉన్నాడు. కోపం కొంచెం కొంచెం తగ్గుతా ఉంది. అంతలో తొలికోడి కూసింది. ఇంట్లో దీపం వెలిగించిన వెలుతురు, పనులు చేస్తున్న చప్పుళ్ళు వినబడతావున్నాయి. కాసేపటికి తలుపు తెరుచుకుంది. రాత్రి తాను చూసిన యువకుడు బయటికి వచ్చాడు.

“అమ్మా… నేను పనికి పోయి వస్తా. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు అన్నీ తీసుకొని వస్తా” అన్నాడు. ఆమె లోపలినుంచి “అలాగే నాయనా… జాగ్రత్తగా వెళ్లి రా” అంది.

ఆ మాటలు వినేసరికి ఆ రైతు మొహంలో నెత్తురు చుక్క లేదు. “అయ్యో… నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టనట్లే, నేను నా కొడుకుని గుర్తుపట్టలేకపోయా. ఆవేశంతో తొందరపడి ఏదైనా చేసివుంటే జీవితాంతం బాధపడవలసి వచ్చేది. తొలికోపం ఎవరికైనా మంచిది కాదు” అనుకుంటూ వాళ్ల ముందుకు వచ్చి, తాను ఎవరో చెప్పి కొడుకుని మనసారా కౌగిలించుకున్నాడు.

ఆ తరువాత తన వద్ద ఉన్న బంగారు నాణాలతో వాళ్లు మంచి పొలం కొనుక్కొని, పెద్ద మిద్దె కట్టుకొని జీవితాంతం హాయిగా కలసిమెలసి జీవించారు.

*

ఎం.హరి కిషన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు