విఫల మనుషుల, విఫల ఉద్యమ గాథ – ఈ విఫల

ద్యమాలు ప్రజాస్వామికమే  అయినా, వాటిలో ఉండే మనుషుల్లో అప్రజాస్వామికత్వం ఉంటుంది. “Fruits of the Barren Tree” అనే ఈ నవల చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం కళ్ళముందు కనబడింది. అనేక జాతి విముక్తి పోరాటాలు కదలాడాయి. అది శ్రీలంక తమిళులు తమకు ప్రత్యేక దేశం కావాలి అని సాయుధం కావడం అవ్వొచ్చు, కాశ్మీరీ ప్రజలు సాయుధ ఉద్యమాల బాట పట్టడం కావొచ్చు. ఆఫ్ఘాన్ – పాక్ సరిహద్దుల్లో కుర్దులు చేస్తున్న యుద్ధమూ కావొచ్చు. ఇవి ప్రజాస్వామిక డిమాండ్లు అని మనం ఒప్పుకోవచ్చు. కొన్నిటిని ఒప్పుకోపోనూవచ్చు. ఆ ప్రజలు మాత్రం మన నమ్మకాలతో, ఒప్పుకోళ్ళతో పని లేకుండా పోరాడారు. పోరాడుతున్నారు.

మహత్తర నక్సల్బరి ఉద్యమం రగిలించిన బొగ్గు పొరల నేల నుండి వచ్చిన వాడిగా ఉద్యమాలను అణచేందుకూ, వాటిల్లోకి ప్రజలు వెళ్ళకుండా పోయేందుకు ప్రభుత్వాలు ఏమేమి చేయగలవో తెలుసు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో యాక్టివ్ పార్టిసి‌పెంట్‌గా, అబ్సర్వర్‌గా ప్రభుత్వ లాలుచీలు ఎలా ఉంటాయో, ప్రత్యక్ష్యంగా చూశాను. ఉస్మానియా విద్యార్థులు చైత్యన్యాన్ని పోరాట తెగువను చూసి ఉద్యమ కాలంలోనే అక్కడ చేరిన విద్యార్థిగా బయటి నుండి చూసిన స్ఫూర్తినొందిన వాటికీ, అక్కడే చదువుతూ, ఉద్యమంలో నడుస్తో లోపలి నుండి చూసిన వాటికి తేడా ఉన్నది. విద్యార్థుల చేతుల్లో ఉన్న ఉద్యమం రాజకీయ పార్టీల చేతుల్లోకి ఎలా వెళ్ళింది? దానికోసం ఎవరు ఏ పాత్ర పోషించారు? ఇదంతా కళ్ళముందరి చరిత్రే. ఉద్యమం నడుస్తున్న కాలంలోనే మిత్రుడు నలమాస కృష్ణ ఒకవైపు ఉద్యమకారుడిగా తీరిక లేని కార్యాచరణలో ఇంగ్లీష్ అండ్ ఫారీన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీకి తన ఎం.ఫిల్ థీసిస్ రాసి సబ్మిట్ చేశాడు. దాన్ని “ఉస్మానియ వెలుగులో… తెలంగాణ విద్యార్థి ఉద్యమం”గా  ఇటీవలే “ఛాయ” ప్రచురించింది. ఈ వివరాలు అందులో దొరుకుతాయి.

అదే ఉస్మానియాలో గోర్ఖాలాండ్ ఉద్యమాని సమర్ధిస్తూ పెద్ద ర్యాలీ తీశాం. నగరంలో గోర్ఖాలు చాలామంది ఆ రోజు యూనివర్సిటీకి వచ్చి వాళ్ళ దుఖాన్ని పంచుకున్నారు. ఉమ్మడి అస్తిత్వం పేరు మీద ఒక వర్గం మీద అణచివేత, వివక్ష జరుగుతున్నప్పుడు మేం విడిపోతాం అనే ఏ ఉద్యమమైనా ప్రజాస్వామికమైనదే. గోర్ఖాలదీ అంతే.

అయితే, ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఒళ్ళు జలదరించింది. ఉద్యమాల్లో ప్రజాస్వామికత లేని పాపులిస్ట్ లంపెన్ శక్తులు చొరబడితే ఏం జరుగుతుందో… కాదు కాదు ఏం జరిగిందో ఈ నవల చెప్పింది. చదివాక, “హమ్మయ్య, తెలంగాణలో ఇట్లా జరగలేదు.” అని ఊపిరి పీల్చుకున్నాను. ఏ సైద్ధాంతిక భూమిక లేని లంపెన్ శక్తులే, ఉద్యమ శక్తులుగా ఉంటే ఏం చేస్తాయి? తమ ఆధిపత్యాన్ని చూయించుకునేందుకు మొదట తమ వారిపైనే దాడి చేస్తాయి. “ఈ పొద్దు నీవు మాతో కలసి రానట్లయితే, నీవు మా వాడివి కానట్లే.” అని తీర్మాణాలు చేసి దాడులు చేస్తాయి. ఇక్కడా ఆ ప్రయత్నం జరిగింది. ఒక పార్టీ తనే ఉద్యమానికి ప్రతినిధి అని నిరూపించుకోవడం కోసం ఇతర పార్టీల మీద దాడులు చేసింది. అది పక్క పార్టీ నాగం జనార్ధన్ రెడ్డి కావొచ్చు, ఆ నాటికి అదే పార్టీలో ఉన్న విజయశాంతీ కావొచ్చు. బాల్క సుమన్ ఒక టీవి చర్చలో ఒకతన్ని కొట్టడమూ కావొచ్చు. అలా టీవిలో దెబ్బలు తిన్న అతను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉరిపోసుకున్న సంతోష్ అనే వ్యక్తీ మృతదేహాన్ని చూడటానికి వస్తే “సంతోష్ మృతదేహం మీద ఉమ్మి, కాలుతో తన్నాడు” అని ఆ పార్టీ విద్యార్థి సంఘం వాళ్ళు అతని తరిమారు. నిజానికి అతను ఆ చర్యకు పాల్పడలేదు. ఉద్యమ నాయకత్వం అని చెప్పుకునే వాళ్లకు అతను అక్కడికి రావడం ఇష్టం లేదు.

ఆయితే, ఈ ధోరణి ఎక్కువగా విస్తరించాక పోవడానికి కారణం ఉద్యమంలో ఉన్న విప్లవ, వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల ఘనతే. కొంత వీళ్ళూ తెలంగాణ జిందా తిలస్మత్ అనే ధోరణిలో కొట్టుకుపోయినా, భిన్న గొంతుకలకు ఈ నేలనా ఉండే స్పేస్ దానికి కారణం.

మామూలు ఉద్యమం నుండి సాయుధ పోరాటం దాక పోయిన గూర్ఖాలాండ్ ఉద్యమం వలన డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ (DGHC)కి పాక్షిక పాలనాధికారం దక్కింది. సుభాష్ ఘిసింగ్ దానికి చైర్మెన్ అయ్యాడు. కాని రెండేళ్ళు జరిగిన ఉద్యమలో 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరుద్యోగం, ఇతర సమస్యలేవీ తీరలేదు. “గూర్ఖాలాండ్ వస్తే పందులూ బాస్మతీ బియ్యం తినే రోజులు తెస్తాను” అన్నాడు ఘిసింగ్. అలా ఘిసింగ్ మాటలు నమ్మిన జీవితాల్లో ఏ వెలుగూ రాలేదు. ఆ నాయకుల ద్రోహానికి బలైన వారిలో ఈ రచయిత తండ్రీ ఒకడూ.

ఈ నవలకు ఫూలంగే (పూలు పూసినా కాయలు కాయని చెట్టు) అని నేపాలీ పేరు పెట్టాడు రచయిత. ఆ ఫూలంగే గురించి చెబుతో, “సైన్సులో గ్రాడ్యుయేషన్ చేసినా ఇంటిపట్టునే ఉన్నాను. నన్ను అలా చదివించటానికి మా నాన్న పడ్డ కష్టం, కూలీకి పోయిన మా అమ్మ కోల్పోయిన వేలిగోర్లు, నా సోదరి మోసిన బాధ్యతలు, ఎన్నని చెప్పాలి?

ఒకరోజు మా నాన్న ఏదో విషయంలో అన్నాడు, ‘మా కొడుకు ఒక ఫూలాంగే అయ్యాడు.” అట్లా చూసుకున్నప్పుడు ఉద్యమం మంటలా పైకి ఎగసింది. చప్పున చల్లారింది. ఆ మంట తాలుకు ఫలితం రాలేదు. అందుకే లేఖ్‌నాథ్ దీని ఒక్క ఒక్కమాటలో “నేనొక్కణ్నే కాదు. ఈ ఉద్యమమే ఒక ఫూలాంగే. అలాగే ఈ నవల పేరు కూడా.” అని తేల్చేశాడు.

ఇది కలల విఫలమైన మనుషుల, పోరాడినా ఫలితం దక్కని విఫల ఉద్యమ గాథ.

నేపాలిలో వచ్చిన ఈ నవలను అనురాగ్ బాస్నేత్ ఇంగ్లీష్‌లోకి చేస్తే, హర్ష యర్రగుంట తెలుగు చేశాడు. హర్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ హిస్టరీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ‘చూపు’ కాత్యాయని ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించింది.

*

అరుణాంక్ లత

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు