విభిన్న దృశ్యాల మేళవింపు ఒడెస్సా

“రాజకీయాలను చర్చించడానికి ఎందుకింత విముఖంగా ఉంటారు?” అని – ఒక్కడే ఉన్నప్పుడు స్లావాని అడిగాను. వాడు, “గోడలకు చెవులుంటాయి,” అన్నాడు.

సుప్రసిద్ధ సోవియట్ చిత్రనిర్మాత, దర్శకుడు సెర్గేయి ఐజెన్‌స్టెయిన్, ‘మొంటాజ్’ అనే ఎడిటింగ్ ప్రక్రియను రూపొందించాడు. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులను, ఎన్నో చిత్ర నిర్మాణాలను ప్రభావితం చేసింది. విభిన్న దృశ్యాలను, సన్నివేశాల ఖండాలను ఒక క్రమంలో గుదిగుచ్చడంద్వారా, దర్శకుడు తాను కోరుకున్న స్పందనను ప్రేక్షకుల నుండి రాబట్టవచ్చునని అతడు కనుగొన్నాడు. ఈ ప్రక్రియకు అత్యుత్తమ నిదర్శనంగా అతడు నిర్మించిన ‘బాటిల్‌షిప్ పొటెమ్‌కిన్’ చిత్రాన్ని, ముఖ్యంగా అందులోని ‘ఒడెస్సా మెట్లు’ సన్నివేశాన్ని సినీ విమర్శకులు ఇప్పటికీ ఉదహరిస్తూంటారు.

మయకోవ్‌స్కీ సుదీర్ఘ కవిత ‘వ్లాదిమిర్ ఇల్యిచ్ లెనిన్’కి శ్రీశ్రీ చేసిన అనువాదంలో, ‘అరోరా మరఫిరంగి, పొటెమ్‌కిన్ యుద్ధనౌక,’ అనే పదాలు ధ్వనిస్తాయి. ‘అరోరా’ యుద్ధనౌక 1917నాటి అక్టోబర్ విప్లవానికి నావికుల మద్దతును తెలుపుతూ, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో ఫిరంగిని పేల్చింది; అంతకుముందు 1905లో జరిగిన జారిస్టు వ్యతిరేక, విఫల తిరుగుబాటులో, నల్ల సముద్రంలో నావికుల భాగస్వామ్యానికి, ‘పొటెమ్‌కిన్’ యుద్ధనౌక అగ్రభాగాన నిలిచింది.

అందుచేత రష్యన్ చరిత్రతో, సోవియట్ సాహిత్యంతో, ప్రపంచ సినీమాతో ఎంతో కొంత పరిచయం ఉన్నవారెవరికైనా పొటెమ్‌కిన్ యుద్ధనౌకనీ, ఒడెస్సా మెట్లనీ, ఐజెన్‌స్టెయిన్ చిత్రాన్నీ తల్చుకోకుండా ఆ నగరంలో సంచరించడం అసాధ్యం. ఆ సినిమాలోని ఒక ప్రధాన సన్నివేశం ఆ మెట్లపై చిత్రీకరించబడింది, అందులో జారిస్టు సైనికులు జరిపిన తుపాకి కాల్పులకు ఒక తల్లి మరణిస్తుంది.  తర్వాత ఒక పసికందుతో ఉన్న ప్రామ్ క్రిందకు దొర్లుతున్నట్లు చూపించారు. ఆ ప్రామ్, వేగంగా ఆ మెట్ల వెంబడి క్రిందికి దొర్లిపోతూ, ప్రేక్షకులలో తీవ్రమైన భయాందోళనలను సృష్టిస్తుంది. ఆ దృశ్యం నాలో శాశ్వతంగా నాటుకుంది.

ప్రొ. తుమ్మల వేణుగోపాలరావు, బుక్ సెంటర్ వరహాలు చెట్టి, తదితరుల పూనికతో నడిచిన విశాఖ ఫిల్మ్ సొసైటీ పుణ్యమా అని 1970-75ల  మహత్తరమైన జాతీయ, అంతర్జాతీయ చిత్రాలను చూసి, చర్చించే భాగ్యం మా తరానికి దక్కింది. వాటిల్లో ‘బాటిల్‌షిప్ పొటెమ్‌కిన్’ ఒకటి. ‘ఒడెస్సా మెట్లు’ సన్నివేశాన్ని, దాని ప్రాముఖ్యతను నాకు మొదట వివరించినవాడు రావిశాస్త్రిగారి పెద్దబ్బాయి, నాకు మిత్రుడు, అయిన రాచకొండ నారాయణమూర్తి. వాళ్లెవరూ ఇప్పుడు మన మధ్య లేరు.

అదే ఒడెస్సా మెట్లను స్వయంగా దిగినప్పుడు ఐజెన్‌స్టెయిన్ నన్ను మళ్లీ ఆవహించాడు. మెట్ల దిగువన, సముద్రతీరం వెంబడి ఉన్న ప్రోమనాడ్‌లో, యుద్ధనౌక పొటెమ్‌కిన్ సంస్మరణ శిల్పం తొలిసారి నా కంటబడినప్పుడు, ఉద్వేగంతో చలించిపోయాను.

ఒడెస్సా మెట్లన్నీ ఎక్కి, కాస్త ముందుకి వెళితే, ప్రసిద్ధ ఒడెస్సా ఒపెరా హౌస్‌ను చేరుకుంటాం. అక్కడ రష్యన్ బ్యాలే బృందం ప్రదర్శించిన అద్భుతమైన నృత్యాన్ని చూడగలగడం  మా అదృష్టం. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఆనాటి సోవియట్ రేవుల్లో భారతీయ నావికులకు ప్రత్యేకమైన ఆతిథ్యం, మినహాయింపులు ఉండేవి. సాయంత్రం అయేసరికి మా కోసం ఒక వ్యాన్, ఇంగ్లీషు మాట్లాడే గైడ్‌తో సహా – సిద్ధంగా ఉండేది. మమ్మల్ని ఊళ్లో తిప్పడానికీ, స్థానిక మెరైన్ క్లబ్బుకి, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉచితంగానే – తీసుకెళ్లడానికీ. అర్థరాత్రిలోగా షిప్‌లోకి తిరిగిరావాలి, కానీ మమ్మల్ని చూసీచూడనట్లు వదిలేసేవారు.

మా గైడ్ ఒక చక్కటి, చలాకీ అయిన యుక్రేనియిన్ అమ్మాయి. ఆమె పేరు నటాలియా అని గుర్తు. ఇంగ్లీషు బాగా మాట్లాడడమే కాకుండా, వ్యాన్ బయలుదేరగానే, రాజ్‌కపూర్ సినీమా ‘శ్రీ420’లోని ‘మేరా జూతాహై జాపానీ’ పాట మొదలు పెట్టింది. రెండో చరణం నుంచీ మేం అందుకున్నాం! యూ.ఎస్.ఎస్.ఆర్. సాధించిన ప్రగతి గురించి గొప్పలు చెప్పింది. అందువల్ల మాకేమీ ఇబ్బంది అనిపించలేదు. మా మెనన్ ఒక సందర్భంలో ఆమెతో,

“మీ రష్యన్‌లు…” అంటూ ఏదో అనబోతూ ఉంటే అడ్డుకొని,

“మేం రష్యన్స్ కాదు! యుక్రేనియన్లం!” అన్నది, నటాలియా, కోపంగా. సోవియట్ యూనియన్‌కి రష్యాని పర్యాయపదంగా వాడకూడదని తెలుసుకున్నాం.

“జస్‌బీర్‌గాడు ఉండి ఉంటే ఈ అమ్మాయికి వల వేసేవాడు,” అన్నాను.

పది అవకాశాలను వెంబడిస్తే, ఒక్కటన్నా చేతికి చిక్కుతుందనేది వాడి ఫిలాసఫీ. షోర్ లీవ్ రద్దు కావడంతో షిప్పులోనే ఉండిపోయాడు, పాపం జస్‌బీరుడు. అదే రోజున, రాత్రి తిరిగి వస్తున్నప్పుడు, మెనన్‌కి ఓ పెగ్గు వోడ్కా ఎక్కువై,  పోలీస్ ఆఫీసర్‌తో తగవు పడ్డాడు. కమ్యూనిజంపైనా, నియంతృత్వం మీదా విరుచుకుపడ్డాడు. దురదృష్టవశాత్తూ ఆ అఫీసర్‌కి ఇంగ్లీషు వచ్చు. అతడు నవ్వేసి, ఒక టాక్సీని పిలిచి ఎక్కించాడు.

“మీరు ఇండియన్స్ కాబట్టి విడిచిపెడుతున్నాను. లేదంటే నిషా తగ్గేవరకూ పోలీసు కస్టడీలోనో, ఆస్పత్రిలోనో ఉండాల్సిందే,” అన్నాడు. టాక్సీ డ్రైవరుకి ఏదో చెప్పాడు. దారిలో ఒకటి, రెండు బార్‌లలో ఆగే కార్యక్రమాన్ని రద్దుచేసుకొని, బుద్ధిగా షిప్పు చేరుకున్నాం.

ఒపెరా హౌస్‌కి దగ్గరలో, అలెగ్జాండర్ పుష్కిన్ కొంతకాలం నివసించిన భవనాన్ని మ్యూజియంగా మార్చారు. నేను ఆ ప్రదేశానికి చేరుకునే సమయానికి, చీకటి పడుతోంది; ఒక మహిళ ఆ ఫ్లాట్‌కి తాళం వేస్తోంది. నేను భారతదేశం నుండి చాలా శ్రమకోర్చి వచ్చానని ఆమెను వేడుకున్నాను. ఆమె నా అబద్ధాన్ని గ్రహించి, చిరునవ్వుతో ఆ ఇంటిని తిరిగి తెరిచి, ఓపికగా వేచి ఉంది!

మేమిచ్చే టిప్స్ మమ్మల్ని రెస్టారెంట్‌లలో సుప్రసిద్ధుల్ని చేసాయి.  వెయిటర్లు పోటీలుపడి మర్యాదలు, వడ్డనలు చేసేవారు. అక్కడున్న వారం రోజుల్లోనూ, సాయంత్రాలలో మా చుట్టూ చేరే పది పన్నెండు మంది యువతీ యువకుల బృందాన్ని ఏర్పరచుకున్నాం. బాగా ఖరీదైన రెస్టారెంట్‌లలో మేము పోయించే వైను, షాంపేన్, పెట్టించే భోజనాలు, మా దాతృత్వము వారిని ఆకర్షించాయి. అయితే అందులో ఇద్దరికే ఇంగ్లీషు బాగా వచ్చు. వాళ్లిద్దరిలోనూ స్లావా అనేవాడు మాటకారి, హాస్యగాడు. పీలగా, కాస్త పొట్టిగా, పిచికలాగా ఉండే స్లావా కూత మాత్రం ఘనమే. నన్ను ‘కేప్టెన్’ అని పిలిచేవాడు. మొదటి వైన్ గ్లాసు దించగానే వాడి నోటివెంట కవిత్వం ఒలికేది. ఒక రోజున వాల్ట్ విట్మన్ కవిత,’ఓ కేప్టెన్, మై కేప్టెన్!’ మొత్తం చదివి మమ్మల్ని (అంటే రూబుల్స్ తగలేసే కార్యక్రమంలో ఉన్న నన్నూ, మెనన్‌నీ) ఆశ్చర్యపరచాడు. మెనన్‌లేచి నిలబడి, “జీవించి ఉండటం ఎంత అద్భుతం!? కానీ అది ఎల్లప్పుడూ ఎందుకు బాధ కలిగిస్తూనే ఉంటుంది?” అన్నాడు.

అక్కడివాళ్లెవరూ ఆ వాక్యాల్ని విన్నట్టులేదు. కానీ మర్యాదపూర్వకంగా చప్పట్లు చరిచారు. నాకూ గుర్తు రాలేదు. “ఇదెక్కడిదిరా? డాస్టొయెవ్‌స్కీయా?” అన్నాను.

వాడు, “కాదు. బోరిస్ పాస్టర్‌నాక్! డాక్టర్ ఝివాగో,” అన్నాడు.

నా వంతుగా, ‘ఆనా కెరినీనా’ నవలలోని తొలి వాక్యాలను (‘సంతోషంగా ఉండే కుటుంబాలన్నీ ఒకే రీతిలో ఉంటాయి; కానీ ప్రతీ దుఃఖిత కుటుంబమూ దాని ప్రత్యేక మార్గంలో దుఃఖాన్ని మోస్తూ ఉంటుంది.’) ఉటంకించాను. నా మాటల్ని స్లావా – రష్యన్, (లేదా యుక్రేయిన్) భాషలోకి అనువదించినప్పుడు మా స్థానిక మిత్రబృందం కరతాళ ధ్వనులు చేసి, ‘ఛీర్స్!’ అంటూ వైన్ గ్లాసుల్ని పైకి లేపారు. స్లావా లేచి వచ్చి, నన్ను నాటకీయంగా కౌగలించుకొని, నా బుగ్గమీద ముద్దుపెట్టి, నా పక్కనే కూర్చున్నాడు.

సోవియట్ అనువాద సాహిత్యమే మమ్మల్ని ఒడెస్సా మిత్రుల వద్దకు చేర్చింది. గొగోల్ పట్ల వారికి ప్రత్యేకమైన అభిమానం ఉండడానికి ప్రధాన కారణం, అతడు యుక్రేయిన్ వాసి కావడమే అని అర్థం అయింది. మరో సుప్రసిద్ధ యుక్రేయిన్, లియాన్ ట్రాట్‌స్కీ పేరును ప్రస్తావిస్తే, “అతడి గురించి నాకేమీ తెలియదు,” అన్నాడు, స్లావా. ‘ఏనిమల్ ఫార్మ్’ నవల గురించి అతడు వినలేదు.

లెనిన్ తరువాత యూ.ఎస్.ఎస్.ఆర్.కి దేశాధిపతి అవుతాడనుకున్న అగ్రశ్రేణి నాయకుడు, సోవియట్ రెడ్ ఆర్మీ నిర్మాత – ట్రాట్‌స్కీని దేశంనుండి వెళ్లగొట్టి, వెంటాడి, చివరికి మెక్సికోలో హత్య చేయించిన స్టాలిన్ కక్ష సాధింపు చర్యలు, ప్రక్షాళనల గురించి చెప్పబోతూంటే, నా చేతులు పట్టుకొని, నన్ను అడ్డుకొని, “అవన్నీ ఇప్పుడు అర్థంలేని మాటలు,” అన్నాడు, స్లావా.

మా ఒడెస్సా మిత్రులు ఏ విషయాన్నయినా చర్చించడానికి ఉత్సాహం చూపేవారుగానీ, రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండేవారు. వాళ్లు భయంతో బిగుసుకుపోయారు. అసలా సమాజమే స్తంభించిపోయింది. ‘నాయకత్వం మారినప్పుడల్లా గతానికి మసిబూసి మారేడుకాయను చెయ్యడమేనా, చారిత్రక భౌతికవాదం అంటే?’ అనే ప్రశ్న నన్ను వేధించింది.

“రాజకీయాలను చర్చించడానికి ఎందుకింత విముఖంగా ఉంటారు?” అని – ఒక్కడే ఉన్నప్పుడు స్లావాని అడిగాను. వాడు, “గోడలకు చెవులుంటాయి,” అన్నాడు.

భారత దేశంలో ఎమెర్జెన్సీ విధించిన ఆరునెలలకే నేను షిప్పు ఎక్కాను. ఆ ఆరు నెలల్లోనే స్వేచ్ఛారహిత జీవనం మాకు ఊపిరాడకుండా చేసింది. సోవియట్ యూనియన్‌లో శాశ్వత ఎమెర్జెన్సీ, ఏకపార్టీ పాలన కొనసాగుతున్నాయనిపించి నిరాశ కలిగింది. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ శాశ్వతంగా అధికారంలో కొనసాగుతుందనే అప్పుడు అందరూ అనుకున్నారు.

సమసమాజ స్థాపనకోసం, ‘మరో ప్రపంచం’ కోసం, మనదేశంలో జరిగిన పోరాటాలూ, ఉద్యమాలూ గుర్తుకొచ్చాయి. ఇదేనా ఆ సమాజం? దీనికోసమేనా అన్ని త్యాగాలు? ఇదికాదు, ఇంకేదో ఉండాలి, మరేదో కావాలి అనిపించింది. ఏదో తెలియని అసంతృప్తి. కామ్రేడ్‌లు దీన్ని పెట్టీ బూర్జువా ఊగిసలాట అని కొట్టిపారేస్తారని తెలుసు. కానీ నాకది కళ్ల ఎదుట నిలిచిన సత్యం.  ఘనీభవించిన పిడివాదంలో కన్నా అన్వేషణాత్మక ఊగిసలాటలోనే ఎక్కువ కదలిక, జీవం ఉంటాయి.

ఒడెస్సా రేవుని విడిచిపెట్టే రోజు వచ్చింది. పొగ గొట్టలపై సుత్తీ-కొడవలి చిహ్నాలు ఉన్న టగ్ బోట్లు మమ్మల్ని హార్బరు బయటకి సాగనంపాయి. మహిళా పైలట్ మా షిప్పు నుంచి దిగి, లాంచిలో వెళ్లిపోయింది. నావ కొద్దిగా ఊగుతోంది. నల్ల సముద్రపు లోతుల్లోకి అడుగుపెడుతున్నాం. అప్పుడే చీకటి పడుతోంది. క్వార్టర్ డెక్‌మీద ఒక్కడినీ నిలబడి, కనుమరుగవుతూన్న నగర కాంతుల్ని చూస్తున్నాను. బ్రిడ్జ్ వింగ్‌మీద ఉన్న జస్‌బీర్ చేతులూపాడు. ఒడెస్సాలో షోర్‌లీవు రద్దు కావడం వాడికొక చేదు అనుభవం. రాబోయే పోర్ట్ కోసం వాడు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. అన్నట్టు, రూబుళ్ల కట్టలు చాలానే మిగిలిపోయాయి.

***

క్రిష్ణన్, జస్‌బీర్, మెనన్, యెలీనా, స్లావా, నటాలియా – వాళ్లంతా  ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? అసలున్నారో, లేదో? ఉంటే గనక, నన్ను కూడా తలచుకుంటున్నారేమో? ఒడెస్సాలో గడిపిన ఆనాటి సాయంత్రాలు ఎవరికైనా గుర్తున్నాయా? ఆనాటి నా మిత్రులంతా మారిపోయి ఉంటారు, నాలాగే. మొత్తం ప్రపంచమే మారిపోయింది; సోవియట్ యూనియన్ కుప్పకూలింది; రష్యా-యుక్రేయిన్‌లు ఇప్పుడు శత్రుదేశాలు.  దశాబ్దాలు దొర్లిపోయాయి; ఋతువులు గడచిపోయాయి. ఈ వాక్యాలు రాస్తూంటే ‘దో బీఘా జమీన్‌’లోని మన్నాడే పాట గుర్తుకొచ్చింది –

ధర్తీ కహే పుకార్‌ కే, బీజ్ బచాలే ప్యార్ కే….

మోసమ్  బీతా జాయె, మోసమ్  బీతా జాయె

కౌన్ కహే ఇస్ ఓర్, తూ ఫిర్ అయే న ఆయె?

అంతటితో ఆగిపోకుండా,

అప్ని కహానీ ఛోడ్ జా, కుఛ్‌తొ నిషానీ ఛోడ్ జా…

మన్‌కీ బన్షీ పే తూ భీ, కొయీ ధున్ బజాలే భాయీ, తు భీ ముస్క్‌రాలే…

అని కూడా అన్నాడు కదా, కవి శైలేంద్ర? అదే నాకు ధైర్యవచనం.

[చిత్రాలు: వీకీపీడియా]

ఉణుదుర్తి సుధాకర్

5 comments

Leave a Reply to KAMESWARA RAO Konduru Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా బాగా రాశారు. పోగొట్టుకున్న కాలం వ్యక్తులకీ, సమాజాలకీ, దేశాలకీ ఎవరికైనా సరే అత్యంత విలువైన కాలం.

    ఆ సినిమా నేను కూడా చూశాను. ఆ మెట్ల గురించి వినే చూశాను. మీరు ఆ మెట్లు తాక్మడం మీకెంత ఉద్విగ్నతను కలిగించి ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను.

  • బాటిల్‌షిప్ పొటెం‌కిన్, ఆ ఒడెస్సా మెట్లు మరీ ముఖ్యంగా పసిపాప ఆ ప్రాంతో పాటు మెట్లమీద జారిపోతుండడం …తలుచుకుంటుంటే ఇప్పటికి వొళ్ళు జలదరిస్తుంది. ఆ కాలంలో వచ్చిన క్రేన్స్ ఆర్ ప్లయింగ్, లిబెరషన్ అత్యుత్తమ చిత్రాలు. మీ ప్రయాణం రోజులకే అక్కడ ఉక్రేయిన్ / రష్యా గుర్రింపులున్నాయన్నమాటా! మా #రాణీబుక్‌సెంటర్ వెనక ‘మినీ థీయేటర్(డా గాలి బాలసుందరరావు గారు ఏర్పరిచింది) ఆ సినిమాలన్ని ప్రదర్శించాము. చివరకు మిగిలేదు జ్ఝాపకాలేగా!

  • నేను సుధాకర్ గారి కథలు, వ్యాసాలు చాలానే చదివాను. అవి చదివిన ప్రతిసారి నాకు ఒక సందేహం కలుగుతుంది. అదేమిటంటే సుధాకర్ చరిత్రను మనకు పరిచయం చెయ్యడానికి కథావస్తువు నెంచుకుంటారా, లేక కథావస్తువును ఎంచుకొని దానిని రక్తి కట్టించడానికి చరిత్రను వాడుకుంటారా అని. ఈ రెండింటిలో వారి వుద్దేశ్యం ఇది అని చెప్పడం కష్టం అని నేను అనుకుంటాను. ఏది ఏమైనా సరళమైన కథావస్తువులను ఎంచుకుని చక్కని కథనంతో పాఠకులను రంజిపచేస్తూ, చరిత్రను వారికి పరిచయం చేయడం సుధాకర్ విశిష్టత.
    ఇలాంటి కోవకు చెందిన ఒక సంపుటే “ఉప్పు గాలి కబుర్లు.” మరీన్ ఇంజనియర్ గా వారి వృత్తిపర జీవితంలోని అనుభవాలను పాఠకులతో ఈ వ్యాసాల ద్వారా పంచుకుంటున్నారు. ఆ సంకలనంలోని ఒక వ్యాసం యూక్రెయిన్ అనుభవాలను గురించి.
    సుమారు 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకుని, వాటిని చరిత్రతో కలుపుతూ కథను నడిపించడం సులువైన పని కాదు. ఒడెస్సా రేవుకు, సోవియట్ యూనియన్ విభజనకు ముందు, వెళ్లిన ఇంచుమించు ప్రతి నావికుడుకి ఎదురయిన అనుభవాలే అవి. కాని సుధాకర్ చాకచక్యం ఆ సంఘటననలను, అనుభవాలను చరిత్రతో జతచేసి అప్పటి సమాజంలోని పరిస్థితులను వివరించడంలో కనిపిస్తుంది. నాకూ ఇటువంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ వ్యాసంలో పేర్కొన్న ప్రదేశాలు నేను కూడా చూసాను. చరిత్ర గురించి ఏమి తెలియదు కాబట్టి వాటి ప్రాముఖ్యత అప్పుడు అర్ధం కాలేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నాకు సోవియట్ యూనియన్ విడిపోయిన 10 సంవత్సరాల తరువాత ఇటువంటి అనుభవం తటస్థించింది. కమ్యూనిస్టు పాలన కాలం నాటి యూక్రెయిన్ తో పోలిస్తే నేను చూసినప్పటి యుూక్రెయిన్ లో చాలా సామాజిక మార్పులు వచ్చాయి. ప్రభుత్వోద్యోగుల వ్యవహర శైలిలో మాత్రం పెద్దగా మార్పులు రాలేదు. తనకు బాగా నచ్చిన కమ్యూనిస్టు సిద్ధాంతం ఆచరణలోకి వచ్చినప్పుడు అందులో నిరంకుశత్వం కనిపిస్తుంది అన్న వాస్తవం తెలిసి రచయిత నిరాశకు లోనయ్యారు అనిపించింది.
    ఇదే సంపుటిలోని ఇంకో వ్యాసం “ఎర్ర సామ్రాజ్యంలో నల్లబజారు “. ఇక్కడ కూడా వ్యాసం మొదట్లోనే కెలాంగ్ కు ఆ పేరు ఎలా వచ్చింది అన్న విషయం చారిత్రాత్మక వివరణ ఇచ్చారు. ఆ తరువాత సూయజ్ కాలవకు సంబంధించిన 6 రోజుల యుద్ధం గురించి ప్రస్తావిస్తారు సుధాకర్. చరిత్రే కాకుండా సాహిత్యం గురించి కూడా తన వ్యాసాలలో చర్చిస్తారు సుధాకర్. కమ్యూనిజం ఆచరణలోని లోపాలతో రచయితకు తొలిసారి పరిచయం ఒడెస్సాలో జరిగిందనిపించింది.

  • Wonderful experiences on board and off board.
    కళ్ల కు కట్టినట్లు దృశ్యాలు వర్ణించెవు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు