విన్నపాలు వినవలె!

యనం ముఖ్యమా? గమ్యం ముఖ్యమా?? అంటే రెండూ ముఖ్యమే.

నలుగురం కలిసి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక గమ్యం ఉండాలి. ప్రయాణం చేయడం వెనక కారణాలు ఏవైనా కావచ్చు. ప్రయాణించడం, స్నేహితులతో కలిసి ప్రయాణించడం, హిమాలయాలంటే ఓ ఆకర్షణ, దైవ దర్శనం ,ఇంటి బాధ్యతల నుండి కాస్త వెసులుబాటు దొరికాక మనకంటూ సమయాన్ని కేటాయించుకోవడం… ఇలా ఏవైనా కావచ్చు. ఆ విధంగానే ఆరుగురం స్నేహితురాళ్ళం కలిసి మా యాత్ర ప్రారంభించాం. అందరికీ ఎంతో ఇష్టమైనది హిమాలయాల సందర్శనం. అందుకని అటువైపుగా మా యాత్ర మొదలైంది. ఆదికైలాశ్, ఓం పర్వత్ సందర్శన చేసుకురావాలని నిశ్చయించుకున్నాం. ఈ యాత్రను నిర్వహించే ఒక ట్రావెల్స్ వారిని సంప్రదించి వారి ద్వారా ఈ యాత్ర మొదలుపెట్టాం. అయితే ఆ రెండింటిని దర్శనం చేసుకునేందుకు వెళ్లి వచ్చే దారులలో మరికొన్ని ఆకట్టుకునే స్థలాలను, క్షేత్రాలను దర్శించుకున్నాం. అదే ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నవి.

   ముందుగా  మా ప్రయాణం ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ లో గల  పిథోరాఘర్ కు  కాఠ్ గోదాం మీదుగా సాగింది. ఆ దారిలో దర్శించుకున్న ఒక ఆసక్తికరమైన అందమైన క్షేత్రం చితాయి గోలు దేవతా మందిరం.
   అల్మోరాకు సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కోనీఫెరస్ వృక్షాల మధ్యన దాగుని ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ మందిరం. ఇది 12వ శతాబ్దానికి చెందినది. Katyuri రాజవంశానికి చెందిన వారసుడు Gollu.
ఈ మందిరంలో  గోలు గుర్రాన్ని అధిరోహించి ఉన్న విగ్రహం ఉంటుంది.శివుడి అవతారంగా భావించే Gollu / Goljya దేవతను స్థానిక ప్రజలు పూజిస్తారు.  కోరుకున్న కోర్కెలను తీరుస్తాడని, నిష్పాక్షికంగా న్యాయం అందజేస్తాడని ఇక్కడే ప్రజల నమ్మకం. ఇప్పటికీ గుర్రంపై ఆ ప్రాంతాలలో సంచరిస్తూ ఉంటాడని అనుకుంటారు.
    ఈ మందిరం గురించి చెప్పగా విన్నాం, కొంత చదివాం. కానీ అక్కడకు చేరి ప్రత్యక్షంగా సందర్శించుకోవడం ఒక వింత అనుభూతి. ఊహించనంత ఆశ్చర్యంలో పడేసింది మమ్మల్ని. అక్కడ మమ్మల్ని విపరీతంగా ఆకర్షించింది మందిర పరిసరాలలో వేలాది కాదు లక్షల కొద్ది ఉన్న గంటలు. మందిరం ప్రవేశ ద్వారం నుండి ప్రధాన మందిరం చేరేవరకు దారి పొడవునా ఇరువైపులా, పైన కప్పుకు వేలాడదీయబడి ఉన్న ఎన్నెన్ని గంటలో. అతి చిన్న పరిమాణంలో ఉన్న గంట నుండి అతి భారీ పరిమాణంలో ఉన్న గంట వరకు. ఎవరికీ తెలియని ఒక అనామకమైన ఇంటిపేరు ఉన్న భక్తుడి నుండి జిందాల్ కుటుంబానికి చెందిన భక్తుడి వరకు అక్కడ అందరూ తమ కోర్కెలు తీర్చమని ప్రార్థించిన వారే.
ప్రతి గంటకు ఒక బంగారు రంగు ఝరీ ఉన్న ఎర్రటి గుడ్డతో కలిపి కట్టి ఉన్న కాగితాలు. ఆ కాగితాలపై రాసి ఉన్న భక్తుల కోర్కెలు.ఎన్ని రకాల కోర్కెలో.
కుటుంబ కలహాలు తీర్చమని ఓ కుటుంబ పెద్ద, ప్రేమను ఫలింప చేయమని ఒక ప్రేమికుడు, ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఒక నిరుద్యోగి, పరీక్షలు పాస్ అవ్వాలని ఓ అమాయక విద్యార్థి, ఏ విఘ్నాలు లేకుండా వివాహం జరిగిపోవాలని ఒక తండ్రి ఇలా అనేకం. ఆస్తి తగాదాలను తీర్చమని కోరుకునే అన్నదమ్ముల నుండి కోరుకున్న అమ్మాయి దక్కాలని ప్రేమికుడి  వరకు అందరూ ఎంతో నమ్మకంతో సందర్శించే మందిరం ఇది.
నిజంగా అందరి కోరికలు తీరుతాయా?ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలా?? అని అనుకునే వారు ఉంటారు. కానీ  బలమైన నమ్మకం ఏదో ఒకటి మనిషిని ఆశతో ముందుకు నడిపిస్తుంది కదా! నిరాశలో మునిగిపోయిన మనిషి, తను అనుకున్నది నెరవేరాలని ఆశపడే మనిషి నమ్మి ఆరాధించే ఒక రూపానికి ఇలా కోర్కెలను విన్నవించుకోవడం, అవి ఆ దేవుడు తీరుస్తాడని ఆశపడడం తప్పులేదు కదా! కోర్కెలు తీరితే ఏ మూగజీవినో బలిస్తామనే మొక్కులు కన్నా ఇటువంటి వాటితో ఎవరికీ ఏ హాని లేదు అనిపించింది.
     దర్శనం నిమిత్తం వచ్చే భక్తులు ఆ గంటలను తాకుతూ ప్రధాన మందిరం వద్దకు చేరుకుంటారు.  దేవుడి వద్దకు కోర్కెలు అలా చేరుతూనే ఉంటాయి అన్నట్టుగా ఆ శబ్దం ఆలయ పరిసరాలలో మారుమోగుతూనే ఉంటుంది.
గోలు దేవత దర్శనం తరువాత మా ప్రయాణం ముందుకు సాగింది.
*

స్వాతి పంతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు